చింత మిమ్మల్ని అధిగమించనివ్వకండి
“రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.” (మత్తయి 6:34) యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ఉపదేశం, ఒత్తిడితో కూడిన నేటి ఉరుకుల పరుగుల సమాజంలో జీవిస్తున్న మనకందరికీ కచ్చితంగా ఎంతో ఆచరణాత్మకమైనది.
అయితే, వాస్తవికంగా, మనం మన సమస్యల గురించి, నిర్ణయాల గురించి, బాధ్యతల గురించి, కర్తవ్యాల గురించి చింతించకుండా ఉండడం సాధ్యమేనా? కోట్లాదిమంది ప్రజలు నిరుత్సాహపడుతున్నారు, క్షోభకు గురౌతున్నారు, కృంగిపోతున్నారు. అందుకే ట్రాంక్విలైజర్‌లు, నిద్రమాత్రల ఉత్పాదన నేడు కోట్ల డాలర్ల వ్యాపారంగా ఉంది.
సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండడమెలా
మనం మన బాధ్యతలు, పనులు, నిర్ణయాలు, సమస్యల గురించి—అవి అత్యవసరమైనవైనా కాకపోయినా—వాటి గురించి పథకం వేసుకుని సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు, “కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచు”కొమ్మని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (లూకా 14:28-30) దానిలో, ఎంపిక చేసుకోవడానికున్న అవకాశాలను జాగ్రత్తగా తూచిచూసుకోవడం, రాగల పర్యవసానాల ప్రభావాల్ని విశ్లేషించుకోవడం, సమయం, శక్తి, డబ్బు రూపేణా వెచ్చించాల్సిన మూల్యాన్ని మదింపుచేసుకోవడం ఇమిడివున్నాయి.
ఎవరైనా, ఏమి సంభవించగలదనేదాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నప్పటికీ, సంభవించగల ప్రతి అవకాశాన్ని గురించీ ఆలోచించడానికి ప్రయత్నించడం సాధ్యం కాదు, లేక అది నిర్మాణాత్మకమైనదీ కాదు. ఉదాహరణకు, కుటుంబ భద్రత దృష్ట్యా, ఇంట్లో నిప్పంటుకుంటే ఏమి చేయాలనేదాని గురించి మీరు ఆలోచించవచ్చు. పొగను పసిగట్టి హెచ్చరించే పరికరాలను, అగ్నిమాపక పరికరాలను కొని వాటిని ఇంట్లో అమర్చవచ్చు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇంట్లో నుండి తప్పించుకోవడానికి ఉన్న వివిధ మార్గాల గురించి ఆలోచించి పెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యగా వాటి గుండా పారిపోవడాన్ని రిహార్సల్ చేసుకొని ఉండవచ్చు. కాని జ్ఞానయుక్తమైన, ఆచరణాత్మకమైన సిద్ధపాటు పరిధిని దాటి, విపరీతమైన అనవసరమైన చింత ఎప్పుడు ప్రారంభమౌతుంది? అలాంటి చింత ఎప్పుడు ప్రారంభమౌతుందంటే, అసంఖ్యాకమైన ఊహాజనిత పరిస్థితుల గురించి మీరు విపరీతంగా వ్యధ చెందడం మొదలెట్టినప్పుడే. అసలు అలాంటి ఊహాజనిత పరిస్థితులలో అనేకం కేవలం మనం ఊహించుకున్నవే అయ్యుంటాయి. బహుశ మీరు దేన్నో అలక్ష్యం చేసివుంటారనీ లేక మీ కుటుంబాన్ని కాపాడడానికి మీరు తగినంత శ్రద్ధ తీసుకోలేదనీ మిమ్మల్ని ఒప్పించేస్తూ కలవరపర్చే ఆ తలంపులు మిమ్మల్ని కృంగదీయవచ్చు. ఇలా మీకుగా మీరు ఉత్పన్నం చేసుకున్న ఆ బాధ, మీ మనస్సుపై పెను భారాన్ని మోపవచ్చు, ఫలితం నిద్రలేని రాత్రుళ్లే.
ఫరో ఎదుట మోషే
యెహోవా దేవుడు తన ప్రవక్తయైన మోషేకు ఒక కష్టతరమైన బాధ్యతను అప్పగించాడు. మొదట, మోషే ఇశ్రాయేలీయుల ఎదుటకు వెళ్లి, వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించడంలో నాయకత్వం వహించడానికి యెహోవా తనను నియమించాడని వారిని ఒప్పించాలి. తర్వాత, మోషే ఫరో ఎదుటకు వెళ్లి, ఇశ్రాయేలీయులను పంపించమని విజ్ఞప్తి చేయాలి. చివరగా, లక్షల సంఖ్యలోవున్న జనసమూహాన్ని అరణ్యం గుండా నడిపిస్తూ, శత్రుభావంగల ప్రజలు ఆక్రమించుకొని ఉన్న దేశంలోకి తీసుకు వెళ్లాలి. (నిర్గమకాండము 3:1-10) ఇదంతా ఆయన గుండెల్లో గుబులు పుట్టించి ఉండవచ్చు, అయినా ఆ బాధ్యత అనవసరమైన చింతతో తన మనస్సును భారంగా చేసేందుకు మోషే అనుమతించాడా?
మోషే అనేక విషయాల గురించి చింత కలిగివున్నాడని స్పష్టమౌతుంది. “చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి—మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు—ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని” ఆయన యెహోవాను అడిగాడు. యెహోవా ఆయనకు సమాధానమిచ్చాడు. (నిర్గమకాండము 3:13, 14) ఫరో తనను నమ్మకపోతే ఏమౌతుందని కూడా మోషే చింతించాడు. మళ్లీ, యెహోవా ఆ ప్రవక్తకు సమాధానమిచ్చాడు. ఇక చివరి సమస్య—తాను “మాట నేర్పరిని కాను” అని మోషే చెప్పాడు. ఈ సమస్యనెలా పరిష్కరించడం? మోషే తరఫున మాట్లాడడానికి యెహోవా అహరోనును ఏర్పాటు చేశాడు.—నిర్గమకాండము 4:1-5, 10-16.
మోషే తన ప్రశ్నలకు సమాధానాలతో సిద్ధమై, దేవునియందు విశ్వాసముంచి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేయడం మొదలుపెట్టాడు. ఫరోను ఎదుర్కొన్నప్పుడు ఏమి సంభవిస్తుందోనని భయపెట్టే తలంపులతో తనను తాను హింసించుకునే బదులు మోషే “ఆలాగుననే” అంటే, అంతా తనకు చెప్పబడినట్లుగానే చేశాడు. (నిర్గమకాండము 7:6) చింతలు తనను అధిగమించేలా ఆయన అనుమతించి ఉన్నట్లయితే, ఆ చింతలు తన బాధ్యతను నిర్వర్తించడానికి ఆయనకు అవసరమైన విశ్వాసం మరియు ధైర్యం సన్నగిల్లిపోయేలా చేసివుండేవి.
మోషే తన బాధ్యతను నిర్వర్తించిన సమతూకమైన విధానం, అపొస్తలుడైన పౌలు “ఇంద్రియ నిగ్రహము” అని పిలిచిన దానికి ఒక ఉదాహరణగా ఉంది. (2 తిమోతి 1:7; తీతు 2:2-6) మోషే ఇంద్రియ నిగ్రహాన్ని గనుక చూపించి ఉండకపోతే, ఆయన తన బాధ్యతా భారాన్ని బట్టి ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యుండేవాడంటే, బహుశ ఆయన ఆ బాధ్యతను చేపట్టడానికి అంగీకరించి ఉండేవాడు కాదేమో.
మీ తలంపులను అదుపుచేసుకోవడం
మీరు మీ అనుదిన జీవితంలో, మీ విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులను లేక శోధనలను ఎదుర్కున్నప్పుడు మీరెలా ప్రతిస్పందిస్తారు? రానైయున్న అవాంతరాలను, సవాళ్లను గురించి కేవలం ఆలోచించడంతోనే మీరు ఆందోళన చెందుతారా? లేక మీరు వాటిని సమతూకమైన విధంగా దృష్టిస్తారా? లేని సమస్యను ఊహించుకుని, దాన్నెలా అధిగమించాలా అని కొంతమంది తలక్రిందులైపోతారు. అలా ఊహించిన సమస్య అసలు తలెత్తకపోవచ్చు! కాబట్టి, అసలు తలెత్తబోని సమస్య గురించి అంతగా నలిగిపోవడమెందుకు? “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 12:25) తరచూ దాని ఫలితమేమై ఉంటుందంటే, మరీ ఆలస్యమైపోయే వరకు వేచివుంటూ, నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడమే.
అనవసరమైన చింత కలుగజేయగల ఆధ్యాత్మిక హాని ఇంకా ఎక్కువ తీవ్రమైనది. “రాజ్యమును గూర్చిన వాక్యము” పట్ల మెప్పు, ధనము యొక్క మోసకరమైన శక్తి మూలంగానూ “ఐహిక విచారము” మూలంగానూ పూర్తిగా అణచివేయబడగలదని యేసుక్రీస్తు సూచించాడు. (మత్తయి 13:19, 22) లేత మొక్కలు ఎదిగి ఫలాలు ఫలించకుండా ముళ్లపొదలు ఎలాగైతే అణచివేస్తాయో అలాగే అదుపులేని చింత కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండా, దేవుణ్ని స్తుతించడమనే ఫలాలను ఫలించకుండా మనల్ని అణచివేయగలదు. చేజేతులా సృష్టించుకున్న నాశనకరమైన చింత, కొందరు తమను తాము యెహోవాకు సమర్పించుకోకుండా చేసింది. ‘నేను నా సమర్పణకు తగినట్టుగా జీవించలేకపోతే ఎలా’ అని వాళ్లు ఆందోళన పడతారు.
మనం మన ఆధ్యాత్మిక యుద్ధంలో, “ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెర”పట్టడానికి కృషి చేస్తున్నామని అపొస్తలుడైన పౌలు మనకు చెప్పాడు. (2 కొరింథీయులు 10:5) మనల్ని నిరుత్సాహపర్చేందుకూ, శారీరకంగానూ మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ మనల్ని బలహీనపర్చేందుకూ మన చింతలను ఉపయోగించుకోవడం మన ముఖ్య శత్రువైన అపవాదియగు సాతానుకు ఎంతో ప్రీతిపాత్రమైన విషయం. అప్రమత్తంగాలేని వారిని వలలో చిక్కించుకోవడానికి సందేహాలను ఉపయోగించడంలో అతడు నిపుణుడు. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా “అపవాదికి చోటియ్యకుడి” అని క్రైస్తవులను హెచ్చరించాడు. (ఎఫెసీయులకు 4:27) “ఈ యుగ సంబంధమైన దేవత”గా, సాతాను “అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు” విజయవంతంగా “గ్రుడ్డితనము కలుగ”జేశాడు. (2 కొరింథీయులు 4:4) అతడు మన మనస్సులను అదుపు చేయడానికి మనం ఎన్నడూ అనుమతించకుందాము!
సహాయం అందుబాటులో ఉంది
సమస్యలు ఎదుర్కుంటున్నప్పుడు ఒక పిల్లవాడు తన ప్రేమగల తండ్రి దగ్గరికి వెళ్లి నడిపింపును, ఓదార్పును పొందుతాడు. అలాగే, మనం మన సమస్యలను మన పరలోక తండ్రియైన యెహోవాకు తెలియజేయవచ్చు. నిజానికి, మన భారములను, చింతలను తన మీద వేయమని యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 55:22) తన తండ్రి దగ్గరి నుండి అభయాన్ని పొందిన తర్వాత తన సమస్యల గురించి ఇక ఎంతమాత్రం చింతించని పిల్లవాడిలా, మనం మన భారములను యెహోవా పైన వేయడమేగాక మనం వాటిని ఆయనకే విడిచిపెట్టాలి.—యాకోబు 1:6.
మనం మన చింతలను యెహోవాపైన ఎలా వేయగలము? ఫిలిప్పీయులు 4:6, 7 దానికిలా సమాధానమిస్తుంది: “దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” అవును, మన ఎడతెగని ప్రార్థనా విజ్ఞాపనలకు సమాధానంగా, యెహోవా మనకు అంతర్గత శాంతిని ఇవ్వగలడు, అది మనం అనవసరమైన చింతల గురించి వ్యాకులపడకుండా మన మనస్సులను కాపాడుతుంది.—యిర్మీయా 17:7, 8; మత్తయి 6:25-34.
అయితే, మన ప్రార్థనలకు అనుగుణంగా పని చేయడానికి, మనం శారీరకంగా గానీ లేక మానసికంగా గానీ ఇతరుల నుండి మనల్ని మనం వేరు చేసుకోకూడదు. (సామెతలు 18:1) బదులుగా, మన సమస్యకు సంబంధించిన బైబిలు సూత్రాలను, నిర్దేశాలను పరిశీలిస్తూ, తద్వారా మన స్వంత అవగాహనపై ఆధారపడకుండా ఉండడం మంచిది. (సామెతలు 3:5, 6) నిర్ణయాలు తీసుకోవడంలోనూ సమస్యలను ఎదుర్కోవడంలోనూ సమాచార భాండాగారం కోసం యౌవనులూ వృద్ధులూ అందరూ బైబిలు వైపూ వాచ్‌టవర్ ప్రచురణలవైపూ తిరగవచ్చు. అంతేగాక, క్రైస్తవ సంఘంలో, మనతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సుముఖంగా ఉండే జ్ఞానవంతులైన అనుభవంగల పెద్దలతో పరిణతి చెందిన ఇతర క్రైస్తవులతో మనం ఆశీర్వదించబడ్డాము. (సామెతలు 11:14; 15:22) మన సమస్యలలో భావోద్వేగపరంగా ఇమిడిలేనివారు, ఆ విషయానికి సంబంధించి దేవుని మనస్సును కలిగివున్న వారు, మనం మన సమస్యను మరో కోణం నుండి చూడడానికి తరచూ మనకు సహాయం చేయగల్గుతారు. వాళ్లు మన తరఫున నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ, మనకు ప్రోత్సాహానికీ మద్దతుకూ గొప్ప మూలంగా ఉండగలరు.
“దేవునియందు నిరీక్షణ యుంచుము”
ప్రతిరోజు మనకున్న నిజమైన సమస్యలను ఎదుర్కోవడంలోనే మనమెంతో ఒత్తిడికి అంటే, ఊహాజనితమైన సమస్యల గురించి చింతించడం ద్వారా వాటిని అధికం చేసుకోకపోయినా సరే మనమెంతో ఒత్తిడికి గురౌతున్నామన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. జరుగనైయున్న దాని గురించిన చింత మనకు భయమూ అసౌకర్యమూ కలిగిస్తే, మనం ప్రార్థన విజ్ఞాపనలతో యెహోవా వైపు తిరుగుదాము. నిర్దేశం, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం కోసం మనం ఆయన వాక్యం వైపు, ఆయన సంస్థవైపు చూద్దాము. ఏ పరిస్థితులు తలెత్తినప్పటికీ, వాటితో వ్యవహరించడానికి సహాయం అందుబాటులో ఉందని మనం కనుగొంటాము.
హృదయభారంతో, ఆందోళనతో కీర్తన గ్రంథకర్త ఇలా పాడాడు: “నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.” (కీర్తన 42:11) మనమూ అవే భావాలను కలిగివుందాము.
అవును, సహేతుకంగా దేన్ని ఎదురుచూడవచ్చో దాని గురించి పథకం వేసుకోండి, ఎదురుచూడలేని దాన్ని యెహోవాకు విడిచిపెట్టండి. “ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:7.
[23వ పేజీలోని చిత్రం]
మీరు దావీదులా, మీ భారములను చింతలను యెహోవా మీద వేస్తారా?