మనం ఎంత కాలంపాటు జీవించ గలం?
ప్రజలు దీర్ఘకాలంపాటు జీవిస్తున్నారు అది, ‘మనం ఎంతకాలంపాటు జీవించగలం?’ అని అనేకమంది అనుకునేలా చేస్తోంది.
ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1995) ప్రకారం, గతంలో ప్యెర్ జూబర్ అనే వ్యక్తి సుదీర్ఘకాలంపాటు జీవించినట్టు విశ్వసించడం జరిగింది. ఆయన 1814లో తన 113వ ఏట కాలంచేశాడు. నిజమే, ఇతరులు అంతకన్నా ఎక్కువకాలం జీవించినట్టు చెప్పబడినా, వాళ్ల వయస్సులకు సంబంధించిన వివరాలు, విశ్వసనీయమైన రీతిలో రికార్డు చేయబడలేదు. అయితే, ఖచ్చితంగా వ్రాయబడివున్న వివరణలు, ప్యెర్ జూబర్ జీవించిన కాలంకన్నా దీర్ఘకాలంపాటు అనేకమంది ప్రజలు జీవించారని ధృవపర్చాయి.
జాన్ లవీజ్ కల్‌మాన్ అనే వ్యక్తి, 1875 ఫిబ్రవరి 21న ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని ఆర్లల్స్ నగరంలో జన్మించింది. 122 కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు జీవించి, 1997 ఆగష్టు 4న ఆమె మరణించింది. దానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. జపాన్ దేశీయుడైన షిగెచియో ఈజూమీ అనే వ్యక్తి 1986లో తన 120వ ఏట మరణించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 1999 పుస్తకాన్ని వ్రాస్తున్ననాటికి జీవిస్తున్న వారిలోకెల్లా వృద్ధురాలిగా 118 ఏండ్ల శారా నూస్‌ను ఆ పుస్తకం లెక్కించింది. ఆమె 1880 సెప్టెంబరు 24న అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించింది. కెనడాలోని క్విబెక్ వాస్తవ్యురాలైన మారీలవీజ్ ఫబ్రోనీ మేయర్ అనే వృద్ధమహిళ 1998లో తన 118వ ఏట మరణించేనాటికి, ఆమె శారా కన్నా 26 రోజులు పెద్దది.
నిజంగానే, వయో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే శతాబ్దపు ప్రథమార్ధంలో నిండు నూరేళ్లు జీవించే వారి సంఖ్య 22 లక్షల కన్నా ఎక్కువ పెరుగుతుందని అంచనా! అదే విధంగా, 80 ఏళ్ల వయస్సున్న వారి సంఖ్య, 1970లో 2 కోట్ల 67లక్షలు ఉంటే 1998లో 6 కోట్ల 60 లక్షలకు పెరిగింది. 60 శాతం పెరిగిన మొత్తం ప్రపంచ జనాభాతో పోల్చి చూస్తే, వయో వృద్ధుల సంఖ్యలో 147 శాతం పెరుగుదల కన్పించింది.
కేవలం ప్రజల ఆయుఃప్రమాణం మాత్రమే పెరగలేదు. వయో వృద్ధుల్లో అనేకులు, 20 ఏళ్ల వయస్సులో ఉన్న అనేకమంది చేయలేని వాటిని చేసి చూపిస్తున్నారు కూడా. 1990లో జాన్ కెల్లీ అనే 82 ఏళ్ల వృద్ధుడు, మారథాన్ రేస్‌లో 42.195 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఐదు గంటల ఐదు నిమిషాల్లో ముగించాడు. అంతే దూరాన్ని, 1991లో 84 ఏండ్ల బామ్మగారు మేవిస్ లిండ్‌గ్రెన్ ఏడు గంటల తొమ్మిది నిమిషాల్లో ముగించింది. ఇటీవల, 91 ఏండ్ల ప్రాయంలో ఒక వ్యక్తి న్యూయార్క్ నగర పరుగుపందాన్ని పూర్తి చేశాడు!
గతకాలం నాటి వృద్ధులు, విస్మయం కల్గించే సాహసకృత్యాలను చేయలేదని కాదు. 99 ఏళ్ల వృద్ధాప్యంలో, బైబిలులోని మూలపురుషుడైన అబ్రాహాము అతిథులను “ఎదుర్కొనుటకు పరుగెత్తి” వెళ్ళాడు. 85 ఏళ్ల వయస్సులో, కాలేబు ఇలా ప్రకటించాడు: “యుద్ధముచేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు [45 సంవత్సరాల క్రితం వలె] బలమున్నది.” “అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు” అని 120 ఏండ్ల వయస్సులో ఉన్న మోషేను గురించి బైబిలు చెబుతుంది.—ఆదికాండము 18:2; యెహోషువ 14:10, 11; ద్వితీయోపదేశకాండము 34:7.
చారిత్రాత్మక వ్యక్తులుగా ఆది మానవుడైన ఆదాము గురించీ, ఓడ నిర్మాణకుడైన నోవహు గురించీ యేసుక్రీస్తు మాట్లాడాడు. (మత్తయి 19:4-6; 24:37-39) ఆదాము 930 ఏండ్లు, నోవహు 950 ఏండ్లు జీవించారని ఆదికాండము పుస్తకం చెబుతోంది. (ఆదికాండము 5:5; 9:29) ప్రజలు నిజంగా అంత సుదీర్ఘకాలం జీవించారా? మనం అంతకన్నా సుదీర్ఘ కాలం, బహుశా నిరంతరమూ జీవించగలమా? దీని తర్వాతి శీర్షికలో దానికి నిదర్శనాలను దయచేసి పరిశీలించండి.