కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/15 పేజీలు 9-14
  • నిత్యజీవానికి ఏకైక మార్గం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిత్యజీవానికి ఏకైక మార్గం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసుక్రీస్తు పాత్ర
  • వాగ్దత్త సంతానం
  • విమోచనా క్రయధనం దేనిని నెరవేరుస్తుందంటే
  • మహిమాన్విత ఉత్తరాపేక్ష
  • దేవుని ప్రమాణాలను చేరుకోవడం
  • యేసు రక్షించును —కానీ ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • మానవజాతిని రక్షించుటకు దేవుడేమి చేశాడు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • క్రీస్తు విమోచన క్రయధనం—దైవిక రక్షణ మార్గము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/15 పేజీలు 9-14

నిత్యజీవానికి ఏకైక మార్గం

“నేనే మార్గమును, సత్యమును, జీవమును.”—యోహాను 14:6.

1, 2. నిత్యజీవానికి నడిపించే మార్గాన్ని యేసు దేనికి పోల్చాడు, ఆయన ఉపమానంలోని అంతర్భావమేమిటి?

యేసు తాను కొండమీద చేసిన ప్రసిద్ధిగాంచిన తన ప్రసంగంలో నిత్యజీవానికి నడిపించే మార్గాన్ని, ఒకడు ద్వారంగుండా ప్రవేశించే దారికి పోల్చాడు. జీవానికి తీసుకువెళ్లే ఆ మార్గం అంత సులభమైనది కాదని యేసు నొక్కి చెబుతున్నాడని గమనించండి. ఆయనిలా అంటున్నాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. [నిత్య] జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”—మత్తయి 7:13, 14.

2 ఈ ఉపమానంలోని అంతర్భావమేమిటో మీరు గ్రహించారా? జీవానికి నడిపించే దారి, లేక మార్గం కేవలం ఒక్కటే ఉందనీ, జీవానికి నడిపించే ఆ మార్గం నుండి తప్పిపోకుండా జాగ్రత్తవహించేందుకు దానికి జాగ్రత్తగా అవధానాన్ని ఇవ్వాల్సి ఉంటుందనీ అది వెల్లడి చేయడం లేదా? అయితే, నిత్యజీవానికి నడిపే ఏకైక మార్గం ఏది?

యేసుక్రీస్తు పాత్ర

3, 4. (ఎ) మన రక్షణ విషయంలో యేసు యొక్క ప్రముఖమైన పాత్రను గురించి బైబిలు ఎలా తెలియజేస్తోంది? (బి) మానవజాతి నిత్యజీవాన్ని పొందగలదని మొట్టమొదటగా దేవుడు ఎప్పుడు బయల్పర్చాడు?

3 ఆ మార్గానికి సంబంధించి యేసుకు ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉందని స్పష్టమౌతుంది, యేసు అపొస్తలుడైన పేతురు ఇలా ప్రకటించాడు: “మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ [యేసు] నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన, మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొస్తలుల కార్యములు 4:12) అదే విధంగా, అపొస్తలుడైన పౌలు ఇలా తెలియచేశాడు: “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (రోమీయులు 6:23) “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని యేసు ప్రకటించుకున్నాడు గనుక నిత్యజీవానికి నడిపించే ఏకైక మార్గం తన ద్వారానేనని ఆయనే స్వయంగా బయల్పరిచాడు.—యోహాను 14:6.

4 అందుకని, నిత్యజీవాన్ని సాధ్యం చేయడంలో యేసు పాత్రను మనం గుర్తించడం ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి, మనం ఆయన పాత్రను మరింత సునిశితంగా పరిశీలిద్దాం. ఆదాము పాపం చేసిన తర్వాత, యెహోవాదేవుడు మానవజాతి నిత్యజీవాన్ని అనుభవించగలదని ఎప్పుడు సూచించాడో మీకు తెలుసా? ఆదాము పాపంలో పడిపోయిన వెంటనే దాన్ని సూచించడం జరిగింది. మానవజాతికి రక్షకునిగా యేసుక్రీస్తు ఏర్పాటును గూర్చి మొట్టమొదట ఎలా ప్రవచించబడిందో మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

వాగ్దత్త సంతానం

5. హవ్వను మోసగించిన సర్పాన్ని మనమెలా గుర్తించగలం?

5 యెహోవా దేవుడు ఆ వాగ్దత్త రక్షకుని సూచనార్థక భాషలో గుర్తించాడు. ఏ సర్పమైతే హవ్వతో మాట్లాడి, నిషేధించిన ఫలాన్ని తినేలా చేసి దేవునికి అవిధేయతను చూపేలా ఆమెను శోధించిందో ఆ “సర్పము” మీదకి రానైవున్న శిక్షను ప్రకటించినప్పుడు, యెహోవా ఆ వాగ్దత్త రక్షకుడ్ని గుర్తించాడు. (ఆదికాండము 3:1-5) నిజమే, ఆ సర్పము నిజానికి అక్షరార్థమైన సర్పము కాదు. అతడు, “అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్ప[ము]”గా బైబిలులో గుర్తించబడిన ఒక శక్తిమంతమైన ఆత్మ ప్రాణియే. (ప్రకటన 12:9) హవ్వను మోసగించేందుకు సాతాను తన వాగ్దూతగా ఆ అల్ప ప్రాణిని ఉపయోగించుకున్నాడు. అలా, సాతానుకు శిక్షను విధిస్తూ దేవుడు అతనితో ఇలా చెప్పాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది [స్త్రీ సంతానము] నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదు[వు].”—ఆదికాండము 3:15.

6, 7. (ఎ) “సంతానము”ను కనిన స్త్రీ ఎవరు? (బి) వాగ్దాన సంతానం ఎవరు, ఆయన ఏమి నెరవేరుస్తాడు?

6 సాతానుకు శత్రువుగావున్న, లేక సాతాను ద్వేషించే ఈ “స్త్రీ” ఎవరు? ప్రకటన 12వ అధ్యాయంలో “ఆది సర్పము” గుర్తించబడినట్లుగానే, సాతాను ద్వేషించే ఆ స్త్రీ కూడా గుర్తించబడింది. మొదటి వచనంలో ఆమె “సూర్యుని ధరించుకొని . . . పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును” కల్గివున్నట్లు చెప్పబడుతుంది. ఆ స్త్రీ నమ్మకమైన దేవదూతలతో కూడిన పరలోక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె కనిన “మగశిశువు,” రాజుగా యేసుక్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది.—ప్రకటన 12:1-5.

7 కాబట్టి, ఆదికాండము 3:15లో ప్రస్తావించబడినట్టుగా మరణించేలా సాతాను ‘తలమీద కొట్టబోయే’ ఆ స్త్రీ  “సంతానము” లేక సంతతి ఎవరు? కన్యకకు అద్భుతమైన రీతిలో జన్మించేలా దేవుడు ఎవరినైతే పరలోకం నుండి పంపించాడో ఆయనే ఆ సంతానం. అవును, యేసు అనే మనుష్యుడే ఆ సంతానం. (మత్తయి 1:18-23; యోహాను 6:38) పునరుత్థానుడైన పరలోక పరిపాలకునిగా ఆ సంతానమైన యేసుక్రీస్తు, సాతానును జయించడంలో నాయకత్వం వహిస్తాడని ప్రకటన 12వ అధ్యాయం బయల్పరుస్తోంది. ప్రకటన 12:10 చెబుతున్నట్టుగా, ‘రాజ్యము మన దేవునిదయ్యేలా, అధికారము ఆయన క్రీస్తుదయ్యేలా’ చేస్తాడు.

8. (ఎ) తన ఆది సంకల్పానికి సంబంధించి, దేవుడు ఏ క్రొత్త సంగతిని ఏర్పాటు చేశాడు? (బి) దేవుని క్రొత్త ప్రభుత్వంగా ఎవరు సంఘటితపర్చబడతారు?

8 ఆ విధంగా, యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న ఆ రాజ్యం, మానవులు భూమిపై నిత్యజీవాన్ని అనుభవించాలనే తన ఆది సంకల్పానికి సంబంధించి దేవుడు ఏర్పాటుచేసిన ఒక క్రొత్త సంగతియైవుంది. సాతాను తిరుగుబాటు చేసిన తర్వాత, యెహోవా ఆ క్రొత్త రాజ్య ప్రభుత్వం ద్వారా చెడు పర్యవసానాలన్నిటినీ నిర్మూలించేందుకు సత్వర చర్యలను చేపట్టాడు. యేసు భూమిపైనున్నప్పుడు, ఆ ప్రభుత్వంలో భాగం వహించేది తాను మాత్రమే కాదని ఆయన వెల్లడి చేశాడు. (లూకా 22:28-30) మానవజాతిలో నుండి ఇతరులు ఎన్నుకోబడతారు. వాళ్లు పరిపాలనలో భాగం వహించేందుకు పరలోకంలో ఆయనతో కలుస్తారు. అలా వాళ్లు స్త్రీ సంతానంలో ఉప భాగమౌతారు. (గలతీయులు 3:16, 29) యేసుతోపాటు సహపరిపాలకులుగా ఉండేవారి సంఖ్య అంటే, భూమిపైనున్న పాపభరితమైన మానవజాతిలో నుండి తీసుకోబడేవారి సంఖ్య 1,44,000 అని బైబిలులో ఇవ్వబడింది.—ప్రకటన 14:1-3.

9. (ఎ) యేసు, భూమి మీద మానవజాతికి కనిపించవలసిన అవసరం ఎందుకుంది? (బి) యేసు సాతాను పనులను ఎలా త్రిప్పికొట్టాడు?

9 అయితే, ఆ రాజ్యం పరిపాలన ప్రారంభించకముందే, ఆ సంతానంలో ప్రథమ భాగమైన యేసుక్రీస్తు భూమి మీద కనిపించడం ఆవశ్యకం. ఎందుకు? “అపవాది యొక్క క్రియలను లయపరచు [తుడిచివేయు]”వానిగా ఆయనను యెహోవా దేవుడు నియమించాడు. (1 యోహాను 3:8) సాతాను క్రియలలో, ఆదామును పాపం చేసేలా పురికొల్పడం ఇమిడివుంది. అది ఆదాము సంతానమంతటిపైకీ పాప మరణాలనే శిక్షావిధిని తీసుకొచ్చింది. (రోమీయులు 5:12) అపవాది యొక్క ఆ చర్యను యేసు తన జీవితాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించడం ద్వారా త్రిప్పికొట్టాడు. ఆ విధంగా యేసు మానవజాతి పాప మరణాలనే శిక్షావిధి నుండి విడుదల పొందేందుకు ఆధారాన్ని అనుగ్రహించి, నిత్యజీవానికి మార్గాన్ని తెరిచాడు.—మత్తయి 20:28; రోమీయులు 3:24; ఎఫెసీయులు 1:7.

విమోచనా క్రయధనం దేనిని నెరవేరుస్తుందంటే

10. ఆదాము, యేసుల మధ్య ఏ సారూప్యమున్నది?

10 యేసు జీవం పరలోకం నుండి ఒక మానవ స్త్రీ గర్భంలోకి మార్చబడింది గనుక, ఆయన ఆదాము పాపంతో కళంకితం కాకుండా పరిపూర్ణ మానవునిగా జన్మించగల్గాడు. ఆయనకు భూమిపై నిరంతరం జీవించగలిగే సామర్థ్యం ఉంది. అదే విధంగా, భూమిపై నిత్యజీవాన్ని అనుభవించగల ఉత్తరాపేక్షతో పరిపూర్ణ మానవునిగా ఆదాము సృష్టించబడ్డాడు. “ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయె[ను] . . . కడపటి ఆదాము [యేసుక్రీస్తు] జీవింపచేయు ఆత్మ ఆయెను. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు” అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు ఆయన మనస్సులో ఆ ఇద్దరి మనుష్యుల మధ్య ఉన్న సారూప్యతే ఉంది.—1 కొరింథీయులు 15:45, 47.

11. (ఎ) ఆదాము, యేసు మానవజాతిపై ఎటువంటి ప్రభావాన్ని కల్గి ఉన్నారు? (బి) యేసు బలిని మనమెలా దృష్టించాలి?

11 పరిపూర్ణ మానవులుగా భూమిమీద నడిచిన ఇద్దరే ఇద్దరు పురుషులైన వారి మధ్యవున్న ఆ సారూప్యత, యేసు “అందరికొరకు [“తత్సమానమైన,” NW] విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను” అన్న బైబిలు ప్రకటన ద్వారా నొక్కి చూపించబడింది. (1 తిమోతి 2:6) యేసు ఎవరికి తత్సమానంగా ఉన్నాడు? అందులో సందేహమేముంది, పరిపూర్ణునిగా ఉన్నప్పటి ఆదాముకు తత్సమానంగా ఉన్నాడు! మొదటి ఆదాము చేసిన పాపం, యావత్‌ మానవ కుటుంబ మరణ శిక్షావిధికి కారణమయ్యింది. “కడపటి ఆదాము” అర్పించిన బలి, పాప మరణాల నుండి విడిపించడానికి ఆధారాన్ని ఏర్పాటు చేసింది గనుక, మనం నిరంతరం జీవించగలం. యేసు బలి ఎంత అమూల్యమైనదో కదా! అపొస్తలుడైన పేతురు ఇలా పేర్కొన్నాడు: “వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు.” బదులుగా, “అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితి[రి]” అని పేతురు వివరించాడు.—1 పేతురు 1:18, 19.

12. మన మరణ దండనను తొలగించడాన్ని గూర్చి బైబిలెలా వర్ణిస్తోంది?

12 మానవ కుటుంబ మరణ శిక్షావిధి ఎలా రద్దు చేయబడుతుందనే విషయాన్ని బైబిలు ఎంత చక్కగా వర్ణిస్తుందో గమనించండి. అదిలా చెబుతోంది: “తీర్పు [ఆదాము యొక్క] ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యము [మరణపర్యంతం యేసు చూపించిన యథార్థత] వలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుష్యుని [ఆదాము] అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని [యేసు] విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.”—రోమీయులు 5:18, 19.

మహిమాన్విత ఉత్తరాపేక్ష

13. అనేకమంది ఎందుకు నిరంతరం జీవించాలని అనుకోరు?

13 దేవుడు చేసిన ఆ ఏర్పాటు మనల్ని ఎంత సంతోషపర్చాలో కదా! రక్షకుడు ఇవ్వబడినందుకు మీరు పులకరించిపోరా? ఒకప్పుడు అమెరికాలోని ఒక ప్రముఖ నగరమందు ఒక వార్తాపత్రిక జరిపిన సర్వేలో “నిరంతరం జీవించాలనే ఉత్తరాపేక్ష మీకు ఆకర్షణీయమైందిగా ఉందా?” అని అడిగినప్పుడు, దానికి ప్రతిస్పందించిన వారిలో 67.4 శాతం మంది ఆశ్చర్యకరంగా “లేదు” అని జవాబు ఇచ్చారు. నిరంతరం జీవించాలని తాము కోరుకోవడంలేదని వాళ్లెందుకు అన్నారు? ఇప్పుడు భూమిపై జీవితం అనేక సమస్యలతో ముడిపడి ఉన్నందుకే వాళ్ళలా అన్నారని స్పష్టమౌతుంది. “200 ఏళ్ల వయస్సున్నదానిగా కనబడాలన్న ఆలోచన నాకు ప్రీతిపాత్రమైందికాదు” అని ఒక మహిళ అన్నది.

14. నిరంతరం జీవించడం ఎందుకు పరిపూర్ణమైన ఆహ్లాదకరంగా ఉంటుంది?

14 అయితే, ప్రజలు అనారోగ్యంతోనూ, వృద్ధాప్యంతోనూ, మరితర విషాదకరమైన సంఘటనలతోనూ బాధపడే లోకంలో నిరంతరం జీవించడం గురించి బైబిలు మాట్లాడడం లేదు. ఎందుకంటే దేవుని రాజ్య పాలకునిగా యేసు, సాతాను మూలంగా కల్గిన అలాంటి సమస్యలన్నింటినీ తొలగిస్తాడు. బైబిలు ప్రకారం దేవుని రాజ్యం, అణచివేసే ఇహలోక ప్రభుత్వాలన్నింటినీ “పగులగొట్టి నిర్మూలము చేయును.” (దానియేలు 2:44) ఆ సమయంలో, యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థనకు జవాబుగా, దేవుని “చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవే”రవలసి ఉంది. (మత్తయి 6:9,  10) దేవుని నూతన లోకంలో, భూమి మీద నుండి చెడుతనమంతా తీసివేయబడిన తర్వాత, యేసు విమోచన క్రయధనబలి ప్రయోజనాలు పూర్తిగా అన్వయించబడతాయి. అవును, అర్హులైన మానవులంతా పరిపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు!

15, 16. దేవుని నూతన లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి?

15 దేవుని నూతన లోకంలో జీవించే ప్రజలకు, బైబిల్లోని ఈ మాటలు అన్వయించబడతాయి: “వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.” (యోబు 33:25) బైబిల్లోని మరో వాగ్దానం కూడా నెరవేరుతుంది: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులువేయును, మూగవాని నాలుక పాడును.”—యెషయా 35:5, 6.

16 ఒక్కసారి ఆలోచించండి: మన వయస్సు ఎంతైనప్పటికీ అంటే 80 ఏళ్లైనా, 800 ఏళ్లైనా, లేక అంతకన్నా ఎక్కువైనా సరే, మన శరీరాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి. అది, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అని బైబిలు వాగ్దానం చేస్తున్నట్టు ఉంటుంది. ఆ కాలంలో, ఈ వాగ్దానం కూడా నెరవేరుతుంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].”—యెషయా 33:24; ప్రకటన 21:3, 4.

17. దేవుని నూతన లోకంలో జీవించబోవు ప్రజల నుండి మనమేం ఎదురుచూడవచ్చు?

17 మన సృష్టికర్త మన అద్భుతమైన మెదడును నేర్చుకునే అపరిమితమైన సామర్థ్యంతో రూపొందించినప్పుడు, ఆయన అది ఎలా పనిచేయాలని ఉద్దేశించాడో అలా మనం దాన్ని ఆ నూతన లోకంలో ఉపయోగించుకోగల్గుతాము. మనం సాధించగల అద్భుతమైన సంగతుల గురించి ఒక్కసారి ఊహించండి! అపరిపూర్ణ మానవులు సహితం, భూమి లోపల ఉన్న మూలకాలను ఉపయోగించి ప్రతీచోటా మనకు కన్పించే సెల్యులార్‌ ఫోన్లనూ, మైక్రోఫోన్లనూ, వాచీలనూ, పేజర్లనూ, కంప్యూటర్లనూ, విమానాలనూ, మరలాంటి అనేకమైన వాటిని తయారుచేశారు. వాటిలో ఏ ఒక్కటీ కూడా విశ్వంలోని మరెక్కడో సుదూర ప్రాంతం నుండి తీసుకువచ్చిన పదార్థాల నుండి తయారు చేయబడలేదు. అనంతమైన జీవితం మన ముందుండగా, రానైయున్న భూ పరదైసులో సృజనాత్మక సాధనా సామర్థ్యం అపరిమితంగా ఉంటుంది!—యెషయా 65:21-25.

18. దేవుని నూతన లోకంలో జీవితం ఎందుకు విసుగ్గా ఉండదు?

18 అప్పుడు జీవితం విసుగ్గా ఉండదు. మనం ఇప్పటికే వేలకొలదిసార్లు భోజనం చేసినప్పటికీ మనం, మరలా తినబోయే భోజనం కోసం ఎదురు చూస్తాం. మానవ పరిపూర్ణతలో, పరదైసు భూమిమీద పండే రుచికరమైన ఆహారపదార్థాలను ఇంకా బాగా ఆస్వాదిస్తాం. (యెషయా 25:6) భూమి యొక్క విస్తృతమైన జంతు జీవాల గురించి శ్రద్ధతీసుకోవడంలో, మనోరంజకమైన సూర్యాస్తమయాలనూ, పర్వతాలనూ, నదులనూ, లోయలనూ తిలకించడంలో మనకు నిత్యం ఆహ్లాదం లభిస్తుంది. నిజంగా, దేవుని నూతన లోకంలో జీవితం ఎన్నటికీ యాంత్రికమైనదిగా మారదు!—కీర్తన 145:16.

దేవుని ప్రమాణాలను చేరుకోవడం

19. జీవమనే దేవుని కృపావరాన్ని పొందడానికి చేరుకోవలసిన దేవుని ప్రమాణాలు ఉన్నాయని నమ్మడం ఎందుకు సహేతుకం?

19 అలాంటి పరదైసులో నిత్యజీవమనే దేవుని ఘనమైన కృపావరాన్ని మనం ప్రయత్నం చేయకుండానే అయాచితంగా పొందగలమని మీరు ఎదురుచూస్తారా? దేవుడు మనలను ఫలానిది చేయవలసిన అవసరముందని ఆదేశించడం సహేతుకమైన విషయం కాదంటారా? ఖచ్చితంగా. దేవుడు ఆ బహుమానాన్ని ఊరికే అలా మనవైపుకు విసిరి వేయడం లేదు. ఆయన మనకు దాన్ని అందిస్తున్నాడు, అయితే మనం ముందుకు వెళ్ళి దాన్ని అందుకోవాలి. అవును, అందుకు ప్రయత్నం అవసరం. “నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలె[ను]” అని ధనికుడైన ఆ యౌవన పరిపాలకుడు యేసును అడిగిన అదే ప్రశ్నను మీరూ అడగవచ్చు. లేదా మీరు అదే ప్రశ్నను, “రక్షణపొందుటకు నేనేమి చేయవలెన”ని అపొస్తలుడైన పౌలును ఫిలిప్పీలోని చెరసాల నాయకుడు అడిగినట్లు అడుగవచ్చు.—మత్తయి 19:16; అపొస్తలుల కార్యములు 16:30.

20. నిత్యజీవాన్ని పొందడానికి ఒక ఆవశ్యకమైన ప్రమాణం ఏమిటి?

20 యేసు తన మరణానికి ముందు రాత్రి తన పరలోక తండ్రికి చేసిన ప్రార్థనలో “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రధానమైన ప్రమాణాన్ని చూపించాడు. (యోహాను 17:3) నిత్యజీవాన్ని సాధ్యపర్చిన యెహోవాను గురించీ, మనకోసం మరణించిన యేసుక్రీస్తు గురించీ జ్ఞానాన్ని పొందడం ఒక సహేతుకమైన ప్రమాణం కాదంటారా? అయినప్పటికీ, అలాంటి జ్ఞానాన్ని కేవలం గైకొనడంకన్నా ఇంకా ఎంతో అవసరమౌతుంది.

21. విశ్వాసాన్ని చూపిస్తూ ఉండాలన్న ప్రమాణాన్ని చేరుకుంటున్నామని మనం ఎలా చూపిస్తాం?

21 బైబిలు ఇంకా ఇలా తెలియజేస్తుంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు.” అదింకా ఇలా జత చేస్తుంది: “కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.” (యోహాను 3:36) మీ జీవితంలో మార్పులను చేసుకోవడం ద్వారా, దానిని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మార్చుకోవడం ద్వారా మీరు కుమారునియందు విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారని కనుపర్చుకోగలరు. మీరు ఎటువంటి చెడు నడతలోనైనా ఉంటే దాన్ని విడనాడి, దేవునిని ప్రీతిపర్చేదానిని చేసేందుకు చర్య తీసుకోవాలి. అపొస్తలుడైన పేతురు ఆజ్ఞాపించిన దాన్ని మీరు చేయవలసిన అవసరం ఉంది: “ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును . . . మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి.”—అపొస్తలుల కార్యములు 3:19,  20.

22. యేసు అడుగుజాడల్లో నడవడంలో ఏ చర్యలు ఇమిడి ఉన్నాయి?

22 యేసునందు విశ్వాసం చూపిస్తూ ఉండడం ద్వారా మాత్రమే మనం నిత్యజీవాన్ని అనుభవించగలమని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. (యోహాను 6:40; 14:6) మనం యేసు ‘అడుగుజాడలయందు నడుచుకోవడం’ ద్వారానే ఆయన యందు మనం విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నామని కనుపర్చుకోగలం. (1 పేతురు 2:21) అలా చేయడంలో ఏమి చేరివుంది? దేవునికి చేసిన ప్రార్థనలో యేసు ఇలా తెలియజేశాడు: “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నా[ను].” (హెబ్రీయులు 10:7) దేవుని చిత్తాన్ని చేయడానికి అంగీకరించి, మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడంలో యేసును అనుకరించడం ప్రాముఖ్యం. ఆ తర్వాత, మీరు ఆ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేయాలి; యేసు కూడా బాప్తిస్మం కోసం తనను తాను ముందుంచుకున్నాడు. (లూకా 3:21, 22) అలాంటి చర్యల్ని గైకొనడం పూర్తిగా సహేతుకం. అపొస్తలుడైన పౌలు “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది” అని పేర్కొన్నాడు. (2 కొరింథీయులు 5:14, 15) ఏ విధంగా? మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసును ప్రేమ కదిలించింది. ఆయన యందు విశ్వాసాన్ని చూపిస్తూ ఉండడం ద్వారా ప్రతిస్పందించేలా మనల్ని ఆ ప్రేమ బలవంతం చేయవద్దా? అవును, ఇతరులకు సహాయం చేయడంలో తనను తాను అర్పించుకున్న ఆయన ప్రేమ పూర్వక మాదిరిని అనుసరించేందుకు అది మనల్ని బలవంతం చేయాలి. క్రీస్తు, దేవుని చిత్తాన్ని చేయడం కోసమే జీవించాడు. మనం కూడా అలాగే చేయాలి, ఇక మన కోసం మనం జీవించకూడదు.

23. (ఎ) జీవాన్ని పొందబోవువారు దేనికి చేర్చబడాలి? (బి) క్రైస్తవ సంఘంలోని వారినుండి ఏమి కోరబడుతుంది?

23 విషయం అంతటితో ముగిసిపోదు. సా.శ. 33 పెంతెకొస్తునాడు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వారు “చేర్చబడిరి.” దేనికి చేర్చబడ్డారు వాళ్లు? “[వారు] అపొస్తలుల బోధయందును సహవాసమందును . . . ఎడతెగక యుండిరి” అని లూకా వివరిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 2:41, 42) అవును, వాళ్లు బైబిలు పఠనం కోసం, సహవాసం కోసం సమకూడేవారు, అలా వారు క్రైస్తవ సంఘంలోకి చేర్చబడ్డారు లేక దానిలో భాగమయ్యారు. తొలి క్రైస్తవులు, ఆధ్యాత్మిక నడిపింపు కోసం కూటాలకు క్రమంగా హాజరయ్యేవారు. (హెబ్రీయులు 10:25) దాన్ని యెహోవాసాక్షులు నేడు కూడా పాటిస్తారు, వాళ్లు తమతోపాటు ఆ కూటాలకు హాజరవ్వమని మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడతారు.

24. ‘వాస్తవమైన జీవితం’ అంటే ఏమిటి, అది ఎప్పుడు, ఎలా, వాస్తవరూపం దాలుస్తుంది?

24 జీవానికి నడిపించే ఈ ఇరుకైన దారిని ఇప్పుడు లక్షలాదిమంది అనుసరిస్తున్నారు. ఈ ఇరుకైన దారిలో నడుస్తూ ఉండడానికి ప్రయత్నం అవసరం! (మత్తయి 7:13, 14) ప్రేమపూర్వకమైన ఈ క్రింది విన్నపంలో పౌలు దాన్ని సూచించాడు: “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి[తివి].” “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము” మంచి పోరాటాన్ని పోరాడడం అవసరం. (1 తిమోతి 6:12, 18, 19) ఆ జీవితం, ఆదాము పాపం మూలంగా మనపైకి వచ్చిన నొప్పులతోనూ, వేదనలతోనూ, బాధలతోనూ కూడిన ప్రస్తుత జీవితం కాదు. బదులుగా, అది దేవుని నూతన లోకంలోని జీవితం. ఆ జీవితం త్వరలోనే అంటే, ప్రస్తుత విధానం తొలగించబడిన తర్వాత యెహోవా దేవుడ్నీ, ఆయన కుమారుడ్నీ ప్రేమించేవారి తరుపున క్రీస్తు విమోచనా క్రయధన బలి అన్వయించబడునప్పుడు వాస్తవరూపం దాలుస్తుంది. దేవుని మహిమాన్వితమైన నూతన లోకంలో ‘వాస్తవమైన జీవితాన్ని’ అంటే నిత్యజీవాన్ని మనమంతా ఎంపిక చేసుకుందాం.

మీరెలా జవాబిస్తారు?

◻ సర్పం ఎవరు, స్త్రీ ఎవరు, ఆదికాండము 3:15లో ఉన్న సంతానం ఎవరు?

◻ యేసు ఆదాముకు తత్సమానంగా ఎలా ఉన్నాడు, విమోచనా క్రయధనం దేన్ని సాధ్యంచేసింది?

◻ మీరు దేవుని నూతన లోకంలో మీకు ఆనందాన్ని తెచ్చే దేని కోసం ఎదురుచూస్తారు?

◻ దేవుని నూతన లోకంలో జీవించడానికి మనం ఏ ప్రమాణాలను చేరుకోవలసిన అవసరం ఉంటుంది?

[10వ పేజీలోని చిత్రం]

యౌవనులకూ, వృద్ధులకూ, అనంతమైన జీవితానికి ఏకైక మార్గం యేసే

[11వ పేజీలోని చిత్రం]

దేవుని నియమిత కాలంలో, వృద్ధులు యౌవనులవుతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి