మీరు చేసిన వాగ్దానాల్ని ఎందుకు నెరవేర్చాలి?
“అతి తక్కువ వాగ్దానాలు చేసే వ్యక్తికి ఓటేయండి; అతడైతే తక్కువగా నిరాశపరుస్తాడు” అని అమెరికా అధ్యక్ష సలహాదారునిగా ఉండిన కీర్తిశేషుడైన బెర్నార్డ్ బారుక్ అన్నాడు. నేటి ప్రపంచంలో వాగ్దానాలు చేసేది వమ్ము చేయటానికే అన్నట్లుంది. అవి వివాహ ప్రమాణాలు కావచ్చు. వ్యాపార ఒప్పందాలు కావచ్చు. లేదా పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతామని చేసే వాగ్దానాలు కావచ్చు. “మాటమీద నిలబడే మనిషి” అని ఈ రోజుల్లో మనం ఎవరి గురించీ చెప్పలేము.
నిజమే, చాలామంది ప్రజలు తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఎన్నడూ అనుకోరు. మరితరులు, తాము నిలబెట్టుకోలేని దుందుడుకు వాగ్దానాలు చేస్తారు లేదా తాము చేసిన వాగ్దానాలను ఎంతమాత్రం నిలబెట్టుకోరు ఎందుకంటే అదే వారికి సులభం గనుక.
తలవని పరిస్థితులు తలెత్తితే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కష్టమన్నది అంగీకరించవలసిన విషయమే. వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడం నిజంగా చాలా హాని చేస్తుందా? మీరు చేసిన వాగ్దానాలను మీరు గంభీరంగా ఎంచాలా? యెహోవా దేవుని మాదిరిని క్లుప్తంగా పరిశీలించటం, మనం ఈ విషయాన్ని ఎందుకంత గంభీరంగా తీసుకోవాలనేదాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తుంది.
యెహోవా తన వాగ్దానాలను నెరవేరుస్తాడు
మనం ఆరాధిస్తున్న దేవుని పేరే, తాను చేసిన వాగ్దానాల నెరవేర్పుతో ముడిపడి ఉంది. బైబిలు కాలాల్లో సాధారణంగా ఒకరి పేరు ఆ వ్యక్తి గురించి తెలియజేసేది. యెహోవా అనే నామం విషయంలో కూడా ఇది వాస్తవమై ఉంది, “తానే కర్త అవుతాడు” అన్నది ఆ నామ భావం. కాబట్టి దైవిక నామంలో, దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే, తన సంకల్పాలను సఫలం చేస్తాడనే తలంపు ఇమిడి ఉంది.
తన నామమునకు తగినట్లుగానే, యెహోవా ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి తాను చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ వాగ్దానాల గురించి, రాజైన సొలొమోను ఇలా అంగీకరించాడు: “తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు.”—1 రాజులు 8:56.
యెహోవా ఎంత నమ్ముకొనదగిన వాడంటే, అపొస్తలుడైన పౌలు ఇలా తర్కించగలిగాడు: “దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తనతోడు అని ప్రమాణముచే[సెను].” (హెబ్రీయులు 6:13, 14) అవును, యెహోవా ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చినప్పటికీ తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడనటానికి ఆయన నామమూ, వ్యక్తిత్వమూ ఒక హామీలా ఉన్నాయి. (రోమీయులు 8:32) యెహోవా తన వాగ్దానాలను నెరవేరుస్తాడన్న వాస్తవం మనకు లంగరు వంటి నిరీక్షణను ఇస్తుంది.—హెబ్రీయులు 6:19.
యెహోవా వాగ్దానాలు, మన భవిష్యత్తు
మన నిరీక్షణ, మన విశ్వాసం, మన జీవితం అన్నీ యెహోవా వాగ్దానాల నెరవేర్పు మీదే ఆధారపడివున్నాయి. మనకు ఏ నిరీక్షణ ఉంది? “మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నద[నే]” నమ్మకానికి కూడా లేఖనాలు మనకు ఆధారాన్నిస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 24:14, 15) ప్రస్తుతం జీవించే ఈ జీవితం కంటే మరెక్కువైనది మనకుందని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. వాస్తవానికి, అపొస్తలుడైన యోహాను “వాగ్దానము” అని పిలుస్తున్నది, “నిత్యజీవము.” (1 యోహాను 2:25) కాని యెహోవా చేసే వాగ్దానాలు కేవలం భవిష్యత్తుకు మాత్రమే పరిమితమై లేవు. అవి ఇప్పుడు కూడా మన అనుదిన జీవితాలకు అర్థాన్నిస్తాయి.
కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి . . . యెహోవా సమీపముగా ఉన్నాడు. . . . ఆయన . . . వారి మొర ఆలకిం[చును].” (కీర్తన 145:18, 19) ‘సొమ్మసిల్లినవారికి బలమిస్తాననీ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాననీ’ కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 40:29) ‘మనం సహించగలిగినంతకంటె ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడనియ్యడనీ, శోధనతోకూడ తప్పించుకొను మార్గమును దయచేస్తాడనీ’ తెలుసుకోవటం ఎంత ఉపశమనాన్నిస్తుందో కదా! (1 కొరింథీయులు 10:13) ఈ వాగ్దానాల్లో వేటి నెరవేర్పునైనా మనం వ్యక్తిగతంగా అనుభవించి ఉంటే, యెహోవాను మనం పూర్తిగా నమ్మవచ్చునని మనకు తెలుస్తుంది. దేవుడు చేసే, నెరవేర్చే అనేకానేక వాగ్దానాల నుండి మనం పొందే ప్రయోజనాల దృష్ట్యా, మనం ఆయనకు చేసే వాగ్దానాలను మనం ఎలా దృష్టించాలి?
దేవునికి మనం చేసే వాగ్దానాలను నెరవేర్చటం
మనం దేవునికి చేసుకునే సమర్పణ నిస్సందేహంగా, మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన వాగ్దానం. ఈ చర్య తీసుకోవటం ద్వారా, నిరంతరం యెహోవా సేవ చేయాలనే కోరిక మనకుందని మనం చూపిస్తాము. దేవుని ఆజ్ఞలు భారమైనవి కాకపోయినప్పటికీ, మనం జీవించేది ఈ దుష్ట విధానంలో గనుక, ఆయన చిత్తాన్ని చేయటం మనకు ఎల్లప్పుడూ అంత సులభం కాకపోవచ్చు. (2 తిమోతి 3:12; 1 యోహాను 5:3) కాని ఒకసారి మనం ‘నాగలి మీద చెయ్యి వేసి,’ యెహోవా దేవుని సమర్పిత సేవకులముగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు శిష్యులముగా తయారైన తర్వాత, మనం వెనుక విడిచి వచ్చిన వాటి వైపుకు ఇక ఎన్నడూ తిరిగి చూడకూడదు.—లూకా 9:62.
మనం యెహోవాకు ప్రార్థించేటప్పుడు, మనం ఒక బలహీనతను జయించటానికి పోరాడతామనీ, ఒక క్రైస్తవ లక్షణాన్ని అలవర్చుకుంటామనీ, లేక మన దైవపరిపాలనా పరిచర్యలోని ఏదైనా అంశంలో అభివృద్ధి సాధిస్తామనీ ఆయనకు వాగ్దానం చేయాలని మనం పురికొల్పబడవచ్చు. ఈ వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేయటానికి మనకేమి సహాయం చేస్తుంది?—ప్రసంగి 5:2-5.
యథార్థమైన వాగ్దానాలు హృదయంలో నుండి అలాగే మనస్సులో నుండి ఉత్పన్నమౌతాయి. కాబట్టి, మనం మన భయాలనూ, కోరికలనూ, బలహీనతలనూ యథార్థంగా వ్యక్తపరుస్తూ మన హృదయాలను యెహోవా ఎదుట కుమ్మరించటం ద్వారా మనం మన వాగ్దానాలను ధృవీకరిద్దాము. ఏదైనా వాగ్దానం గురించి ప్రార్థించటం, దాన్ని నెరవేర్చాలన్న మన నిశ్చయతను బలపరుస్తుంది. దేవునికి మనం చేసిన వాగ్దానాలను మనం మన ఋణంగా ఎంచుదాము. ఋణం మరీ పెద్దదైనప్పుడు, దాన్ని క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మనం యెహోవాకు చేసే వాగ్దానాలను నెరవేర్చటానికి సమయం పడుతుంది. కాని మనం ఆయనకు ఇవ్వగల్గినదాన్ని క్రమంగా ఇవ్వటం ద్వారా, మనం ఏమి చెప్తున్నామో అదే మన ఉద్దేశమని చూపించగల్గుతాము. ఆయన మనల్ని తగిన విధంగా ఆశీర్వదిస్తాడు.
మనం మన వాగ్దానాల గురించి తరచూ ప్రార్థించటం ద్వారా, బహుశా ప్రతి రోజూ ప్రార్థించటం ద్వారా మనం మన వాగ్దానాలను గంభీరమైనవిగా ఎంచుతున్నామని చూపించవచ్చు. మనం యథార్థత కల్గివున్నామని ఇది మన పరలోక తండ్రికి చూపిస్తుంది. అది ఒక క్రమమైన జ్ఞాపికగా కూడా పనిచేస్తుంది. ఈ విషయంలో దావీదు మనకు మంచి మాదిరినుంచాడు. ఒక కీర్తనలో, ఆయన యెహోవాను ఇలా వేడుకున్నాడు: “దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.”—కీర్తన 61:1, 8.
మనం మన వాగ్దానాలను నెరవేర్చటం మనపై నమ్మకాన్ని పెంచుతుంది
దేవునికి చేసిన వాగ్దానాలను తక్కువగా ఎంచకూడదంటే, మరి మనం తోటి క్రైస్తవులకు చేసే వాటి గురించి కూడా అదే చెప్పవచ్చు. మనం యెహోవాతో ఒక విధంగా, మన సహోదరులతో మరో విధంగా వ్యవహరించకూడదు. (పోల్చండి 1 యోహాను 4:20.) కొండ మీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.” (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 5:37) ‘విశ్వాసగృహమునకు చేరినవారియెడల మేలు చేయటానికి’ ఒక మార్గమేమిటంటే మన మాట ఎల్లప్పుడూ నమ్మదగినదిగా ఉండేలా జాగ్రత్త వహించటం. (గలతీయులు 6:10) మనం నెరవేర్చే ప్రతి వాగ్దానం మనపై నమ్మకాన్ని పెంచుతుంది.
వాగ్దానాన్ని నెరవేర్చకపోవటం వల్ల కలిగే హాని, తరచూ డబ్బు విషయాలు ఇమిడి ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పును తిరిగి చెల్లించడమైనా, ఏదైనా సేవను అందించటమైనా, లేక వాణిజ్య ఒప్పందాన్ని నెరవేర్చటమైనా సరే ఒక క్రైస్తవుడు తన మాటకు కట్టుబడి ఉండాలి. అది దేవునికి ప్రీతికరమైనది, సహోదరులు “ఐక్యత కలిగి నివసించుట”కు ఎంతో ఆవశ్యకమైనదైన పరస్పర నమ్మకాన్ని అది పటిష్టం చేస్తుంది.—కీర్తన 133:1.
అయితే, ఒప్పందాలకు కట్టుబడి ఉండలేకపోవటం సంఘానికీ, అలాగే అందులో సూటిగా ఇమిడివున్న వారికీ హాని కల్గించగలదు. ఒక ప్రయాణ కాపరి ఇలా పేర్కొన్నాడు: “వ్యాపార వివాదాలు—ప్రాముఖ్యంగా అవతలి వారు తమ ఒప్పందాన్ని నెరవేర్చలేదని కనీసం ఒక వర్గం వారు భావించినా సరే—తరచూ అందరికీ తెలిసిపోతాయి. ఫలితంగా, సహోదరులు రెండు పక్షాలుగా విడిపోతారు, రాజ్యమందిరంలోని వాతావరణం ఉద్రిక్తంగా తయారౌతుంది.” మనం ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, వ్రాత రూపంలో పెట్టుకోవటం ఎంత ప్రాముఖ్యమో కదా!a
ఖరీదైన వస్తువులను అమ్మేటప్పుడూ లేక పెట్టుబడిని సిఫారసు చేసేటప్పుడూ కూడా, ప్రాముఖ్యంగా ఆ లావాదేవీల నుండి మనం వ్యక్తిగతంగా లాభం పొందేటట్లైతే, జాగ్రత్త వహించటం మంచిది. అలాగే, కొన్ని వస్తువుల లేక ఆరోగ్య ఉత్పాదనల ప్రయోజనాలను మరీ అతిశయోక్తిగా చెప్పకుండా, లేదా పెట్టుబడులపై అవాస్తవికమైన లాభాలను వాగ్దానం చేయకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏవైనా ప్రమాదాలు ఇమిడి ఉంటే వాటిని పూర్తిగా వివరించటానికి ప్రేమ క్రైస్తవులను పురికొల్పాలి. (రోమీయులు 12:10) చాలామంది సహోదరులకు వ్యాపార విషయాల్లో పరిమితమైన అనుభవమే ఉంది గనుక, మనం వారికి విశ్వాసంలో సంబంధీకులం కాబట్టి వాళ్లు మన సలహాను చాలా సులభంగా నమ్మవచ్చు. ఈ నమ్మకం గనుక వమ్ము చేయబడితే అదెంత దుఃఖకరంగా ఉంటుంది!
క్రైస్తవులముగా మనం నిజాయితీలేని వ్యాపార విధానాలనూ, లేదా ఇతరుల న్యాయబద్ధమైన ఆసక్తులను అలక్ష్యం చేసే విధానాలనూ అవలంబించలేము. (ఎఫెసీయులు 2:2, 3; హెబ్రీయులు 13:18) ‘యెహోవా గుడారములో అతిథిగా’ ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే, మనం నమ్మదగినవారిగా ఉండాలి. మనము ‘ప్రమాణము చేయగా నష్టము కలిగినను తప్పము.’—కీర్తన 5:1, 4.
ఇశ్రాయేలు న్యాయాధిపతియైన యెఫ్తా, దేవుడు తనకు అమ్మోనీయులపై విజయాన్నిస్తే, తాను యుద్ధం నుండి తిరిగి వెళ్లినప్పుడు ఎవరు తనకు మొదట ఎదురొస్తే వారిని యెహోవాకు దహనబలిగా అర్పిస్తానని వాగ్దానం చేశాడు. యెఫ్తాకున్న ఏకైక కుమార్తెనే అలా మొదట ఎదురొచ్చింది, కాని ఆయన తన మాట వెనక్కు తీసుకోలేదు. ఆయన తన కుమార్తె హృదయపూర్వక అంగీకారంతో, దేవుని ఆలయంలో శాశ్వతంగా సేవచేయటానికి ఆమెను అర్పించాడు. ఆయన చేసిన ఆ త్యాగం నిస్సందేహంగా ఎంతో వేదనభరితమైనది. అందుకు ఎన్నో విధాలుగా ఆయన ఎంతో మూల్యాన్ని చెల్లించాల్సివచ్చింది కూడా.—న్యాయాధిపతులు 11:30-40.
ప్రాముఖ్యంగా సంఘ పైవిచారణకర్తలకు తమ ఒప్పందాల ప్రకారం కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉంది. 1 తిమోతి 3:2 ప్రకారం పైవిచారణకర్త ‘నిందారహితుడై’ ఉండాలి. ఇది, “తప్పు పట్టలేకపోవటం, దోషరహితమైన, నిష్కళంకమైన” అనే భావంగల గ్రీకు పద అనువాదం. అది “ఆ వ్యక్తి మంచి పేరుగలవాడు అని సూచించడమే గాక, ఆయన అందుకు తగినవాడు అని కూడా సూచిస్తుంది.” (ఎ లింగ్విస్టిక్ కీ టు ద గ్రీక్ న్యూ టెస్ట్‌మెంట్) పైవిచారణకర్త నిందారహితుడై ఉండాలి గనుక, ఆయన చేసే వాగ్దానాలు ఎల్లప్పుడూ నమ్మదగినవై ఉండాలి.
మన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఇతర మార్గాలు
తోటి క్రైస్తవులుకాని వారికి మనం చేసే వాగ్దానాలను మనమెలా దృష్టించాలి? “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని యేసు చెప్పాడు. (మత్తయి 5:16) మనం మన మాటను గౌరవిస్తామని నిరూపించటం ద్వారా మనం మన క్రైస్తవ సందేశం వైపుకు ఇతరులను ఆకర్షించవచ్చు. నిజాయితీ సంబంధిత ప్రమాణాల్లో ప్రపంచవ్యాప్తంగా తగ్గుదల ఉన్నప్పటికీ, చాలామంది ప్రజలు ఇప్పటికీ యథార్థతను విలువైనదిగా ఎంచుతారు. దేవుని పట్ల, పొరుగువారి పట్ల మనకుగల ప్రేమను చూపించటానికీ, నీతి ప్రేమికులను ఆకర్షించటానికీ మన వాగ్దానాలను నెరవేర్చటం ఒక మార్గం.—మత్తయి 22:36-39; రోమీయులు 15:2.
యెహోవా సాక్షులు తమ 1998వ సేవా సంవత్సరంలో, దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా ప్రకటించటంలో ఒక వంద కోట్ల కన్నా ఎక్కువ గంటలను గడిపారు. (మత్తయి 24:14) మనం వ్యాపార వ్యవహారాల్లో గానీ లేక ఇతర విషయాల్లో గానీ మన మాట నిలబెట్టుకోకపోయి ఉన్నట్లైతే, ఈ సువార్త ప్రకటనను కొంతమంది అలక్ష్యం చేసివుండవచ్చు. మనం సత్య దేవునికి ప్రాతినిధ్యం వహిస్తాము గనుక, మనం నిజాయితీగా ఉండాలని ప్రజలు సరిగ్గానే అపేక్షిస్తారు. మనం నమ్మదగినవారిగా, యథార్థపరులుగా ఉండటం ద్వారా, మనం ‘అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరిస్తాము.’—తీతు 2:9-10.
మన పరిచర్యలో, రాజ్య సందేశంలో ఆసక్తి కనపర్చిన వారిని పునర్దర్శించినప్పుడు మనకు మన మాటను నిలబెట్టుకునే అవకాశాలు లభిస్తాయి. మనం తిరిగి వస్తామని చెప్పినప్పుడు మనం తిరిగి వెళ్లాలి. వాగ్దానం చేసినట్లుగా తిరిగి వెళ్లటమన్నది, ‘మేలు పొందదగినవారికి మేలు చేయకుండా వెనుకతియ్యకపోవటానికి’ ఒక మార్గమే. (సామెతలు 3:27) విషయాన్ని ఒక సహోదరి ఇలా వివరించింది: “చాలా సందర్భాల్లో, ఒక సాక్షి వస్తానని వాగ్దానం చేసి తర్వాత రాలేదని చెప్పిన, ఆసక్తిగల వ్యక్తులను నేను కలిశాను. బహుశా గృహస్థులు ఇంటి వద్ద ఉండి ఉండకపోవచ్చు లేదా పరిస్థితులను బట్టి తిరిగి రాలేక పోయుండవచ్చు. కాని నా గురించి ఎవరైనా అలా చెప్పటం నాకిష్టం లేదు, కాబట్టి ఆ వ్యక్తిని ఇంటివద్ద కనుగొనటానికి నేను చేయగలిగినదంతా నేను చేస్తాను. ఎవరినైనా నేను నిరుత్సాహపరిస్తే అది యెహోవా పైన, సహోదరులందరి పైన చెడుగా ప్రతిఫలిస్తుందని నేను నమ్ముతున్నాను.”
కొన్ని సందర్భాల్లో, ఆ వ్యక్తికి నిజంగా ఆసక్తి లేదని మనం తీర్మానించుకుంటాము గనుక మనం తిరిగి వెళ్లటానికి సుముఖంగా ఉండకపోవచ్చు. అదే సహోదరి ఇలా వివరిస్తుంది: “నేను వారికున్న ఆసక్తి శాతాన్ని తీర్మానించటానికి ప్రయత్నించను. తొలి అభిప్రాయాలు తరచూ సరైనవై ఉండవని నా సొంత అనుభవమే నాకు నేర్పింది. కాబట్టి నేను ప్రతి వ్యక్తిని మన భవిష్యత్ సహోదరునిగా లేక సహోదరిగా దృష్టిస్తూ, అనుకూల దృక్పథం కల్గివుండటానికి ప్రయత్నిస్తాను.”
క్రైస్తవ పరిచర్యలోనూ, మరితర విషయాల్లోనూ మన మాట నమ్మదగినదని మనం చూపించాల్సిన అవసరం ఉంది. నిజమే, కొన్ని విషయాలు చెప్పినంత సులభం కాదు చేయటం. జ్ఞాని ఇలా పేర్కొన్నాడు: “దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?” (సామెతలు 20:6) దృఢ సంకల్పం ఉంటే మనం మన మాటకు కట్టుబడి నమ్మకంగా ఉండవచ్చు.
దేవుని నుండి గొప్ప దీవెనలు
ఉద్దేశపూర్వకంగా ఉట్టుట్టి వాగ్దానం చేయటం నిజాయితీ లేనితనమౌతుంది, బాంకులో డబ్బు లేకపోయినా చెక్కు వ్రాసి ఇవ్వటంతో దాన్ని పోల్చవచ్చు. మన వాగ్దానాలను నిలబెట్టుకున్నందుకు మనం ఎంతటి ప్రతిఫలాలనూ, ఆశీర్వాదాలనూ పొందుతామో కదా! నమ్మకమైన వారిగా ఉండటం మూలంగా వచ్చే ఒక ఆశీర్వాదం మంచి మనస్సాక్షి. (పోల్చండి అపొస్తలుల కార్యములు 24:16.) పశ్చాత్తాప భావాలు కల్గివుండే బదులు మనం సంతృప్తిగా, ప్రశాంతంగా ఉంటాము. అంతేగాక, మనం మన మాటకు కట్టుబడి ఉండటం ద్వారా, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉండే సంఘ ఐక్యతకు దోహదపడతాము. మన “సత్యవాక్యము” మనల్ని సత్యదేవుని పరిచారకులనుగా కూడా సిఫారసు చేస్తుంది.—2 కొరింథీయులు 6:3, 4, 7.
యెహోవా తన మాటకు కట్టుబడి ఉంటాడు, ఆయన “కల్లలాడు నాలుక”ను అసహ్యించుకుంటాడు. (సామెతలు 6:16, 17) మన పరలోక తండ్రిని అనుకరించటం ద్వారా, మనం ఆయనకు సన్నిహితమౌతాము. కాబట్టి మనం చేసే వాగ్దానాలను నెరవేర్చటానికి మనకు సరైన కారణం ఉంది.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 1983, 13-15 పేజీల్లో ఉన్న “వ్రాతలో పెట్టండి” అనే శీర్షిక చూడండి.
[10వ పేజీలోని చిత్రాలు]
యెఫ్తాకు తన వాగ్దానాన్ని నెరవేర్చటం ఎంతో వేదనను కల్గించినప్పటికీ, ఆయన దాన్ని నెరవేర్చాడు
[11వ పేజీలోని చిత్రాలు]
పునర్దర్శనం చేస్తానని మీరు వాగ్దానం చేసివుంటే, దాని కోసం బాగా సిద్ధపడండి