మనిషి జీవించేది రొట్టెవల్ల మాత్రమే కాదు నేను నాజీ క్యాంపు నుండి కాపాడబడ్డాను
జోసెఫ్ హీజీగ చెప్పినది
“నువ్వు చదివేదేంటి?” అని నేను నాతోటి ఖైదీని అడిగాను. దానికి అతను, “బైబిలు. ఒక వారం మొత్తం నీకొచ్చే రొట్టెలను నాకు ఇస్తే దీన్ని నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
నే ను అప్పట్లో జర్మనీ దేశంలో భాగమైన మోసెల్లో 1914 మార్చి 1న జన్మించాను. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మోసెల్ ఫ్రాన్స్ దేశ అధీనంలోకి వచ్చింది. 1940లో మోసెల్ మళ్లీ జర్మనీలో భాగమైపోయింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికల్లా మోసెల్ మరోసారి ఫ్రాన్స్ అధీనంలోకి వచ్చింది. అలా మారిన ప్రతీసారి నా దేశ పౌరసత్వం మారుతూ వచ్చింది. అందుకే నేను ఫ్రెంచ్, జర్మన్ రెండూ నేర్చుకోగలిగాను.
మా తల్లిదండ్రులు మతనిష్ఠగల క్యాథలిక్‌లు. ప్రతీరోజు రాత్రి పడుకునే ముందు మా కుటుంబమంతా కలిసి మోకాళ్లూని ప్రార్థించేవాళ్లం. ఆదివారాల్లో, జాతీయ సెలవు దినాల్లో చర్చీకి వెళ్లేవాళ్లం. నేను క్యాథలిక్ స్టడీ గ్రూపుకు చెందినవాన్ని, నాకు నా మతమంటే ఎంతో గౌరవం ఉండేది.
ఒక యెహోవాసాక్షినయ్యాను
1935లో మా ఇంటికి ఇద్దరు యెహోవాసాక్షులు వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆరోజు వాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో మతం పాత్ర గురించే ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాత బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దాంతో 1936లో నేను క్యాథలిక్ ఫాదర్‌ను ఒక బైబిలు కావాలని అడిగాను. కానీ, బైబిల్లోని విషయాలను తెలుసుకోవాలంటే థియోలజీ (ఒక క్రైస్తవ సంస్థ తరఫున బైబిలు ట్రైయినింగ్ పొందడం) చదవాలని ఆయన చెప్పాడు. అయితే, నాకంటూ ఒక బైబిలు ఉండి దాన్ని చదవాలనే కోరిక మరింత బలపడింది.
నా తోటి పనివాడైన ఆల్బిన్ రెలవిట్స్ ఒక యెహోవాసాక్షి. ఆయన 1937 జనవరి నెలలో నాకు బైబిలు విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. “మీ దగ్గర బైబిలు ఉందా” అని ఆయనను అడిగాను. ఆయన తన దగ్గర ఉందని చెప్పి, జర్మన్ ఎల్బర్ఫెల్డర్ వర్షన్ బైబిలు నుండి దేవుని పేరు యెహోవా అని చూపించి ఆ బైబిలును నాకిచ్చాడు. నేను దాన్ని ఎంతో ఆసక్తిగా చదువుతూ దగ్గర్లోవున్న థియోన్విల్లే అనే పట్టణంలో జరిగే యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడం ప్రారంభించాను.
నేను 1937 ఆగస్టు నెలలో పారిస్‌లో జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి ఆల్బిన్తో కలిసి వెళ్లాను. అక్కడే నేను ఇంటింటికి వెళ్లి ప్రకటించడం మొదలుపెట్టాను. త్వరలోనే నేను బాప్తిస్మం తీసుకొని 1939 ప్రారంభపు నెలల్లో పయినీరుగా అంటే పూర్తికాల క్రైస్తవ పరిచారకునిగా సేవ చేయడం ప్రారంభించాను. నేను మెట్స్ నగరంలో సేవచేసే నియామకాన్ని అందుకున్నాను. అదే సంవత్సరం జూలై నెలలో పారిస్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేయడానికి ఆహ్వానం అందుకున్నాను.
యుద్ధకాలంలో వచ్చిన కష్టాలు
నేను ఆ బ్రాంచి కార్యాలయంలో కేవలం కొంతకాలమే సేవచేశాను. ఎందుకంటే 1939 ఆగస్టులో ఫ్రెంచ్ సైన్యంలో చేరమని నాకు పిలుపు వచ్చింది. యుద్ధంలో పాల్గొనడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. దాంతో నన్ను జైల్లో వేశారు. తర్వాతి సంవత్సరం మే నెలలో ఇంకా నేను జైల్లో ఉన్నప్పుడే జర్మనీ హఠాత్తుగా ఫ్రాన్స్‌పై దాడి చేసింది. జూన్ నెల వచ్చేసరికల్లా జర్మనీ ఫ్రాన్స్‌ను జయించడంతో నేను మరోసారి జర్మనీ పౌరుణ్ణి అయ్యాను. అలా నేను 1940 జూలై నెలలో జైలు నుండి విడుదలై మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేశాను.
నాజీ పరిపాలనలో ఉన్నాం కాబట్టి బైబిలు అధ్యయనం చేయడానికి మేము రహస్యంగా కలుసుకునేవాళ్లం. మారీజ్ అనాజియాక్ అనే ఒక ధైర్యంగల క్రైస్తవురాలు మాకు కావలికోట పత్రికలను తెచ్చిచ్చేది. ఒక క్రైస్తవ సహోదరుని బేకరీ దగ్గర నేను ఆమెను కలుసుకునేవాన్ని. 1941 వరకు నేను జర్మనీలో సాక్షులకు ఎదురౌతున్న కష్టాలను తప్పించుకోగలిగాను.
ఒకరోజు నాజీ రహస్య పోలీసు అధికారి నా దగ్గరికి వచ్చాడు. ఆ పోలీసు అధికారి, సాక్షుల పనులు నిషేధించబడ్డాయని చెప్పిన తర్వాత నేను ఇంకా యెహోవాసాక్షిగా ఉండాలనుకుంటున్నానో లేదో చెప్పమని నన్ను అడిగాడు. “అవును, సాక్షిగానే ఉండాలనుకుంటున్నాను” అని నేను చెప్పడంతో ఆ పోలీసు తన వెంట రమ్మని నాతో అన్నాడు. వెంటనే అమ్మ ఆందోళనతో స్పృహ తప్పి పడిపోయింది. అది చూసిన పోలీసు అధికారి, అమ్మను చూసుకోమని చెప్పి వెళ్లిపోయాడు.
నేను పని చేస్తున్న ఫ్యాక్టరీలో మా మేనేజరుకు “హెయిల్ హిట్లర్” అని నేను చెప్పలేదు. నాజీ పార్టీలో చేరనని కూడా చెప్పేశాను. మరుసటిరోజు నాజీ పోలీసులు నన్ను అరెస్టు చేశారు. పోలీసులు నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు తోటి సాక్షుల పేర్లు చెప్పమని ఒత్తిడి చేశారు, కానీ నేను చెప్పకపోవడంతో నన్ను ప్రశ్నిస్తున్న పోలీసు తన తుపాకీ పిడితో నా తలపై కొట్టాడు. అప్పుడు నేను స్పృహ తప్పి కింద పడిపోయాను. “యెహోవాసాక్షుల, బైబిలు విద్యార్థుల సంఘం తరఫున ప్రచారం చేశాను” అనే ఆరోపణపై 1942 సెప్టెంబరు 11న మెట్స్ నగరంలోని సన్డర్గరిట్స్ (నాజీ న్యాయమూర్తులు మాత్రమే ఉండే ప్రత్యేకమైన కోర్టు) నాకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
రెండు వారాల తర్వాత, నన్ను మెట్స్ జైలునుండి జుయ్బ్రూకెన్లోని లేబరు క్యాంపుకు తీసుకెళ్తూ మధ్యమధ్యలో చాలాచోట్ల ఆపారు. అక్కడ నేను రైల్వే సిబ్బందితో కలిసి పనిచేశాను. మేము ఎంతో బరువుండే రైలు పట్టాలు మార్చి వాటికి నట్లు బిగించాం, పట్టాల మధ్యలో రాళ్లు వేశాం. అప్పుడు మాకు దొరికిందల్లా ఉదయం ఓ కప్పు కాఫీ, 150 గ్రాముల రొట్టె, మధ్యాహ్నం సాయంత్రం ఒక గిన్నెడు సూపు మాత్రమే. ఆ తర్వాత నన్ను దగ్గర్లోవున్న మరో జైలుకు తరలించారు. అక్కడ నేను చెప్పులు తయారు చేసే దుకాణంలో పనిచేశాను. చాలా నెలలు గడిచిన తర్వాత నన్ను మళ్లీ జుయ్బ్రూకెన్కు పంపించారు. ఈసారి నేను పొలాల్లో పనిచేశాను.
జీవించాను, కాని రొట్టెవల్ల మాత్రమే కాదు
జైల్లో నాతోపాటు నెదర్లాండ్స్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నాడు. ఆయన భాష కొద్దిగా నేర్చుకోవడంవల్ల నా నమ్మకాల గురించి అతనితో మాట్లాడగలిగాను. ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి సాధించాడు, తనకు నదిలో బాప్తిస్మం ఇవ్వమని కూడా అడిగాడు. నీళ్లలోనుండి బయటకు వచ్చిన తర్వాత, నన్ను హత్తుకొని “జోసెఫ్, ఇప్పుడు నేను నీ సహోదరుణ్ణి!” అన్నాడు. నన్ను మళ్లీ రైల్వే సిబ్బందితో పనిచేయడానికి పంపించినప్పుడు మేము విడిపోయాం.
ఈసారి నాతోపాటు జైల్లోవున్న వ్యక్తి జర్మనీ దేశస్థుడు. అతను ఒకరోజు సాయంత్రం ఒక చిన్న పుస్తకం చదువుతూ కనిపించాడు. అదేంటో కాదు, బైబిలు! నేను ముందు చెప్పినట్లు, ఒక వారం మొత్తం నాకొచ్చే రొట్టెలు అతనికి ఇస్తే దాన్ని నాకు ఇచ్చేస్తానన్నాడు. దానికి నేను ఒప్పుకున్నాను. ఒక వారమంతా నాకొచ్చే రొట్టెలను ఇచ్చేస్తానని ఒప్పుకోవడం నిజంగా పెద్ద త్యాగమే, అయినా నేను దాని గురించి ఎప్పుడూ బాధపడలేదు. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని [యెహోవా] దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని చెప్పిన యేసు మాటల భావాన్ని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను.—మత్తయి 4:4.
అయితే ఇప్పుడు నా దగ్గరున్న బైబిలును పోలీసుల కంటపడకుండా కాపాడుకోవడం నిజంగా ఒక సవాలు. ఇతర ఖైదీల్లా యెహోవాసాక్షులను తమ దగ్గర బైబిలు ఉంచుకోనిచ్చేవారు కాదు. కాబట్టి, నేను రాత్రిళ్ళు దుప్పటి చాటున బైబిలు చదువుకునేవాన్ని. పగలేమో దాన్ని నా చొక్కాలోపల పెట్టుకొని తిరిగేవాన్ని. ఎప్పటికప్పుడు జైలుగదుల్లో గార్డులు సోదా చేసేవారు కాబట్టి నేను బైబిలును ఎక్కడా వదిలేసేవాన్ని కాదు.
ఒకరోజు, పనికి ముందు అందరినీ పిలిచినప్పుడు అక్కడకు వెళ్ళిన తర్వాత బైబిలును జైలుగదిలోనే వదిలేశానన్న విషయం గుర్తుకొచ్చింది. సాయంత్రం వెళ్లి చూసుకునేసరికి నా బైబిలు కనిపించలేదు. దేవునికి ప్రార్థించిన తర్వాత నేను గార్డు దగ్గరికి వెళ్లి నా పుస్తకం ఎవరో తీసుకున్నారని చెప్పి అది నాకు కావాలని అడిగాను. అక్కడ నుండి నేను ఏమి తీసుకుంటున్నానో ఆ గార్డు గమనించకపోవడంతో నా బైబిలు నాకు తిరిగి దక్కింది. అది నా చేతుల్లోకి మళ్లీ వచ్చినందుకు నేను యెహోవాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాను.
మరో సందర్భంలో, స్నానం చేయడానికని నా ఒంటిమీదినుండి మురికి బట్టలు తీస్తున్నప్పుడు నా బైబిలు కింద పడేలా చేసి, గార్డు చూడకుండా దాన్ని వెంటనే కాలితో పక్కకు నెట్టేశాను. స్నానం అయిపోయిన తర్వాత అదే పద్ధతిలో బైబిలును మళ్లీ శుభ్రమైన బట్టలమీదికి చేర్చాను.
జైలు జీవితంలోని ఒడిదుడుకులు
1943లో, ఓ రోజు ఉదయాన్నే ఖైదీలందరినీ వరుసలో నిలబెట్టినప్పుడు నేను ఆల్బిన్ను చూశాను. ఆయన కూడా అరెస్టయి అక్కడకు వచ్చాడు. నన్ను గుర్తుపట్టి, సహోదరత్వానికి గుర్తుగా తన గుండె మీద చెయ్యి పెట్టుకొని నావైపు చూశాడు. నాతో మాట్లడాలనుకున్నవి కాగితం మీద రాసిస్తానని సైగ చేశాడు. మరుసటి రోజు నన్ను దాటివెళ్తూ ఓ కాగితపు ముక్కను కింద వేశాడు. కానీ, గార్డు దాన్ని చూడడంతో మా ఇద్దరికీ రెండువారాల ఏకాంత కారాగార శిక్ష పడింది. మాకు పాడైపోయిన రొట్టెలు, నీళ్లు మాత్రమే ఇచ్చేవారు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా ఉండేవి కావు, చెక్కలమీదే పడుకునేవాళ్లం.
ఆ తర్వాత, నన్ను సీజ్బర్గ్లోని జైలుకు పంపించారు. అక్కడ నేను లోహపు దుకాణంలో పనిచేశాను. ఆ పనివల్ల నేనెంతో అలసిపోయేవాన్ని, అక్కడిచ్చే ఆహారం కూడా సరిపోయేది కాదు. రాత్రి కలల్లో కేకులు, పండ్లు కనిపించేవి కానీ, తీరా లేచేసరికి చచ్చేంత ఆకలి వేసేది, గొంతు ఎండిపోయేది. అప్పుడు నేను 45 కిలోలు కూడా లేను. కానీ, నేను ప్రతీరోజు బైబిలు మాత్రం ఖచ్చితంగా చదివేవాన్ని. అందుకే జీవితంమీద ఆశతో బ్రతుకగలిగాను.
చివరికి విడుదల
1945 ఏప్రిల్ నెలలో అనుకోకుండా ఒకరోజు ఉదయం గార్డులు జైలు తలుపులు తీసేసి పారిపోయారు. అలా నాకు విడుదల దొరికింది. కానీ, నేను నా ఆరోగ్యం కుదుటపడేంతవరకు హాస్పిటల్లో గడపాల్సివచ్చింది. మే నెల ముగిసే సమయానికి నేను మా తల్లిదండ్రులున్న ఇంటికి చేరుకున్నాను. వాళ్లు నేను బ్రతికివున్నానన్న ఆశ ఎప్పుడో వదులుకున్నారు. కానీ, నన్ను చూసిన వెంటనే ఆనందంతో మా అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. విచారకరంగా, ఆ తర్వాత కొంతకాలానికి నా తల్లిదండ్రులు మరణించారు.
నేను మళ్లీ థియోన్విల్లే సంఘంతో సహవసించడం ప్రారంభించాను. నా ఆధ్యాత్మిక కుటుంబాన్ని కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్లు నమ్మకంగా ఉన్నందుకు నాకెంతో ఆనందం కలిగింది. నా ప్రియ మిత్రుడు ఆల్బిన్ జర్మనీలోని రీగెన్స్బర్గ్లో చనిపోయాడు. ఆ తర్వాత, మా చిన్నాన్న కొడుకు జీన్ హిజీగ కూడా యెహోవాసాక్షి అయ్యాడనీ సైన్యంలో చేరడానికి ఆయన మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో ఆయన్ని ఉరితీశారనీ నాకు తెలిసింది. పారిస్ బ్రాంచి కార్యాలయంలో నాతోపాటు పని చేసిన జీన్ క్యురాయ్ కూడా జర్మనీ క్యాంపులో ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాడు.a
మెట్స్ నగరంలో మళ్లీ ప్రకటించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నేను మిన్జాని కుటుంబాన్ని తరచూ కలిసేవాన్ని. వాళ్ల కూతురు టీనా 1946 నవంబర్ 2న బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఉత్సాహంగల ప్రచారకురాలు. ఆమె నాకు బాగా నచ్చింది. 1947 డిసెంబర్ 13న మేము పెళ్లి చేసుకున్నాం. 1967 సెప్టెంబర్‌లో టీనా పూర్తికాల సేవ చేపట్టింది. ఆ తర్వాత ఆమె 98 ఏళ్ల వయస్సులో 2003 జూన్ నెలలో చనిపోయేంతవరకు అలా సేవ చేస్తూనే ఉంది. నాకు ఇప్పుడు ఆమెలేని లోటు బాగా తెలుస్తోంది.
ఇప్పుడు నా వయస్సు 90 ఏళ్లకన్నా ఎక్కువే. పరీక్షలను ఎదుర్కొనేందుకు, వాటిని అధిగమించేందుకు దేవుని వాక్యం నాకు ఎల్లప్పుడూ శక్తినిచ్చిందని నేను గుర్తించాను. నేను కొన్నిసార్లు ఖాళీ కడుపుతో ఉన్నాను కానీ నా మనస్సును, హృదయాన్ని ఎప్పుడూ దేవుని వాక్యంతో నింపుకున్నాను. యెహోవాయే నన్ను బలపరిచాడు. ఆయన ‘వాక్యమే నన్ను బ్రతికించింది.’—కీర్తన 119:50. (w09 3/1)
[అధస్సూచి]
a జీన్ క్యురాయ్ జీవితకథ కోసం కావలికోట 1989, అక్టోబర్ 1, 22-26 పేజీలు చూడండి.
[23వ పేజీలోని చిత్రం]
నా ప్రియ మిత్రుడు ఆల్బిన్ రెలవిట్స్
[23వ పేజీలోని చిత్రం]
మారీజ్ అనాజియాక్
[24వ పేజీలోని చిత్రం]
ఒక వారం మొత్తం నాకొచ్చే రొట్టెలను ఇచ్చి సంపాదించుకున్న బైబిలు
[25వ పేజీలోని చిత్రం]
1946లో నా కాబోయే భార్య టీనాతో
[25వ పేజీలోని చిత్రం]
జీన్ క్యురాయ్ తన భార్య టిటికాతో