కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/1 పేజీలు 18-23
  • మన “దేశము”పైన యెహోవా ఆశీర్వాదము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన “దేశము”పైన యెహోవా ఆశీర్వాదము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పునఃస్థాపిత దేశంలో ఒక నది ప్రవహిస్తుంది
  • ఆశీర్వాదాల గొప్ప వెల్లువ
  • నీరు జీవాన్ని తీసుకొస్తుంది !
  • ఈ నది పరదైసులో ప్రవహిస్తుంది
  • యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—II
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవుని దేవాలయంపై ‘మీ మనస్సు నిలుపుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • నేడు “దేవాలయము” మరియు “అధిపతి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పరిచర్య చేయడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/1 పేజీలు 18-23

మన “దేశము”పైన యెహోవా ఆశీర్వాదము

“ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.”—యెహెజ్కేలు 47:9.

1, 2. (ఎ) నీరు ఎంత ప్రాముఖ్యమైనది? (బి) యెహెజ్కేలు దర్శనంలో చూసిన నది దేనికి చిత్రీకరణగా ఉంది?

నీరు చాలా విశేషమైన ద్రవం. భౌతిక జీవం అంతా ఆ ద్రవం మీదే ఆధారపడుతుంది. మనలో ఏ ఒక్కరమూ అది లేకుండా ఎక్కువకాలం జీవించలేము. మనం శుభ్రతకు కూడా దాని మీదే ఆధారపడతాము, ఎందుకంటే నీరు మలినాల్ని కరిగించుకుని కడిగివేయగలదు. అందుకనే మనం మన శరీరాల్నీ, బట్టల్నీ, చివరికి మన ఆహారాన్ని కూడా నీటితో శుభ్రం చేసుకుంటాము. అలా చేయడం మన జీవితాల్ని రక్షించగలదు.

2 జీవం కోసం యెహోవా చేసే ఆధ్యాత్మిక ఏర్పాట్లను చిత్రీకరించడానికి బైబిలు నీటిని ఉపయోగిస్తుంది. (యిర్మీయా 2:13; యోహాను 4:7-15) ఈ ఏర్పాట్లలో క్రీస్తు విమోచన క్రయధన బలిద్వారా తన ప్రజల్ని పరిశుభ్రపర్చడమూ, దేవుని వాక్యంలో ఉన్న దేవుని జ్ఞానమూ ఇమిడి ఉన్నాయి. (ఎఫెసీయులు 5:25-27) యెహెజ్కేలు దేవాలయ దర్శనంలో దేవాలయం నుండి ప్రవహించే ఆ అద్భుతమైన నది అటువంటి జీవదాయక ఆశీర్వాదాల్ని సూచిస్తుంది. కానీ ఆ నది ఎప్పుడు ప్రవహిస్తుంది, మన విషయంలో అది ఎలాంటి భావాన్ని కలిగివుంది?

పునఃస్థాపిత దేశంలో ఒక నది ప్రవహిస్తుంది

3. యెహెజ్కేలు 47:2-12లో నివేదించబడినట్లుగా యెహెజ్కేలుకు ఏమి అనుభవం అయ్యింది?

3 బబులోనులోని బంధీలుగా యెహెజ్కేలు తోడి ప్రజలకు యెహోవా ఏర్పాట్లు చాలా తీవ్రంగా అవసరమయ్యాయి. అందుకే, దేవాలయం నుండి నీరు చిన్న చిన్న బిందువులుగా ప్రారంభమై బయటికి నదిలా ప్రవహించడం చూసిన యెహెజ్కేలుకు ఎంత ప్రోత్సాహకరంగా ఉండి ఉండవచ్చు! ఒక దేవదూత ఆ నదిని వెయ్యి మూరల చొప్పున కొలుస్తున్నాడు. దాని లోతు ప్రతి వెయ్యి మూరలకు చీలమండల నుండి మోకాళ్ల వరకు, మోకాటి నుండి మొల వరకు పెరుగుతూపోయి చివరికి నడవలేక ఈదాల్సినంత పెద్ద ప్రవాహంగా మారింది. ఈ నది జీవాన్నీ ఫలాల్నీ తెస్తుంది. (యెహెజ్కేలు 47:2-11) యెహెజ్కేలుకు ఇలా చెప్పబడింది: “నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును.” (యెహెజ్కేలు 47:12ఎ) జీవం ఎంతమాత్రం లేని మృతసముద్రంలోనికి ఈ నది ప్రవేశించినప్పుడు ఆ సముద్రానికి జీవం వస్తుంది ! చేపలు సమృద్ధి అవుతాయి. ఒక చేపల పరిశ్రమ వర్ధిల్లుతుంది.

4, 5. ఒక నదిని గూర్చిన యోవేలు ప్రవచనం యెహెజ్కేలు ప్రవచనాన్ని ఎలా పోలివుంది, ఇది ఎందుకు గమనార్హము?

4 చక్కని ఈ ప్రవచనం చెరలో ఉన్న యూదులకు అంతకు రెండు శతాబ్దాల క్రితం నమోదు చేయబడిన మరో ప్రవచనాన్ని జ్ఞప్తికి తెచ్చివుండవచ్చు: “నీటి ఊట యెహోవా దేవాలయంలోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.”a (యోవేలు 3:18) యెహెజ్కేలు ప్రవచనం వలెనే యోవేలు ప్రవచనం కూడా, దేవుని గృహమైన దేవాలయం నుండి ఒక నది ఉబికి ప్రవహిస్తుందని సారంలేని ప్రాంతానికి జీవాన్ని తెస్తుందని ప్రవచించింది.

5 యోవేలు ప్రవచనం మనకాలంలో నెరవేరుతోందని కావలికోట ఎంతోకాలంగా చెబుతుంది.b అదే విధంగా యెహెజ్కేలు దర్శనం విషయంలో కూడా అదే వాస్తవం. ప్రాచీన ఇశ్రాయేలులో వలెనే దేవుని ప్రజల పునఃస్థాపిత దేశంలో యెహోవా ఆశీర్వాదాలు నిజంగానే ప్రవహిస్తూ వచ్చాయి.

ఆశీర్వాదాల గొప్ప వెల్లువ

6. దర్శన దేవాలయంలోని బలిపీఠంమీద రక్తాన్ని చిందించడం యూదులకు దేన్ని గుర్తుకు చేసివుండాలి?

6 పునఃస్థాపిత దేవుని ప్రజల ఆశీర్వాదాలకు మూలం ఏమిటి? నీళ్లు దేవుని ఆలయంలోనుండి ప్రవహిస్తున్నాయని గమనించండి. నేడు కూడా అదే విధంగా, ఆశీర్వాదాలు యెహోవా నుండి ఆయన గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం ద్వారా—అంటే స్వచ్ఛారాధన కోసమైన ఏర్పాటు ద్వారా వస్తున్నాయి. యెహెజ్కేలు దర్శనం ఒక ప్రాముఖ్యమైన వివరణను ఇస్తుంది. లోపలి ఆవరణములో, ఈ నది బలిపీఠం ప్రక్కగా దానికి దక్షిణంగా ప్రవహిస్తుంది. (యెహెజ్కేలు 47:1) బలిపీఠం దర్శనంలోని దేవాలయానికి సరిగ్గా మధ్యలో ఉంది. యెహోవా దాన్ని గురించి యెహెజ్కేలుకు కచ్చితమైన వివరణనిస్తూ, ఒక బలియర్పణ రక్తాన్ని దానిమీద చల్లమన్న ఆజ్ఞ ఇస్తాడు. (యెహెజ్కేలు 43:13-18, 20) ఇశ్రాయేలీయులందరికీ ఆ బలిపీఠం ఎంతోగొప్ప భావాన్ని కలిగివుంది. యెహోవాతో వారి నిబంధన ఎంతోకాలం మునుపు సీనాయి పర్వతపాదంవద్ద మోషే ఒక బలిపీఠంపైన రక్తాన్ని చల్లినప్పుడే అమలులోనికి వచ్చింది. (నిర్గమకాండము 24:4-8) రక్తాన్ని దర్శనంలోని బలిపీఠంపైన చల్లడం, ఒక్కసారి తమ పునఃస్థాపిత దేశంలోనికి అడుగిడితే అటుతర్వాత తాము యెహోవాతో చేసిన నిబంధనను గౌరవించినంత వరకు యెహోవా ఆశీర్వాదాలు ఉంటాయన్న విషయాన్ని వారికి జ్ఞప్తికి తెచ్చివుండాలి.—ద్వితీయోపదేశకాండము 28:1-14.

7. సూచనార్థక బలిపీఠంలో నేడు క్రైస్తవులు ఏ భావాన్ని కనుగొంటారు?

7 అదే విధంగా, నేడు దేవుని ప్రజలు ఒక నిబంధన ద్వారా—మునుపటి దానికన్నా శ్రేష్ఠమైన క్రొత్త నిబంధన ద్వారా ఆశీర్వదించబడ్డారు. (యిర్మీయా 31:31-34) అది కూడా ఎంతోకాలం క్రితం యేసుక్రీస్తు రక్తంద్వారా అమలులోనికి తేబడింది. (హెబ్రీయులు 9:15-20) మనం ఆ నిబంధనలో ఒక పక్షమైన అభిషిక్తుల్లోని సభ్యులం అయినా, లేక ఆ నిబంధననుండి ప్రయోజనం పొందే “వేరే గొఱ్ఱె”ల్లోని సభ్యులం అయినా నేడు ఈ సూచనార్థకమైన బలిపీఠానికి సంబంధించి గొప్ప అర్థం ఉన్నట్లు తెలుసుకుంటాము. అది క్రీస్తు బలియర్పణ సంబంధంగా దేవుని చిత్తాన్ని సూచిస్తుంది. (యోహాను 10:16; హెబ్రీయులు 10:10) సూచనార్థక బలిపీఠం ఆధ్యాత్మిక దేవాలయానికి సరిగ్గా మధ్యన ఉన్నట్లే క్రీస్తు విమోచన క్రయధన బలి స్వచ్ఛారాధనకు కేంద్రమై ఉంది. మన పాపక్షమాపణకు అది ఆధారం, తద్వారా భవిష్యత్తు కొరకైన మన నిరీక్షణలన్నింటికీ అది ఆధారం. (1 యోహాను 2:2) ఆ విధంగా మనం క్రొత్త నిబంధనతోపాటు ఉన్న నియమానికి అంటే “క్రీస్తు నియమము”నకు అనుగుణ్యంగా జీవించడానికి కృషిచేస్తాము. (గలతీయులు 6:2) మనం అలా చేసినంత వరకు జీవం కోసం యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందుతాము.

8. (ఎ) దర్శన దేవాలయంలోని లోపలి ఆవరణములో చాలా ప్రాముఖ్యంగా కనిపించాల్సినది ఏది లేదు? (బి) దర్శన దేవాలయంలోని యాజకులు దేనితో తమను తాము శుభ్రం చేసుకుంటారు?

8 ఆ ప్రయోజనాల్లో ఒకటి యెహోవా ఎదుట నిర్మలమైన స్థానం కలిగివుండడం. గుడారం యొక్క ఆవరణములోను, సొలొమోను దేవాలయంలోను చాలా ప్రాముఖ్యంగా కనిపించేదొకటి ఈ దర్శన దేవాలయంలో లేదు—అది ఒక పెద్ద పాత్ర, అటుతర్వాత అది సముద్రము అని పిలువబడింది; యాజకులు తమను దానిలోని నీటితో కడుగుకునేవారు. (నిర్గమకాండము 30:18-21; 2 దినవృత్తాంతములు 4:2-6) మరి అయితే యెహెజ్కేలు దర్శన దేవాలయంలోని యాజకులు తమను శుభ్రంచేసుకోవడానికి ఏమి ఉపయోగిస్తారు? అందులో సందేహం ఎందుకు, లోపలి ఆవరణములో నుండి ప్రవహిస్తున్న అద్భుతమైన నదీ జలాన్నే! అవును, వారు ఒక పరిశుభ్రమైన లేదా పవిత్రమైన స్థానాన్ని కలిగివుండేలా యెహోవా వారిని ఆశీర్వదిస్తాడు.

9. అభిషిక్తులలోని వారు, గొప్ప సమూహములోని వారు నేడు ఎలా పరిశుభ్రమైన స్థానాన్ని కలిగివుండగలరు?

9 అదే విధంగా, నేడు కూడా అభిషిక్తులు యెహోవా ఎదుట ఒక నిర్మలమైన స్థానాన్ని కలిగివుండేలా ఆశీర్వదించబడ్డారు. యెహోవా వారిని నీతిమంతులని ప్రకటిస్తూ వారిని పవిత్రమైనవారిగా దృష్టిస్తాడు. (రోమీయులు 5:1, 2) యాజకులగోత్రం కాని గోత్రాలచే చిత్రీకరించబడిన “గొప్ప సమూహము” సంగతేమిటి? వారు బయటి ఆవరణములో ఆరాధిస్తున్నారు, దర్శన దేవాలయంలో ఆ ప్రాంతం గుండా కూడా అదే నది ప్రవహిస్తుంది. అందుకనే, ఆధ్యాత్మిక దేవాలయంలోని ఆవరణములో గొప్ప సమూహం శుభ్రమైన తెల్లని వస్త్రములు ధరించుకుని ఆరాధించడాన్ని అపొస్తలుడైన యోహాను చూడడం ఎంత యుక్తము! (ప్రకటన 7:9-14) వారు ఈ తుచ్ఛమైన లోకంలో ఏవిధంగా వ్యవహరించబడినప్పటికీ, వారు క్రీస్తు విమోచన క్రయధన బలియర్పణలో విశ్వాసం ఉంచినంత మేరకు యెహోవా వారిని పరిశుద్ధమైన వారిగా, పవిత్రమైనవారిగా దృష్టిస్తాడన్న నిశ్చయతను వారు కలిగివుండవచ్చు. వారు ఆ విశ్వాసాన్ని ఎలా కలిగివుండగలరు? యేసు అడుగు జాడలను అనుసరించడం ద్వారా, విమోచన క్రయధన బలియర్పణలో పూర్తి నమ్మకం ఉంచడంద్వారా.—1 పేతురు 2:21.

10, 11. సూచనార్థక నీటిలోని ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటి, ఇది ఈ నది చాలా గొప్పగా విస్తృతం కావడానికి ఎలా సంబంధం కల్గివుంది?

10 ముందే పేర్కొన్నట్లుగా, మరొక కీలకమైన అంశం ఈ సూచనార్థక నీటిలో ఉంది—అదే జ్ఞానము. పునఃస్థాపిత ఇశ్రాయేలులో యాజకత్వము ద్వారా అందించిన లేఖనాధార ఉపదేశంతో యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించాడు. (యెహెజ్కేలు 44:23) దానికి సమాంతరముగా, యెహోవా నేడు తన ప్రజల్ని “రాజులైన యాజకసమూహము” ద్వారా తన సత్యవాక్యం గురించిన సరిపడినంత ఉపదేశం ఇచ్చి ఆశీర్వదించాడు. (1 పేతురు 2:9) యెహోవా దేవుని గూర్చిన, మానవజాతి కోసం ఆయన సంకల్పాలను గూర్చిన, మరి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు గూర్చిన ఆయన మెస్సీయా రాజ్యమును గూర్చిన జ్ఞానము ఈ అంత్య దినాల్లో పెరుగుతూపోతున్న నదీ ప్రవాహంలా ప్రవహించింది. ముందుకుసాగే కొలది లోతు పెరుగుతున్న ఈ నీటివెల్లువ మనకు లభించడం, దాని ద్వారా మనకు ఆధ్యాత్మిక సేదదీర్పు లభించడం ఎంత గొప్ప విషయమో కదా!—దానియేలు 12:4.

11 దేవదూత కొలతవేసిన నది క్రమక్రమంగా లోతు పెరుగుతున్నట్లే, ఆనందదాయకమైన మన ఆధ్యాత్మిక దేశంలోనికి వచ్చే ప్రజలను చేర్చుకునేందుకు యెహోవా నుండి వచ్చే జీవదాయక ఆశీర్వాదాల వెల్లువ చాలా ఎక్కువగా పెరిగింది. మరొక పునఃస్థాపనా ప్రవచనం ఇలా చెప్పింది: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెషయా 60:22) ఈ మాటలు వాస్తవమయ్యాయి—స్వచ్ఛారాధనలో మనతోపాటు కలవడానికి లక్షలాదిమంది ప్రవేశించారు! తన పక్షానికి మళ్లే వారందరికీ యెహోవా సమృద్ధియైన “నీళ్లు” అందజేశాడు. (ప్రకటన 22:17) తన భూసంస్థ బైబిళ్లనూ బైబిలు సాహిత్యాన్నీ ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషల్లో పంపిణీచేసేలా యెహోవా నిశ్చయపర్చుకుంటున్నాడు. అదే విధంగా, స్ఫటికంలాంటి స్వచ్ఛమైన సత్యజలాలు అందరికీ అందేలా క్రైస్తవ కూటాలూ సమావేశాలూ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇటువంటి ఏర్పాట్లు ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?

నీరు జీవాన్ని తీసుకొస్తుంది !

12. (ఎ) యెహెజ్కేలు దర్శనంలోని వృక్షాలు అంతగా ఎలా ఉత్పత్తిచేయగల్గుతున్నాయి? (బి) ఫలాలను ఇస్తున్న ఈ వృక్షాలు అంత్యదినాల్లో వేటికి చిత్రీకరణగా ఉన్నాయి?

12 యెహెజ్కేలు దర్శనంలోని నది జీవాన్నీ జవసత్త్వాల్ని ఇస్తుంది. నదీతీరానికి ఇరువైపులా పెరిగే వృక్షాలను గురించి యెహెజ్కేలుకు తెలియజేయబడినప్పుడు ఆయనకు ఇలా చెప్పబడింది: “వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. . . . వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.” ఈ వృక్షాల ఫలాలు, ఆకులు ఇలా ఎందుకు అంత అద్భుతంగా ఉన్నాయి? దానికి కారణం: “ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక.” (యెహెజ్కేలు 47:12) ఈ సూచనార్థకమైన వృక్షాలు, యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా మానవజాతిని పరిపూర్ణతకు తీసుకురావడానికి దేవుడు చేసే ఏర్పాట్లకు ముంగుర్తుగా ఉన్నాయి. ఈ సమయంలో భూమిమీద ఆధ్యాత్మిక పోషణనూ స్వస్థతనూ ఇవ్వడంలో అభిషిక్త శేషం నాయకత్వం వహిస్తుంది. 1,44,000 మందిలో ప్రతి ఒక్కరూ తమ పరలోక బహుమానాన్ని పొందిన తర్వాత, క్రీస్తు సహపరిపాలకులుగా వారి యాజక సేవల నుండి వచ్చే ప్రయోజనాలు భవిష్యత్తులో కూడా—చివరికి ఆదాము మూలంగా వచ్చిన మృత్యువుపై పూర్తి విజయానికి నడిపించేదాకా లభిస్తాయి.—ప్రకటన 5:9, 10, 21:2-4.

13. మన కాలాల్లో ఎటువంటి స్వస్థత సాధించబడింది?

13 దర్శనంలోని నది జీవంలేని మృత సముద్రంలోనికి ప్రవహిస్తూ, అది ప్రవహించిన చోటల్లా స్వస్థతను తెస్తుంది. ఈ సముద్రం ఆధ్యాత్మికంగా మృతమైవున్న వాతావరణాన్ని సూచిస్తుంది. కానీ, “వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల” జీవం వర్ధిల్లుతుంది. (యెహెజ్కేలు 47:9) అదే విధంగా, అంత్యదినాల్లో జీవ జలము ఎక్కడెక్కడికి చొచ్చుకుపోతుందో అక్కడంతా ప్రజలు ఆధ్యాత్మికంగా సజీవులౌతున్నారు. ఆ విధంగా పునరుజ్జీవులైన వారిలో మొదటివారు 1919లోని అభిషిక్త శేషం. వారు మృత స్థితి నుండి అంటే నిష్క్రియా స్థితి నుండి మళ్లీ జీవానికి వచ్చారు. (యెహెజ్కేలు 37:1-14; ప్రకటన 11:3, 7-12) అప్పటినుండి ఈ జీవ జలాలు ఇతర ఆధ్యాత్మిక మృతులను చేరుకున్నాయి, వీరంతా సజీవులై యెహోవాను ప్రేమించి, ఆయనకు సేవచేసే వేరే గొఱ్ఱెల గొప్ప సమూహంగా ఏర్పడ్డారు. త్వరలోనే, ఈ ఏర్పాటు పునరుత్థానులయ్యే అసంఖ్యాకులకు కూడా అందించబడుతుంది.

14. మృత సముద్రతీరంలో వర్ధిల్లిన చేపల పరిశ్రమ, నేడు దేన్ని చక్కగా చిత్రీకరిస్తుంది?

14 ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండడం ఫలాలను ఉత్పత్తి చేయడానికి నడిపిస్తుంది. ఈ విషయం, మునుపు మృతంగా ఉన్న సముద్రం చుట్టూ ఉన్న తీరంలో చేపల పరిశ్రమ వర్ధిల్లడంచే చిత్రీకరించబడింది. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులుగా చేతును.” (మత్తయి 4:19) అంత్యదినాల్లో, అభిషిక్తుల్లోని శేషాన్ని సమకూర్చడంతో ఈ చేపలు పట్టే పని ప్రారంభమయ్యింది, కానీ అదక్కడే ముగిసిపోలేదు. కచ్చితమైన జ్ఞానమనే ఆశీర్వాదమూ, యెహోవా ఆధ్యాత్మిక దేవాలయం నుండి ప్రవహిస్తున్న జీవదాయక జలమూ జనాంగాల్లోని ప్రజలందరినీ ప్రభావితం చేస్తున్నాయి. ఆ నది ప్రవహించిన చోటల్లా ఆధ్యాత్మిక జీవం ఉద్భవించింది.

15. జీవం కొరకైన దేవుని ఏర్పాట్లను ప్రతి ఒక్కరూ స్వీకరించరు అన్నది ఏది చూపిస్తుంది, అటువంటివారికి చివరికి కలిగే పర్యవసానం ఏమిటి?

15 నిజమే ఇప్పుడు జీవ సందేశానికి అందరూ ప్రతిస్పందించరు; అటు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో పునరుత్థానమయ్యే వారిలో కూడా అందరూ ప్రతిస్పందించరు. (యెషయా 65:20; ప్రకటన 21:8) మృత సముద్రంలోని కొన్ని భాగాలు స్వస్థతనొందవని దేవదూత వెల్లడిస్తుంది. ఈ బురద స్థలములు, ఊబిస్థలములు ‘ఉప్పుగలవై ఉంటాయి.’ (యెహెజ్కేలు 47:11) యెహోవా నుండి వచ్చే జీవదాయకమైన జలాలు అందించబడినా మన దినాల్లో కొంతమంది ప్రజలు వాటిని స్వీకరించరు. (యెషయా 6:10) అర్మగిద్దోనులో ఆధ్యాత్మికంగా నిర్జీవంగా రోగగ్రస్థమైన స్థితిలో ఉండడానికే నిశ్చయించుకున్న వారందరూ ఉప్పుగలవారై ఉండి—నిత్య నాశనానికి గురౌతారు. (ప్రకటన19:11-21) అయితే, ఈ జలాల్ని నమ్మకంగా త్రాగుతూ ఉన్నవారు అర్మగిద్దోను తప్పించుకుని ఈ ప్రవచన చివరి నెరవేర్పును అనుభవించే నిరీక్షణ కలిగివుంటారు.

ఈ నది పరదైసులో ప్రవహిస్తుంది

16. యెహెజ్కేలు దేవాలయ దర్శనానికి చివరి నెరవేర్పు ఎప్పుడు ఎలా జరుగుతుంది?

16 ఇతర పునఃస్థాపనా ప్రవచనాల వలెనే యెహెజ్కేలు దేవాలయ దర్శనం వెయ్యేండ్ల కాలంలో చివరి నెరవేర్పును కలిగివుంది. అప్పుడు యాజక వర్గం ఇక ఈ భూమ్మీద ఉండదు. “వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు [పరలోకములో] రాజ్యము చేయుదురు.” (ప్రకటన 20:6) ఈ పరలోక యాజకులు క్రీస్తు విమోచన క్రయధన బలియర్పణ యొక్క పూర్తి ప్రయోజనాలను అన్వయించడంలో క్రీస్తుతోపాటు పనిచేస్తారు. ఆ విధంగా, నీతియుక్తమైన మానవజాతి రక్షించబడుతుంది, పరిపూర్ణతకు పునరుద్ధరించబడుతుంది !—యోహాను 3:17.

17, 18. (ఎ) ప్రకటన 22:1, 2లో జీవదాయక నది గురించి ఎలా వర్ణించబడింది, ఆ దర్శనం యొక్క ప్రాధమిక నెరవేర్పు జరిగే కాలం ఏది? (బి) పరదైసులో జీవజలముల నది ఎలా గొప్పగా విస్తరిస్తుంది?

17 ఒక్క మాటలో చెప్పాలంటే, యెహెజ్కేలు చూసిన నదిలో అప్పుడు పూర్తి జీవశక్తిగల నీరు ప్రవహిస్తుంటుంది. ప్రకటన 22:1, 2లో ఉన్న ప్రవచనం నెరవేరడానికి సరియైన సమయం ఇదే: “స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.”

18 వెయ్యేండ్ల కాలంలో వ్యాధులన్నీ—శారీరక, మానసిక, భావోద్వేగ వ్యాధులన్నీ స్వస్థపర్చబడతాయి. ఇది “జనములను స్వస్థపరచుటకై” ఉన్న ఆ సూచనార్థకమైన వృక్షములచే చక్కగా చిత్రీకరించబడింది. క్రీస్తు, 1,44,000 మంది కలిసి అమలుచేసిన ఏర్పాట్ల నిమిత్తమై మనం కృతజ్ఞులమై ఉండగలము, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు.” (యెషయా 33:24) అటు తర్వాత ఆ నది అతి గొప్పగా విస్తరిస్తుంది. స్వచ్ఛమైన ఈ జీవ జలాన్ని త్రాగే పునరుత్థానం కాబోయే లక్షలాదిమందిని—బహుశ కోట్లాదిమందిని—కూడా చేర్చుకోవడానికిగాను అది మరింత విస్తారమై, మరింత లోతుకావాలి. దర్శనంలోని నది తాను ప్రవహించిన చోటికల్లా జీవాన్ని తీసుకువస్తూ మృత సముద్రాన్ని స్వస్థపర్చింది. పరదైసులో, స్త్రీపురుషులు వారికి అందించబడిన విమోచన క్రయధన ప్రయోజనాల్లో విశ్వాసం ఉంచినట్లైతే ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన మరణం నుండి స్వస్థతను పొంది పూర్తి భావంలో జీవానికి వస్తారు. ఆ దినాల్లో పునరుత్థానులైన మృతులు ప్రయోజనం పొందేలా అధిక అవగాహనను అందిస్తూ “గ్రంథములు” విప్పబడతాయని ప్రకటన 20:12 చెబుతుంది. విషాదకరంగా, కొంతమంది పరదైసులో కూడా స్వస్థత పొందడానికి నిరాకరిస్తారు. ఈ తిరుగుబాటుదారులు ‘ఉప్పుగలవారై’ నిత్యనాశనానికి గురౌతారు.—ప్రకటన 20:15.

19. (ఎ) పరదైసులో భూమిని కేటాయించడం ఎలా నెరవేరుతుంది? (బి) పరదైసులోని ఏ అంశం పట్టణం ద్వారా చిత్రీకరించబడింది? (సి) దేవాలయానికి కొంత దూరంలో పట్టణం ఉండడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

19 ఆ సమయంలో యెహెజ్కేలు దర్శనంలోని దేశాన్ని విభజించడం చివరి నెరవేర్పును కలిగివుంటుంది. యెహెజ్కేలు, దేశం సరియైన రీతిలో కేటాయించబడడాన్ని చూశాడు; అదే విధంగా, నమ్మకస్థుడైన ప్రతి క్రైస్తవుడు పరదైసులో తనకు స్థానం ఉంటుందనీ ఒక స్వాస్థ్యము ఉంటుందనీ నిశ్చయతను కలిగివుండవచ్చు. ఉండడానికి స్వంత ఇల్లు కావాలనే కోరిక బహుశ క్రమమైన పద్ధతిలో నెరవేర్చబడుతుంది. (యెషయా 65:21; 1 కొరింథీయులు 14:33) యెహెజ్కేలు చూసిన పట్టణం, యుక్తమైన రీతిలోనే క్రొత్త భూమి కోసం యెహోవా సంకల్పించిన కార్యనిర్వహణ యంత్రాంగాన్ని చిత్రీకరిస్తుంది. అభిషిక్త యాజకవర్గం ఇక ఎంతమాత్రం మానవజాతి మధ్య నివసించదు. ఈ విషయాన్ని, దేవాలయం నుండి పట్టణము కాస్త దూరంగా “అపవిత్రమైన” ప్రదేశంలో ఉన్నట్లు చిత్రీకరించడం ద్వారా దర్శనమే సూచిస్తుంది. (యెహెజ్కేలు 48:15, NW) 1,44,000 మంది క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలిస్తుండగా, ఆ రాజుకి భూమ్మీద ప్రతినిధులు లేకుండాపోరు. ఆయన క్రింద ఉన్న మానవులు, అధిపతి తరగతి అందించే ప్రేమపూర్వకమైన నడిపింపు నుండీ, నిర్దేశం నుండీ చాలా ప్రయోజనం పొందుతారు. అయితే, అసలు ప్రభుత్వం భూమ్మీద ఉండదు గానీ పరలోకంలో ఉంటుంది. భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరు, అధిపతి తరగతితో సహా, మెస్సీయా రాజ్యాధికారం క్రింద ఉంటుంది.—దానియేలు 2:44; 7:14, 18, 22.

20, 21. (ఎ) పట్టణానికి గల పేరు ఎందుకు యుక్తమైనది? (బి) యెహెజ్కేలు దర్శనాన్ని గూర్చిన అవగాహన మనల్ని మనం ఏ ప్రశ్నలు వేసుకునేందుకు నడిపించాలి?

20 యెహెజ్కేలు ప్రవచనంలోని చివరి మాటలను గమనించండి: “యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.” (యెహెజ్కేలు 48:35) కొంతమందికి అధికారాన్ని గాని లేదా ప్రతిష్ఠను గాని ఇవ్వడానికి కాదు ఆ పట్టణం ఉన్నది; లేక ఎవరో మానవుడి చిత్తాన్ని నెరవేర్చడానికీ కాదు ఆ పట్టణం ఉన్నది. అది యెహోవా పట్టణం, ఎల్లప్పుడూ ఆయన మనస్సునూ ఆయన ప్రేమపూర్వకమైన సహేతుకమైన విధానాల్నీ ప్రతిబింబిస్తుంది. (యాకోబు 3:17) యెహోవా తన వ్యవస్థీకృత “క్రొత్త భూమి” అనే మానవ సమాజాన్ని నిత్య భవిష్యత్తునిచ్చి ఆశీర్వదిస్తాడన్న సంతోషకరమైన నిశ్చయతను అది మనకు ఇస్తుంది.—2 పేతు. 3:13.

21 మన ముందున్న ఆ ఉత్తరాపేక్షను బట్టి మనం ఉల్లసించమా? మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘యెహెజ్కేలు దర్శనంలో వెల్లడిపర్చబడిన అద్భుతమైన ఆశీర్వాదాలకు నేను ఎలా ప్రతిస్పందిస్తాను? ప్రేమపూర్వకమైన పైవిచారణకర్తలు చేసే పనికి నేను నమ్మకంగా మద్దతును ఇస్తానా, అభిషిక్త శేషానికీ, అధిపతి తరగతిలో భావి సభ్యులకూ మద్దతునిస్తానా? నేను స్వచ్ఛారాధనను నా జీవితానికే కేంద్రంగా చేసుకున్నానా? నేడు ఇంత సమృద్ధిగా ప్రవహిస్తున్న జీవ జలం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నానా?’ మనలో ప్రతి ఒక్కరం అలా చేస్తూ యెహోవా చేసిన ఏర్పాట్లలో నిరంతరమూ ఆనందించుదము గాక !

[అధస్సూచీలు]

a ఈ లోయ బహుశ కిద్రోను లోయ అయివుండవచ్చు, ఇది యెరూషలేము నుండి ఆగ్నేయ దిశగా విస్తరిస్తూ మృత సముద్రంలో అంతమౌతుంది. ఎక్కువగా ఈ లోయ చివరివైపు సంవత్సరం అంతా ఎండిపోయివుంటుంది.

b కావలికోట మే 1, 1881 (ఆంగ్లం) మరియు జూన్‌ 1, 1981 (ఆంగ్లం) సంచికలు చూడండి.

మీరు జవాబెలా ఇస్తారు?

◻ దేవాలయం నుండి ప్రవహిస్తున్న నీరు దేన్ని చిత్రీకరిస్తుంది?

◻ సూచనార్థక నది ద్వారా యెహోవా ఎటువంటి స్వస్థతను సాధ్యపర్చాడు, నది ఎందుకు పెరుగుతూ పోయింది?

◻ నదీతీరంలోని వృక్షాలు దేన్ని చిత్రీకరిస్తున్నాయి?

◻ వెయ్యేండ్ల పరిపాలనలో పట్టణం దేన్ని చిత్రీకరిస్తుంది, పట్టణానికి గల పేరు ఎందుకు యుక్తమైనది?

[23వ పేజీలోని చిత్రాలు]

జీవజలముల నది రక్షణ కొరకైన దేవుని ఏర్పాటును సూచిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి