కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/1 పేజీలు 4-7
  • సవతి కుటుంబాలు విజయవంతం కాగలవు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సవతి కుటుంబాలు విజయవంతం కాగలవు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రధాన లక్షణం
  • కన్న తల్లిదండ్రులు
  • క్రమశిక్షణ—సున్నితమైన విషయం
  • తల్లిదండ్రులు సంభాషించుకోడం అవసరం
  • కుటుంబ ఐక్యతను బలపరచడం
  • సవతి కుటుంబాలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీ గృహంలో శాంతిని కాపాడుకోండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • సవతి తలిదండ్రులకు సహాయపడే సమాచారం
    తేజరిల్లు!—1993
  • మీ యింటివారి రక్షణకొరకు కష్టించి పనిచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/1 పేజీలు 4-7

సవతి కుటుంబాలు విజయవంతం కాగలవు

విజయవంతమైన సవతి కుటుంబాలు సాధ్యమేనా? సాధ్యమే, ముఖ్యంగా సవతి కుటుంబంలోని సభ్యులంతా “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అన్న విషయాన్ని గుర్తుంచుకొంటే. (2 తిమోతి 3:16) బైబిలు సూత్రాలను కుటుంబ సభ్యులంతా అన్వయించుకున్నప్పుడు విజయం తథ్యం.

ప్రధాన లక్షణం

బైబిలులో, మానవబంధాలను నడిపించడానికి ఖచ్చితమైన కొన్ని నియమాలు మాత్రమే పొందుపర్చబడి ఉన్నాయి. ముఖ్యంగా అది, జ్ఞానయుక్తంగా ప్రవర్తించేలా మనల్ని నడిపించే మంచి లక్షణాలనూ, దృక్పథాలనూ అలవర్చుకునేందుకు ప్రోత్సహిస్తోంది. అలాంటి మంచి దృక్పథాలూ, లక్షణాలూ సంతోషకరమైన కుటుంబానికి ఆధారం.

అది కొట్టొచ్చినట్టు కనపడ్డా, ఏ కుటుంబమైనా విజయవంతమైందిగా ఉండడానికి అవసరమైన ప్రధాన లక్షణం ప్రేమేనని చెప్పడం సమంజసం. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను . . . సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:9, 10) “ప్రేమ” అనే పదం తరచూ తప్పుగా అన్వయించడం జరుగుతుంది, కానీ పౌలు ఇక్కడ ప్రస్తావించిన లక్షణం సాటిలేనిది. అది దైవిక ప్రేమ, అది “శాశ్వతకాలముండును.” (1 కొరింథీయులు 13:8) దానిని బైబిలు నిస్వార్థమైనదనీ, సేవచేయడానికి సంసిద్ధంగా ఉండేదనీ వర్ణిస్తోంది. ప్రేమ సహించును, దయచూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, లేక ఉప్పొంగదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. అది పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవడానికీ, నమ్మడానికీ, నిరీక్షించడానికీ, ఏమొచ్చినా సరే సహించుకోవడానికీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.—1 కొరింథీయులు 13:4-7.

యథార్థమైన ప్రేమ, ప్రజలలో ఉన్న భేదాభిప్రాయాలను చక్కదిద్ది విభిన్నమైన వాతావరణంలో పెరిగిన వ్యక్తిత్వాలున్న ప్రజలను ఏకం చేస్తుంది. కన్నతల్లి/తండ్రి మరణం మూలంగా, లేక విడాకుల మూలంగా కలిగిన వినాశకరమైన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అది సహాయపడుతుంది. ఒక సవతి తండ్రి తనకున్న నిజమైన సమస్యలను గురించి ఇలా వర్ణిస్తున్నాడు: “నేను నా సవతి పిల్లల భావాలను, నా భార్య భావాలను కూడా విశ్లేషించలేనంత తరచుగా నేను నా సొంత భావాలపైనే శ్రద్ధ చూపించేవాడిని. అంత సున్నితంగా ఉండకుండా ఉండేలా నేర్చుకోవలసి వచ్చింది. మరి ముఖ్యంగా, వినయంగా ఉండడం ఎలాగో నేర్చుకోవలసి వచ్చింది.” అవసరమైన మార్పులు చేసుకొనేలా ప్రేమ అతనికి సహాయపడింది.

కన్న తల్లిదండ్రులు

వదిలిపెట్టిపోయిన కన్నతల్లితో/తండ్రితో పిల్లలకున్న సంబంధం విషయంలో వ్యవహరించేటప్పుడు సవతి తల్లికి/తండ్రికి ప్రేమ సహాయపడగలదు. ఒక సవతి తండ్రి ఇలా ఒప్పుకుంటున్నాడు: “నా సవతి పిల్లల ప్రేమను పొందడంలో మొదటిస్థానం నాదై ఉండాలనుకున్నాను. వాళ్లు తమ కన్నతండ్రిని చూడ్డానికి వెళ్ళినప్పుడెల్లా నేను అతనిని విమర్శించకుండా ఉండాలని ఎంతో ప్రయత్నం చేసేవాడిని. వాళ్లు అతనితో రోజంతా సరదాగా గడిపి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏదోలా ఉండేది. వాళ్లు బాధగా వస్తే నాకు ఆనందంగా ఉండేది. నిజంగా, వారి ప్రేమను కోల్పోతానేమోనని భయపడేవాడ్ని. అత్యంత క్లిష్టమైన విషయాల్లో ఒకటేమిటంటే, నా సవతి పిల్లల జీవితాల్లో వారి కన్నతండ్రి పాత్రని గుర్తించి, దానిని అంగీకరించడం.”

ఆ సవతి తండ్రికి పిల్లలనుండి “తక్షణ” ప్రేమను ఎదురుచూడడం అవాస్తవమన్న నిజాన్ని ఎదుర్కొనేందుకు యథార్థమైన ప్రేమ సహాయపడింది. తండ్రిగా ఆయనను పిల్లలు వెంటనే అంగీకరించనప్పుడు, తృణీకరించబడినట్టు ఆయన భావించలేదు. వాళ్ల కన్నతండ్రి మీద పిల్లల హృదయాల్లో ఉన్న స్థానాన్ని బహుశ తాను ఎన్నటికీ పూర్తిగా ఆక్రమించుకోలేనని ఆయన గ్రహించాడు. ఆ సవతి పిల్లలు తమ కన్నతండ్రిని చిన్నప్పట్నుంచి ఎరుగుదురు, అయితే సవతి తండ్రి వాళ్లకు క్రొత్త, ఆయన వాళ్ల ప్రేమను పొందడానికి కృషి చేయాల్సి ఉంటుంది. పరిశోధకురాలైన ఎలిజబెత్‌ ఐనస్టిన్‌ ఇలా చెప్పింది: “కన్నతల్లి/తండ్రి స్థానం ఎన్నటికీ మార్చబడదు—ఎన్నటికీ. కన్నతండ్రి లేక తల్లి చనిపోయినా లేక పిల్లలను వదిలేసినాసరే, ఆ కన్నతండ్రి లేక కన్నతల్లి స్థానం పిల్లల జీవితాలలో ప్రముఖమైందిగానే ఉంటుంది.”

క్రమశిక్షణ—సున్నితమైన విషయం

ప్రేమతో కూడిన క్రమశిక్షణ పిల్లలకు అవసరమని బైబిలు తెలియజేస్తుంది, అది సవతి పిల్లలకు కూడా వర్తిస్తుంది. (సామెతలు 8:33) ఈ విషయంలో బైబిలు స్థానంతో అనేకమంది నిపుణులు ఏకీభవించడం మొదలుపెట్టారు. ప్రొఫెసర్‌ సిరెజ ఆర్వీస్‌ డి అరేజుహు ఇలా తెలియజేశారు: “స్వతహాగా హద్దులను ఎవరూ ఇష్టపడరు, కాని అవి అవసరం. ‘వద్దు’ అనే మాట సంరక్షకపదం.”

అయితే, సవతి కుటుంబాలలో క్రమశిక్షణ విషయంలో గల వేర్వేరు దృక్పథాలు, కుటుంబ వలయంలో తీవ్రమైన చీలికలకు దారితీయవచ్చు. ఇప్పుడు లేని కన్నతల్లిచే, లేక తండ్రిచే సవతి పిల్లలు పాక్షికంగా మలచబడే ఉంటారు. బహుశా, వారి అలవాట్లూ, పద్ధతులూ సవతి తండ్రికి విసుగు పుట్టించవచ్చు. వారి సవతి తండ్రి కొన్ని విషయాల్లో ఎందుకు మొండిగా భావిస్తాడో బహుశ వాళ్లు అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో విజయవంతంగా ఎలా వ్యవహరించవచ్చు? పౌలు క్రైస్తవులకు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” (1 తిమోతి 6:11) సవతి తండ్రీ/తల్లీ, సవతి పిల్లలూ పరస్పరం అర్థం చేసుకోవడానికి కృషిచేస్తున్నప్పుడు సాత్వికంగానూ, ఓర్పుగానూ ఉండేలా వారికి క్రైస్తవప్రేమ సహాయపడుతుంది. సవతి తండ్రి/తల్లి సహనాన్ని కోల్పోతే, ‘కోపం, క్రోధం, దూషణ,’ వంటివి ఎలాంటి బంధాన్నైనా త్వరగా నాశనం చేయగలవు.—ఎఫెసీయులు 4:31.

ఈ విషయంలో సహాయపడబోయే దానికి సంబంధించి ప్రవక్తయైన మీకా ద్వారా అంతర్దృష్టి దయచేయబడింది. ఆయన ఇలా చెప్పాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” (మీకా 6:8) క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు న్యాయంగా ఉండడం చాల ప్రాముఖ్యం. మరి దయ చూపించే విషయమేమిటి? సంఘ ఆరాధనలో పాల్గొనేలా ఆదివారం ఉదయమే వారిని లేపడమనేది తరచుగా కష్టమై పోయేదని ఒక క్రైస్తవ పెద్ద చెబుతున్నాడు. వారిమీద కోపపడే బదులు, ఆయన దయను కనపరిచాడు. ఆయన పెందలకడనే లేచి, బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసి, ఆ తర్వాత పిల్లలందరికీ వేడి వేడిగా టీ గాని కాఫీ గాని తెచ్చి ఇచ్చేవాడు. ఫలితంగా వాళ్లు, పెందలకడే లేవండర్రా అని ఆయన చేసే విన్నపాన్ని లక్ష్యపెట్టడానికి ఎక్కువగా ఇష్టపడేవారు.

ప్రొఫెసర్‌ ఏన లూయిసె వెయిర డి మట్టోస్‌ ఈ క్రిందనున్న ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేసింది: “ఏ రకం కుటుంబం అనేది కాదుగానీ కుటుంబ బాంధవ్యాలలో ఉన్న నాణ్యతే ప్రాముఖ్యం. ప్రవర్తన విషయంలో సమస్యలున్న యౌవనస్థులులో దాదాపుగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అంతగా లేని కుటుంబాలనుంచీ, నియమ నిబంధనలూ, పరస్పర సంభాషణా కొరవడిన కుటుంబాలనుంచీ వచ్చిన వారేనని నేను నా అధ్యయనాల్లో గమనించాను.” ఆమె ఇంకా ఇలా తెలియజేసింది: “పిల్లలను పెంచడంలో వద్దు అని చెప్పాల్సిన అవసరత ఉందన్న విషయం తగినంతగా ఎన్నడూ నొక్కి చెప్పబడలేదు.” అంతేగాక, ఎమిలీ, జాన్‌ వైశర్‌ అనే డాక్టర్లు ఇలా చెబుతున్నారు: “క్రమశిక్షణను తీసుకుంటున్న వ్యక్తి, క్రమశిక్షణను ఇచ్చే వ్యక్తి ప్రతిస్పందనలను గురించీ, ఆ వ్యక్తితో తనకున్న సంబంధాన్ని గురించీ శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే ప్రధానంగా క్రమశిక్షణ పనిచేస్తుంది.”

ఆ వ్యాఖ్యానాలు, సవతి కుటుంబాలలో క్రమశిక్షణను ఎవరివ్వాలి అన్న ప్రశ్నను ప్రస్తావించాయి. వద్దు అని ఎవరు చెప్పాలి? విషయాలను చర్చించిన తర్వాత, సవతి తండ్రి/తల్లి పిల్లలతో సన్నిహిత సంబంధం పెంపొందించుకొనేలా కన్నతల్లి/తండ్రి ప్రారంభంలో ప్రధాన క్రమశిక్షణకర్తయై ఉండాలని కొంతమంది తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. సవతి తల్లి/తండ్రి క్రమశిక్షణను చేపట్టడానికి ముందు సవతి పిల్లలపట్ల తనకున్న ప్రేమ విషయంలో పిల్లలను నమ్మకం పెంపొందించుకోనివ్వండి.

సవతి కుటుంబంలో తండ్రి, సవతి తండ్రి అయితే అప్పుడేమిటి? కుటుంబానికి శిరస్సు తండ్రి అని బైబిలు చెప్పటంలేదా? అవును, చెబుతుంది. (ఎఫెసీయులు 5:22, 23; 6:1, 2) అయినప్పటికీ, సవతి తండ్రి క్రమశిక్షణను, ప్రాముఖ్యంగా అందులో శిక్షించడం చేరివుంటే కొంతకాలం పాటు దాన్ని కన్నతల్లికి అప్పగించడం మంచిది. సవతి తండ్రి, పిల్లలు ‘తన [క్రొత్త తండ్రి] ఉపదేశాన్ని ఆలకించేలా’ పునాదిని వేస్తాడు. ఈలోగా పిల్లలు ‘వాళ్ల తల్లి చెప్పు బోధకు’ లోబడేందుకు అనుమతిస్తాడు. (సామెతలు 1:8; 6:20; 31:1) చివరకు అది శిరస్సత్వ సూత్రానికి విరుద్ధంగా పనిచేయదని రుజువులు చూపిస్తున్నాయి. అంతేగాక ఒక సవతి తండ్రి ఇలా చెబుతున్నాడు: “క్రమశిక్షణలో మందలించడం, సరిదిద్దడం, గద్దించడం చేరివున్నాయని నాకు గుర్తువుంది. వాటిని ప్రేమ, కనికరం న్యాయం ఉట్టిపడే రీతిలో ఇచ్చినప్పుడు, ఆ విషయంలో తల్లిదండ్రులు మంచి మాదిరి ఉంచినప్పుడు అవి సాధారణంగా పనిచేస్తాయి.”

తల్లిదండ్రులు సంభాషించుకోడం అవసరం

సామెతలు 15:22 ఇలా చెబుతుంది: “ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును.” సవతి కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ప్రశాంతమైన సంభాషణ, నిర్మొహమాటంతో కూడిన ఆంతరంగిక సంభాషణ ప్రాముఖ్యం. ఒ ఎస్టాడో డీ ఎస్‌. పౌలో అనే వార్తాపత్రికలో ఒక విలేఖరి ఇలా పేర్కొంది: “పిల్లలు తల్లిదండ్రులు పెట్టే హద్దులను పరీక్షించడానికే మొగ్గుచూపిస్తుంటారు.” సవతి కుటుంబాలలో అయితే అది రెండింతలు వాస్తవం. అందువల్ల, తల్లిదండ్రులు సమైక్యంగా ఉన్నారని పిల్లలు గ్రహించేలా వాళ్లు వేరువేరు విషయాల్లో పరస్పరాంగీకారానికి రావాల్సి ఉంటుంది. అయితే కన్నతల్లి సమంజసంగా లేదని భావించేరీతిలో సవతి తండ్రి వ్యవహరిస్తే అప్పుడు ఏమిటి? పిల్లల ఎదుటగాక ఆంతరంగికంగా వాళ్లు ఆ సమస్యను పరిష్కరించుకోవాలి.

పునర్వివాహం చేసుకున్న ఒక తల్లి ఇలా చెబుతుంది: “సవతి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టడాన్ని చూడ్డం, మరిముఖ్యంగా ఆయన తొందరపాటుగా ప్రవర్తిస్తున్నాడనీ, లేక పక్షపాతం చూపిస్తున్నాడనీ ఆమె భావించినప్పుడు ఆయన క్రమశిక్షణలో పెట్టడాన్ని చూడడం ఒక తల్లికి ఎంతో కష్టంగా ఉంటుంది. అది ఆమె హృదయాన్ని నలిపివేస్తుంది, ఆమె తన పిల్లల తరుపున వాదించాలని అనుకుంటుంది. కొన్నిసార్లు తన భర్తకు విధేయత చూపించడం, మద్దతునివ్వడం ఆమెకు కష్టంగా ఉంటుంది.

“ఒక సందర్భంలో, 12 ఏళ్ల, 14 ఏళ్ల వయస్సున్న నా ఇద్దరు కొడుకులు ఒక విషయంలో వాళ్ళ సవతి తండ్రి అనుమతి అడిగారు. ఆయన వాళ్ల విన్నపాన్ని వెంటనే తిరస్కరించి, తమకు అది ఎందుకు అంత ప్రాముఖ్యమో వివరించడానికి ఆ పిల్లలకు అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయారు. పిల్లలు ఏడ్పుమొఖం పెట్టారు, నాకు నోటమాట రాలేదు. నా పెద్దకొడుకు నావంక చూసి ఇలా అన్నాడు: ‘అమ్మా, ఆయన ఏమి చేశారో చూశావా?’ నేను దానికి ‘అవును, చూశాను. అయితే ఆయన ఈ కుటుంబానికి శిరస్సు, శిరసత్వాన్ని గౌరవించమని బైబిలు చెబుతోంది’ అని జవాబు చెప్పాను. వాళ్లు మంచి పిల్లలు దాన్ని అంగీకరించారు, కొంచెం సేపటికి కుదుటపడ్డారు. అదేరోజు సాయంకాలం, దాని గురించి ఆయనకు వివరించాను, తాను మరీ అధికారికంగా వ్యవహరించానని ఆయన గ్రహించారు. వెంటనే ఆయన పిల్లల పడక గదిలోకివెళ్ళి క్షమాపణ చెప్పారు.

“ఆ సంఘటన నుండి మేమెంతో నేర్చుకున్నాం. నా భర్త నిర్ణయాలు చేసేముందు వినడం నేర్చుకున్నాడు. శిరస్సత్వ సూత్రానికి కట్టుబడివుండాలని నేను నేర్చుకున్నాను, అది నాకు బాధను కల్గించినప్పటికీ కూడా. లోబడి ఉండడంలో గల ప్రాముఖ్యతను నా పిల్లలు నేర్చుకున్నారు. (కొలొస్సయులకు 3:18, 19) మా ఆయన అడిగిన హృదయపూర్వక క్షమాపణ, వినయం గురించి ఒక మంచి గుణపాఠాన్ని మాకు నేర్పింది. (సామెతలు 29:23) ఈనాడు నా ఇద్దరు కొడుకులు క్రైస్తవ సంఘంలో పెద్దలుగా ఉన్నారు.”

పొరపాట్లు జరగడం సహజమే. గాయపర్చే మాటలను లేక పనులను పిల్లలు చేస్తారు. ఆ యా సందర్బాల్లో వచ్చే ఒత్తిళ్లు, సవతి తల్లిదండ్రులు నిర్హేతుకంగా ప్రవర్తించేలా చేస్తాయి. అయినప్పటికీ, “నన్ను క్షమించు, దయచేసి నన్ను మన్నించండి,” వంటి చిన్న చిన్న మాటలు గాయాలను మాన్పడంలో ఎంతో సహాయపడతాయి.

కుటుంబ ఐక్యతను బలపరచడం

సవతి కుటుంబాలలో సత్సంబంధాలు పెంపొందించడానికి సమయం పడుతుంది. మీరు ఒకవేళ సవతి తండ్రి/తల్లి అయితే, మీరు తదనుభూతిని చూపించాల్సిన అవసరం ఉంది. పిల్లలను అర్థం చేసుకొని, వారితో సమయం గడపడానికి సిద్ధంగా ఉండండి. పిల్లలతో ఆటలాడండి. ఎదిగిన పిల్లలతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉండండి. కలసి సమయం గడపడానికి ఉన్న అవకాశాలను వెదకండి.—ఉదాహరణకు, వంటలో సహాయపడడం, కారును శుభ్రం చేయడం వంటి గృహ పనులలో సాయపడడానికి మీ పిల్లలను ఆహ్వానించండి. మీరు సూపర్‌బజార్‌కి వెళ్ళేటప్పుడు మీతోపాటు తోడురమ్మనీ, మీకు సహాయం చేయమనీ వారిని ఆహ్వానించండి. అంతేకాకుండా, పిల్లలను ముద్దు చేసే పనులు, వాళ్లపై మీకున్న ప్రేమను చూపించవచ్చు. (నిజమే, సవతి తండ్రి తన సవతి కుమార్తెలతో వ్యవహరిస్తున్నప్పుడు కొన్ని హద్దులను పాటించడంలో జాగ్రత్త వహించాలి. వాళ్లకు ఇబ్బంది కల్గించకూడదు. సవతి తల్లులు తమ సవతి మగపిల్లలకు కూడా హద్దులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.)

సవతి కుటుంబాలు విజయవంతం కాగలవు. అనేకం విజయవంతం అయ్యాయి. కుటుంబ సభ్యులంతా, మరిముఖ్యంగా తల్లిదండ్రులు ఏ కుటుంబాలలోనైతే సరియైన దృక్పథాలనూ, వాస్తవిక నిరీక్షణలనూ పెంపొందించుకుంటారో ఆ కుటుంబాలు అత్యంత విజయవంతమైన కుటుంబాలు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది.” (1 యోహాను 4:7) అవును, సంతోషకరమైన సవతి కుటుంబానికి గల నిజమైన రహస్యం హృదయపూర్వకమైన ప్రేమయే.

[7వ పేజీలోని చిత్రాలు]

సంతోషకరమైన సవతి కుటుంబాలు

దేవుని వాక్యాన్ని కలిసి పఠించండి . . .

కలిసి సమయాన్ని గడపండి . . .

పరస్పరం సంభాషించుకోండి . . .

కలిసి పనిచేయండి . . .

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి