గ్రీసులో “దేవుని ఆలయానికి” మరియు విగ్రహాలకు పొందికా?
ఈ మండు వేసవికాల దినాన, మెరిసే రాళ్ల బాటపై సూర్యుని ఎండ కొడుతోంది. అయితే, ఈ విపరీతమైన ఎండ, గుట్ట పైనున్న గుడికి వెళ్లే భక్తిగల గ్రీకు ఆర్థడాక్స్ యాత్రికుల గుంపుకున్న స్ఫూర్తిని మరియు కృత నిశ్చయాన్ని నీరుగార్చలేకపోయినట్లుంది.
ఆ దేశంలోని మరో కొననుండి ప్రయాణించి వస్తున్న, బాగా అలసిపోయిన ఒక వృద్ధ స్త్రీ, అలసిపోయిన తన కాళ్లు మాట వినకపోయినా ముందుకు వెళ్లేందుకు పోరాడటాన్ని మీరు చూస్తారు. ఇంకాస్త పైకెళ్లితే, చెమటతో తడిసిపోయిన ఉత్సుకతగల ఒక వ్యక్తి, తోసుకుంటున్న గుంపులోన చొరబడి ముందుకు వెళ్లాలని ఆత్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఒక యౌవన బాలిక, నొప్పితో బాధపడుతూ, నిరాశాపూర్వకమైన వదనంతో, మోకాళ్లనుండి బాగా రక్తం స్రవిస్తుండగా పాకుతూ వెళ్తోంది. వారి లక్ష్యం ఏమిటి? సరైన సమయానికి అక్కడికి చేరుకోవాలని, ప్రఖ్యాత “సెయింట్” యొక్క విగ్రహం ఎదుట ప్రార్థించాలని లేదా వీలైతే దాన్ని తాకాలి, ముద్దుపెట్టుకోవాలన్నదే వారి లక్ష్యం.
“సెయింట్ల” పూజకు అంకితం చేయబడిన స్థలాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఈ విధంగా తాము దేవున్ని చేరేందుకు ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నామని, అలా తమ భక్తి విశ్వాసాలను వ్యక్తం చేస్తున్నామని, ఈ యాత్రికులందరూ కూడా ఒప్పింపబడ్డారన్నది స్పష్టమౌతుంది. మన ఆర్థడాక్స్ క్రైస్తవ విశ్వాసం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా పేర్కొంటుంది: “మనము [“సెయింట్లను”] జ్ఞాపకం చేసుకుంటాము, వారి పవిత్ర మూర్తిమంతానికి ఘనతా మహిమలను చెల్లిస్తాము . . . , దేవుని ఎదుట మన నిమిత్తం వారు చేయవలసిన ప్రార్థనలను మరియు విన్నపాలను అడుగుతాము మరియు మన అనేక జీవితావసరతల్లో సహాయపడమని వారిని అడుగుతాము. . . . మన ఆత్మీయ మరియు శారీరక అవసరతల కొరకు . . . అద్భుతాలను చేసే సెయింట్లను మనం శరణు వేడుకుంటాము.” అంతేగాక, రోమన్ కాథోలిక్ చర్చి యొక్క సినోడిక్ కానన్ ప్రకారం, దేవునితో మధ్యవర్తులనుగా “సెయింట్లను” సమీపించాలి మరియు “సెయింట్ల” స్మారకచిహ్నాలను మరియు విగ్రహాలను పూజించాలి.
ఒక యథార్థమైన క్రైస్తవుని ప్రాథమిక చింత దేవున్ని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలన్నదే అయివుండాలి. (యోహాను 4:24) క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతాచారాలలో ఒక భాగంగా “సెయింట్ల” పూజ పరిచయం చేయబడిన విధానాన్ని గూర్చిన కొన్ని వాస్తవాలను మనం పరిశీలిద్దాము. దేవునికి అంగీకారమైన రీతిలో ఆయనను సమీపించాలని కోరుకునే వారందరికీ అలాంటి పరిశోధన ఎంతో మేలుకొలుపునిచ్చేదిగా ఉండాలి.
“సెయింట్లు” ఎలా పరిచయం చేయబడ్డారు
క్రీస్తు రక్తం చేత పరిశుభ్రపర్చబడిన మరియు క్రీస్తుతో కూడా భవిష్యత్తులో వారసులుగా పరిపాలించేందుకు దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడిన, ఆ తొలి క్రైస్తవులకందరికీ కూడా క్రైస్తవ గ్రీకు లేఖనాలు “సెయింట్లు” లేక “పరిశుద్ధులు” అనే బిరుదునిస్తుంది. (అపొస్తలుల కార్యములు 9:32; 2 కొరింథీయులు 1:1; 13:13)a స్త్రీ పురుషులు, సంఘంలోని ప్రముఖులూ సామాన్యులూ అందరూ కూడా ఇక్కడ భూమిపై జీవిస్తున్నప్పుడు “పరిశుద్ధమైన వారిగా” వర్ణించబడ్డారు. లేఖనాధారంగా వారు సెయింట్లై ఉన్నారనే గుర్తింపును, వారు మరణించక ముందు కూడా కలిగి ఉన్నారు.
సా. శ. రెండవ శతాబ్దం తర్వాత, మత భ్రష్ట క్రైస్తవత్వం రూపుదిద్దుకుంటుండగా, క్రైస్తవత్వాన్ని అన్యులు సులభంగా అంగీకరించగలిగే విధంగా, వారికి ఇష్టమయ్యే మతంగా చేయాలని, దాన్ని ప్రసిద్ధం చేసేందుకు ప్రయత్నించాలన్న ధోరణి ఉండినది. ఈ అన్యులు దేవగణాలను ఆరాధించేవారు, మరి ఈ క్రొత్త మతం నిక్కచ్చిగా ఏకదైవ మతం. కాబట్టి, ప్రాచీన దేవుళ్లు, ఇలవేల్పులు మరియు పురాణ గాథల కథానాయకుల స్థానాన్ని తీసుకోగల “సెయింట్లను” ఈ మతంలోనికి తీసుకురావడం ద్వారా ఆ విషయంలో రాజీపడవచ్చు. ఈ విషయాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఎక్లీసీయాస్టీకీ ఇస్టోరియా (ఎక్లిసియాస్టికల్ చరిత్ర) అనే పుస్తకం ఇలా పేర్కొంటుంది: “అన్య మతం నుండి క్రైస్తవత్వంలోకి మతమార్పిడి చెందే వారికి, తాము విడనాడిన కథానాయకులను హతసాక్షులలో చూసుకోవడం మరియు వారికి తాము పూర్వం చూపిన ఘనతను ఇప్పుడు వీరికి చెల్లించడం ఎంతో సులభమైంది. . . . అయితే, సెయింట్‌లకు అలాంటి ఘనతను చెల్లించడం చాలా తరచుగా పూర్తి విగ్రహారాధనగా ఉండేది.”
“సెయింట్లు” క్రైస్తవమత సామ్రాజ్యంలోకి ఎలా చేర్చబడ్డారో మరొక పరిశోధన ఇలా వివరిస్తోంది: “గ్రీకు ఆర్థడాక్స్ చర్చి సెయింట్‌లకు ఘనతను చెల్లించడంలో, అన్య మతం కలిగివున్న తీవ్రమైన ప్రభావపు ఛాయలను మనం తప్పక కనుగొంటాము. [ప్రజలు] క్రైస్తవత్వానికి మతమార్పిడి చేయబడక మునుపు ఒలంపియన్ దేవుళ్లకు ఆపాదించబడే లక్షణాలు, ఇప్పుడు సెయింట్‌లకు ఆపాదించబడుతున్నాయి. . . . క్రొత్త మతం యొక్క తొలి సంవత్సరాల నుండే, దాన్ని ఆచరించిన వారు సూర్య దేవుని స్థానంలో ప్రవక్తయైన ఏలీయాను నిలుపుకుని, ఆ దేవుని ప్రాచీన ఆలయాలు మరియు గుడుల శిథిలాలపై లేక వాటి ప్రక్కన, చాలా వరకూ కొండలు మరియు పర్వతాల అంచున, వెలుగునిచ్చే వాడైన ఫోబస్ అపోల్లోను ప్రాచీన గ్రీకులు ఘనపర్చిన స్థలాలన్నిటిలో చర్చీలను నిర్మించారని మనం చూస్తాము. . . . కన్య దేవత అయిన అథెన్నాను వారు కన్య మరియకు పోల్చారు. అలా, అథెన్నా విగ్రహాన్ని కూలద్రోసిన, మత మార్పిడి చేసుకున్న విగ్రహారాధకుని మనస్సులో ఏర్పడిన కలత ఆ విధంగా సమసిపోతుంది.”—నియోటెరాన్ ఎన్కైక్లోపేడికాన్ లెక్సికాన్ (న్యూ ఎన్సైక్లోపీడియా డిక్షనరీ), సంపుటి 1, పేజీలు 270-1.
ఉదాహరణకు, సా. శ. నాల్గవ శతాబ్దం చివర్లో ఏథెన్సు నందు ఉండిన పరిస్థితిని పరిశీలించండి. ఆ పట్టణ నివాసుల్లో అత్యధికులు ఇంకా అన్యులే. వారి అత్యంత పవిత్రమైన ఆచారాల్లో ఒకటి, ఎల్యూసినియన్ మర్మాలు, అది ఏథెన్సుకు 23 కిలోమీటర్ల వాయవ్యదిశలో ఉన్న ఎల్యూసిస్ పట్టణంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరుపబడే ద్వంద్వ ఉత్సవం.b ఈ రహస్యాలకు హాజరయ్యేందుకు, అన్యులైన ఏథెన్సు వారు పవిత్ర మార్గాన్ని (హేరా హోడోస్) అనుసరించవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఆరాధనాస్థలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో, నగర నాయకులు బహు చతురులనిపించుకున్నారు. అదే మార్గంలో, అంటే ఏథెన్స్నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో, అన్యులను ఆకర్షించేందుకు మరియు వారు ఆ మర్మాలకు వెళ్లకుండా వారిని నివారించేందుకు డాఫ్నే సన్యాసిమఠం నిర్మించబడింది. మఠం యొక్క చర్చి, డాఫ్నియాస్ లేక పిత్థియోస్ అపోల్లో అనే గ్రీకు దేవునికి సమర్పించబడిన ప్రాచీన ఆలయ పునాదులపై నిర్మించబడింది.
అన్య దేవతలను “సెయింట్ల” పూజతో కలిపివేయడం గ్రీసులోని కైథేరా ద్వీపంపై కూడా కనుగొనబడుతుంది. ద్వీపమందున్న ఒక గుట్ట అంచుపై, రెండు చిన్న బైజాంటీన్ గుళ్లున్నాయి—దానిలో ఒకటి “సెయింట్” జార్జ్‌కి మరొకటి కన్య మరియకు సమర్పించబడ్డాయి. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం ఆరాధనాస్థలంగా పని చేసిన మినోవన్ సమిట్ గుడి అక్కడే ఉండేదని త్రవ్వకాలు బయల్పరిచాయి. సా. శ. ఆరవ లేక ఏడవ శతాబ్దంలో, “క్రైస్తవులు” అదే సమిట్ గుడి ఉండిన స్థలంలో “సెయింట్” జార్జ్ కొరకు తమ గుడిని నిర్మించారు. అలా మార్చడమనేది పూర్తిగా సూచనార్థకమైనదే; మినోవన్ మతం యొక్క ఆచారాలతో పూర్తిగా నిండిపోయిన ఆ ప్రాంతం, ఏగియన్ సముద్రం యొక్క మార్గాలను నియంత్రించింది. మన స్త్రీ మరియు “సెయింట్” జార్జ్ యొక్క దయను పొందేందుకు అక్కడ రెండు చర్చీలు నిర్మించబడ్డాయి, “సముద్ర ప్రయాణికుల రక్షకుడైన” “సెయింట్” నికోలాస్ పేరుతో, అదే దినాన “సెయింట్” జార్జ్‌కి ఉత్సవం జరుపబడుతుంది. ఇలా కనుగొనబడిన ఈ విషయాన్ని గురించి వ్రాస్తూ ఒక వార్తాపత్రిక ఇలా చెప్పింది: మత సేవలను అందించేందుకు “ప్రాచీన కాలాల్లో మినోవన్ ప్రీస్టు ఆ పర్వతాన్ని అధిరోహించినట్లే, నేడు [గ్రీకు ఆర్థడాక్స్] ప్రీస్టు ఆ పర్వతాన్ని అధిరోహిస్తాడు”!
మత భ్రష్ట క్రైస్తవత్వం అన్య గ్రీకు మతం చేత ఎంతగా ప్రభావితం చెందినదో ఆ విషయాన్ని క్లుప్తంగా చెబుతూ, ఒక చారిత్రాత్మక పరిశోధకురాలు ఇలా సూచిస్తోంది: “క్రైస్తవ మతం కలిగివున్న అన్యమత సంబంధ పునాది, ప్రసిద్ధిగాంచిన విశ్వాసాల్లో తరచూ మారకుండా అలానే ఉంటుంది, ఆ విధంగా పారంపర్యాచార సహన స్వభావాన్ని అంగీకరిస్తోంది.”
‘మనకు తెలిసిన దానిని ఆరాధించుట’
యేసు సమరయ స్త్రీకి ఇలా చెప్పాడు: ‘మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము . . . యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుదురు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.’ (యోహాను 4:22, 23) సత్యంతో ఆరాధించడం తప్పనిసరి అనే విషయాన్ని గమనించండి! కాబట్టి సత్యాన్ని గురించిన కచ్చితమైన జ్ఞానం మరియు దాని ఎడల ప్రగాఢమైన ప్రేమ లేకుండా దేవునికి అంగీకారమైన రీతిలో ఆరాధించడం అసంభవం. నిజమైన క్రైస్తవ మతం సత్యంపై ఆధారపడాలి, అన్య మతం నుండి ఎరువు తెచ్చుకున్న ఆచారాలపై మరియు అలవాట్లపై కాదు. ప్రజలు యెహోవాను తప్పుడు మార్గంలో ఆరాధించేందుకు ప్రయత్నిస్తే ఆయనెలా భావిస్తాడో మనకు తెలుసు. ప్రాచీన గ్రీకు నగరమైన కొరింథులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? . . . దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక?” (2 కొరింథీయులు 6:15, 16) దేవుని ఆలయానికి విగ్రహాలతో సామరస్యాన్ని కల్పించేందుకు ఏ విధంగా ప్రయత్నించినప్పటికీ అది ఆయనకు అసహ్యాన్ని కలిగిస్తుంది.
అంతేకాకుండా, దేవునికి మధ్యవర్తులుగా ఉండేలా “సెయింట్‌లకు” ప్రార్థించాలనే అభిప్రాయాన్ని కూడా లేఖనాలు ఎంతో స్పష్టమైన రీతిలో నిరాకరిస్తున్నాయి. తన మాదిరి ప్రార్థనలో, ప్రార్థనలను కేవలం తండ్రికి మాత్రమే సంబోధించాలని యేసు బోధించాడు, అందుకే ఆయన తన శిష్యులకు ఇలా సూచించాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి,—పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:9) యేసు ఇంకా ఇలా పేర్కొన్నాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.” మరియు అపొస్తలుడైన పౌలు ఇలా పేర్కొన్నాడు: “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.”—యోహాను 14:6, 14; 1 తిమోతి 2:5.
దేవుడు మన ప్రార్థనలను నిజంగా వినాలని మనం కోరుకుంటున్నట్లయితే, ఆయన వాక్యం నడిపిస్తున్న రీతిలో మనం ఆయనను సమీపించడం ఎంతో ప్రాముఖ్యం. యెహోవాను సమీపించేందుకుగల యుక్తమైన ఏకైక మార్గాన్ని గూర్చి నొక్కి చెబుతూ, పౌలు ఇలా కూడా వ్రాశాడు: “చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే.” “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.”—రోమీయులు 8:34; హెబ్రీయులు 7:25.
‘ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట’
అన్యులు తమ అబద్ధ ఆరాధనను విడనాడి యేసుక్రీస్తు యొక్క సత్యవంతమైన బోధలను అనుసరించేలా వారిని ప్రేరేపించగల ఆత్మీయ శక్తిని గానీ దేవుని మద్దతును గానీ మత భ్రష్ట క్రైస్తవత్వము కలిగిలేదు. సభ్యులు, శక్తి మరియు ప్రాముఖ్యత కొరకైన దాని అన్వేషణలో అది అన్య మత విశ్వాసాలను మరియు ఆచారాలను తనలో విలీనం చేసుకుంది. ఈ కారణం చేత, అది దేవునికి మరియు క్రీస్తుకు అంగీకారయోగ్యమైన మంచి క్రైస్తవులను కాక అబద్ధ విశ్వాసులను అంటే దేవుని రాజ్యానికి పనికిరాని “గురుగులను” ఉత్పత్తి చేసింది.—మత్తయి 13:24-30.
అయితే, ఈ అంత్య కాలంలో, యెహోవా నడిపింపు క్రింద సత్యారాధనను పునఃస్థాపించేందుకు ఉద్ధృతమైన ఉద్యమం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు, తమ ఆచార, సాంఘిక లేక మత నేపథ్యాలు ఏమైనప్పటికీ, బైబిలు ప్రమాణాలకు తగిన విధంగా తమ జీవితాలను మరియు నమ్మకాలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవున్ని “ఆత్మతోను సత్యముతోను” ఎలా ఆరాధించాలో మీరు ఎక్కువ తెలుసుకోవాలని ఇష్టపడుతుంటే, మీరు జీవించే ప్రాంతంలోని యెహోవాసాక్షులను దయచేసి సంప్రదించండి. మీ వివేచనా శక్తి ఆధారంగానూ దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం ఆధారంగానూ ఆయనకు అంగీకారయోగ్యమైన పవిత్ర సేవను మీరు అందించడంలో మీకు సహాయం చేసేందుకు వారెంతో సంతోషిస్తారు. పౌలు ఇలా వ్రాశాడు: “సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” మరియు కొలొస్సయులకు ఆయనిలా చెప్పాడు: “ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని . . . దేవుని బతిమాలుచున్నాము.”—రోమీయులు 12:1, 2; కొలొస్సయులు 1:9-12.
[అధస్సూచీలు]
a హెగియోస్ అనే గ్రీకు పదాన్ని కొన్ని బైబిలు అనువాదాలు “పరిశుద్ధులు” అని అనువదిస్తే మరికొన్ని “సెయింట్లు” అని అనువదిస్తున్నాయి.
b గొప్ప ఎల్యూసినియా అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబరులో ఏథెన్సు మరియు ఎల్యూసిస్లో జరుపబడేది.
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
పార్థనాన్ యొక్క అసామాన్య ఉపయోగం
“క్రైస్తవ” సామ్రాట్ అయిన థియోడోసియస్ II, ఏథెన్సు నగరానికి సంబంధించిన రాజాజ్ఞలతో (సా. శ. 438), అన్య ఆచారాలను మరియు మర్మాలను రద్దు చేశాడు, అన్య ఆలయాలను మూసేశాడు. కాబట్టి వాటిని క్రైస్తవ చర్చీలుగా మార్చవచ్చు. ఒక ఆలయాన్ని విజయవంతంగా మార్చేందుకు అవసరమైన ఏకైక విషయమేమంటే దాన్ని శుద్ధి చేసేందుకు అందులో ఒక సిలువను స్థాపించడమే!
అలా మార్చబడిన మొదటి ఆలయాల్లో పార్థనాన్ ఒకటి. పార్థనాన్ను “క్రైస్తవ” ఆలయంగా ఉపయోగించేందుకు దాన్ని సరైన స్థితిలోకి తెచ్చేందుకు ముఖ్య నవీకరణ జరిగింది. సా. శ. 869 నుండి అది ఏథెన్సు కాథిడ్రల్గా పని చేసింది. మొదట్లో అది “పరిశుద్ధ జ్ఞానపు” చర్చిగా ఘనపర్చబడింది. ఆలయపు అసలు “యజమాని” అయిన అథెన్నా, జ్ఞాన దేవత అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసేందుకు ఆ పేరు సంకల్పవంతంగానే ఉండగలదు. తర్వాత అది “మన అథినేనియన్ స్త్రీ”కి అంకితం చేయబడింది. దాన్ని ఆర్థడాక్స్లు ఎనిమిది శతాబ్దాలు ఉపయోగించిన తర్వాత, కాథోలిక్ల ఏథెన్స్ సెయింట్ మేరీ చర్చిగా ఆ ఆలయం మార్చబడింది. పార్థనాన్ను అలా మతపరంగా “మార్చుతూపోవడం,” 15వ శతాబ్దంలో ఒట్టోమన్ టర్కీ వారు ఒక మసీదుగా మార్చినప్పటి వరకూ కొనసాగింది.
నేడు పార్థనాన్ని అంటే గ్రీకుల జ్ఞాన దేవతయైన అథెన్నా పార్థనాస్ (“కన్య”) యొక్క ప్రాచీన డారిక్ ఆలయాన్ని వేలాదిమంది సందర్శకులు, గ్రీకు నిర్మాణశైలి యొక్క కళాఖండంగా మాత్రమే దర్శిస్తారు.
[26వ పేజీలోని చిత్రం]
ఢాఫ్నే మోనాస్టరీ: ప్రాచీన ఏథెన్సులోని అన్యుల కొరకైన ప్రత్యామ్నాయ ఆరాధనాస్థలం