కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w02 2/15 పేజీలు 18-22
  • “శరీరములో ఒక ముల్లు”వంటి సమస్యను అధిగమించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “శరీరములో ఒక ముల్లు”వంటి సమస్యను అధిగమించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక ముల్లులాంటి సమస్యను ఎలా అధిగమించవచ్చు?
  • యెహోవా ఏర్పాట్లు ఆవశ్యకము
  • కొందరు ఎలా విజయవంతంగా అధిగమించగలిగారు?
  • సహనం సంతోషాన్ని తెస్తుంది
  • మానవ బలహీనత యెహోవా శక్తిని ఘనపరుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • వాళ్ళు శరీరంలో ముళ్ళలాంటి సమస్యలను అధిగమించారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పౌలు ‘శరీరంలో ముల్లు’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • మీకు “శరీరములో ఒక ముల్లు” ఉందా?
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
w02 2/15 పేజీలు 18-22

“శరీరములో ఒక ముల్లు”వంటి సమస్యను అధిగమించడం

“నా కృప నీకు చాలును.”—2 కొరింథీయులు 12:9.

1, 2. (ఎ) మనకు పరీక్షలు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ మనం ఎందుకు ఆశ్చర్యపోకూడదు? (బి) శ్రమలు ఎదురవుతున్నప్పటికీ మనం ఎందుకు నమ్మకం కలిగివుండవచ్చు?

“క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:12) ఎందుకలా? ఎందుకంటే, మానవుడు కేవలం తన స్వార్థపూరిత కారణాలను బట్టే దేవుణ్ణి సేవిస్తాడని సాతాను వాదిస్తాడు, అది నిజమని రుజువు చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. “ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను” అని ఒకసారి యేసు తన నమ్మకమైన అపొస్తలులను హెచ్చరించాడు. (లూకా 22:31) బాధాకరమైన సమస్యల ద్వారా మనలను పరీక్షించడానికి సాతానును దేవుడు అనుమతిస్తాడని యేసుకు బాగా తెలుసు. నిజమే, దానర్థం, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టమూ నేరుగా సాతాను నుండి లేదా అతని దయ్యాల నుండి వస్తుందని కాదు. (ప్రసంగి 9:11) కాని మన యథార్థతను పాడు చేయడానికి సాతాను తన దగ్గరున్న ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించడానికి ఆతురతతో ఎదురుచూస్తున్నాడు.

2 మనకు కలిగే శ్రమలను గూర్చి మనం ఆశ్చర్యపోకూడదని బైబిలు మనకు చెబుతుంది. మనకు ఏమి సంభవించినా వింతా కాదు ఎదురు చూడనిదీ కాదు. (1 పేతురు 4:12) వాస్తవానికి, ‘లోకమందున్న మన సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి.’ (1 పేతురు 5:9) నేడు దేవుని ప్రతి సేవకుని మీదకు సాతాను విపరీతమైన ఒత్తిడిని తీసుకువస్తున్నాడు. సాధ్యమైనన్ని ముళ్ళలాంటి సమస్యలతో మనం పీడించబడటాన్ని చూడటంలో అపవాది ఆనందిస్తాడు. దాని కోసం, ‘మనకు శరీరములో ముళ్ళు’ ఏమన్నా ఉంటే వాటిని అధికం చేసే విధంగా, తీవ్రం చేసే విధంగా తన లోక విధానాన్ని ఉపయోగిస్తాడు. (2 కొరింథీయులు 12:7) అయినప్పటికీ, సాతాను దాడులు మన యథార్థతను పాడు చేయవలసిన అవసరం లేదు. యెహోవా మనం శోధనను సహించేందుకు “మార్గమును కలుగజేయు”నట్లే, మనకు శరీరములో ముళ్ళ వంటి కష్టాలు ఎదురైనప్పుడు కూడా మార్గమును కలుగజేస్తాడు.—1 కొరింథీయులు 10:13.

ఒక ముల్లులాంటి సమస్యను ఎలా అధిగమించవచ్చు?

3. తన శరీరములోని ముల్లును తీసివేయమని పౌలు కోరినప్పుడు యెహోవా ఏమని సమాధానమిచ్చాడు?

3 తన శరీరములోని ముల్లును తీసివేయమని అపొస్తలుడైన పౌలు దేవుణ్ణి వేడుకొన్నాడు. ‘అది తనయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొన్నాడు.’ ఆయన పట్టుదలతో చేసిన విన్నపానికి యెహోవా ఏమని సమాధానమిచ్చాడు? “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని” చెప్పాడు. (2 కొరింథీయులు 12:8, 9) మనం ఈ సమాధానాన్ని విశ్లేషించి, మనలను బాధపెట్టే ముళ్ళలాంటి ఏ సమస్యలనైనా అధిగమించడానికి అది ఎలా సహాయపడగలదో చూద్దాం.

4. పౌలుకు యెహోవా చూపిన అపాత్రమైన కృప నుండి ఆయన ఏయే విధాలుగా ప్రయోజనం పొందాడు?

4 పౌలుకు కృప, అంటే అపాత్రమైన కృప క్రీస్తు ద్వారా అప్పటికే చూపబడింది. దాన్ని బట్టి కృతజ్ఞతాభావంతో ఉండమని దేవుడు ఆయనను ప్రోత్సహించాడని గమనించండి. వాస్తవానికి, పౌలు అనేక విధాల్లో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన యేసు అనుచరులను పట్టువిడువకుండా వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ, యేసు శిష్యుడయ్యే ఆధిక్యతను యెహోవా ఆయనకు ప్రేమపూర్వకంగా ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 7:58; 8:3; 9:1-4) ఆ తర్వాత, యెహోవా ఆయనకు ఎంతో ఆనందకరమైన అనేక నియామకాలను ఆధిక్యతలను దయతో ఇచ్చాడు. మనం నేర్చుకోవలసిన పాఠం స్పష్టం. ఎంతో బాధాకరమైన సమయాల్లో సహితం, మనం కృతజ్ఞులమై ఉండేందుకు మనకు అనేక ఆశీర్వాదాలున్నాయి. మనం అనుభవిస్తున్న శ్రమలు మనం యెహోవా మంచితనం యొక్క బాహుళ్యాన్ని మరచిపోయేలా ఎన్నడూ చేయకూడదు.—కీర్తన 31:19.

5, 6. (ఎ) దైవిక శక్తి ‘బలహీనతయందు పరిపూర్ణమగుచున్నది’ అన్న విషయాన్ని యెహోవా పౌలుకు ఎలా నేర్పించాడు? (బి) సాతాను అబద్ధికుడన్న విషయాన్ని పౌలు ఉదాహరణ ఎలా నిరూపించింది?

5 మనకు అపాత్రమైన కృపను యెహోవా చూపిస్తున్నాడు, అది ఉంటే చాలునని మరొక విధంగా రుజువవుతుంది. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనకు సహాయపడేందుకు దేవుడు ఇచ్చే శక్తి, కావలసినదానికన్నా అధికంగానే ఉంటుంది. (ఎఫెసీయులు 3:20) దైవిక శక్తి ‘బలహీనతయందు పరిపూర్ణమగుచున్నది’ అని యెహోవా పౌలుకు నేర్పించాడు. ఎలా? ఆయన తన శ్రమను అధిగమించేందుకు కావలసినంత బలాన్ని యెహోవా ప్రేమపూర్వకంగా ఇచ్చాడు. పౌలు చూపించిన సహనమూ ఆయనకు యెహోవా మీద ఉన్న సంపూర్ణ నమ్మకమూ, బలహీనుడు పాపభరితుడు అయిన ఆయన విషయంలో దేవుని శక్తి విజయం సాధిస్తోందన్న విషయాన్ని అందరికీ వెల్లడి చేశాయి. మానవులు తమ జీవితం ప్రశాంతంగా, సమస్యలు లేకుండా సాగుతున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి సేవిస్తారని వాదించే అపవాదిపై అది ఎలాంటి ప్రభావం చూపిందో ఆలోచించండి. పౌలు యథార్థత, ఆ అపవాది ముఖం మీద కొట్టినట్లయ్యింది!

6 దేవునికి వ్యతిరేకమైన పోరాటంలో మునుపు సాతాను పక్షాన ఉండి, అహంభావంతో క్రైస్తవులను వేధించిన, ఆసక్తిగల పరిసయ్యుడైన పౌలు, ఉన్నత వర్గంలో జన్మించాడు గనుక ఒకప్పుడు అనేక సుఖ సౌకర్యాలను అనుభవించాడనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ పౌలు ‘అపొస్తలులందరిలో తక్కువవాడిగా’ యెహోవాను క్రీస్తును సేవిస్తున్నాడు. (1 కొరింథీయులు 15:9) అందుకే ఆయన, మొదటి శతాబ్దపు క్రైస్తవ పరిపాలక సభ యొక్క అధికారానికి వినయంగా లోబడ్డాడు. ఆయనకు తన శరీరములో ముల్లున్నప్పటికీ, నమ్మకంగా కొనసాగాడు. జీవితంలోని శ్రమలు పౌలు ఆసక్తిని తగ్గించలేకపోవడం సాతానుకు మరింత కోపం పుట్టించింది. తాను క్రీస్తు యొక్క పరలోక రాజ్యంలో పాలివాడవుతాడన్న నిరీక్షణను పౌలు ఎన్నడూ మరచిపోలేదు. (2 తిమోతి 2:12; 4:18) ఏ ముల్లైనా, అది ఎంత బాధాకరమైనదైనా ఆయన ఆసక్తిని తగ్గించలేకపోయింది. అలాగే మన ఆసక్తి కూడా బలంగా కొనసాగాలి! శ్రమల్లో మనకు బలాన్నివ్వడం ద్వారా, సాతాను అబద్ధికుడని నిరూపించడంలో తోడ్పడే ఆధిక్యతనిస్తూ యెహోవా మనలను ఘనపరుస్తున్నాడు.—సామెతలు 27:11.

యెహోవా ఏర్పాట్లు ఆవశ్యకము

7, 8. (ఎ) యెహోవా నేడు తన సేవకులను దేని ద్వారా బలపరుస్తాడు? (బి) మన శరీరములో ఒక ముల్లును అధిగమించేందుకు ప్రతిరోజూ బైబిలు చదవడమూ, అధ్యయనం చేయడమూ ఎందుకంత ఆవశ్యకము?

7 నేడు యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, మన క్రైస్తవ సహోదరత్వం ద్వారా నమ్మకమైన క్రైస్తవులను బలపరుస్తున్నాడు. అపొస్తలుడైన పౌలులాగే, మనం ప్రార్థనలో యెహోవాపై మన భారాన్ని మోపగలము. (కీర్తన 55:22) దేవుడు మన శ్రమలను తీసివేయకపోయినప్పటికీ, మనం వాటిని అధిగమించేందుకు, భరించడం అంత సులభం కాని శ్రమలను సహితం తట్టుకునేందుకు అవసరమైన జ్ఞానాన్నిస్తాడు. అలాగే మనం సహించేందుకు సహాయపడడానికి యెహోవా మనకు “బలాధిక్యము”నివ్వడం ద్వారా మనకు ఆత్మ స్థైర్యాన్ని కూడా ఇవ్వగలడు.—2 కొరింథీయులు 4:7.

8 మనం అలాంటి సహాయాన్ని ఎలా పొందుతాము? దేవుడు ఇచ్చే నిశ్చయమైన ఆదరణను ఆయన వాక్యంలో కనుగొంటాం గనుక, దానిని మనం తప్పనిసరిగా శ్రద్ధగా అధ్యయనం చేయాలి. (కీర్తన 94:19) దేవుని సేవకులు ఆయన సహాయం కోసం అర్థిస్తూ పలికిన, హృదయాన్ని తాకేటువంటి మాటలను మనం బైబిలులో చదువుతాము. దానికి యెహోవా ఇచ్చిన సమాధానాల్లో తరచూ, ఓదార్పుకరమైన మాటలు ఉంటాయి, మనం వాటిని ధ్యానించాలి. దేవుని వాక్య అధ్యయనం మనలను బలపరుస్తుంది, అలా ‘ఆ బలాధిక్యము మన మూలమైనది కాక దేవునిదై యుంటుంది.’ పోషణ కోసమూ, బలం కోసమూ మనం ప్రతి రోజూ భౌతిక ఆహారం భుజించవలసిన అవసరం ఉన్నట్లే, మనం దేవుని మాటలు అనే భోజనాన్ని క్రమంగా తీసుకోవాలి. మనమలా చేస్తున్నామా? మనమలా చేస్తే, మనం “బలాధిక్యము”ను పొందడం, ఆలంకారికమైన ఎటువంటి ముళ్ళు ఇప్పుడు మనలను బాధించినా వాటిని సహించేందుకు సహాయపడుతుందని మనం చూస్తాము.

9. సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నవారికి పెద్దలు ఎలా మద్దతునివ్వగలరు?

9 దైవభయంగల క్రైస్తవ పెద్దలు, బాధ అనే “గాలికి మరుగైనచోటువలెను,” సమస్యలనే “గాలివానకు చాటైన చోటువలెను” ఉండగలరు. ఆ ప్రేరేపిత వర్ణనకు తగినవారముగా ఉండాలని కోరుకునే పెద్దలు, బాధపడుతున్నవారికి సరైన మాటలతో సమాధానమివ్వడమెలాగో తెలిసివుండేలా, “శిష్యునికి తగిన నోరు” ఇవ్వమని వినయంగా హృదయపూర్వకంగా యెహోవాను వేడుకొంటారు. సంఘ పెద్దల మాటలు, జీవితంలోని క్లిష్టమైన సమయాల్లో మన ప్రాణాన్ని తెప్పరిల్లజేసే ఉపశమనాన్నిచ్చే వాన జల్లులా ఉండగలవు. ఆధ్యాత్మిక సహోదరులు సహోదరీలు తమ శరీరంలోని ఏదో ఒక ముల్లు కారణంగా అలసిపోతుండవచ్చు, మానసికంగా కృంగిపోతుండవచ్చు. “ధైర్యము చెడినవారిని ధైర్యపరచు” విధంగా మాట్లాడడం ద్వారా, పెద్దలు వారికి నిజంగా మద్దతునివ్వగలరు.—యెషయా 32:2; 50:4; 1 థెస్సలొనీకయులు 5:14.

10, 11. తీవ్రమైన పరీక్షలను ఎదుర్కుంటున్న ఇతరులను దేవుని సేవకులు ఎలా ప్రోత్సహించగలరు?

10 యెహోవా సేవకులందరూ, ఐక్యపరచబడిన ఆయన క్రైస్తవ కుటుంబంలో భాగమే. అవును, మనం “ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.” “మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.” (రోమీయులు 12:4, 5; 1 యోహాను 4:11) మనమీ ధర్మాన్ని ఎలా నెరవేరుస్తాము? 1 పేతురు 3:8 ప్రకారం, మన విశ్వాస గృహానికి చెందినవారందరి ‘సుఖదుఃఖములయందు పాలుపడి, సహోదరప్రేమ గలవారము, కరుణాచిత్తులము’ అయ్యుండడం ద్వారా నెరవేరుస్తాము. శరీరములో తీవ్ర బాధకలిగిస్తున్న ముల్లును అధిగమించడానికి ప్రయత్నిస్తున్నవారికి, వారు పిల్లలే కానివ్వండి, పెద్దవాళ్ళే కానివ్వండి, వారికి మనమందరము ప్రత్యేక శ్రద్ధనిద్దాము. ఎలా?

11 మనం వారి బాధలను అర్థం చేసుకోవడానికి శ్రమించాలి. మనకు ఇతరుల మీద సానుభూతి ఆప్యాయతా లేకుంటే, లేదా నిర్లిప్తంగా ఉంటే, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, మనం వారి బాధను పెంచినవారమవ్వవచ్చు. వారి శ్రమలను గురించి మనకున్న అవగాహన, మనం ఏమి చెబుతాము, ఎలా చెబుతాము, ఎలా ప్రవర్తిస్తాము అన్న విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు మనలను కదిలించాలి. మనం ఆశావాదంతోను ప్రోత్సాహకరంగాను ఉండడం ద్వారా, వారిని బాధిస్తున్న ముల్లు ఏదైనప్పటికీ దాని నొప్పి తీవ్రత కొంత మేరకు తగ్గడానికి సహాయపడవచ్చు. ఆ విధంగా మనం వారికి ఆదరణనిచ్చేవారముగా ఉన్నామని రుజువు చేసుకుంటాం.—కొలొస్సయులు 4:11.

కొందరు ఎలా విజయవంతంగా అధిగమించగలిగారు?

12-14. (ఎ) క్యాన్సర్‌ సంబంధిత కష్టాలను అధిగమించడానికి ఒక క్రైస్తవురాలు ఏమి చేసింది? (బి) ఈ స్త్రీ యొక్క ఆధ్యాత్మిక సహోదరులు సహోదరీలు ఆమెకు ఎలా మద్దతునిచ్చారు, ఎలా ప్రోత్సహించారు?

12 ఈ చివరి దినాల అంతం సమీపిస్తుండగా, రోజురోజుకూ ‘వేదనలు’ పెరుగుతున్నాయి. (మత్తయి 24:8) కాబట్టి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి యెహోవా చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్న ఆయన నమ్మకమైన సేవకులకు శ్రమలు కలుగవచ్చు. ఉదాహరణకు, పూర్తికాల పరిచర్యలో సేవచేస్తున్న ఒక క్రైస్తవురాలి గురించి చూద్దాం. ఆమెకు క్యాన్సర్‌ ఉందని పరీక్షల్లో తేలింది, ఆమె లాలాజల గ్రంథులు, శోషరస గ్రంథులు శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వచ్చింది. ఆమెకు ఆ జబ్బు ఉందని ఆమెకు ఆమె భర్తకు తెలిసినప్పుడు, వారు వెంటనే యెహోవా వైపు మరలి, అర్థిస్తూ సుదీర్ఘ ప్రార్థన చేశారు. అప్పుడు నమ్మశక్యము కాని సమాధానము తమపై కమ్ముకుందని ఆమె తర్వాత చెప్పింది. అయినప్పటికీ, ఆమె తరచూ బాధాకరమైన పరిస్థితులను, ముఖ్యంగా, ఆమె పొందుతున్న చికిత్సల వల్ల కలిగే ఇబ్బందులను సహించింది.

13 ఆ సహోదరి, తన పరిస్థితిని తాళుకునేందుకు, క్యాన్సర్‌ గురించి సాధ్యమైనంత మేరకు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె తన డాక్టర్లను సంప్రదించింది. ఇతరులు ఈ వ్యాధిని భావోద్వేగపరంగా ఎలా అధిగమించారో చూపించే నిజజీవిత కథలను కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోను, ఆ విషయాన్ని చర్చిస్తున్న క్రైస్తవ ప్రచురణల్లోను ఆమె కనుగొన్నది. క్లిష్ట సమయాల్లో తన ప్రజలకు బలాన్నిచ్చేందుకు యెహోవాకున్న సామర్థ్యాన్ని చూపే బైబిలు భాగాలను, సహాయకరమైన ఇతర సమాచారాన్ని కూడా చదివింది.

14 నిరాశానిస్పృహలను అధిగమించడాన్ని గురించి చర్చించే ఒక ఆర్టికల్‌, “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు” అన్న జ్ఞానయుక్తమైన మాటలను ఉదాహరించింది. (సామెతలు 18:1) కాబట్టి, “ఒంటరిగా ఉండే ప్రవృత్తికి వ్యతిరేకంగా పోరాడండి” అని ఆ ఆర్టికల్‌ సలహా ఇచ్చింది.a “చాలా మంది నాకోసం ప్రార్థిస్తున్నామని చెప్పారు; ఇతరులు నాకు ఫోను చేశారు. ఇద్దరు పెద్దలు నేనెలా ఉన్నానో తెలుసుకోవడానికి క్రమంగా ఫోను చేసేవారు. నాకు పువ్వులు, అనేక కార్డులు అందేవి. కొంత మంది నాకోసం వంట చేసిపెట్టేవారు. అలాగే, చాలా మంది, చికిత్స కోసం నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి తామే స్వయంగా వచ్చేవారు” అని ఆ సహోదరి చెబుతుంది.

15-17. (ఎ) ప్రమాదాల వల్ల కలిగిన కష్టాలను ఒక క్రైస్తవురాలు ఎలా అధిగమించింది? (బి) సంఘంలోనివారు ఏవిధంగా సహాయం చేశారు?

15 అమెరికాలోని మెక్సికోలో దీర్ఘకాలంగా యెహోవా సేవకురాలిగా ఉన్న ఒక స్త్రీకి రెండు సార్లు ప్రమాదం జరిగింది. ఆమె మెడ, భుజాలు బాగా దెబ్బ తిన్నాయి. దాంతో ఆమెను 25 ఏళ్ళకుపైగా పట్టి పీడిస్తున్న కీళ్ళవాపు ఇంకా తీవ్రమైంది. “నా తల పైకి ఎత్తాలన్నా, రెండు కిలోల కన్నా ఎక్కువ బరువున్న దేనినైనా మోయాలన్నా నాకు చాలా కష్టమయ్యేది. కానీ యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థించడం నాకెంతో బలాన్నిచ్చింది. మేము అధ్యయనం చేసిన కావలికోటలోని ఆర్టికల్‌లు కూడా చాలా బలాన్నిచ్చాయి. మీకా 6:8పై వ్యాఖ్యానిస్తూ, దేవునితో వినయంగా నడవడమంటే ఒకరు తన పరిమితులను తెలుసుకోవడమేనని ఒక ఆర్టికల్‌ పేర్కొంది. నా పరిస్థితి ఎలా ఉన్నా, పరిచర్యలో నేను కోరుకున్న దాని కన్నా తక్కువ సమయమే వెచ్చించగలిగినా నేను నిరుత్సాహం చెందకూడదని, నిర్మలమైన ఉద్దేశాలతో ఆయనను సేవించడమే ప్రాముఖ్యమని గ్రహించేందుకు అది నాకు సహాయపడింది” అని ఆమె అంటోంది.

16 “నేను కూటాలకు హాజరుకావడానికి, క్షేత్ర పరిచర్యకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు పెద్దలు ఎల్లప్పుడూ నన్ను ప్రశంసించేవారు. యౌవనస్థులు నన్ను కౌగిలించుకుని పలకరించేవారు. పయినీరు పరిచారకులు నా విషయంలో చాలా ఓపిక కనబరచేవారు, తరచూ నాకు వంట్లో బావుండనప్పుడు వారు తమ ప్లానులను మార్చుకునేవారు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, వారు దయగా నన్ను పునర్దర్శనాలకు తీసుకువెళ్ళేవారు, లేదా తమతోపాటు బైబిలు అధ్యయనాలకు రమ్మని ఆహ్వానించేవారు. నేను ప్రకటనా పనికి వెళ్ళినప్పుడు పుస్తకాల బ్యాగును మోయలేను కనుక, సంఘంలోని ఇతర ప్రచారకులు నా సాహిత్యాన్ని తమ బ్యాగుల్లో పెట్టునేవారు” అని కూడా ఆమె చెబుతోంది.

17 ముళ్ళలాంటి తమ అశక్తతలను అధిగమించడానికి ఆ ఇద్దరు సహోదరీలకు సంఘ పెద్దలు, తోటి విశ్వాసులు ఎలా సహాయపడ్డారో ధ్యానించండి. వాళ్ళ ఆధ్యాత్మికమైన, భౌతికమైన, భావోద్వేగపరమైన నిర్దిష్ట అవసరాలను తీర్చే ఆచరణాత్మకమైన, దయాపూర్వకమైన సహాయాన్ని అందించారు. సమస్యలను అనుభవిస్తున్న ఇతర సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి వాళ్ళ మాదిరి మిమ్మల్ని ప్రోత్సహించదా? చిన్నలారా, మీ సంఘంలో తమ శరీరములో ముళ్ళతో పోరాడుతున్నవారికి మీరు కూడా సహాయం చేయగలరు.—సామెతలు 20:29.

18. కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో ప్రచురించబడిన జీవిత కథల్లో మనం ఎలాంటి ప్రోత్సాహాన్ని పొందవచ్చు?

18 జీవిత సమస్యలను అధిగమించిన, ఇప్పటికీ అధిగమిస్తున్న సాక్షుల అనేక జీవిత కథలు, అనుభవాలు కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో ప్రచురించబడ్డాయి. మీరు అలాంటి ఆర్టికల్‌లను క్రమంగా చదువుతుండగా, ప్రపంచవ్యాప్తంగా మీ ఆధ్యాత్మిక సహోదరుల్లో సహోదరీల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులను, విపత్తుల్లో ప్రియమైనవారిని కోల్పోయిన బాధను, యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రమాదకరమైన పరిస్థితులను సహించారని గ్రహిస్తారు. ఇతరులు తమను బలహీనపరచే వ్యాధులతో జీవిస్తున్నారు. ఆరోగ్యవంతులు తేలిక అని భావించే అతి చిన్న విషయాలను కూడా అనేకులు చేయలేరు. వాళ్ళ అనారోగ్యం వారిని తీవ్రంగా పరీక్షిస్తుంది, ముఖ్యంగా, క్రైస్తవ కార్యకలాపాల్లో తాము కోరుకున్నంతగా భాగం వహించలేనప్పుడు అదొక తీవ్ర పరీక్షగా ఉంటుంది. వారు తమకు సహాయపడుతూ మద్దతుగా ఉంటున్న సహోదర సహోదరీలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకు ఎంతో కృతజ్ఞులైవుంటారు!

సహనం సంతోషాన్ని తెస్తుంది

19. ముళ్ళలాంటి శ్రమలు బలహీనతలు ఉన్నప్పటికీ పౌలు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి?

19 దేవుడు తనను ఎలా బలపరుస్తున్నాడో చూసినప్పుడు పౌలు ఆనందించాడు. “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను” అని ఆయన అన్నాడు. (2 కొరింథీయులు 12:9, 10) “నాకు కొదువ గలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని తన వ్యక్తిగత అనుభవాలను బట్టి పౌలు నమ్మకంగా చెప్పగలిగాడు.—ఫిలిప్పీయులు 4:11-13.

20, 21. (ఎ) “అదృశ్యమైన”వాటిని ధ్యానించడంలో మనం ఆనందాన్ని పొందడానికి కారణమేమిటి? (బి) మీరు భూపరదైసులో చూడాలని నిరీక్షిస్తున్న “అదృశ్యమైన” విషయాల్లో కొన్ని ఏవి?

20 మన శరీరములో ఎటువంటి ఆలంకారిక ముల్లున్నప్పటికీ, మన బలహీనతలో యెహోవా శక్తి పరిపూర్ణమవుతుందని ప్రతి ఒక్కరికీ చూపించడంలో మనం గొప్ప సంతోషాన్ని పొందవచ్చు. “మేము అధైర్యపడము; . . . ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము . . . అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా . . . అదృశ్యమైనవి నిత్యములు” అని పౌలు వ్రాశాడు.—2 కొరింథీయులు 4:16-18.

21 నేడు యెహోవా ప్రజల్లో దాదాపు అందరూ, ఆయన యొక్క భూపరదైసుపై జీవించాలని, ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను అనుభవించాలని నిరీక్షిస్తున్నారు. అటువంటి ఆశీర్వాదాలను నేడు “అదృశ్యమైనవి”గా ఎంచవచ్చు. అయినప్పటికీ, మనం ఆ ఆశీర్వాదాలను మన స్వనేత్రాలతో చూసే సమయం, అవును, వాటిని నిరంతరం అనుభవించే సమయం శీఘ్రంగా ఆసన్నమవుతోంది. అలాంటి ఆశీర్వాదాల్లో ఒకటి ఏమిటంటే, మళ్ళీ ఎన్నడూ ముళ్ళలాంటి సమస్యలతో జీవించనవసరంలేకుండా విముక్తి పొందడం! దేవుని కుమారుడు, “అపవాది యొక్క క్రియలను లయపరచు”తాడు, ‘మరణముయొక్క బలముగలవానిని నశింపజేస్తాడు.’—1 యోహాను 3:8; హెబ్రీయులు 2:14.

22. మనకు ఎలాంటి నమ్మకమూ నిశ్చయతా ఉండాలి?

22 కాబట్టి, మన శరీరములో నేడు ఏ ముల్లు బాధపెడుతున్నప్పటికీ, మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉందాం. తన శక్తిని ఉదారంగా ఇచ్చే యెహోవా మంచితనం ద్వారా పౌలులాగే మనం కూడా, అలా అధిగమించేందుకు కావలసిన బలాన్ని పొందుతాము. మనం భూపరదైసులో జీవించేటప్పుడు, మన దేవుడైన యెహోవా మన కోసం చేసే అద్భుతమైన ఉపకారాలన్నింటిని బట్టి ఆయనను ప్రతిరోజూ స్తుతిస్తాము.—కీర్తన 103:2.

[అధస్సూచి]

a మే 8, 2000 (ఆంగ్లం) తేజరిల్లు!లో “బైబిలు ఉద్దేశము: నిరాశా నిస్పృహలను అధిగమించడమెలా?” అనే ఆర్టికల్‌ను చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• నిజ క్రైస్తవుల యథార్థతను పాడు చేయడానికి అపవాది ఎందుకు, ఎలా ప్రయత్నిస్తాడు?

• యెహోవా శక్తి ఎలా ‘బలహీనతలయందు పరిపూర్ణమవుతుంది’?

• సమస్యలతో బాధపడుతున్నవారిని పెద్దలూ ఇతరులూ ఎలా ప్రోత్సహించగలరు?

[18వ పేజీలోని చిత్రం]

తన శరీరములోని ముల్లును తీసివేయమని పౌలు మూడుసార్లు దేవుణ్ణి వేడుకున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి