బైబిలు నేటి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది
బైబిలు నేటి కాలానికి సంగతమైనదేనా? దానికి సమాధానం అవునని ఉండాలంటే, యుగాల నాటిదైన ఈ గ్రంథం దాని పాఠకులకు ప్రస్తుతం ఆసక్తివున్న విషయాల్లోనూ, సంగతమైయున్న విషయాల్లోనూ నడిపింపునివ్వాలి. నేటి ప్రపంచంలో నిజమైన ప్రాముఖ్యత కల్గివున్న విషయాల్లో బైబిలు ప్రయోజనకరమైన ఉపదేశాన్నిస్తుందా?
రెండు తాజా వివాదాంశాలను మనం చూద్దాము. ఈ విషయాల గురించి బైబిలు ఏమి చెప్తుందో మనం పరిశీలిద్దాము.
దేవుడు బాధను ఎందుకనుమతిస్తున్నాడు?
నేడు లోకంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, సర్వసాధారణంగా అడిగే ప్రశ్నేమిటంటే: దేవుడు నిరపరాధులు బాధపడటానికి ఎందుకనుమతిస్తున్నాడు? ఈ ప్రశ్న సహేతుకమైనదే, ఎందుకంటే అనేకులు దౌర్జన్యపూరితమైన నేరం, అవినీతి, జాతి నిర్మూలన, వ్యక్తిగత దుర్ఘటనలు వంటివాటికి గురౌతున్నారు.
ఉదాహరణకు, 1998 జూన్లో ఉత్తర జర్మనీలో ఒక ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఒక బ్రిడ్జిలోకి దూసుకువెళ్లడంతో వందకంటే ఎక్కువమంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. బాధితుల గురించి, మృతుల గురించి శ్రద్ధ తీసుకున్న అనుభవజ్ఞులైన వైద్య బృందాలు, అగ్నిమాపకదళం వారు కూడా జరిగిన ప్రాణనష్టాన్ని చూసి మ్రాన్పడిపోయారు. ఇవాంజిలికల్ చర్చ్ బిషప్ ఒకాయన ఇలా అడిగాడు: “దేవుడా, ఎందుకిలా జరగాలి?” బిషప్ తానే ఏ సమాధానం చెప్పలేదు.
నిరపరాధులైన ప్రజలు దుష్టత్వానికి గురై, దానికి కారణమేమిటన్నదానికి ఏ వివరణా లభించనప్పుడు, వాళ్ళు కటువుగా మారిపోతారు. ఇక్కడే బైబిలు మనకు సహాయం చేయగలదు, ఎందుకంటే అమాయకులైన ప్రజలు ఎందుకు దుష్టత్వానికి, వేదనకు గురౌతారో అది వివరిస్తుంది.
యెహోవా దేవుడు భూమినీ దానిపైనున్న సమస్తాన్నీ సృష్టించినప్పుడు, మానవజాతి దుష్టత్వానికీ, వేదనకూ గురవ్వాలని ఆయన సంకల్పించలేదు. అలాగని మనమెలా నిశ్చయత కల్గివుండవచ్చు? ఎందుకంటే, దేవుడు తాను సృష్టించే పనిని ముగించిన తర్వాత, “తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (ఆదికాండము 1:31) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేనేదైనా చెడ్డదాన్ని చూస్తే, “చాలమంచిదిగ” ఉందని అంటానా?’ ఎంతమాత్రం అనం! అలాగే, దేవుడు సమస్తాన్నీ “చాలమంచిదిగ” ఉందని అన్నప్పుడు, భూమిపైన దుష్టత్వం ఇసుమంతైనా లేదు. మరి దుష్టత్వం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?
మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను సృష్టించిన కొంతకాలం తర్వాత, ఒక శక్తివంతమైన ఆత్మప్రాణి స్త్రీని సమీపించి, యెహోవా సత్యసంధతనూ, ఆయన సర్వాధిపత్య హక్కునూ సవాలు చేశాడు. (ఆదికాండము 3:1-5) అపవాదియగు సాతాను అయిన ఈ ప్రాణి, కష్టసమయాల్లో మానవులు దేవునిపట్ల యథార్థంగా ఉండలేరని అటుతర్వాత ఆరోపించాడు. (యోబు 2:1-5) యెహోవా ఈ పరిస్థితికి ఎలా ప్రతిస్పందించాడు? మానవులు దేవుని సహాయం లేకుండా తమ అడుగులను విజయవంతంగా నిర్దేశించుకోలేరని స్పష్టమయ్యేలా ఆయన సమయం గడిచేందుకు అనుమతించాడు. (యిర్మీయా 10:23) సృష్టిప్రాణులు దేవుని కట్టడలకూ సూత్రాలకూ విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, ఫలితం పాపమే, అది హానికరమైన పరిస్థితులను ఉత్పన్నం చేస్తుంది. (ప్రసంగి 8:9; 1 యోహాను 3:4) అయితే, ఇలాంటి కష్టతరమైన పరిస్థితులున్నప్పటికీ, కొంతమంది మానవులు తనపట్ల తమ యథార్థతను కాపాడుకుంటారని యెహోవాకు తెలుసు.
ఏదెనులో ఆ విచారకరమైన తిరుగుబాటు జరిగి ఇప్పటికి 6,000 సంవత్సరాలు గతించిపోయాయి. అది చాలా సుదీర్ఘమైన కాలమా? యెహోవా సాతానును, అతని మద్దతుదారులను శతాబ్దాల క్రితమే నాశనం చేసివుండేవాడు. కానీ, యెహోవా సర్వాధిపత్య హక్కును గురించిన, ఆయనపట్ల మానవుల యథార్థతను గురించిన ఏ విధమైన అనుమానమైనా తొలగించబడే వరకూ వేచి ఉండటం సరైనది కాదంటారా? ప్రస్తుత న్యాయ వ్యవస్థలో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది నిరూపించబడేందుకు ఒక కోర్టుకేసుకు సంవత్సరాల కాలం పట్టడం లేదా?
యెహోవా మరియు మానవజాతి—విశ్వ సర్వాధిపత్యమూ, మానవుల యథార్థతా—ఎదుర్కుంటున్న వివాదాంశ ప్రాముఖ్యత దృష్ట్యా సమయం గడిచేందుకు దేవుడు అనుమతించడం ఎంత జ్ఞానయుక్తమైనదో కదా! మానవులు దేవుని కట్టడలను అలక్ష్యం చేసి, తమ వ్యవహారాలను తామే చక్కదిద్దుకోవాలనుకున్నప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. తత్ఫలితమే సర్వవ్యాప్త చెడుతనం. అందుకే నేడు ఎంతోమంది నిరపరాధులు బాధలు పడుతున్నారు.
అయితే సంతోషకరంగా, దుష్టత్వం నిరంతరం కొనసాగదని దేవుని వాక్యం సూచిస్తుంది. వాస్తవానికి, త్వరలోనే యెహోవా దుష్టత్వానికీ, దాన్ని జరిగించేవారికీ అంతం తెస్తాడు. “భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు” అని సామెతలు 2:22 చెబుతుంది. మరోవైపున, దేవునిపట్ల నమ్మకంగా ఉండేవారు త్వరలో రానైయున్న, ‘మరణము ఇక ఉండని, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండని’ కాలం కోసం ఎదురు చూడవచ్చు.—ప్రకటన 21:4.
కాబట్టి నిరపరాధులు ఎందుకు బాధలు పడుతున్నారో బైబిలు స్పష్టంగా వివరిస్తుంది. దుష్టత్వమూ, బాధా త్వరలోనే అంతమౌతాయని కూడా అది హామీ ఇస్తుంది. అయితే, మనం ప్రస్తుత జీవిత కష్టాలను అనుభవిస్తుండగా, మరో ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం కావాలి.
జీవిత సంకల్పమేమిటి?
బహుశా మానవజాతి చరిత్రలో మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు, ప్రజలు అసలు జీవితమంటే ఏమిటనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది తమను తాము ఇలా ప్రశ్నించుకుంటారు, ‘నేనెందుకు జీవిస్తున్నాను? నా జీవితంలో నేనెలా అర్థాన్ని కనుగొనగలను?’ ఈ ప్రశ్నలు వేయడానికి వివిధ పరిస్థితులు వారిని పురికొల్పుతాయి.
ఒక వ్యక్తి జీవితం వ్యక్తిగత విషాదం మూలంగా ఛిన్నాభిన్నమైపోయి ఉండవచ్చు. ఉదాహరణకు, 1998 తొలిభాగంలో, జర్మనీలోని బవేరియాలో నివసిస్తున్న 12 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకుపోయి హత్యచేశారు. ఒక సంవత్సరం తర్వాత, తాను ప్రతి దినం జీవిత సంకల్పం కోసం వెదుకుతూ ఉంటాననీ, అదీ విఫలప్రయత్నమేననీ ఆ అమ్మాయి తల్లి అంగీకరించింది. కొంతమంది యౌవనస్థులు జీవితార్థాన్ని గురించి ఆలోచించేలా పురికొల్పబడుతున్నారు. వాళ్లు భద్రతకోసం, సంతృప్తికోసం, ఒకరికి చెందుతామన్న భావనకోసం వెదుకుతారు, కాని విస్తృతంగా వ్యాపించివున్న వేషధారణను, అవినీతిని చూసి వాళ్లు నిరాశ చెందుతారు. ఇతరులు తమ జీవితాలను తమ వృత్తి చుట్టూ నిర్మించుకుంటారు. అయితే, అధికారం, హోదా, సిరిసంపదలూ తమ ఉనికిని గురించిన కారణాన్ని తెలుసుకోవాలన్న తమ అంతర్గత కోరికను సంతృప్తిపర్చలేవని వాళ్లు కనుగొంటారు.
జీవితసంకల్పాన్ని తెలుసుకోవాలని ఒక వ్యక్తిని ఏది పురికొల్పినప్పటికీ, ఈ ప్రశ్నకు గంభీరమైన, సంతృప్తికరమైన సమాధానం మాత్రం అవసరం. ఈ విషయంలో కూడా బైబిలు ఎంతో ప్రయోజనకరమైనదై ఉండగలదు. యెహోవా సంకల్పంగల దేవుడనీ, ఆయన చేసే వాటన్నిటికీ సరైన కారణాలు ఉంటాయనీ అది చూపిస్తుంది. మేమిలా అడుగుతున్నాము, ఏ కారణం లేకుండా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటారా? అనుకోకపోవచ్చు, ఎందుకంటే, ఒక ఇంటిని కట్టడానికి ఎంతో డబ్బు వెచ్చించవలసి ఉంటుంది లేదా ఆ నిర్మాణ పనికి ఎన్నో నెలలు లేక సంవత్సరాలు పట్టవచ్చు. మీరు గానీ లేదా మరెవరైనా గానీ అందులో నివసించాలనే మీరు ఒక ఇల్లు కుట్టుకుంటారు. అదే తర్కాన్ని యెహోవాకు అన్వయించవచ్చు. ఆయన ఒక కారణం గానీ, సంకల్పం గానీ లేకుండా భూమినీ దాని మీదున్న ప్రాణులనూ సృష్టించేందుకు శ్రమ తీసుకోలేదు. (పోల్చండి హెబ్రీయులు 3:3.) భూమిపట్ల ఆయనకున్న సంకల్పమేమిటి?
యెహోవా ‘భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచిన’ సత్యదేవుడని యెషయా ప్రవచనం తెలియజేస్తుంది. నిజానికి, ‘భూమి నిరాకారముగానుండునట్లు సృజింపకుండా నివాసస్థలమగునట్లు దాని సృజించినది’ ఆయనే. (యెషయా 45:18) అవును, భూమి సృజింపబడినప్పటి నుండి, దాని మీద మానవులు నివసించాలన్నది యెహోవా సంకల్పం. కీర్తన 115:16 ఇలా చెప్తుంది: “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” కాబట్టి, భూమి గురించి శ్రద్ధ వహించే విధేయులైన మానవులు భూమి మీద నివసించడానికి ఆయన దాన్ని సృష్టించాడని బైబిలు చూపిస్తుంది.—ఆదికాండము 1:27, 28.
ఆదాము హవ్వలు చేసిన తిరుగుబాటు యెహోవా తన సంకల్పాన్ని మార్చుకునేలా చేసిందా? లేదు. అలాగని మనమెలా అంత నిశ్చయత కల్గివుండవచ్చు? ఈ విషయాన్ని పరిశీలించండి: ఏదెనులో తిరుగుబాటు జరిగిన వేలాది సంవత్సరాల తర్వాత బైబిలు వ్రాయబడింది. దేవుడు తన ఆది సంకల్పాన్ని విడిచిపెట్టి ఉంటే, బైబిల్లో అది ఎందుకు ప్రస్తావించబడలేదు? స్పష్టంగా మనమే ముగింపుకు రావచ్చంటే, భూమిపట్ల, మానవజాతిపట్ల ఆయనకున్న సంకల్పం మారలేదు.
అంతేగాక, యెహోవా సంకల్పం ఎన్నడూ నెరవేరకుండా ఉండదు. యెషయా ద్వారా దేవుడు ఈ హామీనిస్తున్నాడు: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11.
దేవుడు మననుండి అపేక్షిస్తున్నది
మరి స్పష్టంగా, భూమి విధేయులైన మానవులచే నిరంతరం నిండివుండాలన్న దేవుని సంకల్ప నెరవేర్పులో మనం నమ్మకం కల్గివుండవచ్చు. భూమిపై శాశ్వతంగా జీవించే ఆధిక్యత పొందేవారిలో మనమూ ఉండాలంటే, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి” అని జ్ఞానవంతుడైన సొలొమోను రాజు చెప్పినట్లు మనం చేయాలి.—ప్రసంగి 12:13; యోహాను 17:3.
మానవజాతిపట్ల దేవునికున్న సంకల్పానికి అనుగుణ్యంగా జీవించడమంటే, సత్య దేవుని తెలుసుకుని, పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడినట్లుగా ఆయన కోరేవాటికి అనుగుణ్యంగా మార్పులు చేసుకోవడమే. మనమిప్పుడలా చేస్తే, పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణను కల్గివుండవచ్చు, దానిలో మనం ఎప్పుడూ దేవుని గురించి ఆయన అద్భుతమైన సృష్టి గురించి క్రొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాము. (లూకా 23:43) ఎంతటి పులకరింపజేసే ఉత్తరాపేక్ష!
జీవితంలో సంకల్పం కోసం వెదికే అనేకులు, బైబిలు వైపు తిరిగి ఇప్పుడే గొప్ప ఆనందాన్ని కనుగొంటున్నారు. ఉదాహరణకు, ఆల్ఫ్రెడ్ అనే యౌవనస్థుడు జీవితంలో ఏ అర్థాన్నీ కనుగొనలేకపోయాడు. యుద్ధంలో మతం పాల్గొనడం ఆయనకు ఏవగింపు కలిగించింది, రాజకీయాల్లో ఉన్న వేషధారణను, అవినీతిని చూసి ఆయన విసుగుచెందాడు. ఆల్ఫ్రెడ్ జీవిత సంకల్పాన్ని గురించి తెలుసుకోవాలనే ఆశతో ఉత్తర అమెరికాలోని ఆదివాసులను కలిశాడు, కాని ఆశాభంగం చెంది ఐరోపాకు తిరిగి వచ్చాడు. నిరాశతో, అతడు మాదక ద్రవ్యాలకు, విశృంఖల సంగీతానికి బానిసయ్యాడు. అయితే, బైబిలును క్రమంగా, జాగ్రత్తగా పరిశీలించడం, జీవితంలోని నిజమైన సంకల్పాన్ని గుర్తించడానికీ, సంతృప్తిని కనుగొనడానికీ ఆల్ఫ్రెడ్కు సహాయం చేసింది.
మన త్రోవకు, ఆధారపడదగిన ఒక వెలుగు
అయితే, బైబిలు గురించి మనమే ముగింపుకు రావచ్చు? అది నేడు సంగతమైనదేనా? నిజంగా సంగతమైనదే, ఎందుకంటే అది నేటి వివాదాంశాల్లో నడిపింపునిస్తుంది. దుష్టత్వానికి కారణం దేవుడు కాదని బైబిలు వివరిస్తుంది, జీవితంలో సంతృప్తికరమైన సంకల్పాన్ని కనుగొనడానికి అది మనకు సహాయం చేస్తుంది. అంతేగాక, నేటి అత్యంతావశ్యకమైన ఇతర విషయాల గురించి బైబిలు ఎంతో తెలియజేస్తుంది. వివాహం, పిల్లల పెంపకం, మానవ సంబంధాలు, మృతుల కోసం నిరీక్షణ వంటి అంశాల గురించి దేవుని వాక్యంలో ప్రస్తావించబడింది.
మీరు ఇంతవరకు బైబిలులోని విషయాలను పరిశీలించకపోతే, దయచేసి ఇప్పుడు పరిశీలించండి. జీవితం కోసం అదిచ్చే నిర్దేశక సూత్రాల నిజమైన విలువను మీరు ఒక్కసారి కనుగొన్నారంటే, మీరు కీర్తన గ్రంథకర్తలా భావిస్తారు, ఆయన నడిపింపు కోసం యెహోవా వైపు చూసి, ఇలా పాడాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”—కీర్తన 119:105.
[6వ పేజీలోని చిత్రం]
నిరపరాధులు బాధపడేందుకు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో మీకు తెలుసా?
[7వ పేజీలోని చిత్రం]
మీరు సంకల్పవంతమైన జీవితాన్ని ఆనందించవచ్చు