కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/1 పేజీలు 3-7
  • ఆధునిక కాలానికొక సందేశం ఉన్న జ్ఞానగ్రంథం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆధునిక కాలానికొక సందేశం ఉన్న జ్ఞానగ్రంథం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?
  • మీరు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారా?
  • మీరు మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలనుకుంటున్నారా?
  • మీరు సంచిని తెరుస్తారా?
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • నిజమైన తెలివి కేకలు వేస్తోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • “పరలోకం నుండి వచ్చే తెలివి” మీ జీవితంలో పనిచేస్తుందా?
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/1 పేజీలు 3-7

ఆధునిక కాలానికొక సందేశం ఉన్న జ్ఞానగ్రంథం

“సంచెడు జ్ఞానము సంచెడు ముత్యాలకన్నా విలువైనది” అని ప్రాచీన కాలంలోని ఒక కుటుంబపు పితామహుడూ, తన కాలంలో ఉన్న ధనవంతుల్లో ఒకడూ అయిన యోబు పేర్కొన్నాడు. (యోబు 1:3; 28:18, NW; 42:12) నిజమే, ఒకవ్యక్తి తన జీవితాన్ని సఫలం చేసుకొనేందుకు సహాయపడే విషయానికొస్తే, వస్తుసంబంధ ఆస్తి కన్నా జ్ఞానము చాలా విలువైనది. జ్ఞానవంతుడైన రాజగు సొలొమోను “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయతే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము” అని అన్నాడు.—ప్రసంగి 7:12.

కానీ అలాంటి జ్ఞానాన్ని ఈ రోజు ఎక్కడ కనుగొనవచ్చు? ప్రజలందరూ తమ సమస్యలతో, పత్రికల్లో సలహాలిచ్చే నిపుణుల దగ్గరకీ, మానసిక శాస్త్రవేత్తల దగ్గరకీ, మానసిక వైద్యుల దగ్గరకీ, హెయర్‌డ్రెస్సర్‌లు, టాక్సీ డ్రైవర్‌ల దగ్గరకి సహితం వెళ్తున్నారు. కావల్సినంత ఫీజు చెల్లిస్తే, దాదాపు అన్ని విషయాల్లోనూ సలహాలను ఇవ్వడానికి సలహాలిచ్చే నిపుణులు అనేకమంది సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ, తరచుగా ఆ ‘జ్ఞానపు’ మాటలు నిరాశకు, వినాశనానికి కూడా దారితీశాయి. అలాగయితే మనం నిజమైన జ్ఞానాన్ని ఎలా కనుగొనవచ్చు?

మానవుల వ్యవహారాల విషయంలో గొప్ప అంతర్దృష్టి ఉన్న యేసుక్రీస్తు, “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందు[ను]” అని ఒకసారి చెప్పాడు. (మత్తయి 11:19) మనం ప్రజల జీవితాల్లోని కొన్ని సాధారణ సమస్యలను చూసి, ఏ జ్ఞానపు మాటలు ప్రజలకు నిజంగా సహాయపడి ‘సంచెడు ముత్యాల’ కన్నా చాలా విలువైనవని నిరూపించబడ్డాయో చూద్దాం. మీరు కూడా ఆ ‘సంచెడు జ్ఞానాన్ని’ కనుగొని దాని ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?

“20వ శతాబ్దం వ్యాకులతతో కూడిన కాలంలో అడుగుపెట్టినట్లయితే, నిరాశతో కూడిన కాలారంభాన్ని చూస్తూ ముగింపుకు వస్తోంది” అని లండన్‌లోని ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంటోంది. అదింకా ఇలా తెలియజేస్తోంది, “ప్రపంచవ్యాప్తంగా మేజర్‌ డిప్రెషన్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉందని మేజర్‌ డిప్రెషన్‌ను గూర్చిన మొదటి అంతర్జాతీయ అధ్యయనం వెల్లడి చేస్తోంది. తైవాన్‌, లెబనాన్‌, న్యూజిలాండ్‌ లాంటి దేశాల్లో ప్రతి క్రొత్త తరమూ ఈ రుగ్మతకు మరెక్కువ గురౌతుంది.” 1955 తర్వాత జన్మించిన వారు, తమ పితరుల కంటే మూడువంతులు ఎక్కువగా మేజర్‌ డిప్రెషన్‌తో బాధపడే సాధ్యత ఉందని చెప్పబడుతుంది.

డిప్రెషన్‌కి (అవసాదం) గురై చాలారోజులు మంచమ్మీదే గడిపిన టొమోయే పరిస్థితి కూడా అలాంటిదే. రెండేళ్ల వయస్సుగల తన పిల్లవాని పట్ల సరియైన శ్రద్ధ వహించలేక ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. టొమోయే తన కుమారుని వయసే ఉన్న కుమార్తె గల తన పొరుగామెతో స్నేహం చేసింది. తనెందుకూ పనికిరాని వ్యక్తినని భావిస్తుందని ఆ పొరుగామెకు తెలియజేసినప్పుడు ఆమె ఒక పుస్తకంలో నుండి “కన్ను చేతితో—నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో—మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే”a అని చెబుతున్న ఒక వచనాన్ని చూపించింది. టొమోయే కళ్ళ నుండి కన్నీళ్ళు ఉబికి రాగా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్థలం ఉందనీ ప్రతి ఒక్కరూ అవసరమైన వాళ్ళేననీ ఆమె గ్రహించింది.

ఆ మాటలున్న పుస్తకాన్ని పరిశీలించమని ఆ పొరుగామె సలహా ఇచ్చింది. అప్పటివరకూ టొమోయే ఏమి చేయలేక పోయినప్పటికీ, కనీసం చిన్న వాగ్దానం కూడా చేయలేకపోయినప్పటికి, ఇప్పుడు అంగీకార సూచకంగా తలూపింది. ప్రతిరోజు ఆ పొరుగామె ఆమెకు బజారు పనుల్లోనూ, భోజనం సిద్ధం చేయడంలోనూ సహాయం చేసేది. ఒకనెల తర్వాత టొమోయే ప్రతీ ఇల్లాలు చేసే పనులను అంటే ప్రతి ఉదయాన్నే నిద్రలేచి బట్టలుతికి, ఇంటిని చక్కబెట్టి, బజారు పనులను చూసుకొని, భోజనం సిద్ధం చేసేది. ఆమె అనేకమైన ఇబ్బందులు అధిగమించాల్సినప్పటికీ, “నేను కనుగొన్న జ్ఞానపు మాటలను అనుసరిస్తే చాలు, నేను అన్ని సరిగా చేసుకోగలనన్న నమ్మకం నాకుంది” అని ఆమె చెప్పింది.

టొమోయే తాను కనుగొన్న జ్ఞానాన్ని అన్వయింపచేసుకోవడం ద్వారా, డిప్రెషన్‌తో కూడిన విషాదభరిత దినాలను అధిగమించగలిగింది. టొమోయే తన సమస్యలను అధిగమించగల్గేలా చేసిన అవే మాటలను అన్వయించుకోవడానికి ఇతరులకు సహాయపడే పనిని పూర్తికాలం చేస్తుంది. ఆ జ్ఞానపు మాటలు ఆధునిక కాలానికొక సందేశం ఉన్న ప్రాచీన పుస్తకంలో ఉన్నాయి.

మీరు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారా?

ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు అధికమవుతోంది. తమ కుటుంబాల్లో సన్నిహిత సంబంధాలున్నాయని ఒకప్పుడు గొప్ప చెప్పుకొన్న ప్రాచ్యదేశాల్లో కూడా కుటుంబ సమస్యలు అధికమవుతున్నాయి. వివాహసంబంధ విషయాల్లో జ్ఞానపూర్వకమైన, ఫలితాలను తీసుకువచ్చే నడిపింపును మనమెక్కడ కనుగొనవచ్చు?

వివాహసంబంధమైన అనేక సమస్యలను ఎదుర్కొన్న షూగో మరియు మీహోకో అనే దంపతులనే తీసుకోండి. ప్రతి చిన్న విషయానికి వారిద్దరూ తగవులాడుకునేవారు. షూగో స్వభావరీత్యా ముక్కోపి. అతడు మీహోకోలో తప్పులను ఎత్తిచూపించిన ప్రతీసారీ ఆమె కూడా అలాగే చేసేది. ‘మేము ఏ విషయంలోనైనా ఏకీభవించడమనేది అసంభవం’ అని కూడా ఆమె తలంచేది.

ఒకరోజు ఒక స్త్రీ మీహోకోను దర్శించి ఒక పుస్తకం నుండి, “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి”b అనే మాటలను ఆమెకు చదివి వినిపించింది. మీహోకోకి మతాసక్తి లేనప్పటికీ ఆ స్త్రీతో పాటు ఆ మాటలున్న ఆ పుస్తకాన్ని పఠించేందుకు అంగీకరించింది. తన కుటుంబజీవితాన్ని మెరుగుపర్చుకోవాలన్న దాని మీదే ఆమె ఆసక్తి. నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం చర్చించబడుతున్న కూటానికి వాళ్లను ఆహ్వానించినప్పుడు మీహోకో, ఆమె భర్తా వెంటనే అంగీకరించారు.c

ఆ కూటంలో అక్కడ సమావేశమైన ప్రజలందరూ, వారేమి నేర్చుకున్నారో దాన్ని ఆచరణలో పెడుతున్నట్లుగానూ, వారు సంతోషంగా ఉన్నట్లుగానూ షూగో గమనించాడు. తన భార్య అధ్యయనం చేస్తున్న పుస్తకాన్ని పరిశీలించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక వాక్యం ఆయన అవధానాన్ని ఆకట్టుకొంది: “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.”d ఆయన తన జీవితంలో ఈ సూత్రాన్ని అన్వయించుకొనేందుకు కొంత సమయం పట్టినప్పటికీ, ఆయన భార్యతో సహా ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఆయనలో క్రమేణా వచ్చిన మార్పు కనిపించింది.

తన భర్తలో వచ్చిన మార్పును చూసిన మీహోకో కూడా తను నేర్చుకుంటున్న వాటిని అన్వయించుకోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును,”e అన్న సూత్రం ఖచ్చితంగా సహాయకరమైనదని రుజువైంది. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకునే బదులు ఎల్లప్పుడూ వారి మంచి లక్షణాల గురించీ, ఎలా అభివృద్ధి సాధించాలనే దాని గురించీ మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితం ఏమిటి? “ఇలా చేయడం నన్ను నిజంగా సంతోషపర్చింది. మేము ప్రతి రాత్రీ భోజన సమయాల్లో ఆ విధంగా చేస్తున్నాము. మూడు సంవత్సరాల మా అబ్బాయి కూడా ఆ సంభాషణలో పాల్గొంటాడు. అది మాకు నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉండేది !” అని మీహోకో గుర్తుచేసుకుంటుంది.

వారు పొందిన అర్థవంతమైన సలహాలను ఆచరణలో పెట్టినప్పుడు, వివాహ బంధాన్ని విషమస్థాయికి తీసుకువస్తున్న సమస్యలను అధిగమించగల్గారు. వారికి అది సంచెడు ముత్యాలకన్నా విలువైనది కాదా?

మీరు మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలనుకుంటున్నారా?

నేడు అనేకమందికి ఉన్న జీవిత ధ్యేయం ధనాన్ని కూడబెట్టుకోవడమే. కానీ, ధర్మాదాయ సంస్థకు కోట్ల డాలర్లు దానం చేసిన, అమెరికాలోని ఒక వ్యాపారస్థుడు ఇలా చెప్తున్నాడు: “కొంతమంది ప్రజల విషయానికి వస్తే డబ్బుకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది, కానీ ఎవరూ రెండు జతల చెప్పులను ఒకేసారి ధరించలేరు.” ఈ వాస్తవాన్ని అంగీకరించేవాళ్ళు అరుదు, డబ్బు వెంటపడడాన్ని మానుకొనేవారు అంతకన్నా అరుదు.

హిటోషి పేదవానిగా పెరిగాడు, కాబట్టి ఆయనకు ధనవంతుడ్నవ్వాలనే కోరిక బలంగా ఉండేది. అప్పిచ్చిన వాళ్ళు అప్పుతీసుకున్న ప్రజలను ఎలా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటారో చూసిన తర్వాత “ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటుందో వాళ్ళే విజేతలు” అని నిశ్చయించుకున్నాడు. హిటోషి డబ్బుకున్న శక్తి మీద చాలా నమ్మకాన్నుంచాడు ఎంత నమ్మకముంచాడంటే డబ్బు మానవ జీవితాలను కూడా కొనగలదని అనుకున్నాడు. ధనాన్ని కూడబెట్టేందుకు ప్లంబింగ్‌ పనిలో పూర్తిగా నిమగ్నమైపోయి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సంవత్సరమంతా పనిచేశాడు. తనకు పని ఇచ్చిన కంట్రాక్టర్లంత అధికారం ఒక సబ్‌కాంట్రాక్టర్‌కి ఉండదని త్వరలోనే గ్రహించాడు. దివాలా తీస్తానేమోనన్న భయాన్ని, అలాగే నిరాశను కూడా ప్రతీరోజు ఎదుర్కోవలసివచ్చింది.

అప్పుడే ఒకవ్యక్తి హిటోషి తలుపుతట్టి, మీ కోసం మరణించిన యేసుక్రీస్తు గురించి మీకేమైనా తెలుసా అని ఆయనను అడిగాడు. తనలాంటి వ్యక్తి కోసం ఎవరూ మరణించలేరని హిటోషి భావించాడు గనుక జిజ్ఞాస గలవాడై తర్వాతి చర్చలకు అంగీకరించాడు. ఆ తర్వాతి వారం ఆయన ప్రసంగానికి హాజరయ్యాడు, ‘కంటిని తేటగా ఉంచుకోవాలి’ అన్న ఉపదేశాన్ని విని ఆశ్చర్యపోయాడు. ‘తేటగల’ కన్ను దూరదృష్టి కలిగి ఆధ్యాత్మిక విషయాలపై అవధానాన్ని కలిగివుంటుంది, మరోవైపు “చెడ్డ” కన్ను లేక “ఈర్ష్యాపూరితమైన” కన్ను తక్షణ శరీరాశలను కలిగి ముందుచూపులేకుండా ఉంటుంది. “నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును”f అన్న ఉపదేశం ఆయనపై చెరగని ముద్ర వేసింది. ధనాన్ని సంపాదించడంకంటే ప్రాముఖ్యమైనదేదో ఉంది ! ఇలాంటిదాన్ని ఆయన ముందెన్నడూ వినలేదు.

కదిలింపబడినవాడై, తాను నేర్చుకుంటున్న వాటిని అన్వయించుకోవడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం ప్రాకులాడే బదులు, తన జీవితంలో ఆధ్యాత్మిక విలువలకు ప్రథమస్థానాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. తన కుటుంబ ఆధ్యాత్మిక క్షేమం విషయమై కూడా ఆయన శ్రద్ధ చూపేందుకు సమయాన్ని వెచ్చించాడు. కాబట్టి సహజంగానే పనికి తక్కువ సమయం మిగులుతుంది. అయినప్పటికీ అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. ఎందుకని?

తనకివ్వబడిన ఉపదేశానికి ప్రతిస్పందించినవాడై, తన దెబ్బలాడే వ్యక్తిత్వాన్ని మార్చుకుని, మృదువుగానూ, స్నేహభావం గలవానిగానూ తయారయ్యాడు. ప్రత్యేకించి ఒక ఉపదేశం ఆయనను కదిలించింది: “మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు.”g ఈ సలహా ఆయనను ధనవంతుడ్ని చేయలేదు కానీ, ఆయన “నవీన స్వభావము” తన క్లైంట్లకు సదభిప్రాయాన్ని కలిగించడంతో ఆయన వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందాడు. అవును, తను కనుగొన్న జ్ఞానపు మాటలు తను జీవితాన్ని సఫలీకృతం చేసుకొనేందుకు సహాయం చేశాయి. ఆయనకు అవి అక్షరార్థంగానే సంచెడు ముత్యాలకన్నా, డబ్బుకన్నా విలువైనవి.

మీరు సంచిని తెరుస్తారా?

పైన ఇవ్వబడిన ఉదాహరణల్లోని వ్యక్తులకు విలువైనదిగా నిరూపించబడిన జ్ఞానపు సంచి ఏదో గుర్తుపట్టగలరా? ఆ జ్ఞానం భూమ్యంతటా విరివిగా పంచిపెట్టబడుతున్న విరివిగా లభ్యమౌతున్న బైబిల్లో ఉంది. బహుశా మీ వద్ద ఒక ప్రతి ఉండవచ్చు లేదా మీరు సులభంగానే ఒకటి సంపాదించుకోవచ్చు. ఏమైనప్పటికీ విలువైన సంచెడు ముత్యాలు ఉండి వాటిని ఉపయోగించకపోతే సొంతదారుడికి ప్రయోజనమేమీ ఉండదు. అలాగే బైబిలు ఉన్నంత మాత్రాన సరిపోదు. సంచిని ఎందుకు విప్పకూడదు, ఇంకా చెప్పాలంటే బైబిల్లోని జ్ఞానపూర్వకమైన ఉపదేశాన్ని, సమయోచితమైన సలహానూ అన్వయించుకొని, జీవిత సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకోవడంలో అది మీకు ఎలా సహాయపడుతుందో ఎందుకు చూడకూడదు?

ఎప్పుడైనా మీకు సంచెడు ముత్యాలు ఇవ్వబడ్డాయనుకోండి, మీరు కృతజ్ఞత కలిగి మీకు సహాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ ఇచ్చిన వ్యక్తెవరో తెలుసుకోవాలని ప్రయత్నించరా? బైబిలును ఇచ్చిన దాత ఎవరో మీకు తెలుసా?

“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము . . . ప్రయోజనకరమై యున్నది” అని బైబిలు చెబుతున్నప్పుడు జ్ఞానానికి మూలమెవరన్నది అది వెల్లడిచేస్తుంది. (2 తిమోతి 3:16) ‘దేవుని వాక్యము సజీవమై బలముగలది’ అని కూడా అది చెప్తుంది. (హెబ్రీయులకు 4:12) అందుకే బైబిలులో కనుగొనబడే జ్ఞానపు మాటలు నేడు సమయోచితమైనవి, ఫలవంతమైనవి కూడా. ఆధునిక కాలానికొక సందేశంవున్న జ్ఞానగ్రంథమైన బైబిలులో గల “సంచెడు జ్ఞానము” నుండి ప్రయోజనం పొందే వ్యక్తిగా ఉండే ఉత్తరాపేక్షను మీరు కల్గివుండేందుకుగాను ఉదారంగా ఇచ్చే దాతయైన యెహోవా దేవుని గురించి తెలుసుకునేందుకు మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు.

[అధస్సూచీలు]

a ఈ వాక్యం 1 కొరింథీయులు 12:21, 22 నుండి తీసుకొనబడినది.

b మత్తయి 7:12.

c వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

d సామెతలు 14:29.

e మత్తయి 7:1, 2.

f మత్తయి 6:21-23; అధఃసూచి, NW.

g కొలొస్సయులకు 3:8-10.

[4వ పేజీలోని బాక్సు]

భావోద్వేగ సమతూకాన్ని కాపాడుకొనేందుకు జ్ఞానపు మాటలు

“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.”—కీర్తనలు 130:3, 4.

“సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.”—సామెతలు 15:13.

“అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు?”—ప్రసంగి 7:16.

“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.

“కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.”—ఎఫెసీయులకు 4:26.

[5వ పేజీలోని బాక్సు]

సంతోషకరమైన కుటుంబజీవితానికి జ్ఞానపు మాటలు

“ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.”—సామెతలు 15:22.

“జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.”—సామెతలు 18:15.

“సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.”—సామెతలు 25:11.

“ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులకు 3:13, 14.

“నా ప్రియ సహోదరులారా, . . . ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.”—యాకోబు 1:19.

[6వ పేజీలోని బాక్సు]

జీవితాన్ని సఫలీకృతం చేసుకొనేందుకు జ్ఞానపు మాటలు

“దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.”—సామెతలు 11:1.

“నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”—సామెతలు 16:18.

“ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.”—సామెతలు 25:28.

“ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.”—ప్రసంగి 7:9.

“నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.”—ప్రసంగి 11:1.

“వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.”—ఎఫెసీయులకు 4:29.

[7వ పేజీలోని చిత్రం]

బైబిలును పఠించడమే “సంచెడు జ్ఞానం” నుండి ప్రయోజనం పొందే మొదటి మెట్టు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి