కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 12/1 పేజీలు 3-5
  • అపోకలిప్స్‌ అంటే ఎందుకు భయం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపోకలిప్స్‌ అంటే ఎందుకు భయం?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపోకలిప్స్‌ భీతి చరిత్ర
  • అపోకలిప్స్‌ భీతి న్యాయమేనా?
  • అపోకలిప్స్‌—భయపడాలా లేక నిరీక్షించాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • లోకం త్వరలో అంతం కాబోతుందా? లోకాంతం అంటే ఏమిటి?
    అదనపు అంశాలు
  • ప్రకటన గ్రంథంలో “ఆనందభరిత వార్తలు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ప్రకటన—దాని సంతోషకరమైన ముగింపు!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 12/1 పేజీలు 3-5

అపోకలిప్స్‌ అంటే ఎందుకు భయం?

“దశాబ్దాలపాటు క్రైస్తవమత ఛాందసవాదులు, పూర్తి సమాజ వినాశనం [ఏదో ఒక రీతిలో] చాలా త్వరలో సంభవిస్తుందని ప్రవచిస్తూ వచ్చారు” అని మతాలకు సంబంధించిన రచనలు చేసే డేమియన్‌ థాంప్సన్‌ టైమ్‌ పత్రికలో వ్రాశాడు. “అయితే ఇప్పుడు వారు ఆశ్చర్యపోయేలా చేస్తున్నదేమిటంటే, తాము వర్ణించిన నాశనదిన వర్ణనల్ని ప్రజలు గంభీరంగా తీసుకుంటున్నారు, అంతేకాదు తమను ఇంతకు ముందు ఎగతాళి చేసిన కంప్యూటర్‌ ప్రోగ్రామర్లు, వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు వంటివారే ఆ వర్ణనల్ని పంపిణీ చేస్తున్నారు” అని వ్రాశాడాయన. 2000వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌ ఫెయిల్యూర్‌ జరుగుతుందన్న భయం “పూర్తి లౌకికవాదుల్ని సహితం క్రొత్త సహస్రాబ్దిని గురించి భయపడేవారినిగా చేసింది” అని ఆయన నొక్కి చెప్తున్నాడు. వీరు, “సామూహిక గందరగోళం ఏర్పడుతుందని, ప్రభుత్వాలు స్తంభించిపోతాయని, ఆహారం కోసం హింసా అల్లర్లు చెలరేగుతాయని, ఆకాశహార్మ్యాల్లోకి విమానాలు దూసుకుపోతాయని” ఇంకా అటువంటి వైపరీత్యాలు జరుగుతాయని భయపడుతున్నారు.

సర్వవ్యాప్తంగా ఉన్న చింతలకు, అనేకమైన చిన్న మత గుంపులు చేపట్టే ఆందోళనకరమైన కార్యకలాపాలు తోడౌతున్నాయి. వీరిని “అపోకలిప్టిక్‌” గుంపులు అని పిలుస్తున్నారు. 1999, జనవరిలో “జెరుసలేం, అపోకలిప్స్‌ హెచ్చరికా సంకేతాలు” అనే శీర్షికలో ల ఫేగారో అనే ఫ్రెంచి దినపత్రిక ఇలా చెప్పింది: “ఒలీవల కొండపైనా ఆ చుట్టు ప్రక్కలా క్రీస్తు రెండవ రాకడ కోసమూ లేదా ప్రకటన కోసమూ వేచివుండే ‘సహస్రాబ్దివాదుల’ సంఖ్య వందకు పైగానే ఉందని [ఇజ్రాయెల్‌] భద్రతా శాఖ అంచనా వేస్తుంది.”

1998 బ్రిటానికా బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో “అంతిమ దిన మతతెగల”పై ఒక ప్రత్యేక నివేదిక ఉంది. అందులో హెవెన్స్‌ గేట్‌, పీపుల్స్‌ టెంపుల్‌, ఆర్డర్‌ ఆఫ్‌ ద సోలార్‌ టెంపుల్‌, అలాగే 1995లో టోక్యోలోని భూగర్భ రైల్వేలో 12 మంది ప్రాణాలు బలిగొని వేలాదిమందిని దుష్ప్రభావాలకు గురిచేసిన ప్రాణాంతకమైన విషవాయువును వదిలిన ఓం షిన్రిక్యో (పరమ సత్యం) వంటి ఆత్మహత్యా తెగల పేర్లు మరితర గుంపుల పేర్లు ఉన్నాయి. ఈ నివేదికను ముగిస్తూ యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని మతాల విభాగపు ప్రొఫెసర్‌ అయిన మార్టిన్‌ ఇ మార్టీ ఇలా వ్రాశాడు: “2000వ సంవత్సరారంభం సంచలనాత్మకంగా ఉంటుంది. దాని మూలంగా అనేక రకాలైన ప్రవచనాలు వెలువడతాయి, ఉద్యమాలు ప్రారంభమౌతాయి. కొన్ని ప్రమాదకరంగా తయారు కావచ్చు. దాన్ని తాపీగా ఎదుర్కొందాములే అని అనుకోవటానికి అది సమయం కాదు.”

అపోకలిప్స్‌ భీతి చరిత్ర

అపోకలిప్స్‌, అంటే ప్రకటన అనేది బైబిలులోని చివరి పుస్తకం పేరు. అది సా.శ. మొదటి శతాబ్దం చివర్లో వ్రాయబడింది. ఈ పుస్తకంలోని ప్రవచనాత్మక విషయాలు వాటి సూచనార్థక భాషా దృష్ట్యా “అపోకలిప్టిక్‌” (అపోకలిప్స్‌ సంబంధ) అనే విశేషణాన్ని ఈ బైబిలు పుస్తకమైన ప్రకటన వ్రాయబడటానికి ఎంతోకాలం పూర్వమే ప్రారంభమైన కొన్ని వ్రాతలకు ఇప్పుడు ఉపయోగించటం జరిగింది. ఈ సాహిత్యంలోని కల్పితగాథల్లో ఉపయోగించబడిన సూచనార్థక భాష ప్రాచీన పర్షియా కాలానికి చెందుతుంది, అసలు ఇంకా పూర్వం కూడా అది ఉంది. అందుకని, “[యూదుల అపోకలిప్టిక్‌] సాహిత్యంలో చేర్చబడిన కల్పితగాథాపరమైన అంశాల్లో అత్యధికం విశేషంగా బబులోనుకు మాత్రమే చెందినవిగా ఉన్నాయి” అని ద జ్యూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా పేర్కొంటుంది.

యూదా అపోకలిప్టిక్‌ సాహిత్యం సా.శ.పూ. రెండవ శతాబ్దారంభం నుండి సా.శ. రెండవ శతాబ్దం వరకు వర్ధిల్లింది. ఈ వ్రాతలకు కారణాలను గురించి వివరిస్తూ ఒక బైబిలు పండితుడు ఇలా వ్రాశాడు: “యూదులు కాలాన్ని రెండు యుగాలుగా విభజించారు. ఒకటేమో పూర్తిగా భ్రష్టమైపోయిన ఈ ప్రస్తుత యుగం. . . . అందుకని యూదులు ఇప్పుడున్న విధానానికి అంతం వస్తుందని వేచివున్నారు. రెండవది, రానైయున్న మరో యుగం, అది పూర్తిగా పరిపూర్ణంగా ఉండనైయుంది, అది శాంతి సౌభాగ్యాలు, నీతిన్యాయాలు వర్ధిల్లే దేవుని స్వర్ణయుగం. . . . అయితే, ప్రస్తుతమున్న ఈ యుగం రానైయున్న మరో యుగంగా ఎలా మారనైయుంది? మానవ ప్రయత్నంగా మార్పు రావటం అసంభవమని యూదులు నమ్మారు, అందుకనే వారు దేవుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే సమయం కోసం ఎదురుచూశారు. . . . దేవుని రాకను వారు ప్రభువు దినం అని పిలిచారు, అది ఘోరమైన విధ్వంసం, వినాశనం, తీర్పులు జరుగనైయున్న భయంకరమైన సమయమై ఉంటుంది. అది క్రొత్త యుగానికి ప్రసవవేదన సమయంగా ఉంటుంది. అపోకలిప్టిక్‌ సాహిత్యం సమస్తం ఈ సంఘటనల్నే వర్ణిస్తుంది.”

అపోకలిప్స్‌ భీతి న్యాయమేనా?

బైబిలు పుస్తకమైన ప్రకటన “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అంటే అర్మగిద్దోను అనే యుద్ధం గురించి మాట్లాడుతుంది. అందులో దుష్టులు నాశనం అవుతారు, అటుతర్వాత వెయ్యేండ్ల కాలం (దీన్ని కొన్నిసార్లు సహస్రాబ్ది అని పిలుస్తారు) ప్రారంభమౌతుంది, ఈ కాలంలో సాతాను అగాధంలో పడవేయబడతాడు, క్రీస్తు మానవజాతికి తీర్పు తీరుస్తాడు. (ప్రకటన 16:14, 16; 20:1-4) మధ్య యుగాల్లో ఈ ప్రవచనాల్ని కొందరు అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే క్యాథలిక్‌ “సెయింట్‌” అగస్టీన్‌ (సా.శ. 354-430) సహస్రాబ్ది క్రీస్తు పుట్టినప్పుడే ప్రారంభమైందనీ దీని తర్వాత అంతిమ తీర్పు ఉంటుందనీ పేర్కొన్నాడు. అగస్టీన్‌ కాల ప్రవాహం గురించి ఏమాత్రం ఆలోచించలేదని స్పష్టమౌతుంది, అయితే 1000వ సంవత్సరం దగ్గరపడుతుండగా భయాందోళనలు ఎక్కువయ్యాయి. మధ్యయుగంలోని ఈ అపోకలిప్స్‌ భీతి ఎంత విస్తృతంగా ఉందన్న విషయంపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. అయితే, ఎంత విస్తారంగా ఉన్నా ఆ భయం అనవసరమైనదని తేలింది.

అదే విధంగా నేడు, 2000 గానీ 2001 గానీ ఏదో భయంకరమైన వినాశనాన్ని తీసుకువస్తుందని అటు మతపరమైన ఇటు మతపరం కాని భయాలు ఉన్నాయి. కానీ ఈ భయాలు న్యాయమైనవేనా? బైబిలు పుస్తకమైన ప్రకటనలో లేదా అపోకలిప్స్‌ పుస్తకంలో మనం భయపడాల్సినదేదైనా ఉందా, లేక అందుకు భిన్నంగా, మనం ఎదురుచూడాల్సిన విషయాలు దానిలో ఏమైనా ఉన్నాయా? దయచేసి ముందుకు చదవండి.

[4వ పేజీలోని చిత్రం]

మధ్యయుగాల్లోని అపోకలిప్స్‌ భీతి అనవసరమైనదని రుజువైంది

[క్రెడిట్‌ లైను]

© Cliché Bibliothèque Nationale de France, Paris

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Maya/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి