సౌలు క్రైస్తవులను ఎందుకు హింసించాడు?
“నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యతర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని.”—అపొస్తలుల కార్యములు 26:9-11.
తార్సువాడైన సౌలు అలా అన్నాడు. ఆయనను అపొస్తలుడైన పౌలు అని కూడా అంటారు. ఆయన పై విధంగా చెప్పిన సమయానికెల్లా, ఆయన ఒక క్రొత్త మనిషి అయ్యాడు. ఇకెన్నడూ క్రైస్తవత్వపు విరోధి కాడు. క్రైస్తవత్వాన్ని ఎంతో అభినివేశంతో ప్రచారం చేసినవారిలో ఆయన ఇప్పుడు ఒకరు అయ్యాడు. కాని క్రైస్తవులను హింసించడానికి సౌలును మునుపు పురికొల్పినది ఏమిటి? అలాంటి కార్యాలను ‘తను చేయవలసి ఉందని’ ఆయన ఎందుకు అనుకున్నాడు? ఆయన చరిత్ర నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేమైనా ఉందా?
స్తెఫను మీదకు రాళ్ళు రువ్వడం
స్తెఫనును చంపినవాళ్ళను గురించిన బైబిలు వృత్తాంతంలో సౌలు కూడా ఉన్నాడు. “పట్టణపు వెలుపలికి అతనిని [స్తెఫనును] వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి.” “సౌలు అతని చావునకు సమ్మతించెను.” (అపొస్తలుల కార్యములు 7:58, 60) ఆ విధంగా దాడి చేయడానికి నడిపించినదేమిటి? యూదులు, కిలికియలోని కొందరితో సహా, స్తెఫనుతో తర్కించారు, కాని వాళ్ళు ఆయన ఎదుట గెలవలేకపోయారు. కిలికియవాడైన సౌలు కూడా వాళ్ళలో ఉన్నాడా అన్నది పేర్కొనబడలేదు. ఏది ఏమైనా, ఒక అబద్ధపు సాక్ష్యాన్ని ఉపయోగించుకుని, స్తెఫను దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ, ఆయనను మహా సభ ఎదుటకు లాక్కెళ్ళారు. (అపొస్తలుల కార్యములు 6:9-14) ప్రధాన యాజకుడు అధ్యక్షత వహించే ఈ సభ యూదుల ఉన్నత న్యాయస్థానంగా పనిచేసేది. దాని సభ్యులు దాన్ని అంతిమ మతాధికారిగా ఎంచి, సిద్ధాంతపరమైన పవిత్రత అని వాళ్ళు దేని గురించి తలంచేవారో దాన్ని కాపాడుకునేవారు. వాళ్ళ దృష్టిలో, స్తెఫను మరణయోగ్యుడు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదని ఆయన వాళ్ళను నిందించాడు కదా? (అపొస్తలుల కార్యములు 7:53) తాము దాన్ని ఎలా అనుసరిస్తారో వాళ్ళు ఆయనకు చూపిస్తారు!
సౌలు ఆ అభిప్రాయాన్ని అంగీకరించాడంటే, తర్కబద్ధంగా అది ఆయన నమ్మకాల పరిణామమే. ఆయన ఒక పరిసయ్యుడు. ఆ శక్తివంతమైన సముదాయం ధర్మశాస్త్రాన్నీ, పారంపర్యాన్ని కచ్చితంగా పాటించాలని పట్టుపట్టేది. క్రైస్తవత్వం అనేది ఆ సూత్రాలకు విరుద్ధమైనదిగా, యేసు ద్వారా క్రొత్త రక్షణ మార్గాన్ని బోధించేదిగా దృష్టించబడేది. మెస్సీయ మహిమగల రాజై ఉంటాడనీ, ద్వేషపూరితమైన రోమా ఆధిపత్యం నుండి తమను విడిపిస్తాడని మొదటి శతాబ్దపు యూదులు ఎదురుచూసేవారు. దైవదూషకుడు అన్న ఆరోపణపై, మహాసభ చేత ఖండించబడి, శాపగ్రస్థుడైన నేరస్థుడిలా, హింసా కొయ్యపై వ్రేలాడదీయబడిన వ్యక్తే మెస్సీయ అయ్యుంటాడన్న తలంపు వాళ్ళ మనస్సులకు పూర్తిగా ఒప్పనిది, అనంగీకారమైనది, అసహ్యకరమైనది.
మ్రానుపై వ్రేలాడదీయబడిన మనిషి “దేవునికి శాపగ్రస్థుడు” అని ధర్మశాస్త్రం పేర్కొంది. (ద్వితీయోపదేశకాండము 21:22, 23; గలతీయులు 3:13) సౌలు దృక్కోణంలో చూస్తే, “ఈ మాటలు యేసు విషయంలో స్పష్టంగా వర్తిస్తాయి. ఆయన దేవుడి శాపం క్రిందే మరణించాడు. కనుక, దేవుడి ఆశీర్వాదం అద్వితీయమైన విధంగా ఉండే మెస్సీయ అని నిర్వచించబడిన వ్యక్తి యేసే అయ్యుంటాడన్నది ఏ మాత్రం ఊహించలేని విషయం. కనుక ఆయనే మెస్సీయ అని అంటే దైవదూషణ చేయడమే; అలాంటి అసంగతమయన వాదనను చేసేవారు దైవదూషణ చేసేవారు అనుభవించాల్సిన కష్టాన్ని అనుభవించవలసిందే” అని ఫ్రెడెరిక్ ఎఫ్. బ్రూస్ వ్యాఖ్యానిస్తున్నారు. తర్వాత, సౌలు తానుగా తెలిపినట్లు, ‘క్రీస్తు మ్రానుపై వ్రేలాడదీయబడ్డాడు’ అన్న తలంపే ‘యూదులకు అభ్యంతరకరంగా ఉండేది.’—1 కొరింథీయులు 1:23, NW.
అలాంటి బోధకు పౌలు ప్రతిచర్య, సాధ్యమైనంత దృఢనిశ్చయంతో దానిని ఎదిరించాలన్నదే. దాన్ని కాల రాసేందుకు ఎంత క్రూరమైన చర్యనైనా తీసుకోవలసిందే. దేవుడు కోరుకున్నది కూడా ఇదేనని ఆయనకు నిశ్చయం ఉంది. తను పెంపొందించుకున్న స్ఫూర్తిని వివరిస్తూ, సౌలు, “ఆసక్తివిషయము [“అభినివేశము విషయానికొస్తే,” NW] [నేను] సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.” “పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని” అన్నాడు.—ఫిలిప్పీయులు 3:6; గలతీయులు 1:13, 14.
హింసించడంలో ప్రముఖుడు
స్తెఫను మరణించిన తర్వాత, సౌలు హింసించడంలో కేవలం ఒక సహాయకుడుగా కాక, ప్రముఖుడుగా మారాడు. అలా ఉండగా, కొంత మేరకు కుప్రసిద్ధిని గాంచి ఉంటాడు. కనుకనే, ఆయన [క్రీస్తు] శిష్యులలో కలవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, ఆయన మారిన తర్వాత కూడా, “అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.” (ఇటాలిక్కులు మావి.) తన హృదయాన్ని మార్చుకున్నది ఎవరో మునుపటి వ్యతిరేకి కాదు కానీ, “మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడ[ని]” విన్న శిష్యులు ఆయన నిజంగానే క్రైస్తవుడయ్యాడని స్పష్టమైనప్పుడు, ఆనందించడానికి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి ఆయన మతమార్పిడి కారణమయ్యింది.—అపొస్తలుల కార్యములు 9:26; గలతీయులు 1:23, 24.
దమస్కు యెరూషలేము నుండి 220 కిలోమీటర్ల దూరాన ఉంటుంది, అంటే ఏడెనిమిది రోజులు నడవవలసి ఉంటుంది. అయినప్పటికీ, సౌలు “[క్రీస్తు] శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును” చేస్తూ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, దమస్కులోని సమాజమందిరములకు లేఖలను ఇవ్వమని కోరాడు. ఎందుకు? “యీ మార్గమందున్న”ట్లు తను కనుగొనేవారిని యెరూషలేముకు బంధించి తీసుకువచ్చేందుకే. ఆయన ఆధికారిక ఆమోదంతో, “ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయ, చెరసాలలో వేయంచి సంఘమును పాడుచేయుచుండెను.” ఇతరులను అతడు ‘సమాజమందిరములలో కొట్టేవాడు.’ వాళ్ళను చంపేందుకు ‘సమ్మతించేవాడు [“తన ఓటు వేసేవాడు,” NW].’ (అక్షరార్థంగా, ఆయన తన “ఓటు స్ఫటికాన్ని” ఉపయోగించేవాడు).—అపొస్తలుల కార్యములు 8:3; 9:1, 2, 14; 22:5, 19; 26:10, అధఃసూచి (NW).
గమలీయేలు క్రింద సౌలు పొందిన విద్యాభ్యాసాన్నీ, ఇప్పుడు ఆయన చేతికి వచ్చిన అధికారాలను లెక్కలోకి తీసుకుంటే, ఆయన ధర్మశాస్త్ర విద్యార్థి అనే స్థానం నుండి, యూదా మతంలో కొంత అధికారాన్ని చెలాయించే మేరకు పురోగతి సాధించాడు అని కొందరు పండితులు నమ్ముతున్నారు. ఉదాహరణకు, సౌలు యెరూషలేములోని ఒక సమాజమందిరంలో ఒక ఉపదేశకుడు అయివుండవచ్చు అని ఒక రచయిత అంటున్నారు. అయినప్పటికీ, సౌలు ‘తన ఓటును వేయడం’—ఒక న్యాయసభ సభ్యుడని చూపిస్తుందా, లేక క్రైస్తవులకు మరణశిక్ష విధించడంలో నైతికంగా ఆయన తన మద్దతును వ్యక్తం చేశాడని చూపిస్తుందా అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం.a
క్రైస్తవులందరూ ఒకప్పుడు యూదులు లేక యూదా మతావలంబకులే కనుక, క్రైస్తవత్వం అంటే, యూదామతంలోని మతభ్రష్ట పరివర్తనమనే సౌలు అర్థం చేసుకున్నాడని స్పష్టమౌతుంది. తన అవలంబకులను సరిదిద్దడమనేది ఆధికారిక యూదామతం యొక్క బాధ్యత అని ఆయన ఎంచాడు. “హింసకుడైన పౌలు క్రైస్తవత్వాన్ని యూదామతానికి వెలుపలిదానిగా, పోటీదారుగా దృష్టించడమే దాన్ని వ్యతిరేకించడానికి కారణం అయ్యుండదు. ఆయనా, అలాగే ఇతరులూ, ఈ క్రైస్తవ సమూహం ఇప్పటికీ యూదా అధికారం క్రిందే ఉన్నట్లు చూసి ఉంటారు” అని పండితుడైన ఆర్లండ్ జే. హల్ట్‌గ్రేన్ అంటున్నారు. అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని ఉపయోగించి, తప్పిపోయిన యూదులు వెనుదిరిగేలా, సాంప్రదాయ బద్దులుగా తిరిగివచ్చేలా వాళ్ళను బలవంతపెట్టాలన్నదే ఆయన ఉద్దేశం. (అపొస్తలుల కార్యములు 26:11) ఆయన ముందున్న ఒక పద్ధతి వాళ్ళను చెరసాలలో వేయడమే. మరొకటి, వాళ్ళను న్యాయస్థానాల్లో కొట్టించడమే. రబ్బీయుల అధికారానికి అవిధేయత చూపిస్తే ముగ్గురు న్యాయాధిపతులుండే స్థానిక న్యాయసభలో క్రమశిక్షణనిచ్చే ఒక పద్ధతి ఇది.
నిజమే, దమస్కుకు వెళ్ళే దారిలో యేసు సౌలుకు ప్రత్యక్షం కావడం దీనంతటికీ అడ్డుకట్ట వేసింది. క్రైస్తవత్వానికి బద్ధశత్రువుగా ఉండే బదులు, సౌలు అకస్మాత్తుగా, దానిని ఎంతో అభినివేశంతో ప్రచారం చేసే వ్యక్తిగా, దమస్కులోని యూదులు ఆయనను చంపాలని ప్రయత్నించేంతగా మారాడు. (అపొస్తలుల కార్యములు 9:1-23) విరోధాభాసకరమైన విషయం ఏమిటంటే, తాను మునుపు హింసకుడుగా చేసిన అనేక కార్యాలనే ఇప్పుడు సౌలు ఒక క్రైస్తవుడిగా అనుభవించవలసి వచ్చింది. అందుకే అనేక సంవత్సరాలైన తర్వాత, “యూదులచేత అయదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని” అని అనగల్గాడు.—2 కొరింథీయులు 11:24.
అభినివేశం తప్పుదారిపట్టించబడగలదు
“పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన” నేను “తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని” అని తర్వాత ఎక్కువగా పౌలు అని తెలియబడిన సౌలు వ్రాశాడు. (1 తిమోతి 1:12, 13) ఒకరు తన మతం విషయంలో హృదయపూర్వకంగాను, క్రియాశీలంగాను ఉండడం దేవుడి అంగీకారం ఉంటుందనే హామీ ఇవ్వదు. సౌలు చాలా అభినివేశంతో ఉండేవాడు, తన మనస్సాక్షి ప్రకారంగా ప్రవర్తించాడు. అయినంత మాత్రాన ఆయన సరైనవాడు కాలేదు. ఆయనలోని రగులుతున్న అభినివేశం తప్పుదోవపట్టింది. (పోల్చండి రోమీయులు 10:2, 3.) అది మనం ఆలోచించేలా చేయాలి.
దేవుడు తమ నుండి కోరేదల్లా, సత్ప్రవర్తన గలవారమై ఉండాలన్నదే అని అనేకులు గట్టిగా నమ్మించబడ్డారు. అది నిజమా? “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అని పౌలు చేసిన ఉద్బోధను ప్రతి ఒక్కరు అనుసరించడం మంచిది. (1 థెస్సలొనీకయులు 5:21) అంటే, దేవుడి వాక్యపు సత్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు సమయాన్ని తీసుకుని, దానికి పూర్తి అనుగుణ్యంగా జీవించడమనే దాని భావం. మనం బైబిలును పరిశీలించడం ద్వారా, మనం మార్పులు చేసుకోవలసిన అవసరముందని మనం గ్రహిస్తే, ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మార్పులు చేసుకోవడానికి మనం అన్ని విధాల ప్రయత్నించాలి. బహుశా మనలో అతి తక్కువ మంది మాత్రమే సౌలు అంతటి దూషకులు, హింసకులు లేదా హానికారులు అయ్యుండవచ్చు. అయినప్పటికీ, విశ్వాసానికీ, ఖచ్చితమైన జ్ఞానానికీ అనుగుణ్యంగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే మనం కూడా సౌలులా దేవుడి ప్రీతిని సంపాదించగలం.—యోహాను 17:3, 17.
[అధస్సూచీలు]
a ఏమీల్ షూవరర్ అనే రచయిత వ్రాసిన, పీపుల్ ఇన్ ది ఏజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ (175 బీ.సీ—135 ఏ.డీ.) అనే పుస్తకం ప్రకారం, మిష్నాలో, మహా సభలో లేక, డెబ్భై ఒక్క మంది సభ్యుల సభలో జరిగే పద్ధతులను గురించిన వివరణ లేకపోయినప్పటికీ, చిన్న సభల, అంటే 23 మంది సభ్యులుగల సభల్లో జరిగే పద్ధతులు వివరంగా ఉన్నాయి. ధర్మశాస్త్ర విద్యార్థులు చిన్న న్యాయస్థానాలు నిర్వహించే మరణదండనార్హమైన నేర విచారణలకు కూడా హాజరు కాగల్గేవారు. అక్కడ వాళ్ళు ఆరోపించబడినవారి పక్షంగా మాట్లాడడానికే గానీ, వ్యతిరేకంగా మాట్లాడడానికి అనుమతించబడేవారు కాదు. మరణ దండనార్హమైన నేరాలు కాని పక్షాన వాళ్ళు రెండింటిలో ఏదైనా చేయవచ్చు.