కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/1 పేజీలు 13-18
  • నేడు “దేవాలయము” మరియు “అధిపతి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేడు “దేవాలయము” మరియు “అధిపతి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవాలయము మరియు మీరు
  • నమ్మకమైన ఒక యాజక సమూహము
  • అధిపతి—ఎవరాయన?
  • నేడు దేవుని ప్రజల దేశము
  • దేవుని దేవాలయంపై ‘మీ మనస్సు నిలుపుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—II
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మన “దేశము”పైన యెహోవా ఆశీర్వాదము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పరిచర్య చేయడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/1 పేజీలు 13-18

నేడు “దేవాలయము” మరియు “అధిపతి”

“అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.”—యెహెజ్కేలు 46:10.

1, 2. యెహెజ్కేలు దేవాలయ దర్శనంలోని అర్థాన్ని ఛేదించడానికి ఏ కీలకమైన సత్యం మనకు సహాయం చేస్తుంది?

ప్రాచీన కాలంలోని కొంతమంది రబ్బీలు, యెహెజ్కేలు పుస్తకం విషయమై పూర్తిగా మనశ్శాంతితో ఉండలేకపోయారు. టాల్ముడ్‌ ప్రకారం, వారిలో కొంతమంది చివరికి పరిశుద్ధ లేఖనాల ప్రామాణిక పట్టికనుండి దాన్ని తొలగించాలని కూడా అనుకున్నారు. వారు ప్రాముఖ్యంగా దేవాలయ దర్శనం విషయంలో చాలా కష్టాన్ని అనుభవించారు, దాన్ని మానవ గ్రహింపుకు మించినదని ప్రకటించేశారు. యెహోవా దేవాలయాన్ని గూర్చిన యెహెజ్కేలు దర్శనం ఇతర బైబిలు పండితుల్ని గలిబిలికి గురిచేసింది. మన సంగతేమిటి?

2 స్వచ్ఛారాధన పునఃస్థాపించబడినప్పటి నుండి యెహోవా తన ప్రజలకు ఆధ్యాత్మిక అంతర్దృష్టితో కూడిన అనేకమైన వెలుగులను అందజేశాడు. దేవుని ఆధ్యాత్మిక దేవాలయం ఏమిటన్నది గ్రహించగల్గే ఆశీర్వాదం అందులో ఒకటి—అది స్వచ్ఛారాధన కొరకై యెహోవా చేసిన దేవాలయంవంటి ఏర్పాటు.a కీలకమైన ఈ సత్యం యెహెజ్కేలు దేవాలయ దర్శనానికి అర్థం ఏమిటో చాలామట్టుకు ఛేదించడానికి సహాయం చేస్తుంది. ఈ దర్శనంలోని నాలుగు అంశాలను మనం మరింత లోతుగా పరిశీలిద్దాము—దేవాలయము, యాజకత్వము, అధిపతి, దేశము. నేడు వీటికి ఎటువంటి భావం ఉంది?

దేవాలయము మరియు మీరు

3. ఎత్తైన పైకప్పు నుండీ, దేవాలయ ప్రవేశద్వారాల్లోపలి గోడలమీద ఉన్న చెక్కుడు పని నుండీ మనం ఏమి నేర్చుకుంటాము?

3 మనం ఈ దర్శన దేవాలయంలో పర్యటిస్తున్నట్లు ఊహించండి. ఈ పెద్ద గుమ్మపు ద్వారాల్లో ఒకదానికి నడిపించే ఏడు మెట్లను సమీపించి వాటిని ఎక్కుదాము. ఈ ద్వారము లోపలికి ప్రవేశించి పైకి చూసి అబ్బురపడతాము. పైకప్పు 30 మీటర్లకన్నా ఎక్కువ ఎత్తున ఉంది ! దీని ద్వారా, స్వచ్ఛారాధన కోసం యెహోవా ఏర్పరచిన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవని మనకు జ్ఞప్తిచేయబడుతుంది. సన్నగా నిలువుగా ఉన్న కిటికీల్లోనుండి వచ్చే వెలుతురు గోడలమీద చెక్కివున్న ఖర్జూరపు చెట్లను ప్రకాశవంతం చేస్తుంది—లేఖనాలు ఖర్జూరపు చెట్లను నీతికి చిహ్నంగా చెబుతున్నాయి. (కీర్తన 92:12; యెహెజ్కేలు 40:14, 16, 22) ఈ పవిత్ర స్థలం నైతికంగా ఆధ్యాత్మికంగా నీతిగల వారికి మాత్రమే చెందినది. దానికి అనుగుణ్యంగా మన ఆరాధన యెహోవాకు అంగీకారయోగ్యంగా ఉండేలా మనం కూడా నీతిగా ఉండడానికి ప్రయాసపడాలి.—కీర్తన 11:7.

4. దేవాలయంలోనికి ఎవరికి ప్రవేశార్హత ఉండదు, ఇది మనకు ఏమి బోధిస్తుంది?

4 నడవాకి కుడివైపున మూడు ఎడమవైపున మూడు కావలిగదులున్నాయి. కావలివారు మనల్ని లోపలికి అనుమతిస్తారా? ‘హృదయమందు సున్నతిలేని’ విదేశీయులు ప్రవేశింపరాదని యెహోవా యెహెజ్కేలుకు చెబుతున్నాడు. (యెహెజ్కేలు 40:10; 44:9) దానర్థం ఏమిటి? తన నియమాలను ప్రేమించి, వాటి ప్రకారం జీవించేవారిని మాత్రమే దేవుడు తన ఆరాధకులుగా అంగీకరిస్తాడు. (యిర్మీయా 4:4; రోమీయులు 2:29) అటువంటివారిని ఆయన తన ఆధ్యాత్మిక గుడారములోనికి—తన ఆరాధనా మందిరంలోనికి ఆహ్వానిస్తాడు. (కీర్తన 15:1-5) స్వచ్ఛారాధన 1919లో పునఃస్థాపించబడినది మొదలుకొని యెహోవా యొక్క భూసంస్థ ఆయన నైతిక విధులను ఉన్నతపర్చి క్రమక్రమంగా వాటిని స్పష్టంచేసింది. వాటికి విధేయత చూపడానికి ఉద్దేశపూర్వకంగా నిరాకరించినవారు ఇక ఎంతమాత్రం ఆయన ప్రజలతో సహవసించడానికి అనుమతించబడలేదు. పశ్చాత్తాపం చూపని తప్పిదస్థులను బహిష్కరించడం అనే బైబిలు ఆధారిత ఆచారం, నేడు మన ఆరాధనను స్వచ్ఛంగాను పవిత్రంగాను ఉంచడానికి సహాయం చేసింది.—1 కొరింథీయులు 5:13.

5. (ఎ) యెహెజ్కేలు దర్శనంలోనూ, ప్రకటన 7:9-15లో నమోదు చేయబడిన యోహాను దర్శనంలోనూ ఎటువంటి పోలికలు ఉన్నాయి? (బి) యెహెజ్కేలు దర్శనంలో, బయటి ఆవరణములో ఆరాధిస్తున్న 12 గోత్రాలు ఎవరిని సూచిస్తున్నాయి?

5 నడవాలో ఆ చివరికి నడిస్తే బయటి ఆవరణము వస్తుంది, అక్కడ ప్రజలు యెహోవాను ఆరాధిస్తూ ఆయనకు స్తుతులు చెల్లిస్తారు. ఇది, యెహోవాకు “రాత్రింబగళ్లు ఆయన ఆలయములో” సేవచేస్తున్న “వేరే గొఱ్ఱెల” “గొప్ప సమూహము”ను గూర్చిన అపొస్తలుడైన యోహాను దర్శనాన్ని మనకు గుర్తుకు తెస్తుంది. రెండు దర్శనాల్లోనూ ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. యెహెజ్కేలు దర్శనంలో అవి గుమ్మపు ద్వారములోని గోడలపై అలంకారంగా ఉన్నాయి. యోహాను దర్శనంలోని ఆరాధకుల చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, ఇది యెహోవాను స్తుతించడంలోను, యేసును తమ రాజుగా ఆహ్వానించడంలోను తాము అనుభవిస్తున్న ఆనందానికి సూచనగా ఉంది. (ప్రకటన 7:9-15) యెహెజ్కేలు దర్శనపరంగా చూస్తే, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు “వేరే గొఱ్ఱెల”ను సూచిస్తాయి. (యోహాను 10:16; పోల్చండి లూకా 22:28-30.) యెహోవా రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా ఆయనను స్తుతిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్న వారిలో మీరూ ఉన్నారా?

6. బయటి ఆవరణములో ఉన్న భోజనశాలల ఉద్దేశమేమిటి, వేరే గొఱ్ఱెలకు చెందినవారికి ఇది ఏ ఆధిక్యతను గురించి జ్ఞప్తికి తెస్తుంది?

6 మనం బయటి ఆవరణములో పర్యటిస్తుండగా, 30 భోజనశాలల్లో ప్రజలు తమ స్వచ్ఛంద అర్పణలను భుజిస్తుండడాన్ని చూస్తాము. (యెహెజ్కేలు 40:17) నేడు, వేరే గొఱ్ఱెల్లోనివారు జంతుబలులను అర్పించరు. అయితే, వారు ఆధ్యాత్మిక దేవాలయానికి వట్టి చేతులతో రారు. (పోల్చండి నిర్గమకాండము 23:15.) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “[యేసు]ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:15, 16; హోషేయ 14:2) యెహోవాకు అటువంటి యాగములు అర్పించగల్గడం గొప్ప ఆధిక్యత.—సామెతలు 3:9, 27.

7. దేవాలయాన్ని కొలత వేయడం మనకు ఏ నిశ్చయతను ఇస్తుంది?

7 ఒక దేవదూత ఈ దర్శన దేవాలయాన్ని కొలత వేస్తుండగా యెహెజ్కేలు గమనిస్తూవున్నాడు. (యెహెజ్కేలు 40:3) అలాగే, ఆపొస్తలుడైన యోహానుకు ఇలా చెప్పబడింది: “నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.” (ప్రకటన 11:1) ఈ కొలతవేయడానికి అర్థం ఏమిటి? రెండు సందర్భాల్లోనూ ఇలా కొలతవేయడం, స్వచ్ఛారాధన సంబంధంగా తన సంకల్పాలను నెరవేర్చడం నుండి యెహోవాను ఏదీ ఆపలేదనడానికి ఒక సూచనగా ఒక గ్యారెంటీగా ఉంది. నేడు కూడా అదే విధంగా, ఏదీ—చివరికి శక్తిమంతమైన ప్రభుత్వాలనుండి వచ్చే భయంకరమైన వ్యతిరేకత కూడా—స్వచ్ఛారాధన పునఃస్థాపించబడడాన్ని ఆపలేదని మనం నిశ్చయత కలిగివుండగలము.

8. లోపలి ఆవరణములోనికి నడిపించే గుమ్మపు ద్వారాల్లోనికి ఎవరు ప్రవేశిస్తారు, ఈ ద్వారాలు మనకు ఏమి జ్ఞప్తికి తెస్తాయి?

8 మనం బయటి ఆవరణము గుండా నడుస్తుండగా లోపలి ఆవరణములోనికి నడిపించే మూడు గుమ్మపు ద్వారాలను మనం చూడగల్గుతాము; లోపలి గుమ్మపు ద్వారాలు వెలుపటి గుమ్మపు ద్వారాలున్న వరుసలోనే ఉన్నాయి, అంతే పరిమాణంలో ఉన్నాయి. (యెహెజ్కేలు 40:6, 20, 23, 24, 27) కేవలం యాజకులు మాత్రమే లోపలి ఆవరణములోనికి ప్రవేశించవచ్చు. లోపలి ద్వారాలు ప్రాముఖ్యంగా అభిషిక్తులు దైవిక ప్రమాణాలకూ, నియమాలకూ తగ్గట్లుగా జీవించాలని మనకు గుర్తుచేస్తున్నాయన్నది నిజమే, కానీ అవే నియమాలూ ప్రమాణాలు నిజక్రైస్తవులందరినీ నడిపిస్తాయి. కానీ యాజకుల పని ఏమిటి, దానికి నేడు ఎటువంటి అర్థం ఉంది?

నమ్మకమైన ఒక యాజక సమూహము

9, 10. యెహెజ్కేలు దర్శనంలోని యాజక తరగతిచే చిత్రీకరించబడిన “రాజులైన యాజక సమూహము” ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఎలా అందించింది?

9 క్రైస్తవ కాలానికి ముందు యాజకులు దేవాలయంలో కష్టమైన పని చేసేవారు. బలి అర్పించాల్సిన జంతువులను వధించడం, వాటిని బలిపీఠంపైన అర్పించడం, తోటి యాజకులకూ ప్రజలకూ వడ్డించడం ఇదంతా శారీరక కష్టంతో కూడిన పని. కానీ వారికి వేరే ప్రాముఖ్యమైన పని ఉంది. యెహోవా యాజకుల సంబంధంగా ఇలా ఆజ్ఞాపించాడు: “ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు [నేర్పవలెను].”—యెహెజ్కేలు 44:23; మలాకీ 2:7.

10 “రాజులైన యాజక సమూహము” అయిన అభిషిక్తులు ఒక సమూహముగా స్వచ్ఛారాధన పక్షంగా చేసే కష్టమైన పని విషయమై, వాళ్ళు వినయంతో చేసే సేవ విషయమై మీరు మెప్పుదలను కలిగివున్నారా? (1 పేతురు 2:9) ప్రాచీన కాలంలోని లేవీ యాజక సమూహము వలెనే, వారు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వడంలో నాయకత్వం వహించారు. దేవుని దృష్టిలో ఏది పవిత్రమైనదో ఏది కాదో, ఏది అంగీకారయోగ్యమైనదో ఏది కాదో ప్రజలు అర్థంచేసుకోవడానికి సహాయం చేయడంలో నాయకత్వాన్ని వహించారు. (మత్తయి 24:45) బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా, క్రైస్తవ కూటాలూ సమావేశాల ద్వారా వస్తున్న అటువంటి ఉపదేశం, దేవునితో సమాధానపడడానికి లక్షలాదిమందికి సహాయం చేసింది.—2 కొరింథీయులు 5:20.

11. (ఎ) యాజకుల పక్షంగా పరిశుభ్రంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను యెహెజ్కేలు దర్శనం ఎలా నొక్కిచెబుతుంది? (బి) అంత్యదినాల్లో అభిషిక్తులు ఏ ఆధ్యాత్మిక భావంలో పరిశుభ్రపర్చబడ్డారు?

11 అయితే, యాజకులు పవిత్రంగా ఉండమని ఇతరులకు బోధించడం మాత్రమే కాదు చేయవల్సింది; వారు తాముగా పవిత్రంగా ఉండాలి. అందుకనే ఇశ్రాయేలు యాజకవర్గంలో ఒక శుద్ధీకరణ ప్రక్రియ జరుగుతుందని యెహెజ్కేలు ముందే చూశాడు. (యెహెజ్కేలు 44:10-16) అదే విధంగా, 1918లో యెహోవా అభిషిక్త యాజకవర్గాన్ని పరిశీలిస్తూ ‘శోధించువాడుగా’ తన ఆధ్యాత్మిక దేవాలయంలో కూర్చున్నాడని చరిత్ర చూపిస్తోంది. (మలాకీ 3:1-5) ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉన్నారని కనుగొనబడినవారు, మునుపటి విగ్రహారాధన విషయమై పశ్చాత్తాప పడినవారు ఆయన ఆధ్యాత్మిక దేవాలయంలో సేవ చేసే ఆధిక్యతలో కొనసాగేందుకు అనుమతించబడ్డారు. అయినప్పటికీ, అందరికిలాగానే అభిషిక్తులు గుంపుగా కాకపోయినా ఒక్కొక్కరుగా ఆధ్యాత్మికంగా అయినా లేదా నైతికంగా అయినా అపవిత్రం అయ్యే అవకాశం ఉంది. (యెహెజ్కేలు 44:22, 25-27) ‘ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవడానికి’ వారు చాలా శ్రమించవలసి ఉంది.—యాకోబు 1:27; పోల్చండి మార్కు 7:20-23.

12. అభిషిక్తులు చేసే పనిపట్ల మనం ఎందుకు మెప్పుదల చూపించాలి?

12 మనలో ప్రతి ఒక్కరమూ ఇలా ప్రశ్నించుకోవాలి: ‘అభిషిక్తులు సంవత్సరాల తరబడి నమ్మకంగా సేవ చేస్తూ ఉంచిన మాదిరిపట్ల మెప్పుదలను కలిగివున్నానా? వారి విశ్వాసాన్ని నేను అనుకరిస్తున్నానా?’ అభిషిక్తులు తమతోపాటు ఈ భూమి మీద ఎల్లప్పుడూ ఉండరన్న విషయం గొప్ప సమూహం గుర్తుంచుకోవడం మంచిది. యెహెజ్కేలు దర్శనంలోని యాజకుల గురించి యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులలో వారికెంతమాత్రమును [భూ] స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము.” (యెహెజ్కేలు 44:28) అదే విధంగా, అభిషిక్తులకు నిరంతరం ఉండడానికి భూమ్మీద ఎటువంటి స్థలమూ లేదు. వారికి పరలోక స్వాస్థ్యము ఉంది, వారు ఇంకా భూమి మీద ఉండగా వారికి మద్దతునివ్వడమూ, వారిని ప్రోత్సహించడమూ ఒక గొప్ప ఆధిక్యత అని గొప్ప సమూహం దృష్టిస్తుంది.—మత్తయి 25:34-40; 1 పేతురు 1:3, 4.

అధిపతి—ఎవరాయన?

13, 14. (ఎ) అధిపతి వేరే గొఱ్ఱెలకు చెందినవాడే ఎందుకు అయివుండాలి? (బి) అధిపతి ఎవరికి చిత్రీకరణగా ఉన్నాడు?

13 ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న ఎదురౌతుంది. అధిపతి ఎవరిని సూచిస్తున్నాడు? ఆయన గురించి ఇటు ఒక వ్యక్తిగాను అటు ఒక గుంపుగాను చెప్పబడింది గనుక, ఆయన పురుషులతో కూడిన ఒక తరగతిని సూచిస్తున్నాడని మనం భావించవచ్చు. (యెహెజ్కేలు 44:3; 45:8, 9) కానీ ఏ తరగతిని? అభిషిక్తుల గుంపును మాత్రం కాదు. దర్శనంలో ఆయన యాజకవర్గంతో చాలా సన్నిహితంగా పనిచేశాడు కానీ ఆయన వారిలో ఒకడు కాదు. యాజకవర్గం విషయంలోలా కాక ఆయనకు భూస్వాస్థ్యం ఇవ్వబడింది, గనుక ఆయన భవిష్యత్తు పరలోకంలో కాదు గాని ఇక్కడే భూమిపైనే ఉంది. (యెహెజ్కేలు 48:21) అంతేగాక, యెహెజ్కేలు 46:10 ఇలా చెబుతుంది: “అధిపతి వారితో [యాజక గోత్రం కాని గోత్రాలవారితో] కలిసి ప్రవేశింపగా [దేవాలయంలోని బయటి ఆవరణములోనికి] వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.” ఆయన లోపలి ఆవరణములోనికి ప్రవేశించడు కానీ బయటి ఆవరణములోనే ఉండి ఆరాధిస్తాడు, ప్రజలతోపాటు దేవాలయంలోనికి వెళ్తూ వస్తూ ఉంటాడు. ఈ కారణాలన్నీ అధిపతి వేరే గొఱ్ఱెలైన గొప్ప సమూహంలోనే ఉండాలని నిర్ద్వందంగా తెలియజేస్తున్నాయి.

14 స్పష్టంగా, అధిపతికి దేవుని ప్రజలమధ్య కొంత బాధ్యతాయుతమైన స్థానం ఉంది. ఆయన బయటి ఆవరణములో తూర్పు గుమ్మపు ద్వారములోని మంటపమువద్ద కూర్చుంటాడు. (యెహెజ్కేలు 44:2, 3) ఇశ్రాయేలులో నగరపు గవినివద్ద కూర్చుని తీర్పును తీర్చే పెద్దల వలెనే ఆయనకు పైవిచారణ చేసే స్థానం ఉంటుందని ఇది సూచిస్తుంది. (రూతు 4:1-12; సామెతలు 22:22) నేడు వేరే గొఱ్ఱెలలో పైవిచారణ చేసే స్థానం ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మచే నియమించబడిన భూ నిరీక్షణగల పైవిచారణకర్తలకు. (అపొస్తలుల కార్యములు 20:28) అలా, ఈ అధిపతి వర్గం, అటుతర్వాత నూతన లోకంలో కార్యనిర్వాహక హోదాలో సేవచేసేందుకు ఇప్పుడు సిద్ధపర్చబడుతుంది.

15. (ఎ) గొప్ప సమూహంలోని పెద్దలకు అభిషిక్త యాజక తరగతిలోని పెద్దలకు మధ్య ఉన్న సంబంధంపై యెహెజ్కేలు దర్శనం ఎలా వెలుగును ప్రసరింపజేస్తుంది? (బి) దేవుని భూ సంస్థలో అభిషిక్త పెద్దలు ఎలాంటి నడిపింపును తీసుకున్నారు?

15 అయితే నేడు ఇటు అభిషిక్త యాజక వర్గానికీ, అటు గొప్ప సమూహంలోని భాగమైవుంటూ పైవిచారణా స్థానాల్లో సేవచేస్తున్న పెద్దలకూ ఏమి సంబంధం ఉంది? అభిషిక్తులు ఆధ్యాత్మిక నాయకత్వం వహిస్తుండగా, పెద్దలుగా ఉన్న గొప్ప సమూహంలోని సభ్యులు ఆ అభిషిక్తుల క్రింద పనిచేస్తూ మద్దతునిస్తూ ఉండే పాత్రను కలిగివున్నారని యెహెజ్కేలు దర్శనం సూచిస్తుంది. అదెలా? ఆధ్యాత్మిక విషయాల్లో ప్రజలకు ఉపదేశాన్నిచ్చే బాధ్యత దర్శనంలోని యాజకులకు ఇవ్వబడిందని గుర్తుంచుకోండి. చట్టపరమైన వివాదాల్లో న్యాయాన్ని చెప్పేవారిగా ఉండాలని కూడా వారికి చెప్పబడింది. దానికితోడు, లేవీయులకు దేవాలయ గుమ్మపు ద్వారాలవద్ద “పైవిచారణ హోదాలు” ఇవ్వబడ్డాయి. (యెహెజ్కేలు 44:11, 23, 24, NW) ఇందునుబట్టి స్పష్టమౌతున్న విషయం ఏమిటంటే, యాజకులు నిర్వర్తించే ఆధ్యాత్మిక సేవలకూ వారి ఆధ్యాత్మిక నాయకత్వానికీ అధిపతి విధేయత చూపాలి. అందుకనే ఆధునిక కాలాల్లో అభిషిక్తులు స్వచ్ఛారాధనలో నాయకత్వాన్ని తీసుకున్నారన్నది యుక్తమే. ఉదాహరణకు, యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సభ్యులు వారిలో నుండే ఎంపిక చేయబడ్డారు. అటువంటి నమ్మకస్థులైన అభిషిక్త పెద్దలు, అభివృద్ధి చెందుతున్న అధిపతి తరగతికి దశాబ్దాలుగా శిక్షణనిస్తున్నారు, ఈ తరగతిలో భావి సభ్యులుగా ఉండబోయే వీరిని, రాబోయే దేవుని నూతన లోకంలో పూర్తి అధికారం అప్పగించబడే రోజు కోసం సిద్ధపరుస్తున్నారు.

16. యెషయా 32:1, 2 ప్రకారం పెద్దలందరూ ఎలా పనిచేయాలి?

16 అధిపతి తరగతిగా మరిన్ని బాధ్యతలు చేపట్టబోయే ఈ భావి సభ్యులు ఎటువంటి పైవిచారణకర్తలుగా ఉన్నారు? యెషయా 32:1, 2లోని ప్రవచనం ఇలా చెబుతుంది: “ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును. అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటువలెను, గాలివానకు చాటైనచోటు వలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” ఇటు అభిషిక్తుల గుంపుకు చెందిన, అటు వేరే గొఱ్ఱెల గుంపుకు చెందిన క్రైస్తవ పెద్దలు హింసలు, నిరుత్సాహం వంటి ‘గాలివానల్లో’ నుండి మందను కాపాడడానికి కృషిచేస్తుండగా ఈ ప్రవచనం నెరవేరుతోంది.

17. క్రైస్తవ కాపరులు తమను తాము ఎలా దృష్టించుకోవాలి, వారిని మంద ఎలా దృష్టించాలి?

17 హెబ్రీలో దాదాపు ఒకే అర్థం ఉన్న “అధిపతి,” “ప్రధాని” అనే పదాలు మనుష్యులను ఆకాశానికెత్తే బిరుదులుగా ఉపయోగించబడలేదు. దానికి బదులుగా, దేవుని గొఱ్ఱెలను సంరక్షించడంలో ఈ పురుషులు వహించే బాధ్యతను ఆ పదాలు వివరిస్తాయి. యెహోవా ఇలా ఖండితంగా హెచ్చరిస్తున్నాడు: “ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. ఆలాగు చేయుటమాని . . . నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి.” (యెహెజ్కేలు 45:9) అటువంటి సలహాను తమ హృదయాల్లోనికి తీసుకోవడం నేడు పెద్దలందరికీ మేలు చేస్తుంది. (1 పేతురు 5:2, 3) దాని ఫలితంగా, కాపరులను ‘మనుష్యులలో ఈవులుగా’ యేసు తమకు ఇచ్చాడని మంద గుర్తిస్తుంది. (ఎఫెసీయులు 4:8) వారికి ఉండాల్సిన అర్హతలు దేవుని ఆత్మ ప్రేరేపిత వాక్యంలో వ్రాసి ఉంచబడ్డాయి. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) అందుకని క్రైస్తవులు పెద్దల నడిపింపును అనుసరిస్తారు.—హెబ్రీయులు 13:7.

18. అధిపతి వర్గం నేడు కల్గివున్న బాధ్యతల్లో కొన్ని ఏమిటి, దానికి భవిష్యత్తులో ఎటువంటి బాధ్యతలు ఉంటాయి?

18 బైబిలు కాలాల్లో కొంతమంది అధిపతులకు ఎక్కువ అధికారం ఉండేది, కొంతమందికి తక్కువ ఉండేది. నేడు గొప్ప సమూహంలోని పెద్దలకు ఎంతో వైవిధ్యంగల బాధ్యతలు ఉన్నాయి. కొంతమంది ఒక్క సంఘంలోనే సేవ చేస్తుంటారు; కొందరు ప్రయాణ పైవిచారణకర్తలుగా అనేక సంఘాల్లో సేవ చేస్తుంటారు; మరికొందరు బ్రాంచి కమిటీ మెంబర్లుగా మొత్తం దేశానికే సేవ చేస్తుంటారు; ఇంకొందరు పరిపాలక సభయొక్క వేర్వేరు కమిటీల్లో నేరుగా సహాయం చేస్తుంటారు. భూమి మీది యెహోవా ఆరాధకులలో నాయకత్వం వహించడానికిగాను యేసు నూతన లోకంలో ‘భూమియందంతట అధికారులను’ నియమిస్తాడు. (కీర్తన 45:16) ఇందునిమిత్తం ఆయన నేటి నమ్మస్థులైన పెద్దల్లో నుండే అనేకమందిని ఎంపిక చేసుకుంటాడనడంలో సందేహం లేదు. వీరు ఇప్పుడే తమ సామర్థ్యాలను రుజువు చేసుకుంటున్నారు గనుక, ఆయన నూతనలోకంలో అధిపతివర్గం వహించే పాత్రను వెల్లడిచేసే సమయంలో అనేకమందికి భవిష్యత్తులో మరి గొప్ప ఆధిక్యతలను అప్పజెప్పడానికి ఎంపిక చేసుకుంటాడు.

నేడు దేవుని ప్రజల దేశము

19. యెహెజ్కేలు దర్శనంలోని దేశము దేన్ని సూచిస్తుంది?

19 యెహెజ్కేలు దర్శనం పునఃస్థాపించబడిన ఇశ్రాయేలు దేశాన్ని కూడా చూపించింది. దర్శనంలోని ఈ అంశం దేన్ని సూచిస్తుంది? ఇతర పునఃస్థాపనా ప్రవచనాలు ఈ ఇశ్రాయేలు దేశం ఏదెను వంటి పరదైసుగా మారుతుందని ప్రవచించాయి. (యెహెజ్కేలు 36:34, 35) నేడు మనం పునఃస్థాపించబడిన “దేశము”లో ఉంటూ ఆనందిస్తున్నాము, ఇది కూడా ఒక భావంలో ఏదెను వంటిదే. అదే విధంగా, మనం తరచు మన ఆధ్యాత్మిక పరదైసు గురించి మాట్లాడుతుంటాము. మన “దేశము” అంటే అర్థం, దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజల “కార్యకలాపాల పరిధి” అని కావలికోట నిర్వచించింది.b యెహోవా సేవకుడు భూమ్మీద ఎక్కడ ఉన్నప్పటికీ, క్రీస్తు యేసు అడుగుజాడల్లో నడుస్తూ సత్యారాధనకు మద్దతునివ్వడానికి కృషి చేస్తూ ఉన్నంత వరకు ఆ సేవకుడు పునఃస్థాపించబడిన ఆ దేశములోనే ఉన్నాడు.—1 పేతురు 2:21.

20. మనం యెహెజ్కేలు దర్శనంలోని “పరిశుద్ధ ప్రతిష్ఠిత భాగము” నుండి ఏ సూత్రాన్ని గ్రహించవచ్చు, మనం ఈ సూత్రాన్ని ఎలా అన్వయించగలము?

20 “పరిశుద్ధ ప్రతిష్ఠిత భాగము” అని పిలువబడిన భూభాగము సంగతేమిటి? ఇది యాజకత్వానికీ నగరానికీ మద్దతునివ్వడానికి ప్రజలు ఇచ్చిన విరాళం. అదే విధంగా “దేశమునకు చేరిన జనులందరు” అధిపతి కోసం కొంత భూభాగాన్ని విరాళముగా అర్పించవలసి ఉన్నారు. నేడు దీనర్థం ఏమిటి? జీతం పుచ్చుకునే పాదిరీల భారాన్ని దేవుని ప్రజలు మోయాలని మాత్రం దీని అర్థం కాదు. (2 థెస్సలొనీకయులు 3:8) దానికి బదులుగా, పెద్దలకు అందించబడే మద్దతు ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనదే. పనుల్ని నెరవేర్చడంలో సహాయం చేయడం, సహకార స్ఫూర్తిని విధేయతా స్ఫూర్తిని కనబర్చడం కూడా అందులో ఇమిడి ఉంది. అయినా, యెహెజ్కేలు దినాల్లో లాగానే నేడు కూడా ఈ ప్రతిష్ఠిత అర్పణ ఏ మానవునికీ కాదుగాని “యెహోవాకు” ప్రతిష్ఠించబడుతుంది. (ఇటాలిక్కులు మావి.)—యెహెజ్కేలు 45:1, 7, 16.

21. యెహెజ్కేలు దర్శనంలో దేశాన్ని విభజించడం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

21 ఈ పునఃస్థాపిత దేశంలో నియుక్తమైన స్థానాల్ని కలిగివున్నది కేవలం అధిపతి లేదా యాజకవర్గమూ మాత్రమే కాదు. దేశాన్ని విభజించడం, 12 గోత్రాలకూ స్వాస్థ్యం భద్రంగా ఉందని చూపిస్తుంది. (యెహెజ్కేలు 47:13, 22, 23) కాబట్టి, గొప్ప సమూహంలోని వారు ఆధ్యాత్మిక పరదైసులో నేడు స్థానం కలిగివుండడం మాత్రమే కాదు, రాబోయే దేవుని రాజ్యపు భూపరిధిలో స్థానాన్ని స్వాస్థ్యంగా పొందినప్పుడు వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున భూభాగం నియమించబడుతుంది.

22. (ఎ) యెహెజ్కేలు దర్శనంలోని పట్టణం దేన్ని సూచిస్తుంది? (బి) పట్టణానికి అన్ని వైపులా ద్వారాలు ఉన్నాయన్న విషయం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

22 చివరిగా, దర్శనంలోని పట్టణం దేనిని సూచిస్తుంది? అది పరలోక పట్టణం కాదు, ఎందుకంటే అది “అపవిత్ర” (పరిశుద్ధంకాని) ప్రదేశం నడుమ ఉంది. (యెహెజ్కేలు 48:15-17) కాబట్టి అది భూసంబంధమైనదే అయివుండాలి. సరే, పట్టణం అంటే ఏమని వివరిస్తాము? ప్రజలు ఒక సమూహముగా ఒకచోట చేరి ఒక వ్యవస్థగా లేక సంస్థగా ఏర్పడడం అన్న భావాన్ని ఇవ్వడం లేదా? అవును. కాబట్టి ఈ పట్టణం నీతియుక్తమైన భూసమాజంగా ఏర్పడేవారందరికీ ప్రయోజనాన్ని తెచ్చే భూసంబంధమైన కార్యనిర్వహణ యంత్రాంగాన్ని సూచిస్తున్నట్లు అన్పిస్తుంది. అది రానున్న “క్రొత్త భూమి”లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. (2 పేతురు 3:13) అన్ని ప్రక్కలా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కటిగా ఉన్న పట్టణపు ద్వారాలు బాహాటత్వాన్ని చక్కగా సూచిస్తున్నాయి. నేడు దేవుని ప్రజలు ఏదో రహస్య యంత్రాంగం క్రిందో లేదా దొంగచాటు వ్యవహారాలు కొనసాగించే సంస్థ క్రిందో లేరు. బాధ్యతగల సహోదరులు సమీపించదగ్గవారిగా ఉండాలి; వారిని నడిపించే సూత్రాలు అందరికీ తెలిసినవే. ఈ పట్టణానికి మద్దతునిచ్చే ప్రాంతాన్ని అన్ని గోత్రాల ప్రజలూ సాగుచేస్తున్నారన్న విషయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల కోసం చేయబడే కార్యనిర్వహణా ఏర్పాట్లకు వేరే గొఱ్ఱెలు మద్దతునివ్వడాన్ని—చివరికి వస్తుదాయకంగా కూడా మద్దతునివ్వడాన్ని జ్ఞప్తికి తెస్తుంది.—యెహెజ్కేలు 48:19, 30-34.

23. తర్వాతి శీర్షికలో మనం ఏమి పరిశీలిస్తాము?

23 మరైతే దేవాలయ ప్రాంతం నుండి ప్రవహించే నది విషయం ఏమిటి? అది ఇప్పుడూ మరి భవిష్యత్తులోనూ దేనిని సూచిస్తుంది అనేది ఈ శీర్షికల పరంపరలో మూడవది చివరిదీ అయిన శీర్షికలో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

a వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకం పేజీ 64, పేరా 22 చూడండి.

b కావలికోట జూలై 1, 1995, పేజీ 20 చూడండి.

ఆలోచించవలసిన విషయాలు

◻ యెహెజ్కేలు దర్శనంలోని దేవాలయము దేనికి చిత్రీకరణగా ఉంది?

◻ దేవాలయంలో సేవచేస్తున్న యాజకులు ఎవరికి చిత్రీకరణగా ఉన్నారు?

◻ అధిపతి వర్గము ఎవరు, దాని బాధ్యతల్లో కొన్ని ఏమిటి?

◻ యెహెజ్కేలు దర్శనంలోని దేశము ఏమిటి, అది 12 గోత్రాలవారికి ఏ భావంలో కేటాయించబడింది?

◻ పట్టణం దేనికి చిత్రీకరణగా ఉంది?

[15వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెహెజ్కేలు దర్శనంలో చిత్రీకరించబడినట్లుగా భూమి కేటాయింపు

పన్నెండు గోత్రాలు

మహా సముద్రము

గలిలయ సముద్రము

యొర్దాను నది

ఉప్పు సముద్రము

దాను

ఆషేరు

నఫ్తాలి

మనష్షే

ఎఫ్రాయిము

రూబేను

యూదా

అధిపతి

బెన్యామీను

షిమ్యోను

ఇశ్శాఖారు

జెబూలూను

గాదు

[చిత్రం]

పరిశుద్ధ ప్రతిష్ఠిత భాగము పెద్దగా చూపబడింది

ఎ. యెహోవాయే అక్కడ ఉన్నాడు (యెహోవాషామా); బి. పట్టణంలోని పంటపొలాలు

లేవీయుల భాగము

యెహోవా మందిర ప్రాంతము

యాజకుల భాగము

బి ఎ బి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి