జీవిత కథ
నా మధుర స్మృతుల నిమిత్తం కృతజ్ఞురాలిని!
ద్రుస్సిల్ల కెయిన్ చెప్పినది
అది 1933వ సంవత్సరం. జనోవా కెయిన్‌ను పెళ్ళి చేసుకున్న తొలి రోజులు. ఆయన కూడా నాలానే కల్‌పోర్చర్, అంటే పూర్తికాల సువార్తికుడు. ఉత్సాహం ఉరకలేస్తుండగా నా భర్తతోపాటు ఆనియామకంలోకి ప్రవేశించాలని అనుకుంటూ ఉన్నాను, కానీ అలా చేయాలంటే నాకొక సైకిలు కావాలి. గొప్ప ఆర్థిక మాంద్యం మూలంగా పరిస్థితులు చాలా కష్టంగా ఉండడంతో సైకిలు కొనుక్కునే తాహతుకి నేనెన్నడూ చేరుకోలేదు. ఏం చెయ్యాలిప్పుడు?
నాపరిస్థితిని చూసి నా మరుదులు దగ్గర్లోని జంక్ యార్డ్‌లలో ఏవైనా పాత పార్టులు దొరుకుతాయేమో వాటితో సైకిలు తయారు చేద్దామని వెదకడం ప్రారంభించారు. చివరికి పార్టులు దొరికాయి, నాకు సైకిలు దొరికింది! సైకిలు తొక్కడం నేర్చుకోగానే నేనూ జనోవా కలిసి మాపయనం ప్రారంభించాము. ఇంగ్లాండులోని వర్‌సెస్టర్, హియర్‌ఫోర్డ్ మండలాల్లో సైకిలు తొక్కుకుంటూ, కలిసిన వారందరికి సాక్ష్యం ఇస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయాము.
విశ్వాసంతో మేం వేసిన ఆచిన్న అడుగు సమృద్ధికరమైన స్మృతులతో నిండిన జీవితానికి దారితీస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయితే, నా జీవితానికి ఆధ్యాత్మిక పునాదిని నా ప్రియమైన తల్లిదండ్రులు వేశారు.
గొప్ప యుద్ధం తర్వాత కష్టకాలాలు
నేను 1909 డిసెంబరులో జన్మించాను. అటు తర్వాత కొంతకాలానికి మాఅమ్మకు యుగాల కొరకు దైవిక ప్రణాళిక (ఆంగ్లం) అనే పుస్తకం లభించింది. 1914 లో మాఅమ్మా నాన్న నన్ను “ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్” చూడడానికి లాంకాషైర్‌లోని ఓల్డ్‌హామ్‌కి తీసుకువెళ్ళారు. (ఈ రెండూ ఇప్పుడు యెహోవాసాక్షులని పిలువబడేవారు ఉత్పత్తి చేసినవి.) నా వయస్సు చిన్నదే అయినా అక్కడ చూసిన దాన్ని బట్టి ఆనందంతో గెంతులేసుకుంటూ ఇంటికి రావడం గుర్తుంది! అప్పట్లో మేముండే రోచ్‌డేల్‌లో ఫ్రాంక్ హీలీ ఒక బైబిలు అధ్యయన గ్రూపును ప్రారంభించాడు. దానికి హాజరు కావడం, కుటుంబమంతా లేఖనాలను గురించిన అవగాహనను వృద్ధి చేసుకోవడానికి సహాయపడింది.
అదే సంవత్సరంలో గొప్ప యుద్ధం, అంటే మనమిప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం అని పిలిచే యుద్ధం విరుచుకుపడడంతో మా జీవితాల్లోని ప్రశాంతతకు భంగం వాటిల్లింది. సైన్యం కోసం నాన్నగారి పేరు నమోదు చేసుకున్నారు, కానీ ఆయన తటస్థ స్థానాన్ని వహించారు. కోర్టు ఆయన “చాలా మర్యాదస్థుడు” అని వర్ణించింది. “ఆయన ఆయుధాలు చేపట్టడానికి నిజాయితీగానే అభ్యంతరం తెలుపుతున్నాడని తాము నమ్ముతున్నట్లు కొందరు పెద్ద మనుషులు” ఎన్నో ఉత్తరాలు సమర్పించారని స్థానిక వార్తాపత్రిక నివేదించింది.
అయితే పూర్తి మినహాయింపును ఇవ్వడానికి బదులుగా మానాన్నగారిని “సాయుధ పోరాటం నుండి” మాత్రమే మినహాయించినట్లు రిజిస్టరు చేశారు. అటుతర్వాత ఆయన ఎంతో ఎగతాళికి గురయ్యారు, మాఅమ్మ, నేను కూడా ఎగతాళికి గురయ్యాము. ఆయన రిజిస్టరు చేయబడిన విధానాన్ని పునఃపరిశీలించి ఆయనకు చివరికి వ్యవసాయాన్ని అప్పగించారు. కానీ కొందరు రైతులు ఆయన పరిస్థితిని స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ ఆయనకు చాలా తక్కువ జీతం ఇచ్చేవారు, కొన్నిసార్లు అసలు ఇచ్చేవారే కాదు. కుటుంబాన్ని పోషించడానికి మాఅమ్మ చాలీచాలని జీతానికి ఒక లాండ్రీలో కష్టమైన పనులు చేసేది. అయినా నేను నా బాల్యంలో అంతటి కష్టకాలాలను అనుభవించడం ఎంత మంచిదయ్యిందో నాకిప్పుడు తెలుస్తుంది; అవి మరింత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను బట్టి కృతజ్ఞతాభావం కలిగివుండేందుకు నాకు సహాయం చేశాయి.
చిన్నగా ప్రారంభమైంది
ఉత్సాహంగల బైబిలు విద్యార్థి డానియల్ హ్యూస్ మాజీవితాల్లోకి ప్రవేశించారు. ఆయన ఓస్‌వెస్ట్రీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూవాబన్ గ్రామంలో గని కార్మికుడిగా పనిచేస్తున్నారు. మేమక్కడికి ఇల్లు మారాము. నేనాయన్ని డాన్ అంకుల్ అని పిలిచేదాన్ని, ఆయన మాకుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయనెప్పుడు మాఇంటికి వచ్చినా మాసంభాషణ ఎప్పుడూ లేఖనాల గురించే ఉండేది. ఆయనెప్పుడూ పిచ్చాపాటీ మాట్లాడడానికి వచ్చేవారు కాదు. 1920 లో ఓస్‌వెస్ట్రీలో ఒక బైబిలు అధ్యయన తరగతి ప్రారంభమైంది, డాన్ అంకుల్ నాకు 1921 లో దేవుని వీణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చారు. నేను దీన్ని చాలా అపురూపంగా చూసుకునేదాన్ని ఎందుకంటే అందులో బైబిలు బోధలు నేను ఎంతో సులభంగా అర్థం చేసుకోగలిగేలా వివరించబడ్డాయి.
మరొక వ్యక్తి ప్రైస్ హ్యూస్,a ఈయన అటు తర్వాత యెహోవాసాక్షుల లండన్ బ్రాంచి కార్యాలయంలో పైవిచారణకర్త అయ్యారు. ఆయన తన కుటుంబంతోపాటు దగ్గర్లోని వేల్స్ సరిహద్దుల్లో ఉన్న బ్రోనిగార్త్‌లో ఉంటున్నారు. ఆయన అక్కగారైన సిస్సీ మాఅమ్మగారికి ప్రాణ స్నేహితురాలైంది.
1922 లో ‘రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి’ అనే పిలుపు బయలు వెడలినప్పుడు రేకెత్తిన ఉత్తేజం నాకు బాగా గుర్తు. నేనింకా స్కూలుకెళ్ళే అమ్మాయిగానే ఉన్నా ఆతర్వాతి సంవత్సరాల్లో ప్రత్యేక కరపత్రాలను పంచడంలో, ప్రత్యేకంగా 1924 లోని మతగురువులపై నిందారోపణ (ఆంగ్లం) అనే కరపత్రాన్ని పంచడంలో ఉత్సాహంగా పాల్గొన్నాను. ఆదశకాన్ని గురించి ఆలోచిస్తుంటే విశ్వాసంగా ఉన్న అంతమంది సహోదర సహోదరీలతో సహవసించడం ఎంత చక్కని ఆధిక్యతో కదా అనిపిస్తోంది—వారిలో కొందరు: మోడ్ క్లార్క్b ఆమె పార్ట్‌నర్ మేరీ గ్రాంట్,* ఎడ్గర్ క్లే,* రాబర్ట్ హాడ్లింగ్టన్, కేటీ రాబర్ట్స్, ఎడ్విన్ స్కిన్నర్,* పెర్సీ ఛాప్‌మన్, జాక్ నేథన్,* ఈచివరి ఇద్దరూ కెనడాలోని పనిలో సహాయపడడానికి అక్కడికి వెళ్ళారు.
“ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు” అనే బైబిలు ప్రసంగం విస్తారమైన మాప్రాంతంలో ఎంతో సమయోచితమైన సాక్ష్యంగా ఉంది. 1922, మే 14న ప్రైస్ హ్యూస్ బంధువైన స్టాన్లీ రోజర్స్ ఆప్రసంగాన్ని ఇవ్వడానికి లివర్‌పూల్ నుండి మాపట్టణానికి కాస్త ఉత్తరాన ఉన్న ఛర్క్ అనే గ్రామానికి వచ్చాడు. తర్వాత అదే రోజు సాయంకాలం ఓస్‌వెస్ట్రీలోని ద పిక్చర్ అనే థియేటర్‌లో కూడా అదే ప్రసంగాన్ని ఇచ్చాడు. ప్రత్యేకంగా ఆప్రసంగం కోసం ముద్రించబడిన హ్యాండ్‌బిల్లు ఒకటి నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఈకాలమంతటిలోను మాచిన్న గ్రూపు ముగ్గురు ప్రయాణ పైవిచారణకర్తల సందర్శనాల ద్వారా బలపరచబడుతూ ఉంది. వారిని మేము పిల్‌గ్రిమ్స్ అనేవాళ్ళం, వారు హెర్బర్ట్ సీనియర్, అల్బర్ట్ లాయిడ్, జాన్ బ్లానీలు.
నిర్ణయం తీసుకోవల్సిన సమయం
1929 లో నేను బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకప్పుడు 19 సంవత్సరాలు, అప్పుడే నేను నా మొదటి పరీక్షను ఎదుర్కొన్నాను. నేనొక యౌవనస్థుడ్ని కలిశాను, ఆయన తండ్రొక రాజకీయనాయకుడు. ఒకర్నొకరం ఇష్టపడ్డాము, నన్ను పెళ్ళి చేసుకుంటానని ఆయన అన్నాడు. అంతకు క్రితం సంవత్సరం ప్రభుత్వం (ఆంగ్లం) అనే పుస్తకం విడుదలైంది, ఆపుస్తకం కాపీని ఆయనకు ఇచ్చాను. కానీ ఆయనకు ఆపుస్తకం మూలాంశమైన పరలోక ప్రభుత్వంపైన ఏమాత్రం ఆసక్తి లేదని తొందర్లోనే స్పష్టమైంది. ప్రాచీన కాలాల్లోని ఇశ్రాయేలీయులు అవిశ్వాసులతో ఎలాంటి వివాహ సంబంధాలు ఏర్పరచుకోవద్దని ఆజ్ఞాపించబడ్డారనీ, ఆసూత్రం క్రైస్తవులకు కూడా వర్తిస్తుందనీ నా బైబిలు అధ్యయనాల మూలంగా నాకు తెలుసు. అందుకని నాకు కష్టంగా ఉన్నా ఆయన ప్రతిపాదనను నేను తిరస్కరించాను.—ద్వితీయోపదేశకాండము 7:3; 2 కొరింథీయులు 6:14.
అపొస్తలుడైన పౌలు మాటల నుండి నేను బలాన్ని తెచ్చుకున్నాను: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.” (గలతీయులు 6:9) నా ప్రియమైన డాన్ అంకుల్ కూడా ఇలా వ్రాసినప్పుడు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు: “పరీక్షలు చిన్నవైనా పెద్దవైనా రోమీయులు 8వ అధ్యాయం, 28వ వచనం అన్వయించుకో,” అక్కడిలా ఉంది: “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.” అదంత సులభమైన నిర్ణయమేమీ కాదు, కానీ నేను సరైన నిర్ణయాన్ని తీసుకున్నానని నాకు తెలుసు. అదే సంవత్సరం నేను కల్‌పోర్చర్‌గా నియామకాన్ని చేపట్టాను.
సవాలును ఎదుర్కోవడం
1931 లో మేము ఒక క్రొత్త పేరును, యెహోవాసాక్షులనే పేరును స్వీకరించినప్పుడు రాజ్యం, లోకానికి నిరీక్షణ (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగిస్తూ ప్రచార కార్యకలాపంలో తీవ్రంగా పాల్గొన్నాము. ప్రతి రాజకీయ నాయకుడికి, మతగురువుకి, వ్యాపారస్థుడికి ఒక్కొక్క ప్రతి ఇవ్వబడింది. నేను పనిచెయ్యాల్సిన ప్రాంతం ఓస్‌వెస్ట్రీ నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్న రెక్సామ్ వరకు ఉంది. ఆప్రాంతాన్నంతటినీ పూర్తి చేయడం ఒక సవాలే.
ఆ తర్వాతి సంవత్సరం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఒక సమావేశంలో 24 మంది స్వచ్ఛంద సేవకులు కావాలని పిలుపు బయలు వెడలింది. 24 మందిమి అత్యుత్సాహంతో ఒక క్రొత్త రకమైన సేవకు మాపేర్లను ఇచ్చాము, అదేంటో మాకు అప్పుడు తెలీదు. శరీరానికి ముందు వెనుకల రాజ్యాన్ని ప్రకటిస్తున్న రెండు కార్డుబోర్డులను తగిలించుకుని రాజ్యం, లోకానికి నిరీక్షణ అనే అదే చిన్న పుస్తకాన్ని ఇద్దరిద్దరముగా ప్రజలకు అందించాలన్నదే మానియామకం అని తెలుసుకొని ఎంత ఆశ్చర్యానందాలకు లోనయ్యమో ఒక్కసారి ఆలోచించండి.
నేను ఒక క్యాథడ్రల్ సమీపంలో పనిచేస్తూ చాలా ఇబ్బందిగా భావించాను, కానీ ఆనగరంలో నన్నెవరూ ఎరగరని నన్ను నేను సముదాయించుకున్నాను. అయినా, నన్ను సమీపించిన మొట్టమొదటి వ్యక్తి స్కూల్లోని పాత స్నేహితురాలే. ఆమె నన్ను ఎగాదిగా చూసి, “ఏమిటీ వింత వేషం, ఏం చేస్తున్నావసలు?” అని అడిగింది. ఆఅనుభవంతో మనుష్య భయం అన్నది ఏమాత్రం లేకుండా నన్నొదిలిపోయింది!
క్షేత్రంలో మరింత ముందుకి
1933 లో నేను జనోవాను పెళ్ళి చేసుకున్నాను, ఆయన నాకన్నా 25 ఏండ్లు పెద్ద, భార్య చనిపోయింది. మొదటి భార్య అత్యంతాసక్తిగల ఒక బైబిలు విద్యార్థిని, ఆమె చనిపోయిన తర్వాత జనోవా తన నియామకంలో నమ్మకంగా నిలిచారు. కొద్దికాలానికి మేము ఇంగ్లాండు నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో నార్త్ వేల్స్‌లోని మాక్రొత్త ప్రాంతానికి మారాము. అట్టపెట్టెలు, సూట్‌కేసులు, మరితర విలువైన వస్తువులు మాసైకిళ్ళ హ్యాండిళ్ళపైన, మధ్యలోని బార్లపైనా, వెనుకనున్న స్టాండులపైనా ఎలాగోలా సర్ది పెట్టుకుని చివరికి మేము చేరాల్సిన చోటికైతే చేరాము! ఆనియామకంలో మాకు సైకిళ్ళు తప్పనిసరిగా ఉండాల్సిందే—మేమెక్కడికెళ్ళినా వాటిమీదే వెళ్ళేవాళ్ళం, చివరికి వేల్స్‌లో దాదాపు 900 మీటర్ల ఎత్తున ఉన్న కాడర్ ఐడ్రిస్ అనే పర్వతం మీదికి కూడా ఎక్కాము. “ఈ రాజ్య సువార్త” వినడానికి పరితపిస్తున్న ప్రజలను కనుగొనడం ఎంతో ప్రతిఫలదాయకంగా ఉండేది.—మత్తయి 24:14.
మేమక్కడికి వెళ్ళి ఎంతో కాలం కాకముందే, మేము చేస్తున్నట్లే టామ్ ప్రైస్ అనే ఒకాయన కూడా అక్కడ ప్రకటిస్తున్నాడని కొందరు చెప్పారు. వెల్ష్‌పూల్ దగ్గరున్న లాంగ్ మౌంటైన్‌పై నివసిస్తున్న టామ్‌ను మేము చివరికి కనుగొన్నాము, ఆయనను చూసి ఎంత ఆశ్చర్యపోయామో! నేను సాక్ష్యపు పని ప్రారంభించిన తొలి కాలాల్లో సమాధానపరచబడడం (ఆంగ్లం) అనే బైబిలు అధ్యయన సహాయక పుస్తకాన్ని ఆయనకు ఇచ్చాను. ఆయన ఆపుస్తకాన్ని తనంతట తానే చదువుకొని, మరింత సాహిత్యం కావాలని లండన్‌కు వ్రాశాడు, ఇక అప్పటినుండి తాను క్రొత్తగా కనుగొన్న సత్యాన్ని అత్యంతాసక్తితో ఇతరులతో పంచుకొంటూ ఉన్నాడు. మేము ఎన్నో గంటలు కలిసి గడిపాము, ముగ్గురమూ ఒకర్నొకరం ప్రోత్సహించుకోవడానికి తరచు కలిసి అధ్యయనం చేసేవాళ్ళం.
ఒక విపత్తు ఆశీర్వాదాలకు దారితీసింది
1934 లో నార్త్ వేల్స్ దగ్గర్లో ఉన్న కల్‌పోర్చర్‌లందరూ రెక్సామ్ పట్టణానికి వెళ్ళాలని నియామకాలందుకున్నారు. అక్కడ నీతియుక్తమైన పరిపాలకుడు (ఆంగ్లం) అనే చిన్నపుస్తకాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. ఈప్రత్యేక ప్రకటనా కార్యకలాపాన్ని ప్రారంభించడానికి ముందు రోజు దేశం ఒక పెద్ద విపత్తును అనుభవించింది. రెక్సామ్‌కు ఉత్తరాన 3కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రెస్‌ఫోర్డ్ కాలరీల్లో (బొగ్గు గనులు) ఒక విస్ఫోటనం జరగడంతో 266 మంది గనికార్మికులు చనిపోయారు. దాదాపు 200 మంది పిల్లలు తండ్రిలేని వారయ్యారు, 160 మంది విధవరాండ్రయ్యారు.
మేము విలపిస్తున్నవారి పట్టికను తయారు చేసి వారిని వ్యక్తిగతంగా కలిసి ఒక చిన్న పుస్తకాన్ని ఇవ్వవలసి ఉంది. నాకివ్వబడిన పేర్లలో, 19 ఏండ్ల కుమారుణ్ని పోగొట్టుకున్న మిసెస్ ఛాడ్విక్ అనే ఒక స్త్రీ పేరు ఉంది. నేను వెళ్ళినప్పుడు, తన తల్లిని ఓదార్చడానికని వచ్చిన ఆమె పెద్ద కుమారుడు జాక్ అక్కడే వున్నాడు. ఆయువకుడు నన్ను గుర్తు పట్టాడు, కానీ గుర్తు పట్టినట్లు చెప్పలేదు. అటు తర్వాత ఆయన నేనిచ్చిన చిన్నపుస్తకాన్ని చదివి, కొన్ని సంవత్సరాల క్రితం నేనాయనకు ఇచ్చిన చివరి యుద్ధం (ఆంగ్లం) అనే మరో చిన్నపుస్తకం కోసం వెతికాడు.
జాక్ ఆయన భార్య మే, మరింత సాహిత్యం కోసం నేనెక్కడుంటున్నానో తెలుసుకొని వచ్చారు. 1936 లో రెక్సామ్‌లోని తమ ఇంట్లో కూటాలను జరుపుకోవడానికి వారు అంగీకరించారు. అటు తరువాత ఆరు నెలలకు అల్బర్ట్ లాయిడ్ సందర్శించిన తర్వాత ఒక సంఘం స్థాపించబడింది, దానికి జాక్ ఛాడ్విక్ పైవిచారణకర్త. రెక్సామ్‌లో ఇప్పుడు మూడు సంఘాలు ఉన్నాయి.
జిప్సీ వాహనంలో జీవితం
అప్పటి వరకు మేము ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారుతుండగా మాకు చోటు దొరికిన స్థలాల్లోనే ఉంటూ వచ్చాము. కానీ మాకంటూ ఒక ఇల్లు ఉండాలని, అదీ ఒక చోటి నుండి మరో చోటికి తీసుకువెళ్ళగలిగేదిగా ఉండాలని జనోవా నిర్ణయించుకున్నారు. నా భర్త పూర్వికులు జిప్సీలు, ఆయన మంచి వడ్రంగి, ఆయన మాఇద్దరి కోసం ఒక జిప్సీ బండిని తయారుచేశారు. మేము దాన్ని ఎలీసబెతు అని పిలిచాము, బైబిల్లో ఆపేరుకు “సమృద్ధికి దేవుడు” అని అర్థం.
ప్రత్యేకంగా నాకు ఒక ప్రాంతం చాలా గుర్తుంది, అది ఒక సెలయేరు ప్రక్కనున్న ఒక పండ్ల తోట. నాకైతే అది పరదైసులానే ఉంది! ఆజిప్సీ బండి ఇరుకుగా ఉన్నా, పెద్ద ఆడంబరంగా లేకపోయినా అందులో మేము గడిపిన సంవత్సరాల్లో మేమనుభవించిన ఆనందాన్ని ఏదీ దోచుకోలేకపోయింది. చలికాలంలో పక్కమీది బట్టలు గడ్డకట్టుకుపోయి బండికి అతుక్కుపోయేవి, బండిలోపల గోడలపై నీటి చుక్కలు ఏర్పడేవి. మేము తాగేనీటిని కూడా మాతోపాటు తీసుకెళ్ళేవాళ్ళం, కొన్నిసార్లు చాలా దూరాలు తీసుకెళ్ళేవాళ్ళం, కానీ ఈకష్టాలన్నింటినీ మేము కలిసి అధిగమించాము.
ఒకసారి చలికాలంలో నేను మంచంపట్టాను, తినడానికి అంతగా ఏమీ లేదు, డబ్బు కూడా లేదు. జనోవా పక్కమీద కూర్చుని నా చేతిని తన చేతిలోకి తీసుకుని కీర్తన 37:25 చదివి వినిపించారు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” నావైపు తేరిచూస్తూ ఆయనిలా అన్నారు: “తొందర్లో ఏమీ జరగకపోతే మనం భిక్షమెత్తాల్సివుంటుంది, కానీ అలా జరగడాన్ని దేవుడు అనుమతిస్తాడని నేను అనుకోలేకపోతున్నాను!” తర్వాత ఆయన దగ్గర్లోని ప్రాంతంలో సాక్ష్యం ఇవ్వడానికి బయల్దేరారు.
జనోవా మధ్యాహ్నం నాకేమైనా తాగడానికి ఇద్దామని ఇంటికి వచ్చారు, ఆయనకోసం ఒక కవరు వచ్చి ఉంది. అందులో ఆయన తండ్రిగారు పంపించిన కొంత డబ్బుంది, 50 పౌండ్లు. కొన్ని సంవత్సరాల క్రితం జనోవా మోసానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు, కానీ ఇటీవలనే ఆయన నిజాయితీ బయటపడింది. దానికి పరిహారంగా ఈకానుక. ఎంత సమయోచితమో కదా!
గుణపాఠం
కొన్ని విషయాల నుండి మనం ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత పాఠాలు నేర్చుకుంటాము. ఉదాహరణకు: నేను 1927 లో స్కూలు మానేయడానికి ముందు నా తరగతిలోని తోటి విద్యార్థులకూ ఉపాధ్యాయులకూ సాక్ష్యమిచ్చాను—ఒక్క టీచరుకి తప్ప, ఆమె పేరు లవీన్యా ఫెయిర్‌క్లో. నేను భావి జీవితంలో చేయబోయే దాని గురించి ఎవరికీ అంత ఆసక్తి లేకపోవడంతోను, ఫెయిర్‌క్లో టీచరుతో నాకు సత్సంబంధాలు లేకనూ పోవడంతోను ఆమెకు సాక్ష్యం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈటీచరు తన పాత స్నేహితులనూ విద్యార్థులనూ కలిసి తానిప్పుడు యెహోవాసాక్షి అని వారికి చెప్పడానికి వచ్చిందని విన్నప్పుడు నా ఆశ్చర్యాన్నీ ఆనందాన్ని మీరు ఊహించవచ్చు!
మేము కలిసినప్పుడు, నా మత విశ్వాసాన్ని గురించీ నేను ఎంచుకున్న కెరీర్‌ను గురించీ ఆమెకు ముందే ఎందుకు చెప్పలేదో వివరించాను. ఆమె మౌనంగా విని, “నేను సత్యం కోసం ఎప్పుడూ వెదుకుతూనే ఉన్నాను. అది నా జీవితాన్వేషణ!” అంది. ఈఅనుభవం నాకొక గుణపాఠాన్ని నేర్పింది—నేను కలిసిన వారందరికీ సాక్ష్యం ఇవ్వడానికి ఎన్నడూ వెనుకాడవద్దు, సత్యాన్ని స్వీకరించరని ఎవరిని గురించీ ముందుగానే నిర్ధారణకు రాకూడదు.
మరో యుద్ధం—ఆ తర్వాతా
1930లు ముగింపుకు వస్తుండగా యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నాయి. నా తమ్ముడు డెన్నిస్ నాకన్నా పదేళ్ళు చిన్నవాడు, ఆయన లౌకిక ఉద్యోగంలో కొనసాగాలన్న షరతుపైన ఆయనను సైనిక సేవ నుండి మినహాయించారు. ఆయన సత్యంలో ఎప్పుడూ అంత ఆసక్తిని చూపించలేదు, అందుకని ఆయనను కలవమని అక్కడున్న స్థానిక పయినీర్లైన రూపర్ట్ బ్రాడ్‌బరీని ఆయన తమ్ముడైన డేవిడ్‌ను నేనూ నా భర్త కోరాము. వారు కలిసి ఆయనతో బైబిలు అధ్యయనం చేశారు. 1942 లో డెన్నిస్ బాప్తిస్మం తీసుకున్నాడు, తర్వాత పయినీరు సేవలోకి ప్రవేశించాడు, ఆయన 1957 లో ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాడు.
మా కుమార్తె ఎలిజబెత్ 1938 లో పుట్టింది, కుటుంబ అవసరాలకు అనుగుణంగా జనోవా మాబండిని పెద్ద చేశారు. మారెండవ కుమార్తె యూనిస్ 1942 లో పుట్టింది, దాంతో కాస్త దృఢంగా ఉన్న ఇంటి కోసం వెదకడం మంచిదని మాకనిపించింది. ఈకారణంగా జనోవా కొద్ది సంవత్సరాలపాటు పయినీరు సేవను మానేశారు, మేమందరం రెక్సామ్‌లోని నిరాడంబరమైన ఒక ఇంట్లోకి మారాము. అటు తర్వాత కొంతకాలానికి మేము ప్రక్కనున్న మండలమైన ఛెషైర్‌లోని మిడిలిచ్‌లో స్థిరపడ్డాము. అక్కడ నా ప్రియమైన భర్త 1956 లో చనిపోయారు.
మా ఇద్దరు కుమార్తెలు పూర్తికాల సువార్తికులయ్యారు, ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఆనందంగా కాపురాలు చేస్తున్నారు. యూనిస్, క్రైస్తవ పెద్ద అయిన ఆమె భర్త ఇప్పటికీ లండన్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నారు. ఎలిజబెత్ భర్త కూడా సంఘ పెద్దే, లాంకాషైర్‌లోని ప్రెస్టన్‌లో వారూ వారి పిల్లలు, నలుగురు మునిమనవళ్ళు మనవరాళ్ళు నాతోపాటు ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది.
నా అపార్టుమెంటు ముందు తలుపు నుండి రోడ్డుకవతల ఉన్న రాజ్య మందిరానికి నడుచుకుంటూ వెళ్ళగలను, అందుకు నేను కృతజ్ఞురాలిని. ఇటీవలి సంవత్సరాల్లో నేను గుజరాతీ మాట్లాడే గ్రూపుతో సహవసిస్తూ ఉన్నాను, వాళ్ళు కూడా అక్కడే కూటాలు జరుపుకుంటున్నారు. భాష నేర్చుకోవడం అంత సులభమైన విషయం కాదు, ఎందుకంటే నేనిప్పుడు కాస్త వినికిడి శక్తిని కోల్పోయాను. యౌవనస్థులు గ్రహించినట్లుగా నేను స్వరంలోని చిన్న చిన్న భేదాలను గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కానీ అదొక ఆసక్తికరమైన సవాలు.
నేనిప్పటికీ ఇంటింటి ప్రకటనా పనిలో పాల్గొనగలుగుతున్నాను, మాఇంట్లోనే బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాను. స్నేహితులు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నా తొలినాళ్ళ అనుభవాలు కొన్నింటిని జ్ఞాపకం చేసుకోవడం నిరంతరం ఆనందదాయకంగానే ఉంటుంది. నేను యెహోవా ప్రజలతో సహవసించిన దాదాపు 90 సంవత్సరాల్లో నేననుభవించిన ఆశీర్వాదాల మధుర స్మృతుల నిమిత్తం నేను కృతజ్ఞురాలిని.
[అధస్సూచీలు]
a “నమ్మకమైన సంస్థతో సమంగా ముందడుగు” అనే శీర్షికతో ప్రైస్ హ్యూస్ జీవిత కథ కావలికోట, ఏప్రిల్ 1, 1963 సంచికలో వచ్చింది.
b విశ్వాసంగా ఉన్న ఈయెహోవా సేవకుల జీవిత కథలు మునుపటి కావలికోట సంచికల్లో వచ్చాయి.
[25వ పేజీలోని చిత్రం]
“ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు” అనే బైబిలు ప్రసంగాన్ని ప్రకటిస్తున్న హ్యాండ్‌బిల్, ఆప్రసంగాన్ని నేను 1922, మే 14న విన్నాను
[26వ పేజీలోని చిత్రం]
1933 లో మేము పెళ్ళి చేసుకున్న కొద్ది కాలం తర్వాత నా భర్త జనోవాతో
[26వ పేజీలోని చిత్రం]
నా భర్త తయారుచేసిన “ఎలీసబెతు” ప్రక్కన నిలబడి