అసమానత్వం—దేవుడు దాన్ని ఉద్దేశించాడా?
దానికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే, ఉద్దేశించలేదు. ఎందుకో మనం పరిశీలిద్దాం.
జీవితాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి మానవులందరికీ సమాన అవకాశాలు ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. మానవ సృష్టి గురించి మనమిలా చదువుతాము: “దేవుడు—మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.” భూసంబంధమైన సృష్టి ముగిసిన తర్వాత, “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.”—ఆదికాండము 1:26, 31.
ఈనాటి దుఃఖకరమైన అసమానతా స్థితిని దేవుడు “చాల మంచిది” అని చెప్పగలడా? చెప్పలేడు, ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) ఆయన “నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు” అని, “ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు” అని చెప్పబడుతోంది. (ద్వితీయోపదేశకాండము 10:17; 32:4; పోల్చండి యోబు 34:19.) అపొస్తలుడైన పేతురు ఇలా ముగించి చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.
దేవుడు ప్రేమగలవాడు, పక్షపాతం లేనివాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిపరుడు గనుక సంతోషాన్ని అనుభవించే హక్కు విషయంలో ఆయన మానవులను సహజసిద్ధమైన అసమానత్వంతో ఎలా సృష్టించి ఉంటాడు? ప్రజల మధ్య వివక్షను అనుమతించడం, వారిని అసమానత్వంగల విధానంలో ఉంచడం ఆయన వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధమై ఉండగలవు. వాళ్లంతా “జన్మతః స్వతంత్రులు, గౌరవం మరియు హక్కుల విషయంలో సమానులు” అయ్యుండాలని ఆయన ఉద్దేశించాడు. అయినప్పటికీ, పరిస్థితులు నేడు అలా లేవన్నది సుస్పష్టం. ఎందుకని అలా లేవు?
అసమానతకు మూలం
మానవులంతా సమానంగా ఉండేలా దేవుడు వారిని సృష్టించాడంటే దాని భావం, వాళ్లంతా ప్రతి విషయంలోను సమానంగా ఉండాలని ఆయన ఉద్దేశించాడని కాదు. వాళ్లు ప్రతిభాపాటవాలు, అభిరుచులు, వ్యక్తిత్వం విషయంలో వ్యత్యాసంగా ఉండవచ్చు. హోదా లేక అధికారం విషయంలో కూడా వాళ్లలో తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు, స్త్రీ పురుషులు అన్ని విషయాల్లోనూ సమానులు కాదు, అయితే దేవుడు స్త్రీని పురుషునికి “పూరకం”గా సృష్టించాడు. (ఆదికాండము 2:18, NW) అధికారం విషయంలో తల్లిదండ్రులకు, పిల్లలకు స్పష్టంగా తేడా ఉంది. అయితే, ఈ తేడాలు ఉన్నప్పటికీ, స్థూలంగా అందరూ అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు, సంతోషం కోసమైన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి సమాన అవకాశాలను దేవుడిచ్చిన హక్కులుగా అనుభవించవచ్చు. వాళ్లంతా దేవుని ఎదుట సమాన గౌరవాన్ని, సమాన స్థానాన్ని అనుభవించవచ్చు.
అలాగే, మానవులకంటే ముందు సృష్టించబడిన దేవుని ఆత్మ కుమారులకు వివిధ నియామకాలు, బాధ్యతలు అప్పగించబడ్డాయి. (ఆదికాండము 3:24; 16:7-11; యెషయా 6:6; యూదా 9) అయినప్పటికీ, వారికివ్వబడిన వాటి పరిధిలోనే, అందరూ జీవితం మరియు సంతోషం విషయంలో దైవిక ఏర్పాట్లను సమాన స్థాయిలో అనుభవించగలిగేవారు. దీని ద్వారా దేవుని నిష్పక్షపాత వైఖరి అద్భుతమైన రీతిలో ప్రదర్శించబడింది.
అయితే, విచారకరమైన విషయమేమిటంటే, దేవుని నిష్పక్షపాత ఏర్పాటును బట్టి ఒక ఆత్మ ప్రాణి మాత్రం సంతృప్తి చెందలేదు. దేవుడు తనకు ఇచ్చినదాని కన్నా ఎక్కువ ఆశించాడు, అంటే ఉన్నత స్థానాన్ని హెచ్చైన స్థానాన్ని అతడు ఆశించాడు. ఈ తప్పుడు కోరికను పెంపొందింపజేసుకోవడం ద్వారా, అతడు తనను తాను, న్యాయబద్ధంగా మొత్తమంతటి మీద సర్వోన్నతాధికారంగల సృష్టికర్తయైన యెహోవాకు వ్యతిరేకంగా చేసుకున్నాడు. దేవుని తిరుగుబాటుదారుడైన ఈ ఆత్మ కుమారుడు, మానవులకు దేవుడు ఇచ్చినదాని కన్నా ఎక్కువగా దేవుని నుండి కోరమని వారిని పురికొల్పాడు. (ఆదికాండము 3:1-6; పోల్చండి యెషయా 14:12-14.) అలా, మానవులు జీవితాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి యెహోవా చేసిన ఏర్పాటు సమతూకాన్ని కోల్పోయినట్లుగా కన్పించింది. ప్రకటన 20:2 నందు ‘అపవాది, సాతాను’ అని గుర్తించబడిన ఈ ఆత్మ తిరుగుబాటుదారుడు, మానవ అసమానతకు దుష్ట ప్రేరేపకుడయ్యాడు.
పరిస్థితులు ఎన్నటికైనా మారతాయా?
దానికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే, మారతాయి!
కాని అవసరమైన మార్పులను ఎవరు తీసుకురాగలరు? అలా చేయడానికి మానవ పరిపాలకులు, నిస్సందేహంగా కొంతమంది పూర్తి నిజాయితీతో, శతాబ్దాలపాటు పోరాడారు. వారు సాధించిన విజయం పరిమితమైనదైయుండి, అనేకమంది ప్రజలు మానవ అసమానతా సమస్య ఎన్నటికైనా పరిష్కరించబడుతుందని నిరీక్షించడం అవాస్తవికమైనదనే ముగింపుకు వచ్చేలా చేసింది. అయితే, దేవుని దృక్కోణం యెషయా 55:10, 11 నందు ఇలా వ్రాయబడివుంది: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.”
జీవితాన్ని అనుభవించడానికి, సంతోషాన్ని పొందడానికి మానవులందరికీ సమాన హక్కులను అందజేయాలనే తన ఆది సంకల్పాన్ని నెరవేరుస్తానని యెహోవా దేవుడు ప్రకటించాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగావుంది ! సత్యానికి దేవునిగా, ఆయన తాను వాగ్దానం చేసినదాన్ని నెరవేర్చడానికి తనను తాను బద్ధునిగా చేసుకున్నాడు. సంతోషకరంగా, అలా చేయాలన్న చిత్తమూ, చేసే శక్తీ ఆయనకున్నాయి. ఆయన దీన్నెలా చేస్తాడు?
“పరలోకమందున్న మా తండ్రీ, . . . నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించమని యేసుక్రీస్తు తన అనుచరులకు బోధించిన రాజ్యమందు దీనికి సమాధానం ఉంది. (మత్తయి 6:9, 10) అవును, “[ఇప్పుడు ఉనికిలోవున్న] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము” చేయడానికి యెహోవా ఉపయోగించే ఉపకరణం దేవుని రాజ్యమే, ఆ రాజ్యము “యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
పరలోక రాజ్య పరిపాలన క్రింద, ఒక క్రొత్త మానవ సమాజం ఉనికిలోకి వస్తుంది. ఈ విషయంలో, బైబిలులోని చివరి పుస్తకమైన ప్రకటనలో, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.” (ప్రకటన 21:1) అసమానత యొక్క అసహ్య రూపాలైన పేదరికం, అనారోగ్యం, అజ్ఞానం, వివక్ష, ఇతర మానవ బాధలు ఇక ఉండవు.a
ఒక శతాబ్దం కంటే ఎక్కువకాలం నుండి యెహోవాసాక్షులు ప్రజల అవధానాన్ని ఆ రాజ్యం వైపుకు మళ్లిస్తున్నారు. (మత్తయి 24:14) ముద్రిత పేజీల ద్వారా, వ్యక్తిగత సహాయాన్నివ్వడం ద్వారా, బైబిల్లో వ్రాయబడివున్న దేవుని సంకల్పాన్ని గురించిన జ్ఞానాన్ని పొందడానికి ప్రజలకు సహాయం చేసేందుకు వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. అయితే, వారి ప్రపంచవ్యాప్త విద్యా పని ప్రజలకు భవిష్యత్తులో సమానత్వంతోనూ సంతోషంతోనూ జీవించే నిరీక్షణ నివ్వడమే గాక ఇప్పుడు కూడా అసమానతా మహామారిని అరికట్టడంలో ప్రయోజనాలను చేకూర్చింది. అదెలాగో మనం చూద్దాము.
[అధస్సూచీలు]
a దేవుని రాజ్యం త్వరలోనే అందరికీ ఎలా సమానత్వాన్ని తెస్తుంది అనే దాన్ని గురించిన పూర్తి చర్చ కోసం, దయచేసి వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 10, 11 అధ్యాయాలను చూడండి.
[6వ పేజీలోని చిత్రం]
జీవించడానికి, సంతోషించడానికి మానవులందరికీ సమాన అవకాశాలు ఉండాలని దేవుడు ఉద్దేశించాడు