వాళ్లు ‘దేవునికి భయపడ్డారు’
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసత్వం క్రిందనున్నప్పుడు, షిఫ్రా పూయా అనే హెబ్రీయుల మంత్రసానులు ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న విదేశీ జనాభాను అదుపు చేయాలనే ప్రయత్నంలో, ఫరో ఆ స్త్రీలకు ఇలా ఆజ్ఞాపించాడు: ‘మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయునప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడి.’—నిర్గమకాండము 1:15, 16.
షిఫ్రా, పూయా ‘దేవునికి భయపడ్డారు,’ కాబట్టి వాళ్లు ధైర్యం చేసి ‘ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయలేదు.’ బదులుగా, వాళ్లు మగసంతానాన్ని బ్రదుకనిచ్చారు, ధైర్యవంతమైన ఈ చర్య తమకు ప్రమాదం తీసుకురాగలిగినదే అయినప్పటికీ వారలాగే చేశారు. యెహోవా “ఆ మంత్రసానులకు మేలు చేసెను,” వారు చేసిన జీవాన్ని కాపాడే పనినిబట్టి వారికి ప్రతిఫలమిచ్చాడు.—నిర్గమకాండము 1:17-21.
ఇది తన సేవ చేసే వారిపట్ల యెహోవాకున్న మెప్పును నొక్కి తెలియజేస్తుంది. షిఫ్రా, పూయా చేసినది ధైర్యంతో కూడిన పనే అయినప్పటికీ అది కేవలం మానవత్వంతో చేసినదిగా ఆయన దృష్టించగలిగేవాడే. విచక్షణా జ్ఞానంగల ఏ స్త్రీ కూడా శిశువులను చంపదు! అయినప్పటికీ, కొంతమంది మానవులు మనుష్యులకు భయపడి నీచమైన పనులు చేశారన్న వాస్తవాన్ని యెహోవా నిస్సందేహంగా పరిగణలోకి తీసుకున్నాడు. ఈ మంత్రసానులు మానవత్వపు దయచేత మాత్రమే కాదుగాని దేవునిపట్ల భయం మరియు భక్తి వల్ల వారలా చేశారని ఆయనకు తెలుసు.
మన విశ్వాస క్రియలను పరిగణలోకి తీసుకునే దేవుని సేవ చేయగల్గటానికి మనం ఎంత కృతజ్ఞత కల్గివుండాలి! నిజమే, షిఫ్రా, పూయాలపైకి వచ్చినటువంటి విశ్వాస పరీక్షలను బహుశా మనలో ఎవరం ఎదుర్కుని ఉండకపోవచ్చు. అయినప్పటికీ, మనం సరైనదాని కోసం స్థిరంగా నిలబడినప్పుడు—అది పాఠశాలలోనైనా, మన ఉద్యోగస్థలంలోనైనా, లేక మరితర పరిస్థితిలోనైనా—మనం చూపించే యథార్థమైన ప్రేమను యెహోవా అల్పంగా తీసుకోడు. బదులుగా, ఆయన “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడ”వుతాడు. (హెబ్రీయులు 11:6) అవును, “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యంకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.