కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 9/15 పేజీలు 4-7
  • శ్రద్ధగల వారొకరున్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శ్రద్ధగల వారొకరున్నారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు పేదరికం, ఎందుకు అణచివేత?
  • మానవ పరిష్కారానికి అందని సమస్య
  • “నీ చిత్తము . . . భూమియందును నెరవేరును”
  • లోకాన్ని ఎవరైనా నిజంగా మార్చగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యేసు మాదిరిని అనుసరించి పేదవారిపట్ల శ్రద్ధ చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • అణచి వేయబడిన వారికి ఆదరణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మీరెప్పుడైనా ఆలోచించారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 9/15 పేజీలు 4-7

శ్రద్ధగల వారొకరున్నారు

తమకు నిజంగా శ్రద్ధ ఉందని వేలాదిమంది ప్రజలు చూపిస్తారు. వారు ఇతరుల సమస్యలు తమకు అనవసరమైనవన్న కఠినమైన, స్వార్థపూరితమైన దృక్పథాన్ని కల్గివుండరు. బదులుగా, వారు బాధను తగ్గించటానికి, చివరికి కొన్నిసార్లు తమ ప్రాణాలను పణంగా పెట్టవలసి వచ్చినప్పటికీ, తాము చేయగల్గినదంతా చేస్తారు. ఇదొక బృహత్‌ కార్యం, తాము అదుపు చేయలేని బలమైన శక్తులచే సంక్లిష్టం చేయబడిన కార్యం.

“ఆకలిని నిర్మూలించటానికి చేయబడుతున్న అత్యంత జ్ఞానవంతమైన, కృతనిశ్చయంతో కూడిన ప్రయత్నాలను” కూడా అత్యాశ, రాజకీయ కుతంత్రం, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి అణచివేయగలవని ఒక సహాయక సేవకుడు చెప్తున్నాడు. ఆకలిని రూపుమాపాలన్నది, శ్రద్ధగల ప్రజలు ఎదుర్కుంటున్న అనేకానేక సమస్యల్లో కేవలం ఒకటి మాత్రమే. రోగంతోనూ, పేదరికంతోనూ, అన్యాయంతోనూ, యుద్ధం మూలంగా ఏర్పడిన తీవ్రమైన బాధతోనూ వాళ్లు పోరాడతారు. కాని వాళ్లు విజయం సాధిస్తున్నారా?

ఆకలినీ, బాధనూ నిర్మూలించటానికి అలాంటి “అత్యంత జ్ఞానవంతమైన, నిశ్చయమైన ప్రయత్నాలను చేసే” వారు, యేసుక్రీస్తు ఉపమానంలో వర్ణించబడిన కనికరంగల సమరయుని వంటివారని ఒక సహాయక సంస్థకు చెందిన ప్రధాన కార్యనిర్వాహకుడు అన్నాడు. (లూకా 10:29-37) అయితే వాళ్లు ఏం చేసినప్పటికీ, బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయనిలా ప్రశ్నించాడు: “ఆ మంచి సమరయుడు, సంవత్సరాలపాటు ప్రతిరోజు అదే మార్గంగుండా వెళుతూ, రోడ్డు ప్రక్కన దొంగలచే దోచుకోబడిన మరో వ్యక్తిని వారం వారం కనుగొంటే ఇక అతడేమి చేయాలి?”

‘సహాయకుని నిస్సత్తువ అనే ప్రాణాంతకమైన రోగం’ అని వర్ణించబడిన దానికి లోనై, నిస్పృహతో చేతులెత్తేయటం సులభం. కానీ నిజంగా శ్రద్ధ ఉన్న వాళ్లు అలా చేతులెత్తేయరు, అది నిజంగా మెచ్చుకోదగిన విషయం. (గలతీయులు 6:9, 10) ఉదాహరణకు, బ్రిటన్‌కు చెందిన జ్యూయిష్‌ టెలిగ్రాఫ్‌కు వ్రాసిన ఒక వ్యక్తి, నాజీ పరిపాలన కాలంలో “ఆషెవిట్జ్‌లోని దయనీయమైన పరిస్థితులను తట్టుకోవటానికి వేలాదిమంది యూదులకు సహాయం చేసిన” యెహోవాసాక్షులను ప్రశంసించాడు. ఆ రచయిత ఇలా వ్రాశాడు: “ఆహార కొరత ఉన్నప్పుడు, వాళ్లు తమవద్దనున్న రొట్టెల్ని తమ [యూదా] సహోదర సహోదరీలతో పంచుకున్నారు!” సాక్షులు తమ వద్దనున్న వనరులతో తాము చేయగల్గినదంతా చేయటంలో కొనసాగారు.

అయినప్పటికీ, ఎంత ఆహారాన్ని పంచుకున్నా, మానవ వేదనలు సమసిపోవు. అంటే దాని భావం, కనికరంగల ప్రజలు చేసినదాని విలువను తగ్గించటమని కాదు. వేదనను సరైన విధంగా తగ్గించే ఏ చర్యయైనా ఉపయుక్తమైనదే. ఆ సాక్షులు తోటి ఖైదీల బాధను కొంతమేరకు తగ్గించారు. చివరికి నాజీ పరిపాలన నిర్మూలించబడింది. అయితే, అలాంటి అణిచివేతకు కారణమైన ప్రపంచ విధానం ఇంకా మిగిలే ఉంది. ఎవరినీ పట్టించుకోని ప్రజలు ఇంకా వృద్ధి చెందుతూనే ఉన్నారు. వాస్తవానికి, “దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగునట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయునట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు.” (సామెతలు 30:14) బహుశ, పరిస్థితి ఎందుకిలా ఉందని మీరు ఆలోచిస్తుండవచ్చు.

ఎందుకు పేదరికం, ఎందుకు అణచివేత?

యేసుక్రీస్తు ఒకసారిలా అన్నాడు: “బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయవచ్చును.” (మార్కు 14:7) పేదరికం, అణచివేత ఎన్నటికీ సమసిపోవని యేసు ఉద్దేశమా? కనికరంగల ప్రజలు తమకు ఎంత శ్రద్ధ ఉందో చూపించటానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలన్న దేవుని సంకల్పంలో అలాంటి బాధ ఒక భాగమని యేసు కూడా కొంతమంది ప్రజల్లా విశ్వసించాడా? లేదు ! యేసు అలా విశ్వసించలేదు. ఈ విధానం ఉనికిలో ఉన్నంత వరకు పేదరికం జీవితంలో ఒక భాగమై ఉంటుందని మాత్రం ఆయన తెలియజేస్తున్నాడు. కాని యేసుకు ఈ విషయం కూడా తెలుసు: భూమిపై అలాంటి పరిస్థితులు ఉండాలన్నది తన పరలోక తండ్రి ఆది సంకల్పం కాదు.

భూమి ఒక పరదైసులా ఉండాలని యెహోవా దేవుడు సృష్టించాడు గానీ పేదరికం, అన్యాయం, అణచివేతలతో అది పీడించబడే స్థలంగా ఉండాలని కాదు. జీవితానందాన్ని అధికం చేసే అద్భుతమైన ఏర్పాట్లను చేయటం ద్వారా ఆయన, తనకు మానవ కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ ఉందో చూపించాడు. అంతెందుకు, మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు ఉండిన తోట పేరునే తీసుకోండి! అది ఏదెను అని పిలువబడింది, అంటే “ఆహ్లాదం” అని అర్థం. (ఆదికాండము 2:8, 9) యెహోవా మానవులను విసుగుపుట్టించే, అణచివేసే పరిసరాల్లో కేవలం కనీసావసరాలతో మాత్రం జీవించాలని నిర్ణయించలేదు. యెహోవా తన సృష్టి ముగింపులో తాను చేసిన దానిని పరిశీలించి, అది “చాలమంచిదిగ” ఉందని ప్రకటించాడు.—ఆదికాండము 1:31.

మరి నేడు భూవ్యాప్తంగా పేదరికం, అణచివేత, బాధకు కారణమైన ఇతర కారకాలు ఎందుకింత విశృంఖలంగా ఉన్నాయి? మన ఆది తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి ఎంపిక చేసుకున్నందుకే ప్రస్తుత దుష్ట విధానం ఉనికిలో ఉంది. (ఆదికాండము 3:1-5) ఇది, దేవుడు తన సృష్టిప్రాణుల నుండి విధేయతను కోరటం సరైనదేనా కాదా అనే ప్రశ్నను లేవనెత్తింది. కాబట్టి యెహోవా ఆదాము సంతానానికి కొంత పరిమిత కాలం పాటు స్వేచ్ఛను అనుమతించాడు. అయినప్పటికీ మానవ కుటుంబానికి ఏం జరుగుతుందనే దాని గురించి దేవుడు శ్రద్ధ కల్గివున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు తీసుకురాబోయే హానినంతటినీ తొలగించేందుకు ఆయన ఏర్పాటు చేశాడు. త్వరలోనే, యెహోవా పేదరికాన్నీ, అణచివేతనూ, వాస్తవానికి బాధనంతటినీ నిర్మూలిస్తాడు.—ఎఫెసీయులు 1:8-10.

మానవ పరిష్కారానికి అందని సమస్య

మానవ సృష్టి జరిగినప్పటి నుండీ శతాబ్దాలన్నిటిలోనూ, మానవజాతి యెహోవా ప్రమాణాల నుండి దూరంగా వెళ్లిపోయింది. (ద్వితీయోపదేశకాండము 32:4, 5) దేవుని చట్టాలనూ, సూత్రాలనూ నిరాకరించటంలో కొనసాగుతూ మానవులు ఒకరితో ఒకరు పోరాడారు, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చు”కున్నాడు. (ప్రసంగి 8:9) నిజంగా న్యాయవంతమైన సమాజాన్ని తెచ్చేందుకైన ప్రయత్నాలన్నీ, బాధితులను పీడించే వాటినన్నింటినీ తొలగించాలన్న ప్రయత్నాలన్నీ, దేవుని సర్వాధిపత్యానికి విధేయత చూపడానికి బదులు తమ సొంత విధానంలో పనులు చేయాలనుకునేవారి స్వార్థం మూలంగా విఫలమయ్యాయి.

మరో సమస్య ఉంది—దీన్ని చాలామంది మూర్ఖమైన మూఢనమ్మకం అని కొట్టిపారేస్తుండవచ్చు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును రేకెత్తించినవాడే, ప్రజలు చెడుతనానికీ స్వార్థానికీ పాల్పడేలా ఇప్పటికీ చేస్తున్నాడు. అతడే అపవాదియైన సాతాను. యేసుక్రీస్తు అతడ్ని “ఈ లోకాధికారి” అని పిలిచాడు. (యోహాను 12:31; 14:30; 2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19) అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన ప్రకటనలో సాతాను, శ్రమకు ప్రధానమైన మూలంగా, “సర్వలోకమును మోసపుచ్చ”టానికి ప్రాథమిక కారకునిగా గుర్తించబడ్డాడు.—ప్రకటన 12:9-12.

కొంతమంది ప్రజలు తమ తోటి మానవుల గురించి ఎంత శ్రద్ధ కల్గివున్నప్పటికీ, వాళ్లు అపవాదియైన సాతానును ఎన్నటికీ నిర్మూలించలేరు లేక నిరంతరం అధికమౌతుండే బాధితులను వృద్ధిచేసే ఈ విధానాన్ని ఎన్నటికీ మార్చలేరు. మరి మానవజాతి సమస్యలను పరిష్కరించటానికి ఏం అవసరం? దానికి పరిష్కారం కేవలం శ్రద్ధ ఉన్నవారు కాదు. సాతానునూ, అన్యాయమైన అతని మొత్తం విధానాన్నీ నిర్మూలించాలన్న కోరికా, నిర్మూలించే శక్తీ ఉన్నవారు అవసరం.

“నీ చిత్తము . . . భూమియందును నెరవేరును”

ఈ దుష్ట విధానాన్ని నాశనం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా చేయాలన్న కోరికా, చేసే శక్తీ రెండూ ఆయనకున్నాయి. (కీర్తన 147:5, 6; యెషయా 40:25-31) ప్రవచనాత్మక బైబిలు పుస్తకమైన దానియేలులో ఇలా ప్రవచించబడింది: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును”—అవును అది, నిరంతరం నిలుస్తుంది. (దానియేలు 2:44) “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని దేవుడ్ని ప్రార్థించమని యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించినప్పుడు ఆయన మనస్సులో ఉన్నది ఆ నిరంతరం నిలిచే ప్రయోజనకరమైన పరలోక రాజ్యమే.—మత్తయి 6:9, 10.

యెహోవా అలాంటి ప్రార్థనలకు ఉత్తరమిస్తాడు, ఎందుకంటే ఆయనకు మానవజాతి పట్ల నిజంగా శ్రద్ధ ఉంది. 72వ కీర్తనలోని ప్రవచనార్థక మాటల ప్రకారం, యేసు పరిపాలనకు మద్దతునిచ్చే పేదవారికీ, బాధితులకూ, నిర్భాగ్యులకూ నిరంతర ఉపశమనాన్ని తీసుకు వచ్చేందుకు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుకు అధికారాన్నిస్తాడు. అందుకే, ప్రేరేపించబడిన కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “శ్రమనొందువారికి అతడు [దేవుని మెస్సీయ రాజు] న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలుగగొట్టును. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”—కీర్తన 72:4, 12-14.

మన దినం ఇమిడివున్న ఒక దర్శనంలో, అపొస్తలుడైన యోహాను, “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” అంటే దేవుడు స్థాపించిన పూర్తి క్రొత్త విధానాన్ని చూశాడు. బాధ అనుభవిస్తున్న మానవజాతికి ఎంతటి ఆశీర్వాదం ! యెహోవా ఏం చేస్తాడనేదాని గురించి ముందుగానే తెలియజేస్తూ, యోహాను ఇలా వ్రాశాడు: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.”—ప్రకటన 21:1-5.

అవును, మనం ఈ మాటలను నమ్మవచ్చు, ఎందుకంటే అవి నమ్మదగినవి, నిజమైనవి. యెహోవా భూమి మీది నుండి పేదరికాన్నీ, ఆకలినీ, అణిచివేతనూ, రోగాన్నీ, అన్యాయాన్నంతటినీ త్వరలోనే నిర్మూలిస్తాడు. ఈ పత్రిక తరచూ లేఖనాల నుండి ఎత్తిచూపించినట్లుగా, ఈ వాగ్దానాలు నెరవేరబోయే సమయంలో మనం జీవిస్తున్నామని అనేకానేక సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకం సమీపంలో ఉంది! (2 పేతురు 3:13) త్వరలోనే యెహోవా ‘మరెన్నడును ఉండకుండ మరణమును మ్రింగివేయును,’ అంతేగాక ఆయన “ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8.

అది జరిగే వరకూ, ఇప్పుడు కూడా నిజంగా శ్రద్ధగల ప్రజలు ఉన్నందుకు మనం ఆనందించవచ్చు. యెహోవా దేవుడు తానే నిజంగా శ్రద్ధ కల్గివున్నాడన్నది మరింత ఆనందానికి కారణమైన విషయం. ఆయన త్వరలోనే అణచివేతనంతటినీ, బాధనంతటినీ నిర్మూలిస్తాడు.

యెహోవా వాగ్దానాలందు మీరు పూర్తి నమ్మకాన్ని కల్గివుండవచ్చు. ఆయన సేవకుడైన యెహోషువ అలాగే పూర్తి నమ్మకాన్ని కల్గివున్నాడు. దేవుని ప్రాచీన ప్రజలకు ఆయన పూర్తి నిశ్చయతతో ఇలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” (యెహోషువ 23:14) కాబట్టి ప్రస్తుత విధానం ఇంకా మిగిలి ఉండగా, మీరు ఎదుర్కోవలసి వచ్చే శ్రమలను బట్టి సతమతమైపోకండి. మీ చింత యావత్తూ యెహోవాపైన వేయండి, ఎందుకంటే ఆయనకు మీ పట్ల శ్రద్ధ ఉంది.—1 పేతురు 5:7.

[7వ పేజీలోని చిత్రాలు]

దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలో, భూమి మీద నుండి పేదరికం, అణచివేత, రోగం, అన్యాయం నిర్మూలించబడతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి