కమ్యూనిస్టు నిషేధం క్రింద 40 ఏళ్లకుపైగా
మ్యీకీల్ వసీలవిక్ సవీత్సకీ చెప్పినది
1951 ఏప్రిల్ 1, 7, 8 తేదీలలో యెహోవాసాక్షులపై “గొప్ప ప్రక్షాళన” చర్యలు జరిగాయని 1956 ఏప్రిల్ 1 కావలికోట నివేదించింది. “ఈ తేదీలు రష్యాలోని యెహోవాసాక్షులు ఎన్నడూ మరువలేనివి” అని కావలికోట వివరించింది. “ఈ మూడు రోజుల్లోనూ పశ్చిమ యుక్రేయిన్, వైట్ రష్యా [బెలారస్], బెస్సరేబియా, మాల్డావియా, లాట్వియా, లిథువానియా, ఎస్తోనియాలలో కనిపించిన యెహోవాసాక్షులనందరినీ అంటే ఏడు వేలకంటే ఎక్కువమంది స్త్రీ పురుషులను . . . బండ్లలోకి ఎక్కించి, రైల్వే స్టేషన్లకు తీసుకువెళ్లి అక్కడినుండి పశువులను రవాణా చేసే రైలు బోగీలలోకి ఎక్కించి దూరంగా పంపించేశారు.”
నాభార్యని, ఎనిమిదినెలల నా కుమారుడ్ని, నా తల్లిదండ్రుల్ని, నా తమ్ముడ్ని, ఇంకా అనేకమంది ఇతర సాక్షుల్ని 1951 ఏప్రిల్ 8న యుక్రేయిన్‌నందలి టర్నోపోల్‌లో, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లనుండి తీసుకువెళ్లారు. పశువులను రవాణా చేసే రైలు బోగీలలోకి ఎక్కిన తర్వాత వాళ్లు దాదాపు రెండు వారాలపాటు ప్రయాణించారు. చివరికి వాళ్లను బైకాల్ సరస్సుకు తూర్పునున్న సైబీరియన్ అడవుల్లో (ఆర్కిటిక్ వలయానికి దక్షిణానున్న అడవుల్లో) దించేశారు.
ఆ ప్రక్షాళనలో నేనెందుకు లేను? ఆ సమయంలో నేనెక్కడున్నానో, ఆ తర్వాత మాకందరికీ ఏమి జరిగిందో చెప్పేముందు, నేను యెహోవాసాక్షిని ఎలా అయ్యానో చెబుతాను.
బైబిలు సత్యం మమ్మల్ని చేరడం
1947 సెప్టెంబర్‌లో, నాకు 15 ఏళ్లున్నప్పుడు, టర్నోపోల్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోవున్న స్లావ్యటిన్ అనే చిన్న గ్రామంలోవున్న మా ఇంటికి ఇద్దరు యెహోవాసాక్షులు వచ్చారు. ఆ యౌవనస్థులు చెబుతున్నదాన్ని అమ్మా నేను వింటూ కూర్చున్నప్పుడు—వారిలో ఒకరి పేరు మరీయ—ఇది కేవలం మరో మతం మాత్రమే కాదని నేను గ్రహించాను. వాళ్లు తమ విశ్వాసాన్ని వివరించి, మేము అడిగిన బైబిలు ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు చెప్పారు.
బైబిలు దేవుని వాక్యమని నేను నమ్మాను, కాని చర్చినిబట్టి నేను ఎంతో నిరుత్సాహానికి గురయ్యాను. తాతగారు ఇలా చెప్పేవారు: “నరకాగ్నిలో హింసలు పొందడం గురించి మాట్లాడి ప్రీస్టులు ప్రజలను భయపెడతారు, కాని ప్రీస్టులు మాత్రం దేనికీ భయపడరు. వాళ్లు బీదల్ని దోచుకుని మోసం చేస్తారు.” రెండవ ప్రపంచ యుద్ధారంభంలో మా గ్రామంలోవున్న పోలాండ్ దేశస్థులపై జరిగిన దౌర్జన్యకాండ మరియు ఆస్తినష్టమూ నాకు గుర్తున్నాయి. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, ఈ దాడుల వెనుక ఉన్నది గ్రీకు క్యాథలిక్ ప్రీస్టే. ఆ తర్వాత వధకు గురైన ఎంతోమంది బాధితులను నేను చూశాను, అలాంటి క్రూరత్వానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆతురత నాకుండేది.
నేను సాక్షులతో బైబిలు పఠిస్తున్నప్పుడు, నేను అర్థం చేసుకోవడం మొదలెట్టాను. నేను ప్రాథమిక బైబిలు సత్యాలను తెలుసుకున్నాను, వాటిలో మండుతున్న నరకం లేదనే వాస్తవం, యుద్ధాన్ని రక్తపాతాన్ని పెంపొందింపజేయడానికి అపవాదియైన సాతాను అబద్ధమతాన్ని ఉపయోగిస్తాడనే వాస్తవం చేరివున్నాయి. నేను వ్యక్తిగత పఠనం చేసుకునేటప్పుడు అప్పుడప్పుడూ మధ్యలో ఆపి నేను నేర్చుకుంటున్న దాన్ని బట్టి ప్రార్థనలో యెహోవాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసేవాడిని. నేను ఈ బైబిలు సత్యాలను నా తమ్ముడు స్టాక్‌తో చెప్పడం మొదలెట్టాను, అతడు వాటిని అంగీకరించినప్పుడు నేనెంతో సంతోషించాను.
నేను నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టడం
వ్యక్తిగతంగా మార్పులు చేసుకోవలసిన అవసరతను నేను గుర్తించి, వెంటనే పొగత్రాగడం మానేశాను. క్రమమైన బైబిలు పఠనం కోసం నేను ఇతరులతో క్రమంగా సహవసించవలసివున్న అవసరాన్ని గ్రహించాను. దానికోసం, కూటాలు జరిగే రహస్య స్థలాన్ని చేరుకోవడానికి నేను అడవి గుండా దాదాపు 10 కిలోమీటర్లు నడిచేవాడిని. కొన్నిసార్లు కేవలం కొంతమంది స్త్రీలు మాత్రమే కూటానికి వచ్చేవారు, నేను అప్పటికింకా బాప్తిస్మం తీసుకోకపోయినప్పటికీ, కూటం నిర్వహించమని నన్ను అడగడం జరిగేది.
బైబిలు సాహిత్యాన్ని కల్గివుండడం ప్రమాదకరమైనదిగా ఉండేది, సాహిత్యాలతో పట్టుబడితే, దాదాపు 25 ఏళ్ల జైలు శిక్ష విధించబడేది. అయినప్పటికీ, నాకొక స్వంత లైబ్రరీ ఉండాలని కోరుకున్నాను. మా పొరుగువారిలో ఒకతను యెహోవాసాక్షులతో పఠించాడు, కానీ భయంవల్ల పఠనం మానేసి, తన సాహిత్యాల్ని తన తోటలో పాతి పెట్టేశాడు. ఆ వ్యక్తి తన పుస్తకాలనూ పత్రికల్నీ త్రవ్వి బయటికి తీసి నాకు ఇవ్వడానికి అంగీకరించినప్పుడు నేను యెహోవాకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిపాను! నేను వాటిని మా నాన్నగారు తేనెటీగలను పెంచే పెట్టెలో దాచాను, అక్కడైతే సాధారణంగా ఎవ్వరూ వెదకరు.
1949 జూలైలో, నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, నా సమర్పణకు గుర్తుగా బాప్తిస్మం తీసుకున్నాను. అది నా జీవితంలో అత్యంత ఆనందభరితమైన దినం. నాకు రహస్యంగా బాప్తిస్మం ఇచ్చిన సాక్షి, నిజ క్రైస్తవునిగా ఉండడం అంత సులభం కాదనీ, ముందు ముందు ఎన్నో శ్రమలు వస్తాయనీ నొక్కి చెప్పాడు. ఆయన మాటలెంత నిజమో నేను త్వరలోనే తెలుసుకున్నాను! అయినప్పటికీ, బాప్తిస్మం పొందిన సాక్షిగా నా జీవితం ఆనందభరితంగా ప్రారంభమయ్యింది. నేను బాప్తిస్మం తీసుకున్న రెణ్నెల్ల తర్వాత, నేను మరీయను వివాహం చేసుకున్నాను, నాకూ అమ్మకూ సత్యాన్ని పరిచయం చేసిన ఇద్దరిలో ఆమె ఒకరు.
నా మొదటి శ్రమ హఠాత్తుగా వచ్చింది
1950 ఏప్రిల్ 16న, నేను పడ్గీట్సీ అనే చిన్న పట్టణం నుండి ఇంటికి తిరిగివస్తున్నాను, అప్పుడు సైనికులు హఠాత్తుగా నాకు ఎదురై, మా పఠన గుంపుకోసం తీసుకు వెళుతున్న బైబిలు సాహిత్యం నా దగ్గర ఉండడాన్ని కనుగొన్నారు. నన్ను నిర్బంధించారు. కస్టడీలోవున్న మొదటి కొద్ది రోజుల్లో, నన్ను లాఠీతో కొట్టారు, తిననివ్వలేదు, నిద్రపోనివ్వలేదు. చేతులు తల మీద పెట్టుకుని వంద గుంజీలు తీయమని నాకు ఆజ్ఞాపించారు, నేను పూర్తిగా అలసిపోవడంతో అవి ముగించలేకపోయాను. ఆ తర్వాత నన్ను చల్లగా, తడిగా ఉన్న గదిలో 24 గంటలు ఉంచారు.
నన్ను అలా వేధించడం యొక్క ఉద్దేశమేమిటంటే నాకున్న తట్టుకునే శక్తిని తగ్గించి, నా నుండి సమాచారం పొందడాన్ని సులభం చేయాలన్నదే. “నీకు సాహిత్యం ఎక్కడినుండి వచ్చింది, ఎవరి కోసం అది తీసుకువెళుతున్నావు?” చెప్పమని నన్ను ఒత్తిడి చేశారు. నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ చట్టం ప్రకారం నన్ను ప్రశ్నిస్తున్నారో ఆ చట్టంలోని కొంత భాగాన్ని నాకు చదివి వినిపించారు. సోవియట్ వ్యతిరేక సాహిత్యాన్ని పంచిపెట్టడం లేక ఉంచుకోవడం శిక్షించదగిన నేరమనీ, దానికి ఉరిశిక్షగాని లేక 25 సంవత్సరాల జైలు శిక్షగాని విధించబడుతుందని అది తెలియజేసింది.
“నీవు ఏ శిక్షను కోరుకుంటావు?” అని వాళ్లు ప్రశ్నించారు.
“ఏదీ కోరుకోను, కాని నాకు యెహోవాయందు నమ్మకం ఉంది, ఆయన సహాయంతో, ఆయన అనుమతించినదేదైనా నేను స్వీకరిస్తాను” అని నేను సమాధానమిచ్చాను.
నాకు ఆశ్చర్యం కలుగజేస్తూ, ఏడు రోజుల తర్వాత వాళ్లు నన్ను విడిచిపెట్టారు. ఆ అనుభవం, “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని యెహోవా చేసిన వాగ్దాన సత్యత్వాన్ని గుణగ్రహించడానికి నాకు సహాయం చేసింది.—హెబ్రీయులు 13:5.
నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి, నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను, నాన్నగారు నన్ను డాక్టరు దగ్గరికి తీసుకువెళ్లారు, నేను త్వరలోనే కోలుకున్నాను. నాన్నగారు మిగతా కుటుంబమంతటి మత నమ్మకాలను పంచుకోకపోయినప్పటికీ, మా ఆరాధనలో మాకు మద్దతు నిచ్చేవారు.
జైలు శిక్ష, దేశ బహిష్కరణ
కొన్ని నెలల తర్వాత సోవియట్ సైనిక సేవలో చేరడానికి నన్ను ఎంపిక చేశారు. నా మనస్సాక్షి అంగీకరించడం లేదని నేను వివరించాను. (యెషయా 2:4) అయినప్పటికీ, 1951 ఫిబ్రవరిలో, నాకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, నన్ను టర్నోపోల్‌లోని జైలుకు పంపించారు. ఆ తర్వాత, దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోవున్న ఒక పెద్ద నగరమైన లవీఫ్‌లోవున్న జైలుకు నన్ను మార్చారు. అక్కడ జైల్లో ఉన్నప్పుడు, చాలామంది సాక్షులను సైబీరియాకు పంపించారని నేను తెలుసుకున్నాను.
1951 వేసవిలో, నన్ను ఇంకొందరిని సైబీరియా అవతల ఈశాన్య ప్రాంతానికి పంపించారు. మేము ఒక నెల పాటు అంటే దాదాపు 11,000 కిలోమీటర్లు ప్రయాణించాము—11 టైమ్ జోన్‌లను దాటాము! కేవలం ఒక్కసారి, ట్రైన్‌లో రెండు వారాలకంటే ఎక్కువ కాలం గడిపిన తర్వాత, మమ్మల్ని ఒక స్థలంలో ఆపి, మేము స్నానం చేసేందుకు అనుమతించారు. సైబీరియాలోని నోవోసబిర్కస్ నగరంలోని పెద్ద బహిరంగ స్నానాల గదిలో మేము స్నానం చేశాము.
అక్కడ, ఖైదీల పెద్ద సమూహం మధ్యన, ఒక వ్యక్తి బిగ్గరగా ఇలా అనడం నాకు వినిపించింది: “ఇక్కడున్న వారిలో ఎవరు యెహోనాదాబు కుటుంబానికి చెందినవారు?” ఆ సమయంలో “యెహోనాదాబు” అనే పదం భూమి మీద నిరంతర జీవితాన్ని అనుభవించే నిరీక్షణగల వారిని గుర్తించడానికి ఉపయోగించబడేది. (2 రాజులు 10:15-17; కీర్తన 37:11, 29) చాలామంది ఖైదీలు వెంటనే తమను తాము సాక్షులుగా తెలియజేసుకున్నారు. మేము ఒకరినొకరం ఎంతో ఆనందంతో పరామర్శించుకున్నాము!
జైలులో ఆధ్యాత్మిక కార్యకలాపం
నోవోసబిర్కస్‌లో ఉన్నప్పుడు, మేము మా గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత ఒకరినొకరం గుర్తించుకోవడానికి ఒక పాస్‌వర్డ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము. జపాన్ సముద్రం వద్ద మేము అందరం ఒకే జైలు కాంప్‌లో ఉన్నాము, అది వ్లాడివోస్టోక్‌కు దగ్గరలో ఉంది. అక్కడ మేము బైబిలు పఠనం కోసం క్రమంగా కూటాలను ఏర్పాటు చేసుకున్నాము. ఎంతోకాలం జైల్లో ఉన్న, పరిణతి చెందిన ఈ వృద్ధ సహోదరులతో ఉండడం నిజంగా నన్ను ఆధ్యాత్మికంగా బలపర్చింది. బైబిలు లేఖనాలను, కావలికోట పత్రికల నుండి తాము గుర్తుంచుకున్న సంబంధిత అంశాలను ఉపయోగిస్తూ వారిలో ఒక్కొక్కరూ వంతులవారిగా మా కూటాలను నిర్వహించారు.
ప్రశ్నలు అడిగినప్పుడు, సహోదరులు సమాధానాలు చెప్పారు. మాలో చాలామందిమి ఖాళీ సిమెంట్ సంచుల నుండి కాగితం ముక్కలను కత్తిరించుకుని, వ్యాఖ్యానాలను వాటి మీద వ్రాసిపెట్టుకున్నాము. మేము వాటిని దాచుకుని, మా వ్యక్తిగత రిఫరెన్సు లైబ్రరీగా వాటిని ఉపయోగించుకునేందుకు వాటిని కలిపి బైండ్ చేసిపెట్టుకున్నాము. కొన్ని నెలల తర్వాత, ఎక్కువ కాలం శిక్ష విధించబడినవారిని సైబీరియాకు సుదూరంగా ఉత్తరాన ఉన్న క్యాంప్‌లకు పంపించారు. యౌవనస్థులమైన మేము ముగ్గురం సహోదరులం, జపాన్ నుండి 650 కిలోమీటర్లకంటే తక్కువ దూరంలోవున్న సమీప నగరమైన నాఖోద్కాకు బదిలీ చేయబడ్డాము. అక్కడ జైలులో నేను రెండు సంవత్సరాలు గడిపాను.
కొన్నిసార్లు మేము కావలికోట ప్రతిని ఒకదాన్ని సంపాదించేవాళ్లం. కొన్ని నెలలపాటు అది మాకు ఆధ్యాత్మిక ఆహారంగా పనిచేసింది. కొంతకాలానికి మాకు ఉత్తరాలు కూడా వచ్చేవి. (అప్పుడు దేశబహిష్కరణలో ఉన్న) నా కుటుంబం నుండి నాకు వచ్చిన మొదటి ఉత్తరం చూసినప్పుడు నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రారంభంలో ఉల్లేఖించబడిన కావలికోట నందు వర్ణించబడినట్లుగా, సాక్షుల గృహాలను ముట్టడించి, తరలి వెళ్లిపోవడానికి కుటుంబాలకు కేవలం రెండు గంటల కాలవ్యవధి మాత్రం ఇవ్వబడిందని ఆ ఉత్తరం తెలియజేసింది.
మళ్లీ నా కుటుంబంతో
నా నాలుగేళ్ల శిక్షలో రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత 1952 డిసెంబరులో నేను విడుదలయ్యాను. సైబీరియాలోని టులూన్ సమీపాన ఉన్న గాడాలె అనే చిన్న గ్రామానికి నా కుటుంబం పంపబడింది. అక్కడే నేను వారిని కలుసుకున్నాను. నిజంగా, వారిని మళ్లీ కలుసుకోవడం అద్భుతంగా అనిపించింది—నా కుమారుడు ఇవాన్ దాదాపు మూడు సంవత్సరాల వాడయ్యాడు, నా కుమార్తె అన్నాకు దాదాపు రెండేళ్లు. అయితే నా స్వేచ్ఛ కేవలం పాక్షికమైనదే. స్థానిక అధికారులు నా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు, నన్ను నిఘాలో ఉంచారు. నేను ఇంటినుండి మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణించకూడదు. తర్వాత, టులూన్‌లోని మార్కెట్‌కు గుర్రం మీద వెళ్లడానికి నాకు అనుమతి లభించింది. నేను అప్రమత్తంగా ఉంటూ, అక్కడున్న తోటి సాక్షులను కలిశాను.
అప్పటికల్లా మాకు ఇద్దరు అమ్మాయిలు అన్నా, నాడియా; ఇద్దరు అబ్బాయిలు, ఇవాన్, కోల్య. 1958లో మాకు మరో అబ్బాయి, వలోడ్య పుట్టాడు. ఆ తర్వాత, 1961లో మాకు మరో కుమార్తె, గేల్య పుట్టింది.
కెజిబి (మాజీ రాష్ట్ర భద్రతా ఏజెన్సీ) తరచూ నన్ను నిర్బంధించి, ఇంటరాగేట్ చేసేది. వాళ్ల సంకల్పం, సంఘం గురించిన సమాచారాన్ని నా నుండి రాబట్టాలన్నదే కాదు గాని నేను వారితో సహకరిస్తున్నాన్న అనుమానాన్ని కలిగించాలన్నది కూడా. కాబట్టి వాళ్లు నన్ను ఒక మంచి హోటల్‌కు తీసుకువెళ్లి, నేను చిరునవ్వు నవ్వుతున్న ఫోటోలను, వారితో కలిసి ఆనందిస్తున్నట్లున్న ఫోటోలను తీయడానికి ప్రయత్నించేవారు. కాని నేను వారి ఉద్దేశాన్ని గ్రహించి, నా మొహం మీద అయిష్టతను కనబరుస్తూ ఉండేవాడిని. నేను నిర్బంధించబడిన ప్రతిసారి, నేను సహోదరులకు కచ్చితంగా ఏమి జరిగిందో చెప్పేవాడిని. అందుకే వాళ్లు నా యథార్థతను ఎన్నడూ శంకించలేదు.
శిబిరాలతో సంబంధం
సంవత్సరాలు గడుస్తుండగా, వందలాదిమంది సాక్షులు జైలు శిబిరాల్లో వేయబడ్డారు. ఈ సమయంలో, నిర్బంధంలో ఉన్న మా సహోదరులను క్రమంగా కలుసుకొని వారికి సాహిత్యాన్ని అందజేసేవాళ్లము. ఇదెలా జరిగేది? సహోదరులు గాని సహోదరీలు గాని శిబిరం నుండి విడుదల చేయబడినప్పుడు, ఎంత కచ్చితమైన నిర్బంధాలు ఉన్నప్పటికీ సాహిత్యాన్ని రహస్యంగా చేరవేయడానికి గల మార్గాల గురించి మేము వారి నుండి తెలుసుకునే వాళ్లము. దాదాపు పది సంవత్సరాలపాటు, ఈ శిబిరాల్లో ఉన్న మన సహోదరులకు మేము పోలాండ్ నుండి ఇతర దేశాల నుండి పొందిన పత్రిక ప్రతులను, పుస్తకాలను అందజేయగలిగాము.
మొత్తం పత్రికనంతా అగ్గిపెట్టె అంత చిన్న సైజువున్న దాంట్లో దాచడం సాధ్యమయ్యేలా, మన క్రైస్తవ సహోదరీలలో చాలామంది చిన్ని చిన్ని అక్షరాల్లో సాహిత్యాల్ని ఎత్తి వ్రాయడానికి ఎన్నో గంటలు కృషి చేసేవారు! 1991లో, మేము ఇక నిర్బంధం క్రిందలేనప్పుడు, అందమైన నాలుగు రంగుల పత్రికలను అందుకుంటున్నప్పుడు, మన సహోదరీల్లో ఒకామె ఇలా అంది: “ఇక మమ్మల్ని మరచిపోతారు.” ఆమె అన్నది తప్పు. మానవులు మరచిపోయినప్పటికీ, అలాంటి యథార్థవంతుల పనిని యెహోవా ఎన్నడూ మరచిపోడు!—హెబ్రీయులు 6:10.
మరో స్థలానికి వెళ్లడం, దుర్ఘటనలు
1967 చివర్లో, నా తమ్ముడు ఇర్కుట్స్ ఇంటిని సోదా చేశారు. ఫిల్మ్, బైబిలు సాహిత్య ప్రతులు దొరికాయి. ఆయన నేరం నిరూపించబడి, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అయితే, మా ఇంటిని కూడా సోదా చేసినప్పుడు ఏమీ దొరకలేదు. అయినప్పటికీ, మేము ఇమిడి ఉండడం గురించి అధికారులకు రూఢి అయిపోయింది గనుక, మా కుటుంబం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లవలసివచ్చింది. మేము 5,000 కిలోమీటర్లు పశ్చిమంగా, కాకాసస్‌లోని నెవిన్నోమిస్క్ నగరానికి తరలివెళ్లాము. అక్కడ మేము అనియత సాక్ష్యమివ్వడంలో నిమగ్నమయ్యాము.
1969 జూన్‌లో పాఠశాల సెలవులు ఇవ్వబడిన మొదటిరోజునే దుర్ఘటన జరిగింది. 12 ఏళ్ల మా అబ్బాయి కోల్య, హై-వోల్టేజి ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర పడిన బంతిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా వాడికి తీవ్రమైన విద్యుద్ఘాతం తగిలింది. వాడి శరీరం దాదాపు 70 శాతంకంటే ఎక్కువ కాలిపోయింది. హాస్పిటల్‌లో, వాడు నావైపు తిరిగి, “మనం మళ్లీ కలిసి ద్వీపానికి వెళ్లగల్గుతామా?” అని ప్రశ్నించాడు. (మేము తరచూ వెళ్లి అక్కడ గడిపి ఆనందించే ఒక ద్వీపం గురించి వాడు మాట్లాడుతున్నాడు.) “వెళతాము కోల్య, మళ్లీ మనం ఆ ద్వీపానికి వెళతాము. యేసుక్రీస్తు నిన్ను తిరిగి జీవానికి తెచ్చినప్పుడు, మనం తప్పకుండా ఆ ద్వీపానికి తిరిగి వెళదాము” అని నేను సమాధానం ఇచ్చాను. పూర్తిగా స్పృహలో లేకపోయినా వాడు, సంఘ ఆర్కెస్ట్రాలో తన ట్రంపెట్ మీద వాయించడానికి ఇష్టపడే తనకిష్టమైన రాజ్య గీతాలను పాడుతూనే ఉన్నాడు. పునరుత్థాన నిరీక్షణయందు నమ్మకంతో, వాడు మూడు రోజుల తర్వాత మరణించాడు.
తర్వాతి సంవత్సరం, 20 ఏళ్ల మా కుమారుడైన ఇవాన్ సైనిక సేవకు ఎంపిక చేయబడ్డాడు. సేవ చేయడానికి అతడు నిరాకరించినప్పుడు, అతడిని నిర్బంధించారు. అతడు మూడు సంవత్సరాలు జైలులో గడిపాడు. 1971లో, నన్ను మళ్లీ సైనిక సేవకు ఎంపిక చేశారు, సేవ చేయకపోతే నిర్బంధిస్తామని బెదిరించారు. నా కేసు నెలలపాటు కొనసాగింది. ఇంతలో, నా భార్యకు క్యాన్సర్ రావడంతో, ఆమెపట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసి వచ్చింది. ఆ కారణాన్ని బట్టి నా కేసును కొట్టేశారు. 1972లో మరీయ మరణించింది. ఆమె నమ్మకమైన సహచరిగా, మరణం వరకు యెహోవా పట్ల యథార్థంగా ఉంది.
విదేశాలకు విస్తరించిన మా కుటుంబం
1973లో నేను నీనాను వివాహం చేసుకున్నాను. ఆమె సాక్షి అయినందుకు ఆమె తండ్రి ఆమెను 1960లో ఇంటినుండి వెళ్లగొట్టాడు. క్యాంపులో ఉన్నవారికోసం పత్రికలను ఎత్తి వ్రాయడంలో ఎంతగానో కృషి చేసిన సహోదరీలలో ఆమె ఒకరు, ఆమె ఎంతో ఆసక్తిగల పరిచారకురాలు. నా పిల్లలు కూడా ఆమెను ప్రేమించనారంభించారు.
నెవిన్నోమిస్క్‌లో మా కార్యకలాపాలను బట్టి అధికారులు కలవరపడి, వెళ్లిపోమని మమ్మల్ని ఒత్తిడి చేశారు. కాబట్టి 1975లో నేనూ నా భార్యా, కుమార్తెలూ, జార్జియాలోని కాకాసస్ దక్షిణ ప్రాంతానికి వెళ్లాము. అదే సమయంలో, మా అబ్బాయి ఇవాన్, వలోడ్య ఖజకస్తాన్ దక్షిణ తీరమైన జాంబిల్‌కు తరలివెళ్లారు.
జార్జియాలో యెహోవాసాక్షుల కార్యకలాపాలు అప్పుడే ప్రారంభమౌతున్నాయి. మేము నల్ల సముద్రం తీరానున్న గేగ్ర మరియు సుకుమి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనియత సాక్ష్యమిచ్చాము, ఒక సంవత్సరం తర్వాత, ఆ పర్వత నది దగ్గర పది మంది క్రొత్త సాక్షులు బాప్తిస్మం తీసుకున్నారు. త్వరలోనే, మేము ఆ ప్రాంతాన్ని వదలి వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేశారు, మేము తూర్పు జార్జియాకు తరలి వెళ్లాము. గొఱ్ఱెవంటి వారిని కనుగొనడానికి మేము మా ప్రయత్నాలను తీవ్రతరం చేశాము, యెహోవా మమ్మల్ని ఆశీర్వదించాడు.
మేము చిన్న చిన్న గుంపులుగా సమకూడేవాళ్లము. భాష ఒక సమస్యగా ఉండేది, ఎందుకంటే మాకు జార్జియా భాష తెలియదు, కొంతమంది జార్జియావాసులకు రష్యా భాష అంతగా వచ్చేదికాదు. మొదట్లో, మేము కేవలం రష్యావారితోనే పఠించేవాళ్లము. అయితే, త్వరలోనే, జార్జియా భాషలో ప్రకటించడం, బోధించడం పురోగమించింది, ఇప్పుడు జార్జియాలో వేలాదిమంది రాజ్య ప్రచారకులు ఉన్నారు.
1979లో, కెజిబి ఒత్తిడి క్రింద, నాకు ఉద్యోగమిచ్చిన నా యజమాని నేను ఆ దేశంలో పని చేయవలసిన అవసరం లేదని నాకు చెప్పాడు. అప్పుడే మా కుమార్తె నాడియా కారు యాక్సిడెంటుకు గురైంది, దానిలో ఆమె, ఆమె కుమార్తె ఇద్దరూ మరణించారు. దానికి ఒక సంవత్సరం ముందు మా అమ్మ నెవిన్నోమిస్క్‌లో మరణించింది. ఆమె చివరి వరకు యెహోవా పట్ల నమ్మకంగా ఉంది. అమ్మ మరణంతో మా నాన్న, మా తమ్ముడు ఒంటరిగా ఉన్నారు. అందుకని మేము అక్కడికి తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకున్నాము.
సహనానికి ఆశీర్వాదాలు
నెవిన్నోమిస్క్‌లో మేము బైబిలు సాహిత్యాన్ని రహస్యంగా ఉత్పత్తి చేయడం కొనసాగించాము. 1980ల మధ్యకాలంలో ఒకసారి, అధికారులు రమ్మని నాకు ఆజ్ఞాపించినప్పుడు, నేను మన పత్రికలను దాచిపెడుతున్నట్లు నాకు కల వచ్చిందని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు నవ్వారు. నేను వెళ్లిపోతుండగా, వారిలో ఒకరు ఇలా అన్నారు: “మీరు మీ సాహిత్యాన్ని ఎలా దాచిపెట్టాలనేదాని గురించి ఇక కలలు కననవసరం లేదు. త్వరలోనే సాహిత్యం మీ షెల్ఫ్‌లలో ప్రదర్శించబడుతుంది, మీరు చేతిలో బైబిలు పట్టుకుని, మీ భార్య చేతిలో చేయి వేసుకుని కూటాలకు వెళుతూ ఉంటారు.”
1989లో మా కుమార్తె అన్నా, మెదడులో కంతి మూలంగా మరణించినప్పుడు మేము ఎంతో బాధపడ్డాము. ఆమెకు కేవలం 38 ఏళ్లే. అదే సంవత్సరం ఆగస్టులో, నెవిన్నోమిస్క్‌లోని సాక్షులు అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు ఒక ట్రెయిన్ అద్దెకు తీసుకుని పోలాండ్‌లోని వార్సాకు ప్రయాణించారు. సోవియట్ యూనియన్ నుండి వచ్చిన వేలాదిమందితో సహా అక్కడ 60,366 మంది హాజరయ్యారు. నిజంగా మేము కలగంటున్నామేమో అనుకున్నాము! అటు తర్వాత రెండేళ్లకు అంటే 1991 మార్చి 27న, సోవియట్ యూనియన్‌లో ఎంతోకాలంగా పెద్దలుగా ఉన్న ఐదుగురికి యెహోవాసాక్షుల మత సంస్థకు చట్టబద్ధమైన గుర్తింపును ఇచ్చిన చరిత్రాత్మక డాక్యుమెంటు మీద మాస్కోలో సంతకాలు చేసే ఆధిక్యత లభించింది, ఆ ఐదుగురిలో నేను ఒకరిని!
బ్రతికివున్న నా పిల్లలు నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నారని నేనెంతో ఆనందిస్తున్నాను. అన్నాను, నాడియాను, ఆమె కుమార్తెను, అలాగే కోల్యను నేను దేవుని నూతన లోకంలో మళ్లీ చూడడానికి ఎదురు చూస్తున్నాను. కోల్య పునరుత్థానమైనప్పుడు, ఎన్నో సంవత్సరాల క్రితం మేము వెళ్లి ఎంతో ఆనందించిన ఆ ద్వీపానికి అతడిని తీసుకువెళతానని నేను చేసిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను.
ఇంతలో, ఈ సువిశాల దేశంలో బైబిలు సత్యం త్వరితంగా అభివృద్ధి చెందడాన్ని చూడడం ఎంతో ఆనందాన్ని కలిగించింది ! జీవితంలో నాకు లభించినదాన్ని బట్టి నేను నిజంగా ఆనందిస్తున్నాను, ఆయన సాక్షులలో ఒకరినయ్యేందుకు యెహోవా నన్ను అనుమతించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయంచు నరుడు ధన్యుడు” అని చెబుతున్న కీర్తన 34:8 యొక్క సత్యత్వాన్ని నేను ఒప్పుకుంటున్నాను.
[25వ పేజీలోని చిత్రం]
టులూన్‌లో నేను మా కుటుంబాన్ని కలుసుకున్న సంవత్సరం
[26వ పేజీలోని చిత్రాలు]
పైన: సైబీరియాలోని టులూన్‌లో ఉన్న మా ఇంటి వెలుపల మా నాన్న, మా పిల్లలు
పైన కుడివైపు: కారు యాక్సిడెంట్‌లో మరణించిన మా కుమార్తె నాడియా, ఆమె కుమార్తె
కుడి: 1968 నాటి కుటుంబ చిత్రం