కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 12/15 పేజీలు 14-19
  • నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకుందాము!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకుందాము!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నశించిపోయేలా వెనుక తీయడమంటే ఏమిటి?
  • క్రైస్తవులు వెనుకతీసేలా ఎలా ఒత్తిడి చేయబడ్డారు
  • వాళ్లు నశించిపోయేలా ఎన్నడూ ఎందుకు వెనుకతీయకూడదు?
  • నశించిపోయేలా మనమెన్నడూ ఎందుకు వెనుకతీయకూడదు?
  • విశ్వాసము గలవారమై ఉందాము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • జీవం కొరకైన పరుగు పందేన్ని విడిచిపెట్టకండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • విశ్వాసలేమి విషయమై జాగ్రత్త
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 12/15 పేజీలు 14-19

నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకుందాము!

“మనము నశించుటకు వెనుకతీయువారము కాము.”—హెబ్రీయులు 10:39.

1. అపొస్తలుడైన పేతురు భయపడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి?

వారందరూ తనను విడిచిపెట్టి చెదరిపోతారని తమ ప్రియమైన ప్రభువైన యేసు చెప్పినప్పుడు అపొస్తలులు విభ్రాంతి చెంది ఉంటారు. ఆయనకు ఎంతో అవసరమున్న, ఈ గడియలో అదెలా జరుగగలదు? పేతురు ఇలా నొక్కిచెప్పాడు: “అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడ[ను].” నిజానికి, పేతురు ధైర్య సాహసాలు కలవాడే. కానీ యేసు అప్పగించబడి బంధించబడినప్పుడు పేతురుతో సహా, అపొస్తలులు చెదరిపోయారు. తర్వాత, ప్రధాన యాజకుడైన కయప ఇంట్లో యేసును ప్రశ్నిస్తున్నప్పుడు పేతురు వ్యాకులతతో అక్కడి ఆవరణలో తచ్చాడుతూ ఉన్నాడు. చల్లని రాత్రి గడిచిపోతుండగా, యేసుగానీ ఆయనతో సహవసించే ఎవరైనాగానీ చంపబడతారని బహుశా పేతురు భయపడి ఉండవచ్చు. యేసు సన్నిహిత సహచరుల్లో ఈయన ఒకడని, అక్కడ నిలబడివున్న కొందరు పేతురును గుర్తించినప్పుడు, ఆయన భయవిహ్వలుడయ్యాడు. మూడుసార్లు ఆయన యేసుతో తనకున్న సంబంధాన్ని కాదన్నాడు. ఆయన తనకు తెలుసన్న విషయాన్ని కూడా పేతురు ఒప్పుకోవడానికి అంగీకరించలేదు.—మార్కు 14:27-31, 66-72.

2. (ఎ) యేసు నిర్బంధించబడిన నాటి రాత్రి పేతురు భయంతో చేసిన చర్య ఆయనను ‘వెనుక తీసినవానిగా’ ఎందుకు చేయదు? (బి) మన నిశ్చయత ఏమై ఉండాలి?

2 అది పేతురు జీవితంలో చాలా దుర్భరమైన సమయం, ఆ క్షణాలను తలచుకుని ఆయన తన మిగతా జీవితమంతా అనుతాపం చెందాడు అన్నదానిలో సందేహం లేదు. కానీ ఆ రాత్రి పేతురు చేసిన పని ఆయనను పిరికివాడిని చేస్తుందా? “మనము నశించుటకు వెనుకతీయువారము కాము” అని వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత వివరించినటువంటి ‘వారిలో’ ఆయనను ఒకడిని చేస్తుందా? (హెబ్రీయులు 10:39) పౌలు వ్రాసిన మాటలు పేతురుకు వర్తించవని మనలో చాలామందిమి అంగీకరిస్తుండవచ్చు. ఎందుకు? ఎందుకంటే పేతురు భయం తాత్కాలికమైనది మాత్రమే, అసాధారణమైన ధైర్యానికీ, విశ్వాసానికీ పేరుపొందిన జీవితంలో అది కేవలం క్షణికమైన తడబాటు మాత్రమే. అలాగే, మనం ఒక మోస్తరు సిగ్గుతో జ్ఞాపకం చేసుకునే క్షణాలు, అంటే మనల్ని భయం ఆవహించేసి, మనమనుకున్నంత ధైర్యంగా సత్యం కోసం నిలబడలేకపోయిన క్షణాలు మనలో చాలామంది గత జీవితాల్లోనూ ఉన్నాయి. (పోల్చండి రోమీయులు 7:21-23.) అలా తాత్కాలికంగా క్షణకాలంపాటు భయానికి లోనవ్వడం, మనల్ని నశించిపోయేలా వెనుక తీసేవారిగా చేయదని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. అయినప్పటికీ, మనం ఎన్నడూ అలాంటి వారం కాకుండా ఉండటానికి నిశ్చయత చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకు? అలాంటి వ్యక్తులం కాకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

నశించిపోయేలా వెనుక తీయడమంటే ఏమిటి?

3. ప్రవక్తలైన ఏలీయా, యోనాలు ఎలా భయానికి లొంగిపోయారు?

3 ‘వెనుకతీయువారి’ గురించి వ్రాసినప్పుడు పౌలు ఉద్దేశించినది తాత్కాలికంగా క్షణకాలంపాటు ధైర్యాన్ని కోల్పోయేవారి గురించి కాదు. పేతురు అనుభవం గురించి, అలాంటి ఇతర విషయాల గురించి పౌలుకు కచ్చితంగా తెలుసు. దుష్టురాలైన యెజెబెలు రాణి చంపేస్తానని బెదిరించినప్పుడు, ఎంతో ధైర్యవంతుడూ, నిర్మొహమాటంగా మాట్లాడే ప్రవక్తా అయిన ఏలీయా భయపడిపోయి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడు. (1 రాజులు 19:1-4) ప్రవక్తయైన యోనా ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. దౌర్జన్యానికీ, దుష్టత్వానికీ పేరుపొందిన నగరమైన నీనెవెకు వెళ్లే పనిని యెహోవా ఆయనకు అప్పగించాడు. యోనా వెంటనే, దానికి వ్యతిరేక దిశలో 3,500 కిలోమీటర్ల దూరంలోవున్న తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. (యోనా 1:1-3) అయినప్పటికీ, ఈ నమ్మకమైన ప్రవక్తలుగానీ, అపొస్తలుడైన పేతురుగానీ వెనుక తీసేవారని చెప్పడం సబబుకాదు. ఎందుకని?

4, 5. (ఎ) హెబ్రీయులు 10:39 నందు పౌలు ‘నశించటం’ అన్నప్పుడు ఆయన ఉద్దేశమేమిటో నిశ్చయించుకునేందుకు సందర్భం మనకెలా సహాయం చేస్తుంది? (బి) ‘నశించిపోయేలా వెనుక తీయువారము కాము’ అని చెప్పినప్పుడు పౌలు ఉద్దేశమేమిటి?

4 పౌలు ఉపయోగించిన మొత్తం వాక్యాన్ని గమనించండి: “మనము నశించుటకు వెనుకతీయువారము కాము.” (ఇటాలిక్కులు మావి.) ‘నశించటం’ అన్నప్పుడు ఆయన ఉద్దేశించినదేమిటి? ఆయన ఉపయోగించిన గ్రీకు పదం కొన్నిసార్లు, నిత్య నాశనాన్ని సూచిస్తుంది. ఈ నిర్వచనం సందర్భంతో పొందిక కల్గివుంది. పౌలు అంతక్రితమే ఇలా హెచ్చరించాడు: “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.”—హెబ్రీయులు 10:26, 27.

5 కాబట్టి పౌలు తన తోటి విశ్వాసులకు, “మనము నశించుటకు వెనుకతీయువారము కాము” అని చెప్పినప్పుడు, తానూ తన నమ్మకమైన క్రైస్తవ పాఠకులూ యెహోవా నుండి ఎన్నడూ మరలిపోకుండా, ఆయన సేవచేయడాన్ని ఎన్నడూ మానుకోకుండా ఉండేందుకు దృఢనిశ్చయం చేసుకున్నామని ఆయన ఉద్దేశించాడు. అలా మరలిపోవడం లేదా మానుకోవడం కేవలం నిత్య నాశనానికే నడిపిస్తుంది. అలా నశించిపోయేలా వెనుక తీసినవారిలో యూదా ఇస్కరియోతు ఒకరు, ఉద్దేశపూర్వకంగానే యెహోవా ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర సత్యశత్రువులు కూడా అలాంటివారే. (యోహాను 17:12; 2 థెస్సలొనీకయులు 2:3) అలాంటి వ్యక్తులు సూచనార్థకమైన అగ్నిగుండంలో నిత్యనాశనాన్ని అనుభవించే ‘పిరికివారిలో’ ఒకరైవుంటారు. (ప్రకటన 21:8) అలాంటి వారమై ఉండాలని మనమెన్నడూ కోరుకోము!

6. మనం ఏమి చేయాలని అపవాదియైన సాతాను ఇచ్ఛయిస్తాడు?

6 మనం నశించిపోయేలా వెనుక తీయాలని అపవాది అయిన సాతాను ఇచ్ఛయిస్తాడు. అలాంటి నాశనకరమైన విధానం తరచూ చిన్న చిన్న విషయాలతో ప్రారంభమౌతుందని, ‘తంత్రములలో’ నిపుణుడైన అతడికి తెలుసు. (ఎఫెసీయులు 6:11) సూటిగా హింసించడం ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చుకోలేకపోతే, మోసకరమైన మార్గాల ద్వారా నిజ క్రైస్తవుల విశ్వాసాన్ని హరింపజేయడానికి అతడు ప్రయత్నిస్తాడు. ధైర్యవంతులైన, ఆసక్తిపరులైన యెహోవాసాక్షుల నోళ్లుమూయించాలని అతడు చూస్తాడు. పౌలు ఎవరికైతే వ్రాశాడో ఆ హెబ్రీ క్రైస్తవులకు వ్యతిరేకంగా అతడు ఏ తంత్రములను ఉపయోగించాడో మనం చూద్దాం.

క్రైస్తవులు వెనుకతీసేలా ఎలా ఒత్తిడి చేయబడ్డారు

7. (ఎ) యెరూషలేములోని సంఘ చరిత్ర ఏమైవుంది? (బి) పౌలు పాఠకులు కొందరి విషయంలో ఏ ఆధ్యాత్మిక పరిస్థితులు ఉండేవి?

7 పౌలు సా.శ. 61లో హెబ్రీయులకు తన లేఖను వ్రాశాడని నిదర్శనాలు సూచిస్తున్నాయి. యెరూషలేములోని సంఘానికి సంక్షోభపూరితమైన చరిత్ర ఉంది. యేసు మరణం తర్వాత, హానికరమైన హింసా ఉప్పెన చెలరేగింది, దానితో నగరంలోని చాలామంది క్రైస్తవులు చెల్లాచెదురైపోయారు. అయితే కొంతకాలంపాటు సమాధానం నెలకొనడంతో క్రైస్తవుల సంఖ్య వృద్ధి అయ్యింది. (అపొస్తలుల కార్యములు 8:4; 9:31) సంవత్సరాలు గడుస్తుండగా, ఇతర హింసలూ, కష్టాలూ వచ్చాయి, పోయాయి. పౌలు హెబ్రీయులకు ఈ లేఖ వ్రాసే సమయానికి సంఘం మరోసారి కాస్తంత శాంతిని అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, ఒత్తిళ్లు ఉన్నాయి. యెరూషలేము నాశనమౌతుందని యేసు చెప్పి అప్పటికి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. అంతం మరీ ఆలస్యమైపోయిందనీ, ఇక తమ జీవితకాలంలో రాకపోవచ్చుననీ భావించిన వారు కొందరు ఉండే ఉంటారు. ఇతరులు, ప్రాముఖ్యంగా విశ్వాసంలోకి క్రొత్తగా వచ్చినవారు, ఇంకా తీవ్రమైన హింసతో పరీక్షించబడలేదు, శ్రమలు వచ్చినప్పుడు సహనం కల్గివుండవలసిన అవసరం గురించి వారికి ఎక్కువగా తెలియదు. (హెబ్రీయులు 12:4) అలాంటి పరిస్థితుల నుండి ప్రయోజనం పొందాలని సాతాను తప్పకుండా ప్రయత్నించాడు. అతడు ఏ ‘తంత్రములను’ ఉపయోగించాడు?

8. వృద్ధి చెందుతున్న క్రైస్తవ సంఘం పట్ల చాలామంది యూదులకు ఏ దృక్పథం ఉండేది?

8 యూదా యెరూషలేములలో నివసిస్తున్న యూదా జనాంగాలు అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రైస్తవ సంఘాన్ని తృణీకారభావంతో చూశారు. పౌలు లేఖలోని అంశాలను బట్టి చూస్తే, అహంకారులైన యూదా మత నాయకులూ, వారి అనుచరులూ క్రైస్తవులను ఎలా ఎత్తిపొడిచేవారో కొంత అవగాహన ఏర్పడుతుంది. వాళ్లు బహుశా ఇలా అనేవారేమో: ‘మాకు యెరూషలేములో, శతాబ్దాల నుంచీవున్న గొప్ప ఆలయం ఉంది! అక్కడ సేవ చేసే ఉన్నతమైన ప్రధాన యాజకుడు, ఆయనతో కలిసి పని చేసే సహ యాజకులు ఉన్నారు. ప్రతి రోజు బలులు అర్పించబడతాయి. సీనాయి పర్వతం మీద గొప్ప సూచనలతో స్థాపించబడిన, దూతల ద్వారా మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం మాకుంది. మతభ్రష్టులై యూదామతం నుండి విడిపోయిన ఈ నడమంత్రపు మతతెగకు, ఈ క్రైస్తవులకు అవేవీ లేవు!’ అలాంటి తృణీకారం దాని ప్రభావాన్ని చూపిందా? కొందరు హెబ్రీ క్రైస్తవులు ఆ దాడికి కలవరపడ్డారని స్పష్టమౌతుంది. పౌలు వ్రాసిన లేఖ సరిగ్గా సరైన సమయంలో వారికి సహాయపడింది.

వాళ్లు నశించిపోయేలా ఎన్నడూ ఎందుకు వెనుకతీయకూడదు?

9. (ఎ) హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ అంతటా ఏ ఇతివృత్తం వ్యాపించి ఉంది? (బి) క్రైస్తవులు ఏ భావంలో, యెరూషలేములోని ఆలయం కంటే శ్రేష్ఠమైన ఆలయంలో సేవ చేస్తున్నారు?

9 నశించిపోయేలా ఎన్నడూ వెనుకతీయకుండా ఉండేందుకు పౌలు యూదయలోవున్న తన సహోదర సహోదరీలకు ఇచ్చిన రెండు కారణాలను మనం పరిశీలిద్దాము. మొదటిది—క్రైస్తవ ఆరాధనా విధానానికున్న ఔన్నత్యం—హెబ్రీయులకు వ్రాసిన లేఖ అంతటా వ్యాపించి ఉంది. తన లేఖ అంతటిలోనూ పౌలు ఇదే ఇతివృత్తాన్ని వృద్ధి చేశాడు. యెరూషలేములోవున్న ఆలయం, మరెంతో గొప్పదైన ఒక వాస్తవానికి అంటే “హస్తకృతము కాని” కట్టడమైన యెహోవా ఆధ్యాత్మిక ఆలయానికి కేవలం ఒక ప్రతిరూపం మాత్రమే. (హెబ్రీయులు 9:11) స్వచ్ఛారాధన కొరకైన ఆ ఆధ్యాత్మిక ఏర్పాటులో సేవచేసే ఆధిక్యత ఆ క్రైస్తవులకు ఉంది. మరింత శ్రేష్ఠమైన నిబంధన క్రింద, ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన నిబంధన క్రింద, మోషేకంటే ఉన్నతుడైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా గల ఆ నిబంధన క్రింద వాళ్లు సేవ చేశారు.—యిర్మీయా 31:31-34.

10, 11. (ఎ) యేసు వంశావళి ఆయన ఆధ్యాత్మిక ఆలయంలో ప్రధాన యాజకునిగా సేవ చేయడం నుండి ఆయనను ఎందుకు అనర్హుడిని చేయదు? (బి) యెరూషలేములోని ఆలయంలో సేవచేస్తున్న ప్రధాన యాజకుని కంటే యేసు ఏ యే విధాలుగా ఉన్నతమైనవాడు?

10 ఆ క్రైస్తవులకు అంతకన్నా ఇంకా శ్రేష్ఠమైన ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ఉన్నాడు. నిజమే, ఆయన అహరోను సంతానం వాడు కాదు. కానీ ఆయన “మెల్కీసెదెకు క్రమము చొప్పున” ప్రధాన యాజకుడు. (కీర్తన 110:4) వంశావళిలేని మెల్కీసెదెకు ప్రాచీన షాలేము రాజు మరియు ప్రధాన యాజకుడు. కాబట్టి, ఆయన యేసుకు తగిన ప్రవచనార్థక సారూప్యంగా ఉన్నాడు, ఆయన యాజకత్వం అపరిపూర్ణ మానవ వంశావళిపై కాదుగానీ అంతకంటే గొప్పదైన యెహోవా దేవుని వాగ్దానంపై ఆధారపడినది. మెల్కీసెదెకులా యేసు ప్రధాన యాజకునిగానే కాదు ఎన్నడూ మరణించని రాజుగా కూడా సేవచేస్తాడు.—హెబ్రీయులు 7:11-21.

11 అంతేగాక, యెరూషలేము ఆలయములోని ప్రధాన యాజకునిలా కాకుండా, యేసు సంవత్సరం తర్వాత సంవత్సరం బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఆయన అర్పించిన బలి ఆయన పరిపూర్ణ జీవమే, ఆయన దాన్ని ఒక్కసారే అర్పించాడు. (హెబ్రీయులు 7:27) ఆలయంలో అర్పించబడే బలులన్నీ కేవలం ఛాయలు మాత్రమే, అంటే యేసు అర్పించేదాన్ని సూచించేవి మాత్రమే. ఆయన అర్పించిన పరిపూర్ణ బలి, విశ్వసించిన వారందరి పాపాలకూ నిజమైన క్షమాపణను అందజేసింది. ఈ ప్రధాన యాజకుడు, యెరూషలేములోని క్రైస్తవులకు తెలిసిన, ఎన్నడూ మారని యేసే అని చూపించే పౌలు వ్యాఖ్యానాలు కూడా హృదయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఆయన దీనుడు, దయగలవాడు, “మన బలహీనతలయందు మనతో సహానుభవము” గలవాడు. (హెబ్రీయులు 4:15; 13:8) ఆ అభిషిక్త క్రైస్తవులకు క్రీస్తు ఉపయాజకులుగా సేవచేసే ఉత్తరాపేక్ష ఉంది! భ్రష్ట యూదామతానికి చెందిన “బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన” వాటి కోసం వెనుక తీయడం గురించి వారు కనీసం ఆలోచించడమైనా ఎలా ఆలోచించగలరు?—గలతీయులు 4:9.

12, 13. (ఎ) వెనుక తీయక ఉండటానికి ఏ రెండవ కారణాన్ని పౌలు అందజేశాడు? (బి) హెబ్రీ క్రైస్తవుల సహనాన్ని గురించిన గత చరిత్ర, తాము నశించిపోయేలా ఎన్నడూ వెనుక తీయక ఉండటానికి వారిని ఎందుకు ప్రోత్సహిస్తుంది?

12 అది చాలదన్నట్లు, వారు నశించిపోయేలా ఎన్నడూ వెనక తీయకుండా ఉండేందుకు పౌలు హెబ్రీయులకు రెండవ కారణాన్ని కూడా ఇచ్చాడు—సహనాన్ని గూర్చిన వారి స్వంత చరిత్రయే. ఆయనిలా వ్రాశాడు: “మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.” వారు “పదిమందిలో ఆరడిపడి” నిందలకు, శ్రమలకు గురయ్యారని పౌలు వారికి జ్ఞాపకం చేశాడు. కొందరు చెరసాలలో వేయబడ్డారు; ఇతరులు చెరసాలలో ఉన్నవారిపట్ల సానుభూతి చూపించి, వారికి మద్దతునిచ్చారు. అవును, వాళ్లు విశేషమైన విశ్వాసాన్ని, పట్టుదలను చూపించారు. (హెబ్రీయులు 10:32-34) అయినప్పటికీ, అలాంటి వేదనకరమైన అనుభవాలను “జ్ఞాపకము తెచ్చుకొనుడి” అని పౌలు వారికెందుకు చెప్పాడు? అది వారిని నిరుత్సాహపర్చదా?

13 దానికి భిన్నంగా, ‘పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకోవడం,’ శ్రమల సమయంలో యెహోవా తమను ఎలా బలపర్చాడనే విషయాన్ని హెబ్రీయులకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన సహాయంతో, వాళ్లు అప్పటికే సాతాను దాడులనెన్నింటినో ఎదిరించారు. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:10) అవును, వాళ్లు చేసిన నమ్మకమైన పనులన్నిటినీ యెహోవా తన అపారమైన స్మృతిలో భద్రపర్చుకుని జ్ఞాపకముంచుకున్నాడు. పరలోకంలో ధనము సమకూర్చుకొమ్మని యేసు చేసిన ఉద్బోధ మనకు గుర్తుచేయబడుతుంది. ఈ ధనాన్ని ఏ దొంగా దోచుకోలేడు; ఏ చిమ్మెట లేక తుప్పు తినివేయలేదు. (మత్తయి 6:19-21) వాస్తవానికి, ఒక క్రైస్తవుడు నశించిపోయేలా వెనుక తీసినప్పుడే ఈ ధనము నాశనం చేయబడగలదు. అలా చేయటం, ఆయన పరలోకంలో సమకూర్చుకున్న ఏ ధనాన్నైనా కొల్లగొట్టగలదు. అలాంటి మార్గాన్ని ఎన్నడూ చేపట్టకుండా ఉండేందుకు పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎంత శక్తివంతమైన కారణాన్ని ఇస్తున్నాడో కదా! అన్ని సంవత్సరాలపాటు నమ్మకంగా చేసిన సేవను ఎందుకు వ్యర్థం చేసుకోవడం? సహనంతో కొనసాగడం సరైనది, ఎంతో శ్రేష్ఠమైనది.

నశించిపోయేలా మనమెన్నడూ ఎందుకు వెనుకతీయకూడదు?

14. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎదుర్కున్నలాంటి ఏ సవాళ్లనే మనం కూడా ఎదుర్కుంటున్నాము?

14 వెనుక తీయకుండా ఉండేందుకు నిజ క్రైస్తవులకు నేడు అంతే శక్తివంతమైన కారణాలున్నాయి. మొదటిగా, యెహోవా మనకిచ్చిన స్వచ్ఛమైన ఆరాధన అనే ఎంతటి ఆశీర్వాదం మనకుందో గుర్తుంచుకుందాము. మొదటి శతాబ్దపు క్రైస్తవులలా, మరింత జనాదరణ పొందిన మతాల సభ్యులు ప్రభావవంతమైన తమ మతభవనాలను, తమ ఆచారాల ప్రాచీనత్వాన్నీ గర్వంగా ఎత్తి చూపిస్తూ మనల్ని అవహేళన చేసే, అవమానపర్చే కాలంలో మనం జీవిస్తున్నాము. అయితే, మన ఆరాధనా విధానాన్ని తాను ఆమోదిస్తున్నానని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. వాస్తవానికి, మొదటి శతాబ్దపు క్రైస్తవులకు లేని ఆశీర్వాదాలను నేడు మనం అనుభవిస్తున్నాము. ‘అదెలా?’ అని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఎంతైనా, వాళ్లు ఆధ్యాత్మిక ఆలయం పనిని కొనసాగిస్తున్న సమయంలో జీవించారు కదా? యేసు సా.శ. 29లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత దాని ప్రధాన యాజకుడు అయ్యాడు కదా? కొంతమంది అద్భుతాలు చేసే దేవుని కుమారుడ్ని చూశారు కూడానే? ఆయన మరణం తర్వాత కూడా, అనేక అద్భుతాలు జరుగలేదూ? అయితే ప్రవచించబడినట్లుగా, అలాంటి వరాలు చివరికి నిలిచిపోయాయి.—1 కొరింథీయులు 13:8.

15. నిజ క్రైస్తవులు నేడు ఏ ప్రవచన నెరవేర్పు సమయంలో జీవిస్తున్నారు, మనకు దాని భావమేమై ఉంది?

15 అయితే, యెహెజ్కేలు 40-48 అధ్యాయాలలోవున్న విస్తృతమైన ఆలయ ప్రవచనపు విశేషమైన నెరవేర్పు కాలంలో మనం జీవిస్తున్నాము.a అలా, స్వచ్ఛారాధన కోసమైన దేవుని ఏర్పాటు పునరుద్ధరించబడటాన్ని మనం చూశాము. ఆ ఆధ్యాత్మిక ఆలయం అన్ని రకాలైన మత కాలుష్యాల నుండి, విగ్రహారాధన నుండి శుభ్రపర్చబడటాన్ని మనం చూశాము. (యెహెజ్కేలు 43:9; మలాకీ 3:1-5) ఈ శుభ్రపర్చడం మనకు తెచ్చిన ప్రయోజనాల గురించి ఆలోచించండి.

16. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ నిరుత్సాహకరమైన ధోరణిని ఎదుర్కున్నారు?

16 మొదటి శతాబ్దంలో, సంస్థీకృత క్రైస్తవ సంఘానికి భవితవ్యం అంధకారమయంగా గోచరించింది. క్రొత్తగా నాటిన గోధుమ పైరులో గురుగులు నాటబడి, గోధుమలను గురుగుల నుండి వేరుపర్చడం అసాధ్యమన్నట్లు ఉంటుందని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 13:24-30) సరిగ్గా అలాగే జరిగింది. మొదటి శతాబ్దాంతానికల్లా, భ్రష్టత్వాన్ని అడ్డగించడానికి వృద్ధ అపొస్తలుడైన యోహాను చివరి అడ్డంకుగా ఉన్నప్పుడు, మతభ్రష్టత్వం అప్పటికే వేళ్లూని ప్రబలుతోంది. (2 థెస్సలొనీకయులు 2:6; 1 యోహాను 2:18) అపొస్తలులు మరణించి చాలాకాలం గడవకముందే, మందను అణచివేసే, ప్రత్యేకమైన ఒక మతనాయక వర్గం ఉనికిలోకి వచ్చింది, వాళ్లు తమను ప్రత్యేకించి చూపించే వస్త్రాలను ధరించేవారు. మత భ్రష్టత్వం కొరుకుడు పుండులా వ్యాపించింది. నమ్మకమైన క్రైస్తవులకు ఎంత నిరుత్సాహం కల్గివుంటుందో కదా! క్రొత్తగా స్థాపించబడిన స్వచ్ఛారాధన కొరకైన ఏర్పాటును కలుషిత విధానం ముంచెత్తడాన్ని వాళ్లు చూశారు. క్రీస్తు సంఘాన్ని నెలకొల్పి ఇంకా శతాబ్దమైనా గడవక ముందే ఇది వృద్ధి చెందింది.

17. ఆధునికదిన క్రైస్తవ సంఘం ఏ భావంలో మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంకన్నా ఎక్కువకాలం నిలిచింది?

17 ఇప్పుడొక వ్యత్యాసాన్ని పరిశీలించండి. అపొస్తలులు మరణించిన ఎంతోకాలం తర్వాత నేటి వరకు స్వచ్ఛారాధన కొనసాగింది. పూర్వం 1879లో ఈ పత్రిక మొదటి సంచిక ప్రచురించబడినప్పటి నుండి, యెహోవా మనల్ని అత్యధికంగా శుభ్రపర్చబడిన ఆరాధనతో ఆశీర్వదించాడు. యెహోవా, క్రీస్తు యేసు ఆధ్యాత్మిక ఆలయాన్ని శుభ్రపరిచేందుకు 1918లో దానిలోకి ప్రవేశించారు. (మలాకీ 3:1-5) 1919 నుండి, యెహోవా దేవుని ఆరాధన కొరకైన ఏర్పాటు క్రమంగా శుద్ధీకరించబడింది. బైబిలు ప్రవచనాలకు, సూత్రాలకు సంబంధించిన మన అవగాహన స్పష్టమైంది. (సామెతలు 4:18) దానికి ఘనత ఎవరికి చెందాలి? అపరిపూర్ణులైన మానవమాత్రులకు కాదు. తన కుమారుడు సంఘ శిరస్సుగా ఉండగా, కేవలం యెహోవా మాత్రమే ఈ భ్రష్ట కాలాల్లో తన ప్రజలను భ్రష్టత్వం నుండి కాపాడగలడు. కాబట్టి నేడు స్వచ్ఛారాధనలో భాగం వహించడానికి మనకు అనుమతి ఇస్తున్నందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయడంలో ఎన్నడూ విఫలులం కాకూడదు. నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకూడదని దృఢంగా నిశ్చయించుకుందాము!

18. నశించిపోయేలా వెనుక తీయక ఉండటానికి మనకు ఏ కారణం ఉంది?

18 ఆ హెబ్రీ క్రైస్తవులలా, పిరికితనంతో కూడిన, వెనుక తీసే విధానాన్ని నిరాకరించేందుకు మనకు రెండో కారణం కూడా ఉంది—అది సహనానికి సంబంధించిన మన స్వంత చరిత్రయే. మనం ఇటీవలి సంవత్సరాల్లోనే యెహోవా సేవ చేయడం ప్రారంభించినా లేక దశాబ్దాలుగా నమ్మకంగా సేవ చేస్తున్నా, మనం క్రైస్తవ చర్యల రికార్డును నిర్మించుకున్నాము. మనలో చాలామందిమి హింసను అనుభవించాము, అది చెరసాలలో ఉండటమైనా, నిషేధమైనా, క్రూరత్వమైనా, లేక ఆస్తి నష్టమైనా. ఇంకా చాలామంది కుటుంబ వ్యతిరేకతను, తిరస్కారాన్ని, హేళనను, ఉదాసీనతను అనుభవించారు. మనమందరం జీవిత సవాళ్లను, పరీక్షలను ఎదుర్కుంటూ కూడా యెహోవాకు నమ్మకంగా సేవ చేయడంలో కొనసాగుతూ సహించాము. అలా చేయడం ద్వారా, మనం నిర్మించుకున్న పట్టుదలతో కూడిన చరిత్రను యెహోవా మరచిపోడు, అది పరలోకంలో భాండాగారం లాంటిది. కాబట్టి కచ్చితంగా, మనం విడిచిపెట్టి వచ్చిన భ్రష్టమైన పాత విధానం కోసం వెనుక తీయడానికి ఇది సమయం కాదు. మన కష్టాన్నంతటినీ నిరర్థకం చేసుకోవడం ఎందుకు? అంతానికి ముందు కేవలం “బహు కొంచెము” కాలము మాత్రమే మిగిలివున్న ఈ సమయంలో ప్రత్యేకించి ఇది నిజం.—హెబ్రీయులు 10:37.

19. తదుపరి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?

19 అవును, ‘మనం నశించిపోయేలా వెనుక తీయువారము’ కాకుండేలా నిశ్చయం చేసుకుందాము! బదులుగా మనం “విశ్వాసము కలిగినవారమై” ఉందాము. (హెబ్రీయులు 10:39) మనం ఆ వివరణకు సరిపోతామని మనమెలా నిశ్చయత కల్గివుండవచ్చు, అదే చేయడానికి మనం మన తోటి క్రైస్తవులకు ఎలా సహాయం చేయగలము? మా తదుపరి శీర్షిక ఈ విషయాన్ని పరిశీలిస్తుంది.

[అధస్సూచీలు]

a కావలికోట, మార్చి 1, 1999, 8-23 పేజీలను చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ నశించిపోయేలా వెనుక తీయడమంటే ఏమిటి?

◻ పౌలు ఎవరికైతే వ్రాశాడో ఆ హెబ్రీ క్రైస్తవులపైకి ఏ ఒత్తిళ్లు వచ్చాయి?

◻ నశించిపోయేలా వెనుక తీయక ఉండటానికి పౌలు హెబ్రీయులకు ఏ కారణాలను ఇచ్చాడు?

◻ నశించిపోయేలా ఎన్నడూ వెనుక తీయక ఉండటానికి నిశ్చయం చేసుకునేందుకు మనకే కారణాలున్నాయి?

[15వ పేజీలోని చిత్రాలు]

పేతురు భయానికి లోనవ్వడం, ఆయనను ‘నశించిపోయేలా వెనుక తీసినవానిగా’ చేయలేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి