నిత్యజీవం నిజంగా సాధ్యమేనా?
“బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలె[ను]?”—మత్తయి 19:16.
1. మన మానవ జీవిత కాలాన్ని గురించి ఏమని చెప్పవచ్చు?
బైబిలులో అహష్వేరోషుగా సుపరిచితుడైన పారసీక రాజైన క్సెరెక్సెస్, సా.శ.పూ. 480వ సంవత్సరంలో సమరానికి సన్నద్ధమౌతున్న తన సైనిక దళాలను పరిశీలిస్తున్నాడు. (ఎస్తేరు 1:1, 2) గ్రీకు చరిత్రకారుడైన హెరిడోటస్ ప్రకారం, రాజు తన సైనికులను చూసి కంటతడి పెట్టుకున్నాడు. ఎందుకు? “మానవుని అల్పాయుష్షును గురించి తలంచితే నాకు బాధ కల్గుతుంది. మరో నూరేళ్ల తర్వాత వీళ్లల్లో ఏ ఒక్కరూ బ్రతికి ఉండరు” అని క్సెరెక్సెస్ అన్నాడు. జీవితం ఎంతో స్వల్పమనీ, వృద్ధాప్యానికి ఎదిగి, రోగగ్రస్థులై, మరణించాలని ఏ ఒక్కరూ కోరుకోరనీ బహుశా మీరు కూడా గ్రహించేవుంటారు. ఓహ్, మనం యౌవనారోగ్యమూ, సంతోషమూ ఉండే జీవితాన్ని అనుభవించగల్గితే ఎంత బాగుండు!—యోబు 14:1, 2.
2. అనేకులు ఏ నిరీక్షణను కల్గి ఉన్నారు, ఎందుకు?
2 1997 సెప్టెంబరు 28 నాటి ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ “వాళ్లకు జీవించాలని ఉంది” అనే శీర్షికను ప్రచురించడం ఇక్కడ గమనార్హం. ఆ శీర్షిక, “నిరంతరం జీవించే మొదటి తరం మనదే కాగలదని నేను నిజంగా నమ్ముతున్నాను” అని ఒక పరిశోధకుడు చెప్పినట్లు తెలియజేసింది. నిత్యమూ జీవించడం సాధ్యమేనని బహుశా మీరు కూడా విశ్వసిస్తుండవచ్చు. ఈ భూమి మీద మనం నిరంతరం జీవించగలమని బైబిలు వాగ్దానం చేస్తున్నందున మీరు అలా అనుకొని ఉండవచ్చు. (కీర్తన 37:29; ప్రకటన 21:3, 4) అయినప్పటికీ, కొంతమంది ప్రజలు బైబిల్లో పొందుపర్చబడిన కారణాల్నిబట్టిగాక మరితర కారణాలనుబట్టి నిరంతర జీవించడం సాధ్యమౌతుందని నమ్ముతున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలించడం, నిత్యజీవం నిజంగా సాధ్యమౌతుందని గుణగ్రహించేందుకు మనకు సహాయపడతాయి.
నిరంతరం జీవించడానికే రూపొందించబడడం
3, 4. (ఎ) మనం నిరంతరం జీవించగలమని కొందరు ఎందుకు నమ్ముతున్నారు? (బి) తాను రూపొందించబడిన విధానాన్ని గురించి దావీదు ఏమని చెప్పాడు?
3 మానవులు నిరంతరం జీవించగలరని అనేకులు నమ్మడానికిగల ఒక కారణం, మనం నిర్మించబడిన అద్భుతమైన విధానమే. ఉదాహరణకు, మనం మన తల్లి గర్భంలో ఎలా రూపొందించబడ్డామన్నది నిజంగా అద్భుతకరమైన విషయం. వార్ధక్య నిపుణుడైన ఒక ప్రముఖ రచయిత, “మనల్ని గర్భధారణ నుండి జననం వరకు, ఆ తర్వాత లైంగిక పరిపక్వత, వయోజనులయ్యే వరకు తీసుకువెళ్లే అద్భుతాలను నిర్వహించిన తర్వాత, ప్రకృతి ఆ అద్భుతాలను నిరంతరం కొనసాగించే మరింత సుళువైన సంవిధానంలాంటి విధానాన్ని ఎంపిక చేసుకోలేదనిపిస్తుంది” అని వ్రాశాడు. అవును, మనం రూపొందించబడిన విధానాన్ని పరిశీలిస్తే, మనం ఎందుకు మరణించాలి? అన్న ప్రశ్న మిగిలిపోతుంది.
4 నేటి సైంటిస్టులు చూడగల్గినట్లుగా గర్భాశయంలో జరిగేదాన్ని బైబిలు రచయితయైన దావీదు చూడలేకపోయినప్పటికీ ఆయన ఆ అద్భుతాలను గురించి వేలాది సంవత్సరాల క్రిందటే తలపోశాడు. దావీదు తన ‘తల్లి గర్భమందు నిర్మించబ’డినప్పుడు, తాను రూపొందించబడిన విధానం గురించి ఆశ్చర్యపోయానని ఆయన వ్రాసుకున్నాడు. అప్పుడు ‘తన అంతరింద్రియములు ఏర్పడ్డాయని’ ఆయన చెప్పాడు. తాను ‘రహస్యమందు పుట్టి’నప్పుడు తన “యెముకలు” రూపొందించబడినట్టు కూడా చెప్పాడు. ఆ తర్వాత, దావీదు “పిండము”ను గూర్చి మాట్లాడి, తన తల్లి గర్భంలో ఉన్న ఆ పిండమునకు సంబంధించి ఇలా పేర్కొన్నాడు: “నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నియు (“నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నియు,” అధఃస్సూచి) నీ గ్రంథములో లిఖితము లాయెను.”—కీర్తన 139:13-16.
5. గర్భాశయమందు మనం రూపించబడే విధానంలో ఏ యే అద్భుతాలు చేరివున్నాయి?
5 తన తల్లి గర్భంలోపల దావీదు రూపొందించబడిన విధానాన్ని తెలియజేసే అక్షరార్థమైన చేతివ్రాత నఖలు ఏమీలేదనేది సుస్పష్టం. కానీ, దావీదు తన ‘అంతరింద్రియములు,’ “యెముకలు,” ఇతర అవయవాలు రూపొందించబడిన విధానాన్ని ధ్యానించడంవల్ల, ఆయనకు ఆ అవయవాలన్నింటి ఎదుగుదల ఓ పథకం ప్రకారం జరిగినట్టు—అలంకారికంగా చెప్పాలంటే ప్రతీదీ ‘గ్రంథములో లిఖించబడి’నట్టు ఉంది. అది, మానవ శిశువు ఎలా రూపొందించబడాలో తెలియజేసే వివరణాత్మక సూచనలు ఉన్న పుస్తకాలతో పూర్తిగా నిండిపోయిన ఓ పెద్దగదిని తల్లి గర్భాశయంలోపల ఫలదీకరణం చెందిన కణం కల్గివున్నట్టుంది. ఆ సంక్లిష్టమైన సూచనలు, ఫలదీకరణం చెందిన కణం నుండి ఉద్భవించనైవున్న ప్రతీ కణానికీ చేరవేయబడతాయి. అలా, సైన్స్ వరల్డ్ పత్రిక ‘ఎదుగుతున్న పిండములోని ప్రతీ కణమూ పూర్తిగా నకళ్లతో నిండివున్న ఒక కేబినెట్‌ను (గదిని) కల్గివుంటాయి’ అని ఆ కణాల్ని గురించి అలంకారిక భాషను ఉపయోగిస్తోంది.
6. దావీదు వ్రాసినట్టుగా మనలను ‘కలుగజేసిన విధము చూడగా . . . ఆశ్చర్యము పుట్టుచున్నది’ అనడానికి ఏ రుజువు ఉంది?
6 మన శరీరాలు పనిచేసే అద్భుతమైన తీరుతెన్నుల్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జీవశాస్త్రవేత్త అయిన జేరడ్ డైమండ్ “మన పేగు లోపలి కణాలు కొన్ని రోజులకు ఒకసారి చొప్పున, మూత్రాశయం లోపలి కణాలు రెండు నెలలకు ఒకసారి చొప్పున, అలాగే మన ఎర్రరక్త కణాలు నాలుగు నెలలకు ఒకసారి చొప్పున కొత్త కణాలచే మార్చబడుతూ ఉంటాయి” అని పేర్కొన్నారు. “ప్రకృతి మనల్ని ప్రతి రోజు వేరు చేసి తిరిగి దగ్గరగా చేరుస్తుంది” అన్న ముగింపుకు ఆయన వచ్చారు. నిజానికి దాని అర్థమేమిటి? మనం ఎంత కాలం జీవించినప్పటికీ అంటే 8 ఏళ్లు జీవించినా, 80 ఏళ్లు జీవించినా లేక 800 ఏళ్లు జీవించినా సరే, మన భౌతిక శరీరం యౌవనంగానే ఉంటుంది. ఒక శాస్త్రవేత్త ఒకప్పుడు ఇలా అంచనా వేశాడు: “ఒక్క సంవత్సరంలో, మనలో ఇప్పుడున్న పరమాణువుల్లో దాదాపు 98 శాతం, గాలిలో నుండి, ఆహారంలో నుండి, ద్రవపదార్థాలలో నుండి మనం తీసుకునే ఇతర పరమాణువులతో మార్చబడతాయి.” నిజానికి, దావీదు శ్లాఘించినట్లుగా మనలను “కలుగజేసిన విధము చూడగా . . . ఆశ్చర్యము పుట్టుచున్న[ది].”—కీర్తన 139:14.
7. మన భౌతిక శరీరాల రూపకల్పన ఆధారంగా కొందరు ఏ ముగింపుకు వచ్చారు?
7 “వృద్ధాప్యం ఎందుకు వస్తుందన్నది స్పష్టంకావడం లేదు” అని వార్ధక్య నిపుణుడైన ఒక ప్రముఖ రచయిత మన భౌతిక శరీరాల రూపకల్పన ఆధారంగా చెప్పాడు. మనం నిరంతరం జీవించాల్సిందేనన్నట్టు కనిపిస్తుంది. అందుకే మనుష్యులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మరణంపై విజయం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో డా. ఆల్విన్ సిల్వర్‌స్టైన్ ఎంతో దృఢ నమ్మకంతో ఇలా వ్రాశాడు: “మనం జీవిత సారాన్ని తెలుసుకుంటాం. మనిషి ఎలా వృద్ధుడౌతాడో . . . మనం అర్థం చేసుకుంటాం.” ఏ పర్యవసానాలతో? ఆయన ఇంకా ఇలా జోస్యం చెప్పాడు: “‘వృద్ధ’ ప్రజలనేవారే ఇక ఉండరు, ఎందుకంటే మరణంపై విజయాన్ని సాధ్యపర్చే జ్ఞానం నిత్యయౌవనాన్ని కూడా తెస్తుంది.” మానవుడు రూపించబడిన విధానాన్ని గురించిన ఆధునిక శాస్త్రీయ అన్వేషణను పరిశీలించడం, నిత్యజీవం అనే తలంపు విశ్వసించలేనట్లుగా ఉందా? నిత్యజీవం సాధ్యమేనని నమ్మడానికి బలమైన కారణం మరొకటి కూడా ఉంది.
నిరంతరం జీవించాలన్న కోరిక
8, 9. చరిత్రయందంతటా ప్రజలు ఏ సహజ కోరికను కల్గి ఉన్నారు?
8 నిరంతరం జీవించాలన్నది మానవుని సహజమైన కోరికన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? “నిరంతరం జీవించాలన్న స్వప్నం, మానవజాతంత ప్రాచీనమైనది” అని ఒక జర్మన్ పత్రికలో ఒక డాక్టర్ వ్రాశాడు. కొంతమంది ప్రాచీన యూరోపియన్ల నమ్మకాలను వర్ణిస్తూ, ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా తెలియజేసింది: “యోగ్యులైన ప్రజలు, వైభవంతో శోభిల్లే స్వర్ణమందిరాల్లో నిరంతరం జీవిస్తారు.” నిత్యజీవాన్ని పొందాలనే తమ కోరికను తీర్చుకునేందుకు ప్రజలు ఎంత దాకా వెళ్ళారన్నది ఇక చెప్పనవసరం లేదు.
9 రెండువేలకన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం చైనాలో, యౌవనపు ఊట అని పిలువబడే “అమృతాన్ని వెదకడానికి టావోయి ప్రీస్టుల నాయకత్వం క్రింద చక్రవర్తులూ సామాన్యులూ తమ కార్యకలాపాల్ని మానుకున్నారని” ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా పేర్కొన్నది. నిజం చెప్పాలంటే, చరిత్రయంతటిలో ప్రజలు వివిధ రకాలైన మిశ్రమాలను తీసుకోవడం ద్వారా లేక కొన్ని రకాలైన ద్రావకాలను త్రాగడం ద్వారా తాము నిత్య యౌవనులుగానే ఉండపోగలమని విశ్వసించారు.
10. జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి ఎటువంటి ఆధునిక ప్రయత్నాలు చేయడం జరుగుతోంది?
10 నిత్యమూ జీవించాలనే మానవుని స్వతఃసిద్ధమైన కోరికను తృప్తిపర్చేందుకు ప్రయత్నించే ఆధునిక ప్రయత్నాలు, అదే విధంగా విశిష్టమైనవి. ఒక ప్రసిద్ధిగాంచిన ఉదాహరణ ఏమిటంటే, రోగగ్రస్థుడై మరణించిన వ్యక్తిని శీతలీకరణకు గురిచేయడమే. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ రోగాన్ని నయంచేసే మందును తయారుచేసినప్పుడు అతనిని బ్రతికించుకోవచ్చనే ఆశతోనే అలా చేయడం జరుగుతోంది. క్రయోనిక్స్ అని పిలువబడే దాన్ని సమర్థిస్తున్న ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “మన ఆశావాదం న్యాయమైనదేనని నిరూపించబడితే,—వృద్ధాప్య బలహీనతలతో సహా—అన్ని రుగ్మతలనూ ఎలా స్వస్థపర్చవచ్చో లేక ఎలా బాగుచేయవచ్చో కనుగొనబడినప్పుడు, ఇప్పుడు ‘మరణించే’ వారందరికీ భవిష్యత్తులో అనంతకాలం కొనసాగించగల జీవితం లభిస్తుంది” అని వ్రాశాడు.
11. నిరంతరం జీవించాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారు?
11 నిరంతరం జీవించాలన్న కోరిక మన ఆలోచనల్లో ఎందుకంతగా పాతుకు పోయి ఉంది? అని మీరు అడగవచ్చు. “[దేవుడు] మానవుని మనస్సులో నిత్యత్వాన్ని ఉంచి”నందువల్లనేనా? (ప్రసంగి 3:11, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్) ఇది గంభీరంగా ఆలోచించవలసిన విషయం! ఒక్కసారి ఆలోచించండి: జన్మతః ఉన్న అనంతకాలం జీవించాలన్న అంటే నిరంతరం జీవించాలన్న కోరికను తీర్చాలన్నది మన సృష్టికర్త సంకల్పం కాకపోతే మనలో ఆ కోరిక ఎందుకుంటుంది? మనల్ని నిరంతరం జీవించాలన్న కోరికతో సృష్టించి, ఆ కోరికను తీర్చుకోవడానికి మనల్ని ఎన్నడూ అనుమతించకపోవడం ఆయనకు సమంజసమేనా?—కీర్తన 145:16.
మనం ఎవరిని విశ్వసించాలి?
12. కొందరు ఏ నమ్మకాన్ని కనబరిచారు? అయితే, అది ఆధారపడ దగినదని మీరు నమ్ముతారా?
12 నిత్యజీవాన్ని పొందడానికి మనం ఎక్కడ లేక దేనిపై నమ్మకాన్ని ఉంచాలి? 20వ శతాబ్దపు లేక 21వ శతాబ్దపు మానవ సాంకేతిక పరిజ్ఞానంపైనా? ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ “వాళ్లకు జీవించాలని ఉంది” అనే శీర్షికలో ‘సాంకేతిక పరిజ్ఞానం అనే ఒక క్రొత్త దేవత’ గురించీ, “సాంకేతికతా సామర్థ్యాన్ని గూర్చిన ఉత్సాహాల” గురించీ మాట్లాడింది. “వార్ధక్యాన్ని నిలిపివేయడం ద్వారా, బహుశా దాన్ని తిరోగమింప చేయడం ద్వారా [మనల్ని] రక్షించడానికి జన్యు వృద్ధికి దోహదపడే సాంకేతిక నైపుణ్యాలు కొంతకాలానికి అందుబాటులోకి రావచ్చునన్న . . . ఉల్లాసభరితమైన నమ్మకం” ఒక పరిశోధకుడికి ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే, వాస్తవానికి వార్ధక్యాన్ని నిలిపివేయడానికి లేదా మరణాన్ని జయించడానికి సంబంధించిన మానవ ప్రయత్నాలు పూర్తిగా వ్యర్థమని రుజువయ్యాయి.
13. మనం నిరంతరం జీవించడానికే రూపొందించబడ్డామని మన మెదడు నిర్మాణం ఎలా సూచిస్తుంది?
13 నిత్య జీవాన్ని పొందడానికి మరింకే మార్గమూ లేదని దానర్థమా? కానేకాదు! దానికొక మార్గం ఉంది ! మన మెదడు యొక్క అద్భుతమైన నిర్మాణం, నేర్చుకునేందుకు దానికి గల అపారమైన సామర్థ్యం మనం నిరంతరం జీవించేందుకు ఒక మార్గం ఉందని మనల్ని ఒప్పించాలి. కణజీవ శాస్త్రవేత్త అయిన జేమ్స్ వాట్సన్, మన మెదడును “మన విశ్వంలో ఇంతవరకు కనుగొన్న వాటన్నింటిలోకెల్లా అత్యంత సంశ్లిష్టమైనది” అని పిలిచారు. న్యూరాలజిస్ట్ రిచర్డ్ రెస్టక్ ఇలా చెప్పారు: “మనకు తెలిసిన విశ్వమంతటిలో మెదడుతో పోల్చదగినదేదీ ఎక్కడా లేదు.” మనం నిత్యజీవాన్ని అనుభవించాలని ఉద్దేశించబడకపోతే, అపరిమితమైన సమాచారాన్ని సేకరించి, దాన్ని తనలో ఇముడ్చుకునే సామర్థ్యంగల మెదడునూ, నిరంతరం పనిచేయడానికి రూపకల్పన చేయబడిన శరీరమూ మనకెందుకుండాలి?
14. (ఎ) బైబిలు రచయితలు మానవ జీవితాన్ని గురించి ఏ ముగింపుకు వచ్చారు? (బి) మన నమ్మకాన్ని మానవులపైగాక దేవునిపైనే ఎందుకు పెట్టుకోవాలి?
14 అయితే మనం రావాల్సిన సహేతుకమైన, వాస్తవికమైన ముగింపు ఏమైవుంది? మనం నిరంతరం జీవించగల్గేలా సర్వశక్తిమంతుడు, జ్ఞాని అయిన సృష్టికర్త ద్వారా మనం రూపించబడి, సృష్టించబడలేదా? (యోబు 10:8; కీర్తన 36:9; 100:3; మలాకీ 2:10; అపొస్తలుల కార్యములు 17:24, 25) కాబట్టి, “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు; వారిని నమ్ముకొనకుడి” అని బైబిలు కీర్తనల గ్రంథకర్త ఇచ్చిన ప్రేరేపిత ఆజ్ఞను జ్ఞానయుక్తంగా లక్ష్యపెట్టవద్దా? మానవుడ్ని ఎందుకు నమ్మలేం? ఎందుకంటే, కీర్తనల గ్రంథకర్త వ్రాసినట్టుగా “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు; వారి సంకల్పములు నాడే నశించును.” నిరంతరం జీవించగల సాధ్యనీయతవున్నా, వాస్తవానికి మానవులు మరణం ముంగిట్లోకొచ్చేసరికి నిస్సహాయులైవున్నారు. “ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు” అని కీర్తనల గ్రంథకర్త ముగిస్తున్నాడు.—కీర్తన 146:3-5.
ఇది నిజంగా దేవుని సంకల్పమేనా?
15. మనం నిరంతరం జీవించాలన్నది దేవుని సంకల్పమని ఏది చూపిస్తుంది?
15 అయితే, మనం నిత్యజీవాన్ని అనుభవించడం నిజంగా దేవుని సంకల్పమేనా? అని మీరు అడగవచ్చు. అవును, దేవుని సంకల్పమే! దాని గురించి ఆయన వాక్యం అనేకసార్లు వాగ్దానం చేస్తోంది. “దేవుని కృపావరము . . . నిత్యజీవము” అని బైబిలు అభయమిస్తోంది. దేవుని సేవకుడైన యోహాను ఇలా వ్రాశాడు: “నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే [దేవుడు] తానే మనకు చేసిన వాగ్దానము.” కాబట్టి “బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలె[ను]?” అని ఒక యౌవనుడు యేసును అడగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. (రోమీయులు 6:23; 1 యోహాను 2:25; మత్తయి 19:16) వాస్తవానికి, “ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను” అని పౌలు వ్రాశాడు.—తీతు 1:2.
16. దేవుడు “అనాదికాలమందే” నిత్యజీవాన్ని ఏ భావంలో వాగ్దానం చేశాడు?
16 దేవుడు నిత్యజీవాన్ని “అనాదికాలమందే వాగ్దానము చేసెను” అంటే అర్థమేమిటి? దేవుడు ఆది దంపతులైన ఆదాము హవ్వలను సృష్టించడానికి ముందే మానవులు నిరంతరం జీవించాలని ఆయన ఉద్దేశించాడనేది అపొస్తలుడైన పౌలు భావమని కొందరు తలస్తారు. అయినా, మానవులను సృష్టించిన తర్వాత యెహోవా తన సంకల్పాన్ని తెలియజేసిన కాలాన్నే గనుక పౌలు సూచిస్తున్నట్లైతే, అప్పుడు కూడా ఆ దేవుని చిత్తంలో మానవులు నిత్యమూ జీవించాలన్నది చేరివుందనే విషయం స్పష్టంగా ఉంది.
17. ఏదెను నుండి ఆదాము, హవ్వలు ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు, ప్రవేశ మార్గం దగ్గర కెరూబులు ఎందుకు నిలువబెట్టబడ్డారు?
17 ఏదెను తోటలో “దేవుడైన యెహోవా . . . జీవవృక్షమును . . . నేలనుండి మొలిపించెను” అని బైబిలు చెబుతోంది. ఆదామును ఏదెను తోటలోనుండి బయటకు గెంటివేయడానికి ఇవ్వబడిన కారణమేమిటంటే, “అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో”ననేదే—అవును నిరంతరం జీవిస్తాడేమోననే ! ఆదాము, హవ్వలను ఏదెను తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, యెహోవా “కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.”—ఆదికాండము 2:9; 3:22-24.
18. (ఎ) జీవవృక్ష ఫలాలను తినడం అంటే ఆదాము హవ్వల విషయంలో భావమేమై ఉంది? (బి) ఆ వృక్ష ఫలాలను తినడం దేనికి ప్రాతినిధ్యం వహించింది?
18 ఆదాము హవ్వలు ఆ జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతించబడివుంటే, వారి విషయంలో దాని భావమేమై ఉండేది? అందులో సందేహం ఎందుకు, పరదైసులో నిరంతరం జీవించే ఆధిక్యత లభించి ఉండేది ! “మానవ శరీరాన్ని వృద్ధాప్యపు శిథిలావస్థ నుండీ, లేక మరణానికి దారితీసే క్షీణావస్థ నుండీ కాపాడగల ఏదో శక్తి ఆ జీవవృక్షానికి ఉండివుండవచ్చు” అని ఒక బైబిలు వ్యాఖ్యానకర్త చెప్పాడు. వృద్ధాప్యపు “ప్రభావాలను నిరర్థకం చేసే సామర్థ్యంగల మూలికలు పరదైసులో ఉండేవని” కూడా ఆయన అన్నాడు. అయితే, జీవాన్నివ్వగల లక్షణాలు ఆ జీవవృక్షము దానంతటదే కల్గివున్నట్లు బైబిలు చెప్పడం లేదు. బదులుగా ఆ వృక్షం, దాని ఫలాల్ని తినడానికి అనుమతించబడే వ్యక్తికి నిత్యజీవాన్ని గూర్చిన దేవుని హామీవుందన్న విషయానికి కేవలం ప్రాతినిధ్యం వహిస్తుంది.—ప్రకటన 2:7.
దేవుని సంకల్పంలో మార్పులేదు
19. ఆదాము ఎందుకు మరణించాడు? అతని సంతానమైన మనం కూడా ఎందుకు మరణిస్తున్నాము?
19 ఆదాము పాపం చేసినప్పుడు, నిత్యమూ జీవించే హక్కును పోగొట్టుకున్నాడు, అప్పటికింకా జన్మించని తన సంతానానికుండే హక్కును కూడా పోగొట్టాడు. (ఆదికాండము 2:17) అతడు తన అవిధేయత మూలంగా పాపి అయినప్పుడు, అతడు లోపముగలవాడూ, అపరిపూర్ణుడూ అయిపోయాడు. తత్ఫలితంగా అప్పటి నుండీ, ఆయన మరణం నిర్థారితమయ్యింది. బైబిలు చెబుతున్నట్లుగా, “పాపము వలన వచ్చు జీతము మరణము.” (రోమీయులు 6:23) అంతేగాక, ఆదాము యొక్క అపరిపూర్ణ సంతాన మరణం నిర్థారితమయ్యింది. బైబిలు ఇలా వివరిస్తోంది: “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
20. మానవులు ఈ భూమి మీదనే నిరంతరం జీవించాల్సి ఉన్నారని ఏది సూచిస్తోంది?
20 కానీ, ఆదాము పాపం చేయకపోయుంటే, ఆయన దేవునికి అవిధేయతను చూపకపోయివుంటే, జీవవృక్ష ఫలాలను తినేందుకు అతనికి అనుమతి లభించి ఉంటే అప్పుడేమిటి? నిత్యజీవమనే దేవుని కృపావరాన్ని ఆయన ఎక్కడ అనుభవించి ఉండేవాడు? పరలోకంలోనా? కాదు! ఆదామును పరలోకానికి తీసుకువెళ్లడాన్ని గురించి దేవుడు ఏమీ చెప్పలేదు. ఆయన పని నియామకం, భూమ్మీదనే. “దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును . . . నేలనుండి మొలిపించెను” అని బైబిలు వివరిస్తోంది. అదింకా ఇలా చెబుతోంది: “దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.” (ఆదికాండము 2:9, 15) ఆదాముకు జతగా హవ్వ సృష్టించబడిన తర్వాత, వారిద్దరికీ ఇక్కడ భూమిపైన అదనపు పని నియామకాలు ఇవ్వబడ్డాయి. దేవుడు వారికిలా చెప్పాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.”—ఆదికాండము 1:28.
21. మొదటి మానవులు ఏ అద్భుతకరమైన ఉత్తరాపేక్షలను అనుభవించారు?
21 దేవుడు ఆదాము హవ్వలకిచ్చిన నిర్దేశాలు చూపించిన అద్భుతకరమైన భూసంబంధ ఉత్తరాపేక్షల గురించి ఆలోచించండి ! వారు భూపరదైసులో పరిపూర్ణ ఆరోగ్యవంతులైన కుమారులనూ, కుమార్తెలనూ పెంచవలసి ఉంది. వారి ప్రియమైన పిల్లలు పెద్దవారౌతుండగా, ఫలించడంలోనూ ఆ పరదైసును కాపాడే ఆహ్లాదకరమైన తోటపనిలోనూ తమ పిల్లలతో పాటు భాగం వహించవలసి ఉంది. జంతువులన్నిటినీ లోబర్చుకుంటూ, వాళ్ళు ఎంతో సంతృప్తికరమైన జీవితాలను గడిపి ఉండేవారు. చివరికి మొత్తం భూమి అంతా పరదైసుగా మారేంతగా ఏదెను తోట పరిధులను విస్తరింపజేయడంలో లభించే ఆనందాన్ని గురించి ఆలోచించండి ! వృద్ధులై మరణించడాన్ని గురించిన చింతలేమీ లేకుండా అలాంటి సుందరమైన భూ గృహంలో పరిపూర్ణులైన పిల్లలతో మీరు జీవితాన్ని ఆనందిస్తారా? ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీ హృదయపు సహజ మానసిక ప్రేరణలను అనుమతించండి.
22. భూమి విషయంలో దేవుడు తన సంకల్పాన్ని మార్చుకోలేదని మనమెందుకు నిశ్చయతను కల్గి ఉండవచ్చు?
22 అయితే, ఆదాము హవ్వలు అవిధేయత చూపించి, ఏదెను తోటలోనుండి వెళ్లగొట్టబడినప్పుడు, మానవులు భూమిపై పరదైసులో నిరంతరం జీవించాలన్న తన సంకల్పాన్ని దేవుడు మార్చుకున్నాడా? ఎంతమాత్రం మార్చుకోలేదు! దేవుడు అలా మార్చుకుని ఉంటే, తన ఆది సంకల్పాన్ని నెరవేర్చే సామర్థ్యం తనకు లేదని తన ఓటమిని ఒప్పుకున్నట్లు అయ్యేది. “ఆలాగే, నా నోటనుండి వచ్చువచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును” అని దేవుడు తనకుగా తానే ప్రకటించుకున్నట్టుగానే ఆయన వాగ్దానం చేసినవాటిని నెరవేరుస్తాడనే నిశ్చయతను మనం కల్గి ఉండవచ్చు.—యెషయా 55:11.
23. (ఎ) నీతిమంతులు భూమిపై నిరంతరమూ జీవించాలనేది దేవుని సంకల్పమని ఏది మరలా ధృవీకరిస్తోంది? (బి) దీని తర్వాతి శీర్షికలో మనం ఏమి చర్చించబోతున్నాము?
23 భూమి విషయంలో దేవుని సంకల్పం మారలేదన్న విషయం బైబిలులో స్పష్టపర్చబడింది, బైబిల్లో దేవుడు ఇలా వాగ్దానంచేస్తున్నాడు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారని యేసుక్రీస్తు కూడా కొండమీద చేసిన తన ప్రసంగంలో చెప్పాడు. (కీర్తన 37:29; మత్తయి 5:5) అయితే, నిరంతర జీవితాన్ని మనమెలా పొందగలము, అలాంటి జీవితాన్ని అనుభవించాలంటే మనమేమి చేయాలి? అవి దీని తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.
మీరు ఎలా జవాబిస్తారు?
◻ నిత్యజీవం సాధ్యమేనని అనేకమంది ఎందుకు నమ్ముతున్నారు?
◻ మనం నిరంతర జీవించడానికే చేయబడ్డామని మనల్ని ఏది ఒప్పింపచేయాలి?
◻ మానవజాతి విషయంలో, భూమి విషయంలో దేవుని ఆది సంకల్పమేమైవుంది?
◻ దేవుడు తన ఆది సంకల్పాన్ని నెరవేరుస్తాడని మనమెందుకు నిశ్చయత కల్గివుండొచ్చు?