అన్యమత పునాదుల మీద నిర్మించడం
ఇటలీలోని రోమ్‌కు వచ్చే సందర్శకులు దర్శించే అద్భుతమైన అనేక స్మారక కట్టడాల్లో పాంథియన్ ఒకటి. రోమా నిర్మాణశైలికి సంబంధించిన అత్యుత్తమమైన ఈ కట్టడం, ప్రాచీన కాలాల్లో ఎలా ఉన్నాయో అలాగే ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచివున్న కొన్ని కట్టడాలలో ఒకటైవుంది. దాదాపు సా.శ.పూ. 27లో అగ్రిప్ప ప్రారంభించిన దానిని, దాదాపు సా.శ. 120లో హాద్రియన్ పునర్నిర్మించాడు. ఈ భవన విశేషాలలో ఒకటేమిటంటే 43 మీటర్ల వృత్తవ్యాసంగల అతిపెద్ద గుమ్మటం, అంతకన్నా వెడల్పైన గుమ్మటాన్ని నిర్మించడం ఆధునిక కాలంలో మాత్రమే సాధ్యమైంది. పాంథియన్ మొట్టమొదట అన్యమత దేవాలయం. “సర్వ దేవ మందిరం” అని దాని ఆదిమ గ్రీకు పదం యొక్క భావం. నేడు, అదింకా రోమన్ క్యాథలిక్ చర్చిగానే పరిగణించబడుతుంది. అంతటి ఆశ్చర్యకరమైన మార్పు ఎలా సాధ్యమైంది?
ఎప్పటి నుండో ఉపయోగంలోలేని ఈ ఆలయాన్ని, సా.శ. 609లో పోప్ బోనీఫేస్ IV “క్రైస్తవ” చర్చిగా తిరిగి ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో దానికి చర్చ్ ఆఫ్ సాంటా మార్యా రోటుండా అని పేరు పెట్టడం జరిగింది. లా సివిల్టా కాట్టోలికా అనే ఇటాలియన్ జెసూట్ పత్రికలో 1900లో ప్రచురించబడిన ఒక శీర్షిక ప్రకారం, దాన్ని ప్రత్యేకంగా దేని కోసం ఉపయోగించాలనే దాని గురించి బోనీఫేస్‌కు మనస్సులో ఉన్న విషయం ఏమిటంటే, “క్రైస్తవ హతసాక్షులందరినీ లేక దానికి బదులుగా, పరిశుద్ధులనందరినీ కలిపి మహిమపర్చాలన్నదే, అయితే వారిలో మొదటిదీ, అత్యంత ప్రాముఖ్యమైనదీ కన్యయైన దేవుని తల్లియే.” పాంథియన్‌కు నేటి రోమన్ క్యాథలిక్ చర్చి ఇచ్చిన పేర్లు—సాంట మార్యా అడ్ మార్టిర్స్ లేక ప్రత్యామ్నాయంగా, సాంటా మార్యా రోటుండా—లేఖనవిరుద్ధమైన ఆ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తున్నాయి.—పోల్చండి అపొస్తలుల కార్యములు 14:8-15.
పాంథియన్‌ను దాని క్రొత్త ఉద్దేశానికి అనుగుణంగా మలిచేందుకు, “మార్పులు పెద్దగా చేయవలసిన అవసరం ఏర్పడలేదు,” అని అదే శీర్షిక కొనసాగిస్తోంది. “తన పూర్వికుడూ, మాస్ట్రో (గొప్ప విద్వాంసుడు), అన్యమత దేవాలయాలను క్రైస్తవ ఆరాధన కోసం మార్చడంలో మాదిరికర్తా అయిన సెయింట్ గ్రెగోరీ ది గ్రేట్ [పోప్ గ్రెగోరీ I] అప్పటికే పెట్టిన సరళమైన ఉత్కృష్టమైన సూత్రాలనే బోనీఫేస్ అనుసరించాడు.” అవేమిటి?
సా. శ. 601లో, అన్యమత బ్రిటన్‌కు వెళ్లబోతున్న ఒక మిషనరీకి వ్రాసిన ఉత్తరంలో గ్రెగోరీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “ప్రస్తావించబడిన దేశంలోని, విగ్రహాలున్న ఆలయాలను కూల్చివేయవద్దు; కేవలం వాటిలోవున్న విగ్రహాలనే నాశనం చేయండి . . . చెప్పబడిన ఆలయాలు మంచిస్థితిలో ఉంటే, వాటిని దయ్యాల ఆరాధనా స్థలాల నుండి సత్యదేవుని సేవాస్థలాలుగా మార్చండి.” అన్యమతాల వారు తమ మునుపటి ఆలయాలు పాడు చేయబడని స్థితిలో ఉండడం చూసినప్పుడు, వాళ్లు వాటికి తరచూ వస్తారన్నది గ్రెగోరీ ఆలోచన. అయితే అన్యమతాల వారు “దయ్యాలకు బలి ఇవ్వడానికి ఎన్నో ఎద్దులను వధించేవారు” అని పోప్ వ్రాస్తున్నాడు. “వాళ్లు జంతువులను ఇక దయ్యానికి బలి ఇవ్వరుగాని, దేవునికి స్తుతి కలిగేలా తాము తిని ఆనందించడానికి చంపుతారని” ఇప్పుడు ఆశించబడుతుంది.
“క్రైస్తవ” సంరక్షక సెయింట్‌లకు అంకితం చేయబడిన చర్చీలను మునుపటి ఆలయాలకు సమీపంలో స్థాపించడం ద్వారా కూడా, రోమన్ క్యాథలిక్ మతం అన్య ఆరాధనపై “ఎదురుదాడి చేసింది.” ప్రాచీన వేడుకలను సంగ్రహించి వాటికి “క్రైస్తవ” గుర్తింపు ఇవ్వడం జరిగింది. దాన్ని లా సివిల్టా కాట్టోలికా మాటల్లో వ్యక్తపర్చాలంటే: “తొలి క్రైస్తవుల కొన్ని ఆచారాలు, మతసంబంధమైన నియమాలు నిర్దిష్టమైన అన్యమత ఆచారాలతోనూ విధానాలతోనూ సన్నిహిత సంబంధం కల్గివున్నాయన్న విషయం ఈ రోజుల్లో పండితులందరికీ తెలిసిందే. అవి ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆచారాలు. అవి ప్రాచీన లోకంలోని బాహ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో లోతుగా పాతుకుపోయి, అంతర్భాగమైపోయాయి. దయగలదీ, తెలివైనదీ అయిన రోమన్ క్యాథలిక్ చర్చి ఆ అన్య ఆచారాలను నిర్మూలించాలని అనుకోలేదు; కాని, ఏ అల్లకల్లోలం లేకుండా సామాన్యులనూ విద్యావంతులనూ గెలుచుకోవడానికి, వాటికి క్రైస్తవ రూపాన్నిచ్చి, వాటికి పెద్దపీటవేసి, వాటికి జీవంపోయడం ద్వారా ఎంతో సున్నితంగానే అయినా ఎంతో శక్తివంతమైన విధంగా అది విజయం సాధించింది.”
అయితే, చర్చి సంగ్రహించిన అన్యమత పండుగకు ఒక ఉదాహరణ క్రిస్మస్సే. నిజానికి డిసెంబరు 25 అన్నది ప్రాచీన రోమన్ల డైయీస్ నాటాలిస్ సోలీస్ ఇన్‌విక్టి అంటే “అజేయుడైన సూర్యుని జన్మదినం” జరుపుకునే తేది.
అన్యమతస్థుల హృదయాలను గెలుచుకోవాలనే కోరికతో, చర్చి సత్యాన్ని హత్తుకోలేదు. అది మిశ్రిత నమ్మకాలను ఆచరించడాన్ని అంటే “సామాన్యులకు ఇష్టమైన” అన్యమత నమ్మకాలనూ, ఆచారాలనూ తనలో కలుపుకోవడాన్ని సమర్థించింది. ఫలితంగా నిజ క్రైస్తవ బోధలకు ఎంతో భిన్నమైన, సంకరజాతి, భ్రష్ట చర్చి రూపొందింది. పై విషయాన్ని బట్టి, మునుపటి రోమన్ల “సర్వ దేవ” మందిరమైన పాంథియన్ మరియకూ, “పరిశుద్ధు”లందరికీ అంకితం చేయబడిన రోమన్ క్యాథలిక్ చర్చిగా రూపొందడంలో బహుశ ఆశ్చర్యపోవలసినదేమీ లేదు.
అయితే, ‘దయ్యాల ఆరాధనా స్థలాన్ని సత్య దేవుని సేవాస్థలంగా’ మార్చడానికి ఆలయ అంకితాన్ని మార్చడం లేక వేడుక యొక్క పేరును మార్చడం మాత్రమే సరిపోదు. “దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?” అని ప్రశ్నించాడు అపొస్తలుడైన పౌలు. “కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.—మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.”—2 కొరింథీయులు 6:16-18.