కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/15 పేజీలు 26-28
  • రాషీ—ప్రభావవంతమైన బైబిలు వ్యాఖ్యానకర్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాషీ—ప్రభావవంతమైన బైబిలు వ్యాఖ్యానకర్త
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాషీ ఎవరు?
  • వ్యాఖ్యానం ఎందుకవసరమైంది?
  • రాషీ లక్ష్యం, పద్ధతులు
  • తన కాలానికి ప్రభావితమయ్యాడు
  • బైబిలు అనువాదాన్ని ఆయనెలా ప్రభావితం చేశాడు?
  • రబ్బి అని పిలువబడేందుకు ఎవరు యోగ్యులు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మసరెటిక్‌ మూలపాఠం అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/15 పేజీలు 26-28

రాషీ—ప్రభావవంతమైన బైబిలు వ్యాఖ్యానకర్త

హెబ్రీ భాషలో అచ్చువేయబడిన మొట్టమొదటి పుస్తకాల్లో ఒకటేది? పంచగ్రంథంపై (మోషే వ్రాసిన ఐదు పుస్తకాలపై) వ్రాయబడిన వ్యాఖ్యానం. అది సా.శ. 1475లో ఇటలీ నందలి రెగ్గియోలో ప్రచురించబడింది. దాని రచయిత? రాషీ అనే పేరుగల వ్యక్తి!

ఒక వ్యాఖ్యానానికి ఇంత ప్రత్యేకమైన విశిష్టత ఎందుకు ఇవ్వబడింది? రాషీ వ్యాఖ్యానం “యూదుల గృహంలోనూ, అధ్యయన కేంద్రంలోనూ ప్రాథమిక పాఠ్యగ్రంథంగా తయారైంది. యూదా సాహిత్యానికి సంబంధించిన ఏ ఇతర గ్రంథమూ అంతటి ప్రశంసను ఎన్నడూ పొందలేదు . . . పంచగ్రంథంపై రాషీ వ్రాసిన వ్యాఖ్యానాన్ని వివరించే అదనపు వ్యాఖ్యానాలు 200 కంటే ఎక్కువ ఉన్నాయి” అని రాషీ—ఆ వ్యక్తి, ఆయన ప్రపంచం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఎజ్ర షెరెషెవ్స్‌కీ తెలియజేస్తున్నాడు.

రాషీ వ్యాఖ్యానానికి ప్రభావితమైంది కేవలం యూదులు మాత్రమేనా? అనేకులు గ్రహించకపోయినప్పటికీ, హెబ్రీ లేఖనాలపై రాషీ వ్రాసిన వ్యాఖ్యానం బైబిలు అనువాదకులను శతాబ్దాలపాటు ప్రభావితం చేసింది. అయితే రాషీ ఎవరు, ఆయన అంత ప్రభావాన్ని ఎలా చూపించగలిగాడు?

రాషీ ఎవరు?

రాషీa సా.శ. 1040వ సంవత్సరంలో, ఫ్రాన్స్‌నందలి ట్రోయస్‌లో జన్మించాడు. యౌవనస్థునిగా ఆయన రైన్‌లాండ్‌లోని వార్మస్‌, మెయిన్జ్‌లలోని యూదా మతసంబంధమైన విద్యాకేంద్రాలకు వెళ్లాడు. అక్కడ ఆయన యూరపులోవున్న అత్యంత ప్రముఖులైన కొంతమంది యూదా పండితుల వద్ద అధ్యయనం చేశాడు. దాదాపు పాతికేళ్ల వయస్సులో, ఆయన వ్యక్తిగత పరిస్థితులు ఆయన ట్రోయస్‌కు తిరిగి వచ్చేలా చేశాయి. అప్పటికే ప్రముఖ పండితునిగా గుర్తింపబడిన రాషీ వెంటనే స్థానిక యూదా సమాజంలో మతనాయకుడై, తన స్వంత మతసంబంధ విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. కొంతకాలానికి, ఈ క్రొత్త యూదా జ్ఞానసంచయ కేంద్రం, జర్మనీలోని రాషీ ఉపాధ్యాయుల కేంద్రాలకంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా తయారైంది.

ఆ సమయంలో ఫ్రాన్సులోవున్న యూదులు సాపేక్షికంగా చూస్తే, క్రైస్తవులమని చెప్పుకుంటున్న తమ పొరుగువారితో శాంతి సామరస్యాలను అనుభవించారు. దానితో రాషీ పాండిత ప్రకర్ష ప్రయత్నాలకు మరింత స్వేచ్ఛ లభించింది. అయినప్పటికీ, అతడు ఒంటరి పండితుడు కాదు. బోధకునిగా, విద్యాకేంద్ర అధిపతిగా ప్రతిష్ఠను పొందడమేగాక రాషీ జీవనోపాధి కోసం వైన్‌ తయారు చేసేవాడు. సాధారణ వర్తకాలను గురించిన ఈ సునిశిత పరిజ్ఞానం సగటు యూదులతో సన్నిహిత సంబంధాలు కలిగివుండి, వారి పరిస్థితులను అర్థం చేసుకుని వారి పట్ల సానుభూతి చూపించడానికి ఆయనకు సహాయం చేసింది. ట్రోయస్‌ నెలకొనివున్న ప్రాంతం కూడా రాషీ పరిజ్ఞానానికి దోహదపడింది. ప్రముఖ వర్తక మార్గాల వెంబడి నెలకొని ఉన్నందున ఆ నగరం కాస్మోపాలిటన్‌ కేంద్రంగా పనిచేసింది. ఇది అనేక దేశాలకు చెందిన ఆచారవ్యవహారాలతో పరిచయం ఏర్పరచుకోవడానికి రాషీకి వీలుకలుగజేసింది.

వ్యాఖ్యానం ఎందుకవసరమైంది?

యూదులు పుస్తకం ప్రజలుగా పేరుపొందారు. అయితే “పుస్తకం” అంటే బైబిలు, హెబ్రీ భాషలో ఉండేది. మరి ఆ “ప్రజలు” ఇప్పుడు అరబిక్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ మరితర అనేకానేక భాషలు మాట్లాడుతున్నారు. చాలామంది యూదులకు హెబ్రీ భాష బాల్యం నుండి నేర్పించబడుతున్నప్పటికీ, వాళ్లకు అనేక బైబిలు పదాలు స్పష్టంగా అర్థమయ్యేవికాదు. అంతేగాక, శతాబ్దాలపాటు రబ్బీల జుడాయిజమ్‌లో ఉన్న ఒక బలమైన ప్రవృత్తి, బైబిలు లేఖనాల అక్షరార్థ భావాన్ని చూడకుండా ప్రజలను నిరుత్సాహపర్చింది. బైబిలు పదాలకూ, వచనాలకూ సంబంధించిన రెండర్థాల కథలూ, కట్టుకథలూ అధికమయ్యాయి. అలాంటి అనేక వ్యాఖ్యానాలూ, కథలూ సంపుటిలుగా వ్రాయబడ్డాయి, అలాంటివన్నీ కలిపి సమష్టిగా మిద్రాష్‌b అని పిలువబడ్డాయి.

రాషీ మనుమడైన రబ్బీ సామ్యెల్‌ బెన్‌ మేయీర్‌ (రాష్‌బామ్‌) కూడా బైబిలు పండితుడే. ఆదికాండము 37:2పై తన వ్యాఖ్యానంలో ఆయనిలా అన్నాడు: “పూర్వపు [రాషీకి మునుపున్న] వ్యాఖ్యాతలు . . . ప్రసంగాలను (డెరాషోట్‌) బోధించడానికి ఇష్టపడేవారు, అది అత్యంత ప్రాముఖ్యమైన ఉద్దేశమని వాళ్లు భావించేవారు, [కాని] వాళ్లు బైబిలు మూలపాఠంలోని అక్షరార్థ భావపు లోతుపాతులను పరిశోధించేవారు కాదు.” ఈ ప్రవృత్తి గురించి వ్యాఖ్యానిస్తూ డా. ఏ. కోహెన్‌ (సాన్సీనో బుక్స్‌ ఆఫ్‌ ది బైబిల్‌ యొక్క ప్రధాన సంపాదకుడు) ఇలా వ్రాస్తున్నాడు: “పేషాత్‌తో లేక మూలపాఠపు స్పష్టమైన భావంతో పొసగని ఏ అనువాదాన్ని అంగీకరించకూడదు అని రబ్బీలు ఒక నియమాన్ని స్థాపించారన్నది నిజమే; కాని ఆచరణలో మాత్రం వాళ్లు ఈ నియమానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వలేదు.” అలాంటి మత వాతావరణంలో, సగటు యూదుడు బైబిలు మూలపాఠాన్ని సమీపించినప్పుడు నిస్సహాయునిగా భావించి, ఏదైనా వివరణాత్మక ఉపకరణం అవసరమని తలంచాడు.

రాషీ లక్ష్యం, పద్ధతులు

హెబ్రీ లేఖనాల మూలపాఠాన్ని యూదులందరికీ అర్థమయ్యేలా చేయాలన్నదే రాషీ జీవిత లక్ష్యం. దీన్ని సాధించడానికి ఆయన, పాఠకుడికి కష్టంగా ఉంటాయని తాను భావించిన ప్రత్యేకమైన పదాలపై, వచనాలపై వ్రాయబడిన వ్యాఖ్యాన పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టాడు. రాషీ వ్రాసిన నోట్సులు, ఆయన అధ్యాపకులు ఇచ్చిన వివరణల గురించి ప్రస్తావిస్తాయి, అవి రబ్బీల సాహిత్యపు పూర్తి వ్యాప్తిని గురించి ఆయనకున్న సమగ్రమైన అవగాహన ఆధారంగా వ్రాయబడ్డాయి. భాషాపరంగా చేయబడిన పరిశోధనలో, రాషీ అందుబాటులోవున్న మూలాలన్నింటినీ ఉపయోగించుకున్నాడు. మసరెట్లు పెట్టిన సూచనార్థక గుర్తులు, ఉచ్చారణా సంబంధిత గుర్తులు మూలపాఠాన్ని అర్థం చేసుకోవడాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేదానికి ఆయన అవధానమిచ్చాడు. ఒక పదం యొక్క భావాన్ని స్పష్టపరిచేందుకు, పంచగ్రంథంపై ఆయన వ్రాసిన వ్యాఖ్యానం తరచూ అరామిక్‌ అనువాదాన్ని (టార్గమ్‌ ఆఫ్‌ ఆన్‌కెలాస్‌ను) పరిశీలిస్తుంది. విభక్తులు, ఉపసర్గలు, సముచ్చయాలు, క్రియాపద భావాలు, వ్యాకరణంలోని ఇతర అంశాలు మరియు వాక్యరచన వంటివాటిని వివరించడంలో మునుపు పరిశీలించబడని సాధ్యతలను పరీక్షించేటప్పుడు రాషీ పరిస్థితులకు అనుగుణ్యంగా సర్దుకుపోయే లక్షణాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించాడు. అలాంటి వ్యాఖ్యానాలు, హెబ్రీ భాషా వాక్యరచననూ, వ్యాకరణాన్నీ అర్థం చేసుకోవడానికి విలువైన సహాయాన్ని అందజేశాయి.

రబ్బీల జుడాయిజమ్‌లో ఉన్న ప్రబల ప్రవృత్తికి భిన్నంగా, రాషీ ఎల్లప్పుడూ లేఖనాల సరళమైన, అక్షరార్థ భావాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించాడు. కాని యూదులకు చిరపరిచితమైన, విస్తృతమైన మిద్రాష్‌ సాహిత్యం అలక్ష్యం చేయబడలేదు. బైబిలు మూలపాఠపు అక్షరార్థ భావం తరచూ మరుగుపడిపోయేలా చేసిన మిద్రాష్‌ వ్రాతలకే రాషీ ముడిపెట్టిన తీరు ఆయన వ్యాఖ్యానంలోని విశేషమైన అంశమైవుంది.

ఆదికాండము 3:8పై తాను వ్రాసిన వ్యాఖ్యానంలో, రాషీ ఇలా వివరిస్తున్నాడు: “బెరెషిత్‌ రబ్బాహ్‌లోనూ ఇతర మిద్రాషిక్‌ సంకలిత గ్రంథాల్లోనూ మన జ్ఞానులు అప్పటికే తగిన విధంగా అమర్చిన ఆగాధిక్‌c మిద్రాషిమ్‌లు అనేకం ఉన్నాయి. అయితే, వచనం యొక్క సూటియైన భావాన్ని (పేషాత్‌) గురించీ, లేఖనాధారిత వృత్తాంతాన్ని దాని సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని వివరించే అగ్గాదోత్‌ వంటివాటి గురించీ నేను ప్రత్యేకంగా శ్రద్ధ కలిగివున్నాను.” ఒక వచన భావాన్ని లేక సందర్భాన్ని స్పష్టపరిచేందుకు సహాయం చేశాయని ఆయన భావించిన మిద్రాషిమ్‌లను మాత్రమే ఎంపిక చేసుకుని, వాటిని సంకలనం చేయడం ద్వారా రాషీ, పరస్పర వైరుద్ధాన్నీ మరియు గందరగోళాన్నీ కలిగించిన మిద్రాషిమ్‌ను తొలగించివేశాడు లేక నిర్మూలించాడు. ఇలా తొలగించడం మూలంగా, యూదా భావి తరాల వారికి, మిద్రాష్‌లోనుండి రాషీ చేసిన ఎంపికలే ఎక్కువగా పరిచయమయ్యాయి.

రాషీ తన అధ్యాపకులకు గుర్తింపునివ్వడంలో ఉదారంగా ఉన్నప్పటికీ, వాళ్ల వివరణలు మూలపాఠంపై ఇవ్వబడిన స్పష్టమైన తర్కనకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఆయన భావించినప్పుడు వారితో విభేదించడానికి ఆయన వెనుకాడేవాడు కాదు. ఆయనకు కొన్ని ప్రకరణలు అర్థం కానప్పుడు లేక తాను మునుపు వివరించినవి తప్పు అని ఆయన భావించినప్పుడు, ఆయన దాన్ని అంగీకరించడానికి సుముఖత కలిగివుండేవాడు, చివరికి తన విద్యార్థులు తన అవగాహనను సరిచేసిన సందర్భాలను కూడా ఆయన ప్రస్తావించాడు.

తన కాలానికి ప్రభావితమయ్యాడు

రాషీ తన కాలానికి తగినట్లు ఉండేవాడు. ఒక రచయిత దాన్నిలా సమీకరించాడు: “[రాషీ], యూదా జీవన విధానానికి చేసిన గొప్ప సహాయం ఏమిటంటే, సంబంధిత ప్రకరణలన్నిటికీ ఆ కాలం నాటి భాషలోకి క్రొత్త భాష్యం చెప్పడమే. అదీ ఎంత స్పష్టమైన, అర్థం చేసుకోదగిన భాషలోనూ, ఎంతటి వాత్సల్యాభిమానాలతోనూ, ఎంతటి అరుదైన ప్రజ్ఞాపాఠవాలతోనూ చేశాడంటే, ఆయన వ్యాఖ్యానాలు బైబిలు లేఖనాల్లా గౌరవించబడేవి, సర్వజనీన సాహిత్యంగా ప్రేమించబడేవి. రాషీ హెబ్రీ భాషను అది ఫ్రెంచి భాష అన్నట్లు ఎంతో విజ్ఞానంతోనూ, సొగసుగానూ వ్రాశాడు. ఆయనకు నిర్దిష్టమైన హెబ్రీ పదం లభించనప్పుడు, దానికి బదులుగా ఆయన ఫ్రెంచి పదాన్ని ఉపయోగించి, దాన్ని హెబ్రీ అక్షరాల్లో వ్రాసేవాడు.” ఇలా ప్రతిలిఖించబడిన ఫ్రెంచి పదాలు—రాషీ దాదాపు 3,500 కంటే ఎక్కువ ప్రతిలేఖన పదాలను ఉపయోగించాడు—ప్రాచీన ఫ్రెంచి భాషా సంబంధ మరియు ఉచ్చారణ సంబంధ శాస్త్ర విద్యార్థులకు విలువైన మూలంగా తయారయ్యాయి.

రాషీ జీవితం కొంతమేరకు ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రారంభమైనప్పటికీ, ఆయన జీవితంలోని తర్వాతి సంవత్సరాల్లో, యూదులకూ క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారికీ మధ్య ఉద్రిక్తత పెరిగింది. సా.శ. 1096లో మొదటి మతయుద్ధం, రాషీ అధ్యయనం చేసిన రైన్‌లాండ్‌లోని యూదా సమాజాలపైకి నాశనాన్ని తెచ్చింది. వేలాదిమంది యూదులు సామూహికంగా హత్య గావించబడ్డారు. ఈ సామూహిక సంహారాలను గురించిన వార్తలు రాషీ ఆరోగ్యంపై (సా.శ. 1105లో మరణించేంత వరకు ఆయన ఆరోగ్యం క్రమేణా క్షీణించిపోయింది) ప్రభావాన్ని చూపినట్లు కనిపిస్తుంది. అప్పటి నుండి, ఆయన లేఖన వ్యాఖ్యానాల్లో విశేషమైన మార్పు కనిపించింది. బాధననుభవిస్తున్న యెహోవా సేవకుని గురించి మాట్లాడుతున్న యెషయా 53వ అధ్యాయం దానికి ఒక విశేషమైన ఉదాహరణ. టాల్ముడ్‌ చేసినట్లుగానే రాషీ, మునుపు ఈ లేఖనాలను మెస్సీయాకు అన్వయించాడు. కాని, మతయుద్ధాల తర్వాత, ఈ వచనాలు అన్యాయంగా బాధింపబడిన యూదా ప్రజలకు అన్వయిస్తాయని ఆయన తలంచినట్లు కనిపిస్తుంది. అది, ఆ లేఖనాలకు యూదులు చెప్పే భాష్యంలో ఒక మలుపురాయిగా నిరూపించబడింది.d అలా, క్రైస్తవమత సామ్రాజ్యపు క్రైస్తవవ్యతిరేక ప్రవర్తన యూదులతో సహా అనేకులు యేసును గూర్చిన సత్యం నుండి దూరమైపోయేలా చేసింది.—మత్తయి 7:16-20; 2 పేతురు 2:1, 2.

బైబిలు అనువాదాన్ని ఆయనెలా ప్రభావితం చేశాడు?

రాషీ ప్రభావం, త్వరలోనే జూడాయిజమ్‌ వెలుపల కూడా విదితమైంది. ఫ్రెంచ్‌ ఫ్రాన్సిస్‌కాన్‌ బైబిలు వ్యాఖ్యానకర్త అయిన నికొలాస్‌ ఆఫ్‌ లైరా (సా.శ. 1270-1349) “రబ్బీ సాలమన్‌ [రాషీ]” అభిప్రాయాలను ఎంత తరచుగా సూచించేవాడంటే, అతనికి “సొలొమోనుకు ప్రతిరూపం” అనే మారుపేరు పెట్టడం జరిగింది. క్రమేణా ఇంగ్లీషు కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ అనువాదకులకు పూర్వగామి అనువాదకులు, జర్మను భాషలో బైబిలు అనువాదాన్ని ఉద్యమింపజేసిన సంస్కర్తయైన మార్టిన్‌ లూథర్‌ వంటివారితో సహా ఎంతోమంది వ్యాఖ్యానకర్తలను, అనువాదకులను లైరా ప్రభావితం చేశాడు.

క్రైస్తవ సత్యంతో పొందికలేని రబ్బీల తలంపుతో రాషీ ఎంతగానో ప్రభావితమయ్యాడు. అయినప్పటికీ, బైబిలు సంబంధిత హెబ్రీ పదాలు, వాక్యరచన, వ్యాకరణం వంటివాటిలో తనకుగల లోతైన అవగాహనతోనూ, మూలపాఠానికున్న స్పష్టమైన, అక్షరార్థమైన భావాన్ని గ్రహించడానికి చేసిన ఎడతెగని కృషితోనూ రాషీ బైబిలు పరిశోధకులకూ, అనువాదకులకూ పోల్చిచూడడానికి ఒక అర్థవంతమైన మూలాన్ని అందజేశాడు.

[అధస్సూచీలు]

a “రాషీ” అనే హెబ్రీ సంక్షిప్తనామం, “రబ్బీ ష్‌లోమో యిట్జాకి [రబ్బీ సాలమన్‌ బెన్‌ ఐసాక్‌]” అనే పదాల మొదటి అక్షరాల నుండి రూపొందింది.

b “మిద్రాష్‌” అనే పదం, “విచారించడం, అధ్యయనం చేయడం, పరిశోధించడం” ఇంకా విస్తృతార్థంలో చెప్పాలంటే, “ప్రకటించడం” అనే భావాలుగల హెబ్రీ క్రియాపదం నుండి వస్తుంది.

c ఆగాధా (బహువచనం ఆగాధాత్‌) అంటే అక్షరార్థంగా “కథనం” అని భావం, అది రబ్బీనిక్‌ వ్రాతల్లోని చట్టపరిధిలోకి రాని అంశాలను అంటే తరచూ బైబిల్లోని వ్యక్తుల గురించిన బైబిల్లోలేని గాథలు లేక రబ్బీలను గురించిన కట్టుకథలు ఇమిడివున్న అంశాలను సూచిస్తుంది.

d ఆ లేఖనాధారిత ప్రకరణపై మరింత సమాచారం కోసం, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన యుద్ధంలేని లోకం ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్‌లోని 28వ పేజీలోగల “నా సేవకుడు”—ఆయనెవరు? అనే శీర్షికను చూడండి.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

Text: Per gentile concessione del Ministero dei Beni Culturali e Ambientali

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి