రాజ్య ప్రచారకుల నివేదిక
‘అనుకూల సమయములందును అనుకూలముకాని సమయములందును’ ప్రకటించడం
యుద్ధం బోస్నియా, హెర్జెగోవినా దేశాలను నాశనం చేసినప్పుడు, వేలాదిమంది తీవ్రమైన కష్టాలను అనుభవించారు. ఆ కష్టకాలాల్లో ప్రజలకు ప్రోత్సాహ, నిరీక్షణలను అందించేందుకు యెహోవాసాక్షులు అన్నివిధాల ప్రయత్నించారు. సరజివోలో కొంతకాలంపాటు సేవచేసిన ఒక సాక్షి వ్రాసిన ఉత్తరం నుండి తీసుకొనబడిన కొన్ని భాగాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
“జీవితం ఇక్కడ దుర్భరంగా ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం బైబిలు సత్యాలకు ఎంతగానో ప్రతిస్పందించారు. స్థానిక సాక్షులు పట్టుదలకు మారుపేరుగా మంచి మాదిరినుంచారు. వస్తుపరంగా వాళ్ళకున్నది అతి తక్కువే అయినప్పటికీ, వారికి చక్కని స్ఫూర్తి ఉంది. దాదాపుగా సంఘంలో ఉన్న యౌవనులంతా పూర్తికాల పరిచర్యలో ఉన్నారు. వారి ఆసక్తినిబట్టి క్రొత్త ప్రచారకులు ప్రోత్సాహాన్ని పొందారు. సేవకు వెళ్ళడం మొదలుపెట్టిన మొట్ట మొదటి నెల నుండే నెలకు 60 లేక అంతకంటే ఎక్కువ గంటలను సేవలో గడపడానికి కేటాయించడం వారికి అసాధారణమైన విషయమేమీ కాదు.
“ప్రజలను సమీపించేందుకు ఇంటింటి పరిచర్యతోపాటు మేం వేర్వేరు ఇతర పద్ధతులను ప్రయత్నించాము. ఉదాహరణకు, నగరంలో ఉన్న అనేక శ్మశానాల్లో బైబిలు ప్రచురణలను పంచిపెట్టడం ద్వారా మేము చక్కని ఫలితాలను పొందాము.
“హాస్పిటల్స్‌లో కూడా సాక్ష్యమివ్వడం జరిగింది. సరజివో హాస్పిటల్‌లోని కార్డియాలజీ శాఖలో పనిచేసే ప్రధాన వైద్యుడు, గుండె పోటు—ఏమి చేయవచ్చు?’ అనే ముఖ శీర్షికగల జనవరి 8 1997, తేజరిల్లు! పత్రికను తీసుకున్నాడు. ఇతర డాక్టర్లకు ఇవ్వడానికి ఆ సంచిక ప్రతులు మరిన్ని కావాలని అడిగాడు. ఆ తర్వాత ఆయన పనిచేసే డిపార్ట్మెంటులో ఉన్న రోగులందరినీ సందర్శించడానికి సాక్షులకు అనుమతి లభించింది. అలా ఒక్క గంట దాటేటప్పటికి 100 కన్నా ఎక్కువ పత్రికలను హాస్పిటల్లో ఉన్న రోగులకు పంచిపెట్టడం జరిగింది. ప్రోత్సాహ నిరీక్షణలను అందించేందుకు హాస్పిటల్లో ఉన్న తమను చూడ్డానికి ఎవరైనా రావడమంటూ జరిగితే, అది ఇదే మొదటిసారని అనేకమంది రోగులు చెప్పారు.
“మరొక సందర్భంలో, పిల్లలకు సంబంధించిన శీర్షికలుగల పత్రికతో పెడియాట్రిక్ శాఖను దర్శించడం జరిగింది. నా బైబిలు కథల పుస్తకము ప్రతులను కొన్నింటిని రీడింగ్ రూమ్‌లో ఉంచడానికి ప్రధాన వైద్యురాలు తీసుకుంది. డాక్టరుకు చూపించడానికి తమ పిల్లలను హాస్పిటల్‌కు తీసుకు వచ్చే తల్లులు ఆ పిల్లలకు బైబిలు కథలను ప్రతిరోజూ చదివి వినిపిస్తున్నారు. ఆ డాక్టర్ని వాళ్ల ఇంటి దగ్గర కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.
“సరజివోలో వేర్వేరు దేశాలకు చెందిన నాటో సైనికులు వేలాది మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పూర్తిగా సాక్ష్యమివ్వబడింది. వేర్వేరు భాషల్లో ఉన్న కావలికోట, తేజరిల్లు! పత్రికలతోపాటు గుడ్‌న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్ అనే బుక్‌లెట్‌ను ఉపయోగిస్తూ కొన్నిసార్లు ఒక సాయుధ మిలటరీ వ్యాన్ నుండి మరొక వ్యాన్‌కు మేం వెళ్ళే వాళ్ళం. ఇటాలియన్ సైనిక శిబిరాల్లో 200 కంటే ఎక్కువ పత్రికలు పంచిపెట్టాం. ఆశ్చర్యకరంగా, ఆ ఇటాలియన్ సైనికులలో అనేకమంది యెహోవాసాక్షులతో ఇదివరకెన్నడూ మాట్లాడలేదని తెలియజేశారు. మేము వారిని సరజివోలో కనుగొన్నాము.
“ఒక రోజు ఒక మిలటరీ వ్యాన్ రోడ్డు ప్రక్కన ఆగి ఉంది. నా గొడుగుతో ఆ వ్యాన్‌ను తట్టాను, ఒక సైనికుడు బయటకు వచ్చాడు. అతనికి ‘శాంతి సందేశకులు—వారు ఎవరు?’ అనే శీర్షికగల కావలికోటను అందించాను. ఆ సైనికుడు నా వైపు చూసి ఇలా అడిగాడు, ‘నీవు యెహోవాసాక్షులలో ఒకడివి కాదుకదా?’ నేను యెహోవాసాక్షినే అని తెలుసుకున్న తర్వాత, ‘మీరు ఇక్కడ కూడా ఉన్నారన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను! సాక్షులులేని ప్రదేశం భూమి మీద ఎక్కడైనా ఉందా?’”
“సందేశమును బోధింపుము. అనుకూల సమయములందును, అనుకూలము కాని సమయములందును దానిని కొనసాగింపుము” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (2 తిమోతి 4:2, క్యాతలిక్ అనువాదము) ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి తోటి విశ్వాసులవలెనే సరజివోలో ఉన్న యెహోవాసాక్షులు హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ, సాయుధ మిలటరీ వ్యాన్లన్నింటికీ సాక్ష్యమిస్తున్నారు!