యెహోవా మన నుండి మరీ ఎక్కువగా అడుగుతున్నాడా?
“న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”—మీకా 6:8.
1. కొందరు యెహోవాను సేవించకపోవడానికి కారణం ఏమైవుండవచ్చు?
యెహోవా తన సేవకుల నుండి అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. కానీ మీకా ప్రవచనం నుండి ఎత్తి వ్రాయబడిన పై మాటల్ని చదివిన తర్వాత దేవుడు కోరే విషయాలు సహేతుకంగానే ఉన్నట్లు మీకన్పించవచ్చు. అయినప్పటికీ చాలామంది మన మహాగొప్ప సృష్టికర్తను సేవించరు, అంతేగాక ఆయన్ను ఒకప్పుడు సేవించినవారు అలానే కొనసాగకుండా మానుకున్నారు. ఎందుకు? ఎందుకంటే దేవుడు తమ నుండి మరీ ఎక్కువ అడుగుతున్నాడని వారు అనుకుంటున్నారు. అది వాస్తవమా? లేదా యెహోవా కోరుతున్న వాటి గురించి ఒక వ్యక్తి కల్గివుండే దృక్కోణంలో ఏదైనా సమస్య ఉన్నట్లా? ఈ విషయంపై చరిత్రలోని ఒక వృత్తాంతం అంతర్దృష్టిని కలుగజేస్తుంది.
2. నయమాను ఎవరు, యెహోవా ప్రవక్త ఏమి చేయమని ఆయనకు చెప్పాడు?
2 నయమాను అనే సిరియా సైన్యాధిపతికి కుష్ఠరోగం, ఆయనను బాగుచేయగల యెహోవా ప్రవక్త ఇశ్రాయేలులో ఉన్నాడని ఆయనకు తెలిసింది. అందుకని నయమాను, తన సాయుధ బలగంతోపాటు ఇశ్రాయేలుకు ప్రయాణించి చివరికి దేవుని ప్రవక్త అయిన ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలుచున్నాడు. ఇంట్లోంచి బయటికి వచ్చి ఈ ప్రముఖ సందర్శకుడిని ఆహ్వానించడానికి బదులుగా ఎలీషా ఒక దూతను పంపి, “నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని” చెప్పమన్నాడు.—2 రాజులు 5:10.
3. యెహోవా చెప్పినది చేయడానికి నయమాను మొదట్లో ఎందుకు తిరస్కరించాడు?
3 దేవుని ప్రవక్త చెప్పిన దానికి నయమాను విధేయత చూపించినట్లైతే ఆ భయంకరమైన రోగం ఆయనకు నయమయ్యేది. కాబట్టి యెహోవా ఆయన నుండి మరీ ఎక్కువగా అడుగుతున్నాడా? అలా అనలేము. అయినా నయమాను యెహోవా కోరినది చేయనంటున్నాడు. “దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా?” అంటూ ఆయన తన అసమ్మతిని తెలిపాడు. “వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా?” అన్నాడాయన. తర్వాత నయమాను రౌద్రంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.—2 రాజులు 5:12.
4, 5. (ఎ) నయమాను చూపిన విధేయతకు ఆయన ఏ ప్రతిఫలాన్ని పొందాడు, అందుకు ఆయన ఎలా ప్రతిస్పందించాడు? (బి) మనం ఇప్పుడేమి పరిశీలిస్తాము?
4 నయమాను సమస్య ఏమిటి అసలు? తనకు చేయమని చెప్పినది కష్టమైన పని అన్నది కాదు సమస్య. నయమాను దాసులు యుక్తినుపయోగించి ఇలా అన్నారు: “ఆ ప్రవక్త యేదైనా నొక గొప్ప కార్యము చేయుమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా?” (2 రాజులు 5:13) సమస్య నయమాను మనోవైఖరిలో ఉంది. తనకు చూపాల్సిన గౌరవం తనకు చూపించలేదనీ, ఎటువంటి ప్రభావమూ ఉండని పనిని అవమానకరమైన పనిని చేయమని తనకు చెప్పారనీ ఆయన భావించాడు. అయితే, తన సేవకులు యుక్తితో ఇచ్చిన సలహాను నయమాను విని యొర్దాను నదిలో ఏడు మారులు మునిగాడు. “అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధు”డైనప్పుడు ఆయన అనుభవించిన ఆనందాన్ని ఊహించండి! ఆయన హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోయింది. అంతేకాదు, తాను ఇది మొదలుకొని యెహోవాను తప్ప మరే ఇతర దేవతనూ ఆరాధించనని నయమాను ప్రకటించాడు.—2 రాజులు 5:14-17.
5 మానవ చరిత్రంతటిలో, వివిధ రకాలైన నియమాలను పాటించమని యెహోవా ప్రజలను అడిగాడు. వీటిలో కొన్నింటిని పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ పరిశీలనలో, అటువంటి నియమాలను యెహోవా మీకిచ్చినట్లైతే మీరు ఏమి చేసివుండేవారని ప్రశ్నించుకోండి. అటుతర్వాత, యెహోవా నేడు మన నుండి ఏమి అడుగుతున్నాడో చూద్దాము.
గతంలో యెహోవా కోరినవి
6. మొదటి మానవ జతను ఏమి చేయమని నిర్దేశించడం జరిగింది, అటువంటి నిర్దేశాలకు మీరైతే ఎలా ప్రతిస్పందించి ఉండేవారు?
6 పిల్లల్ని కని, భూమిని నిండించి, జంతువుల్ని లోపరచుకోమని యెహోవా మొదటి మానవజత అయిన ఆదాము హవ్వలను నిర్దేశించాడు. ఈ నరునికీ నారికీ ఉద్యానవనంలాంటి విశాలమైన గృహం కూడా ఆశీర్వాదంగా లభించింది. (ఆదికాండము 1:27, 28; 2:9-15) కానీ ఒక నిషేధం ఉంది. వారు ఒకానొక వృక్ష ఫలాన్ని తినకూడదు, ఏదెను తోటలోని ఫలాల్ని కాసే అనేకానేక వృక్షాల్లో అది ఒక వృక్షం మాత్రమే. (ఆదికాండము 2:16, 17) ఈ నిషేధం ఇవ్వడం మరీ ఎక్కువగా అడుగుతున్నట్లు కాదు, అవునా? పరిపూర్ణారోగ్యంతో నిరంతరం జీవించే ఉత్తరాపేక్షతో అటువంటి నియామకాన్ని నిర్వర్తిస్తూ మీరు ఆనందించి ఉండేవారు కారా? తోటలో ఒక శోధకుడు కనిపించినా, మీరు వాని వాదనను త్రోసిపుచ్చేవారు కారా? అంతేగాక, అటువంటి చిన్న నిషేధాన్ని విధించే హక్కు యెహోవాకు ఉన్నదని మీరు అంగీకరించరా?—ఆదికాండము 3:1-5.
7. (ఎ) నోవహుకు ఏ నియామకం ఇవ్వబడింది, ఆయన ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు? (బి) యెహోవా నోవహును కోరినదాన్ని మీరెలా దృష్టిస్తారు?
7 అటుతర్వాత, యెహోవా నోవహుకు భౌగోళిక జలప్రళయాన్ని తప్పించుకునేందుకుగాను ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఓడ పరిమాణం చాలా భారీగా ఉండటం దృష్ట్యా దాన్ని నిర్మించే పని కష్టతరమైనది, బహుశ విపరీతమైన ఎగతాళినీ, వ్యతిరేకతనూ ఎదుర్కొంటూ వారు ఆ పనిని నిర్వర్తించాల్సి వచ్చింది. అయినా, తన కుటుంబాన్ని రక్షించే అవకాశం నోవహుకు లభించటం ఎంతటి ఆధిక్యత, ఇక అనేకానేక జంతువుల్ని రక్షించటం గురించి చెప్పనే అక్కరలేదు ! (ఆదికాండము 6:1-8, 14-16; హెబ్రీయులు 11:7; 2 పేతురు 2:5) అటువంటి నియామకం మీకు లభించివుంటే మీరు దాన్ని పూర్తి చేయడానికి గట్టి కృషిచేసి ఉండేవారా? లేక, యెహోవా మీ నుండి మరీ ఎక్కువగా కోరుతున్నాడని ఒక ముగింపుకు వచ్చి ఉండేవారా?
8. అబ్రాహామును ఏమి చేయమని అడగడం జరిగింది, అందుకు ఆయన విధేయత చూపడం ఫలితంగా ఏమి దృష్టాంతపర్చబడింది?
8 దేవుడు అబ్రాహామును చాలా కష్టమైనదే అడిగాడు: “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించు[ము].” (ఆదికాండము 22:2) అప్పటికి ఇంకా సంతానమే కలుగని ఇస్సాకుకు పిల్లలు కలుగుతారని యెహోవా వాగ్దానం చేసినందున, ఇస్సాకును తిరిగి సజీవుణ్ని చేయగల యెహోవా సామర్థ్యంపై అబ్రాహాముకు ఉన్న విశ్వాసం పరీక్షకు గురైంది. అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆ యౌవనస్థుణ్ని కాపాడాడు. ఇది, దేవుడు తన స్వంత కుమారుణ్ని మానవజాతి కోసం అర్పించనైయున్నాడని, తర్వాత ఆయన్ను పునరుత్థానం చేయనైయున్నాడని ఈ సంఘటన దృష్టాంతపర్చింది.—ఆదికాండము 17:19; 22:9-18; యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 2:23, 24, 29-32; హెబ్రీయులు 11:17-19.
9. యెహోవా అబ్రాహాము నుండి మరీ ఎక్కువగా ఎందుకు అడగడం లేదు?
9 యెహోవా అబ్రాహాము నుండి మరీ ఎక్కువ అడుగుతున్నాడని కొందరు అనుకోవచ్చు. కానీ నిజంగా ఎక్కువే అడుగుతున్నాడా? మృతులను పునరుత్థానం చేయగల మన సృష్టికర్త, తనకు మనం విధేయత చూపించాలని అడగడం—విధేయత మూలంగా మనం మృత్యువు ఒడిలో తాత్కాలికంగా నిద్రపోవాల్సి వచ్చినప్పటికీ—ఆయనలా అడగడం నిజంగా ప్రేమ లేకపోవడమా? యేసుక్రీస్తూ ఆయన తొలి అనుచరులూ అలా భావించలేదు. వారు దేవుని చిత్తాన్ని చేయడం కోసం శారీరక బాధల్ని, చివరికి మృత్యువును కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. (యోహాను 10:11, 17, 18; అపొస్తలుల కార్యములు 5:40-42; 21:13) ఒకవేళ పరిస్థితుల మూలంగా అదే అవసరమైతే మీరు కూడా అలానే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తన ప్రజలుగా ఉండటానికి ఒప్పుకున్న కొందర్ని యెహోవా అడిగిన కొన్ని విషయాల్ని పరిశీలించండి.
ఇశ్రాయేలుకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం
10. యెహోవా అడిగిన దానంతటినీ చేస్తామని ఎవరు వాగ్దానం చేశారు, ఆయన వారికి ఏమి ఇచ్చాడు?
10 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు ద్వారా, ఆయన మనుమడైన యాకోబు, అంటే ఇశ్రాయేలు ద్వారా వచ్చిన వంశస్థులు ఇశ్రాయేలు జనాంగంగా తయారయ్యారు. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని బానిసత్వం నుండి విడిపించాడు. (ఆదికాండము 32:28; 46:1-3; 2 సమూయేలు 7:23, 24) అటుతర్వాత కొంతకాలానికి, దేవుడు అడిగిన వాటన్నింటినీ తాము చేస్తామని వారు వాగ్దానం చేశారు. వారిలా అన్నారు: “యెహోవా చెప్పినదంతయు చేసెద[ము].” (నిర్గమకాండము 19:8) తన పరిపాలన క్రింద ఉండాలన్న ఇశ్రాయేలీయుల కోరికకు అనుగుణ్యంగా యెహోవా ఆ జనాంగానికి పది ఆజ్ఞలతోసహా 600 నియమాలను ఇచ్చాడు. కొంతకాలానికి, మోషే ద్వారా దేవుడిచ్చిన ఈ నియమాలు ధర్మశాస్త్రం అని పిలువబడ్డాయి.—ఎజ్రా 7:6; లూకా 10:25-27; యోహాను 1:17.
11. ధర్మశాస్త్రం ఇవ్వడానికిగల ఒక సంకల్పం ఏమిటి, ఆ సంకల్పాన్ని నెరవేర్చిన కొన్ని నియమాలు ఏవి?
11 ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో ఒక సంకల్పం ఏమిటంటే, లైంగిక నైతికత, వ్యాపార లావాదేవీలు, శిశు సంరక్షణ వంటి రంగాల్లో ఇశ్రాయేలీయులకు ఆరోగ్యకరమైన నియమాలను ఇవ్వడం ద్వారా వారిని కాపాడటమే. (నిర్గమకాండము 20:14; లేవీయకాండము 18:6-18, 22-24; 19:35, 36; ద్వితీయోపదేశకాండము 6:6-9) తోటి మానవులతో ఎలా వ్యవహరించాలి, తమ జంతువులతో ఎలా వ్యవహరించాలి అనే వాటి గురించి నియమాలు ఇవ్వబడ్డాయి. (లేవీయకాండము 19:18; ద్వితీయోపదేశకాండము 22:4, 10) వార్షిక పండుగలకు, ఆరాధన కోసం సమకూడే విషయంలోను వర్తించే నియమాలు ఆ ప్రజల్ని ఆధ్యాత్మికంగా సంరక్షించేందుకు సహాయపడ్డాయి.—లేవీయకాండము 23:1-43; ద్వితీయోపదేశకాండము 31:10-13.
12. ధర్మశాస్త్రం ఇవ్వడానికిగల అసలైన సంకల్పం ఏమిటి?
12 ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో అసలైన సంకల్పం ఏమిటో చెబుతూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవరికి ఆ వాగ్దానం చేయబడిందో ఆ సంతానం [క్రీస్తు] వచ్చేంత వరకు అతిక్రమాల్ని స్పష్టం చేయడానికి అది ఇవ్వబడింది.” (గలతీయులు 3:19, NW) ఇశ్రాయేలీయులు అపరిపూర్ణులని ధర్మశాస్త్రం వారికి గుర్తు చేసింది. అందుకని తర్కబద్ధంగా చూస్తే, తమ పాపాల్ని పూర్తిగా తీసివేసే ఒక పరిపూర్ణమైన బలి అవసరం వారికి ఉంది. (హెబ్రీయులు 10:1-4) అందుకని మెస్సీయా లేదా క్రీస్తు అయిన యేసును స్వీకరించేలా ఆ ప్రజల్ని సిద్ధం చేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. పౌలు ఇలా వ్రాశాడు: “మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.”—గలతీయులు 3:24.
యెహోవా ధర్మశాస్త్రము భారమైనదా?
13. (ఎ) అపరిపూర్ణ మానవులు ధర్మశాస్త్రాన్ని ఎలా దృష్టించారు, ఎందుకు? (బి) ధర్మశాస్త్రం నిజంగా భారమైనదా?
13 ధర్మశాస్త్రము “పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై” ఉన్నప్పటికీ అనేకులు దాన్ని భారమైనదిగా పరిగణించారు. (రోమీయులు 7:12) ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది గనుక ఇశ్రాయేలీయులు దాని ఉన్నతమైన ప్రమాణాల్ని చేరుకోలేకపోయారు. (కీర్తన 19:7) అందుకనే అపొస్తలుడైన పేతురు దాన్ని “మన పితరులైనను మనమైనను మోయలేని కాడి” అని పిలిచాడు. (అపొస్తలుల కార్యములు 15:10) దీనర్థం ధర్మశాస్త్రం భారమైనదని కాదు, దాన్ని పాటించడం ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చింది.
14. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రయోజనకరమైన సంకల్పాల్ని నెరవేర్చిందనడానికి కొన్ని ఉదాహరణలు ఏవి?
14 ఉదాహరణకు ధర్మశాస్త్రం క్రింద దొంగతనం చేసిన వ్యక్తిని ఖైదు చేయడం జరగదు, అందుకు బదులుగా తాను దొంగిలించిన దానికి రెండింతలు లేదా అంతకన్నా ఎక్కువ చెల్లించడానికి అతడు పనిచేయాల్సి ఉంటుంది. ఆ విధంగా బాధితునికి ఎటువంటి నష్టమూ ఉండేది కాదు, లేదా కారాగార విధానాన్ని పోషించడానికి, కష్టపడి పనిచేసేవారి మీద భారమూ పడదు. (నిర్గమకాండము 22:1, 3, 4, 7) ఆరోగ్యకరంకాని ఆహారపదార్థాలు నిషేధించబడ్డాయి. పంది మాంసాన్ని సరిగ్గా ఉడికించకపోతే ట్రికినోసిస్ వ్యాధినీ, కుందేళ్ళ మాంసం టులరీమియా అనే వ్యాధినీ కలుగజేయగలవు. (లేవీయకాండము 11:4-12) అదే విధంగా మృత కళేబరాలను ముట్టుకోకూడదనే నిషేధం ఇవ్వడం ద్వారా ధర్మశాస్త్రం ఒక కాపుదలగా ఉంది. ఎవరైనా శవాన్ని ముట్టుకున్నట్లైతే ఆ వ్యక్తి స్నానం చేసి తన వస్త్రాల్ని ఉదుకుకోవల్సి ఉంటుంది. (లేవీయకాండము 11:31-36; సంఖ్యాకాండము 19:11-22) మలవిసర్జనము భూమిలో కప్పివేయాలి, దీని ద్వారా క్రిములు వ్యాప్తి చెందకుండా ఉంటాయి, ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఈ క్రిముల ఉనికిని వైజ్ఞానికులు ఇటీవలి శతాబ్దాల్లోనే కనుగొన్నారు.—ద్వితీయోపదేశకాండము 23:13.
15. ఏది ఇశ్రాయేలీయులకు భారముగా ఉంది?
15 ధర్మశాస్త్రం ప్రజలను మరీ ఎక్కువేమీ అడగలేదు. కానీ ఇదే మాట ఆ ధర్మశాస్త్రానికి భాష్యం చెప్పే బాధ్యతను నెత్తినవేసుకున్నవారి గురించి చెప్పలేము. వారు విధించిన నియమాలను గురించి జేమ్స్ హేస్టింగ్స్ ఎడిట్ చేసిన ఎ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ ఇలా చెబుతుంది: “బైబిల్లోని ప్రతి ఆజ్ఞ చుట్టూ అల్పమైన ఆదేశాలు అల్లబడ్డాయి. . . . ఈ విధంగా, వారు ఊహించదగ్గ ప్రతి దానినీ ధర్మశాస్త్రం పరిధిలోనికి తీసుకురావడానికీ, దయారహితంగా తర్కిస్తూ కేవలం అనుభవం మీద ఆధారపడిన నియమాలతో మానవ ప్రవర్తనలో ప్రతి అంశాన్నీ క్రమబద్దీకరించడానికీ ప్రయత్నం జరిగింది. . . . మనస్సాక్షి గొంతు నొక్కేయడం జరిగింది; దైవిక వాక్యానికున్న సజీవమైన శక్తి నిష్ఫలం చేయబడింది, విస్తారమైన బాహ్య నియమాల బరువు క్రింద నలిపివేయబడింది.”
16. మతనాయకుల భారమైన నియమాలూ పారంపర్యాచారాల గురించి యేసు ఏమి అన్నాడు?
16 విస్తారమైన నియమాల్ని విధించిన మత నాయకుల్ని యేసుక్రీస్తు అధిక్షేపించాడు, ఆయనిలా అన్నాడు: “మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.” (మత్తయి 23:2, 4) ఇల్లు ఒళ్లు కడుక్కోవడానికి సంబంధించిన వాటితోసహా, భారమైన వారి మానవనిర్మిత నియమాలూ పారంపర్యాచారాలూ ‘దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాయని’ ఆయన చెప్పాడు. (మార్కు 7:1-13; మత్తయి 23:13, 24-26) అయితే యేసు భూమ్మీదకి రాకముందే ఇశ్రాయేలులోని మతబోధకులు, యెహోవా నిజంగా కోరేదాన్ని గలిబిలి చేస్తూవున్నారు.
యెహోవా నిజంగా అడుగుతున్నవి
17. విశ్వాసఘాతకులైన ఇశ్రాయేలీయులు అర్పించే దహన బలులంటే యెహోవాకు ఎందుకు ఇష్టంలేకపోయింది?
17 ప్రవక్త అయిన యెషయా ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను; కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.” (యెషయా 1:10, 11) అర్పించమని తానే ధర్మశాస్త్రంలో చెప్పిన బలులంటే దేవునికి ఎందుకిష్టం లేకపోయింది? (లేవీయకాండము 1:1–4:35) ఎందుకంటే ప్రజలు ఆయనపట్ల అగౌరవంతో ప్రవర్తించారు. అందుకని వారీ విధంగా ఉద్బోధించబడ్డారు: “మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి. కీడుచేయుట మానుడి మేలు చేయనేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి.” (యెషయా 1:16, 17) యెహోవా తన సేవకుల నుండి కావాలంటున్నదాన్ని అర్థం చేసుకోవడానికి మనకిది సహాయం చేయదా?
18. యెహోవా ఇశ్రాయేలీయులను నిజానికి ఏమి అడుగుతున్నాడు?
18 దేవుడు నిజంగా కావాలంటున్నదేమిటో యేసు చూపించాడు. ఒక వ్యక్తి, “బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని” ఆయన్ను అడిగినప్పుడు ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేశాడు. యేసు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్న[వి].” (మత్తయి 22:36-40; లేవీయకాండము 19:18; ద్వితీయోపదేశకాండము 6:4-6) ప్రవక్తయైన మోషే ఈ క్రింది విధంగా ప్రశ్నించినప్పుడు ఆ విషయాన్నే నొక్కిచెప్పాడు: “కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?”—ద్వితీయోపదేశకాండము 10:12, 13; 15:7, 8.
19. ఇశ్రాయేలీయులు పరిశుద్ధంగా ఉండేలా కనబడటానికి ఎలా ప్రయత్నించారు, కానీ యెహోవా వారితో ఏమన్నాడు?
19 ఇశ్రాయేలీయులు తాము తప్పిదాలు చేసినప్పటికీ పరిశుద్ధంగా కనబడాలనుకున్నారు. వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినం నాడు మాత్రమే ఉపవాసం ఉండాలని ధర్మశాస్త్రం కోరుతుంటే వారు ఇంకా తరచుగా ఉపవాసం ఉండటం ప్రారంభించారు. (లేవీయకాండము 16:30, 31) కానీ యెహోవా ఇలా అంటూ వారిని మందలించాడు: “దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా? నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము?”—యెషయా 58:3-7.
20. యేసు మత వేషధారులను ఎందుకు మందలించాడు?
20 “మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను” అని యేసు చెప్పిన మత వేషధారుల్లో ఉన్న లోపమే స్వనీతిపరులైన ఆ ఇశ్రాయేలీయుల్లో ఉంది. (మత్తయి 23:23; లేవీయకాండము 27:30) యెహోవా నిజంగా మననుండి కావాలంటున్నదాన్ని అర్థం చేసుకోవడానికి యేసు మాటలు సహాయం చేయవా?
21. యెహోవా మన నుండి ఏమి కోరుతున్నాడు ఏమి కోరడం లేదు అనేది ప్రవక్తయైన మీకా సంగ్రహంగా ఎలా చెబుతున్నాడు?
21 యెహోవా మన నుండి ఏమి కోరుతున్నాడు, ఏమి కోరడం లేదు అనేది స్పష్టం చేయడానికి దేవుని ప్రవక్తయైన మీకా ఇలా అడిగాడు: “ఏమి తీసికొనివచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా? మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”—మీకా 6:6-8.
22. ధర్మశాస్త్రం క్రిందనున్న వారి నుండి యెహోవా స్పష్టంగా ఏమి కోరాడు?
22 దీనంతటిని బట్టి చూస్తే, ధర్మశాస్త్రం క్రిందనున్న వారినుండి యెహోవా స్పష్టంగా ఏమి కోరాడు? ఒకటి మాత్రం స్పష్టం, వారు యెహోవాను ప్రేమించవలసి ఉన్నారు. అంతేగాక, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ధర్మశాస్త్రమంతయు—నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.” (గలతీయులు 5:14) అదే విధంగా, పౌలు రోమ్‌లోని క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. . . . ప్రేమకలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.”—రోమీయులు 13:8-10.
మరీ ఎక్కువేమీ కాదు
23, 24. (ఎ) యెహోవా అడిగేది చేయటం ఎన్నడూ మరీ ఎక్కువ ఎందుకు కాదు? (బి) మనం తర్వాత ఏమి పరిశీలిస్తాము?
23 యెహోవా ఎంత ప్రేమపూర్వకమైన, శ్రద్ధగల, దయాపూర్వకమైన దేవుడో గ్రహించిన మనం ఆయనపట్ల ఆకర్షితులమైనట్లు భావించమా? ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు దేవుని ప్రేమను ఉన్నతపర్చడానికి—యెహోవాకు ప్రజలంటే ఎంత ప్రేమో వారికి తెలియజేయడానికి ఈ భూమ్మీదకి వచ్చాడు. దేవుని ప్రేమను దృష్టాంతపరుస్తూ యేసు రెండు అల్పమైన పిచ్చుకలను గురించి చెప్పాడు: “మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు.” అందుకని ఆయన ఇలా ముగించాడు: “మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:29-31) అటువంటి ప్రేమపూర్వకమైన దేవుడు అడిగే ఏదైనా చేయడానికి మనకు మరీ ఎక్కువగా అనిపించకూడదు!
24 అయితే యెహోవా నేడు మననుండి ఏమి అడుగుతున్నాడు? దేవుడు మరీ ఎక్కువగా అడుగుతున్నాడని కొందరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్రశ్నలను పరిశీలించడం ద్వారా, యెహోవా ఏది అడిగితే అది చేయడం ఎందుకు ఒక ఆధిక్యతో మనం చూడవచ్చు.
మీరు జవాబివ్వగలరా?
◻ కొందరు యెహోవాను సేవించడానికి ఎందుకు నిరాకరిస్తారు?
◻ యెహోవా కోరుతున్నవి గడిచిన సంవత్సరాల్లో ఎలా వైవిధ్యంగా ఉన్నాయి?
◻ ధర్మశాస్త్రం ద్వారా ఏ సంకల్పాలు నెరవేరాయి?
◻ యెహోవా మన నుండి అడిగేది మనకు ఎందుకు మరీ ఎక్కువ కాదు?
[18వ పేజీలోని చిత్రం]
చేతులు కడుక్కోవడం వంటి మానవులు ఏర్పర్చిన నియమాలు, ఆరాధనను భారమైనదిగా చేశాయి