వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్ సమర్పణ—యెహోవాకు ఒక పండుగ
ప్రాచీన కాలాల నుండీ, ఆనందభరితమైన పండుగలు సత్యారాధనలో ఒక భాగమైవున్నాయి. ప్రాచీన ఇశ్రాయేలులో జరిగిన కొన్ని పండుగలు రోజుల తరబడి జరిగేవి, వేలాదిమంది యెహోవా ఆరాధకులు వాటికి హాజరయ్యేవారు. సొలొమోను ఆలయ ప్రారంభోత్సవం ఏడు దినాలపాటు జరిగింది, దాని వెంటనే వారం పొడుగునా ఉండే పర్ణశాలల పండుగ జరిగింది. ఇది, యెహోవా తమతో వ్యవహరించిన అద్భుతమైన విధానం గురించి అవలోకించడానికి ఇశ్రాయేలీయులకు అవకాశాన్నిచ్చింది. వాళ్ళు “యెహోవా . . . చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై” ఇళ్లకు తిరిగివెళ్లారు.—1 రాజులు 8:66.
అమెరికాలోని న్యూయార్క్ నందలి పాటర్సన్లోవున్న వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్లో, 1999, మే 17- 22 వరకు జరిగినది, సందర్శకులకు ప్రాచీన కాలంనాటి ఆ ఆనందభరితమైన పండుగలను జ్ఞప్తికి తెచ్చింది. భూగోళవ్యాప్త బైబిలు విద్యను పెంపొందింపజేయడానికి రూపొందించబడిన 28-భవనాల సముదాయ సమర్పణపై కేంద్రీకరించబడిన ప్రత్యేకమైన కార్యక్రమం జరిగిన వారమది. ప్రధాన కార్యాలయంలోవున్న—బ్రూక్లిన్, వాల్కిల్, పాటర్సన్లలో ఉన్న—5,400 మంది సభ్యులందరూ ఆ విశేషమైన వారంలో పాటర్సన్లోని భవనసౌకర్యాలను గురించిన అవగాహన ఏర్పరచుకోవడానికి టూర్లు ఏర్పాటు చేయబడ్డాయి. అతిథులలో, ఎడ్యుకేషనల్ సెంటర్ నిర్మాణ పనిలో భాగం వహించిన 500 కన్నా ఎక్కువమంది మాజీ స్టాఫ్ మెంబర్లు, వాచ్ టవర్ సొసైటీ యొక్క 23 బ్రాంచీల ప్రతినిధులు, సమీప సంఘాల నుండి వచ్చిన ఇతరులు ఉన్నారు, మొత్తం కనీసం 8,100 మంది.
టూర్ ప్రదర్శనలు విజ్ఞానాన్ని అందజేశాయి
సందర్శకులకు ఎడ్యుకేషనల్ సెంటర్‌తో పరిచయం ఏర్పరచేందుకు ప్రత్యేకమైన ప్రదర్శనలు, ఎడ్యుకేషనల్ వీడియో ప్రదర్శనలు, సెల్ఫ్ గైడెడ్ టూర్లు ఏర్పాటు చేయబడ్డాయి. యేసు భూపరిచర్య సమయంలో యెరూషలేములోవున్న ఆలయ నమూనాను తయారు చేసి దాన్ని మెయిన్ లాబీలో పెట్టారు, సందర్శకులు వెంటనే దానివైపు ఆకర్షించబడేవారు. వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్, చారిత్రకమైన సమావేశాలు, సంఘకూటాలు, ఆధునిక దినాల్లోని గృహబైబిలు పఠనాల్లో వచ్చిన అభివృద్ధి వంటివాటిని చూపించే వ్యాఖ్యానసహితమైన ఇతర చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. అలాంటి గృహబైబిలు పఠనాలు ప్రతి వారం లక్షల సంఖ్యలో నిర్వహించబడుతున్నాయి, అలాంటి కార్యకలాపాలు కొనసాగేందుకు లీగల్ డిపార్ట్మెంట్ నిర్వహించే పనిని తెలియజేసే వ్యాఖ్యానసహిత చిత్రాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఈ పని అంతా కూడా, మత్తయి 28:19, 20 నందు వ్రాయబడివున్న యేసు ఇచ్చిన ఆజ్ఞకు విధేయంగా చేయడం జరుగుతోంది.
సమర్పణ ఉత్సవాలను సందర్శించడానికి వచ్చిన వారి కోసం, లాబీకి ప్రక్కగానున్న ఆడిటోరియమ్‌లో 33-నిమిషాల వీడియో చూపించబడింది, “శక్తితో కాదు—నా ఆత్మతో!” అన్నది ఆ వీడియో పేరు, ఆ ఆడిటోరియమ్‌లో 1,700 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఎలా ఉనికిలోకి వచ్చిందో ఆ వీడియో చూపించింది. విషయాలను యెహోవా నిర్దేశిస్తున్నాడనీ, ఈ 15-సంవత్సరాల బృహత్పథకాన్ని ముగింపుకు తీసుకురావడానికి జరిగిన కృషిపై ఆయన ఆశీర్వాదం ఉందనీ స్పష్టంగా సూచించే సంఘటనల గురించి, అక్కడ చేయబడిన ఇంటర్వ్యూలు తెలియజేశాయి. వాస్తవంగా నిర్మాణపనిలో వేలాదిమంది పాల్గొన్నారు. 1994లో ఒక సందర్భంలో, 526 మంది పనివాళ్లు పనిచేశారు, వారిలో 350 మంది పూర్తికాల స్వచ్ఛంద సేవకులు, 113 మంది తాత్కాలిక పనివాళ్లు, 63 మంది ప్రతి రోజు సహాయం చేయడానికి వచ్చిపోయే వారు ఉన్నారు. ఇంకా చాలామంది తమ విరాళాల ద్వారా ఈ పనికి మద్దతునిచ్చారు. యెహోవా ఆత్మ లేకుండా ఇదంతా సాధ్యమై ఉండేదికాదని వాళ్లంతా గుర్తిస్తారు.—జెకర్యా 4:6.
ఎడ్యుకేషన్ సెంటర్లో జరుగుతున్న పని కేంద్రీకరించేది దైవిక బోధను పెంపొందింపజేయడం పైనే అని టూర్‌కు వచ్చిన వారు చూడగలిగారు. పాఠశాల భవనంలోని మొదటి అంతస్థులోవున్న గిలియడ్ పాఠశాల ముఖ ద్వారం దగ్గర పెట్టబడిన వ్యాఖ్యానసహిత చిత్రాలు సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వాన్నీ, పాఠశాల చరిత్రనూ ఉన్నతపర్చాయి. గిలియడ్ పాఠశాల, న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్లోవున్న దాని మొట్టమొదటి కాంపస్‌లో 1943లో జరిగిన మొదటి గిలియడ్ తరగతి మొదలుకొని ఇప్పటి వరకు 7,000 కన్నా ఎక్కువమంది విద్యార్థులకు మిషనరీ సేవలో తర్ఫీదునిచ్చింది. పాఠశాల భవనంలోని రెండవ అంతస్థులో ప్రదర్శించబడిన వ్యాఖ్యానసహిత చిత్రాలు, బ్రాంచి కమిటీ సభ్యుల పాఠశాలకు, ప్రయాణ పైవిచారణకర్తల పాఠశాలకు సంబంధించిన దృశ్యాలను చూపించాయి, ఈ రెండు పాఠశాలల తరగతులూ అక్కడే నిర్వహించబడతాయి. బ్రాంచి పాఠశాల 1995 నవంబరులో ప్రారంభమైనప్పటి నుండీ, 106 దేశాలనుండి వచ్చిన 360 మంది బ్రాంచి కమిటీ సభ్యులకు పురోభివృద్ధికరమైన ఉపదేశాన్ని ఇచ్చింది.
సందర్శకులు టూర్‌కు వెళ్లినప్పుడు, అనేక ప్రాంతాల్లో తాము ప్రదర్శించబడిన చిత్రాల కంటే ఎక్కువే చూడగల్గుతున్నామని వెంటనే గ్రహించారు. వాళ్లు వివిధ విభాగాల్లోకి నేరుగా వెళ్లిపోయి, కార్యాలయాలను, ఇతర పని స్థలాలను సందర్శించి, అక్కడ జరిగే పని గురించి లోతైన అవగాహన ఏర్పరచుకోగలిగారు. ఆ టూర్లో ఒక ఉన్నతాంశం ఆడియో/వీడియో సేవల భవనం. బైబిలు విద్యను పెంపొందింపజేయడానికి అక్కడ ఎంతో చక్కని సౌకర్యాలు ఉపయోగించబడుతున్నాయి! స్వరాలు ఎలా రికార్డు చేయబడతాయో, వీడియోలు ఎలా తయారు చేయబడతాయో అర్థం చేసుకునేందుకు సమాచారంతో నిండిన చిత్ర ప్రదర్శన పరంపరలూ, స్వల్పకాలిక వీడియోలూ సందర్శకులకు సహాయం చేశాయి. రంగస్థల సంబంధమైన వస్తుసామగ్రిని, నటీనటుల వస్త్రాలనూ సిద్ధం చేయడానికి ఎంత విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంటుందనే దాని గురించి వాళ్లు కొంత తెలుసుకున్నారు. అతితక్కువ ఖర్చుతో, ప్రతి చిన్న వివరణకూ విశేషమైన అవధానాన్నిస్తూ రంగస్థల సెట్లు ఎలా సమకూర్చబడతాయో వాళ్లు చూశారు. ప్రజలు తాము చూస్తున్న దృశ్యంలో తాము స్వయంగా ఉన్నట్లు భావించేలా చేసేందుకు సంగీతం ఎలా ఉపయోగించబడుతుందో వాళ్లు చూశారు. 1990 నుండి సంస్థ 41 భాషల్లో పది వీడియోలను ఉత్పత్తి చేసింది, వాటిలో వివిధ బైబిలు అంశాలు ఉన్నతపర్చబడ్డాయి, అంతేగాక అమెరికన్ సంజ్ఞా భాషను ఉపయోగించే వారికోసం అదనంగా ఇతర వీడియోలను ఉత్పత్తి చేసింది.
టూర్‌కు వచ్చినవాళ్లు చాలామంది ఫోటో లాబ్‌కు, ఆర్ట్ డిపార్ట్మెంట్కు, కంప్యూటర్ ట్రైనింగ్ మరియు సపోర్ట్ అందజేసే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌కు, 11,242 సంఘాల కార్యకలాపాల గురించీ 572 మంది ప్రయాణ పైవిచారణకర్తల గురించీ శ్రద్ధ వహించే సర్వీస్ డిపార్ట్మెంట్కు, ప్రతి సంవత్సరం దాదాపు 14,000 ఎంక్వైరీలతో వ్యవహరించే రైటింగ్ కరస్పాండెన్స్‌కు వెళ్లారు. బయటికి పంపబడే ఉత్తరాల వెనుకనున్న పరిశోధనను బట్టి, గంభీరమైన సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేసే ఎంక్వైరీలు చేసినవారిపట్ల చూపించబడిన నిజమైన శ్రద్ధను బట్టి వాళ్లు ఎంతగానో ప్రభావితమయ్యారు.
వెల్లువలా టూర్‌కు వస్తున్న సందర్శకులు ట్రాన్స్లేషన్ సర్వీసెస్‌ను కూడా దర్శించారు. సంస్థ బైబిలు సాహిత్యాన్ని ప్రచురిస్తున్న భాషల సంఖ్యకు, గత ఐదు సంవత్సరాల్లో 102 భాషలు అదనంగా చేర్చబడ్డాయని తెలుసుకుని వాళ్లు ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 80 శాతం మంది యెహోవాసాక్షులు సంస్థ ప్రచురణలను ఆంగ్లేతర భాషల్లో చదువుతారు. వారి అవసరాలను తీర్చడానికి, 100 దేశాల్లో, 1,700 కంటే ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు అనువాదపు రంగంలో పని చేస్తున్నారు. అమెరికాల, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా భాషల్లో కావలికోటలు ప్రదర్శనగా ఉంచబడ్డాయి. సందర్శకులు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిలును, అది ప్రచురించబడిన 31 భాషల్లోనూ చూడగలిగారు. వాచ్ టవర్ ప్రచురణలు ఇప్పుడు 332 భాషల్లో అందుబాటులో ఉన్నాయనీ, వాటిలో, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు 219 భాషల్లో అందుబాటులో ఉందనీ వాళ్లు తెలుసుకున్నారు.
లీగల్ డిపార్ట్మెంట్కు వచ్చిన సందర్శకులకు, ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైన అవధానం అవసరమైన వివిధ రంగాలు చూపించబడ్డాయి. ఒక వీడియోలో, రక్తమార్పిడికి సంబంధించిన ఒక కోర్టు కేసులో సాక్షి తరపు న్యాయవాది వాదిస్తున్న అసలైన కోర్టు విచారణను వాళ్లు చూశారు. సువార్తను బహిరంగంగా ప్రకటించడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు ఏమి చేయడం జరుగుతుందో కూడా వాళ్లు తెలుసుకున్నారు. (ఫిలిప్పీయులు 1:7) అమెరికానందలి న్యూజెర్సీ ప్రాంతంలో తమ ఇంటింటి పరిచర్యయైన బహిరంగ పరిచర్యలో పాల్గొనాలనుకునే యెహోవాసాక్షులపై విధించబడిన పర్మిట్‌ను, వాళ్లు బాడ్జి ధరించాలనే అవసరాన్ని తొలగించే విధంగా తమ చట్టాలను మార్చుకోమని ఈ సంవత్సరం మార్చిలో ఓర్డెల్ పట్టణ ప్రభుత్వాన్ని నిర్దేశించిన ఒక ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ణయానికి అవధానం ఇవ్వడం జరిగింది.
అయితే సందర్శకులు చూసింది ఇది మాత్రమే కాదు. గోడలను తయారు చేసే షాపులోని నిర్మాణ చిత్రాల ప్రదర్శనలను వాళ్లు పరిశీలించారు, మరితరవాటితో పాటు, వ్యర్థజల శుద్ధీకరణ సౌకర్యాలను, పవర్ హౌస్‌ను, జల మృదుకరణ సౌకర్యాలను, అనేకానేక ఇతర మెయింటెనెన్స్ షాపులను వాళ్లు దర్శించారు. అది చాలా అరుదైన అవకాశం.
సమర్పణ కార్యక్రమం దైవిక విద్యను నొక్కిచెప్పడం
అసలు సమర్పణ కార్యక్రమం మే 19, బుధవారం సాయంకాలం 4:00 గంటలకు ప్రారంభమైంది. ఆనందభరితులైన 6,929 మంది సమూహంలో, ప్రధాన కార్యాలయ సిబ్బంది సభ్యులు, సంస్థ అతిథులు, కెనడా బ్రాంచిలో సమావేశమై ఎలక్ట్రానికల్‌గా లింకుచేయబడిన 372 మంది ఉన్నారు.
వాచ్ టవర్ సంస్థ అధ్యక్షుడైన మిల్టన్ జి. హెన్షెల్ పలికిన ఆప్యాయతతో కూడిన ఆహ్వాన పలుకులను విని ప్రేక్షకులంతా ఆనందించారు. పరిపాలక సభ సభ్యులలో ఒకరూ, ఆ సందర్భంలో సభాధ్యక్షుడూ అయిన థియోడర్ జారజ్, ఆ తర్వాత విలియమ్ మాలెన్ఫాంట్ను పరిచయం చేశారు. “నిర్మాణ కార్యక్రమ ఉన్నతాంశాలు” అందజేస్తున్నప్పుడు ఆయన, వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్ అభివృద్ధిలో, రూపనిర్మాణంలో, నిర్మాణం వంటి వాటిలో ప్రముఖ పాత్ర వహించిన ముగ్గురు సహోదరులను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలు చేస్తున్న సమయంలో, అసలు నిర్మాణ పని జరిగిన సంవత్సరాల్లో 8,700 తాత్కాలిక పనివాళ్లు తమ స్వంత ఖర్చులను పెట్టుకుని పనిచేయడానికి వచ్చారని తెలియజేయడం జరిగింది. దైవిక బోధ ద్వారా సాధ్యమైన ఐక్యతా ఔదార్యాలను గురించిన ఎంత చక్కని సాక్ష్యం!
తర్వాత, “భూగోళవ్యాప్త పరిధిలో దైవిక విద్య” అనే గోష్ఠి జరిగింది. దాన్ని పరిపాలక సభ సభ్యులు నలుగురు అందజేశారు. దైవిక విద్యకు ఆధారం దేవుని వాక్యమైన బైబిలనీ, అది “ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచూ” ఉండమని క్రైస్తవులను ప్రోత్సహిస్తుందనీ జాన్ ఇ. బార్ నొక్కి చెప్పారు. (కొలొస్సయులు 1:9-10) క్రైస్తవ సంఘ శిరస్సైన యేసుక్రీస్తు నుండి ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోని ప్రతి సభ్యుని వరకు దైవిక విద్య ఎలా దైవపరిపాలనా విధానంలో సంస్థీకరించబడి ఉందో డానియల్ సిడ్లిక్ చర్చించారు. (1 కొరింథీయులు 12:12-27) గోష్ఠిలోని చివరి రెండు భాగాలను గెర్రిట్ లూష్ మరియు క్యారి బార్బర్ ఇచ్చారు, సర్వత్రా ఉన్న ప్రజలను చేరడానికీ, వారు కూడా దేవుని మార్గంలో నడిచేలా వారికి బోధించడానికీ దైవిక విద్య పరిచారకులను ఎలా అర్హులను చేస్తుందో వాళ్లు చూపించారు.—యెషయా 2:1-4; 2 కొరింథీయులు 3:5.
ఈ ఎడ్యుకేషనల్ సెంటర్లో పని చేసే వివిధ పాఠశాలల గురించి ప్రేక్షకులకు పరిచయం ఏర్పరచడానికి, బోధకులతోనూ, ఈ పనిలో నిమగ్నమైయున్న ఇతరులతోనూ ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి, చర్చలు చేయబడ్డాయి. దైవిక విద్యా కార్యక్రమాన్ని భూగోళవ్యాప్త పరిధిలో కొనసాగించడంలో ప్రతి పాఠశాల నిర్వహిస్తున్న పాత్ర గురించి తెలియజేయడం జరిగింది. గిలియడ్ పాఠశాల బైబిలులోని ప్రతి పుస్తకం గురించిన అధ్యయనంపై, యెహోవా ప్రజల ఆధునిక దిన చరిత్రపై, మిషనరీ సేవ కోసమైన సిద్ధపాట్లపై అవధానాన్ని నిలుపుతుందని తెలియజేయబడింది. బ్రాంచి పాఠశాల, బ్రాంచి కమిటీ సభ్యులు ఇమిడివున్న వివిధ రంగాల కార్యకలాపాలను గురించిన అవగాహనాపూర్వక అద్భుతమైన అధ్యయనం. ప్రయాణ పైవిచారణ కర్తల కోసమైన పాఠశాల ప్రయాణిస్తున్న సహోదరుల అవసరాలను తీర్చడానికే గాక, సంఘాలకు ప్రాముఖ్యంగా ప్రయోజనకరమయ్యే ఆధ్యాత్మిక సహాయాన్ని అందజేసేందుకు వారిని ఆయత్తపర్చేవిధంగా కూడా రూపొందించబడింది.
ఆ చక్కని కార్యక్రమాన్ని ముగించడానికి, పరిపాలక సభకు చెందిన లాయిడ్ బ్యారీ, “మన గొప్ప సృష్టికర్తతో కలిసి నిర్మించటం” అనే అంశంపై సమర్పణ ప్రసంగాన్ని ఇచ్చారు. సృష్టికర్తయైన యెహోవా తన సృష్టినంతటిని బట్టి ఆనందిస్తాడనీ, తనతోపాటు ఆనందించమని మనల్ని ఆహ్వానిస్తున్నాడనీ ఆయన తెలియజేశారు. (యెషయా 65:18) “సమస్తమును కట్టినవాడు దేవుడే” గనుక, ఈ నిర్మాణానికంతటికీ ప్రాథమికంగా ఘనత యెహోవా దేవునికే చెందుతుంది. (హెబ్రీయులు 3:3) అలాంటి తలంపులు వ్యక్తపర్చిన తర్వాత ప్రసంగీకుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి, వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌ను, మహా గొప్ప సృష్టికర్తయైన యెహోవాకు సమర్పించాడు.a
వారం పొడవునా జరిగిన ఆ పండుగలకు హాజరైనవారికి అవి చిరకాలం జ్ఞాపకం ఉంటాయనడంలో సందేహం లేదు. వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌ను దర్శించడానికి ఎందుకు ఏర్పాట్లు చేసుకోకూడదు? మన ప్రేమగల సృష్టికర్త గురించి మరింత తెలుసుకోవడానికీ, ఆయన నీతియుక్తమైన ప్రమాణాల ప్రకారం జీవించడానికీ మీరు చేసే మీ కృషిలో అది తప్పక ప్రోత్సాహకరంగా ఉంటుందని మేము నిశ్చయత కల్గివున్నాము.
[అధస్సూచీలు]
a సహోదరుడు బ్యారీ తన భూజీవితాన్ని 1999 జూలై 2న నమ్మకంగా ముగించాడు. కావలికోట అక్టోబరు 1, 1999, పేజీ 16 చూడండి.
[10వ పేజీలోని చిత్రాలు]
క్రిక్కిరిసివున్న ఆడిటోరియమ్, డైనింగ్ రూమ్‌లో ప్రేక్షకుల వెల్లువ
[10వ పేజీలోని చిత్రాలు]
టూర్లు ప్రత్యేకంగా ఆనందభరితమైనవి