తోటివారి ఒత్తిడి, ప్రకటించే మీ ఆధిక్యత
1 తోటివారి ఒత్తిడి ఒక శక్తివంతమైన ప్రభావం—అది మంచికైనా సరే, చెడుకైనా సరే. తోటివారైన యెహోవా సేవకులు, మంచి క్రైస్తవ పనులను చేసేందుకు మనల్ని పురికొల్పే ఒక అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తారు. (హెబ్రీ. 10:24, 25) అయినా, సాక్షులు కాని కుటుంబసభ్యులూ, తోటి పనివారూ, తోటి విద్యార్థులూ, పొరుగువారూ, లేదా ఇతర పరిచయస్థులూ క్రైస్తవ సూత్రాలకు విరుద్ధమైన మార్గాన్ని అనుసరించేలా మనల్ని ఒత్తిడి చేయవచ్చు. వాళ్ళు “క్రీస్తునందున్న [మన] సత్ ప్రవర్తన మీద” అపనింద వేయవచ్చు. (1 పేతు. 3:15, 16) మనం ప్రతికూలమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రకటిస్తూనే ఉండాలన్న మన కృతనిశ్చయాన్ని మనమెలా బలపర్చుకోగలం?
2 కుటుంబ సభ్యులు: కొన్నిసార్లు, యెహోవాసాక్షి కాని భర్తో లేక తండ్రో తన భార్యా పిల్లలు బహిరంగ పరిచర్యలో పాల్గొనడాన్ని ఇష్టపడకపోవచ్చు. మెక్సికోలోని ఒక కుటుంబ సభ్యుల పరిస్థితి అదే. ఒక వ్యక్తి భార్యా, ఏడుగురు పిల్లలూ సత్యంలోకి వచ్చారు. మొదట్లో ఆయన ఆటంకపర్చాడు ఎందుకంటే తన కుటుంబ సభ్యులు ప్రకటించడం, ఇంటింటికీ వెళ్ళి సాహిత్యాలను పంచిపెట్టడం ఆయనకు ఇష్టంలేదు. ఈ పని వారి హోదాకు తక్కువగా ఉన్నట్లు ఆయన భావించేవాడు. ఆయన భార్యాపిల్లలు యెహోవాను సేవించాలన్న, పరిచర్యలో క్రమంగా భాగం వహించాలన్న తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కొంత కాలానికి ఆయన, దేవుని ఏర్పాటైన ప్రకటనా పనిని అంగీకరించడంలో ఉన్న విలువను గ్రహించడం ప్రారంభించి, తనను తాను యెహోవాకు సమర్పించుకున్నాడు కూడా. ఆయన సత్యాన్ని అంగీకరించడానికి 15 సంవత్సరాలు పట్టింది. అయితే ప్రకటించే తమ ఆధిక్యతలో ఆయన కుటుంబ సభ్యులే గనుక పట్టుదల కలిగివుండకపోతే ఆయన ఎప్పటికైనా సత్యంలోకి వచ్చివుండేవాడా?—లూకా 1:68-75; 1 కొరిం. 7:16.
3 తోటి పనివారు: తోటి పనివారికి సాక్ష్యమిచ్చేందుకు చేసే మీ ప్రయత్నాలను కొందరు స్వీకరించకపోవచ్చు. తాను పనిచేస్తున్న ఆఫీసులో లోకాంతాన్ని గురించిన ఒక చర్చ తలెత్తినప్పుడు, ఒక సహోదరి వాళ్లను మత్తయి 24వ అధ్యాయాన్ని చదవమని సూచించినందున వాళ్లామెను ఎగతాళి చేశారని ఆమె తెలియజేసింది. అయినప్పటికీ, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సహోదరి తోటి ఉద్యోగస్థుల్లో ఒకామె ఆ అధ్యాయాన్ని చదివి ముగ్ధురాలినయ్యానని ఆ సహోదరితో చెప్పింది. ఒక ప్రచురణను ఇచ్చి, ఆ ఉద్యోగస్థురాలితోనూ ఆమె భర్తతోనూ బైబిలు పఠనాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేయడం జరిగింది. మొదటి పఠనం తెల్లవారు జామున రెండు గంటల వరకూ కొనసాగింది. మూడవ పఠనం జరిగిన తర్వాత, వాళ్లు కూటాలకు హాజరవ్వడం ప్రారంభించారు. అటు తర్వాత, ధూమపానాన్ని విసర్జించి, పరిచర్యలో భాగం వహించడం ప్రారంభించారు. మన సహోదరి తన నిరీక్షణను ఇతరులతో పంచుకోవడానికి కృషి చేసి ఉండకపోతే ఇది సాధ్యమై ఉండేదా?
4 విద్యార్థులతో: స్కూల్లో తోటివారి ఒత్తిడిని అనుభవించడం, ప్రకటనా పనిలో పాల్గొంటున్నందుకు తమను తోటి పిల్లలు హేళన చేస్తారని భయపడడం సాక్షులైన యౌవనులకు అసాధారణమైన విషయమేమీ కాదు. “నన్ను గేళి చేస్తారేమోనని ఇతర యౌవనులకు ప్రకటించాలంటేనే భయంగా ఉండేది” అని అమెరికాలోని ఒక క్రైస్తవ యౌవనురాలు చెప్తుంది. అందుకే ఆమె స్కూల్లోనూ, ప్రకటనా ప్రాంతంలోనూ తన తోటివారికి సాక్ష్యమిచ్చేందుకు వచ్చిన అవకాశాలను జారవిడుచుకుంది. తోటివారి ఒత్తిడిని తట్టుకొని నిలబడేందుకు కావల్సిన బలాన్ని మీరు ఎలా పెంపొందించుకోగలరు? యెహోవా యందు నమ్మకముంచండి, చిరునవ్వుతో కూడిన ఆయన అంగీకారాన్ని పొందేందుకు ప్రయత్నించండి. (సామె. 29:25) మీ పరిచర్యలో దేవుని వాక్యాన్ని ఉపయోగించడమనే మీ సామర్థ్యాన్ని గర్వకారణంగా ఎంచండి. (2 తిమో. 2:15) ప్రారంభంలో ప్రస్తావించబడిన ఆ యౌవనురాలు యెహోవాకు ప్రార్థించడం ప్రారంభించి, తన తోటి వారికి ప్రకటించేందుకైన అభీష్టాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేయమని అడిగింది. ఆమె స్కూల్లో అనియతంగా సాక్ష్యమివ్వడం మొదలుపెట్టింది, మంచి ఫలితాలను పొందింది, ఆ తర్వాత తనకు తెలిసిన వాళ్ళందరితోనూ మాట్లాడడం ప్రారంభించింది. “వాళ్లకి భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అవసరం, వాళ్ళకు అది కావాలి కూడా. వారికి సహాయం చేసేందుకు యెహోవా మనలను ఉపయోగించుకుంటున్నాడు” అని ఆమె ముగించింది.
5 పొరుగువారు: మనమెవరమో, మనం వేటికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో అనే వాటిని బట్టి మన పొరుగువారుగానీ, ఇతర పరిచయస్థులుగానీ కొంచెం చిరాకును వ్యక్తం చేయవచ్చు. వాళ్ళు ఏమి అనుకుంటారో అని మీరు భయపడినట్లయితే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నిత్యజీవానికి నడిపించే సత్యాన్ని గురించి వాళ్ళకు తెలుసా? వారి హృదయాలను చేరేందుకు నేనేమి చేయగలను?’ క్రమంగా కొద్ది కొద్దిగా పొరుగువారికి సాక్ష్యమిచ్చినప్పుడు, చక్కని ఫలితాలను పొందడం జరిగిందని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త గమనించాడు. యథార్థహృదయం గలవారిని వెదకడంలో కొనసాగేందుకు అవసరమైన శక్తి కోసం, జ్ఞానం కోసం యెహోవాను హృదయపూర్వకంగా అడగండి.—ఫిలి. 4:13, 14.
6 తోటివారి నుంచి వచ్చే ప్రతికూలమైన ఒత్తిడికి మనం లొంగిపోవడం మనల్ని వ్యతిరేకించేవారిని ప్రీతిపర్చవచ్చు, కానీ అలా లొంగిపోవడమనేది వాళ్ళ ఆసక్తులను నెరవేర్చినట్టౌతుందా లేక మన ఆసక్తులనా? యేసును ఆయన నివసించిన సమాజంలోని ప్రజలే వ్యతిరేకించారు. తన సహోదరుల సూటిపోటి మాటలను కూడా ఆయన సహించాడు. కానీ దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడంలో కొనసాగడం ద్వారా మాత్రమే తాను వారికి సహాయం చేయగలనని యేసుకు తెలుసు. అలా యేసు “పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొ[న్నాడు].” (హెబ్రీ. 12:1-3) మనం కూడా అలాగే చేయాలి. రాజ్య సందేశాన్ని ప్రకటించడమనే మీ ఆధిక్యతను నెరవేర్చగలిగినంత మేరకు నెరవేర్చాలని నిశ్చయపరచుకోండి. అలా చేయడం ద్వారా మీరు ‘మిమ్మల్నీ మీ బోధ వినువారిని రక్షించుకొంటారు.’—1 తిమో. 4:16.