యౌవనస్థులారా—మీ గ్రహణ శక్తులకు శిక్షణనివ్వండి!
“వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు [“గ్రహణ శక్తులు,” NW] కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.”—హెబ్రీయులు 5:14.
1, 2. (ఎ) నేటి మన పరిస్థితి ఎఫెసులోని ప్రాచీన క్రైస్తవుల పరిస్థితిని ఎలా పోలి ఉంది? (బి) ఎటువంటి సామర్థ్యాలు మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడగలవు, మీరు వాటిని ఎలా పెంపొందించుకోగలరు?
“దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫెసీయులు 5:15, 16) అపొస్తలుడైన పౌలు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ మాటలను వ్రాసినప్పటి నుండి ‘దుర్జనులు వంచకులు అంతకంతకు చెడిపోయారు.’ మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నాము, లేదా మరో అనువాదం చెబుతున్నట్లుగా, “పూర్తి ప్రమాదాలతో నిండిన” కాలంలో జీవిస్తున్నాము.—2 తిమోతి 3:1-5, 13; ఫిలిప్స్.
2 అయితే, ‘బుద్ధిని తెలివిని వివేచనను’ పెంపొందించుకోవడం ద్వారా మీ మార్గంలో పొంచివుండే ప్రమాదాలను తప్పించుకోవచ్చు. (సామెతలు 1:4) సామెతలు 2:10-12 ఇలా చెబుతుంది: “జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.” కానీ మీరు ఈ సామర్థ్యాలను అసలు ఎలా పెంపొందించుకోగలరు? హెబ్రీయులు 5:14 ఇలా చెబుతుంది: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు [“గ్రహణ శక్తులు,” NW] కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” దేంట్లో ప్రావీణ్యం సంపాదించాలన్నా శిక్షణ అవసరమైనట్లే, తన గ్రహణ శక్తులను ఉపయోగించటంలో ప్రావీణ్యం సంపాదించటానికి కూడా శిక్షణ అవసరం. పౌలు ఉపయోగించిన గ్రీకు పదానికి అక్షరార్థంగా ‘వ్యాయామం చేసే వ్యక్తిలా శిక్షణ పొందటం’ అని భావం. అటువంటి శిక్షణను మీరు ఎలా ప్రారంభించవచ్చు?
మీ గ్రహణ శక్తులకు శిక్షణనివ్వటం
3. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు మీ గ్రహణ శక్తులను ఎలా ఉపయోగించగలరు?
3 మీ గ్రహణ శక్తులకు—మంచి చెడులను వివేచించే మీ సామర్థ్యానికి—‘సాధకము’ చేయడం ద్వారా మీరు శిక్షణనివ్వగలరని గమనించండి. మీరేదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంచనాలు కట్టడమో, అనాలోచితంగా చర్య తీసేసుకోవడమో, లేదా గ్రుడ్డిగా అందరూ చేసేదే చేసేయడమో వంటివి జ్ఞానవంతమైన ఎంపికలు కావు. జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు మీ గ్రహణ శక్తులను ఉపయోగించాలి. ఎలా? మొట్టమొదటిగా, పరిస్థితిని పూర్తిగా పరిశోధించి వాస్తవాలన్నింటినీ సంపాదించటం ద్వారా అలా చేయవచ్చు. అవసరమైనప్పుడు ప్రశ్నలు వేయండి. ఎంపిక చేసుకునేందుకున్న వివిధ అవకాశాల గురించి ఆలోచించండి. సామెతలు 13:16 ఇలా చెబుతుంది: “వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు.” తరువాత, ఆ అంశానికి ఏ బైబిలు నియమాలు, సూత్రాలు వర్తిస్తాయో నిర్ధారించుకోవటానికి ప్రయత్నించండి. (సామెతలు 3:5) అయితే, ఇలా చేయాలంటే మీకు బైబిలు జ్ఞానం అవసరం. అందుకనే పౌలు, “బలమైన ఆహారము” తీసుకోమని—సత్యం యొక్క “వెడల్పు పొడుగు లోతు ఎత్తు” తెలుసుకోమని ప్రోత్సహిస్తున్నాడు.—ఎఫెసీయులు 3:18.
4. దేవుని సూత్రాలను గూర్చిన జ్ఞానము ఎందుకు అత్యంత ప్రాముఖ్యం?
4 అలా చేయటం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే మనం అపరిపూర్ణులం, పాపంవైపుకి మొగ్గుతుంటాము. (ఆదికాండము 8:21; రోమీయులు 5:12) “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని యిర్మీయా 17:9 చెబుతుంది. మనల్ని నిర్దేశించటానికి దైవిక సూత్రాలు లేకపోయినట్లైతే మనం ఏదైనా చెడ్డ విషయాన్ని అది మంచిదని తలంచేలా మనల్ని మనం మోసంచేసుకోవచ్చు—దానిక్కారణం కేవలం పాపభరితమైన మన శరీరం ఆ చెడు విషయాన్ని వాంఛించడమే. (పోల్చండి యెషయా 5:20.) కీర్తన గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను, తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.”—కీర్తన 119:9, 104.
5. (ఎ) కొంతమంది యౌవనులు ఎందుకు తప్పు మార్గాల్ని అనుసరిస్తున్నారు? (బి) ఒక యౌవనస్థురాలు సత్యాన్ని ఎలా తన స్వంతం చేసుకుంది?
5 క్రైస్తవ గృహాల్లోనే పెరిగిన కొందరు యౌవనులు ఎందుకు తప్పుమార్గాల్ని అనుసరించారు? అటువంటివారు ‘తమకై తాము ఉత్తమమైన అనుకూలమైన దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకోనందుకేనా’? (ఇటాలిక్కులు మావి.) (రోమీయులు 12:2) కొందరు తమ తల్లిదండ్రులతో కూటాలకు హాజరౌతుండవచ్చు, బైబిల్లోని కొన్ని ప్రాథమికమైన బోధలను ఒప్పజెప్పగలుగుతుండవచ్చు. కానీ తాము నమ్ముతున్న విషయాలకు రుజువులిమ్మనో లేదా దేవుని వాక్యంలోని కొన్ని లోతైన విషయాలను వివరించమనో అడిగినప్పుడు వారిది మిడిమిడి జ్ఞానం మాత్రమేనని తేలుతుంది. అటువంటి యౌవనులు మోసపోవడం చాలా సులభం. (ఎఫెసీయులు 4:14) ఇది మీ విషయంలో నిజమైతే, కొన్ని మార్పులు చేసుకోవాలని ఎందుకు తీర్మానించుకోకూడదు? ఒక యౌవన సహోదరి ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది: “నేను బాగా పరిశోధన చేశాను. నన్ను నేను, ‘ఇదే సరైన మతమని నాకెలా తెలుసు? యెహోవా అనే పేరుగల దేవుడు ఉన్నాడని నాకెలా తెలుస్తుంది?’ అని ప్రశ్నించుకున్నాను.”a లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించటం ద్వారా తన తల్లిదండ్రులు తనకు నేర్పించినవి వాస్తవాలేనని ఆమె గ్రహించింది !—పోల్చండి అపొస్తలుల కార్యములు 17:11.
6. ‘ప్రభువు’ అయిన యెహోవాకు ‘ఏది ప్రీతికరమో దానిని’ మీరెలా పరీక్షించగలుగుతారు?
6 యెహోవా అందించిన సూత్రాలను గూర్చిన జ్ఞానంతో నిండినవారై మీరు మరింత సుళువుగా ‘ప్రభువుకేది ప్రీతికరమో దానిని పరీక్షించగలుగుతారు.’ (ఎఫెసీయులు 5:10) అయితే ఏదైనా ఫలాని పరిస్థితిలో జ్ఞానవంతమైన పని ఏమిటో మీకు స్పష్టంగా తెలియనప్పుడు ఏమి చేయాలి? నడిపింపు కోసం యెహోవాకు ప్రార్థించండి. (కీర్తన 119:144) విషయాలన్నీ మీ తల్లిదండ్రులతోనో లేదా ఎవరైనా పరిణతిగల క్రైస్తవుడు/రాలితోనో చర్చించడానికి ప్రయత్నించండి. (సామెతలు 15:22; 27:17) బైబిలును, వాచ్ టవర్ ప్రచురణలను పరిశోధించటం ద్వారా కూడా మీకు సహాయపడగల నడిపింపును పొందగలరు. (సామెతలు 2:3-5) మీరు మీ గ్రహణ శక్తులను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అవి అంత నిశితంగా తయారౌతాయి.
వినోదం విషయంలో వివేచన
7, 8. (ఎ) ఏదైనా పార్టీకి హాజరు కావాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి మీరు మీ గ్రహణ శక్తులను ఎలా ఉపయోగించగలరు? (బి) వినోదం విషయంలో బైబిలు దృక్కోణం ఏమిటి?
7 మనమిప్పుడు కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో మీరు మీ గ్రహణ శక్తులను ఎలా ఉపయోగించగలరో చూద్దాము. ఉదాహరణకు, మిమ్మల్ని ఒక పార్టీకి ఆహ్వానించారని అనుకుందాము. ఆ పార్టీని గురించిన ఆహ్వాన పత్రికను కూడా మీరు అందుకున్నారు. పెద్ద సంఖ్యలో యెహోవాసాక్షులైన యువతీ యువకులు అక్కడ ఉంటారని మీకు చెప్పారు. కానీ ఖర్చులకు మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సివుంటుంది. మీరు అక్కడికి వెళ్లాలా?
8 మీ గ్రహణ శక్తుల్ని ఉపయోగించండి. మొట్టమొదటిగా, వాస్తవాల్ని సంపాదించండి. ఆ పార్టీ ఎంత పెద్దదిగా ఉంటుంది? అక్కడ ఎవరెవరు ఉంటారు? ఎప్పుడు మొదలౌతుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఏ కార్యకలాపాలు ఉంటాయి? దాని పర్యవేక్షణ ఎలా జరుగుతుంది? అటుతర్వాత, కొంత పరిశోధన చేయండి, వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో “సోషల్ గేదరింగ్స్,” “ఎంటర్టెయిన్మెంట్” అనే అంశాల క్రింద చూడండి.b మీ పరిశోధన ఏమి చూపిస్తుంది? ఒక స్పష్టమైన విషయం ఏమిటంటే ఆనందించటానికి ఒకచోట సమకూడటాన్ని యెహోవా ఖండించడు. నిజానికి, కష్టపడి పనిచేయటానికి తోడు “అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు” అని ప్రసంగి 8:15 చెబుతుంది. అంతెందుకు, స్వయాన యేసుక్రీస్తు ప్రత్యేక సందర్భంలో భోజనానికి హాజరయ్యాడు, కనీసం ఒక వివాహానికి హాజరయ్యాడు. (లూకా 5:27-29; యోహాను 2:1-10) సమతుల్యంగా ఉంచినట్లైతే సామాజికంగా కూడుకోవటం ప్రయోజనకరంగా ఉండగలదు.
9, 10. (ఎ) కొన్ని పార్టీల్లో ఎటువంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది? (బి) ఏదైనా పార్టీకి హాజరు కావాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి ముందు మీరు ఏ ప్రశ్నలు ప్రశ్నించుకోవచ్చు?
9 అలా కాక, సరిగా సంస్థీకరింపబడని పార్టీలు సమస్యల్ని ఉత్పన్నం చేయగలవు. జ్ఞానవంతంకాని సహవాసాలు వ్యభిచారానికీ, “ఒక్క దినముననే యిరువది మూడువేలమంది” విశ్వాసభ్రష్టులైన ఇశ్రాయేలీయులు హతం కావడానికీ ఎలా నడిపించాయో 1 కొరింథీయులు 10:8లో మనం చదువుతాము. మరో గంభీరమైన హెచ్చరిక రోమీయులు 13:13లో ఉంది: “అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయనను లేకయు, కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.” (పోల్చండి 1 పేతురు 4:3.) నిజమే, ఒక పార్టీకి ఎంతమంది హాజరు కావచ్చనే విషయంలో ఒక సంఖ్యను నిర్ణయించి చెప్పలేము. కానీ సంఖ్య ఎంత పెద్దగా ఉంటుందో దాన్ని పర్యవేక్షించటం అంత కష్టంగా ఉన్నట్లు అనుభవం చూపిస్తోంది. చిన్నగా ఉండి చక్కగా నిర్వహించబడిన పార్టీలు ‘విశృంఖలమైన పార్టీలు’గా మారే సాధ్యత తక్కువ.—గలతీయులు 5:21, బైయింగ్‌టన్.
10 మీరు చేసే పరిశోధన నిస్సందేహంగా మరిన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతుంది, ఉదాహరణకు, ఆ పార్టీలో కొందరు పెద్దవయస్సుగల పరిణతిచెందిన క్రైస్తవులు ఉంటారా? నిజానికి దీన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ పార్టీ అసలు ఉద్దేశ్యం ఆరోగ్యకరమైన సహవాసాన్ని వృద్ధిచేయటమా లేదా ఎవరికైనా లాభాన్ని చేకూర్చటమా? ఎవరు హాజరు కావచ్చుననే విషయంలో ఏమైనా నిర్బంధాలున్నాయా? ఆ పార్టీ శనివారంలో ఉన్నట్లైతే, హాజరైన వారు ఆ తర్వాతి రోజు క్రైస్తవ పరిచర్యలో భాగం వహించగలిగే విధంగా అది సహేతుకమైన సమయానికి ముగుస్తుందా? సంగీతమూ, నృత్యమూ ఉంటే అవి క్రైస్తవ ప్రమాణాలకు అనుగుణ్యంగా ఉంటాయా? (2 కొరింథీయులు 6:3) అటువంటి ప్రశ్నలు ప్రశ్నించుకోవటం అంత సులభం కాదు. కానీ సామెతలు 22:3 ఇలా హెచ్చరిస్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” అవును, మీరు మీ గ్రహణ శక్తులను ఉపయోగించడం ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోగలరు.
విద్యాభ్యాసం విషయంలో వివేచన
11. యౌవనస్థులు తమ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవటానికి తమ గ్రహణ శక్తులను ఎలా ఉపయోగించవచ్చు?
11 భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవటం జ్ఞానవంతమైన పని అని బైబిలు చెబుతుంది. (సామెతలు 21:5) మీరూ మీ తల్లిదండ్రులూ కలిసి మీ భవిష్యత్తు గురించి చర్చించారా? బహుశ మీరు పయినీరుగా పూర్తికాల పరిచర్యలో ప్రవేశించాలని ప్రణాళిక వేస్తుండవచ్చు. నిజంగా, అంతకన్నా గొప్ప సంతృప్తిని వేరే ఏ కెరీర్ కూడా ఇవ్వదు. మీరు మంచి పఠన అలవాట్లను పెంపొందించుకుంటూ, పరిచర్యలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నట్లైతే ఈ ఉత్తేజవంతమైన కెరీర్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధపర్చుకుంటున్నట్లే. పరిచర్య చేస్తూ మిమ్మల్ని మీరు ఎలా పోషించుకోగలరనే దాని గురించి ఆలోచించారా? భవిష్యత్తులో ఒకవేళ మీరు ఒక కుటుంబాన్ని పోషించాల్సివుంటే, ఆ అదనపు బాధ్యతల్ని మీరు చేపట్టగల్గుతారా? ఇటువంటి విషయాల్లో సమతుల్యమైన, వాస్తవికమైన నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహణ శక్తులను ఉపయోగించటం అవసరం అవుతుంది.
12. (ఎ) మారుతున్న ఆర్థిక స్థితులకు తగ్గట్టుగా కొన్ని కుటుంబాలు ఎలా మార్పులు చేసుకున్నాయి? (బి) కొంత అదనపు విద్యను సంపాదించటం పయినీరింగ్ని లక్ష్యంగా పెట్టుకోవడానికి విరుద్ధమా? వివరించండి.
12 కొన్ని ప్రాంతాల్లో ఏదైనా పనిలోనో వృత్తిలోనో కొనసాగుతూనే శిక్షణపొందే సౌకర్యం ఉంది. కొంతమంది యౌవనస్థులు కుటుంబ వ్యాపారంలో కౌశలం సంపాదిస్తారు లేదా పెద్ద వయస్కులైన సన్నిహితులకు వ్యాపారాలు ఉంటే వారి దగ్గర శిక్షణ పొందుతారు. మరితరులు స్కూల్లో ఉన్నప్పుడే అటుతర్వాత జీవనభృతినిచ్చే కోర్సులను నేర్చుకుంటారు. అటువంటి అవకాశాలు లేనిచోట్ల, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించిన పిమ్మట తమ పిల్లలు హైస్కూలు తర్వాత కొంత అదనపు విద్యను సముపార్జించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ విధంగా పెద్దవారైనప్పుడు ఎదురయ్యే బాధ్యతలను చేపట్టడానికి, ప్రాముఖ్యంగా పయినీరు సేవను ఎక్కువకాలంపాటు చేయటానికి సిద్ధమయ్యేందుకు ప్రణాళికలు వేసుకోవడం దేవుని రాజ్యాన్ని మొదట ఉంచడానికి విరుద్ధమేమీ కాదు. (మత్తయి 6:33) అంతేగాక, అదనపు విద్య పొందటం అంటే పయినీరింగ్ చేయలేకపోవటం అని కాదు అర్థం. ఉదాహరణకు, ఒక యౌవనురాలైన యెహోవాసాక్షి దీర్ఘకాలంపాటు పయినీరు సేవ చేయాలనుకుంది. ఆమె హైస్కూలు పూర్తి చేసిన తర్వాత, క్రమ పయినీర్లైన ఆమె తల్లిదండ్రులు ఆమె అదనపు విద్యను పొందేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె విద్యను కొనసాగిస్తూనే పయినీరింగ్ చేయగల్గింది, ఇప్పుడామె తనను తాను పోషించుకుంటూనే పయినీరింగ్ చేయగల్గుతోంది.
13. అదనపు విద్యకు సంబంధించి కుటుంబాలు ఎలా తగులుబడి చూసుకోవాలి?
13 అదనపు విద్య విషయంలో ప్రతి కుటుంబానికీ తన స్వంత నిర్ణయాన్ని తీసుకునే హక్కూ, బాధ్యతా ఉన్నాయి. విద్యను బాగా ఆలోచించి ఎంపిక చేసుకున్నప్పుడు అది సహాయకరంగా ఉంటుంది. అయితే అది ఉచ్చుగా మారే అవకాశం ఉంది. మీరు అటువంటి విద్యను పొందాలని ఆలోచిస్తున్నట్లైతే మీ లక్ష్యం ఏమిటి? పెద్దయ్యాక వచ్చే బాధ్యతల్ని గౌరవనీయమైన రీతిలో చేపట్టడానికి మిమ్మల్ని మీరు సిద్ధపర్చుకోవడమేనా? లేక ‘మీ నిమిత్తము మీరు గొప్పవాటిని వెదుకుతున్నారా’? (యిర్మీయా 45:5; 2 థెస్సలొనీకయులు 3:10; 1 తిమోతి 5:8; 6:9) ఇంటికి దూరంగా ఉంటూ, బహుశ ఏదైనా హాస్టల్లో ఉంటూ అదనపు విద్యను ఆర్జించే విషయమేమిటి? “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అన్న పౌలు హెచ్చరిక దృష్ట్యా అది జ్ఞానవంతంగా ఉంటుందా? (1 కొరింథీయులు 15:33; 2 తిమోతి 2:22) “కాలము సంకుచితమై యున్నది” అని కూడా గుర్తుంచుకోండి. (1 కొరింథీయులు 7:29) మీరు అటువంటి విద్య కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తారు? మీ యౌవనకాలంలో ఎక్కువ శాతం దానికే వెచ్చించాల్సి ఉంటుందా? అలాగైతే మీరు, “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని ప్రోత్సహిస్తున్న బైబిలు వచనాన్ని ఎలా అన్వయించుకుంటారు? (ప్రసంగి 12:1) అంతేగాక, మీరు తీసుకోబోయే కోర్సులు కూటాల హాజరు, క్షేత్ర సేవ, వ్యక్తిగత అధ్యయనం వంటి కీలకమైన క్రైస్తవ కార్యకలాపాలకు సమయాన్ని అనుమతిస్తాయా? (మత్తయి 24:14; హెబ్రీయులు 10:24, 25) మీ గ్రహణ శక్తులు చురుకుగా ఉన్నట్లైతే, మీరూ మీ తల్లిదండ్రులూ కలిసి మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుండగా ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎన్నడూ మర్చిపోరు.
కోర్ట్షిప్ను ఘనమైనదిగా ఉంచటం
14. (ఎ) కోర్ట్‌షిప్ కొనసాగిస్తున్న జంట, ఒకరిపట్ల ఒకరు అనురాగాన్ని ప్రదర్శిస్తుండగా వారిని ఏ సూత్రాలు నిర్దేశించాలి? (బి) కొన్ని జంటలు ఈ విషయంలో ఎలా వివేచనను కోల్పోయారు?
14 కోర్ట్‌షిప్ కొనసాగించే విషయంలో కూడా మీ గ్రహణ శక్తులు అవసరమౌతాయి. మీరు ఇష్టపడే వ్యక్తిపట్ల అనురాగాన్ని ప్రదర్శించాలనుకోవటం చాలా సహజం. పరమగీతములోని పవిత్రమైన జంట తాము వివాహం చేసుకోవడానికి ముందు ఒకరిపట్ల ఒకరికిగల అనురాగాన్ని కొన్ని రీతుల్లో ప్రదర్శించుకున్నారని స్పష్టంగా ఉంది. (పరమగీతము 1:2; 2:6; 8:5) నేడు, అదే రీతిలో కోర్ట్‌షిప్ కొనసాగిస్తున్న కొన్ని జంటలు చేతులు పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం, హత్తుకోవడం యుక్తమైనవేనని భావించవచ్చు, ప్రాముఖ్యంగా వివాహం త్వరలో జరుగుతుందనుకున్నప్పుడు. కానీ గుర్తుంచుకోండి: “తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు.” (సామెతలు 28:26) విచారకరంగా, కొందరు వివేచనను ఉపయోగించక క్రైస్తవ సూత్రాల విషయంలో రాజీపడిపోయారు. అనురాగాన్ని ప్రదర్శించే విధానాలు తీవ్రతరమై, అదుపుతప్పాయి; ఫలితంగా అపరిశుభ్రమైన క్రియలు చేయటం, చివరికి లైంగిక అనైతికతకు దారితీయటం జరిగింది.
15, 16. తమ కోర్ట్షిప్ను ఘనమైన రీతిలో ఉంచుకునేలా చూసుకోవడానికి జంటలు ఎటువంటి సహేతుకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు?
15 మీరు డేటింగ్ చేస్తున్నట్లైతే భావి జీవిత భాగస్వామితో అనుచితమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఉండటాన్ని నివారించడం జ్ఞానయుక్తం. అందుకని ఇతరుల సాన్నిధ్యంలోనో లేదా బహిరంగ ప్రదేశాల్లోనో ఒకరి సహవాసాన్ని మరొకరు ఆనందించడం శ్రేష్ఠం. కొన్ని జంటలు తమతోపాటు మరో వ్యక్తి ఉండేలా ఏర్పాటు చేసుకుంటాయి. అంతేగాక, హోషేయ 4:11లోని మాటల్ని పరిగణలోనికి తీసుకోండి: “ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.” మద్యపానీయాలు వివేచనా శక్తిని క్షీణింపజేస్తాయి, అటుతర్వాత తాము పశ్చాత్తాపపడే పనులు చేసేందుకు కూడా ఒక జంటను నడిపించవచ్చు.
16 సామెతలు 13:10 ఇలా చెబుతుంది: “గర్వమువలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.” అవును మీరు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి కలిసి ‘ఆలోచన చేయండి,’ చర్చించుకోండి. అనురాగాన్ని ప్రదర్శించుకునే విషయంలో పరిమితులు ఏర్పర్చుకోండి, అవతలి వ్యక్తి భావాల్నీ మనస్సాక్షినీ పరస్పరం గౌరవించుకోండి. (1 కొరింథీయులు 13:5; 1 థెస్సలొనీకయులు 4:3-7; 1 పేతురు 3:15, 16) ఈ సున్నితమైన విషయాన్ని గురించి చర్చించటం మొదట్లో కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ అలా చేయడం అటుతర్వాత గంభీరమైన సమస్యలు లేవనెత్తకుండా చేయగలదు.
“బాల్యమునుండి” నేర్చించబడటం
17. దావీదు యెహోవాను ‘బాల్యమునుండే తన ఆశ్రయముగా’ ఎలా చేసుకున్నాడు, అందులో నేటి యువతకు ఎటువంటి పాఠం ఉంది?
17 సాతాను పన్నే ఉచ్చుల్ని తప్పించుకోవడానికి మీ వైపునుండి నిరంతరమైన జాగరూకత అవసరం—కొన్నిసార్లు ధైర్యం కూడా అవసరమౌతుంది. కొన్ని సమయాల్లో మీరు కేవలం మీ తోటివయస్కుల వారికి మాత్రమే కాక పూర్తి లోకానికే విరుద్ధంగా ఉన్నట్లు అన్పించవచ్చు. కీర్తనల గ్రంథకర్త దావీదు ఇలా ప్రార్థించాడు: “నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.” (కీర్తన 71:5, 17)c దావీదు ధైర్యానికి ప్రసిద్ధిగాంచాడు. ఆయన దాన్నెప్పుడు అలవర్చుకున్నాడు? బాల్యంలోనే ! గొల్యాతుతో ప్రఖ్యాతిచెందిన ఆయన పోరాటానికి మునుపే దావీదు తన తండ్రి గొఱ్ఱెలను కాయటంలో అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించాడు—ఒక సింహాన్నీ, ఒక ఎలుగుబంటినీ చంపాడు. (1 సమూయేలు 17:34-37) అయితే, దావీదు “బాల్యమునుండి నా ఆశ్రయము” ఆయనే అంటూ తాను ప్రదర్శించిన సాహసానికి పూర్తి ఘనత యెహోవాకే ఇచ్చాడు. యెహోవాపై ఆధారపడటంలో దావీదు చూపిన సామర్థ్యం ఆయనకు ఎదురైన ఎటువంటి పరీక్షనైనా అధిగమించటానికి ఆయనను సిద్ధం చేసింది. యెహోవాపై ఆధారపడినట్లైతే, ‘లోకాన్ని జయించటానికి’ కావల్సిన ధైర్యాన్నీ బలాన్నీ ఆయన ఇస్తాడని మీరు కూడా కనుగొంటారు.—1 యోహాను 5:4.
18. నేటి దైవిక యౌవనస్థులకు ఎటువంటి పురికొల్పు ఉంది?
18 మీలాగే వేలాదిమంది యౌవనస్థులు ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న సువార్త ప్రచారకులుగా సేవచేస్తున్నారు. యౌవనులైన మీరు చూపించే విశ్వాసానికీ ధైర్యానికీ మేము దేవునికి ధన్యవాదాలు తెల్పుతున్నాము! ఈ లోక భ్రష్టత్వం మీకంటకుండా దూరంగా ఉండాలని కృత నిశ్చయం చేసుకుని అలాగే ముందుకు కొనసాగండి. (2 పేతురు 1:4) బైబిలుచే శిక్షణ పొందిన మీ గ్రహణ శక్తులను ఉపయోగిస్తూ ఉండండి. అలా చేయటం మిమ్మల్ని ఇప్పుడు ప్రమాదం నుండి కాపాడుతుంది, అంతేగాక చిట్టచివరికి మీ రక్షణను రూఢీ చేస్తుంది. నిజంగానే, మన చివరి శీర్షిక చూపించే రీతిగానే, మీరు మీ జీవితాన్ని విజయవంతం చేసుకుంటారు.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! యొక్క నవంబరు 8, 1998 సంచికలో, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . సత్యాన్ని ఎలా నా సొంతం చేసుకోగలను?” అనే శీర్షిక చూడండి.
b ఈ విషయంపైన నవంబరు 1, 1992 సంచిక కావలికోటలో వచ్చిన, “సామాజిక వినోదము—ప్రయోజనాలు అనుభవించండి, ఉరులను తప్పించుకోండి” అనే శీర్షికలో చక్కని సమాచారం ఉంది.
c 71వ కీర్తన, దావీదు రచించిన కీర్తన అని పైవిలాసము ఉన్న 70వ కీర్తనకు కొనసాగింపుగా అన్పిస్తుంది.
పునస్సమీక్షకు ప్రశ్నలు
◻ ఒక యౌవనస్థుడు/రాలు తన గ్రహణ శక్తులకు ఎలా శిక్షణనివ్వవచ్చు?
◻ ఒక యౌవనస్థుడు/రాలు క్రైస్తవులు హాజరయ్యే పార్టీలకు వెళ్లడం విషయంలో ఎలా తన గ్రహణ శక్తులను ఉపయోగించవచ్చు?
◻ తన విద్య గురించి ప్రణాళిక వేసుకోవడానికి ఏ విషయాలని పరిగణలోనికి తీసుకోవచ్చు?
◻ కోర్ట్‌షిప్ కొనసాగిస్తున్న జంటలు లైంగిక అనైతికత అనే ఉచ్చును ఎలా తప్పించుకోవచ్చు?
[15వ పేజీలోని చిత్రం]
పరిశోధన చేయటం నేర్చుకుంటే మీ గ్రహణ శక్తులకు మీరు శిక్షణనివ్వటంలో సహాయాన్ని పొందుతారు
[16వ పేజీలోని చిత్రం]
చిన్న మొత్తంలో సమకూడటం మూలంగా, పర్యవేక్షణ సులభంగా ఉంటుంది, అదుపుతప్పిన అల్లరితోకూడిన ఆటలుగా మారే అవకాశాలు తక్కువ
[16వ పేజీలోని చిత్రం]
తల్లిదండ్రులు తమ పిల్లల విద్య విషయంలో ప్రణాళిక వేసుకోవడానికి వారికి సహాయం చేయాలి
[17వ పేజీలోని చిత్రం]
ఇతరుల సాన్నిధ్యంలో డేటింగ్ చేయడం కాపుదలగా ఉంటుంది