అపోకలిప్స్—భయపడాలా లేక నిరీక్షించాలా?
“నేడు అపోకలిప్స్ కేవలమొక బైబిలు సంబంధ విషయం మాత్రమే కాదు గానీ అది తప్పక సంభవించగల సంఘటనగా మారింది.”—జేవియర్ పెరెజ్ డి క్యుల్లర్, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ-జనరల్.
“అపోకలిప్స్” అనే పదాన్ని ఒక ప్రపంచస్థాయి నాయకుడు ఆ విధంగా ఉపయోగించటం, చాలామంది ప్రజలు ఆ పదాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, సినిమాల పేర్లలో, పుస్తకాల పేర్లలో, పత్రికల శీర్షికల్లో, వార్తాపత్రికల నివేదికల్లో ఆ పదం ఏ భావంలో ఉపయోగించబడుతుందో వివరిస్తుంది. ఆ పదం విశ్వనాశనాన్ని గూర్చిన దర్శనాల్ని మనసునకు తీసుకువస్తుంది. అయితే అసలు “అపోకలిప్స్” అనే పదానికి అర్థం ఏమిటి? అంతకన్నా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, బైబిల్లో అపోకలిప్స్ అనే పేరుగల, అంటే ప్రకటన అనే పేరుగల పుస్తకంలోని సందేశం ఏమిటి?
“అపోకలిప్స్” అనే పదం, “వెల్లడిచేయటం” లేదా “ముసుగుతీయటం” అనే అర్థంగల ఒక గ్రీకు మాట నుండి వచ్చింది. బైబిలులోని ప్రకటన గ్రంథంలో ఏమి ముసుగు తీయబడింది లేదా వెల్లడి చేయబడింది? అందులో కేవలం వినాశన సందేశమే ఉందా, అది ఏ ఒక్కరూ బ్రతికి బట్టకట్టని వినాశనానికి పూర్వగామిలాంటిదా? అపోకలిప్స్ అన్న పదానికి అర్థం ఏమని భావిస్తున్నారని అడిగినప్పుడు ఎంస్టీట్యూ డ ఫ్రాంస్ సభ్యుడు చరిత్రకారుడైన ఝాన్ డెల్యూమో ఇలా చెప్పాడు: “ఆ పుస్తకంలో ఓదార్పు నిరీక్షణల సందేశం ఉంది. అందులోని వినాశన వృత్తాంతాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రజలు దానిలోని అసలు విషయానికి రంగులు పులిమారు.”
తొలి చర్చి మరియు అపోకలిప్స్
తొలి “క్రైస్తవులు” అపోకలిప్స్‌ను ఎలా దృష్టించారు? క్రీస్తు భూమిపై చేసే వెయ్యేండ్ల పరిపాలనను (సహస్రాబ్ది) గురించి అది అందజేసే నిరీక్షణను వారు ఎలా దృష్టించారు? అదే చరిత్రకారుడు ఇలా పేర్కొన్నాడు: “నా అభిప్రాయం ప్రకారం తొలి శతాబ్దాల్లోని క్రైస్తవులు చాలామట్టుకు సహస్రాబ్దివాదాన్ని స్వీకరించారు. . . . సహస్రాబ్దిని విశ్వసించిన తొలి శతాబ్దాల్లోని క్రైస్తవ ప్రముఖుల్లో ఆసియా మైనరులోని హైరాపోలిస్ బిషప్ అయిన పాపియస్, . . . పాలస్తీనాలో జన్మించి రోమ్‌లో 165 దరిదాపుల్లో హతసాక్షి అయిన సెయింట్ జస్టిన్, 202లో చనిపోయిన లైయన్స్ బిషప్ అయిన సెయింట్ ఐరీనియస్, 222లో చనిపోయిన టెర్టూలియన్, ఇంకా మహా రచయిత అయిన లాక్టాన్‌షీయస్‌లు ఉన్నారు.
సా.శ. 161లో గాని 165లో గాని పెర్గములో హతసాక్షి అయ్యాడని చెప్పబడుతున్న పాపియస్ గురించి ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “హైరాపోలిస్ బిషప్ అయిన పాపియస్ సెయింట్ యోహాను శిష్యుడు. ఈయన సహస్రాబ్దివాదాన్ని సమర్థించిన వ్యక్తి. ఆయన తన సిద్ధాంతాన్ని అపొస్తలుల సమకాలీనుల నుండి పొందినట్లు చెప్పుకున్నాడు. శిష్యుడైన యోహానును చూసి ఆయన చెప్పినది విన్న ఇతర ‘పెద్దలు,’ ప్రభువు సిద్ధాంతాల్లో భాగంగా సహస్రాబ్ది విశ్వాసాన్ని స్వీకరించారు అని ఐరీనియస్ వివరిస్తున్నాడు. యూసేబియస్ ప్రకారం . . . పాపియస్ తన పుస్తకంలో మృతుల పునరుత్థానం తర్వాత క్రీస్తు యొక్క ఒక వెయ్యి సంవత్సరాల దృశ్య మహిమాన్విత భూరాజ్యం ప్రారంభమౌతుందని దృఢంగా నొక్కిచెప్పాడు.”
అపోకలిప్స్ పుస్తకం అంటే ప్రకటన పుస్తకం, తొలి విశ్వాసులపై చూపిన ప్రభావాన్ని గురించి ఇది మనకు ఏమి చెబుతుంది? అది వారిలో భయాన్ని రేకెత్తించిందా లేక నిరీక్షణను ఏర్పర్చిందా? ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చరిత్రకారులు తొలి క్రైస్తవుల్ని ఖిలియాస్ట్‌లు అని పిలుస్తారు, ఇది ఖిలియా ఏటె (వెయ్యి సంవత్సరాలు) అనే పదాల నుండి వస్తుంది. అవును, వారిలో అనేకులు, భూమిపై పరదైసు పరిస్థితులను తీసుకువచ్చే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో విశ్వాసం ఉంచిన వ్యక్తులుగా మనకు తెలుసు. బైబిల్లో సహస్రాబ్ది నిరీక్షణ గురించి నిర్దుష్టంగా ప్రస్తావించబడింది అపోకలిప్స్‌లో అంటే ప్రకటన గ్రంథంలో మాత్రమే. (20:1-7) కాబట్టి, విశ్వాసులకు భీతిని కల్గించటానికి బదులుగా అపోకలిప్స్ వారికి అద్భుతమైన నిరీక్షణనిచ్చింది. ది ఎర్లీ చర్చ్ అండ్ ద వరల్డ్ అనే తన పుస్తకంలో ఆక్స్‌ఫర్డ్‌లోని చర్చి చరిత్ర సంబంధిత ప్రొఫెసర్ అయిన సీసెల్ కాడూ ఇలా వ్రాస్తున్నాడు: “ఖిలియాస్ట్‌ల దృష్టికోణాలు చివరికి తిరస్కరించబడినా అవి చర్చిలో చాలా కాలమే నమ్మబడేవి, అత్యంత గౌరవనీయులైన రచయితలు కొందరు వాటిని బోధించేవారు.”
అపోకలిప్స్ నిరీక్షణ ఎందుకు తిరస్కరించబడింది?
తొలి క్రైస్తవుల్లో అందరూ కాకపోయినా చాలామంది క్రీస్తు భూ పరదైసుపై వెయ్యేండ్లు పరిపాలిస్తాడని నిరీక్షించారన్నది నిర్ద్వందమైన చారిత్రక వాస్తవం గనుక, అటువంటి “ఖిలియాస్ట్‌ల దృష్టికోణాలు చివరికి” ఎలా “తిరస్కరించబడ్డాయి”? కొన్ని న్యాయమైన విమర్శలే లేచాయి, ఎందుకంటే పండితుడైన రాబర్ట్ మౌన్స్ చెప్పినట్లుగా “విచారకరంగా, చాలామంది ఖిలియాస్ట్‌లు తమ ఊహలకు రెక్కలు కట్టి, వెయ్యేండ్ల కాలంలో నెరవేరనైయున్నాయని తాము భావించిన వస్తుసంబంధమైన కల్పనలు, మనస్సుకు తోచిన స్వైరకల్పనలు చేశారు.” కానీ సహస్రాబ్దిని గూర్చిన నిజమైన నిరీక్షణల్ని తృణీకరించకుండానే ఈ శృతిమీరిన దృక్పథాల్ని సరిచేయటం సాధ్యమై ఉండేది.
సహస్రాబ్దివాదాన్ని అణచివేయటానికి దాని వ్యతిరేకులు ఉపయోగించిన మాధ్యమాలు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. (రెండవ శతాబ్దం చివర్లో, మూడవ శతాబ్దం మొదట్లో జీవించిన), రోమా చర్చిసభ్యుడైన కేయస్ గురించి డీక్స్యోనార్ డ టేయోలజీ కాటోలీక్ ఇలా చెబుతుంది, “సహస్రవాదాన్ని జయించటానికి ఆయన అపోకలిప్స్ [ప్రకటన గ్రంథం] ప్రామాణికత్వాన్నీ సెయింట్ యోహాను వ్రాసిన సువార్త ప్రామాణికత్వాన్నీ నిర్ద్వందంగా తిరస్కరించాడు.” మూడవ శతాబ్దపు అలెగ్జాండ్రియా బిషప్ అయిన డయొనీసియస్, సహస్రవాదానికి వ్యతిరేకంగా వివరణాత్మకమైన ఒక వాదగ్రంథాన్ని వ్రాశాడని ఈ డీక్స్యోనార్ చెబుతుంది. అంతేగాక, “ఈ సహస్రాబ్దివాదాన్ని హత్తుకున్న వారు తమ విశ్వాసాన్ని సెయింట్ యోహాను వ్రాసిన అపోకలిప్స్‌పై ఆధారం చేసుకోకుండా ఉండేందుకుగాను ఈ వాదగ్రంథం దాని ప్రామాణికత్వాన్ని తృణీకరించటానికి కూడా వెనుకాడలేదు” అని కూడా డీక్స్యోనార్ చెబుతుంది. భూమిపై ఆశీర్వాదాలను కుమ్మరించే సహస్రాబ్ది రాబోతున్నదన్న నిరీక్షణకు ఇటువంటి కఠోరమైన వ్యతిరేకత, ఆ కాలంలోని వేదాంతుల్లో పనిచేస్తున్న మోసకరమైన ప్రభావానికి ప్రమాణంగా ఉంది.
ద పర్సూట్ ఆఫ్ ద మిల్లెనియమ్ అనే పేరుగల తన పుస్తకంలో ప్రొఫెసర్ నార్మన్ కోహెన్ ఇలా వ్రాస్తున్నాడు: “సహస్రాబ్దివాదం అబద్ధమని నిరూపించటానికి మొట్టమొదటి ప్రయత్నం మూడవ శతాబ్దంలో జరిగింది. అప్పట్లోని ప్రాచీన చర్చి వేదాంతుల్లోనే బహుశ అత్యంత ప్రముఖుడైన ఒరిగెన్, [దేవుని] రాజ్యం అనేది ఏదైనా ప్రాంతంలోగానీ లేదా సమయంలోగానీ సంభవించే సంఘటన కాదుగాని విశ్వాసుల హృదయాల్లో మాత్రమే ఉండేదని వాదించటం ప్రారంభించాడు.” ఒరిగెన్ బైబిలుపైకాక గ్రీకు తత్త్వజ్ఞానంపై ఆధారపడుతూ మెస్సీయా రాజ్యం ద్వారా భూమిపైకి రాబోయే ఆశీర్వాదాల అద్భుతమైన నిరీక్షణ, “విశ్వాసుల హృదయాల్లో మాత్రమే ఉండే” అవగాహనకు అందని ఒక సంఘటన అని చెబుతూ దాన్ని నీరుగార్చాడు. క్యాథలిక్ రచయిత అయిన లేయోన్ గ్రీ ఇలా వ్రాశాడు: “అతి విస్తృతంగా ఉన్న గ్రీకు తత్త్వజ్ఞాన ప్రభావం . . . క్రమక్రమంగా ఖిలియాస్ట్‌ల తలంపులు కనుమరుగు కావటానికి కారణమైంది.”
“చర్చి తన నిరీక్షణా సందేశాన్ని కోల్పోయింది”
తన కాలానికల్లా నిజ క్రైస్తవత్వానికి కేవలం మసకబారిన ప్రతిబింబంగా ఉన్న “క్రైస్తవత్వాన్ని” గ్రీకు తత్త్వజ్ఞానంతో మిళితం చేసేసిన చర్చి ఫాదర్ నిస్సందేహంగా అగస్టీన్ మాత్రమే. తొలుత సహస్రాబ్దివాదాన్ని గట్టిగా సమర్థించిన వ్యక్తి అయినప్పటికీ ఆయన చివరికి, భవిష్యత్తులో భూమిపై క్రీస్తు వెయ్యేండ్లు పరిపాలన చేస్తాడన్న తలంపుని తృణీకరించాడు. ఆయన ప్రకటన 20వ అధ్యాయానికి అలంకారిక అర్థం ఇస్తూ దాన్ని వక్రీకరించాడు.
ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “చివరికి అగస్టీన్, సహస్రాబ్ది అంటూ ఏదీ ఉండదన్న దృఢ విశ్వాసాన్ని హత్తుకున్నాడు. . . . ఈ అధ్యాయం పేర్కొంటున్న మొదటి పునరుత్థానం అనేది, బాప్తిస్మం సమయంలో జరిగే ఆధ్యాత్మిక పునర్జన్మను సూచిస్తుందని ఆయన చెబుతున్నాడు; ఆరు వేల సంవత్సరాల చరిత్ర తర్వాత వెయ్యేండ్ల సబ్బాతే పూర్తి నిత్య జీవము అని కూడా ఆయన చెబుతున్నాడు.” ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతుంది: “సహస్రాబ్ది సూచనార్థకమైనదన్న అగస్టీన్ వాదం చివరికి చర్చి యొక్క అధికారిక సిద్ధాంతంగా మారిపోయింది. . . . లూథరన్, కల్విన్, ఆంగ్లికన్ ప్రొటెస్టెంట్ సంస్కరణవాదులు . . . అగస్టీన్ దృక్పథాలకే గట్టిగా హత్తుకున్నారు.” ఆ విధంగా క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చి సభ్యులకు సహస్రాబ్ది నిరీక్షణ అనేది లేకుండా పోయింది.
అంతేగాక, స్విస్ వేదాంతి అయిన ఫ్రేడేరిక్ డ రూఝ్‌మోన్ ప్రకారం “వెయ్యేండ్ల పరిపాలనపై తనకున్న తొలి విశ్వాసాన్ని త్యజించటం ద్వారా ఆయన [అగస్టీన్] చర్చికి చెప్పనలవి కానంత నష్టాన్ని కలుగజేశాడు. తనకున్న గొప్ప ఖ్యాతి అధికారాలతో ఆయన భూసంబంధమైన జీవితమనే తలంపునే [చర్చికి] లేకుండా చేసిన ఒక తప్పును ఆమోదించాడు.” సహస్రాబ్దిలో నమ్మకాన్ని తిరస్కరించటం మూలంగా సామాన్య ప్రజానీకానికి “తమకు అర్థమయ్యే మతం” లేకుండా పోయిందనీ, “పాత మతవిశ్వాసం పాత నిరీక్షణల” స్థానే “తాము అర్థం చేసుకోలేని మతవిశ్వాసాన్ని” తీసుకువచ్చిందనీ జర్మన్ వేదాంతి అయిన అడాల్ఫ్ హార్నాక్ ఒప్పుకున్నాడు. ప్రజలకు తాము అర్థం చేసుకోగల్గిన మతవిశ్వాసము, నిరీక్షణా అవసరమనటానికి, అనేక దేశాల్లో శూన్యత ఆవరిస్తున్న నేటి చర్చీలే స్పష్టమైన నిదర్శనం.
హైలైట్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ అనే తన పుస్తకంలో బైబిలు విద్వాంసుడైన జార్జ్ బీజ్లీ-మరీ ఇలా వ్రాశాడు: “ఒకవైపు ప్రధానంగా అగస్టీన్ చూపిన గొప్ప ప్రభావం మూలంగా, మరోవైపు సహస్రాబ్దివాదాన్ని వివిధ మతతెగలు స్వీకరించటం మూలంగా క్యాథలిక్కులూ ప్రొటెస్టెంట్లూ దాన్ని తిరస్కరించటంలో ఐక్యమయ్యారు. మానవునికి ఈ లోకంలో ఎటువంటి ప్రత్యామ్నాయ నిరీక్షణ ఉందని అడిగినప్పుడు అధికారిక జవాబేమిటంటే: ఏమీ లేదు. క్రీస్తు వచ్చినప్పుడు ఈ లోకం నాశనమౌతుంది, నిత్య పరలోకం నిత్య నరకం వస్తాయి, వాటిలో చరిత్ర గతస్మృతుల్లో కలిసిపోతుంది. . . . చర్చి తన నిరీక్షణా సందేశాన్ని కోల్పోయింది.”
అద్భుతమైన అపోకలిప్స్ నిరీక్షణ ఇంకా సజీవంగా ఉంది !
యెహోవాసాక్షుల విషయానికి వస్తే, సహస్రాబ్ది సంబంధంగా ఉన్న అద్భుతమైన వాగ్దానాలు నెరవేరతాయని వారు పూర్తి నమ్మకంతో ఉన్నారు. “2000వ సంవత్సరం: అపోకలిప్స్ భీతి” అనే విషయంపై ఫ్రెంచి టీవీ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేయబడిన ఫ్రెంచి చరిత్రకారుడు ఝాన్ డెల్యుమేయూ ఇలా అన్నాడు: “సహస్రాబ్దివాదుల శ్రేణిలో యెహోవాసాక్షులు కచ్చితంగా నడుస్తున్నారు, ఎందుకంటే వారు త్వరలోనే . . . మనం 1000 సంవత్సరాల సంతోషభరిత కాలంలోనికి—విపత్తుల గుండా అయినప్పటికీ—ప్రవేశిస్తామని చెబుతున్నారు.”
అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో చూసినది సరిగ్గా దీనినే, ఆయన దీన్ని అపోకలిప్స్ పుస్తకంలో అంటే ప్రకటన గ్రంథంలో వర్ణించాడు. ఆయనిలా వ్రాశాడు: “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:1, 3, 4.
సాధ్యమైనంత మంది ఈ నిరీక్షణను హత్తుకునేలా సహాయం చేయటానికి యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఒక బైబిలు విద్యాపనిలో నిమగ్నమైవున్నారు. దీన్ని గురించి మీరు ఇంకా తెలుసుకునేందుకు సహాయపడటానికి వారు సంతోషిస్తారు.
[6వ పేజీలోని చిత్రం]
తాను నేరుగా అపొస్తలుల సమకాలీనుల నుండే సహస్రాబ్ది సిద్ధాంతాన్ని పొందినట్లు పాపియస్ చెప్పుకున్నాడు
[7వ పేజీలోని చిత్రం]
క్రీస్తు సహస్రాబ్ది పరిపాలనలో టెర్టూలియన్ విశ్వాసం ఉంచాడు
[క్రెడిట్ లైను]
© Cliché Bibliothèque Nationale de France, Paris
[7వ పేజీలోని చిత్రం]
“వెయ్యేండ్ల పరిపాలనపై తనకున్న తొలి విశ్వాసాన్ని త్యజించటం ద్వారా ఆయన [అగస్టీన్] చర్చికి చెప్పనలవి కానంత నష్టాన్ని కలుగజేశాడు”
[8వ పేజీలోని చిత్రం]
అపోకలిప్స్‌లో వాగ్దానం చేయబడిన పరదైసు భూమి మనం ఎంతో ఆత్రుతతో ఎదురుచూడాల్సిన నిరీక్షణ