“మంచి భార్యతో ఆనందభరితుడైన భర్త”
కొన్నిసార్లు, కొంతమంది ప్రజలు యెహోవాసాక్షులు వివాహాలను విచ్ఛిన్నం చేస్తారని వారిని నిందిస్తారు. అయితే, భార్యాభర్తల్లో కేవలం ఒకరు మాత్రమే యెహోవాసాక్షి అయ్యున్న అనేకానేక విజయవంతమైన వివాహాలు అది కచ్చితంగా అసత్యమని నిరూపిస్తున్నాయి. వైవాహిక జీవితానికి సంబంధించి ఇవ్వబడుతున్న బైబిలు ఉపదేశాన్ని స్వీకరించటం ఆనందభరితమైన వివాహ జీవితానికి నడిపిస్తుంది, ఫ్రెంచ్ వార్తాపత్రికలో ప్రచురించబడిన ఈ ఉత్తరం ఆ విషయాన్ని చూపిస్తుంది.
“ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలుగా నేను యెహోవాసాక్షియైన మంచి భార్యతో ఆనందభరితుడైన భర్తగా ఉన్నాను. ఆమె నా ఐదుగురు పిల్లలను పెంచింది, వాళ్లలో ఇద్దరు ఆమె స్వంత పిల్లలు కాకపోయినా వారందరినీ ఒకే విధమైన శ్రద్ధతో, ఒకే విధమైన ప్రేమతో ఆమె పెంచింది. ప్రస్తుతం 45 మంది ఉద్యోగులున్న కంపెనీకి డైరెక్టర్గా, నా ఉద్యోగ సాఫల్యానికి కూడా ఆమె ఎంతగానో తోడ్పడిందని నేను కచ్చితంగా చెప్పగలను. నేను తెప్పించుకునే వార్తాపత్రికలో, యెహోవాసాక్షులు లోటేగరోన్ ప్రాంతానికి ఒక ముప్పు అని చెప్తున్న శీర్షికను చూసినప్పుడు, నేను ఒక అధికారిక సాక్ష్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.”
ఆ ఉత్తరం ఇంకా ఇలా చెప్తుంది: “వాళ్లు పొగత్రాగరు, వాళ్లు త్రాగుబోతులు కాదు. ఇదొక ముప్పా? వాళ్లు తాము అనుసరించే నియమాలను ఇతరులపై రుద్దని, సహనంగల క్రైస్తవులు. బదులుగా, అనేక విధాలుగా వారు మంచి ఉదాహరణగా ఉన్నారు. . . . వాళ్లు ఆర్థికపరమైన కుంభకోణాల్లోనో లేక మాదకద్రవ్యాల దొంగ వ్యాపారాల్లోనో పాల్గొనే ప్రజలు కాదు. వాళ్లు బ్రహ్మచర్యాన్ని పాటించరు, కానీ వాళ్లు సాధారణమైన జీవితాన్ని గడుపుతారని నేను హామీ ఇవ్వగలను. . . .
“మరి మీరు కూడా ఎందుకు యెహోవాసాక్షి కాలేదు? అని మీరడగవచ్చు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసమూ, కచ్చితమైన నైతికతలు అవసరం, సామాన్యులలో వీటిని కనుగొనటం అంత సులభం కాదు.”