“యెహోవా” లేక “యాహ్వే,” ఏది?
“సంకరం,” “మిశ్రమం,” “వికారం.” ఇంతటి కఠినమైన పదాల్ని బైబిలు హెబ్రీ భాషా విద్వాంసులు ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? వివాదానికి కేంద్రం ఏమిటంటే, “జెహోవా” అన్నది దేవుని నామపు సరైన ఇంగ్లీషు ఉచ్చారణా కాదా అన్నది. ఒక శతాబ్దంకన్నా ఎక్కువ కాలంగా ఈ వివాదం చెలరేగింది. నేడు, చాలామంది విద్వాంసులు రెండక్షరాల పదమైన “యాహ్వే”నే ఇష్టపడుతున్నట్లుంది. కానీ “జెహోవా” [యెహోవా] అన్న ఉచ్చారణ నిజంగా అంత “వికారం”గా ఉందా?
వివాదానికి మూలకారణాలు
బైబిలు ప్రకారం దేవుడే మానవజాతికి తన నామాన్ని వెల్లడిపర్చుకున్నాడు. (నిర్గమకాండము 3:15) ఆ నామాన్ని దేవుని ప్రాచీన సేవకులు స్వేచ్ఛగా ఉపయోగించారని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. (ఆదికాండము 12:8; రూతు 2:4) దేవుని నామం ఇతర దేశాలవారికి కూడా తెలుసు. (యెహోషువ 2:9) యూదులు బబులోనులోని చెరవాసం నుండి తిరిగివచ్చిన తర్వాత అనేక ఇతర దేశాలతో సంబంధం పెట్టుకున్న కాలంలో ఇది మరింత వాస్తవం. (కీర్తన 96:2-10; యెషయా 12:4; మలాకీ 1:11) ది ఇంటర్ప్రెటర్స్ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ ఇలా అంటుంది: “చెరనుండి తిరిగి వచ్చిన తర్వాతి కాలంలో చాలామంది విదేశీయులు యూదుల మతంపట్ల ఆకర్షితులయ్యారని చెప్పడానికి చాలా ఆధారం ఉంది.” అయితే, సా.శ. మొదటి శతాబ్దానికల్లా దేవుని నామం సంబంధంగా ఒక మూఢనమ్మకం అభివృద్ధి చెందింది. చివరికి, యూదా జనాగం దేవుని నామాన్ని బహిరంగంగా ఉపయోగించడం మానివేయడమే కాక, కొంతమంది దాన్ని ఉచ్చరించడాన్నే నిషేధించారు. ఆ విధంగా దాని సరియైన ఉచ్చారణ మరుగున పడిపోయింది—ఇది నిజమా?
పేరులోనేముంది?
హెబ్రీ భాషలో దేవుని నామం יהוה అని వ్రాయబడుతుంది. ఈ నాలుగు అక్షరాల్ని కుడి నుండి ఎడమకు చదువుతారు, ఇది సాధారణంగా టెట్రగ్రామటన్ (చతురక్షరాలు) అని పిలువబడుతుంది. బైబిలులో ఉన్న చాలామంది ప్రజల పేర్లు, స్థలాల పేర్లలో ఈ దైవిక నామం సంక్షిప్త రూపంలో ఇమిడివుంది. దేవుని నామం ఎలా ఉచ్చరించబడేదో తెల్సుకోవడానికి ఏమైనా క్లూలు ఈ పేర్లలో దొరికే అవకాశాలు ఉన్నాయా?
అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో వెస్లీ థియాలాజికల్ సెమినరీ వద్ద గౌరవ ప్రొఫెసర్ అయిన జార్జ్ బుకానన్ చెప్పే జవాబు ఏమిటంటే అవును, ఉన్నాయి. ప్రొఫెసర్ బుకానన్ ఇలా వివరిస్తున్నాడు: “ప్రాచీన కాలాల్లో తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లలకు తమ దేవతల పేర్లమీదుగా వచ్చే పేర్లను పెట్టేవారు. దానర్థం ఏమిటంటే ఆ దేవత పేరు ఎలా ఉచ్చరించబడేదో అలాగే తమ పిల్లల పేర్లను కూడా ఉచ్చరించి ఉంటారు. టెట్రగ్రామటన్ ప్రజల పేర్లలో ఉపయోగించబడేది, వారు దానిలోని మధ్య అచ్చును ఎల్లప్పుడూ ఉపయోగించేవారు.”
సంక్షిప్త రూపంలో ఉన్న దేవుని నామం చేరివున్న పేర్ల కొన్ని ఉదాహరణలను బైబిలునందే చూడవచ్చు. హెబ్రీ బైబిలులో యొహ్నాతాన్ లేదా యెహోహ్నాతాన్ అని ఉండే యోనాతాను అనే పేరుకు, “యహో లేదా యహోవా ఇచ్చాడు” అని అర్థమని ప్రొఫెసర్ బుకానన్ చెబుతున్నాడు. ప్రవక్తయైన ఏలీయా పేరు హెబ్రీలో ఎలీయాహ్ లేదా ఎలీయాహు అని ఉంటుంది. ప్రొఫెసర్ బుకానన్ ప్రకారం ఈ పేరుకు అర్థం ఇది: “నా దేవుడు యాహూ లేదా యాహూవా.” అదే రకంగా, యెహోషాపాతు అనే పేరు హెబ్రీలో యెహోహ్షాఫాట్, దీనర్థం “యహో తీర్పు తీర్చాడు.”
టెట్రగ్రామటన్ను “యాహ్వే” అని రెండక్షరాలతో ఉచ్చరించడం మూలంగా, ఓ అనే అచ్చు దేవుని నామంలో ఒక భాగంగా ఉండకుండా పోతుంది. కానీ దైవిక నామాన్ని ఇముడ్చుకున్న అనేక బైబిలు పేర్లలో ఈ ‘ఓ’త్వం అనేది ఉంది, ఉదాహరణకు రెండు పేర్లను చూడండి: యెహోనాతాను, యోనాతాను. అందుకని ప్రొఫెసర్ బుకానన్ దైవిక నామం గురించి ఇలా చెబుతున్నాడు: “ఏ సందర్భంలోనూ ఊ లేదా ఓ అనే అచ్చులు విడనాడబడలేదు. దేవుని నామం కొన్నిసార్లు ‘యా’ అని సంక్షిప్తంగా చెప్పబడింది, కానీ ఎన్నడూ ‘యావే’గా చెప్పబడలేదు. . . . టెట్రగ్రామటన్ను ఒక్క అక్షరంగా ఉచ్చరించినప్పుడు అది ‘యా’ లేదా ‘యో’ గానే ఉచ్చరించబడేది. దాన్ని మూడు అక్షరాలుగా ఉచ్చరించినప్పుడు అది ‘యహోవా’ లేదా ‘యహూవా’ అని ఉచ్చరించబడేది. దానికి అసలు రెండు అక్షరాల సంక్షిప్తరూపం ఎప్పుడైనా ఇచ్చినట్లైతే అది ‘యహో’నే అయివుండేది.”—బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ.
ఈ వ్యాఖ్యానాలు, 19వ శతాబ్దంలో హెబ్రీ విద్వాంసుడైన గెజేనియస్ తన హెబ్రీ అండ్ కల్డీ లెక్సికన్ టు ది ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్లో చేసిన వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి: “יְהוָֹה [యెహోవా] అన్నది [దేవుని నామానికి] సరియైన ఉచ్చారణ అని పరిగణించేవారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి వారికి అసలు ఆధారమంటూ లేకుండా ఏమీ లేరు. దేవుని నామాన్ని ఈ విధంగా ఉచ్చరించడం ద్వారానే, అనేక పేర్ల ఆరంభంలో ఉండే సంక్షిప్త అక్షరాలైన יְהוֹ [యెహో] మరియు יוֹ [యో]లను మరింత సంతృప్తికరంగా వివరించవచ్చు.”
అయినా, ఇటీవల తను చేసిన అనువాదమైన మోషే వ్రాసిన మొదటి ఐదు పుస్తకాలు (ఆంగ్లం) లోని పరిచయవాక్యంలో ఎవరెట్ ఫాక్స్ ఇలా చెబుతున్నాడు: “[దేవుని] హెబ్రీ నామం యొక్క ‘సరైన’ ఉచ్చారణను కనుక్కోవడానికైన పాత, క్రొత్త ప్రయత్నాలు సఫలం కాలేదు; అప్పుడప్పుడు వినబడే ‘యెహోవా’ గానీ లేదా విద్వాంసులు ఉపయోగించే ‘యాహ్వే’ గానీ సరియైనవని రుజువు చేయలేము.”
విద్వాంసపరమైన వాగ్వివాదం నిస్సందేహంగా కొనసాగుతుంది. అచ్చుల ఉచ్చారణా చిహ్నాలు పెట్టే పద్ధతిని మసరెట్లు స్థాపించకముందే సత్య దేవుని నామాన్ని యూదులు ఉచ్చరించడం మానివేశారు. ఆ విధంగా, YHWH (יהוה) అనే హల్లుల్లో ఏ అచ్చులు ఉంటాయనేది రుజువు చేయడానికి కచ్చితమైన మార్గం లేదు. అయినా, బైబిలు పాత్రల పేర్లే—ఈ పేర్ల సరియైన ఉచ్చారణ కోల్పోవడం అంటూ జరగనే లేదు—ఆ పేర్లే ప్రాచీన కాలపు దేవుని నామపు ఉచ్చారణకు కచ్చితమైన క్లూ ఇస్తున్నాయి. ఈ కారణంగా, కనీసం కొంతమంది విద్వాంసులైనా “యెహోవా” అన్న ఉచ్చారణ “వికారం”గా ఏమీ లేదని అంగీకరిస్తున్నారు.
[31వ పేజీలోని చిత్రాలు]
“యెహోవా” అన్నది అత్యంత ప్రఖ్యాతి గాంచిన దేవుని నామపు ఉచ్చారణయై ఉంది