కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/1 పేజీలు 28-29
  • దేవుడు “వంకర” మార్గాల్లో పని చేస్తాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు “వంకర” మార్గాల్లో పని చేస్తాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విషయాలను సరిచేసే సమయం
  • యెహోవాను మీ ఆశ్రయంగా చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?
    శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?
  • అశక్తతలు ఎలా అంతం అవుతాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
    “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/1 పేజీలు 28-29

దేవుడు “వంకర” మార్గాల్లో పని చేస్తాడా?

“డియూస్‌ ఎస్క్రెవీ సెర్టూ పోర్‌ లీన్యాస్‌ టోర్టాస్‌” (“దేవుడు వంకర గీతలనే ఉపయోగించి సరిగ్గా వ్రాస్తాడు”) అనేది బ్రెజిల్‌లోని ఒక లోకోక్తి. ఇది, దేవుడు ఎల్లప్పుడు సరైనదే చేస్తాడు, కానీ కొన్నిసార్లు మానవులకు వక్రంగా అన్పించే మార్గంలో చేస్తాడని ఆ లోకోక్తి సూచిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా తన యౌవనంలో చనిపోతే, ‘దేవుడు అతడ్ని పరలోకానికి పిలిచాడు’ అని అనేకులు చెబుతారు. శారీరక వైకల్యం వల్ల లేదా దుర్ఘటనల వల్ల ఎవరైనా బాధ పడుతున్నట్లయితే, ‘ఇది దేవుని చిత్తం’ అని కొందరు అంటారు. మరణం, శారీరక సమస్యలు, బాధలకు కారణమైన ఇతర విషయాలకు దేవుడ్ని నిందిస్తారు, ఇటువంటి వ్యక్తీకరణలు దేవుడు ‘వక్రంగా వ్రాస్తాడనీ’, మానవుడు అర్థం చేసుకోలేని విధంగా కార్యాలను చేస్తాడనీ సూచిస్తున్నాయి.

మరణానికీ, కష్టాలకూ దేవుడే బాధ్యుడని మత విశ్వాసం గల అనేకమంది ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఈ నమ్మకాలు ఎక్కువగా బైబిలులోని విభిన్న శైలిలో వ్రాయబడిన కొన్ని వాక్య భాగాలను అపార్థం చేసుకోవడం వల్ల కలిగినవే. వీటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

● “మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.”—నిర్గమకాండము 4:11.

అయితే, ఆయా వైకల్యాల కారణంగా బాధపడే వాళ్ళందరి విషయమై దేవుడ్నే నిందించాలని దీని భావమా? కాదు. ఇది దేవుని వ్యక్తిత్వంతో పొందిక లేనిదవుతుంది. “దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది” అని బైబిలు చెబుతుంది. (1 తిమోతి 4:4) కాబట్టి, ఎవరైనా గ్రుడ్డివారిగా గానీ, మూగవారిగా గానీ లేదా చెవిటివారిగా గానీ పుడితే, దానికి ఆయనను నిందించకూడదు. ఆయన తన సృష్టికి ఏది మంచిదో దానినే కోరుతున్నాడు, “శేష్ఠమైన ప్రతి యూవియు సంపూర్ణమైన ప్రతి వరము”నకు ఆయనే మూలము.—యాకోబు 1:17.

మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలు తమ సొంత ఎంపిక ప్రకారం దేవుడికి విరుద్ధంగా తిరుగుబాటు చేసి, తమ పరిపూర్ణతనూ, తద్వారా పరిపూర్ణులైన పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యాన్నీ కోల్పోయారు. (ఆదికాండము 3:1-6, 16, 19; యోబు 14:4) వాళ్ళ పిల్లలు వివాహాలు చేసుకోవడం, వారికి పిల్లలు పుట్టడం జరుగుతూ ఉండగా, శారీరక లోపాలతో సహా మరింత ఎక్కువ అపరిపూర్ణ లక్షణాలు మానవుల మధ్య కనిపించడం ప్రారంభించాయి. వీటికి యెహోవా కారకుడు కాడు కానీ, ఇవి జరగడానికి అనుమతించాడు. అందుకే, మూగవారిని, చెవిటివారిని, గ్రుడ్డివారిని తానే ‘పుట్టించానని’ చెప్పాడు.

● “వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు.”—ప్రసంగి 1:15.

విషయాలను వక్రంగా చేసింది దేవుడా? ఎంత మాత్రం కాదు. “దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు” అని ప్రసంగి 7:29 చెబుతుంది. దీని భావాన్ని కాంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌ “దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం పూర్తిగా నిజాయితీ గలవారం, కానీ ఇప్పుడు వక్ర మనస్సులను కలిగి ఉన్నాము” అని చెబుతుంది. దేవుని నీతియుక్తమైన కట్టడలకు లోబడడానికి బదులు స్త్రీ, పురుషులలో అనేకులు తమ సొంత పథకాలు, పద్ధతులు, యుక్తులు, లేదా మార్గాలను అనుసరించడానికి ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకున్నారు—ఫలితంగా హాని తెచ్చుకున్నారు.—1 తిమోతి 2:14.

అపొస్తలుడైన పౌలు పేర్కొన్నట్లుగా, మానవజాతి యొక్క పాపం కారణంగా, “సృష్టి” కూడా “నాశనమునకు లోనయం[ది].” (రోమీయులు 8:20) మానవ ప్రయత్నం ద్వారా ఈ పరిస్థితిని “చక్కపరచ శక్యముకాదు.” కేవలం దైవిక జోక్యం ద్వారానే భూ వ్యవహారాలలోని సకల వక్రతలు, నిరర్థకమైన విషయాలు లేకుండాపోతాయి.

● “దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును?”—ప్రసంగి 7:13.

మరోమాటలో రాజైన సొలొమోను, ‘దేవుడు అనుమతించిన లోపాలను, అపరిపూర్ణతలను మానవజాతిలోని ఎవడు సరిచేయగలడు?’ అని అడిగాడు. ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే, దేవుడు ఇవన్నీ జరిగేందుకు అనుమతించడానికి ఒక కారణం ఉంది.

అందుకే సొలొమోను సిఫారసు చేస్తున్నాడు: “సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు” (ప్రసంగి 7:14) ఒక వ్యక్తి తన విషయాలు సక్రమంగా జరిగినప్పుడు అతడు తప్పకుండా ఆ దినం విషయమై తన మెప్పుదలను కనబరచాలి. అతడు ఒక మంచి దినం దేవుని నుండి బహుమానంగా వచ్చిందన్న దృక్కోణాన్ని కల్గి ఉండాలి. కానీ ఒక దినం విపత్తును తీసుకువస్తే అప్పుడేమిటి? ఆ వ్యక్తి దేవుడు కష్టాన్ని అనుమతించాడని గుర్తించి, బాగా ‘యోచిస్తే’ మంచిది. దేవుడెందుకు అలా అనుమతించాడు? ఎందుకంటే, “తాము చనిపోయన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుం”దురని సొలొమోను చెబుతున్నాడు. దీని అర్థం ఏమిటి?

మనం ఆనందాలనూ, బాధలనూ రెండింటినీ అనుభవించడానికి దేవుడు అనుమతిస్తున్నాడన్న వాస్తవం, భవిష్యత్తులో ఏమి జరగబోతోందో మనం చెప్పలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. విపత్తులు నీతిమంతులకూ, దుష్టులకూ సంభవిస్తాయి. ఎవరికీ మినహాయింపులు లేవు. ఇది “దేవుడు ప్రేమాస్వరూపి” అని గుర్తుంచుకుంటూ, మనం మనపై కాదు గానీ దేవునిపై ఆధారపడవలసిన దాని ప్రాముఖ్యతను మనం గ్రహించేలా చేయాలి. (1 యోహాను 4:8) కొన్ని విషయాలను మనం ఇప్పుడు అర్థం చేసుకోలేక పోయినప్పటికీ, ప్రతిదీ దాని పరిసమాప్తికి వచ్చిన తర్వాత, దేవుడు అనుమతించిన విషయాలు వాటితో సంబంధం గల వారందరికీ, ప్రయోజనకరమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తాయని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు.

అయితే, ఆయన వేటిని అనుమతించినా, అవి యథార్థ హృదయులకు శాశ్వత హానిని కల్గించవు. “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును” అని అంటూ, పేతురు తన కాలంలోని తోటి విశ్వాసులపై రానున్న కష్టాలను గురించి వ్యాఖ్యానించినప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.—1 పేతురు 5:10.

విషయాలను సరిచేసే సమయం

ప్రస్తుతం ఉన్న శోధనలను మనం సహించేందుకు యెహోవా మనకు బలాన్ని ఇస్తాడు. ఆయన “సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని” కూడా వాగ్దానమిచ్చాడు. (ప్రకటన 21:5) అవును, తన పరలోకరాజ్యం, వైకల్యాలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే మృతుల పునరుత్థానాన్ని పర్యవేక్షిస్తుంది అన్నదే ఆయన ఉద్దేశం. ఎవరివైతే వక్ర మార్గాలో ఆ వ్యక్తిని అంటే అపవాదియగు సాతానును కూడా ఈ ప్రభుత్వం నిర్మూలిస్తుంది. (యోహాను 5:28, 29; రోమీయులు 16:20; 1 కొరింథీయులు 15:26; 2 పేతురు 3:13) దేవుడు విషయాలను సరి చేసే సమయం వచ్చినప్పుడు భూవ్యాప్తంగా దేవుని పట్ల భయభక్తులు గల ప్రజలకు ఎంత దీవెనకరంగా ఉంటుంది!

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

Job Hearing of His Ruin/The Doré Bible Illustrations/Dover Publications

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి