ప్రాచ్య దేశాల్లో క్రిస్మస్
• దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం, ప్రముఖుడైన కొరియా విద్వాంసుడు ఒకరు చైనాలోని పీకింగ్‌కి వెళ్ళారు. ఆయన, అక్కడ కెథీడ్రల్‌లోని లోకప్పు మీద వేసివున్న పెయింటింగ్‌ని చూస్తుండగా, ఆ పెయింటింగ్‌లో, బాల యేసును మరియ ఎత్తుకుని ఉన్న దృశ్యం కనిపించింది. అచ్చెరువొందించే ఆ పెయింటింగ్ గురించి ఆయన ఇలా చెప్పారు:
“ఒక మహిళ, ఐదారేండ్ల వయస్సువాడైన, సుస్తీగా కనిపిస్తున్న తన బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంది. తన బిడ్డ దైన్యస్థితిని చూడలేనట్లు, ఆమె తన తలను పక్కకు వాల్చి ఉంది. వాళ్ళకు వెనుక, దూరాన, చాలా మంది ప్రేతలూ, ఇటు అటు ఎగురుతున్న రెక్కలుగల పసిబిడ్డలూ ఉన్నారు. నేను, నాకు పైగానున్న ఆ పెయింటింగ్‌లో వాళ్ళను చూస్తుండగా, ఏ క్షణంలోనైనా వాళ్ళు నా మీద పడిపోతారేమోననిపించింది. నేను భయపడిపోయి వాళ్ళను పట్టుకోవడానికి చేతులు చాచాను.”
చీకటి యుగమైన మధ్యయుగం గడిచిపోయిన చాలాకాలం తర్వాత, 16వ శతాబ్దంలో యూరప్‌లో క్రైస్తవ మత సంస్కరణ మొదలైన తర్వాత, అది జరిగింది. కానీ చాలామంది ప్రాచ్య దేశస్థులకు, ఆ పెయింటింగ్ ఎంత అపరిచితంగా ఉండేదో, క్రైస్తవత్వమూ అంతే అపరిచితమైనదిగా ఉండేది. అయితే నేడు పరిస్థితి చాలా మారిపోయింది ! ప్రతి సంవత్సరమూ క్రిస్మస్ కాలంలో, బాల యేసు బొమ్మలతో చేసిన దృశ్యాలు ప్రదర్శించబడుతుంటాయి. నేడు ప్రాచ్య దేశస్థులకు అలాంటి దృశ్యాలు సుపరిచితమైనవయ్యాయి, ఇప్పుడు అక్కడి అనేక వీధులు యూరప్‌లోని వీధులను పోలి ఉన్నాయి.
1998లో క్రిస్మస్‌కి ఒక నెల ముందు, అంటే నవంబరు 25 సాయంకాలాన, పారిస్‌లోని షాన్‌జేలీజే అనే ప్రసిద్ధిగాంచిన వీధిలో వరుసగా ఉన్న 300 చెట్లమీద 1,00,000 కన్నా ఎక్కువ బల్బులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కొరియాలోని సీయోల్ నగరపు వాణిజ్య ప్రాంతంలో ఉన్న ఒక వీధిలోని ఒక పెద్ద క్రిస్మస్ చెట్టును ఒక ప్రముఖ డిపార్ట్‌మెంట్ స్టోర్ ఆకర్షణీయంగా అలంకరించింది. ఆ చెట్టు ఆ రాత్రి ఆ రాజధాని నగరాన్నంతటినీ తేజోమయం చేసింది. త్వరలోనే దాని వీధులు క్రిస్మస్ అలంకరణలతో ఆడంబరంగా కనిపించాయి.
టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలూ క్రిస్మస్ కార్యక్రమాలను ప్రతి రోజు సమర్పిస్తూనే ఉంటాయి. క్రిస్మస్ మూడ్‌లో దేశమంతా కూడా ఆ సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంలో లీనమౌతుంది. సీయోల్‌లోని అనేకానేక చర్చీలు అతి త్వరగా అలంకరించుకుని సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. నవంబరు చివర్లో, అమెరికా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే థ్యాంక్స్‌గివింగ్ డే పండుగను ఆచరిస్తుండగా, కొరియా దేశమూ, మరితర ప్రాచ్యదేశాలూ క్రిస్మస్ ఉత్సాహంతో నిండి ఉంటాయి.
ప్రాచ్యంలోని అనేక దేశాలు క్రైస్తవ మత సామ్రాజ్యంలో భాగంగా పరిగణించబడడం లేదు. ఉదాహరణకు, కొరియాలో కేవలం 26.3 శాతం జనాభా మాత్రమే క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. హాంగ్‌కాంగ్‌లో 7.9 శాతం మందీ, తైవాన్‌లో 7.4 శాతం మందీ, జపాన్‌లో కేవలం 1.2 శాతం మందీ మాత్రమే. స్పష్టంగా, ప్రాచ్యంలో ఉన్న అనేక దేశాలు క్రైస్తవత్వాన్ని ఆచరించవు, కానీ అక్కడి వాళ్ళకు క్రిస్మస్‌ను వేడుకగా జరుపుకోవడంలో అభ్యంతరమేమీ లేనట్లుంది. వాస్తవానికి, వాళ్ళు ఈ పండుగంటే పాశ్చాత్య దేశస్థుల కన్నా కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్లు తరచూ కనిపిస్తుంది. ఉదాహరణకు, హాంగ్‌కాంగ్ నివాసుల్లోని అధిక సంఖ్యాకులు బౌద్ధమతస్థులు లేదా టాయోయిస్ట్‌లు అయినప్పటికీ, హాంగ్‌కాంగ్ అత్యాడంబరంగా క్రిస్మస్ జరుపుకుంటున్నట్లు పేరు గాంచింది. చైనాలో కూడా క్రైస్తవులమని చెప్పుకునే వారు కేవలం 0.1 శాతం మంది మాత్రమే ఉన్నప్పటికీ, క్రిస్మస్ అక్కడ శీఘ్రగతిన జనాదరణను పొందుతోంది.
ప్రాచ్య దేశాల్లో క్రిస్మస్ పండుగను ఎందుకు అంత విస్తృతంగా జరుపుకుంటున్నారు? క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు క్రీస్తు జన్మదినంగా దృష్టించే క్రిస్మస్‌ను వేడుకగా జరుపుకోవడంలో, క్రీస్తును మెస్సీయగా అంగీకరించని ప్రజలు ఎందుకు చేరుతున్నారు? క్రిస్మస్‌ను వాళ్ళు దృష్టిస్తున్నట్లు, నిజ క్రైస్తవులూ దృష్టించాలా? సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాచ్య దేశమైన కొరియాలో క్రిస్మస్ జనాదరణగలదిగా ఎలా మారిందో పరిశీలించడం ద్వారా మనం జవాబులను కనుగొంటాం.