తప్పు చేయటానికి తిరస్కరించేంత ధైర్యం కల్గివుండటం
“నాకు పదిహేనేళ్లున్నప్పుడు నేనొక కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాను. అప్పుడు నా సహోద్యోగి నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. తన తల్లిదండ్రులు బయటికెళతారనీ, అక్కడికి అమ్మాయిలు కూడా వస్తారనీ, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందనీ అతడు చెప్పాడు” అని తిమోతి వివరిస్తున్నాడు. చాలామంది యౌవనస్థులు నేడు అలాంటి ఆహ్వానానికి వెంటనే సరే అంటారు. కాని తిమోతి ఎలా ప్రతిస్పందించాడు? “నేను రాననీ, నా క్రైస్తవ మనస్సాక్షిని బట్టి, నాకు వివాహం కాని స్త్రీతో నేను లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనననీ అక్కడికక్కడే అతనికి చెప్పేశాను.”
తన తిరస్కారాన్ని గురించి వివరించేటప్పుడు, తాను చెప్తున్నదంతా యౌవనస్థురాలైన మరో సహోద్యోగి వింటున్నదని తిమోతికి తెలియదు. అతని స్వచ్ఛత ఆమెను ప్రలోభ పెట్టడంతో, త్వరలోనే ఆయన ఆమె కోరినదాన్ని తిరస్కరించాల్సిన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది, అదీ చాలాసార్లు, దాని గురించి మనం తర్వాత పరిశీలిద్దాము.
శోధించబడటం మన కాలాలకే పరిమితం కాదు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. . . . వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.” (సామెతలు 1:10, 15) యెహోవా తానే ఇశ్రాయేలు జనాంగానికి ఇలా ఆజ్ఞాపించాడు: “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు.” (నిర్గమకాండము 23:2) అవును, కొన్నిసార్లు మనం తప్పు చేయాలన్న శోధనను నిరోధిస్తూ, తిరస్కరించవలసి వస్తుంది, అది జనాదరణ పొందిన విధానం కాకపోయినప్పటికీ అలా చేయాల్సి వస్తుంది.
తిరస్కరించటం నేడు ప్రత్యేకంగా ఎంతో ప్రాముఖ్యం
తప్పు చేయటానికి తిరస్కరించటం ఎప్పుడూ అంత సులభం కాదు, ఈ రోజుల్లో అయితే మరీ కష్టం, ఎందుకంటే మనం ఈ విధానపు “అంత్య దినముల”ని బైబిలు పిలుస్తున్న కాలంలో జీవిస్తున్నాము. బైబిలు ప్రవచనం చెప్తున్నట్లుగానే, మొత్తం ప్రజలందరూ సుఖానుభవాన్నీ దౌర్జన్యాన్నీ ప్రేమించేవారిగా తయారయ్యారు, ఆధ్యాత్మికత నైతికత వంటివి వారిలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. (2 తిమోతి 3:1-5) ఒక జెసూట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ పేర్కొన్నట్లుగా, “మనకున్న సాంప్రదాయబద్ధమైన ప్రమాణాలు సవాలు చేయబడ్డాయి, అవి తగినవి కాదని తీర్మానించబడ్డాయి, లేక అవి ఇక ఎంతమాత్రం నాగరికమైనవిగా ఎంచబడటం లేదు. ఇప్పుడిక అసలు ఏవిధమైన నైతిక సూత్రాలూ ఉన్నట్లే అనిపించటం లేదు.” దానికి తగ్గట్లుగానే, ఒక ఉన్నత న్యాయస్థాన జడ్జి ఇలా అన్నాడు: “ఇప్పుడిక విషయాలు మంచీ చెడూ అని స్పష్టంగా ఎంతమాత్రమూ లేవు. ప్రతిదీ ఎటూకానిదిగా తయారైంది. . . . మంచికి చెడుకు మధ్యనున్న తేడాను చాలా తక్కువమంది ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు, పట్టుబడితేనే తప్పు గానీ, అతిక్రమించడం తప్పుకాదు.”
“అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి” అని అలాంటి దృక్పథమున్న ప్రజల గురించి అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 4:18, 19) కాని వాళ్లకు తిప్పలు తప్పవు. యెషయా ఇలా ప్రకటించాడు: “కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ.” (యెషయా 5:20) వాళ్లు ఇప్పుడు తాము విత్తుతున్నదాన్ని కోయడమే గాక, వాళ్లు త్వరలోనే ఘోరమైన “శ్రమ”ను అంటే యెహోవా నుండి ప్రతికూలమైన తీర్పును ఎదుర్కుంటారు.—గలతీయులు 6:7.
“నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు” అని కీర్తన 92:7 చెప్తుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, జీవితం అందరికీ దుర్భరమయ్యేలా చేస్తూ దుష్టత్వమనే ఈ పుష్కలమైన పంట ఇలాగే నిరంతరం కొనసాగదు. వాస్తవానికి, ఈ దుష్టత్వాన్ని పెంపొందింపజేస్తున్న “తరం,” దేవుడు “మహా శ్రమ”లో నాశనం చేసే తరమని యేసు చెప్పాడు. (మత్తయి 24:3, 21, 34) కాబట్టి మనం ఆ శ్రమను తప్పించుకోవాలంటే, మనం దేవుని ప్రమాణాల ప్రకారం తప్పేదో ఒప్పేదో తెలుసుకోవాలి; ఏ విధమైన చెడు అయినప్పటికీ దాన్ని చేయటానికి తిరస్కరించేంత నైతిక బలం కూడా మనకుండాలి. ఇది అంత సులభం కాకపోయినప్పటికీ, యెహోవా మనకు బైబిలు కాలాల్లోని, అలాగే నేటి, కొన్ని ప్రోత్సాహకరమైన ఉదాహరణలను అందజేశాడు.
తిరస్కరించిన ఒక యువకుని నుండి నేర్చుకోవటం
వ్యభిచారాన్ని, జారత్వాన్ని తిరస్కరించటం ప్రాముఖ్యంగా కష్టమన్నట్లు అనిపిస్తుంది, చివరికి క్రైస్తవ సంఘంలోని కొందరికి కూడా కష్టమే అనిపిస్తుంది. ప్రారంభ పేరాలో ప్రస్తావించబడిన తిమోతి, లేఖనాల్లో ఆదికాండము 39:1-12 నందు వ్రాయబడివున్న యువకుడైన యోసేపు ఉదాహరణను మనస్సుకు తీసుకున్నాడు. ఐగుప్తు అధికారి అయిన పోతీఫరు భార్య తనతో సంబంధాలు పెట్టుకోమని యోసేపును పదే పదే ఆహ్వానించినప్పుడు ఆయన నైతిక బలాన్ని చూపించాడు. వృత్తాంతం తెలియజేస్తున్నట్లుగా, యోసేపు అందుకు “ఒప్పక, . . . నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని” అన్నాడు.
దినం తర్వాత దినం పోతీఫరు భార్య ప్రతిపాదనను తిరస్కరించేంత నైతిక బలాన్ని యోసేపు ఎలా సంపాదించుకున్నాడు? మొదటగా, ఆయన క్షణికానందాల కంటే యెహోవాతో తనకున్న సంబంధాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాడు. అంతేగాక, యోసేపు దైవిక ధర్మశాస్త్రం (మోషే ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా రానైయుంది) క్రింద లేకపోయినప్పటికీ, ఆయనకు నైతిక సూత్రాలను గురించిన స్పష్టమైన అవగాహన ఉంది; వ్యామోహంతో నిండి ఉన్న పోతీఫరు భార్యతో వ్యభిచరించటం ఆమె భర్తకే కాకుండా దేవునికి కూడా వ్యతిరేకంగా పాపం చేసినట్లు అవుతుందని ఆయనకు తెలుసు.—ఆదికాండము 39:8, 9.
అదుపుచేయలేని కామాగ్నిని ప్రజ్వరిల్లజేయగల చిన్న కోరికను కూడా రేకెత్తించకపోవటం యొక్క ప్రాముఖ్యతను యోసేపు అర్థం చేసుకున్నాడని స్పష్టమౌతుంది. క్రైస్తవుడు యోసేపు ఉదాహరణను అనుసరించటం జ్ఞానయుక్తమైనది. కావలికోట (ఆంగ్లం) 1957 జూలై 1 సంచిక ఇలా పేర్కొంది: “అతడు తన శారీరక బలహీనతలను గుర్తించాలి, ఇంద్రియ సంబంధమైన కోరికలను లేఖనాధార సరిహద్దురేఖ వరకు అనుసరించి అక్కడే ఆపివేయగలనని అతడు అనుకోకూడదు. అలా చేయటంలో అతడు కొంతసేపటి వరకు విజయం సాధించగల్గినప్పటికీ, అతడు చివరికి ఆ సరిహద్దురేఖను దాటి పాపంలో పడిపోతాడు. తప్పక అలాగే జరుగుతుంది, ఎందుకంటే పెంచిపోషించబడిన కామోద్రేకాలు బలపడి ఆ వ్యక్తిపై గట్టి పట్టును సాధిస్తాయి. అప్పుడిక అతడు వాటి నుండి తన మనస్సును మళ్ళించడం చాలా కష్టమౌతుంది. వాటిని ఆదిలోనే అణచివేసుకోవటమే అతనికి శ్రేష్ఠమైన రక్షణ.”
తప్పు పట్ల ద్వేషాన్నీ, ఒప్పు పట్ల ప్రేమనూ పెంపొందించుకుంటే, ఆదిలోనే అణచివేసుకోవటం సులభమౌతుంది. (కీర్తన 37:27) మనం దానికోసం తీవ్రంగా కృషి చేస్తూనే ఉండాలి—ఎడతెగక చేయాలి. మనమలా చేస్తే, యెహోవా సహాయంతో సరైనదాని పట్ల మన ప్రేమ, తప్పు పట్ల మన ద్వేషం బలపడతాయి. అదే సమయంలో, యేసు సూచించినట్లుగా, శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించమని ఎడతెగక ప్రార్థిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి.—మత్తయి 6:13; 1 థెస్సలొనీకయులు 5:17.
తోటివారి ఒత్తిడిని తిరస్కరించటం
తప్పు చేయటానికి పురికొల్పే మరో ప్రభావం తోటి వారి ఒత్తిడి. ఒక అమ్మాయి ఇలా ఒప్పుకుంది: “నేను ద్వంద్వ జీవితాన్ని గడుపుతున్నాను—స్కూల్లో ఒక జీవితం, ఇంట్లో ఒక జీవితం. స్కూల్లో నేను, నోరు తెరిచినప్పుడల్లా బూతు మాటలనే ఉపయోగించే పిల్లలతో సమయం గడుపుతాను, నేను కూడా వాళ్లలాగే తయారౌతున్నాను. నేనేం చెయ్యను?” కావలసిందల్లా, భిన్నంగా ఉండేందుకైన ధైర్యం. దాన్ని పొందటానికి ఒక మార్గం ఏమిటంటే దేవుని యథార్థ సేవకుడైన యోసేపు వంటివారి గురించి మనకు తెలియజేసే బైబిలు వృత్తాంతాలను చదవటం, వాటి గురించి ధ్యానించటం. చక్కని ఇతర ఉదాహరణలు, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో—తమ తోటి వారి నుండి భిన్నంగా ఉండే ధైర్యంగల నలుగురు యౌవనస్థులు.
బబులోను రాజాస్థానంలో ఇతర యౌవనస్థులతోపాటు విద్యనభ్యసిస్తున్నప్పుడు ఈ నలుగురు ఇశ్రాయేలు యౌవనస్థులు ‘రాజు భుజించు ఆహార పానీయములలో నుండి అనుదిన భాగము’ తినవలసి ఉన్నారు. మోషే ధర్మశాస్త్రంలోని ఆహార నియమాలను ఉల్లంఘించటం ఇష్టం లేక వాళ్లు ఆ ఆహారాన్ని తిరస్కరించారు. దానికి ఎంతో బలం అవసరం, ప్రాముఖ్యంగా ‘రాజు భుజించు ఆహార పానీయాలు’ బహుశ ఎంతో శోధించేవిగానే ఉండి ఉండవచ్చు గనుక వాటిని తిరస్కరించటానికి మరింత బలం అవసరం. మత్తుపానీయాల్లో మునిగితేలమని లేక మాదకద్రవ్యాలను తీసుకోమని లేదా పొగాకు ఉపయోగించమని శోధించబడుతూ, చివరికి ఒత్తిడి చేయబడుతున్న నేటి క్రైస్తవులకు ఈ యౌవనస్థులు ఎంత చక్కని మాదిరి నుంచారు!—దానియేలు 1:3-17.
“మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును” అని యేసుక్రీస్తు ఆ తర్వాత చెప్పినదాని నిజత్వాన్ని కూడా షద్రకు, మేషాకు, అబేద్నెగోలు నిరూపించారు. (లూకా 16:10) పోల్చిచూస్తే చిన్న విషయమైన ఆహార విషయంలో వాళ్లు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం, దానికి యెహోవా ఇచ్చిన చక్కని ప్రతిఫలం, వాళ్లు ఆ తర్వాత మరింత గంభీరమైన పరీక్షను ఎదుర్కోవటానికి బలపర్చిందనడంలో సందేహంలేదు. (దానియేలు 1:18-20) విగ్రహారాధనలో పాల్గొనకపోతే, అగ్నికి ఆహుతైపోవలసి వస్తుందని వాళ్లకు ఆజ్ఞాపించబడినప్పుడు ఆ పరీక్ష వచ్చింది. ఆ ముగ్గురు యౌవనస్థులూ, ఫలితం ఏదైనప్పటికీ యెహోవాను పూర్తిగా విశ్వసిస్తూ ఆయనను మాత్రమే ఆరాధించటానికి ధైర్యంగా నిశ్చయించుకున్నారు. వాళ్ల విశ్వాసాన్నీ ధైర్యాన్నీ బట్టి యెహోవా వాళ్లను మళ్లీ ఒకసారి ఆశీర్వదించాడు—మండుతున్న అగ్నిగుండంలో పడవేసినప్పుడు వాళ్లను మంటలనుండి అద్భుతంగా కాపాడటం ద్వారా ఈసారి వాళ్లను ఆశీర్వదించాడు.—దానియేలు 3:1-30.
తప్పు చేయటానికి తిరస్కరించిన వారి అనేక ఇతర ఉదాహరణలు దేవుని వాక్యంలో ఉన్నాయి. “ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు” మోషే తిరస్కరించాడు, ఇది ఐగుప్తులో “అల్పకాలము పాపభోగము” అనుభవించేందుకు కావలసినంత అవకాశం ఇవ్వగల్గినప్పటికీ ఆయన నిరాకరించాడు. (హెబ్రీయులు 11:24-26) ప్రవక్తయైన సమూయేలు లంచాలు తీసుకోవటం ద్వారా తన అధికారాన్ని దుర్వినియోగం చేయటానికి నిరాకరించాడు. (1 సమూయేలు 12:3, 4) ప్రకటించటం ఆపమని ఆజ్ఞాపించబడినప్పుడు యేసుక్రీస్తు అపొస్తలులు ధైర్యంగా తిరస్కరించారు. (అపొస్తలుల కార్యములు 5:27-29) యేసు చెడుతనాన్నంతటినీ దృఢంగా తిరస్కరించాడు—చివరికి ఆయన జీవితంలోని చివరి క్షణాల్లో సైనికులు “బోళము కలిపిన ద్రాక్షారసము” ఆయనకివ్వ జూపినప్పుడు కూడా ఆయన తిరస్కరించాడు. దాన్ని తీసుకోవటం ఆ క్లిష్ట సమయంలో ఆయన కృత నిశ్చయాన్ని బలహీనపర్చి ఉండేది.—మార్కు 15:23; మత్తయి 4:1-10.
తిరస్కరించటం—జీవన్మరణాలకు సంబంధించిన విషయం
యేసు ఇలా చెప్పాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”—మత్తయి 7:13, 14.
వెడల్పైన దారి జనాదరణ పొందింది, ఎందుకంటే దానిలో ప్రయాణించటం సులభం. దానిలో ప్రయాణించేవారు తమ విషయాల్లో తాము నిమగ్నమై ఉంటారు, శరీర సంబంధమైన ఆలోచనా విధానాన్ని మార్గాలను ఇష్టపడతారు, ఇతరులకు భిన్నంగా ఉండటం వాళ్ళకిష్టం లేదు గానీ సాతాను లోకానికి అనురూపంగా మారాలని కోరుకుంటారు. వాళ్లు దేవుని కట్టడలతో, ప్రమాణాలతో నైతికంగా బంధించబడినట్లు భావిస్తారు. (ఎఫెసీయులు 4:17-19) అయినప్పటికీ, వెడల్పైన దారి ‘నాశనానికి పోతుందని’ యేసు స్పష్టంగా చెప్పాడు.
కాని కేవలం కొందరు మాత్రమే ఇరుకు దారిని ఎంపిక చేసుకుంటారని యేసు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దేవుని కట్టడలు సూత్రాలు తమ జీవితాలను నడిపించాలనీ, అవి తమ చుట్టూ జరుగుతున్న చెడును చేయాలన్న అనేక ప్రేరణలనూ, చేసే అవకాశాలనూ ఎదిరించటానికి తమకు సహాయం చేయాలనీ కేవలం కొద్దిమంది మాత్రమే కోరుకుంటారు. అంతేగాక, ఇంకా చాలా కొద్దిమంది మాత్రమే చెడు కోరికలతో, తోటివారి ఒత్తిడితో, తాము ఎంపిక చేసుకున్న మార్గం మూలంగా రాగల అపహాస్యంతో పోరాడటానికి సిద్ధంగా ఉంటారు.—1 పేతురు 3:16; 4:4.
పాపం చేయటానికి తిరస్కరించేందుకు తాను చేసిన పోరాటాన్ని గురించి వర్ణించేటప్పుడు అపొస్తలుడైన పౌలు ఎలా భావించాడో వీళ్లు పూర్తిగా అర్థం చేసుకుంటారు. నేటి ప్రపంచంలా, పౌలు కాలంనాటి రోమా గ్రీకు ప్రపంచాలు తప్పిదంలో పడిపోవటానికి అవకాశమనే చాలా వెడల్పైన దారిని తెరిచాయి. సరైనదేదో తెలిసిన తన మనస్సు, తప్పు చేయటానికి ఇష్టపడే తన శరీరంతో ఎడతెగని ‘పోరాటం’ జరిపేదని పౌలు వివరిస్తున్నాడు. (రోమీయులు 7:21-24) అవును, తన శరీరం తన ఆధీనంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుందనీ, శరీరం తనపై పెత్తనం చెలాయించినప్పుడు చెడు జరుగుతుందనీ పౌలుకు తెలుసు, కాబట్టి శరీరం కోరేదాన్ని తిరస్కరించటాన్ని పౌలు నేర్చుకున్నాడు. “నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను” అని ఆయన వ్రాశాడు. (1 కొరింథీయులు 9:27) ఆయన అలా ఎలా అదుపులో పెట్టుకోగలిగాడు? ఆయనలా చేసింది తన సొంత శక్తితో కాదు ఎందుకంటే ఆయన సొంత శక్తి ఆ పనిని నిర్వర్తించటానికి సరిపోదు, అయితే దేవుని పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆయనలా చేయగలిగాడు.—రోమీయులు 8:9-11.
ఫలితంగా, పౌలు అపరిపూర్ణుడే అయినప్పటికీ, అంతం వరకూ యెహోవా పట్ల తన యథార్థతను కాపాడుకున్నాడు. తన మరణానికి కొంచెం ముందు ఆయనిలా వ్రాయగలిగాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది.”—2 తిమోతి 4:7, 8.
మనం మన అపరిపూర్ణతలతో పోరాడుతుండగా, మనకు ఎంతో ప్రోత్సాహకరమైన ఉదాహరణలు ఉన్నాయి, అంటే పౌలు మాత్రమే కాదు, ఆయనకు ఉదాహరణగా ఉన్న యోసేపు, మోషే, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఇంకా మరితరులు కూడా ఉన్నారు. వాళ్లు అపరిపూర్ణ మానవులే అయినప్పటికీ, విశ్వాసం గల వీరిలో ప్రతి ఒక్కరూ తప్పు చేయటానికి తిరస్కరించారు, అంటే మొండి పట్టుదల వల్లనో లేక మూర్ఖత్వం వల్లనో కాదు గాని యెహోవా ఆత్మ ఇచ్చిన నైతిక బలంతోనే వాళ్లలా చెప్పగలిగారు. (గలతీయులు 5:22, 23) వాళ్లు ఆధ్యాత్మికత ఉన్న పురుషులు. వాళ్లు యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాటకోసం ఆత్రంగా ఎదురు చూశారు. (ద్వితీయోపదేశకాండము 8:3) ఆయన మాటంటే వారికి జీవమే. (ద్వితీయోపదేశకాండము 32:47) అన్నిటికంటే ఎక్కువగా, వాళ్లు యెహోవాను ప్రేమించారు, ఆయనకు భయపడ్డారు, ఆయన సహాయంతో వాళ్లు ఓర్పుగా చెడు పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు.—కీర్తన 97:10; సామెతలు 1:7.
మనం వాళ్లలా ఉందాము. వాస్తవానికి, చెడుతనాన్నంతటినీ తిరస్కరించటంలో కొనసాగటానికి, వాళ్లకులాగే మనకూ యెహోవా ఆత్మ అవసరం. మనం యెహోవా ఆత్మ కోసం యథార్థంగా అడిగితే, ఆయన వాక్యాన్ని పఠిస్తే, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరైతే, యెహోవా మనకు తన ఆత్మను ధారాళంగా దయచేస్తాడు.—కీర్తన 119:105; లూకా 11:12, 13; హెబ్రీయులు 10:24, 25.
ప్రారంభంలో ప్రస్తావించబడిన తిమోతి, తాను తన ఆధ్యాత్మిక అవసరాలను అలక్ష్యం చేయనందుకు సంతోషించాడు. ఆయన తన సహోద్యోగితో మాట్లాడటాన్ని విన్న యౌవనస్థురాలైన ఆ సహోద్యోగి తిమోతి స్వచ్ఛతచే తప్పుగా ఆకర్షించబడి, తన భర్త లేని సమయంలో రహస్యంగా ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. తిమోతి నిరాకరించాడు. అంత సులభంగా విడిచిపెట్టకుండా ఆమె పోతీఫరు భార్యలా అనేక సందర్భాల్లో మళ్లీ మళ్లీ ఆహ్వానించింది. ప్రతిసారీ తిమోతి దయగానే అయినా దృఢంగా తిరస్కరించాడు. ఆయన దేవుని వాక్యం నుండి ఆమెకు చక్కని సాక్ష్యం కూడా ఇచ్చాడు. తిరస్కరించటానికి కావలసిన నైతిక శక్తిని ఇచ్చినందుకు తిమోతి యెహోవా పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కల్గివున్నాడు. ఇప్పుడాయన చక్కని తోటి క్రైస్తవురాలిని వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నాడు. వాస్తవానికి, తప్పు చేయటానికి తిరస్కరించటం ద్వారా తమ క్రైస్తవ యథార్థతను కాపాడుకోవాలనుకునే వారందరినీ యెహోవా ఆశీర్వదించి, బలపరుస్తాడు.—కీర్తన 1:1-3.