రాజ్య ప్రచారకుల నివేదిక
‘దేవునికి సమస్తము సాధ్యం’
మత్తయి 19:26లో కనిపించే పై మాటలు నిజమని వెనిజులాలోని ఒక యువతి విషయంలో రుజువైంది. యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచడాన్ని నేర్చుకున్న తర్వాత, ఆమె ఒక గంభీరమైన సమస్యను అధిగమించగల్గింది. ఆమె ఇలా చెబుతోంది:
“మా అమ్మమ్మ చాలా దయగా చాలా ప్రేమగా ఉండేది. విచారకరమైన విషయమేమిటంటే, నాకు 16 ఏండ్లున్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది. ఆమె మరణం నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. నా మానసిక సమతుల్యతను పోగొట్టుకున్నాను. మా ఇంటి వెలుపలి ఆవరణంలోకి వెళ్ళాలని కూడా అనిపించేది కాదు. నేను పూర్తిగా ఏకాంతంగా ఉండడానికే ఇష్టపడే వ్యక్తిగా దాదాపు మారిపోయాను.
“నేను స్కూల్‌కు వెళ్ళలేదు. నాకు జాబ్ కూడా లేదు. నేను నా గదిలోనే ఉండిపోయాను. ఒంటరితనంతో, స్నేహితులెవరూ లేక, తీవ్రమైన కృంగుదలతో బాధపడ్డాను. నేను దేనికీ పనికిరానిదాన్నని భావించాను, చచ్చిపోవాలని, నా జీవితాన్ని అంతం చేసుకోవాలని నాకనిపించేది. ‘నేనెందుకు బ్రతికి ఉన్నానా?’ అని తరచూ నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని.
“గీసెలా అనే యువ సాక్షి నుండి మా అమ్మ కావలికోట, తేజరిల్లు! పత్రికలను తీసుకుంటుండేది. ఒక రోజు గీసెలా మా ఇంటి ముందు నుండి పోతుండగా, మా అమ్మ ఆ అమ్మాయిని ఆపి, ఆమె నాకు సహాయం చేయగలదేమోనని అడిగింది. అలా ప్రయత్నించి చూసేందుకు గీసెలా ఒప్పుకుంది. కాని నేను ఆ అమ్మాయిని చూడడానికి ఒప్పుకోలేదు. అయినా ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఆమె నాకు ఒక ఉత్తరం వ్రాసి, తను నా స్నేహితురాలిగా ఉండాలని కోరుకుంటుందనీ, ఆమె కన్నా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి నా స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నాడనీ ఆమె వ్రాసింది. ఆ వ్యక్తి యెహోవా దేవుడు అని ఆమె చెప్పింది.
“అది నా హృదయాన్ని తాకింది. నేను ఆమెకు బదులు వ్రాశాను. మేము మూడు నెలలు అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకున్నాం. గీసెలా నన్ను ఎంతో ప్రోత్సహించిన తర్వాత మాత్రమే, చివరికి నేను ఆమెను కలవడానికి ధైర్యం చూపించాను. మా మొదటి కలయికలో, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ఉపయోగిస్తూ, గీసెలా నాతో బైబిలును పఠించింది. ఆ పఠనం తర్వాత, స్థానిక రాజ్య మందిరంలో జరిగే ఒక కూటానికి హాజరుకమ్మని ఆమె నన్ను ఆహ్వానించింది. నేను కలవరపడ్డాను. నేను గత నాలుగు సంవత్సరాలుగా ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. వీధిలోకి వెళ్ళడమనే తలంపే చాలా భయం కలిగించింది.
“గీసెలా నాతో చాలా ఓపికగా వ్యవహరించేది. నేను దేని గురించీ భయపడనవసరం లేదనీ, కూటానికి నాతోపాటు తనూ వస్తుందనీ ఆమె నాకు హామీ ఇచ్చింది. చివరికి నేను సమ్మతించాను. మేము రాజ్య మందిరానికి వెళ్ళినప్పుడు, సన్నగా వణుకు ప్రారంభమైంది, ముచ్చెమటలు పట్టనారంభించాయి. నేను ఎవరినీ పలకరించలేకపోయాను. అయినప్పటికీ, నేను కూటాలకు వస్తానని అంగీకరించాను. గీసెలా చాలా నమ్మకంగా ప్రతి వారం వచ్చి, నన్ను తీసుకువెళ్ళేది.
“నేను పిరికితనాన్ని అధిగమించేందుకు నాకు సహాయపడేందుకుగానూ, గీసెలా నన్ను కూటాలకు సమయాని కంటే చాలా ముందుగా తీసుకువెళ్ళేది. మేము తలుపు దగ్గర నిలబడి, వస్తున్న వాళ్ళనందరినీ పలకరించేవాళ్ళం. ఆ విధంగా నేను మొత్తం గుంపును ఒక్కసారే ముఖాముఖిగా కలుసుకునే బదులు, ఒకరిద్దరు చొప్పున అందరినీ కలిసి పలకరించేవాళ్ళం. నేను ఇక అలా చేయలేననుకున్నప్పుడు, గీసెలా, ‘మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము’ అనే మత్తయి 19:26 వచనాన్ని ఉటంకించేది.
“అది అంత సులభంగా ఉండకపోయినప్పటికీ, చివరికి, చాలా మంది సమావేశమయ్యే ప్రాంతీయ సమావేశానికి హాజరు కాగల్గాను. అది నా జీవితంలో ఒక పెద్ద మెట్టు! 1995 సెప్టెంబర్‌లో, ఇంటింటి పరిచర్యలో పాల్గొనడాన్ని గురించి నేను పెద్దలతో మాట్లాడడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఆర్నెల్ల తర్వాత, 1996 ఏప్రిల్‌లో, నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు నా సమర్పణను తెలియజేసుకున్నాను.
“నేను దీన్ని చేయడానికి ధైర్యాన్నెలా తెచ్చుకోగల్గానా అని ఈ మధ్యే ఒకరు అడిగినప్పుడు, ‘యెహోవాను ప్రీతిపర్చాలన్న నా కోరిక నా భయానికన్నా గొప్పది’ అని బదులిచ్చాను. నేను ఇప్పటికీ అప్పుడప్పుడు కృంగుదలకు గురవుతున్నప్పటికీ, నేను క్రమ పయినీర్‌గా సేవ చేయడం నా ఆనందాన్ని అధికం చేసింది. గతకాలంలోకి వెనక్కి తిరిగి చూస్తే, నేను గీసెలాతో ఏకీభవించవలసిందే. నాపై ఆసక్తి చూపే ఒక స్నేహితుడు నాకిప్పుడు ఉన్నాడు, ఆయన ‘నన్ను బలపరుస్తాడు.’”—ఫిలిప్పీయులు 4:13.
[8వ పేజీలోని చిత్రాలు]
“యెహోవాను ప్రీతిపరచాలన్న నా కోరిక నా భయానికన్నా గొప్పది”