పాఠకుల ప్రశ్నలు
ఇప్పుడు, సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, కావాలంటే, రివర్స్ (పిల్లలు కలిగేలా మళ్ళీ శస్త్రచికిత్స) చేయించుకునే సాధ్యత ఉందని చెప్పబడుతుంది గనుక సంతాన నిరోధక శస్త్రచికిత్సలను గర్భ నియంత్రణ ఎంపికగా ఒక క్రైస్తవుడు దృష్టించవచ్చా?
కుటుంబ నియంత్రణ పద్ధతిగా సంతాన నిరోధక శస్త్రచికిత్స అత్యంత ఎక్కువగా పాటించబడుతుంది. చాలామంది ప్రజల విషయంలో ఆ పద్ధతిని స్వీకరించవచ్చా అనేది సామాజిక పరమైన, విద్యాపరమైన నేపథ్యాలు, అలాగే మతపరమైన దృక్పథాలు నిర్ణయిస్తున్నట్లు అన్పిస్తుంది. యెహోవాసాక్షుల విషయంలో మతపరమైన నమ్మకం నిర్ణయిస్తుంది. “యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. . . . సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము” అని కీర్తనల గ్రంథకర్త వ్యక్తం చేసిన కోరికే వాళ్ళకు కూడా ఉంది. (కీర్తన 27:11) సంతాన నిరోధక శస్త్రచికిత్సా ప్రక్రియలో ఏమి ఇమిడివుంది?
కుటుంబ నియంత్రణకోసం మగవాళ్లకు చేసే సంతాన నిరోధక శస్త్రచికిత్సని వేసెక్టమీ అంటారు. ముష్కములోని రెండు చిన్న శుక్రవాహక నాళాలు, లేదా ట్యూబులను కోసి వాటిని ముడివేస్తారు. దీన్ని వివిధ వైద్య పద్ధతుల్లో చేయవచ్చు, కానీ ముష్కముల నుండి శుక్రం బయటికి రాకుండా చేయడమే దీని లక్ష్యం. స్త్రీలకు చేసే సంతాన నిరోధక శస్త్రచికిత్సని ట్యూబల్ లిగేషన్ అంటారు. ఇది సాధారణంగా అండాన్ని అండాశయంనుండి గర్భాశయానికి తీసుకువెళ్లే అండవాహక నాళాలను కోసి గట్టిగా కట్టేయడం (లేదా, కాల్చేయడం) ద్వారా చేస్తారు.
ఒకసారి పిల్లలు కలగకుండా శస్త్రచికిత్స చేయించుకుంటే, ఇక దాన్ని రివర్స్ చేయించుకునే అవకాశం ఉండదనీ, అది అలా శాశ్వతంగా ఉండిపోతుందని చాలా కాలంగా భావిస్తూ వచ్చారు. కానీ కొందరు తాము తీసుకున్న చర్యకు దుఃఖం కలగడం మూలంగానో లేక క్రొత్త పరిస్థితులు ఏర్పడటం మూలంగానో వేసెక్టమీని గానీ ట్యూబల్ లిగేషన్‌ని గానీ రివర్స్ చేయమని వైద్యసహాయం కోరారు. ప్రత్యేక ఉపకరణాలు, మైక్రోసర్జరీలు రావడంతో అలా చేసే ప్రయత్నాలు మరింత విజయవంతమయ్యాయి. ఎంపిక చేయబడిన కొంతమంది అభ్యర్థులకు, కోసిన చిన్న నాళాలను తిరిగి కలపడం ద్వారా వేసెక్టమీని రివర్స్ చేయడంలో 50 నుండి 70 శాతం ఫలితాలు కలిగినట్లు చదవడం అసాధారణమేమీ కాదు. స్త్రీలకు చేసిన ట్యూబల్ లిగేషన్‌ను రివర్స్ చేయడంలో 60 నుండి 80 శాతం ఫలితాలు దక్కినట్లు చెప్పబడుతుంది. ఈ విషయాలు తెలుసుకున్న కొంతమంది, సంతాన నిరోధక శస్త్రచికిత్సను ఇక ఎంతమాత్రం శాశ్వతమైన ప్రక్రియగా దృష్టించనవసరం లేదని భావించారు. గర్భం కావాలనుకున్నప్పుడు మానుకోగల—సంతాన నిరోధక మాత్రలు, కండోమ్‌లు, డయాఫ్రమ్‌లవంటివాటి కోవలోనికే వేసెక్టమీ, ట్యూబల్ లిగేషన్ వస్తున్నట్లు దృష్టించవచ్చని వాళ్ళు నమ్మవచ్చు. అయితే, ఆలోచించవలసిన కొన్ని విషయాలను విస్మరించకూడదు.
ఒకటి ఏమిటంటే, సంతాన నిరోధక శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు నాళాలకు జరిగిన నష్టం ఎంత, నాళం ఎంత మేరకు తీసివేయబడింది, లేదా ఎంతమేరకు దెబ్బ తింది, శస్త్రచికిత్స జరిగి ఎన్ని సంవత్సరాలైంది, వేసెక్టమీ సంబంధంగా చూస్తే పురుషుని శుక్రానికి విరుద్ధంగా యాంటీబాడీలు ఏర్పడ్డాయా అనే అంశాలు రివర్స్ చేసే సాధ్యతను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. మైక్రోసర్జరీ సౌకర్యాలు చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా అందులో ఉండే ఖర్చులు మీరు భరించలేనంత కావచ్చు అన్న వాస్తవాల్ని కూడా విస్మరించకూడదు. అందుకని, ఏదేమైనా సంతాన నిరోధక శస్త్రచికిత్సను రివర్స్ చేయించుకోవాలని ఎంతగానో కోరుకునే చాలామంది అలా చేయించుకోలేకపోవచ్చు. వాళ్ళ విషయం అంతేనన్నమాట.a కాబట్టి, రివర్స్ చేయించుకోవడాన్ని గురించి పైన ఇవ్వబడిన రేట్లు నిజానికి సైద్ధాంతికమే, వాటిమీద మనం ఆధారపడలేము.
కొన్ని వాస్తవాలు యథార్థమేమిటో చూపిస్తున్నాయి. వేసెక్టమీని రివర్స్ చేయించుకోవడం గురించి అమెరికాలో ప్రచురించబడిన ఒక శీర్షిక, 12,000 డాలర్లు ఖరీదు చేసే ఈ శస్త్రచికిత్స తర్వాత “కేవలం 63 శాతం మంది మాత్రమే తమ భార్యలకు గర్భాన్ని కలుగజేయగలరు” అని వ్యాఖ్యానించింది. అంతేగాక, “వేసెక్టమీ చేయించుకున్నవారిలో కేవలం ఆరు శాతం మంది మాత్రమే చివరికి మళ్లీ రివర్స్ చేయించుకోవాలనుకుంటారు.” మధ్య యూరప్ గురించి జర్మనీ చేసిన ఒక అధ్యయనంలో, సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించుకున్న పురుషుల్లో దాదాపు 3 శాతం మంది తర్వాత రివర్స్ చేయించుకోవాలని చూశారు. దాదాపు సగం ప్రయత్నాలు సఫలమైనా, వేసెక్టమీ చేయించుకున్న వారిలో 98.5 శాతంమంది విషయంలో సంతాన నిరోధక శస్త్రచికిత్స రివర్స్ చేయలేనిదిగా ఉంటుందని అర్థం. అంతేగాక మైక్రోసర్జన్‌లు అరుదుగా ఉన్న లేదా అసలే లేని ప్రాంతాల్లో ఆ రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది.
దీన్నిబట్టి చూస్తే, పురుషుల లేదా స్త్రీల సంతాన నిరోధక శస్త్రచికిత్సను, అదేదో తాత్కాలిక కుటుంబ నియంత్రణా విధానం అన్నట్లు, తేలిగ్గా తీసుకోవడం అవాస్తవికం అని అర్థం అవుతుంది. యథార్థవంతుడైన క్రైస్తవుడు పరిగణలోనికి తీసుకోవల్సిన మరితర అంశాలు కూడా ఉన్నాయి.
ఒక కీలకమైన విషయం ఏమిటంటే సంతానోత్పత్తి సామర్థ్యం మన సృష్టికర్త ఇచ్చిన ఒక కానుక. ఆయన ఆది సంకల్పంలో, పరిపూర్ణ మానవులు సంతానోత్పత్తి చేయడం కూడా ఇమిడి ఉంది, అలా వారు “భూమిని నిండించి దానిని లోపరచుకో”వలసి ఉంది. (ఆదికాండము 1:28) అటుతర్వాత జలప్రళయం భూ జనాభాని ఎనిమిదిమందికి తగ్గించినప్పుడు దేవుడు ఆ ప్రాథమిక నిర్దేశాలు మళ్ళీ ఈ ఎనిమిది మందికి ఇచ్చాడు. (ఆదికాండము 9:1) దేవుడు ఆ ఆజ్ఞను మళ్లీ ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వలేదు, కానీ సంతానం కలిగివుండటం ఎంతో కోరుకోవలసిన విషయంగా వారు దృష్టించారు.—1 సమూయేలు 1:1-11; కీర్తన 128:3.
మానవ సంతానోత్పత్తిని దేవుడు పరిగణిస్తాడనే దాని సూచనలు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఉదాహరణకు, ఒక వివాహిత వ్యక్తి తన వంశాన్ని నిలబెట్టే కుమారుణ్ని కనకముందే మరణించినట్లైతే, ఆయన సహోదరుడు మరిదిధర్మము జరిపించడం ద్వారా ఒక కుమారుణ్ని కనాలి. (ద్వితీయోపదేశకాండము 25:5) ఈ విషయానికి ఇంకా దగ్గరగా ఉన్నది, పోట్లాటలో ఉన్న తన భర్తకు సహాయం చేయడానికి ఒక భార్యకు సంబంధించి ధర్మశాస్త్రంలో ఉన్న ఒక చట్టం. ఆమె ఒకవేళ తన భర్తతో పోట్లాడుతున్న వ్యక్తి మానాన్ని పట్టుకున్నట్లైతే ఆమె చేతిని ఛేదించాల్సిందే; దేవుడు కంటికి కన్ను పంథాలో ఆమె/ఆమె భర్త సంతానోత్పత్తి అవయవాలకు హాని జరగాలని కోరలేదు. (ద్వితీయోపదేశకాండము 25:11, 12) ధర్మశాస్త్రంలోని ఈ చట్టంలో స్పష్టంగా సంతానోత్పత్తి అవయవాలపట్ల గౌరవం ప్రదర్శితమయ్యేది; వాటిని అనవసరంగా నాశనం చేయకూడదు.b
క్రైస్తవులు ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం క్రింద లేరని మనకు తెలుసు, కనుక, అందుకని ద్వితీయోపదేశకాండము 25:11, 12లోని నియమం క్రిందికి వారు రారు. తన శిష్యులు వివాహం చేసికోవల్సిందేననీగానీ ఎంతమంది పిల్లలకు జన్మనివ్వడం వీలైతే అంతమంది పిల్లలకి జన్మనివ్వాలని గానీ యేసు ఆజ్ఞాపించనూ లేదు అలా ఎన్నడూ సూచించనూ లేదు. అనేకమంది దంపతులు, ఏదైనా ఒక కుటుంబ నియంత్రణా పద్ధతిని పాటించాలా వద్దాని నిర్ణయించుకునేప్పుడు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకున్నారు. (మత్తయి 19:10-12) అపొస్తలుడైన పౌలు భావావేశంగల ‘యౌవనస్థులైన విధవరాండ్రను వివాహము చేసికొని పిల్లలను కనమని’ ప్రోత్సహించాడు. (1 తిమోతి 5:11-14) క్రైస్తవులు శాశ్వతమైన సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించుకోవడం గురించి—సంతానోత్పత్తి చేయగల తమ సామర్థ్యాన్ని స్వచ్ఛందంగా త్యాగం చేయడం గురించి ఆయన చర్చించలేదు.
తమ సంతానోత్పత్తి సామర్థ్యాలను దేవుడు ఎంతో ఘనంగా ఎంచుతాడనే సూచనలను క్రైస్తవులు తూచి చూడటం మంచిది. యుక్తమైన కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని పాటించాలా వద్దా, పాటించాలనుకుంటే ఎప్పుడు పాటించాలి అన్న విషయాలను దంపతులు నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో గర్భం ధరిస్తే, తల్లికిగానీ బిడ్డకుగానీ తీవ్రమైన వైద్యపరమైన ప్రమాదాలు ఎదురౌతాయనీ, చివరికి మరణం కూడా సంభవించే సాధ్యత ఉందనీ వైద్యులు నిర్ధారితంగా చెప్పినట్లైతే ఈ నిర్ణయమన్నది మరింత గంభీరమైనదిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో కొందరు, ముందు చెప్పినట్లు, గర్భం ధరించినట్లైతే తల్లి ప్రాణానికిగానీ (అప్పటికే బహుశ ఆమెకు పిల్లలు ఉండవచ్చు) లేదా ఏదైనా ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యతో పుట్టే సాధ్యత ఉన్న బిడ్డకుగానీ ఏ ప్రమాదమూ వాటిల్లకుండునట్లు సంతాన నిరోధక శస్త్రచికిత్సకు అయిష్టంగానే ఒప్పుకున్నారు.
కానీ అటువంటి అసాధారణమైన, తీవ్రమైన ప్రమాదంలో లేని క్రైస్తవులు, ‘స్వస్థబుద్ధిని’ ఉపయోగిస్తూ, సంతానోత్పత్తి సామర్థ్యానికి దేవుడు ఇచ్చే విలువను బట్టి, తమ ఆలోచనలను చర్యలను మలచుకోవాలని నిశ్చయంగా కోరుకుంటారు. (1 తిమోతి 3:2; తీతుకు 1:8; 2:2, 5-8) ఇలా చేయడం లేఖనాలు సూచిస్తున్నవాటిని గురించిన పరిపక్వతతో కూడిన స్పృహను ప్రతిబింబిస్తుంది. అయితే, ఒక క్రైస్తవుడు ఏమాత్రం పట్టింపు లేకుండా దేవుడిచ్చే విలువలను నిర్లక్ష్యం చేశాడని బహిరంగంగా తెలిసిపోయినట్లైతే అప్పుడేమిటి? ఆయన (లేక ఆమె) బైబిలుకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకునే వారనే మంచి పేరు సంపాదించుకున్న, ఒక మంచి మాదిరిని చూపించే వ్యక్తియా కాదా అని ఇతరులు సందేహాన్ని వ్యక్తం చేయరా? ఒకరి పేరుమీద అటువంటి మచ్చ ఏర్పడటం, ఆ పరిచారకుడు ప్రత్యేక సేవాధిక్యతలు పొందేందుకుగల అర్హతను సందేహంలో పెట్టగలదు. అయితే, అజ్ఞానం వల్లే, ఈ శస్త్రచికిత్స చేయించుకున్నట్లైతే, అలా కాకపోవచ్చు.—1 తిమోతి 3:7.
[అధస్సూచీలు]
a “[శుక్రమును మూత్రద్వారానికి తీసుకునివచ్చే నాళములను] తిరిగి కలపడానికి చేసిన శస్త్రచికిత్సా ప్రయత్నాల్లో దాదాపు 40 శాతం సఫలం అయ్యాయి. మైక్రోసర్జరీ టెక్నిక్‌లు మరింత అభివృద్ధైనప్పుడు, మరింత ఎక్కువ విజయాన్ని పొందవచ్చని కొన్ని ఆధారాలు చూపుతున్నాయి. అయినప్పటికీ, వేసెక్టమీ ద్వారా సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించుకోవడం శాశ్వతమైన ప్రక్రియ అనే దృష్టించాలి.” (ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా) “సంతాన నిరోధక శస్త్రచికిత్సను శాశ్వతమైన ప్రక్రియగా పరిగణించాలి. రివర్స్ చేయడం గురించి పేషెంటు ఏమి విన్నప్పటికీ, రీ-అనాస్టోమోసిస్ (ఛేదించబడిన ఒక నాళాన్ని తిరిగి కలపడం) అనేది ఖరీదైన ప్రక్రియ, సఫలమౌతుందని గ్యారెంటీ ఇవ్వలేరు కూడా. ట్యూబల్ లిగేషను రివర్స్ చేయించుకునే స్త్రీలల్లో పిండము గర్భాశయంలో కాక గర్భకోశ నాళము వంటి అన్య ప్రాంతాల్లో పెరగడం వంటి ప్రమాదాలు హెచ్చుగా ఉంటాయి.”—కాంటెంపొరెరీ OB/GYN, జూన్ 1998.
b దీనికి సంబంధించిన మరో చట్టం, మర్మాంగాలు తీవ్రంగా నాశనమైన ఏ పురుషుడు కూడా దేవుని సమాజంలోనికి రాలేడు అని చెబుతున్నట్లు స్పష్టమైంది. (ద్వితీయోపదేశకాండము 23:1) అయితే, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకం, ఇది స్పష్టంగా “స్వలింగ లైంగికత వంటి అనైతిక ఉద్దేశాల నిమిత్తం, కావాలని మర్మాంగాలను కోయడానికి సంబంధించినది” అని పేర్కొంటోంది. కనుక, ఆ చట్టం వృషణాలను గానీ, అండాశయాన్ని గానీ తీసివేయడాన్ని గురించి లేదా కుటుంబ నియంత్రణను గురించి ఏమీ చెప్పడం లేదు. అంతర్దృష్టి అనే పుస్తకం ఇలా కూడా చెబుతుంది: “యెహోవా ఓదార్పుకరంగా, నపుంసకులను తన సేవకులనుగా స్వీకరించే కాలాన్ని గురించి ముందే చెప్పాడు, అంతేగాక వారు విధేయులుగా ఉన్నట్లైతే వారు కుమారులు కుమార్తెలకన్నా మంచి పేరును కలిగివుంటారని కూడా చెప్పాడు. యేసుక్రీస్తు చేత ధర్మశాస్త్రం రద్దుచేయబడటంతో, విశ్వాసాన్ని అభ్యసించేవారందరూ, వారి మునుపటి స్థాయి లేదా స్థితి ఏదేమైనప్పటికీ దేవునికి ఆధ్యాత్మిక కుమారులు కాగల్గేవారు. శారీరక తేడాలు తీసివేయబడ్డాయి.—యెష 56:4, 5; యోహా 1:12.”