ఫలవంత ప్రదేశమైన వెండ
గత పదేళ్ళుగా నేను నా భార్య పూర్తికాల సువార్తికులుగా వెండ వాసుల మధ్య పనిచేశాము. ఈ వెండ వాసులు దక్షిణాఫ్రికాకు ఉత్తరాన ఉన్న లింపొపొ నదికి దక్షిణాన నివసిస్తున్నారు. వారి జనాంగం గత శతాబ్దాల కాలంలో లింపొపొ నదిని దాటి వచ్చిన అనేక తెగలతో రూపొందించబడింది. కొంతమంది వెండ వాసులు 1,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రిందటి నుండీ తమ పూర్వీకులు అక్కడే స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నారని చెప్పుకుంటారు.
వాస్తవంగా ఈ ప్రదేశము, మాపుంగుబ్వే రాజ్యం అని పిలువబడిన ప్రాచీన నాగరికతలో ఒకప్పుడు భాగమైయుండేది. అది, దక్షిణాఫ్రికాలోని స్థిరనివాసం ఏర్పరచుకున్న మొట్ట మొదటి పెద్ద నగరం. అది పశ్చిమాన బోట్సువానా నుండి తూర్పున మొజాంబిక్ వరకూ వ్యాపించివున్న లింపొపొనదిలోయను నియంత్రించేది. దాదాపు, సా.శ. 900 నుండి సా.శ. 1100 మధ్య కాలంలో అరబ్ వర్తకులకు ఏనుగు దంతాలనూ, ఖడ్గమృగాల కొమ్ములనూ, జంతు చర్మాలనూ, రాగినీ, బంగారాన్నీ కూడా మాపుంగుబ్వే అందించేది. మాపుంగుబ్వే అని పిలువబడే రాజవంశీకులను పాతిపెట్టే శ్మశానపర్వతంపై నైపుణ్యవంతంగా చెక్కబడి బంగారంతో తాపడం చేసిన వస్తువులు బయల్పడుతున్నాయి. ఇవి “దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల త్రవ్వకానికి మొట్టమొదటి సూచనలు” అని ఒక ఎన్‌సైక్లోపీడియా సూచిస్తుంది.
ఇక్కడ బంగారం ఇక ఎంతమాత్రం దొరకదు. ఈ రోజు వెండ ప్రాంతం దాని భూసారాన్ని బట్టి ప్రఖ్యాతి గాంచింది. సౌట్‌పేన్స్‌బర్గ్ పర్వతాలకు దక్షిణాన పచ్చని చెట్లుగల ఒక లోయ ఉంది, అక్కడ బేరిపళ్ళలా ఉండే పళ్ళు, అరటిపళ్ళు, మామిడిపళ్ళు, జామపళ్ళు సమృద్ధిగా పెరుగుతాయి. పెకన్, మెకడామియా వంటి పప్పులతో పాటు రకరకాల కూరగాయలు సమృద్ధిగా దొరుకుతాయి. వాటిలో బచ్చలికూర లాంటి రుచిగల మురోహో కూడా ఉంది. దాన్ని స్థానిక ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు.
వెండ వాసులు శాంతికాముకులు, ఆతిథిప్రియులు. చెప్పాపెట్టకుండా వచ్చిన అతిథికి కోడికూర వండిపెట్టమని ఇంటియజమాని ఆదేశించడం అసాధారణమైన విషయమేమి కాదు. దాన్ని మొక్కజొన్నతో చేసిన ముఖ్య ఆహారమైన బుస్వాతో తింటారు. అతిథి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అతనితో పాటు ఇంటియజమాని కొంతదూరం వరకూ వెళ్తాడు. ఒక అతిథి పట్ల గౌరవాన్ని చూపించడంలో అదొక సాంప్రదాయక మార్గం. పిల్లలు తమ ఇంటికి వచ్చిన అతిథులకు చూడముచ్చట గొలిపే రీతిలో కాస్త వంగి తమ అరచేతులు రెండింటినీ క్రిందకి నేలవైపుగా జోడిస్తూ అభివాదం చేసేలా నేర్పించబడతారు. ఆ సాంప్రదాయ పద్ధతిలో ఇద్దరు వెండ స్త్రీలు ఒకరికొకరు అభివాదం చేసుకోవడాన్ని మీరు ఈ పేజీలో చూడవచ్చు.
ఒక కష్టమైన భాష
యూరోపియన్ ఖండవాసులు వెండ భాషపై అంత సులభంగా పట్టుసాధించలేరు. వెండ భాషను కష్టమైనదిగా చేసే ఒక విషయమేమిటంటే, పదాల వర్ణ క్రమం ఒకే విధంగా ఉంటుంది కానీ వాటి ఉచ్ఛారణ వేరు వేరుగా ఉండడమే. యెహోవాసాక్షుల వెండ సంఘంలో ఒకరోజు బైబిలు ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు నేను, ప్రతి వ్యక్తితోనూ మాట్లాడాలని ప్రేక్షకులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రేక్షకులలోని ఒక వ్యక్తి నవ్వును ఆపుకోలేకపోయారు. ఎందుకంటే నేను “వ్యక్తి వ్యక్తికీ” అని చెప్పడానికి “వేలి వేలికీ” అన్నాను.
నేను మొట్టమొదట బహిరంగ పరిచర్య పనిలో వెండ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఒక వెండ స్త్రీ “నాకు ఆంగ్లభాష రాదు” అని చెప్పింది. నేను ఆమెతో ఇప్పుడు వెండ భాషలో చక్కగానే మాట్లాడానే అని అనుకున్నాను కానీ ఆమె దాన్ని ఆంగ్లం అనుకుంది! మరొక సందర్భంలో ఒక ఇంటిని దర్శించినప్పుడు, ఒక యౌవ్వనునితో ఆ ఇంటి యజమానిని పిలువమని చెప్పాను. వెండలో ఇంటి యజమాని అనే పదానికి తోహొ అంటారు. పొరపాటున నేను తొహో అన్నాను, దానర్థం నేను ఇంటి కోతితో మాట్లాడతానని అడిగానన్నమాట! అలాంటి పొరపాట్లు నన్ను నిరుత్సాహపరచినప్పటికీ, పట్టుదలతో నేర్చుకొని నేను నా భార్య ఇప్పుడు వెండ భాషలో ఓ మోస్తరుగా సంభాషించగలుగుతున్నాము.
ఆధ్యాత్మికతలో ఫలవంతం
వెండ ప్రాంతం ఆధ్యాత్మిక మార్గంలో ఫలవంతంగా ఉందని నిరూపించుకుంటున్నది. మస్సీనా పట్టణంలో రాగి గనిలో పని చేయడానికి పొరుగు దేశాల నుండి వలస వచ్చిన వారి మధ్య 1950లలో యెహోవాసాక్షుల సంఘం ఒకటి ఏర్పడింది. వారి ఆసక్తికరమైన పరిచర్య అనేకమంది వెండ వాసులకు బైబిలు సత్యాలను పరిచయం చేసింది. ఒక దశాబ్దం తర్వాత సిబాసా పట్టణంలోని ఒక ఇంటిలో వెండ సాక్షుల గుంపొకటి కూటాలను జరుపుకుంటుండేవారు.
సాక్ష్యమిచ్చే పనిని వేగ వంతం చేయడానికి దక్షిణాఫ్రికాలోని వాచ్ టవర్ బ్రాంచ్ పూర్తికాల సువార్తికులను ఆ ఫలవంత ప్రాంతంలోనికి పంపించింది. త్వరలోనే సిబాసా గుంపు ఒక పెద్ద సంఘంగా తయారయ్యింది. ఆ సమయంలో క్రైస్తవ కూటాలు క్లాస్‌రూమ్‌లో జరిగేవి. వెండకు దక్షిణాన 160కిలోమీటర్ల దూరంలో వున్న పీటర్స్‌బర్గ్‌లోని యెహోవాసాక్షుల సహాయంతో, పొరుగు పట్టణమైన తొహోయాండవ్‌లో రాజ్యమందిరం నిర్మించబడింది.
దక్షిణాఫ్రికాలో ఉత్తర ప్రాంతంలో వెండ మాట్లాడే ప్రజల జనాభా 5,00,000కు పైగా ఉంది. అక్కడ 1950లలో రాజ్య ప్రచారపని ప్రారంభించేనాటికి వెండ సాక్షులు లేనేలేరు. ఇప్పుడు అక్కడ 150 కన్నా ఎక్కువమంది ఉన్నారు. అక్కడ ఇంకా అస్సలు ప్రకటించని ప్రాంతాలు ఉన్నాయి, చేయాల్సిన పని ఎంతో ఉంది. హముట్షా అని పిలువబడే వెండ గ్రామాన్ని 1989లో దర్శించడం మొదలుపెట్టాము. ఆ సమయంలో కేవలం ఒక సాక్షి మాత్రమే నివసించేవాడు. ఇప్పుడు ఆ గ్రామంలో 40 కంటే ఎక్కువ మంది రాజ్యప్రచారకులున్నారు. రాజ్యమందిర నిర్మాణాన్ని పూర్తి చేయడంలో బిజీగా వున్నాము, పీటర్స్‌బర్గ్ సంఘాలనుండి వచ్చిన సాక్షులు అందించిన సహాయాన్ని బట్టీ, ధనిక దేశాల్లోని సహోదరులు అందించిన ఆర్థికపరమైన చందాలను బట్టీ మరలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
మేము ఒక పొలంలో కరవాన్‌లో (చిన్న గూడుబండి) నివసిస్తున్నాము. మా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం ద్వారా స్థానిక ప్రజలకు సువార్తను ప్రకటించడానికి మాకు అధిక సమయం ఉంటుంది. (మార్కు 13:10) ఫలితంగా, తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకొనేలా అనేకమందికి సహాయం చేసే ఆధిక్యత వల్ల మేం ఎంతో ఆశీర్వదింపబడతాము. ఉదాహరణకు మైఖెల్ అను పేరు గల ఒక వ్యక్తినే తీసుకోండి. ఆయన తన స్నేహితుని ఇంటిలో మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని చూశాడు.a దాన్ని చదవడం ప్రారంభించి వెంటనే సత్యాన్ని గ్రహించాడు. కాబట్టి ఆయన మరిన్ని బైబిలు సాహిత్యాల కోసం వాచ్ టవర్ సొసైటీకి వ్రాశాడు. ఆయన ఇటీవల అపొస్టలిక్ చర్చి సభ్యునిగా బాప్తీస్మం తీసుకున్నట్లు తన ఉత్తరంలో తాను వివరించాడు. ఆయనిలా వ్రాశాడు “నేను దేవుని రాజ్యానికి వెళ్ళే దారిని తప్పినట్టు కనుగొన్నాను. నేను మీ సభ్యుల్లో ఒకనిగా ఉండాలని నిర్ణయించుకున్నాను, కానీ సభ్యునిగా ఎలా అవ్వాలో నాకు తెలియదు.” ఆయన తన చిరునామాను ఇచ్చి, తనకు సహాయం చేసేందుకు ఒక యెహోవాసాక్షిని పంపించమని కోరాడు. ఏదోవిధంగా ఆ చిరునామాను పట్టుకొని మైఖెల్‌తో గృహ బైబిలు పఠనం ప్రారంభించాను. ఈరోజు, ఆయన బాప్తీస్మం తీసుకొన్న ఒక సాక్షి, యెహోవా సేవను యథార్థంగా చేస్తున్నాడు.
డిసెంబరు 1997లో తొహోయాండవ్ పట్టణంలోని ఒక స్పోర్ట్స్ స్టేడియం నందు జరిగిన “దేవుని వాక్యంలో విశ్వాసము” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి మేము హాజరయ్యాము. అక్కడ 634 మంది హాజరయ్యారు, 12 మంది క్రొత్త వ్యక్తులు బాప్తీస్మం తీసుకున్నారు. వెండ భాషలో రెండు ప్రసంగాలను ఇచ్చే ఆధిక్యత నాకు లభించింది. ఆ ఫలవంతమైన ప్రాంతంలో సంతోషంగా మేము గడిపిన ఈ దశాబ్ద కాలంలో అది నిజంగా ఒక మలుపురాయి!—ఉచిత వ్యాఖ్యానం.
[అధస్సూచీలు]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.