గాలికి మరుగైనచోటు
యూరప్‌లోని ఆల్ప్స్ పర్వత శిఖరాల్లో, దృఢంగా గుబురుగా ఉండే మొక్క పెరుగుతుండటాన్ని మీరు చూడవచ్చు. అది ఆల్పైన్ రోజ్ అని పిలువబడుతుంది. పొట్టిగా ఉండే ఆ రోడోడెండ్రోన్ మొక్కలు తరచూ తక్కువ ఎత్తుతో దట్టంగా పెరుగుతాయి, ఎత్తైన ప్రాంతాల్లో వీచే గాలుల తాకిడిని తట్టుకునేలా నేలవైపుగా కొంచెం ఒరిగి ఉంటాయి. నిర్విరామంగా వీచే గాలులు ఆల్పైన్ మొక్కల ఉష్ణోగ్రతను తగ్గించి, గాలిని నేలను తేమలేకుండా చేసి ఆ మొక్కల వేర్లను పెకిలిస్తూ వాటి ఉనికిని ప్రమాదంలో పడవేస్తాయి.
ఆల్పైన్ రోజ్ మొక్కలు తరచూ బండలలోని పగుళ్ళలో పెరుగుతూ గాలి తాకిడికి నాశనం కాకుండా తప్పించుకుంటాయి. ఆ పగుళ్ళలో మట్టి అంతగా ఉండకపోయినప్పటికీ, వాటిలో ఉన్న సందు, గాలి నుండి రక్షణనిచ్చి, ఆ మొక్క నీటిని నిల్వ ఉంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ రోడోడెండ్రోన్ మొక్కలు సంవత్సరంలోని అధికభాగం బయటికి కనిపించకుండా ఉండి, వేసవిలో ఉజ్జ్వలమైన ఎరుపు వర్ణంలోని పువ్వులతో తమకు ఆశ్రయమిచ్చిన పర్వతాలను అలంకరిస్తాయి.
“అధికారులు” దేవునిచేత నియమించబడి, వారిలో ప్రతి ఒక్కరూ, “గాలికి మరుగైనచోటువలె” ఉంటారని ప్రవక్తయైన యెషయా వివరించాడు. (యెషయా 32:1, 2) ఒత్తిడి లేదా బాధలు అనుభవిస్తున్న సమయంలో, ఈ ఆధ్యాత్మిక అధికారులు, లేదా పైవిచారణకర్తలు, రాజైన యేసుక్రీస్తు నిర్దేశం క్రింద, దృఢంగా కదలని బండల్లా ఉంటారు. వారు ప్రతికూల పరిస్థితుల్లో నమ్మదగిన ఆశ్రయాన్నిస్తారు, దేవుని వాక్యంలో నుండి తీసుకున్న ఆధ్యాత్మిక నీటి నిలువలను కాపాడుకునేందుకు సహాయం అవసరమైనవారికి సహాయం చేస్తారు.
హింస, నిరుత్సాహం, లేదా అనారోగ్యం అనే గాలులు ఒక క్రైస్తవుణ్ణి కొట్టుకుపోయేలా చేసి, ఆయనకు కాపుదల లభించకపోతే ఆయన విశ్వాసం బలహీనమయ్యేలా చేయగలవు. క్రైస్తవ పెద్దలు ఆయన సమస్యను శ్రద్ధగా ఆలకించి, బైబిలు ఆధారిత ఉపదేశాన్నిచ్చి, ప్రోత్సాహాన్ని లేదా ఆచరణాత్మకమైన సహాయాన్ని ఇవ్వడం ద్వారా కాపుదలనివ్వగలరు. తమ నియమిత రాజైన క్రీస్తుయేసులా, వాళ్ళు కూడా, “చెదరియున్న”వారికి సహాయం చేయాలని కోరుకుంటారు. (మత్తయి 9:36) అలాగే, అబద్ధ బోధలనే గాలుల ప్రమాదానికి గురవుతున్న ఇతరులకు సహాయపడాలని వారు కోరుకుంటారు. (ఎఫెసీయులు 4:14) సరైన సమయంలో అలా ఇవ్వబడే సహాయం ఎంతో ఆవశ్యకమైనదిగా నిరూపించబడగలదు.
మిరీయమ్ ఇలా తెలియజేసింది: “నా సన్నిహిత స్నేహితులు కొందరు సత్యాన్ని విడిచిపెట్టిన సమయంలోనే మా నాన్నగారు బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడ్డారు. ఆ సమయం నా జీవితంలో అత్యంత దుర్భరమైన సమయం. నేను నా మానసిక వ్యధను అధిగమించే ప్రయత్నంలో, యెహోవాసాక్షి కాని ఒక బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు, నేను నిష్ప్రయోజకురాలినన్న భావనతో, యెహోవా నన్ను ప్రేమించలేడన్నది నాకు నిశ్చయంగా తెలుసు గనుక, నేను సత్యాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని సంఘ పెద్దలకు తెలియజేశాను.
“బాధాకరమైన ఆ సమయంలో, సానుభూతిగల ఒక పెద్ద నేను క్రమ పయినీరు పరిచారకురాలిగా సేవ చేసిన సంవత్సరాలను నాకు గుర్తు చేశాడు. నా విశ్వాస్యతను ఆయన ఎల్లప్పుడూ మెచ్చుకునేవాడని ఆయన నాకు చెప్పాడు. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడన్న నిశ్చయత తిరిగి కలిగేలా పెద్దలు నాకు సహాయపడేందుకు అనుమతించమని ఆయన దయాపూర్వకంగా కోరాడు. బాధాకరమైన ఆ సమయంలో వారు చూపించిన ప్రేమపూర్వకమైన శ్రద్ధ, నా చుట్టూ ఆధ్యాత్మిక తుపాను చెలరేగిన సమయంలో నాకు ‘మరుగైనచోటు’వలె ఉంది. ఒక నెలలోపే, నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకున్నాను, అప్పటి నుండి సత్యపు మార్గంలోనే నడుస్తూ ఉన్నాను.”
తోటి క్రైస్తవులకు సరైన సమయంలో ఇవ్వబడిన కాపుదల మూలంగా వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లడాన్ని చూసినప్పుడు పెద్దలు తమకు ప్రతిఫలం లభించినట్లు భావిస్తారు. ఈ ‘మరుగైన చోట్లు,’ క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో మనం అనుభవించనున్న సమృద్ధమైన ఆధ్యాత్మిక సహాయాన్ని ముందుగా చవిచూపిస్తున్నారు.