పరిపాలక సభ ఒక చట్టపరమైన కార్పొరేషన్‌కు ఎలా భిన్నంగా ఉంది?
వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క వార్షిక కూటాలు 1885 జనవరి నుండి జరుగుతూనే ఉన్నాయి. 19వ శతాబ్దం చివర్లో అభిషిక్త క్రైస్తవులను సమకూర్చే పని కొనసాగుతుండగా ఈ కార్పొరేషన్‌లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆఫీసర్లు అందరికీ పరలోక నిరీక్షణే ఉన్నది. నిజానికి దాదాపు ఈ సంవత్సరాలన్నింట్లోను ఇలాగే ఉండేది.
ఒక్క మినహాయింపు మాత్రం ఉంది. 1940 లో, భూనిరీక్షణగల “వేరే గొఱ్ఱెల”లో ఒకరిగా ఉన్న, సొసైటీకి న్యాయ సలహాదారుడిగా ఉన్న హేడిన్ సి. కవింగ్టన్ సొసైటీలో ఒక డైరెక్టర్‌గా ఎన్నిక అయ్యారు. (యోహాను 10:16) ఆయన 1942 నుండి 1945 వరకు సొసైటీ ఉపాధ్యక్షుడిగా సేవచేశారు. పెన్సిల్వేనియా కార్పొరేషన్‌లోని డైరెక్టర్లందరూ ఆఫీసర్లందరూ అభిషిక్త క్రైస్తవులే అయ్యుండాలన్నది యెహోవా చిత్తం అని అప్పట్లో అనుకున్నందున దానికి అనుగుణ్యంగా ఉండేందుకుగాను 1945 లో సహోదరుడు కవింగ్టన్ డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఆయన స్థానంలో లైమన్ ఎ. స్వింగిల్ వచ్చారు, ఫ్రెడ్రిక్ డబ్ల్యు. ఫ్రాంజ్ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క డైరెక్టర్లందరూ ఆఫీసర్లందరూ అభిషిక్త క్రైస్తవులే అయ్యుండాలని యెహోవా సేవకులు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే అప్పట్లో పెన్సిల్వేనియా కార్పొరేషన్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆఫీసర్లు యెహోవాసాక్షుల పరిపాలక సభతో సరిపోలినవారిగా పరిగణించబడేవారు, ఈ పరిపాలక సభ మాత్రం అన్ని కాలాల్లోనూ పూర్తిగా ఆత్మాభిషిక్త పురుషులతో ఏర్పడినదై ఉంది.
ఒక చరిత్రాత్మక వార్షిక కూటమి
1944, అక్టోబరు 2న పిట్స్‌బర్గ్‌లో జరిగిన వార్షిక కూటమిలో పెన్సిల్వేనియా కార్పొరేషన్ సభ్యులు దాని నిబంధనావళిని సవరిస్తూ ఆరు తీర్మానాలను స్వీకరించారు. సొసైటీ పనికి చందాలను ఇచ్చే వారికి ఓటింగ్ షేర్లు ఇవ్వాలని నిబంధనావళి చెబుతుంది, మూడవ సవరణ ప్రకారం ఆ ఏర్పాటు తీసివేయబడింది. ఆ వార్షిక కూటమి గురించిన ఒక నివేదికలో ఇలా ఉంది: “సొసైటీలోని సభ్యత్వం 500ల మందికి పరిమితం చేయబడింది . . . ఎంపిక చేయబడిన ప్రతి సభ్యుడు సొసైటీ యొక్క పూర్తికాల సేవకునిగా లేదా యెహోవాసాక్షుల ఒక కంపెనీలో [సంఘంలో] పార్ట్‌టైమ్ సేవకునిగా ఉండాలి, ప్రభువు ఆత్మ తనపై ఉన్నట్లు ప్రదర్శించాలి.”
ఇక అప్పటినుండి, రాజ్య పనిని పురోభివృద్ధిపర్చడానికి వారెంత డబ్బు చందా వేశారన్నదానితో నిమిత్తం లేకుండా యెహోవాకు పూర్తిగా సమర్పించుకుని ఉన్న వ్యక్తులు మాత్రమే సొసైటీ యొక్క డైరెక్టర్లుగా అధికారంలోకి ఎన్నికచేయబడడం జరిగింది. ఇది యెషయా 60:17 లో ప్రవచించబడిన క్రమానుగత శుద్ధీకరణలకు అనుగుణ్యంగా సంభవించింది, అక్కడ మనమిలా చదువుతాము: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” ‘అధికారులు,’ “విచారణకర్తల” గురించి మాట్లాడుతూ ఈ ప్రవచనం యెహోవా ప్రజల్లో సంస్థాగతమైన పద్ధతుల్లో మెరుగులు దిద్దబడతాయని సూచించింది.
సంస్థను దైవపరిపాలనా ఏర్పాటుకు అనుగుణ్యంగా తీసుకువచ్చిన ప్రాముఖ్యమైన ఈ చర్య, దానియేలు 8:14 [NW]లో పేర్కొనబడిన “రెండువేల మూడువందల దినముల” అంతంలో తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో “పవిత్ర స్థలం” “తిరిగి సరియైన స్థితికి తీసుకురాబడింది.”
అయితే 1944 లోని చరిత్రాత్మక వార్షిక కూటమి తర్వాత ఒక పెద్ద ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పట్లో పరిపాలక సభ పెన్సిల్వేనియా కార్పొరేషన్ యొక్క ఏడుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సరిపోలినదిగా పరిగణించబడుతుండడం మూలంగా, పరిపాలక సభలో ఏడుగురికన్నా ఎక్కువమంది అభిషిక్త క్రైస్తవులు ఉండడం వీలుకాదా? అంతేకాదు, డైరెక్టర్లందరూ కార్పొరేషన్ సభ్యులచే ఎన్నిక చేయబడుతున్నారు గనుక, కార్పొరేషన్ సభ్యులు వార్షిక కూటమిలో ప్రతి సంవత్సరం పరిపాలక సభ సభ్యుల్ని ఎన్నిక చేస్తున్నారా? వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క డైరెక్టర్లూ ఆఫీసర్లూ అలాగే పరిపాలక సభ సభ్యులూ ఒకటేనా, లేక వారు వేర్వేరా?
మరో చిరస్మరణీయమైన వార్షిక కూటమి
ఈ ప్రశ్నలకు 1971, అక్టోబరు 1న జరిగిన వార్షిక కూటమిలో జవాబులివ్వబడ్డాయి. ఆ సందర్భంలో ప్రసంగీకుల్లో ఒకరు ‘నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని’ పరిపాలక సభ, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఉనికిలోకి రాకముందే వందలాది సంవత్సరాల క్రితమే ఉందని చెప్పారు. (మత్తయి 24:45-47) పెన్సిల్వేనియా కార్పొరేషన్ అస్తిత్వంలోనికి రావడానికి 18 శతాబ్దాలకు ముందే సా.శ. 33 పెంతెకొస్తు దినాన పరిపాలక సభ రూపొందించబడింది. మొదట్లో పరిపాలక సభలో 7గురు పురుషులు కాదు 12 మంది అపొస్తలులు ఉన్నారు. ఈ సంఖ్య అటుతర్వాత పెరిగిందని స్పష్టమౌతుంది, ఎందుకంటే కొంతకాలానికి ‘యెరూషలేములో అపొస్తలులు మరియు పెద్దలు’ నాయకత్వం వహిస్తున్నారు. (ఇటాలిక్కులు మావి.)—అపొస్తలుల కార్యములు 15:2.
1971 లో అదే ప్రసంగీకుడు, వాచ్ టవర్ సొసైటీ సభ్యులు అభిషిక్తులైన పరిపాలక సభ సభ్యుల్ని ఓటు ద్వారా ఎన్నిక చేయడం కుదరదని వివరించారు. ఎందుకని? ఆయనిలా అన్నారు: “ఎందుకంటే, ‘దాసుని’ తరగతి యొక్క పరిపాలక సభ ఏ మనుష్యుని ద్వారాను నియమించబడలేదు. అది . . . నిజమైన క్రైస్తవ సంఘానికి శిరస్సు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతి యొక్క ప్రభువూ యజమానీ అయిన యేసుక్రీస్తుచే నియమించబడుతుంది.” అందుకని ఎటువంటి చట్టపరమైన కార్పొరేషన్‌కు చెందిన ఏ సభ్యులూ పరిపాలక సభ సభ్యుల్ని ఓటుద్వారా అధికారంలోనికి తీసుకురాలేరని స్పష్టమౌతుంది.
ప్రసంగీకుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ గమనార్హమైన వ్యాఖ్యానాన్ని చేశారు: “సొసైటీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఉన్నట్లుగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటెరి-ట్రెజరర్, అసిస్టెంట్ సెక్రటెరి-ట్రెజరర్ వంటి ఆఫీసర్లు పరిపాలక సభలో ఉండరు. అందులో కేవలం ఛైర్మన్ మాత్రమే ఉంటారు.” చాలా సంవత్సరాలుగా పెన్సిల్వేనియా కార్పొరేషన్ యొక్క అధ్యక్షుడే పరిపాలక సభలో అగ్రస్థానంలో ఉండడం జరిగింది. ఇక అలా ఉండబోదు. అనుభవంలోను లేదా సామర్థ్యంలోను సమానం కాకపోయినా పరిపాలక సభ సభ్యులందరూ బాధ్యతల విషయంలో సమానంగా ఉంటారు. ప్రసంగం ఇంకా ఇలా కొనసాగింది: “పరిపాలక సభలోని ఏ సభ్యుడైనా . . . సొసైటీ . . . యొక్క అధ్యక్షుడిగా ఉండనవసరం లేకుండానే ఛైర్మన్‌గా ఉండడం సంభవిస్తుంది. అదంతా పరిపాలక సభ యొక్క ఛైర్మన్‌షిప్ కొరకైన రొటేషన్ పద్ధతిపై ఆధారపడివుంటుంది.”
చిరస్మరణీయమైన ఆ 1971 లోని వార్షిక కూటమిలో, ఆత్మాభిషిక్తులైన పరిపాలక సభ సభ్యులకూ పెన్సిల్వేనియా కార్పొరేషన్‌లోని డైరెక్టర్లకూ స్పష్టమైన తేడా చూపించబడింది. అయినప్పటికీ పరిపాలక సభ సభ్యులు సొసైటీ యొక్క డైరెక్టర్లుగా ఆఫీసర్లుగా సేవచేస్తూ కొనసాగుతూనే ఉన్నారు. అయితే, నేడు ఈ ప్రశ్న తలెత్తుతుంది: వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క డైరెక్టర్లు పరిపాలక సభ సభ్యులై ఉండాలనడానికి లేఖనాధార కారణమేమైనా ఉందా?
దానికి జవాబు—లేదు. యెహోవాసాక్షులచే ఉపయోగించబడేది పెన్సిల్వేనియా కార్పొరేషన్ ఒక్కటే కాదు. ఇంకా ఇతర సొసైటీలు కూడా ఉన్నాయి. ఒకటి వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇన్కార్పొరేటెడ్. ఇది అమెరికాలోని మన కార్యకలాపాల్ని కొనసాగించేందుకు సహాయం చేస్తుంది. ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆఫీసర్లు ప్రధానంగా “వేరే గొఱ్ఱెల” వారైనప్పటికీ దానిపై యెహోవా ఆశీర్వాదాలున్నాయని స్పష్టంగా ఉంది. బ్రిటన్‌లో ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉపయోగించబడుతోంది. మరితర దేశాల్లో రాజ్యాసక్తులను పెంపొందింపజేయడానికిగాను ఇతర చట్టపరమైన సొసైటీలను ఉపయోగించడం జరుగుతోంది. అవన్నీ భూవ్యాప్తంగా సువార్తను ప్రకటింపజేయడంలో ఒకదానితో మరొకటి పొందికగా పనిచేస్తూ, చక్కని పాత్రను పోషిస్తున్నాయి. అవెక్కడున్నా, వాటి డైరెక్టర్లు లేదా ఆఫీసర్లు ఎవరైనా ఈ సొసైటీలు దైవపరిపాలనా విధానంలో నిర్దేశించబడుతున్నాయి, పరిపాలక సభచే ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి, అలాంటి సొసైటీలన్నింటికి రాజ్యాసక్తుల్ని పెంపొందింపజేసేందుకుగాను వాటి నియామకాలు వాటికున్నాయి.
చట్టపరమైన సొసైటీలను కల్గివుండడం మనకు ప్రయోజనకరం. వాటి ద్వారా మనం స్థానిక చట్టాలకు దేశ చట్టాలకు అనుగుణ్యంగా ఉంటాము, దేవుని వాక్యం అలా ఉండాలని కోరుతుంది. (యిర్మీయా 32:11; రోమీయులు 13:1) బైబిళ్ళు, పుస్తకాలు, పత్రికలు, బ్రోషూర్ల ద్వారా, మరితర ముద్రిత సమాచారం ద్వారా రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేసే మన పనిని చట్టపరమైన సొసైటీలు సులభతరం చేస్తాయి. స్థిర చరాస్తుల యాజమాన్యం, పునరావాస కార్యకలాపాలు, సమావేశ స్థలాల ఉపయోగం కోసం కాంట్రాక్టులు, ఇంకా ఇతరత్రా విషయాల సంబంధంగా అలాంటి సొసైటీలు చట్టపరమైన ఉపకరణాలుగా కూడా ఉపయోగపడతాయి. ఆ చట్టపరమైన సొసైటీలు అందించే సేవల నిమిత్తం మనం కృతజ్ఞతా భావాన్ని కలిగివున్నాము.
యెహోవా నామాన్ని అన్నింటికన్నా ముందుంచడం
1944 లో వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క నిబంధనావళిలోని రెండవ ఆర్టికల్‌ను ఈ కార్పొరేషన్ లక్ష్యాలను మరింత దృఢతరం చేయడానికి మార్చడం జరిగింది. ఆ నిబంధనావళి ప్రకారం సొసైటీ సంకల్పాల్లో ఈ ప్రధాన సంకల్పం ఉంది: “సర్వశక్తిగల దేవుడైన యెహోవా యొక్క నామము, ఆయన వాక్యము, ఆయన సర్వాధిపత్యమును గురించి సకల జనములకు సాక్ష్యార్థమై క్రీస్తు యేసు ఆధీనంలో దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించడమే.”
1926 నుంచి ‘నమ్మకమైన దాసుడు’ యెహోవా నామాన్ని అన్నింటికన్నా ముందుంచాడు. 1931 ఎంతో ప్రాముఖ్యమైనది, ఆ సంవత్సరంలో బైబిలు విద్యార్థులు యెహోవాసాక్షులనే పేరును స్వీకరించారు. (యెషయా 43:10-12) దేవుని నామంపై ఎంతో ప్రాముఖ్యాన్ని ఉంచిన సొసైటీ ప్రచురణల్లో యెహోవా (1934, ఆంగ్లం), నీ నామము పరిశుద్ధ పరచబడుగాక” (1961, ఆంగ్లం), “నేను యెహోవానైయున్నానని జనములు తెలుసుకొంటాయి”—ఎలా? (1971, ఆంగ్లం) అనే పుస్తకాలున్నాయి.
1960 లో ఆంగ్లంలో పూర్తిగా ప్రచురించబడిన న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్‌ను గురించి ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాలి. హెబ్రీ లేఖనాల్లో ఎక్కడెక్కడైతే టెట్రాగ్రమాటన్ కనిపిస్తుందో అక్కడల్లా యెహోవా నామం అందులో ఉంది. ఈ అనువాదంలో క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో 237 చోట్ల దైవిక నామం ఉంది, ఆయా స్థలాల్లో జాగ్రత్తగా చేసిన విశ్లేషణ ద్వారా దైవిక నామాన్ని ఉంచడం అవసరం అని తెలిసిన తర్వాత అలా చేయడం జరిగింది. యెహోవా నామాన్ని భూవ్యాప్తంగా తెలియజేసేందుకు అనేక విధాలుగా ప్రచురణా వనరుల్నీ చట్టపరమైన సొసైటీల్నీ ఉపయోగించుకునేందుకు యెహోవా తన ‘దాసుడిని’ దాని పరిపాలక సభను అనుమతించినందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలో కదా!
దేవుని వాక్య పంపిణీ ప్రోద్బలపర్చబడింది
యెహోవా ప్రజలు కోట్లాది సంఖ్యలో బైబిలు ఆధారిత ప్రచురణల్నీ బైబిళ్ళనూ ప్రచురించి పంపిణీ చేయడం ద్వారా ఆయన నామానికి నిరంతరాయంగా సాక్ష్యం ఇచ్చి, ఆయన వాక్యాన్ని సమర్థించారు. బెంజమిన్ విల్సన్ ప్రచురించిన క్రైస్తవ గ్రీకు లేఖనాల గ్రీక్-ఇంగ్లీష్ ఇంటర్లీనియర్ ఎడిషన్ అయిన ది ఎంఫాటిక్ డయాగ్లట్ యొక్క కాపీరైట్ యాజమాన్యం 1900లలో వాచ్ టవర్ సొసైటీకి లభించింది. బైబిలు విద్యార్థుల ఎడిషన్ రూపంలో సొసైటీ కింగ్ జేమ్స్ వెర్షన్‌ను ప్రచురించింది, ఇందులో 500 పేజీల అనుబంధం కూడా చేరివుంది. 1942 లో సొసైటీ కింగ్ జేమ్స్ వెర్షన్‌ను మార్జినల్ రెఫరెన్సులతో ప్రచురించింది. తరువాత 1944 లో సొసైటీ 1901వ సంవత్సరపు ఎడిషన్ అయిన అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్‌ను ప్రచురించడం ప్రారంభించింది, ఇందులో దైవిక నామం కూడా ఉంది. స్టీవెన్ టి. బయింగ్టన్ యొక్క ద బైబిల్ ఇన్ లివింగ్ ఇంగ్లీష్‌లో యెహోవా నామం ఉండడం ఒక ప్రత్యేకత, దీన్ని సొసైటీ 1972 లో ప్రచురించింది.
యెహోవాసాక్షులు ఉపయోగించిన చట్టపరమైన సొసైటీలు ఈ బైబిలు అనువాదాలన్నింటినీ ముద్రించి పంపిణీచేసే పనుల్లో సహాయపడ్డాయి. అయితే, వాచ్ టవర్ సొసైటీకీ యెహోవా యొక్క అభిషిక్త సాక్షుల సమూహం చేరివున్న న్యూ వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్ కమిటీకీ మధ్య ఉన్న సన్నిహితమైన సహకారం అత్యంత గమనార్హమైనది. నేటికి పూర్తిగానైనా లేక కొన్ని భాగాలుగానైనా ఈ అనువాదం యొక్క 10,64,00,000 కాపీలు 38 భాషల్లో ముద్రించబడినందుకు మనమెంతో ఆనందిస్తున్నాము. వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా నిజంగానే ఒక బైబిలు సొసైటీ!
‘నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు తన యజమాని యొక్క యావదాస్తిమీద ఉంచబడ్డాడు.’ ఈ ఆస్తిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రపంచ ముఖ్యకార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 110 బ్రాంచిలు ఉన్నాయి. దాసుని తరగతి సభ్యులకు, తమకు అప్పగించబడిన వాటిని తామెలా ఉపయోగించామో లెక్క ఒప్పజెప్పాల్సివస్తుందని తెలుసు. (మత్తయి 25:14-30) అయినా, “వేరే గొఱ్ఱెల”కు చెందిన అర్హులైన పైవిచారణకర్తలకు చట్టపరమైన కార్యనిర్వహణపరమైన పనుల్ని అప్పగించకుండా ఇది ‘దాసుడిని’ నివారించదు. నిజానికి, ఇలా అప్పగించడం ద్వారా పరిపాలక సభ సభ్యులు “ప్రార్థనయందును వాక్యపరిచర్య యందును” మరింత సమయాన్ని వెచ్చించేందుకు వారిని అనుమతిస్తుంది.—అపొస్తలుల కార్యములు 6:4.
ఈ లోక పరిస్థితులు అనుమతించినంత వరకు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిపాలక సభ చట్టపరమైన సొసైటీల్ని ఉపయోగించుకుంటూనే ఉంటుంది. ఇవి అనువైనవేగానీ ఆవశ్యకమైనవి కావు. ఏదైనా చట్టపరమైన సొసైటీ ప్రభుత్వ ఆజ్ఞతో రద్దు చేయబడినట్లైతే ప్రకటనా పని మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నిర్బంధాలు అమల్లో ఉన్న, ఎటువంటి చట్టపరమైన సొసైటీల్నీ ఉపయోగించని కొన్ని దేశాల్లో రాజ్య సందేశం ప్రకటించబడుతుంది, శిష్యులు తయారుచేయబడుతున్నారు, దైవపరిపాలనా అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. ఇదెందుకు జరుగుతుందంటే యెహోవాసాక్షులు నాటి నీరు పోస్తుంటారు, ‘దేవుడు వృద్ధి కలుగజేస్తాడు.’—1 కొరింథీయులు 3:6, 7.
యెహోవా తన ప్రజల ఆధ్యాత్మిక భౌతిక అవసరాల్ని తీరుస్తూనే ఉంటాడని మనం నమ్మకంతో భవిష్యత్తులోనికి చూస్తాము. ఆయనా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య ప్రకటనా పనిని పూర్తిచేయడానికి కావాల్సిన పరలోక నడిపింపునూ మద్దతునూ అందజేస్తూనే ఉంటారు. నిజమే, మనం దేవుని సేవకులముగా ఎంత చేసినా ‘శక్తిచేతనైనను బలముచేతనైననుకాక యెహోవా ఆత్మచేతనే’ మనం చేస్తాము. (జెకర్యా 4:6) అందుకని మనం యెహోవా అందజేసే బలంతో ఆయన ఈ అంత్యకాలంలో మనకిచ్చిన పనిని నెరవేర్చగలమని తెలుసుకొని దైవిక సహాయం కోసం ప్రార్థిద్దాము!