విశ్వసనీయంగా ఉండడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయి
కొన్ని దేశాల్లో పిల్లలు తమ స్నేహితులను ఆటపట్టించడానికి అంట్రింతలను (చిన్న చిన్న ముళ్ళుండే ఒక రకమైన గడ్డి విత్తనాలు) వారి స్వెట్టర్లకు అంటిస్తారు. ఆ అంట్రింతలు ఉన్నికి అంటుకొని ఉంటాయి, ఆ స్నేహితుడు ఏమి చేసినా అంటే నడిచినా, పరుగెత్తినా, కదిలినా లేక గంతులు వేసినా ఆ అంట్రింతలు ఉన్నికి అంటుకొనే ఉంటాయి. వాటిని విదిలించుకొనే ఏకైక మార్గం వాటిని ఒకదాని తర్వాత మరొకటి తీసివేయడమే. చిన్నపిల్లలకు అదంతా పెద్ద సరదా.
నిజమే, తమ బట్టలకు అంట్రింతలు అంటుకోవడాన్ని అందరూ ఇష్టపడరు, అయితే ఆ అంట్రింతలకున్న అంటుకొనే సామర్థ్యానికి అందరూ అబ్బురపడతారు. విశ్వసనీయమైన వ్యక్తికి అలాంటి లక్షణమే ఉంటుంది. విశ్వసనీయమైన వ్యక్తి ఒక వ్యక్తితో ఉన్న సంబంధాన్ని నిరంతరం కాపాడుకుంటాడు. ఆయన, పరిస్థితులు కష్టతరంగా ఉన్నా కూడా ఆ సంబంధంవల్ల వచ్చే కర్తవ్యాలను, బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తాడు. “విశ్వసనీయత” అనే పదం యథార్థత, విధేయత, అంకిత భావం వంటి సద్గుణాలను గుర్తు చేస్తుంది. ప్రజలు మీకు విశ్వసనీయంగా ఉన్నప్పుడు వారి విశ్వసనీయతను మీరు ఇష్టపడవచ్చు, అయితే ఇతరులకు విశ్వసనీయంగా ఉండాలనే దృఢ సంకల్పం మీకు ఉందా? ఉన్నట్లయితే, మీరు ఎవరికి విశ్వసనీయంగా ఉండాలి?
వివాహంలో నమ్మకంగా ఉండడం ఒక ప్రాథమిక అవసరం
విశ్వసనీయత అత్యంత అవసరమైన ఒక రంగం వివాహం, అయితే విచారకరంగా అది ఈ రంగంలోనే ఎక్కువగా లోపిస్తోంది. తమ వివాహ ప్రమాణాలకు నమ్మకంగా కట్టుబడి ఉండే భార్యాభర్తలు, అంటే కలిసి ఉండి ఒకరి సంక్షేమం కోసం మరొకరు కృషి చేసే భార్యాభర్తలు, సంతోషాన్ని, భద్రతను పొందడంలో భాగంగా ఒక ప్రాముఖ్యమైన చర్య తీసుకున్నారు. ఎందుకు? ఎందుకంటే మానవులు విశ్వసనీయత చూపించవలసిన అవసరతతోనే కాక ఇతరుల విశ్వసనీయతను పొందవలసిన అవసరతతో కూడా సృష్టించబడ్డారు. ఏదెను తోటలో ఆదాము, హవ్వల వివాహం జరిగినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును.” ఆ వాక్యం భార్యకు కూడా అన్వయిస్తుంది, ఆమె తన భర్తను హత్తుకోవాలి. భార్యాభర్తలు ఒకరిపట్ల మరొకరు నమ్మకంగా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి.—ఆదికాండము 2:24; మత్తయి 19:3-9.
నిజమే ఆ వాక్యం వేలాది సంవత్సరాల ముందు చెప్పబడింది. అలాగని నేడు వివాహంలో విశ్వసనీయంగా ఉండడం పాత కాలపు విషయమని దాని భావమా? చాలామంది కాదు అనే జవాబిస్తారు. వివాహంలో నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యమని 80 శాతం మంది భావిస్తున్నారని జర్మనీలోని పరిశోధకులు కనుగొన్నారు. స్త్రీపురుషుల్లో చాలా అభిలషణీయమైన లక్షణాలను కనుగొనేందుకు రెండవ సర్వే నిర్వహించబడింది. స్త్రీలలో తాము చాలా ఇష్టపడే ఐదు లక్షణాలను చెప్పమని కొంతమంది పురుషులను అడగడం జరిగింది, అలాగే పురుషుల్లో తాము చాలా ఇష్టపడే ఐదు లక్షణాలను కొంతమంది స్త్రీలు పేర్కొన్నారు. రెండు వర్గాలవారూ నమ్మకంగా ఉండడమే ఎంతో అమూల్యమైన సద్గుణమని భావించారు.
అవును, విశ్వసనీయత విజయవంతమైన వివాహానికి బలమైన పునాదిలో ఒక భాగం. అయినా దీని ముందటి ఆర్టికల్లో మనం గమనించినట్లుగా విశ్వసనీయత ఎక్కువగా కొనియాడబడుతున్నా అంతగా అనుసరించబడని ఒక సద్గుణం. ఉదాహరణకు, అనేక దేశాల్లో పెరుగుతున్న విడాకుల రేటు విస్తృతంగా ఉన్న అవిశ్వసనీయత గురించిన రుజువునిస్తోంది. వివాహ దంపతులు ఈ పోకడను నిరోధించి ఒకరిపట్ల మరొకరు విశ్వసనీయంగా ఎలా ఉండగలరు?
విశ్వసనీయత వివాహం ఎక్కువ కాలం నిలిచేందుకు దోహదపడుతుంది
వివాహ దంపతులు ఒకరిపట్ల మరొకరికి ఉన్న అంకిత భావాన్ని బలపరచుకొనే అవకాశాల కోసం చూసినప్పుడు విశ్వసనీయత చూపించబడుతుంది. ఉదాహరణకు, “నా” అని చెప్పే బదులు “మా” అని చెప్పడం సాధారణంగా మంచిది, “మా స్నేహితులు,” “మా పిల్లలు,” “మన ఇల్లు,” “మా అనుభవాలు” మొదలైన విధంగా మాట్లాడడం మంచిది. భార్యాభర్తలు ఇల్లు, ఉద్యోగం, పిల్లలను పెంచడం, వినోదం, సెలవులు లేక మత సంబంధ కార్యకలాపాలు వంటి ఎలాంటి ప్రణాళికలైనా, నిర్ణయాలైనా చేస్తున్నప్పుడు ఒకరి భావాలను, అభిప్రాయాలను మరొకరు పరిగణలోకి తీసుకోవడం మంచిది.—సామెతలు 11:14; 15:22.
దంపతులిద్దరూ తాను కావాల్సిన వ్యక్తి అని అవతలి వ్యక్తి భావించేలా చేసినప్పుడు విశ్వసనీయత వ్యక్తమవుతుంది. తన భర్తగానీ భార్యగానీ మరొకరితో అతి చనువుగా వ్యవహరిస్తున్నట్లయితే ఆ వివాహిత వ్యక్తిలో అభద్రతా భావాలు కలుగుతాయి. “[తన] యౌవనకాలపు భార్యను” హత్తుకొని ఉండాలని బైబిలు పురుషులకు హితవు చెబుతోంది. ఒక భర్త, తన భార్య కాని వేరొక స్త్రీ తనపట్ల అభిమానంతో కూడిన శ్రద్ధ చూపించాలని తన హృదయం కోరుకోకుండా చూసుకోవాలి. ఆయన మరో స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు; ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే.” నమ్మకంగా ఉండడానికి సంబంధించిన అదే ఉన్నత ప్రమాణం ఒక భార్య నుండి కూడా ఆశించబడుతోంది.—సామెతలు 5:18; 6:32.
వివాహంలో నమ్మకంగా ఉండడానికి చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుందా? లభిస్తుంది. అది వివాహాన్ని చాలా స్థిరమైనదిగా, చాలాకాలం నిలిచేదిగా చేస్తుంది, దంపతులిద్దరూ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, భర్త తన భార్య సంక్షేమానికి నమ్మకంగా అంకితమైనట్లయితే ఆమెలో భద్రతా భావం కలుగుతుంది, ఆమె తనలోని మంచి లక్షణాలను కనబరిచేందుకు అది ఆమెకు సహాయం చేస్తుంది. భర్త విషయంలో కూడా అది నిజమే. తన భార్యకు విశ్వసనీయంగా ఉండాలనే ఆయన దృఢసంకల్పం, తన జీవితంలోని అన్ని రంగాల్లో నీతి సూత్రాలపట్ల అంకిత భావం వృద్ధి చేసుకొనేందుకు ఆయనకు సహాయం చేస్తుంది.
భార్యాభర్తలిద్దరూ కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, వారిద్దరూ భద్రతా భావంతో ఉండడానికి విశ్వసనీయత సహాయం చేస్తుంది. మరోవైపు, విశ్వసనీయత కొరవడిన వివాహంలో సమస్యలు ఎదురైతే, ఆ దంపతులు సాధారణంగా విడిపోతారు లేక విడాకుల కోసం ప్రయత్నిస్తారు. అలాంటి చర్య సమస్యలను పరిష్కరించే బదులు, సాధారణంగా ఉన్న సమస్యల స్థానంలో వేరే సమస్యలను సృష్టిస్తుంది. 1980లలో పేరుగాంచిన ఒక ఫ్యాషన్ సలహాదారుడు తన భార్యను, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఒంటరి వ్యక్తిగా ఆయన ఆనందాన్ని పొందాడా? ఇరవై సంవత్సరాల తర్వాత, వారిని వదిలేయడం తనను “ఒంటరివాణ్ణి చేసింది, కలత చెందేలా చేసింది, [తన] పిల్లలకు గుడ్ నైట్ చెప్పాలనే కోరికతో రాత్రుళ్ళు మెలకువగా ఉండేలా చేసింది” అని ఆయన ఒప్పుకున్నాడు.
తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే విశ్వసనీయత
తల్లిదండ్రులు ఒకరిపట్ల మరొకరు విశ్వసనీయంగా ఉంటే వారి పిల్లలు కూడా ఆ లక్షణాన్ని అలవరచుకొనే అవకాశం ఉంది. విశ్వసనీయమైన, ప్రేమగల కుటుంబంలో పెరిగిన పిల్లలకు, భవిష్యత్తులో తమ జతపట్లనే కాక, తమ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి సంబంధించిన బలహీనతలను అనుభవిస్తున్నప్పుడు వారిపట్ల కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం సులభమౌతుంది.—1 తిమోతి 5:4, 8.
నిజమే, ఎప్పుడూ తల్లిదండ్రులే మొదటగా అస్వస్థులు కారు. కొన్నిసార్లు ఒక పిల్లవానికి కూడా నిజమైన శ్రద్ధ అవసరమవుతుంది. అలాంటి పరిస్థితినే యెహోవాసాక్షులైన హర్బర్ట్, గర్టుర్ట్లు 40 కంటే ఎక్కువ సంవత్సరాలు ఎదుర్కొన్నారు. వారి కుమారుడు డీటమర్, కండరాల క్షీణత వ్యాధితో తన జీవితాంతం బాధపడ్డాడు. 2002 నవంబరులో ఆయన చనిపోవడానికి ముందు, చివరి ఏడు సంవత్సరాలు డీటమర్కు రాత్రీ పగలూ శ్రద్ధాసక్తులు అవసరమయ్యాయి. ఆయన తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా ఆయన అవసరాల గురించి శ్రద్ధ తీసుకున్నారు. వారు తమ ఇంట్లో వైద్య పరికరాన్ని అమర్చి వైద్య శిక్షణను కూడా పొందారు. కుటుంబ విశ్వసనీయత విషయంలో వారు ఒక మంచి ఉదాహరణ కదా!
విశ్వసనీయత స్నేహానికి చాలా అవసరం
“ఒక వ్యక్తి జీవిత భాగస్వామి లేకుండా సంతోషంగా ఉండవచ్చు, కానీ ఒక స్నేహితుడు లేక స్నేహితురాలు లేకుండా సంతోషంగా ఉండడం కష్టం” అని బిర్గిట్ అభిప్రాయపడింది. మీరు ఆమెతో ఏకీభవిస్తుండవచ్చు. మీరు వివాహితులైనా అవివాహితులైనా ఒక మంచి స్నేహితుని విశ్వసనీయత మీ హృదయానికి ఆనందాన్నిచ్చి మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. నిజమే, మీరు వివాహితులైతే, మీ జీవిత భాగస్వామే మీ సన్నిహిత స్నేహితునిగా లేక స్నేహితురాలిగా ఉండాలి.
స్నేహితుడు అంటే కేవలం ఒక పరిచయస్థుడు మాత్రమే కాదు. అలాంటి పరిచయస్థులు మన పొరుగువారు, సహోద్యోగులు, అప్పుడప్పుడు మనం కలిసే వ్యక్తులు వంటి అనేకమంది ఉండవచ్చు. నిజమైన స్నేహానికి సమయం, శక్తి, అంకిత భావం అవసరమవుతాయి. ఒకరి స్నేహితులుగా ఉండడం గౌరవాన్నిచ్చే విషయం. స్నేహంవల్ల ప్రయోజనాలు కలుగుతాయి, అయితే దానితో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి.
స్నేహితులతో మంచి సంభాషణ ఉండడం చాలా అవసరం. అలాంటి సంభాషణ అప్పుడప్పుడు అవసరాన్నిబట్టి ప్రారంభం కావచ్చు. “మా ఇద్దరిలో ఎవరికైనా సమస్య ఎదురైతే, నేను నా స్నేహితురాలు వారానికి ఒకటి లేక రెండుసార్లు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆమె అందుబాటులో ఉండి, నేను చెబుతున్నది వినడానికి ఇష్టపడుతున్నది అని తెలుసుకోవడం ఓదార్పుకరమైన విషయం” అని బిర్గిట్ చెబుతోంది. స్నేహానికి దూరం అవరోధం కానవసరం లేదు. గెర్డా హెల్గాలు ఒకరి నుండి మరొకరు వేలాది కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు, అయినా వారు దాదాపు 35 సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా ఉన్నారు. గెర్డా ఇలా వివరిస్తోంది: “మేము తరచూ ఉత్తరాలు రాసుకుంటాం, ఆ ఉత్తరాల్లో అనుభవాలను, మా అంతర్గత భావాలను, అవి సంతోషకరమైనవైనా దుఃఖాన్నిచ్చేవైనా వాటిని వివరించుకుంటాం. హెల్గా నుండి వచ్చే ఉత్తరం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మేము ఒకే విధంగా ఆలోచిస్తాం.”
విశ్వసనీయత స్నేహానికి చాలా అవసరం. విశ్వాసఘాతకానికి సంబంధించిన ఒకే క్రియ అయినా అది దీర్ఘకాల సంబంధాలను కూడా పాడుచేయగలదు. స్నేహితులు ఒకరికొకరు ఆంతరంగిక విషయాలపై కూడా సలహాలిచ్చుకోవడం సర్వసాధారణం. స్నేహితులు తాము హేళనకు గురవుతామని గానీ తమ ఆంతరంగిక విషయాలు బట్టబయలవుతాయని గానీ భయపడకుండా హృదయపూర్వకంగా మాట్లాడుకుంటారు. బైబిలు ఇలా చెబుతోంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.
మన స్నేహితులు మనం ఆలోచించే విధానం మీద, మన భావాల మీద, చర్యల మీద ప్రభావం చూపిస్తారు కాబట్టి మన జీవన విధానానికి అనుగుణంగా ఉన్న జీవన విధానంగల వ్యక్తులను స్నేహితులుగా చేసుకోవడం ప్రాముఖ్యం. ఉదాహరణకు, మీకున్నటువంటి నమ్మకాలు, అవే నైతిక దృక్పథాలు, మంచి చెడుల విషయంలో మీకున్నలాంటి ప్రమాణాలున్న వ్యక్తులతోనే స్నేహాన్ని పెంపొందించుకొనేలా చూసుకోండి. అలాంటి స్నేహితులు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు సహాయం చేస్తారు. మీకున్న ప్రమాణాలు, నైతిక సూత్రాలు లేని వ్యక్తికి సన్నిహితం కావాలని మీరు ఎందుకు ఇష్టపడతారు? “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని చెప్పడం ద్వారా బైబిలు, సరైన స్నేహితులను ఎన్నుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తోంది.—సామెతలు 13:20.
విశ్వసనీయతను నేర్చుకోవచ్చు
ఒక పిల్లవాడు మరొకరి బట్టల మీద అంట్రింతలు అంటించడం నేర్చుకున్నప్పుడు, వాడు ఆ ఆటను మళ్ళీ మళ్ళీ ఆడడానికి ఇష్టపడవచ్చు. విశ్వసనీయమైన వ్యక్తి విషయంలో కూడా అదే చెప్పవచ్చు. ఎందుకు? ఎందుకంటే మనం విశ్వసనీయతను చూపించడాన్ని ఎంత ఎక్కువగా అభ్యసిస్తే దానిని ప్రదర్శించడం మనకు అంత సులభమవుతుంది. ఒక వ్యక్తి బాల్యంలోనే కుటుంబంలో విశ్వసనీయంగా ఉండడం నేర్చుకుంటే ఆ తర్వాత ఆయనకు విశ్వసనీయత ఆధారంగా స్నేహాలను వృద్ధి చేసుకోవడం సులభమవుతుంది. కొంతకాలం తర్వాత అలాంటి బలమైన, చిరకాల స్నేహాలు వివాహంలో విశ్వసనీయంగా ఉండడానికి మార్గం సుగమం చేయవచ్చు. ఆయన స్నేహాలన్నిటిలోకి అతి ప్రాముఖ్యమైన స్నేహంలో కూడా విశ్వసనీయంగా ఉండడానికి అది ఆయనకు సహాయం చేస్తుంది.
యెహోవా దేవుణ్ణి పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణవివేకంతో, పూర్ణబలంతో ఆరాధించడం ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (మార్కు 12:30) దానర్థం మనం దేవునికి పూర్ణ విశ్వసనీయత ఋణపడి ఉన్నాం. యెహోవా దేవునికి విశ్వసనీయంగా ఉండడం ఎన్నో ప్రతిఫలాలను తెస్తుంది. ఆయన మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచడు లేక నిరాశపరచడు, ఎందుకంటే బైబిలు ఆయన గురించి ఇలా చెబుతోంది: “దేవుడు నమ్మతగిన వాడు.” (1 కొరింథీయులు 1:9) దేవునికి విశ్వసనీయంగా లేక నమ్మకంగా ఉండడం నిత్య ప్రతిఫలాలను తెస్తుంది.—1 యోహాను 2:17.
[6వ పేజీలోని బ్లర్బ్]
ఒక మంచి స్నేహితుని విశ్వసనీయత మీ హృదయానికి సంతోషాన్నిస్తుంది
[5వ పేజీలోని చిత్రం]
విశ్వసనీయంగా ఉండే కుటుంబ సభ్యులు ఒకరి అవసరాలపట్ల మరొకరు శ్రద్ధ చూపించుకుంటారు