కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 12/15 పేజీలు 9-13
  • శ్రమలతో నిండిన దేశంలో నిజమైన శాంతిని పొందటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శ్రమలతో నిండిన దేశంలో నిజమైన శాంతిని పొందటం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • “నేను పెద్దవాడినయ్యాక, ఐఆర్‌ఏలో చేరతాను!”
  • తటస్థంగా ఉండటం నిజమైన భద్రతనిస్తుంది
  • “నా తుపాకీలే నాకున్న ఏకైక కాపుదల”
  • “జరుగుతున్నవన్నీ అర్థరహితంగా అనిపించేవి”
  • “సాక్షులు ఎప్పుడూ మా అవధానాన్ని బైబిలువైపు త్రిప్పేవారు”
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 12/15 పేజీలు 9-13

శ్రమలతో నిండిన దేశంలో నిజమైన శాంతిని పొందటం

“మత సంబంధమైన దౌర్జన్యపు రక్కసి తన బోనులో నుండి పూర్తిగా బయటపడింది,” అని పూర్వం 1969లో ఒక నివేదిక తెలియజేసింది. అప్పుడు, ట్రబుల్స్‌ (శ్రమలు) తీవ్రతరమయ్యాయి అంటే, ఉత్తర ఐర్లాండ్‌లో ప్రస్తుతమున్న సంక్షోభ పరిస్థితులు తీవ్రతరమయ్యాయి.

రాజకీయపరమైన మతపరమైన విభాగాలకు “ఇరువైపులా ఉన్న క్రూరమైన మనుష్యులు” అని పిలువబడిన ప్రొటెస్టెంట్‌ మరియు క్యాథలిక్‌ హంతకులు ఐర్లాండ్‌పై ఆధిపత్యం సంపాదించుకోవడానికి తమ పోరాటాన్ని తీవ్రతరం చేసినప్పుడు మతసంబంధమైన దౌర్జన్యం, హత్యలు సర్వసాధారణ విషయాలైపోయాయి. అప్పటి నుండి “దాదాపు 30 సంవత్సరాల దౌర్జన్యంలో 3,600 కంటే ఎక్కువమంది ప్రజలు చంపబడ్డారు, వేలాదిమంది వికలాంగులయ్యారు” అని ది ఐరిష్‌ టైమ్స్‌ నివేదిస్తుంది.

అయితే ఇది క్రొత్త పోరాటమేమీ కాదు. ఇది శతాబ్దాలుగా ఐర్లాండ్‌ను పీడిస్తూనే ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో దాని ప్రాణాంతకమైన ప్రభావాలు ఉత్తర ఐర్లాండ్‌పై పడ్డాయి, కాని అది సృష్టించిన విషాదానికి, వైషమ్యానికి ఐర్లాండ్‌ అంతటా ఉన్న ప్రజల జీవితాలు నాశనమయ్యాయి.

అలాంటి పరిస్థితుల్లో, ఇప్పటికి వంద సంవత్సరాలకు పైగా, యెహోవాసాక్షులు శ్రమలతో నిండిన ఈ దేశాన్ని పీడిస్తున్న సమస్యలకు నిజమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు. ఆ పరిష్కారం యేసుక్రీస్తు చేతుల్లోవున్న దేవుని రాజ్యం. (మత్తయి 6:9, 10) ఐర్లాండ్‌లో 1969లో శ్రమలు ప్రారంభమైనప్పుడు, అక్కడ 876 మంది సాక్షులున్నారు. ఇప్పుడక్కడ 100 కన్నా ఎక్కువ సంఘాల్లో 4,500 కంటే ఎక్కువమంది సాక్షులున్నారు. రాజకీయ, పారామిలిటరీ కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన కొంతమంది అనుభవాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

“నేను పెద్దవాడినయ్యాక, ఐఆర్‌ఏలో చేరతాను!”

మైఖేల్‌a రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌లో క్యాథలిక్‌గా పెరిగాడు. ఐర్లాండ్‌ చరిత్ర గురించి, బ్రిటన్‌తో దానికి శతాబ్దాలుగా ఉన్న వైరాన్ని గురించి ఆయన తన పాఠశాలలో నేర్చుకున్నాడు. బాల్యం నుండి ఆయన ఆంగ్లేయులపట్ల ప్రగాఢమైన విద్వేషాన్ని ఏర్పరచుకున్నాడు, ఆంగ్లేయులు “ఐర్లాండ్‌ ప్రజలను అణిచివేసేవారని” ఆయన భావించాడు. తనకు పది సంవత్సరాల వయసున్నప్పుడు, “నేను పెద్దవాడినయ్యాక ఐఆర్‌ఏలో (ది ఐరీష్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో) చేరతాను!” అని వాళ్ల అమ్మమ్మతో అన్నాడు. “అప్పుడు తగిలిన చెంప దెబ్బ నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది” అని ఆయన అంటున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తన తాతగారు బ్రిటీషు సైన్యంలో పనిచేశారని తర్వాత ఆయనకు తెలిసింది. ఒకసారి ఐఆర్‌ఏ సభ్యులు తన తాతగారిని కాల్చేయకుండా తన అమ్మమ్మ ఆయనకు అడ్డం నిలబడవలసి వచ్చింది.

అయినప్పటికీ, మైఖేల్‌ పెద్దవాడైనప్పుడు, ఉత్తర ఐర్లాండ్‌లోని తన తోటి క్యాథలిక్కులకు సహాయం చేసేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు. “ఆ సమయంలో ఉత్తర ఐర్లాండ్‌లోని క్యాథలిక్‌ ప్రజలకు సహాయం చేయడానికి ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే అది కేవలం ఐఆర్‌ఏ వాళ్లే అని నాకనిపించేది.” న్యాయమైన సంకల్పమని తాను పరిగణించిన దాన్ని బట్టి ప్రేరేపింపబడి, ఆయన ఐఆర్‌ఏ సభ్యుడై, ఆయుధాలను ఉపయోగించడంలో తర్ఫీదు పొందాడు. ఉత్తర ఐర్లాండ్‌లో ప్రొటెస్టెంట్‌ పారామిలిటరీ వారు ఆయన స్నేహితులు ముగ్గురిని కాల్చి చంపేశారు.

మైఖేల్‌ చివరికి పారామిలిటరీ పోరాటంతో నిరాశ చెందాడు, ఉదాహరణకు, వివిధ పారామిలిటరీ గుంపుల మధ్య జరుగుతున్న విషాదకరమైన కలహాలనుబట్టి అయన కలవరపడ్డాడు. ఐఆర్‌ఏ కార్యకలాపాలకు సంబంధించిన నేరాలనుబట్టి చెరసాలలో ఉన్నప్పుడు, నిరంతర శాంతి, న్యాయాలను పొందేందుకు నిజమైన మార్గాన్ని కనుగొనడానికి సహాయం చేయమని ఆయన దేవునికి ప్రార్థించాడు. కొంతకాలం తర్వాత యెహోవాసాక్షులు ఆయన ఇంటికి వచ్చారు. అయితే పాత దురభిమానాలు అడ్డంకులను ఏర్పరిచాయి. సాక్షులు ఆంగ్లేయులు. ఆయనలో లోతుగా పాతుకుపోయిన విద్వేషం మూలంగా వాళ్లు చెప్పేది వినడం కష్టమైపోయింది. “నేను వాళ్లను ప్రతిసారీ ఆహ్వానించేవాడిని కాదు, కానీ వాళ్లు వచ్చి నాతో మాట్లాడాలని పట్టుదలతో ఉండేవారు, నేను నిర్మూలించాలని చూస్తున్న అన్ని రాజకీయ, సామాజిక అన్యాయాలకు దేవుని రాజ్యం అంతం తెస్తుందని నేను గ్రహించడం మొదలుపెట్టాను.”—కీర్తన 37:10, 11; 72:12-14.

మైఖేల్‌ ఒక సాయంకాలం తన ఐఆర్‌ఏ కమాండింగ్‌ ఆఫీసర్‌ను కలిసినప్పుడు అసలు ఉపద్రవం వచ్చింది. “నీవు చేయవలసిన పని ఒకటి మేము నీకు అప్పగిస్తున్నాము” అని ఆయన అన్నాడు. “నేను అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని భావించాను. కాబట్టి నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఆ సమయానికి నేనింకా బాప్తిస్మం తీసుకోకపోయినా, ‘ఇప్పుడు నేనొక యెహోవాసాక్షిని’ అని చెప్పేశాను. నేను యెహోవా సేవ చేయాలన్నది మాత్రమే నాకు తెలుసు” అని మైఖేల్‌ చెప్తున్నాడు. “నిన్ను గోడకు నిలబెట్టి కాల్చిపారేయాలి” అన్నాడు కమాండింగ్‌ ఆఫీసరు. అలా బెదిరించినా లాభం లేకపోయింది, మైఖేల్‌ ఐఆర్‌ఏను విడిచిపెట్టేశాడు. యెహోవా మాటలు తన మనస్సునూ, హృదయాన్నీ ప్రభావితం చేసేందుకు అనుమతించడం ద్వారా ఆయన అలా చేసేందుకు ధైర్యాన్ని సంపాదించుకున్నాడు. “కొంతకాలానికి నా భార్య, కొంతమంది పిల్లలు కూడా తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నారు. ఇప్పుడు మా హృదయాల్లో మాకు నిజమైన శాంతి ఉంది. మేము సత్యాన్ని తెలుసుకునేందుకు, శ్రమలతో నిండిన దేశంలో సమాధాన సందేశాన్ని వ్యాప్తిచేయడంలో భాగం వహించేందుకు అనుమతించిన యెహోవాకు మేమెప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము.”—కీర్తన 34:14; 119:165.

తటస్థంగా ఉండటం నిజమైన భద్రతనిస్తుంది

“నేను ఉత్తర ఐర్లాండ్‌లోని డెర్రీ అనే గ్రామ ప్రాంతంలో పెరిగాను. నాకు బాల్యంలో శ్రమలు తప్ప ఇంకేమీ తెలియవు. ఆ వాతావరణం నా దృక్కోణాన్ని, ఆలోచనను ప్రభావితం చేశాయన్నది సుస్పష్టం” అని పాట్రిక్‌ చెప్తున్నాడు. విద్వేషపూరితమైన జాతీయవాదంతోనూ, ప్రగాఢమైన బ్రిటీష్‌ వ్యతిరేక దురభిమానంతోనూ ప్రభావితమైన పాట్రిక్‌ తీవ్రవాద దృక్పథాలను పెంపొందించుకున్నాడు. రాజకీయ పోరాటానికి ఇరువైపులా ఉన్న మతసంబంధమైన ప్రజలు ప్రాథమికమైన క్రైస్తవ సూత్రాలనూ, అలాగే ప్రధానమైన మానవ సభ్యతా సూత్రాలనూ అతిక్రమించడాన్ని ఆయన చూశాడు. ఫలితంగా, అతడు మతం నుండి దూరమై, చివరికి నాస్తికుడూ, కఠోరమైన మార్కిస్టువాదీ అయిపోయాడు.—పోల్చండి మత్తయి 15:7-9; 23:27, 28.

“నాకున్న తొలి జ్ఞాపకాలు, ఉత్తర ప్రాంతంలోని రిపబ్లికన్‌ ఖైదీలు చేసిన నిరాహార దీక్షలను గురించినవే,” అని పాట్రిక్‌ చెప్తున్నాడు. “అవి నన్ను గాఢంగా ప్రభావితం చేశాయి. సాధ్యమైన చోటల్లా ఐరిష్‌ జెండాలను పాతడం, బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలను గోడలమీద వ్రాయడం నాకు గుర్తుంది. కేవలం 15 ఏళ్ల వయస్సులో, నిరాహార దీక్ష చేసి ఖైదులో మరణించిన ఒక వ్యక్తికి అంత్యక్రియలు చేసేటప్పుడు నేను కావలివాడిగా ఉన్నాను.” ఆ సమయంలోని సంక్షోభంలోనూ, అయోమయంలోనూ చిక్కుకుపోయిన చాలామంది ఇతరుల్లాగే పాట్రిక్‌ కూడా తాను సాంఘిక న్యాయం, సమానత అని తలంచిన వాటి కోసం చేసే అల్లర్లలోనూ, అసమ్మతిని తెల్పుతూ చేసిన పాదయాత్రల్లోనూ పాల్గొన్నాడు. ఆయన అనేకమంది తీవ్రవాద జాతీయవాదులతో సన్నిహిత స్నేహాలు ఏర్పరచుకున్నాడు, వాళ్లల్లో చాలామందిని బ్రిటీష్‌ అధికారులు చెరసాలలో వేయించారు.

“తర్వాత, ఆర్థిక కారణాలను బట్టి, నేను ఇంగ్లాండులో కొంతకాలం గడపాల్సి వచ్చింది. నేను అక్కడున్నప్పుడు, బాంబులు వేయటానికి వెళ్తున్న నా స్నేహితుణ్ణి బ్రిటీష్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు” అని పాట్రిక్‌ చెప్తున్నాడు. జాతీయవాద సంకల్పాలపట్ల పాట్రిక్‌ ఎంతో సానుభూతి కల్గివున్నప్పటికీ, ఆయన దృక్పథం మారనారంభించింది. ఆంగ్లేయులందరి పైనా ఆయనకున్న దురభిమానం ప్రధానంగా నిరాధారమైనదని ఆయన గ్రహించడం మొదలు పెట్టాడు. “పారామిలిటరీ కార్యకలాపాలు నిజంగా సమస్యలను ఎన్నటికీ పరిష్కరించలేవనీ, నన్ను కలవరపెడుతున్న అన్యాయాలను తీసివేయలేవనీ నేను గుర్తించనారంభించాను. పారామిలిటరీ సంస్థలను అదుపు చేస్తున్నవారిలో విపరీతమైన అవినీతి, ఇతర అపరిపూర్ణతలు ఉండేవి” అని పాట్రిక్‌ చెప్తున్నాడు.—ప్రసంగి 4:1; యిర్మీయా 10:23.

పాట్రిక్‌ చివరికి ఉత్తర ఐర్లాండ్‌కు తిరిగి వచ్చాడు. “నేను తిరిగి వచ్చినప్పుడు ఒక స్నేహితుడు నన్ను యెహోవాసాక్షులకు పరిచయం చేశాడు.” పాట్రిక్‌ తాను సాక్షులతో చేసిన బైబిలు పఠనం ద్వారా, మానవ సంక్షోభానికి, వైషమ్యానికి నిజమైన పరిష్కారం ఏమిటో గ్రహించడం మొదలుపెట్టాడు. బైబిలు సూత్రాలు ఆయన మనస్సును, హృదయాన్ని ప్రభావితం చేయడంతో ఆయన చాలా త్వరగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాడు. (ఎఫెసీయులు 4:20-24) “ప్రస్తుతం ఉనికిలోవున్న సామాజిక రాజకీయ విధానాన్ని పడద్రోయడానికి పథకాలు వేసే బదులు, ఇప్పుడు నేను బైబిలు నుండి శాంతి సందేశాన్ని ప్రకటిస్తున్నాను, చివరికి నేను మునుపెన్నడూ వెళ్లివుండని ప్రభుత్వ విధేయుల (లాయలిస్ట్‌ల) ప్రాంతాల్లోకి కూడా వెళ్తున్నాను. వాస్తవానికి, బెల్‌ఫాస్ట్‌లో ఒకప్పుడు ఎన్నో మత సంబంధమైన హత్యలు జరిగినప్పుడు, లాయలిస్ట్‌, నేషనలిస్ట్‌ ప్రాంతాల మధ్య సాయుధ వాహనాలు లేకుండా తిరగ గల్గింది కేవలం యెహోవాసాక్షులు మాత్రమే” అని ఆయన అంటున్నాడు. ఉత్తర ఐర్లాండ్‌లోని ఇతర సాక్షుల్లాగే, ఈ సమయంలో, తొలి క్రైస్తవులు ఉన్నట్లుగా తటస్థంగా ఉండటం నిజమైన భద్రతనిస్తుందని ఆయన తెలుసుకున్నాడు. (యోహాను 17:16; 18:36) ఆయనిలా ముగిస్తున్నాడు: “యెహోవా, యేసుక్రీస్తు ద్వారా నిజమైన న్యాయాన్నీ, మానవజాతికంతటికి అణిచివేత నుండి స్వేచ్ఛనూ తీసుకువస్తాడని తెలుసుకోవడం మనస్సుకు ఎంతో ఉపశమనాన్నిచ్చేదిగా ఉంది.”—యెషయా 32:1, 16-18.

“నా తుపాకీలే నాకున్న ఏకైక కాపుదల”

“నేను రాజకీయ, మత సంక్షోభానికి మరో వైపున పెరిగాను. నేను ప్రొటెస్టెంట్‌ దురభిమానాలలో కూరుకుపోయి, క్యాథలిక్కులకు సంబంధించిన దేనినైనా విపరీతంగా ద్వేషించేవాడిని. నేను సాధ్యమైనంత వరకూ క్యాథలిక్కుల దుకాణాల్లోకి కూడా వెళ్లేవాడిని కాదు, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌కు నేను కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లాను. నేను ఆరెంజ్‌ ఆర్డర్‌ వంటి అనేక ప్రొటెస్టెంట్‌ గుంపులతోనూ, సంస్థలతోనూ కలిసి పనిచేయడంలో నిమగ్నమైపోయాను, ఆరెంజ్‌ ఆర్డర్‌ అనేది ప్రొటెస్టెంట్‌ మతాన్ని, జీవన విధానాన్ని పరిరక్షించడానికి అంకితమైన సంస్థ” అని విలియమ్‌ చెప్తున్నాడు. విలియమ్‌ తనకు 22 ఏళ్లున్నప్పుడు, అల్స్‌టర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్‌లో చేరాడు, అది స్థానికంగా నెలకొల్పబడిన బ్రిటీష్‌ సైన్యంలో ఒక భాగం. దాని సభ్యుల్లో చాలామంది ప్రొటెస్టెంట్‌లు. ఆయన తన వారసత్వాన్ని కాపాడుకునేందుకు హత్యలు చేయడానికి ఎంతో సుముఖంగా ఉన్నాడు. “నా దగ్గర చాలా పిస్తోళ్లు ఉండేవి, అవసరమైతే వాటిని ఉపయోగించడానికి నేను వెనుకాడి ఉండేవాడిని కాదు. నేను రాత్రి నా దిండు క్రింద ఒక పిస్తోలు పెట్టుకుని పడుకునేవాడిని.”

కానీ అక్కడే పరిస్థితి మలుపు తిరిగింది. “ఒక పాత ఇంటిని బాగుచేస్తూ ఒక సాక్షితో కలిసి పనిచేసినప్పుడు, యెహోవాసాక్షుల వద్ద ప్రత్యేకమైనదేదో ఉందని నేను గ్రహించడం మొదలు పెట్టాను. ఈ తోటి పనివాడు నా మీద చాలా ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించాడు. మేమిద్దరం కలిసి ఇంటిని కడుతున్నప్పుడు, శ్రమల గురించి, మతం గురించి, దేవుని గురించి నన్ను కలవరపెడుతున్న అనేక ప్రశ్నల్ని ఆయనను అడిగాను. ఆయనిచ్చిన సరళమైన, స్పష్టమైన సమాధానాలు యెహోవాసాక్షులంటే ఐక్యతగల, దౌర్జన్యం చేయని, రాజకీయాల్లో తటస్థంగా ఉండే ప్రజలనీ, దేవునిపట్ల పొరుగువారిపట్ల ప్రేమగలవారిగా పేరుపొందిన ప్రజలనీ నేను గ్రహించేలా చేశాయి.”—యోహాను 13:34, 35.

బైబిలు పఠనాన్ని ప్రారంభించిన నాలుగు నెలల్లో, విలియమ్‌ తాను సహవసిస్తున్న మతపరమైన, రాజకీయసంబంధమైన సంస్థలన్నిటికీ రాజీనామా చేశాడు. “అది నేను చేసుకున్న పెద్ద మార్పు, ఎందుకంటే నేను నాకెంతో ఇష్టమైన, దీర్ఘకాలంగావున్న ఎన్నో ఆచారాలను వదులుకోవలసి వచ్చింది.” అయితే ఆయన ఎదుర్కోవలసిన అతి పెద్ద పరీక్ష ఇంకా ముందుంది. “ఉత్తర ఐర్లాండ్‌లోవున్న పరిస్థితి మూలంగా, నా తుపాకీలే నాకున్న ఏకైక కాపుదల అని నేను భావించాను. ఐఆర్‌ఏ పారామిలిటరీలు నన్ను ‘న్యాయమైన గురిగా’ పెట్టుకున్నారు. కాబట్టి ఆ ఆయుధాలను వదులుకోవడం చాలా కష్టంగా ఉండేది.” అయితే యెషయా 2:2-4 నందున్నదాని వంటి బైబిలు ఉపదేశం మెల్లిగా ఆయన దృక్పథాన్ని మార్చింది. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఉన్నట్లుగానే తనకు కూడా చివరికి అసలైన కాపుదల యెహోవాయే అని ఆయన గ్రహించాడు. అప్పుడు విలియమ్‌ తన తుపాకీలను ఇచ్చేశాడు.

“నేను నిజంగా సంతోషించే ఒక విషయం ఏమిటంటే, నేను మునుపు బద్ధ శత్రువులని దృష్టించి ఉండేవారితోనే నాకిప్పుడు ప్రగాఢమైన, శాశ్వతమైన స్నేహసంబంధాలు ఉన్నాయన్నదే. ఒకప్పుడు ‘వెళ్లకూడని ప్రాంతాలుగా’ ఉన్న ప్రాంతాల్లోకి నేనిప్పుడు బైబిల్లోని నిరీక్షణా సందేశాన్ని తీసుకువెళ్లగల్గడం నిజంగా ఆనందానికి మూలం. సత్యం నాకూ నా కుటుంబానికీ ఏమి చేసిందనేదాని గురించి ఆలోచించడం యెహోవాకు, ఆయన సంస్థకు నేను నిరంతరం కృతజ్ఞత కల్గివుండేలా చేస్తుంది.”

“జరుగుతున్నవన్నీ అర్థరహితంగా అనిపించేవి”

రాబర్ట్‌, థెరీసా పూర్తిగా వేరు వేరు నేపథ్య రంగాలుగల వాళ్లు. “నేను సనాతన ప్రొటెస్టెంట్‌ కుటుంబానికి చెందినవాడిని” అని రాబర్ట్‌ చెప్తున్నాడు. “నా బంధువుల్లో కొందరు పారామిలిటరీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండేవారు. నేను 19 ఏళ్ల వయస్సులో బ్రిటీష్‌ సైన్యానికి చెందిన అల్స్‌టర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్‌లో చేరాను. ఆ సమయంలో చాలా భాగం నేను థెరీసా నివసిస్తున్న ప్రాంతంలో కాపలా పని మీద ఉండేవాడిని. ఒక రాత్రి నాకు కాపలా కాసే పని కాకుండా వేరే పనులు అప్పగించారు. ఆ రాత్రి నేను ప్రయాణించి ఉండాల్సిన లాండ్‌-రోవర్‌ పేల్చివేయబడింది. ఇద్దరు సైనికులు చనిపోయారు, మరిద్దరు గాయపడ్డారు.”

రాబర్ట్‌ జీవితార్థాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. “నాకెప్పుడూ దేవుడంటే నమ్మకమే, కానీ ఉత్తర ఐర్లాండ్‌ పరిసరాలను చూసినప్పుడు, జరుగుతున్నవన్నీ అర్థరహితంగా అనిపించేవి. నేను నిజంగా దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నీవు నిజంగా ఉనికిలో ఉన్నావా, ఉంటే నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపేందుకు నాకు నేర్పించు అని దేవుడ్ని అడిగాను. ఎక్కడో నిజమైన మతం ఉండేవుంటుందని నేను దేవునితో అనడం నాకు గుర్తుంది !” కేవలం కొన్ని రోజుల తర్వాత, ఒక యెహోవాసాక్షి రాబర్ట్‌ దగ్గరికొచ్చి, కొన్ని ప్రచురణలిచ్చాడు. ఆ రాత్రి రాబర్ట్‌ కాపలాకాయడం నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చి, అవి చదవడం మొదలుపెట్టి ఉదయం ఐదు గంటలకల్లా ముగించాడు. “నేను వెంటనే సత్యాన్ని గ్రహించాను, అంతా బైబిలు నుండే చెప్పబడుతుందని నేను తెలుసుకున్నాను.” (2 తిమోతి 3:16) ఆయన బైబిలు పఠనం ప్రారంభించాడు, కొంతకాలానికే ఆయన తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు.

“సాక్షులు ఎప్పుడూ మా అవధానాన్ని బైబిలువైపు త్రిప్పేవారు”

మరోవైపున, థెరీసా ప్రగాఢమైన జాతివాద భావాలుగల క్యాథలిక్‌. “యౌవనస్థురాలిగా ఉన్నప్పుడే నేను షిన్‌ ఫేన్‌లోb చేరాను.” థెరీసా ఇలా ఒప్పుకుంటోంది: “దానితో నేను పారామిలిటరీ కార్యకలాపాలకు మద్దతునివ్వడంలో నిమగ్నమయ్యాను. నేను సైనిక పోరాటం కోసం నిధులు సేకరించడానికి తోడ్పడేదాన్ని. నేనున్న ప్రాంతంలో ఏమి జరుగుతోందో నేను ఐఆర్‌ఏకు తెలియజేస్తూ ఉండేదాన్ని. నేను అల్లర్లలో పోలీసుల మీదా సైనిక గస్తీల మీదా రాళ్లు రువ్వడంలో కూడా పాల్గొనేదాన్ని.”

థెరీసా కుటుంబ సభ్యులు కొంతమంది యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించినప్పుడు, ఆమెకు కుతూహలం పెరిగింది. దేవుని వాక్య శక్తి ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. “ప్రశ్నలకు జవాబులను కనుగొనేందుకు సాక్షులు ఎప్పుడూ మా అవధానాన్ని బైబిలువైపు త్రిప్పేవారు” అని ఆమె చెప్తుంది. “దానియేలు 2:44 నందున్న వాగ్దానం నిజంగా కళ్లు తెరిపించింది. నేను ఏ యే అన్యాయాలతోనైతే పోరాడుతున్నానో వాటన్నింటినీ నిర్మూలించగలిగేది దేవుని రాజ్యమేనని నేను గ్రహించాను.” పారామిలిటరీలు చేస్తున్న కొన్ని దారుణాలను చూసి ఆమె మనసు తీవ్రంగా ఎదురు తిరిగేది. ఉదాహరణకు, దయాగుణం, మంచిమర్యాద ఉన్న ఎవరైనా కూడా తీవ్రవాదుల కార్యకలాపాల మూలంగా సైనికులుగానీ ఇతరులుగానీ చనిపోయి లేక వికలాంగులైపోయి వారి కుటుంబాలు దుఃఖావేదనలతో కృంగిపోయామన్న వార్తలు విని ఎలా ఆనందిస్తారనేది థెరీసా అర్థం చేసుకోలేకపోయేది. ఆమె కూడా బైబిలు సత్యానికి ప్రతిస్పందించి, దేవుని సూత్రాలు తన ఆలోచనా విధానాన్ని సవరించేందుకు అనుమతించింది. ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని, త్వరలోనే బాప్తిస్మం తీసుకుంది.—సామెతలు 2:1-5, 10-14.

ఉత్తర ఐర్లాండ్‌లోని యెహోవాసాక్షుల సంఘాల్లో ఒకదానిలో కూటాలకు హాజరైనప్పుడు థెరీసా రాబర్ట్‌ను కలిసింది. ఆమె ఇలా వ్యాఖ్యానిస్తోంది: “నేను రాబర్ట్‌ను మొదటిసారి కలిసినప్పుడు, ఇంతకు క్రితం వరకూ బ్రిటీష్‌ యుద్ధ యంత్రాంగంలో భాగంగా పరిగణించే ఒకరితో నేనింత ప్రశాంతంగా, సమాధానంగా మాట్లాడుతున్నానన్నది నమ్మలేకపోయాను. లోతుగా పాతుకుపోయిన విద్వేషాలనూ, దురభిమానాలనూ నిర్మూలించుకునేందుకు దేవుని వాక్యం నాకు కచ్చితంగా సహాయం చేసింది.” విభిన్నమైన తమ సంప్రదాయాచారాల నుండి ఉత్పన్నమయ్యే విద్వేషాలూ, దురభిమానాలతో విభాగింపబడే బదులు, ఇప్పుడు తాము చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కల్గివున్నామని ఆమె, రాబర్ట్‌ గ్రహించారు. వాటిలో అత్యంత శక్తివంతమైనది యెహోవా దేవునిపట్ల వారికున్న ప్రేమ. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అన్ని రకాలైన పూర్వాపరాలూ నమ్మకాలూ గల శ్రమలతో నిండిన ఈ దేశంలోని ప్రజలకు, నిజమైన శాంతికి సంబంధించిన దేవుని సందేశాన్ని అందజేయడానికి వాళ్లు కలిసి పనిచేస్తున్నారు.

ఐర్లాండ్‌లోని ఇతరులకు కూడా అదే విధమైన అనుభవాలు ఎదురయ్యాయి. దేవుని ప్రేరేపిత వాక్య బోధలను విని అంగీకరించడం ద్వారా, వాళ్లు మనుష్యుల “మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము” నుండి తప్పించుకున్నారు. (కొలొస్సయులు 2:8) వాళ్లిప్పుడు బైబిల్లో వ్రాయబడివున్న దేవుని వాగ్దానాలందు తమ పూర్తి నమ్మకాన్ని ఉంచారు. వినే వారెవరితోనైనా సరే, మతసంబంధమైన, మరితరమైన దౌర్జన్యం నుండి పూర్తిగా విముక్తి చేయబడిన సమాధానకరమైన భవిష్యత్తును గూర్చిన తమ నిరీక్షణను పంచుకునేందుకు వాళ్లు సంతోషిస్తున్నారు.—యెషయా 11:6-9.

[అధస్సూచీలు]

a పేర్లు మార్చబడ్డాయి.

b ప్రొవిజనల్‌ ఐఆర్‌ఏతో సన్నిహిత సంబంధంగల ఒక రాజకీయ పార్టీ.

[10వ పేజీలోని చిత్రాలు]

పారామిలిటరీ పోరాటాలు గోడలపైని వ్రాతల్లో మహిమపర్చబడటం ఉత్తర ఐర్లాండ్‌ అంతటిలోనూ కనిపిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి