కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 12/15 పేజీలు 4-8
  • క్రిస్మస్‌—ప్రాచ్య దేశాల్లో కూడా ఎందుకుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రిస్మస్‌—ప్రాచ్య దేశాల్లో కూడా ఎందుకుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బహుమతులు ఇచ్చుకునే ప్రక్రియకున్న పాత్ర
  • క్రిస్మస్‌ ఆవిర్భావం
  • లేఖనాలతో క్రిస్మస్‌ను లోతుగా పరిశీలించడం
  • ఆధునిక క్రిస్మస్‌ మూలాధారాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్రిస్మస్‌ ఎందుకు క్రైస్తవులది కాదు
    తేజరిల్లు!—1992
  • ప్రాచ్య దేశాల్లో క్రిస్మస్‌
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 12/15 పేజీలు 4-8

క్రిస్మస్‌—ప్రాచ్య దేశాల్లో కూడా ఎందుకుంది?

చోవాన్జ్‌షిన్‌ మీద కొరియా వాళ్ళకున్న ఒక ప్రాచీన ప్రాచ్య నమ్మకం, క్రిస్మస్‌ తాతను గుర్తుచేస్తుంది. ఆ నమ్మకానికి సామ్యమైన నమ్మకాలు చైనీయులకూ, జపానీయులకూ కూడా ఉన్నాయి.

చోవాన్జ్‌షిన్‌ వంటగది బాధ్యత ఉన్న దేవుడు అనీ, ప్రాచీన కొరియా దేశస్థులు ఆరాధించే అగ్ని దేవుడు అనీ తలంచబడుతుంది. (ప్రాచీన కాలాల్లో, కొరియా దేశస్థులు మండుతున్న నిప్పులను ఆరిపోకుండా జాగ్రత్తగా రవాణా చేసేవారు.) ఈ దేవుడు, సంవత్సరమంతా, కుటుంబ సభ్యుల ప్రవర్తనను గమనిస్తూ ఉంటాడనీ, దాని తర్వాత, వంటగదిలోని పొయ్యిలోంచి, పొగగొట్టంలో గుండా స్వర్గానికి ఆరోహణమవుతాడని నమ్మేవారు.

చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం, డిసెంబర్‌ 23న, చోవాన్జ్‌షిన్‌, స్వర్గలోక రాజుకు తాను గమనించినవాటిని తెలియజేస్తాడని అనుకునేవాళ్ళు. ఆయన ఆ సంవత్సరాంతంలో, పొగ గొట్టం గుండా, పొయ్యిలో గుండా తిరిగి వస్తాడనీ, ప్రతి ఒక్కరి ప్రవర్తనకు అనుగుణ్యంగా ప్రతిఫలాలనూ శిక్షలనూ తీసుకువస్తాడనీ నిరీక్షించబడేది. ఆయన తిరిగివచ్చే రోజున, కుటుంబ సభ్యులు వంటగదిలో, అలాగే ఇంట్లో అన్నిచోట్లా క్రొవ్వొత్తులను వెలిగించాలి. వంటగది దేవుడి చిత్రాలు, మరో విషయంలో కూడా క్రిస్మస్‌ తాతకు సాదృశ్యంగా ఉంటాయి—ఆయన ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్నట్లు చిత్రీకరించబడేవాడు! ఇంటి కోడలు, దక్షిణాయనమున (డిసెంబర్‌ 22న) సాంప్రదాయబద్ధమైన కొరియా మేజోళ్ళను తయారు చేసి, తన అత్తగారికి బహుమతిగా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. ఆ తేదీ తర్వాత, పగలు సమయం ఎక్కువగా ఉంటుంది కనుక, అలా చేయడం తన అత్తగారు దీర్ఘాయుష్మంతురాలిగా ఉండాలన్న ఆమె కోరికకు ప్రతీకగా ఉంటుందని తలంచబడేది.

మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలకూ, క్రిస్మస్‌కూ సామ్యాలు ఉన్నట్లు మీరు చూడడం లేదా? పొగగొట్టాలు, క్రొవ్వొత్తులు, బహుమతులను ఇచ్చుకోవడం, మేజోళ్లు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన ఒక వృద్ధుడూ, ఆ తేదీ మొదలైనవాటిని గురించిన కథలూ ఆచారాలు సామ్యంగా కనిపిస్తున్నాయి. అయితే, కొరియాలో క్రిస్మస్‌ అంత సులభంగా జనాదరణ పొందడానికి కారణాలు ఈ సామ్యాలు మాత్రమే కాదు. కొరియాలో క్రిస్మస్‌ మొదటిసారి ప్రవేశపెట్టబడేటప్పటికే, చోవాన్జ్‌షిన్‌పై నమ్మకం దాదాపుగా అంతరించిపోయింది. వాస్తవానికి, నేడు చాలా మంది కొరియా దేశస్థులకు, అలాంటి నమ్మకం ఉండేదన్న విషయమే తెలియదు.

అయితే, దక్షిణాయనంతోనూ సంవత్సరాంతంతోనూ ముడిపడివున్న ఆచారాలు వివిధ మార్గాల్లో ప్రపంచమంతటా ఎలా వ్యాపించాయన్నది ఇది చూపిస్తుంది. సా.శ. 4వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో ప్రాబల్యంలో ఉన్న చర్చి, సూర్య భగవానుడి జన్మదిన వేడుకగా రోమన్‌లు జరుపుకునే సాటెర్నేలియా అనే అన్యమత పండుగ పేరును మార్చి, దాన్ని క్రిస్మస్‌లో భాగంగా చేసింది. స్థానిక ఆచారాలు మరో పేరుతో పునరుద్ధరించబడేందుకు క్రిస్మస్‌ పండుగ ఆచరణ దారితీసింది. అదెలా సాధ్యమయ్యింది?

బహుమతులు ఇచ్చుకునే ప్రక్రియకున్న పాత్ర

బహుమతులను ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఇప్పటికీ ఉంది. ఎంతో కాలంగా కొరియా దేశస్థులు, బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందాన్ని పొందారు. కొరియాలో క్రిస్మస్‌ వేడుక అంత జనాదరణ పొందడానికి అది ఒక కారణం.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, కొరియాలో ఉండిపోయిన అమెరికా సైనికులు, ప్రజలతో తమకున్న సంబంధాలను పటిష్ఠం చేసుకోవడానికిగాను ప్రజలను కలిసేందుకూ, బహుమతులను పంచిపెట్టేందుకూ ఉపశమన సహాయాలను అందించేందుకూ చర్చీలు అనువైన స్థలాలయ్యాయి. ముఖ్యంగా క్రిస్మస్‌ రోజే అది జరిగేది. చాలా మంది పిల్లలు జిజ్ఞాసతో చర్చీని సందర్శించారు, వాళ్ళు మొదటిసారిగా అక్కడ చాక్లెట్‌లను బహుమతిగా పొందారు. మీరు అర్థం చేసుకోగలిగినట్లే, వాళ్ళలో చాలా మంది, తర్వాతి క్రిస్మస్‌ కోసం ఎదురు చూశారు.

అలాంటి పిల్లలకు, ఎరుపు రంగు టోపీ ధరించిన అమెరికా సైనికుడే క్రిస్మస్‌ తాత. “కానుకలు ఇచ్చే వానితో ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉండాలని కోరుకొంటారు” అని సామెతలు 19:6 చెబుతుంది. (పరిశుద్ధ బైబల్‌). అవును, బహుమతులను ఇవ్వడం ఫలకరమైందిగా నిరూపించబడింది. కానీ ఆ వచనాన్ని బట్టి, బహుమానాలు శాశ్వతమైన స్నేహానికి హమీ ఇవ్వలేవు అన్న నిర్ధారణకు మీరు రాగలరు. కొరియాలో కూడా అనేకులకు చిన్నప్పుడు చాక్లెట్లను పొందిన అనుభవం తప్ప చర్చి గురించి ఏమీ తెలియదు. అయినప్పటికీ క్రిస్మస్‌ స్మృతిపథం నుండి తొలగిపోలేదు. కొరియాలో, శీఘ్రగతిన జరిగిన ఆర్థిక పెరుగుదలతోపాటు వాణిజ్యం కూడా పెరిగింది. క్రిస్మస్‌ బహుమతులు, వినియోగదారులచేత మరింత ఖర్చుచేయించే సరళమైన మాధ్యమంగా మారాయి. వ్యాపారస్థులు లాభాలను ఆర్జించుకునేందుకు క్రిస్మస్‌ను బాగా ఉపయోగించుకున్నారు.

నేటి ప్రాచ్య దేశాల్లో క్రిస్మస్‌ ఎందుకింత విస్తృతంగా వ్యాపించిందన్నది మీకు ఇప్పుడు అర్థమౌతుండవచ్చు. క్రిస్మస్‌ సందర్భంగా, షాపింగ్‌లో ప్రజల చేత దుబారాగ ఖర్చుచేయించేందుకు క్రొత్త ఉత్పత్తులు తయారౌతాయి. వ్యాపార ప్రకటనలను గురించిన పథకాలు నడివేసవిలోనే మొదలౌతాయి. క్రిస్మస్‌ కానుకలూ, కార్డులూ, మ్యూజికల్‌ రికార్డింగ్‌ల కొనుగోళ్లతో సంవత్సరాంతం కెల్లా అమ్మకాల రేటు తారాస్థాయికి చేరుకుంటుంది. అంతెందుకు, సగటు యౌవనస్థులు తాము ఇంట్లో ఉండీ కూడా క్రిస్మస్‌ మొదలయ్యే సాయంకాలాన బహుమతులను పొందకపోతే తామెంతో దౌర్భాగ్యులమని భావించేలా వ్యాపార ప్రకటనలు చేస్తాయి!

క్రిస్మస్‌ రోజు దగ్గరికి వస్తున్న కొలది, సీయోల్‌లోని స్టోర్‌లూ, షాపింగ్‌ సెంటర్లూ బహుమతులు కొనడానికి వచ్చేవారితో కిటకిటలాడుతూ ఉంటాయి, మిగతా ప్రాచ్యదేశ నగరాలు కూడా అలాగే ఉంటాయి. రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. హోటళ్ళూ, బజార్లూ, రెస్టారెంట్లూ, నైట్‌క్లబ్బులూ అన్నీ కూడా వినియోగదారులతో సందడిగా ఉంటాయి. అట్టహాసాలూ—గట్టిగా పాడడమూ వినిపిస్తాయి. క్రిస్మస్‌ మొదలయ్యే రోజున, త్రాగి మత్తులైన స్త్రీ పురుషులు చెత్తాచెదారంతో నిండిన వీధుల గుండా వెళ్ళడం కనిపిస్తుంది.

క్రిస్మస్‌ అలా జరుగుతోంది. క్రిస్మస్‌ అనేది ఇక ప్రాచ్య దేశాల్లో క్రైస్తవులమని చెప్పుకునేవాళ్ళు మాత్రమే జరుపుకునే పండుగ కాదు. స్పష్టంగా, మిగతాచోట్లలాగే, కొరియాలో కూడా, క్రైస్తవుల పండుగను ఉపయోగించుకోవడంలో వాణిజ్య రంగమే ముందుంది. క్రిస్మస్‌కి క్రీస్తు స్ఫూర్తి లేకపోవడానికి కారణం, పూర్తిగా వాణిజ్య రంగమేనని నిందించవచ్చా? అందులో ఇమిడివున్న గంభీరమైన వివాదాన్ని నిజ క్రైస్తవులు లోతుగా పరీక్షించవలసిన అవసరం ఉంది.

క్రిస్మస్‌ ఆవిర్భావం

ఒక వన్య మృగాన్ని జంతు ప్రదర్శనశాలలోని బోనులో ఉంచినంత మాత్రాన అది వన్యమృగం కాకుండా పోదు. కొంత కాలం బోనులో ఉన్నంత మాత్రాన, తన పిల్లలతో ఆనందిస్తున్నట్లు కనిపిస్తున్నంత మాత్రాన అది పెంపుడు జంతువుగా మారిందని నమ్మడమంటే చాలా పెద్ద పొరపాటే. జంతుప్రదర్శన శాలలోని పనివాళ్ళపై అక్కడ ఉన్న వన్యమృగాలు దాడి చేశాయన్న నివేదికలు మీరు వినే ఉండవచ్చు.

కొన్ని విధాల్లో క్రిస్మస్‌ వేడుక కూడా చాలామేరకు అలాగే ఉందని మనం చెప్పవచ్చు. అది మొదట్లో, క్రైస్తవత్వానికి వెలుపల జీవించే “క్రూరమృగం”గా ఉండేది. ద క్రిస్టియన్‌ ఎన్‌సైక్లోపీడియాలో (కొరియా భాషలో)a “రోమన్‌ సాటెర్నేలియాకు గల సంబంధం” అనే హెడ్డింగ్‌ క్రింద, క్రిస్మస్‌ గురించి ఇలా పేర్కొంటుంది:

“అన్యమతానికి చెందిన సాటెర్నేలియా, బ్రూమేలియా పండుగలు జనాదరణ పొందిన ఆచారాల్లో ఎంతగా కలగలిసిపోయాయంటే, క్రైస్తవ ప్రభావం చేత దాన్ని త్రోసిపుచ్చడం అనేది అసాధ్యమైపోయింది. చక్రవర్తి కాన్‌స్టంటైన్‌, (ఫీబస్‌ మరియు మిథ్రాస్‌ దేవుళ్ళ రోజైన, అలాగే ప్రభువు దినమైన) ఆదివారానికి గుర్తింపునివ్వడం . . . నాలుగవ శతాబ్దపు క్రైస్తవులు, సూర్య భగవానుడి జన్మదినాన్ని దైవ పుత్రుని జన్మదినంగా మార్చడం సబబేనని భావించేందుకు నడిపించి ఉండవచ్చు. అడ్డూ అదుపులేని పార్టీలతో విలాసోత్సవాలతో కూడిన అన్యమత పండుగ ఎంత ప్రజాదరణ పొందిందంటే, దృక్పథంలోను, పద్ధతిలోను ఏమాత్రం తేడాలేకుండా ఆ అన్యమత పండుగను జరుపుకొనే సాకు దొరికినందుకు క్రైస్తవులు చాలా సంతోషించారు.”

అలాంటి వికాసం ఏ వ్యతిరేకతా లేకుండా జరిగివుంటుందని మీరనుకుంటున్నారా? అదే ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటోంది: “అనుచితమైన తుచ్ఛమైన విషయాలతో క్రీస్తు జన్మ దినాన్ని వేడుక చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాల్లోని మరియు ప్రాచ్యానికి సమీపంగా ఉన్న దేశాల్లోని క్రైస్తవ బోధకులు వ్యతిరేకించగా, ఈ అన్యమత పండుగను క్రైస్తవ పండుగగా మార్చి, విగ్రహారాధనను సూర్యారాధనను చేస్తున్నారని పాశ్చాత్య క్రైస్తవులను మెసపటోమియాలోని క్రైస్తవులు నిందించారు.” నిజంగానే, ఆరంభం నుండే (ఆరంభంలోనే) ఏదో లోపం ఉంది. “అయినప్పటికీ, ఆ పండుగ అతి వేగంగా అందరి ఆమోదాన్ని సంపాదించింది, అది చివరికి ఎంత సుస్థిరమయ్యిందంటే, పదహారవ శతాబ్దంలో జరిగిన ప్రొటెస్టెంట్‌ సంస్కరణ కూడా దాన్ని తొలగించలేకపోయింది” అని ఆ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది.

అవును, నిజ క్రైస్తవత్వానికి వెలుపల ఉండిన సూర్య భగవానుడి పండుగ, బాగా ప్రాబల్యంలో ఉన్న చర్చిలోకి ప్రవేశపెట్టబడింది. అది మరో పేరును పొందింది—కానీ దానికున్న అన్యమత లక్షణాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. అది నామమాత్రపు క్రైస్తవ చర్చిల్లోకి అన్యమతాన్ని ప్రవేశపెట్టేందుకూ, వ్యక్తుల ఆధ్యాత్మికతను పాడు చేసేందుకూ దోహదపడింది. క్రైస్తవమత సామ్రాజ్యం వికాసం పొందగా, “మీ శత్రువులను ప్రేమించండి” అన్న ఆదిమ దృక్పథం పోయి, నైతిక పతనమూ, హింసాయుత యుద్ధాలు జరిగాయని చరిత్ర ధృవీకరిస్తోంది.

సూర్య భగవానుడి పండుగ క్రిస్మస్‌ అనే మారుపేరులో తెలియబడుతున్నప్పటికీ, అల్లరితో కూడిన ఆటపాటలలోనూ, అమిత త్రాగుళ్ళలోనూ, విలాసోత్సవాలలోనూ, నాట్యాలలోనూ, బహుమతులను ఇచ్చుకోవడంలోనూ, ఇండ్లను ఎవర్‌గ్రీన్‌ మొక్కలతో అలంకరించుకోవడంలోనూ అది అన్యమతం నుండి వచ్చిందన్న విషయాన్ని ప్రతిబింబిస్తుందని చివరకు స్పష్టమైంది. వాణిజ్యపు తుది లక్ష్యం కోసమే—మరిన్ని అమ్మకాలు జరగాలన్న లక్ష్యం కోసమే—సాధ్యమైన ప్రతి మార్గంలోను క్రిస్మస్‌ ఉపయోగించుకోబడుతుంది. సమాచార మాధ్యమాలు క్రిస్మస్‌ను ఆకాశానికెత్తుతుంటాయి; ప్రజలు వినోదాన్ని పొందుతుంటారు. సీయోల్‌లోని వాణిజ్యప్రాంతంలో ఉన్న, లోదుస్తుల దుకాణమొకటి క్రిస్మస్‌ ట్రీని కేవలం లోదుస్తులతో అలంకరించి ప్రదర్శిస్తూ టీవీలో వార్తను సృష్టించింది. క్రిస్మస్‌ వాతావరణం అవధానాన్ని ఆకట్టుకుంది గానీ, క్రీస్తుకు స్వాగతం పలుకుతున్న ఏ ఆచూకీ కనిపించలేదు.

లేఖనాలతో క్రిస్మస్‌ను లోతుగా పరిశీలించడం

అలాంటి చరిత్రాత్మక నేపథ్యాన్ని గురించిన, వికాసాలను గురించిన పరిజ్ఞానం నుండి మనం ఏం తెలుసుకుంటున్నాం? షర్ట్‌ బటన్‌లు గానీ, బ్లౌజ్‌ హుక్సులు గానీ మొదటి నుండి ఎగుడు దిగుడుగా పెట్టుకున్నట్లైతే, వాటన్నింటినీ విప్పి, మళ్ళీ మొదటి నుండి సరిగ్గా పెట్టుకురావడమే ఏకైక మార్గం. అది నిజం కాదా? అది సత్యమైనప్పటికీ, సూర్యారాధనతో సంబంధంగల అన్యమతంలో క్రిస్మస్‌ వ్రేళ్ళూని ఉన్నప్పటికీ, క్రైస్తవమత సామ్రాజ్యమంతా కూడా దాన్ని అంగీకరించింది కదా అని కొందరు వాదిస్తారు. కనుక ఈ పండుగ, క్రీస్తు జన్మదినంగా పవిత్రీకరించబడిందనీ, అది క్రొత్త ప్రాముఖ్యతను సంతరించుకుందనీ వాళ్ళు భావిస్తారు.

ప్రాచీన యూదాలో జరిగిన ఒక చరిత్రాత్మక సంఘటన నుండి మనం విలువైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. సా.శ.పూ. 612లో యూదులు అన్యమత ఆరాధనయైన సూర్యారాధనను యెరూషలేములోని ఆలయంలో ప్రవేశపెట్టారు. అలాంటి అన్యమత ఆరాధన, యెహోవా దేవుని పవిత్ర ఆరాధన కోసం ప్రతిష్ఠించబడిన స్థలంలో జరిగినంత మాత్రాన పవిత్రీకరించబడిందా? యెరూషలేము ఆలయంలో జరిగిన సూర్యారాధన గురించి బైబిలు రచయిత అయిన యెహెజ్కేలు ఇలా వ్రాశాడు: “యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయదుగురు మనుష్యులు కనబడిరి. . . . వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను -నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.”—యెహెజ్కేలు 8:16, 17.

అవును, ఆ అన్యమత ఆరాధన పవిత్రీకరించబడే బదులు, ఆ ఆలయమంతటినీ అపాయంలో పడవేసింది. అలాంటి ఆరాధనా క్రియలు, యూదయ అంతటా వ్యాపించాయి, అది ఆ దేశంలో బలాత్కారం ప్రబలమయ్యేందుకు, నైతికత దిగజారిపోయేందుకు దోహదపడింది. క్రైస్తవమత సామ్రాజ్యంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. సూర్యారాధనలో భాగమైన సాటెర్నేలియా పండుగలో వేళ్ళూనిన ఆచారాలు క్రిస్మస్‌ వేడుకలో స్పష్టంగా కనిపిస్తాయి. యెహెజ్కేలు ఆ దర్శనాన్ని పొందిన కొన్ని సంవత్సరాల తర్వాత, యెరూషలేము దేవుని తీర్పుకు లోనైంది—బబులోనీయుల చేతిలో నాశనమైపోయింది అన్నది గమనించవలసిన విషయం.—2 దినవృత్తాంతములు 36:15-20.

ముందటి శీర్షికలో, బాల యేసును గురించి కొరియా విద్వాంసుడు చేసిన వర్ణన మీకు ఆసక్తికరంగా అనిపించి ఉండవచ్చు. వాస్తవమేంటంటే, క్రీస్తును గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానంలేని వ్యక్తి నుండి వచ్చిన ఆ ప్రతిస్పందనకు చెప్పుకోదగినంత విలువుంది. అది క్రిస్మస్‌ జరుపుకునేవారు గంభీరంగా ఆలోచించేలా చేయవచ్చు. ఎందుకని? ఎందుకంటే క్రిస్మస్‌ క్రీస్తును సరైన విధంగా ప్రతిబింబించడంలో విఫలమయ్యింది. వాస్తవానికి, అది ఆయనకిప్పుడు ఉన్న అసలు స్థానాన్ని మరుగు చేసేస్తుంది. యేసు ఇక తొట్టిలో ఉన్న పసిబిడ్డ కాడు.

యేసు ఇప్పుడు, మెస్సీయ అని, దేవుని పరలోక రాజ్యపు శక్తిమంతుడైన రాజు అని బైబిలు మరలా మరలా చెబుతుంది. (ప్రకటన 11:15) కొందరు క్రిస్మస్‌ కాలంలో మరిచిపోకుండా దానధర్మాలు చేస్తారు, అయితే యేసు, దారిద్ర్యాన్నీ పేదరికాన్నీ శాశ్వతంగా తీసివేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

నిర్మొహమాటంగా చెప్పాలంటే, క్రిస్మస్‌ క్రైస్తవ దేశాలకు గానీ, ప్రాచ్య దేశాలతో సహా ఇతర దేశాలకు గానీ ప్రయోజనమేమీ చేకూర్చలేదు. బదులుగా, అది దేవుని రాజ్యాన్ని గురించిన, ప్రస్తుత దుష్ట విధానాంతాన్ని గురించిన నిజ క్రైస్తవ సందేశం నుండి అవధానాన్ని మళ్ళించింది. (మత్తయి 24:14) ఆ అంతం ఎలా వస్తుందన్నది యెహోవాసాక్షులను అడిగి తెలుసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత దేవుని రాజ్యపు నిర్దేశాల క్రింద, పరిపాలిస్తున్న రాజైన యేసుక్రీస్తు నిర్దేశాల క్రింద భూమి మీదకు రాబోయే శాశ్వతమైన ఆశీర్వాదాలను గురించి మీరు వారి నుండి తెలుసుకోగలరు.—ప్రకటన 21:3, 4.

[అధస్సూచీలు]

a ద న్యూ షఫ్‌-హర్ట్‌సోక్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలిజియస్‌ నాలెడ్జ్‌ ఆధారంగా అనువదించబడినది.

[6వ పేజీలోని చిత్రం]

నామమాత్రపు క్రైస్తవ చర్చీల్లోకి అన్యమతాచారాలు ప్రవేశించేందుకు క్రిస్మస్‌ దోహదపడింది

[5వ పేజీలోని చిత్రం]

చాలా మంది పిల్లలు జిజ్ఞాస మూలంగా చర్చీలకు వెళ్ళి, చాక్లెట్లను బహుమతిగా పొందారు. వాళ్ళు తర్వాతి క్రిస్మస్‌ కోసం ఎదురు చూశారు

[7వ పేజీలోని చిత్రం]

కొరియాలోని సీయోల్‌లో ఉన్న వాణిజ్య ప్రాంతంలో క్రిస్మస్‌ మొదలైన రోజు

[8వ పేజీలోని చిత్రం]

క్రీస్తు ఇప్పుడు పసిబిడ్డ కాడు, దేవుని రాజ్యపు శక్తిమంతుడైన రాజు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి