నేటి అసమానతామహామారి
“మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారు, జీవం, స్వేచ్ఛ, సంతోషాన్వేషణ వంటి అన్యాక్రాంతం చేయబడలేని కొన్ని హక్కులను వారు తమ సృష్టికర్త నుండి పొందారన్న సత్యాలు సుస్పష్టమైనవని మేము పరిగణిస్తాము.”—అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1776లో స్వీకరించిన స్వాతంత్ర్య ప్రకటన.
“మానవులందరూ జన్మతః స్వతంత్రులు, అందరికీ సమాన హక్కులున్నాయి.”—ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ 1789లో స్వీకరించిన మానవ, పౌర హక్కుల ప్రకటన.
“మానవులందరూ జన్మతః స్వతంత్రులు, గౌరవం విషయంలోనూ హక్కుల విషయంలోనూ అందరూ సమానులు.”—ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1948లో స్వీకరించిన మానవ హక్కుల విశ్వ ప్రకటన.
సందేహం లేదు. సర్వమానవాళీ సమానత్వాన్ని కోరుకుంటుంది. కాని విచారకరమైన విషయమేమిటంటే, మానవ సమానత్వపు తలంపు ఇంత తరచుగా పునరుచ్చరించబడవలసి వస్తోందన్న వాస్తవమే, సమానత్వం ఇంతవరకూ మానవజాతికి అందకుండా తప్పించుకుందన్న విషయాన్ని నిరూపిస్తోంది.
ఇప్పుడు ఇరవయ్యో శతాబ్దపు ముగింపులో పరిస్థితులేమైనా మంచిగా మారాయని ఎవరైనా గంభీరంగా వాదించగలరా? అమెరికా, ఫ్రాన్సు దేశాల పౌరులందరూ, లేక ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలైన 185 దేశాల్లో ఏ దేశ పౌరులైనా, వాళ్లు ఏ హక్కులనైతే జన్మతః పొందారని భావించబడుతుందో ఆ హక్కులను నిజంగా సమానంగా అనుభవిస్తున్నారా?
మానవులందరూ సమానులన్న తలంపు ‘సుస్పష్టమైనదే’ అయినప్పటికీ, “జీవం, స్వేచ్ఛ, సంతోషాన్వేషణ” హక్కులు ప్రజలందరికీ ఎంత మాత్రం సమానంగా లేవు. ఉదాహరణకు, ఆఫ్రికాలోని ఒక బాలుడు 2,569 మందితో కలిసి ఒక వైద్యుడ్ని పంచుకోవలసి ఉంటే, యూరపులోని ఒక బాలుడు కేవలం 289 మందితో కలిసి ఒక వైద్యుడ్ని పంచుకుంటుంటే, ఇక మనం జీవం విషయంలో ఉన్న ఏ సమానత్వపు హక్కు గురించి మాట్లాడగలం? లేదా భారతదేశంలోని మూడింట ఒక వంతుమంది అబ్బాయిలు, మూడింట రెండొంతులమంది అమ్మాయిలు నిరక్షరాస్యులుగానే పెరిగి పెద్దవుతుండగా, జపాను జర్మనీ గ్రేట్బ్రిటన్ వంటి దేశాల్లో దాదాపు ప్రతి పిల్లవాడు కచ్చితంగా విద్యను పొందగల్గే అవకాశం ఉండగా, ఇక స్వేచ్ఛా సంతోషాన్వేషణల హక్కుల విషయంలో ఏమాత్రం సమానత్వం ఉన్నట్లు?
తలసరి ఆదాయం 1,380 డాలర్లుగా ఉన్న మధ్య అమెరికా దేశాల్లోని ప్రజలు, 24,990 డాలర్ల తలసరి ఆదాయం గల ఫ్రాన్సు దేశ ప్రజల్లా, జీవితంలో అదే ‘గౌరవాన్ని, హక్కులను’ అనుభవించగలరా? 56 సంవత్సరాల సంభవనీయ జీవితాయుష్షుతో పుట్టిన ఆఫ్రికాదేశ ఆడశిశువును, 79 సంవత్సరాల సంభవనీయ జీవితాయుష్షుతో పుట్టిన ఉత్తర అమెరికా ఆడశిశువుతో పోలిస్తే ఏం సమానత్వం ఉంది?
అసమానత్వానికి ఎన్నో కోణాలున్నాయి, అన్నీ అసహ్యమైనవే. జీవన ప్రమాణాల్లో, ఆరోగ్య సంరక్షణా విద్యారంగాల్లో అసమానత్వం వాటిలో కేవలం కొన్ని మాత్రమే. కొన్నిసార్లు రాజకీయ, జాతి, లేక మత భేదాలు ప్రజలు తాము పొందవలసిన గౌరవ స్వేచ్ఛలను పొందకుండా చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. సమానత్వాన్ని గురించి ఎంతో చర్చ జరుగుతున్నప్పటికీ, మనం సమానత్వంలేని లోకంలో జీవిస్తున్నాము. విస్తృతమైన, విపరీతమైన బాధను కలిగించే వ్యాధిలా అసమానత్వం మానవ సమాజపు ప్రతి స్థాయిలోనూ రాజ్యమేలుతోంది. పేదరికం, అనారోగ్యం, అజ్ఞానం, నిరుద్యోగం, వివక్ష వంటి రూపాల్లో అది కలిగించే బాధ వేదనభరితమైనది.
“మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారు.” ఎంత చక్కని తలంపు! కాని వాస్తవం దానికి విరుద్ధంగా ఉండటం ఎంత బాధాకరం !
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
UN PHOTO 152113/SHELLEY ROTNER