దేవుని దేవాలయంపై ‘మీ మనస్సు నిలుపుకోండి’!
“నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని . . . మనస్సులో ఉంచుకొనుము; . . . నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.”—యెహెజ్కేలు 40:4.
1. సా.శ.పూ. 593లో దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు?
అది సా.శ.పూ. 593వ సంవత్సరం, ఇశ్రాయేలీయులు చెరలో 14వ సంవత్సరం గడుపుతున్నారు. బబులోనులో జీవిస్తున్న యూదులకు తమ ప్రియమైన స్వదేశం నిజంగా ఎంతో సుదూరంలో ఉన్నట్లుగా అన్పించి ఉంటుంది. వారిలో అనేకులు యెరూషలేము మంటల్లో దహనమౌతూ ఉండగా చివరిసారిగా చూశారు. దాని ఎత్తైన గోడలు, దాన్లోని ఎత్తైన భవనాలు కూలిపోయి ఉండగా చూశారు. యెహోవా దేవాలయం—ఒకప్పుడు ఆ పట్టణానికే మకుటాయమానంగా ఉన్న దేవాలయం, భూమి అంతటిలోనూ స్వచ్ఛారాధనకు కేంద్రంగా ఉన్న దేవాలయం—కూలిపోయి ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చెరలో ఉండాల్సిన కాలంలో చాలా భాగం ఇంకా ముందుంది. వాగ్దత్త విడుదలకు ఇంకా 56 సంవత్సరాలు ఉన్నాయి.—యిర్మీయా 29:10.
2. యెరూషలేములోని దేవుని దేవాలయాన్ని గురించిన స్మృతులు యెహెజ్కేలును ఎందుకు విచారపర్చి ఉంటాయి?
2 వందల మైళ్ల దూరాన దేవుని ఆలయం శిథిలావస్థలో ఉండడం, వన్య మృగాలకు ఆలవాలంగా నిర్జనంగా మారి ఉండడం నమ్మకస్థుడిగా ఉన్న యెహెజ్కేలు ప్రవక్తకు చాలా దుఃఖాన్ని కల్గించి ఉంటుంది. (యిర్మీయా 9:11) ఆయన స్వంత తండ్రి అయిన బూజీ అక్కడ ఒక యాజకునిగా పనిచేశాడు. (యెహెజ్కేలు 1:3) యెహెజ్కేలుకు కూడా అదే ఆధిక్యత లభించివుండేది, కానీ ఆయన ఇంకా యౌవనుడిగానే ఉన్నప్పుడు సా.శ.పూ. 617లో యెరూషలేములోని కులీనులతోపాటుగా చెరలోనికి తీసుకొనిపోబడ్డాడు. ఇప్పుడు దాదాపు 50 ఏండ్ల వయస్సులో ఉన్న యెహెజ్కేలుకు, తాను యెరూషలేమును ఇకెన్నడూ చూడడనీ లేదా ఆ పట్టణంలోని దేవాలయాన్ని పునర్నిర్మించే కార్యంలో తనకు ఎటువంటి భాగం ఉండదనీ బహుశ తెలిసే ఉండవచ్చు. అందుకనే, ఒక మహిమాన్వితమైన దేవాలయాన్ని గూర్చిన ఒక దర్శనాన్ని పొందడం యెహెజ్కేలుకు ఎంత అపురూపమైన విషయమో ఊహించండి !
3. (ఎ) దేవాలయాన్ని గూర్చిన యెహెజ్కేలు దర్శనం ఇవ్వబడడానికిగల సంకల్పం ఏమిటి? (బి) దర్శనంలోని నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు ఏమిటి?
3 విస్తృతమైన ఈ దర్శనాన్ని గూర్చి వర్ణించడానికి యెహెజ్కేలు పుస్తకంలో తొమ్మిది అధ్యాయాలు పట్టాయి. ఆ దర్శనం చెరలో ఉన్న యూదయవారికి విశ్వాసాన్ని దృఢపర్చే వాగ్దానాన్ని ఇచ్చింది. ఆ వాగ్దానం ఏమిటంటే—స్వచ్ఛారాధన పునఃస్థాపించబడుతుంది ! నాటనుండి అనేక శతాబ్దాలపాటు, అంతెందుకు మన కాలంలో కూడా, ఆ దర్శనం యెహోవాను ప్రేమించే వారికి ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉంది. అదెలా? యెహెజ్కేలు చూసిన ఈ ప్రవచనాత్మక దర్శనం చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఎలాంటి భావాన్ని కలిగి ఉందో మనం చూద్దాము. అందులో నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి: దేవాలయము, యాజకత్వము, అధిపతి, దేశము.
పునఃస్థాపించబడిన దేవాలయం
4. దర్శనం ప్రారంభంలో యెహెజ్కేలు ఎక్కడికి తీసుకుపోబడ్డాడు, ఆయన అక్కడ ఏమి చూస్తాడు, ఆయనకు పరిశీలనగా చూపించడానికి ఎవరు తీసుకెళ్తారు?
4 మొదటిగా, యెహెజ్కేలు “మిగుల ఉన్నతమైన పర్వతము” మీదికి తీసుకురాబడ్డాడు. ఆ పర్వతం మీది నుండి దక్షిణంవేపు చూస్తే చాలా పెద్ద దేవాలయం ఒకటి ఉంది, అది చుట్టూ గోడలు ఉన్న ఒక పట్టణంలా ఉంది. “మెరయుచున్న యిత్తడివలె” ఉన్న ఒక దేవదూత ఆ దేవాలయ చుట్టు ప్రక్కల ప్రాంతాలను పరిశీలనగా చూపించడానికి ఈ ప్రవక్తను తీసుకుని వెళ్తాడు. (యెహెజ్కేలు 40:2, 3) దర్శనం ముందుకు సాగుతుండగా—ఒకే ఆకృతిగల మూడు జతల గుమ్మపు ద్వారములతోపాటు వాటితోనే ఉన్న కావలిగదులు, ఒక బయటి ఆవరణము, ఒక లోపటి ఆవరణము, భోజనశాలలు, ఒక బలిపీఠము, దేవాలయప్రాంతము, దాన్లోని పరిశుద్ధ, అతిపరిశుద్ధ స్థలాలు—వీటన్నింటినీ దేవదూత అతిజాగ్రత్తగా కొలతలు వేయడాన్ని యెహెజ్కేలు చూస్తాడు.
5. (ఎ) యెహోవా యెహెజ్కేలుకు ఏమని హామీ ఇస్తాడు? (బి) దేవాలయంలో నుండి తీసివేయబడాల్సిన “రాజుల కళేబరము”లు ఏమిటి, ఇది ప్రాముఖ్యమైనది ఎందుకని?
5 అటుతర్వాత, ఈ దర్శనంలో యెహోవా తానే ప్రత్యక్షమౌతాడు. ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి తాను అక్కడ నివసిస్తానని యెహెజ్కేలుకు హామీ ఇస్తాడు. కానీ “వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరములను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును” అని చెబుతూ తన గృహాన్ని పరిశుభ్రపర్చడానికి యెహోవా పిలుపునిస్తాడు. (యెహెజ్కేలు 43:2-4, 7, 9) ఈ “రాజుల కళేబరము”లు అక్కడున్న విగ్రహాలనే సూచించాయని చెప్పవచ్చు. యెరూషలేములోని తిరుగుబాటుదారులైన రాజులూ ప్రజలూ దేవుని ఆలయాన్ని విగ్రహాలతో కలుషితం చేసి, తద్వారా వాటిని తమ రాజులుగా చేసుకున్నారు. (పోల్చండి ఆమోసు 5:26, క్యాతలిక్ అనువాదము.) ఆ విగ్రహాలు ఎంతమాత్రం సజీవమైన దేవతలు గానీ రాజులుగానీ కావు. బదులుగా అవి మృతమైనవి, యెహోవా కన్నులకు అసహ్యమైనవి. వాటిని తీసివేయవల్సిందే.—లేవీయకాండము 26:30; యిర్మీయా 16:18.
6. దేవాలయాన్ని కొలతలు వేయడం దేన్ని సూచిస్తుంది?
6 దర్శనంలోని ఈ భాగం ఏమి చెప్పాలనుకుంటుంది? ఈ భాగం దేవుని ఆలయంలోని స్వచ్ఛారాధన పూర్తిగా పునఃస్థాపించబడుతుందని చెరలో ఉన్నవారికి హామీ ఇస్తుంది. అంతేకాదు, దేవాలయాన్ని కొలవడం, ఈ దర్శనం కచ్చితంగా నెరవేరుతుందనే దానికి దైవిక హామీగా ఉంది. (పోల్చండి యిర్మీయా 31:39, 40; జెకర్యా 2:2-8.) విగ్రహారాధన పూర్తిగా తొలగించబడనైవుంది. యెహోవా మళ్లీ తన గృహాన్ని ఆశీర్వదించనై ఉన్నాడు.
యాజకత్వము, అధిపతి
7. లేవీయుల గురించి, యాజకుల గురించి ఏ సమాచారం ఇవ్వబడింది?
7 యాజకత్వం కూడా మళ్లీ శుభ్రపర్చే ప్రక్రియకు, అంటే ప్రక్షాళన చేసే ప్రక్రియకు లోనుకావల్సి ఉంది. పరిశుద్ధంగా ఉన్నందుకు యాజకులైన సాదోకు సంతానం ప్రశంసించబడి ప్రతిఫలం పొందనైయుండగా, విగ్రహారాధనకు లొంగిపోయినందుకు లేవీయులు గద్దింపుకు గురికావల్సి ఉన్నారు.a అయినప్పటికీ, రెండు గుంపులవారూ ఒక్కొక్కరుగా నమ్మకంగా ఉన్నారా లేరా అన్న దానిపై ఆధారపడి యాజకులూ లేవీయులూ దేవుని పునఃస్థాపిత గృహంలో సేవా బాధ్యతలను కలిగివుంటారనడంలో సందేహమేమీ లేదు. దానికితోడు, యెహోవా ఇలా ప్రకటించాడు: “ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పు[దురు].” (యెహెజ్కేలు 44:10-16, 23) కాబట్టి యాజకత్వం పునఃస్థాపించబడనైవున్నది, నమ్మకంగా ఉంటూ సహనంతో కొనసాగిన యాజకులకు ప్రతిఫలం దక్కుతుంది.
8. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలులోని అధిపతులు ఎవరు? (బి) యెహెజ్కేలు దర్శనంలోని అధిపతి స్వచ్ఛారాధనలో ఎలా క్రియాశీలంగా ఉన్నాడు?
8 ఈ దర్శనం అధిపతి అని పిలువబడిన వ్యక్తిని గురించి కూడా మాట్లాడుతుంది. మోషే కాలం నుండి మొదలుకొని ఇశ్రాయేలు జనాంగానికి అధిపతులు ఉండేవారు. అధిపతి అన్న పదానికి హెబ్రీ పదమైన నాసీ, ఒక పితృస్వామ్య గృహంలోగానీ, ఒక గోత్రంలోగానీ, లేక చివరికి ఒక జనాంగంలోగానీ ఉండే ప్రధానిని సూచిస్తుంది. యెహెజ్కేలు దర్శనంలో, ప్రజల్ని అణగద్రొక్కినందుకు ఇశ్రాయేలు పరిపాలకులు అందరూ ఒక గుంపుగా మందలించబడి నీతిగాను న్యాయంగాను ఉండమని పురికొల్పబడ్డారు. అధిపతి యాజకవర్గానికి చెందినవాడు కాకపోయినా స్వచ్ఛారాధనలో క్రియాశీలంగా ఒక ప్రముఖపాత్రను వహిస్తున్నాడు. ఆయన యాజక గోత్రం కాని గోత్రాలతో బయటి ఆవరణంలోపలికీ వెలుపలికీ వెళ్తూవస్తూ, తూర్పు గుమ్మపుద్వారములో కూర్చునివుంటూ, ప్రజలు అర్పణలు అర్పించడానికిగాను వారికి కావల్సిన అర్పణల్లో కొంత ఇస్తాడు. (యెహెజ్కేలు 44:2, 3; 45:8-12, 17) ఆ విధంగా ఈ దర్శనం, యెహెజ్కేలు తోటి ప్రజలకు, పునఃస్థాపితమైన దేశంలో మాదిరికరమైన నాయకులు ప్రసాదించబడతారని, దేవుని ప్రజల్ని సంస్థీకరించే పనిలో యాజకులకు మద్దతునిచ్చే పురుషులు, ఆధ్యాత్మిక విషయాల్లో చక్కని మాదిరిని కనపర్చే పురుషులు ప్రసాదించబడతారనీ హామీనిచ్చింది.
దేశము
9. (ఎ) దేశము ఎలా విభజించబడాలి, కానీ ఎవరికి స్వాస్థ్యము దొరకదు? (బి) పరిశుద్ధ ప్రతిష్ఠిత భాగము ఏమిటి, అందులో ఏమి ఉంది?
9 చివరిగా, యెహెజ్కేలు దర్శనంలో ఇశ్రాయేలు దేశాన్ని చూపించడం కూడా ఇమిడి ఉంది. ఆ దేశం విభజించబడి, ప్రతి గోత్రానికి భూమి కేటాయించబడాలి. అధిపతికి కూడా స్వాస్థ్యం లభిస్తుంది. అయితే యాజకులకు కేటాయించబడదు, ఎందుకంటే “నేనే వారికి స్వాస్థ్యము” అని యెహోవా చెప్పాడు. (యెహెజ్కేలు 44:10, 28; సంఖ్యాకాండము 18:20) అధిపతికి కేటాయించబడిన భూమి పరిశుద్ధ ప్రతిష్ఠిత భాగము అని పిలువబడే ప్రత్యేక భూమికి ఇరువైపులా ఉంటుందని దర్శనం చూపిస్తుంది. ఈ ప్రతిష్ఠిత భూమి మూడు భాగాలుగా విభజించబడే చతురస్రాకార భూభాగం—మొదటిదైన పైభాగం పశ్చాత్తప్తులైన లేవీయుల కోసం, రెండవదైన మధ్యభాగం యాజకుల కోసం, మూడవదైన క్రిందిభాగం పట్టణానికీ, పచ్చిక మైదానాలకీ కేటాయించబడుతుంది. యెహోవా మందిరం యాజకుల భూభాగంలో ఉంటుంది, అంటే చతురస్రాకారంలోని ప్రతిష్ఠిత భాగములోని మధ్యభాగంలో అన్నమాట.—యెహెజ్కేలు 45:1-7.
10. చెరలో ఉన్న నమ్మకస్థులైన యూదావాసులకు దేశము విభజించబడుతుందనే ప్రవచనం ఎటువంటి భావాన్ని కలిగివుంది?
10 చెరలో ఉన్న వారందరి హృదయాలనూ ఇది ఎంతగా నిమ్మళపర్చి ఉంటుందో కదా! ప్రతి కుటుంబానికీ భూస్వాస్థ్యం ఉంటుందన్న హామీ ఇవ్వబడింది. (పోల్చండి మీకా 4:4.) స్వచ్ఛారాధన అక్కడ ఒక ఉన్నతస్థానాన్ని కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకోనైయుంది. యెహెజ్కేలు దర్శనంలో అధిపతి కూడా యాజకుల్లాగానే ప్రజలిచ్చిన ప్రతిష్ఠిత భాగములోనే నివసించనున్నట్లు గమనించండి. (యెహెజ్కేలు 45:16) కాబట్టి, పునఃస్థాపిత దేశంలో నాయకత్వం వహించడానికి యెహోవా నియమించిన వారు చేసే పనికి ప్రజలు తోడుగా ఉంటూ, వారి నిర్దేశానికి సహకారాన్నిస్తూ మద్దతునివ్వనైయున్నారు. మొత్తంమీద చూస్తే, ఈ దేశం సంస్థీకరణకూ, సహకారానికీ, భద్రతకూ చిత్రీకరణ అయివుంది.
11, 12. (ఎ) వారి పునస్థాపిత స్వదేశాన్ని తాను ఆశీర్వదిస్తానని యెహోవా తన ప్రజలకు ఎలా ప్రవచనాత్మకంగా హామీ ఇచ్చాడు? (బి) నదీతీరాల్లోని వృక్షాలు దేన్ని సూచించాయి?
11 యెహోవా వారి దేశాన్ని ఆశీర్వదిస్తాడా? ప్రవచనవాక్యాలు ఈ ప్రశ్నకు హృదయాన్ని తాకే వర్ణనతో జవాబిస్తున్నాయి. దేవాలయం నుండి మొదలైన ఒక చిన్న పిల్లకాలువ ముందుకు సాగుతుండగా పెరుగుతూపోతూ, మృత సముద్రములోనికి ప్రవేశించేటప్పటికి ఒక పెద్ద నదిగా మారుతుంది. అక్కడ ఆ నది మృతమైన నిర్జీవమైన నీటిని పునరుజ్జీవం చేస్తుంది, దానితో సముద్రతీరంలో చేపల పరిశ్రమ వర్ధిల్లుతుంది. నదీతీరం పొడుగునా చాలా వృక్షాలు సంవత్సరం అంతటా కాపుకాస్తూ పోషణను అందిస్తూ, స్వస్థతను చేకూరుస్తుంటాయి.—యెహెజ్కేలు 47:1-12.
12 చెరలో ఉన్నవారికి ఈ వాగ్దానం, తాము అపురూపంగా ఎంచిన మునుపటి పునఃస్థాపనా ప్రవచనాలకు ప్రతిధ్వనిగా ఉండి, వారికి పూర్తి నిశ్చయతను ఇచ్చాయి. యెహోవా ఆత్మచే ప్రేరేపితులైన ప్రవక్తలు పునఃస్థాపితమైన ఇశ్రాయేలు దేశాన్ని, మళ్లీ జనులతో నిండి ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని గూర్చి పరదైసులాంటి వర్ణనని ఎన్నోసార్లు ఇచ్చారు. మృతమైన ప్రాంతాలు మళ్లీ జీవాన్ని పోసుకోవడం ప్రవచనాల్లో మళ్లీ మళ్లీ కన్పించే విషయంగా ఉంది. (యెషయా 35:1, 6, 7; 51:3; యెహెజ్కేలు 36:35; 37:1-14) అందుకనే ప్రజలు జీవాన్నిచ్చే యెహోవా ఆశీర్వాదాలు పునఃస్థాపితమైన దేవాలయంలో నుండి ఒక నదిలా ప్రవహిస్తాయని ఎదురుచూడగల్గారు. ఆ విధంగా ఆధ్యాత్మికంగా మృతమైన జనాంగం పునరుజ్జీవం పొందుతుంది. పునఃస్థాపించబడిన ప్రజలకు విశిష్టమైన ఆధ్యాత్మిక పురుషులు ప్రసాదించబడతారు, దర్శనంలోని నదీతీరం పొడవునా ఉన్న వృక్షాలంతటి నీతితోను స్థిరత్వంతోను ఉండే పురుషులు ప్రసాదించబడతారు, శిథిలాల్లో ఉన్న దేశాన్ని పునర్నిర్మించే కార్యంలో నాయకత్వాన్ని వహించే పురుషులు ప్రసాదించబడతారు. “నీతి అను మస్తకివృక్షము”ల గురించి యెషయా కూడా వ్రాశాడు, “పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు” అని కూడా వ్రాశాడు.—యెషయా 61:3, 4.
దర్శనం ఎప్పుడు నెరవేరింది?
13. (ఎ) పునఃస్థాపించబడిన తన ప్రజలను యెహోవా “నీతి అను మస్తకివృక్షము”లతో ఏ భావంలో ఆశీర్వదించాడు? (బి) మృత సముద్రమును గూర్చిన ప్రవచనం ఎలా నెరవేరింది?
13 చెరలోనున్నవారు వెనక్కి తిరిగివచ్చి ఆశాభంగానికి గురయ్యారా? ఎంతమాత్రం లేదు! పునఃస్థాపించబడిన శేషం తమ ప్రియతమ స్వదేశానికి సా.శ.పూ. 537లో తిరిగివచ్చారు. కొంతకాలానికి “నీతి అను మస్తకివృక్షముల” నడిపింపులో—అంటే శాస్త్రి అయిన ఎజ్రా, ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా, ప్రధాన యాజకుడైన యెహోషువ—వీరందరి నడిపింపులో ఎంతోకాలంగా పాడుగానున్న స్థలములు తిరిగి కట్టబడ్డాయి. ఉదాహరణకు నెహెమ్యా యెరుబ్బాబెలువంటి అధిపతులు దేశాన్ని నీతితోను న్యాయంతోను పరిపాలించారు. యెహోవా దేవాలయం పునఃస్థాపించబడింది, జీవం కోసమైన ఆయన ఏర్పాట్లు—ఆయన నిబంధన ప్రకారం జీవించడం మూలంగా కలిగే ఆశీర్వాదాలు—మళ్లీ ప్రవహించడం ప్రారంభమయ్యాయి. (ద్వితీయోపదేశకాండము 30:19; యెషయా 48:17-20) అటువంటి ఆశీర్వాదాల్లో ఒకటి జ్ఞానము. యాజకత్వం మళ్లీ తన విధులను ప్రారంభించింది, యాజకులు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించారు. (మలాకీ 2:7) తత్ఫలితంగా, మృత సముద్రం స్వస్థతనొందడము, చేపల పరిశ్రమ వర్ధిల్లడము ద్వారా చిత్రించబడినట్లుగా ప్రజలు ఆధ్యాత్మికంగా పునరుజ్జీవులయ్యారు, యెహోవాకు మళ్లీ ఫలభరితులైన సేవకులుగా మారారు.
14. బబులోనులోని చెర నుండి యూదులు తిరిగివచ్చిన తర్వాత జరిగిన సంఘటనలను మించిపోయే నెరవేర్పు ఒకటి యెహెజ్కేలు ప్రవచనానికి ఎందుకు ఉండాలి?
14 ఈ సంఘటనలన్నీ యెహెజ్కేలు దర్శనానికి ఉన్న ఒకే ఒక్క నెరవేర్పా? కాదు; అంతకంటే మరిగొప్ప సంఘటనలు జరుగుతాయనే సూచనలు ఆ దర్శనంలో ఉన్నాయి. పరిశీలించండి: యెహెజ్కేలు చూసిన దేవాలయాన్ని అక్కడ వర్ణించబడిన రీతిలో నిజానికి నిర్మించడం సాధ్యంకాదు. నిజమే, యూదులు ఈ దర్శనాన్ని గంభీరంగా తీసుకుని దాన్లోని కొన్ని వివరణల్ని అక్షరార్థంగా అన్వయించారు కూడా.b అయితే, దర్శనంలోని దేవాలయాన్ని మొత్తంగా తీసుకుంటే అది, మునుపటి దేవాలయం స్థానమైన మోరీయా పర్వతంమీద కూడా పట్టలేనంత పెద్దది. దానికితోడు, రెండవ దేవాలయము మునుపటి దేవాలయం ఉన్న స్థానంలోనే—యెరూషలేము పట్టణం లోపలే నిర్మించబడగా, యెహెజ్కేలు దేవాలయము పట్టణంలో లేదు, కొంత దూరంలో వేరే భూభాగంపై ఉంది. (ఎజ్రా 1:1, 2) అంతేకాదు, యెరూషలేములోని దేవాలయంలోనుండి ఎటువంటి నదీ ఎన్నడూ ప్రవహించలేదు. ఆ విధంగా ప్రాచీన ఇశ్రాయేలీయులు యెహెజ్కేలు ప్రవచనం యొక్క చిన్న నెరవేర్పు మాత్రమే చూశారు. దానర్థం ఏమిటంటే, ఈ దర్శనానికి మరిగొప్ప, ఆధ్యాత్మిక నెరవేర్పు ఉండి ఉండాలి.
15. (ఎ) యెహోవాయొక్క ఆధ్యాత్మిక దేవాలయం ఎప్పుడు కార్యరూపం దాల్చింది? (బి) యెహెజ్కేలు దర్శనం క్రీస్తు భూమ్మీద జీవించిన కాలంలో నెరవేరలేదని ఏమి సూచిస్తుంది?
15 స్పష్టంగా, యెహెజ్కేలు దర్శనపు అసలు నెరవేర్పు యెహోవా యొక్క గొప్ప ఆధ్యాత్మిక దేవాలయంలో ఉంటుందని మనం ఎదురుచూడాలి. దీన్ని గురించి అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పుస్తకంలో విస్తృతంగా చర్చిస్తున్నాడు. ఆ దేవాలయం, యేసుక్రీస్తు సా.శ. 29లో దానికి ప్రధాన యాజకునిగా అభిషిక్తుడైనప్పుడు కార్యరూపం దాల్చింది. కానీ యెహెజ్కేలు దర్శనం యేసు కాలంలో నెరవేరిందా? అలా జరగలేదని చెప్పవచ్చు. తన బాప్తిస్మంద్వారా, తన బలియర్పణద్వారా, అతిపరిశుద్ధ స్థలమైన పరలోకంలోకే ప్రవేశించడంద్వారా యేసు ప్రధాన యాజకునిగా, ప్రాయశ్చిత్త దినం యొక్క పూర్తి ప్రవచనాత్మక అర్థాన్ని నెరవేర్చాడు. (హెబ్రీయులు 9:24) అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యెహెజ్కేలు దర్శనంలో ప్రధాన యాజకుడ్ని గురించి గాని లేదా ప్రాయశ్చిత్త దినం గురించి గాని ఒక్క మాట కూడా లేదు. అందుకని ఈ దర్శనం సా.శ. మొదటి శతాబ్దాన్ని సూచిస్తున్నట్టు కన్పించడం లేదు. మరైతే అది ఏ కాలానికి వర్తిస్తుంది?
16. ఈ దర్శనం లభించిన స్థానం, మనకు వేరే ఏ ప్రవచనాన్ని జ్ఞప్తికి తెస్తుంది, ఇది యెహెజ్కేలు దర్శనం యొక్క అసలు నెరవేర్పు సంభవించే కాలాన్ని గ్రహించేలా మనకు ఎలా సహాయం చేస్తుంది?
16 జవాబు కోసం మనం దర్శనంవైపుకే మరలుదాము. యెహెజ్కేలు ఇలా వ్రాశాడు: “దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగుపడెను.” (యెహెజ్కేలు 40:2) ఈ దర్శనం లభించిన స్థానమైన “మిగుల ఉన్నతమైన పర్వతము,” మనకు మీకా 4:1ని గుర్తుకుతెస్తుంది: “అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.” ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్పులోనికి వస్తుంది? జనాంగములు ఇంకా అబద్ధ దేవతలను ఆరాధిస్తుండగానే ఇది జరుగుతుందని మీకా 4:5 చూపిస్తుంది. నిజానికి, మన కాలంలోనే—ఈ “అంత్యదినములలో”నే—స్వచ్ఛారాధన ఉన్నతంగా ఎత్తబడింది, దేవుని సేవకుల జీవితాల్లో అది ఉండాల్సిన స్థానానికే తీసుకురాబడింది.
17. యెహెజ్కేలు దర్శన దేవాలయం ఎప్పుడు శుభ్రపర్చబడిందో నిర్ధారించడానికి మలాకీ 3:1-5లోని ప్రవచనం ఎలా సహాయం చేస్తుంది?
17 ఈ పునఃస్థాపన ఎలా సాధ్యమయ్యింది? గుర్తుతెచ్చుకోండి, మొత్తం యెహెజ్కేలు దర్శనంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటంటే, యెహోవా దేవాలయానికి వచ్చి, తన గృహంలోని విగ్రహారాధనను తీసివేసి శుభ్రపర్చాలని చెబుతాడు. దేవుని ఆధ్యాత్మిక దేవాలయం ఎప్పుడు శుభ్రపర్చబడింది? మలాకీ 3:1-5లో యెహోవా, తన “నిబంధన దూత” అయిన యేసుతోపాటు ‘తన ఆలయానికి వచ్చే’ సమయం గురించి చెప్పాడు. అలా రావడానికిగల సంకల్పం? “ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు.” ఈ శుద్ధీకరణ మొదటి ప్రపంచయుద్ధం కాలంలో ప్రారంభమయ్యింది. దాని ఫలితం? యెహోవా తన గృహంలో నివసించి, తన ప్రజల ఆధ్యాత్మిక దేశమును 1919 మొదలుకొని ఆశీర్వదించాడు. (యెషయా 66:8) అందుకని, యెహెజ్కేలు దేవాలయ ప్రవచనం అంత్యదినములలో ఒక ప్రాముఖ్యమైన నెరవేర్పును కలిగివుందన్న ముగింపుకు మనం రావచ్చు.
18. దేవాలయ దర్శనం ఎప్పుడు చివరి నెరవేర్పును కలిగివుంటుంది?
18 ఇతర పునఃస్థాపనా ప్రవచనాలవలెనే యెహెజ్కేలు దర్శనానికి మరొక నెరవేర్పు—చివరి నెరవేర్పు—పరదైసులో ఉంది. అప్పుడు మాత్రమే యథార్థహృదయంగల మానవజాతి దేవుని ఆలయ ఏర్పాటునుండి పూర్తి ప్రయోజనాలను పొందుతుంది. అప్పుడు క్రీస్తు తన పరలోక యాజకవర్గం అయిన 1,44,000 మందితో కలిసి తన విమోచన క్రయధన విలువను వర్తింపజేస్తాడు. క్రీస్తు పరిపాలనకు విధేయులుగా ఉన్న మానవులంతా పరిపూర్ణతకు తీసుకురాబడతారు. (ప్రకటన 20:5, 6) అయితే, యెహెజ్కేలు దర్శన నెరవేర్పుకు ప్రాథమిక నెరవేర్పు పరదైసు మాత్రమే కాదు. ఎందుకు కాదు?
దర్శనం మన ఈ కాలంపై కేంద్రీకరిస్తుంది
19, 20. దర్శనం యొక్క అసలు నెరవేర్పు పరదైసులో కాకుండా ఇప్పుడే ఎందుకు జరగవల్సివుంది?
19 విగ్రహారాధననూ, ఆధ్యాత్మిక వ్యభిచారాన్నీ తీసివేయాల్సిన అవసరం ఉన్న దేవాలయాన్ని యెహెజ్కేలు చూశాడు. (యెహెజ్కేలు 43:7-9) నిశ్చయంగా ఇది పరదైసులోని యెహోవా ఆరాధనకు వర్తించదు. అంతేకాదు, దర్శనంలోని యాజకులు, ఇంకా భూమ్మీదే ఉన్న అభిషిక్త యాజక వర్గాన్ని సూచిస్తున్నారు, అంతేగాని వారు పరలోకానికి పునరుత్థానం అయిన తర్వాత యాజకులుగా ఉండడాన్నిగాని లేదా వెయ్యేండ్లకాలంలోని యాజకుల్నిగాని సూచించడంలేదు. ఎందుకు కాదు? ఈ యాజకులు లోపలి ఆవరణములో సేవచేస్తున్నట్లు చూపించబడ్డారని గమనించండి. ఈ ఆవరణము, క్రీస్తుక్రిందనున్న ఉపయాజకులు వారింకా భూమ్మీదే ఉన్నప్పటి వారి విశేష ఆధ్యాత్మిక స్థానాన్ని సూచిస్తుందని కావలికోటలోని మునుపటి శీర్షికలు చూపించాయి.c ఈ దర్శనం ఆ యాజకుల అపరిపూర్ణతను నొక్కిచెబుతుందన్న విషయాన్ని కూడా గమనించండి. వారు తమ స్వంత పాపాల నిమిత్తం కూడా బలి అర్పణలు అర్పించాలని చెప్పబడింది. వారు అటు ఆధ్యాత్మికంగా ఇటు నైతికంగా మలినానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించబడ్డారు. అందుకనే, వారు పునరుత్థానులైన అభిషిక్తులను సూచించడం లేదు. ఈ పునరుత్థానులైన అభిషిక్తులను గూర్చి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు.” (ఇటాలిక్కులు మావి.) (1 కొరింథీయులు 15:52; యెహెజ్కేలు 44:21, 22, 25, 27) దర్శనంలోని యాజకులు ప్రజలతో కలిసిమెలిసి నేరుగా వారికి సేవచేశారు. పరదైసులో అలా ఉండదు, అప్పుడు యాజకవర్గం పరలోకంలో ఉంటుంది. కాబట్టి, నేడు భూమ్మీద ఉన్న అభిషిక్తులు “గొప్ప సమూహము”తో సన్నిహితంగా పనిచేస్తుండడాన్ని ఈ దర్శనం చక్కని రీతిలో చిత్రీకరిస్తుంది.—ప్రకటన 7:9; యెహెజ్కేలు 42:14.
20 ఆ విధంగా, ఈ యెహెజ్కేలు దేవాలయ దర్శనం నేడు నెరవేరుతున్న ఆధ్యాత్మికంగా శుభ్రపర్చే పనియొక్క చక్కని ప్రభావాల్ని చూపిస్తుంది. కానీ మీ విషయంలో దాని భావమేమైవుంది? ఇది కేవలం ఏదో అర్థంపర్థంలేని వేదాంతపరమైన భేటీ కాదు. ఈ దర్శనం ఏకైక సత్యదేవుడైన యెహోవాను మనం అనుదినం ఆరాధించడంతో ఎంతో సంబంధం కలదై ఉంది. తర్వాతి శీర్షికలో ఇది ఎలాగో చూద్దాము.
[అధస్సూచీలు]
a యెహెజ్కేలు సాదోకు యాజక సంతానంలోని వాడే అని చెప్పబడుతుంది గనుక, దర్శనంలోని ఈ భాగం యెహెజ్కేలును వ్యక్తిగతంగా బాగా స్పర్శించివుండవచ్చు.
b ఉదాహరణకు, పునర్నిర్మించబడిన దేవాలయంలో బలిపీఠము, దేవాలయపు రెండు ద్వారాలు, వంట జరిగే స్థలాలు యెహెజ్కేలు దర్శనంలో ఉన్నట్లే నిర్మించబడ్డాయని ప్రాచీన మిష్నా సూచిస్తుంది.
c కావలికోట జూలై 1, 1996, పేజీ 16; డిసెంబరు 1, 1972, (ఆంగ్లం) పేజీ 718 చూడండి.
మీకు జ్ఞాపకముందా?
◻ దేవాలయాన్ని గురించిన, యాజకత్వాన్ని గురించిన యెహెజ్కేలు దర్శనం యొక్క తొలి నెరవేర్పు ఏమిటి?
◻ దేశాన్ని కేటాయించడాన్ని గూర్చిన యెహెజ్కేలు దర్శనపు తొలి నెరవేర్పు ఎలా సంభవించింది?
◻ ప్రాచీన ఇశ్రాయేలు పునఃస్థాపనలో నమ్మకమైన అధిపతులుగా ఎవరు పనిచేశారు, “నీతి అను మస్తకివృక్షము”లుగా ఎవరు పనిచేశారు?
◻ యెహెజ్కేలు దేవాలయ దర్శనం అసలు నెరవేర్పు అంత్యదినాల్లో ఎందుకు జరగాలి?