శోధనలు ఎదురైనప్పటికీ యెహోవాను బట్టి ఆనందించడం
జార్జ్ స్కీపీయో
1945 డిసెంబర్లో, నేను ఆసుపత్రి వార్డ్‌లో పడుకుని ఉన్నాను. నా చేతులూ పాదాలూ తప్ప మిగతా శరీరమంతా పక్షవాతం వచ్చింది. నా ఈ పరిస్థితి తాత్కాలికమని నేననుకున్నాను. కానీ నేను మళ్ళీ నడవలేనేమోనని ఇతరులు సంశయించారు. చలాకీగా ఉండే 17 ఏండ్ల పిల్లవాడికి అది ఎంతటి శోధన! ఏ ఆధారంలేని అలాంటి అభిప్రాయంతో ఏకీభవించడానికి నేను ఒప్పుకోలేదు. తరువాతి సంవత్సరం మా ఎంప్లాయర్తోపాటు ఇంగ్లండ్‌కు వెళ్ళాలన్న పథకంతో సహా అనేక పథకాలు ఉండేవి నాకు.
సెయింట్ హలీన అంతటా వ్యాపించివున్న బాలపక్షవాతం నాకూ వచ్చింది. దీని వల్ల 11 మంది చనిపోయారు, చాలా మంది అశక్తులయ్యారు. మంచం మీద అశక్తుడనుగా పడుకుని ఉండవలసి వచ్చిన ఆ పరిస్థితిలో, నా స్వల్ప కాల జీవితాన్ని గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచించుకునేందుకు నాకు బోలెడు సమయం దొరికింది. నేనలా ఆలోచిస్తుండగా, నా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ నేనానందించగల్గడానికి కారణముందని గ్రహించనారంభించాను.
కొద్దిమందితో ప్రారంభం
మా నాన్నగారి పేరు టామ్. ఆయన పోలీస్‌గానూ, బాప్టిస్ట్ చర్చిలో పాదిరిగాను పనిచేసేవారు. 1933లో, అంటే నాకు ఐదేండ్లున్నప్పుడు, ఆయన ఇద్దరు యెహోవాసాక్షుల నుండి కొన్ని బౌండ్ పుస్తకాలను సంపాదించారు. వాళ్ళు పూర్తికాల సువార్తికులుగా, లేదా పయినీర్లుగా పనిచేసేవారు. వాళ్ళు కొన్నాళ్ళు మా దీవిని సందర్శించారు.
మా నాన్నగారు వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న పుస్తకాల్లో ఒక దాని పేరు ద హార్ప్ ఆఫ్ గాడ్ (దేవుడి వీణ). మా నాన్నగారు మా కుటుంబంతోనూ, అలాగే ఆసక్తిగల ఇతరులతోను బైబిలు పఠించేటప్పుడు దానిని ఉపయోగించారు. అది చాలా లోతైన విషయాలను చర్చిస్తుంది. నేను దానిలోని విషయాలను అంతగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ మేము చర్చించుకున్న ప్రతి లేఖనానికీ నేను నా బైబిలులో గుర్తులు పెట్టుకోవడం నాకు గుర్తుంది. మేము పఠిస్తున్నదే సత్యమనీ, బాప్టిస్ట్ చర్చిలో తను బోధిస్తున్నది తప్పనీ మా నాన్నగారు త్వరలోనే గ్రహించారు. ఆయన దాని గురించి ఇతరులకు చెప్పడమూ, త్రిత్వం, నరకాగ్ని, అమర్త్య ఆత్మ అనేవి లేవని చర్చిలో ప్లాట్‌ఫామ్ మీద నిలబడి చెప్పడమూ మొదలుపెట్టారు. ఇది చర్చిలో గొప్ప వివాదం తలెత్తడానికి కారణమైంది.
చివరికి, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు, చర్చి ఒక మీటింగ్‌కు అందరినీ సమావేశపర్చింది. “బాప్టిస్టుల వైపు ఎవరు ఉంటారు?” అని అడిగారు. అధిక సంఖ్యాకులు దానివైపే అన్నారు. “యెహోవా వైపున ఎవరుంటారు?” అని తర్వాత అడిగారు. దాదాపు 10, 12 మంది యెహోవా వైపు అన్నారు. ఆ 10, 12 మందిని చర్చి వదిలిపెట్టి వెళ్ళమని చెప్పారు.
సెయింట్ హలీనలో క్రొత్త మతం కొద్ది మంది సభ్యులతో ప్రారంభమయ్యింది. మా నాన్నగారు అమెరికాలో ఉన్న వాచ్ టవర్ సొసైటీ ప్రధాన కార్యాలయంతో సంప్రదించి, రికార్డు చేసిన బైబిలు ప్రసంగాలను ప్రజలకు వినిపించేందుకు ట్రాన్స్క్రిప్షన్ మెషీన్ కావాలని కోరారు. ఆ మెషీన్ చాలా పెద్దది గనుక, దానిని సెయింట్ హలీనకు పంపలేమని వాళ్ళు నాన్నగారికి తెలిపారు. వాళ్ళు ఒక చిన్న ఫోనోగ్రాఫ్ ప్లేయర్‌ను పంపించారు. తర్వాత, సహోదరులు మరో రెండు ఫోనోగ్రాఫ్ ప్లేయర్ల కోసం ఆర్డర్ చేశారు. వాళ్ళు కాలి నడకనా, గాడిద మీదా వెళ్ళి దీవంతటా ఉన్న ప్రజలకు సందేశాన్ని తీసుకువెళ్ళారు.
సందేశం అంతటా వ్యాపించగా, వ్యతిరేకత కూడా తలెత్తింది. మా స్కూల్లో, పిల్లలు, “రండీ, రండీ, రారండీ, టామీ స్కీపీయో గ్రామఫోన్ వినరండి!” అని పాడేవాళ్ళు. బడిపిల్లవాడనైన నాకు అదొక తీవ్రమైన శోధనగా ఉండేది. తోటి వయస్కుల మెప్పు పొందాలని కోరుకునే ప్రాయం కదా అది. దానిని ఓర్చుకోవడానికి నాకు ఏమి సహాయపడింది?
మా కుటుంబం ఆరుగురు పిల్లలు గల పెద్ద కుటుంబం. మేము క్రమంగా కుటుంబ సమేతంగా బైబిలు పఠించేవాళ్ళం. మేము ప్రతిరోజూ టిఫిన్ చేసే ముందు కూడా కలిసి బైబిలు చదివేవాళ్ళం. మా కుటుంబం అనేక సంవత్సరాలుగా సత్యంలో నమ్మకంగా కొనసాగేందుకు నిస్సందేహంగా ఇది ఎంతో సహాయం చేసింది. వ్యక్తిగతంగా నేను చిన్నప్పటి నుండే బైబిలు మీద మమకారం పెంచుకున్నాను. సంవత్సరాలుగా నేను క్రమంగా బైబిలు చదివే అలవాటును అలాగే కొనసాగిస్తున్నాను. (కీర్తన 1:1-3) నేను స్కూలు చదువు పూర్తిచేసే సరికి నాకు 14 ఏండ్లు. నేను అప్పటికెల్లా సత్యంలో బాగా పాతుకుపోయాను, నా హృదయంలో యెహోవా భయం కూడా ఉంది. ఇది శోధనలు ఎదురైనప్పటికీ నేను యెహోవాను బట్టి సంతోషించగల్గేలా చేసింది.
తర్వాతి శోధనలూ, ఆనందాలు
నేను అలా మంచం మీద అనారోగ్యంతో పడుకుని నా చిన్నప్పటి కాలాన్ని గురించి, నా భవిష్యత్ అపేక్షలను గురించి ఆలోచిస్తుండగా, ఈ వ్యాధి దేవుడు పెట్టిన పరీక్షనో, ఆయన ఇచ్చిన శిక్షనో కాదని నాకు బైబిలు పఠనం నుండి నాకు తెలుస్తూనే ఉంది. (యాకోబు 1:12, 13) అయినప్పటికీ, పోలియో చాలా భయంకరమైన శోధనే. దాని పర్యవసానాలు నా శేషజీవితమంతటా నాతో పాటు ఉంటాయి.
నేను కోలుకున్నాక, నేను మళ్ళీ నడవడం నేర్చుకోవలసి వచ్చింది. నా చెయ్యిలోని కండరాలు కొన్ని పని చేయడం మానేశాయి కూడా. నేను ప్రతి రోజు ఎన్నిసార్లు పడిపోయేవాడ్నో నాకు గుర్తు లేదు. అయినప్పటికీ, హృదయపూర్వకంగా ప్రార్థించడంవల్లా, ఎడతెగక ప్రయత్నించడం వల్లా, 1947 అయ్యే సరికి, నేను చేతికర్ర సహాయంతో నడవగల్గాను.
ఇలా ఉండగా, నా మత నమ్మకాలే గల అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఆమె పేరు డోరస్. మేమిద్దరమూ పిల్లలమే కనుక, వివాహం గురించి అప్పట్లో ఆలోచించలేదు. కానీ నేను నడవడంలో మరింత పురోభివృద్ధి సాధించేందుకు అది ప్రేరేపించింది. నేను వివాహం చేసుకుంటే నాకు ప్రస్తుతం వస్తున్న జీతం సరిపోదు కనుక నాకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, నా అంతట నేను సొంతంగా డెంటల్ లాబరేటరీని పెట్టుకున్నాను. తర్వాతి రెండు సంవత్సరాల వరకు దానిని నడిపాను. మేము 1950లో పెండ్లి చేసుకున్నాం. అప్పటికెల్లా, నేను ఒక కారు కొనుక్కోవడానికి సరిపోను డబ్బు సంపాదించాను. ఆ తర్వాత నేను సహోదరులను కూటాలకూ ప్రాంతీయ సేవకూ కారులో తీసుకువెళ్ళగల్గాను.
దీవిలో దైవపరిపాలనా సంబంధ పురోగతులు
1951లో సొసైటీ తన మొదటి ప్రతినిధిని మా దగ్గరికి పంపింది. ఆయన ఒక యువకుడు. పేరు యాకోబూస్ వాన్ స్టాడన్. దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. మేము ఆ మధ్యే కొంచెం పెద్ద ఇంట్లోకి మారాం. కనుక ఒక సంవత్సరమంతా ఆయనకు వసతి ఇవ్వగల్గాం. నాది నేను సొంతంగా పెట్టుకున్న పనే కనుక, మేము చాలా సమయం ప్రకటనా పనిలో గడిపాం. నేను చాలా విలువైన తర్ఫీదును ఆయన నుండి పొందాను.
యాకోబూస్ను మేము కోస్ అని పిలుస్తాం. ఆయన క్రమ సంఘ కూటాలను సంస్థీకరించారు. మేమందరం సంతోషంగా హాజరయ్యేవాళ్ళం. మాకు ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండేవి. ఎందుకంటే, ఆసక్తిగలవాళ్ళందరికి కలిపి రెండు కార్లు మాత్రమే ఉండేవి. నేల ఎత్తుపల్లాలుగా ఉండేది, కొండలు ఉండేవి. ఆ కాలంలో మంచి రోడ్లు చాలా అరుదుగా ఉండేవి. కనుక, ప్రతి ఒక్కరినీ కూటాలకు తీసుకురావడమంటే నిజంగా శ్రమతో కూడిన పనే. కొందరు ఉదయాన్నే నడవడం మొదలుపెట్టేవాళ్ళు. నేను ముగ్గురిని నా చిన్న కారులో ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళాక రోడ్డు మీద దింపేవాడ్ని. వాళ్ళు అక్కడ నుండి నడవడం మొదలుపెట్టేవాళ్ళు. నేను కొంత దూరం తిరిగి వెళ్ళి మరో ముగ్గురిని ఎక్కించుకుని, కొంత దూరం తీసుకువెళ్ళి, దింపి, వెనక్కి వెళ్ళి మరో ముగ్గురిని ఎక్కించుకునేవాడ్ని. ఇలా, చివరికి అందరూ కూటానికి చేరుకునేవాళ్ళు. కూటం తర్వాత, మళ్ళీ అదే పద్ధతిలో అందరినీ వాళ్ళ వాళ్ళ ఇండ్లకు చేర్చేవాడ్ని.
ఇండ్ల తలుపుల దగ్గర మనం సమాచారాన్ని ఫలవంతంగా ఎలా సమర్పించవచ్చో కూడా కోస్ మాకు నేర్పించారు. మాకు అనేక మంచి అనుభవాలు కలిగాయి. కొన్ని మాత్రం మంచి అనుభవాలు కావు. కాని ప్రాంతీయ సేవలో మాకు కలిగిన ఆనందం, మా ప్రకటనా కార్యకలాప వ్యతిరేకులవల్ల కలిగిన శోధనలను అధిగమించింది. ఒకరోజు ఉదయం నేను కోస్తో పనిచేస్తున్నాను. మేము ఒక ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళేసరికి, లోపలి నుండి ఒక స్వరం వినిపించింది. ఒక మనిషి బైబిలును పెద్దగా చదువుతున్నాడు. యెషయా రెండవ అధ్యాయంలో పరిచయమున్న మాటలను మేము స్పష్టంగా వినగల్గాం. ఆయన నాల్గవ వచనానికి వచ్చేసరికి, మేము తలుపు తట్టాం. స్నేహశీలియైన ఒక వృద్ధుడు మమ్మల్ని లోపలికి ఆహ్వానించాడు. మేము దేవుని రాజ్యసువార్తను ఆయనకు వివరించేందుకు యెషయా 2:4ను ఉపయోగించాం. ఆయన నివసిస్తున్నచోటికి చేరుకోవడం చాలా కష్టమైనప్పటికీ, ఆయనతో బైబిలు పఠనాన్ని ఆరంభించాం. మేము కొండదిగి వెళ్ళి, పారుతున్న నీటిలో రాళ్ళ మీదుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి మరో కొండ ఎక్కి, అవతలి వైపుకు దిగి ఆయన ఇంటికి వెళ్ళాలి. అయితే దానివల్ల ప్రయోజనం లేకుండా పోలేదు. నమ్రతగల ఆ మనిషి సత్యాన్ని స్వీకరించి, బాప్తిస్మం తీసుకున్నాడు. కూటాలకు చేరుకునేందుకు ఆయన తన రెండు కర్రల సహాయంతో, నేను కారులో వెళ్ళగల్గే చోటు వరకూ నడిచి వచ్చేవాడు. అక్కడి నుండి ఆయనను కూటానికి కారులో తీసుకువచ్చేవాడ్ని. తర్వాత ఆయన నమ్మకమైన సాక్షిగా చనిపోయారు.
పోలీస్ కమిషనర్ మా పనిని వ్యతిరేకించేవాడు. కోస్‌ను దేశం నుండి బహిష్కరిస్తానని మళ్ళీ మళ్ళీ బెదిరించేవాడు. నెలకొకసారి, ఆయన కోస్‌ను ప్రశ్నించేందుకు పిలిచేవాడు. వాస్తవమేమిటంటే, కోస్ ఎల్లవేళలా బైబిలు నుండి సూటైన జవాబులు ఇచ్చేవాడు. అది ఆయనకు మరింత శత్రుభావాన్ని రేకెత్తించేది. పిలిచిన ప్రతిసారీ ప్రకటనా పనిని ఆపివేయమని కోస్కు హెచ్చరికనిచ్చేవాడు. అయితే ప్రతిసారి ఆయనకు సాక్ష్యమివ్వబడేది. కోస్ సెయింట్ హలీనను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఆయన వ్యతిరేకిస్తూనే వచ్చాడు. ఆ కమిషనర్ భారీ కాయుడు, బలాఢ్యుడైన వ్యక్తి. అలాంటి మనిషి తర్వాత, అకస్మాత్తుగా అనారోగ్యం పాలై, చాలా చిక్కి పోయాడు. ఆయన జబ్బు ఏమిటో డాక్టర్లు చెప్పలేకపోయారు. అందువల్ల, ఆయన మా దీవి నుండి వెళ్ళిపోయాడు.
బాప్తిస్మము, తరగని పెరుగుదలా
తను మూడు నెలలు మా దీవిలో ఉన్న తర్వాత, మా కోసం బాప్తిస్మపు సేవ చేయడం సముచితమని కోస్ తలంచారు. సరైన వాటర్ పూల్‌ను కనుక్కోవడం ఒక సమస్యై కూర్చుంది. మేము ఒక పెద్ద గుంట త్రవ్వి, దానికి సిమెంట్ వేసి, దానిలో నీళ్ళు తీసుకువచ్చి నింపాలని నిశ్చయించుకున్నాం. బాప్తిస్మానికి ముందటి రాత్రి వర్షంపడింది. మరుసటి రోజు ఉదయం మేం చూసేసరికి, మేము త్రవ్విన గుంట నిండా నీళ్ళు నిండిపోయి ఉండడం చూసి ఆనందించాం.
ఆ ఆదివారం ఉదయం కోస్ బాప్తిస్మపు ప్రసంగం ఇచ్చారు. బాప్తిస్మపు అభ్యర్థులను లేచినిలబడమని ఆయన అడిగినప్పుడు, వాడుకగా అడిగే ప్రశ్నలకు జవాబివ్వడానికి మేము 26 మందిమి లేచి నిలబడ్డాం. ఈ దీవిలో బాప్తిస్మం పొందిన మొదటి సాక్షులయ్యే ఆధిక్యత మాకు లభించింది. అది నాకు అత్యంత సంతోషకరమైన రోజు. ఎందుకంటే, నేను బాప్తిస్మం పొందకముందే అర్మగెద్దోన్ వస్తుందేమోనని ఎప్పుడూ బాధపడేవాడ్ని.
చివరికి రెండు సంఘాలు రూపొందాయి. ఒకటి లెవల్వుడ్లోనూ, మరొకటి జేమ్స్టౌన్లోనూ. మేము ముగ్గురమో, నలుగురమో ప్రతి శనివారం సాయంకాలం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను, సేవా కూటాన్నీ నిర్వహించేందుకు ఒక సంఘానికి 13 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం. ఆదివారం ఉదయం ప్రాంతీయ సేవ ముగిసిన తర్వాత, మేము తిరిగివచ్చి అవే కూటాలనూ అలాగే కావలికోట పఠనాన్నీ మా సొంత సంఘంలో, మధ్యాహ్నమూ, సాయంకాలమూ జరుపుకునేవాళ్ళం. అలా మా వారాంతాలు దైవపరిపాలనా కార్యకలాపాలతో ఆనందభరితంగా ఉండేవి. నేను పూర్తికాలం ప్రకటనాపనిని చేయాలని వాంఛించాను. కానీ, నేను కుటుంబాన్ని పోషించవలసి ఉంది. కనుక, 1952లో, నేను రెసిడెంట్ డెన్టిస్ట్గా గవర్నమెంట్ సర్వీస్‌లోకి తిరిగి జాయిన్ అయ్యాను.
1955లో, సొసైటీ ప్రయాణ ప్రతినిధులైన, ప్రాంతీయ పైవిచారణకర్తలు, ప్రతి సంవత్సరం మా దీవిని సందర్శించడం మొదలుపెట్టారు. వాళ్ళు తమ సందర్శనంలో భాగంగా మా ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మా కుటుంబంపై నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని చూపారు. దాదాపు ఆ సమయంలోనే, మా దీవంతటా సొసైటీ యొక్క మూడు ఫిల్మ్‌లను చూపించడంలో భాగం వహించే ఆధిక్యత కూడా నాకు లభించింది.
పులకరింత కలుగజేసేటువంటి దైవిక చిత్తం సమావేశం
1958లో, న్యూయార్క్‌లో జరగనున్న దైవిక చిత్తం అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు, నేను గవర్నమెంట్ సర్వీస్‌కు మళ్ళీ రాజీనామా ఇచ్చాను. ఆ సమావేశం నా జీవితంలో మైలు రాయిగా ఉంది—నేను యెహోవాను బట్టి ఆనందించేందుకు ఎంతో ఎక్కువ కారణముందని తెలుసుకునే అవకాశం దొరికిన సందర్భమది. ఈ దీవికి క్రమమైన ప్రయాణ సౌకర్యాలు లేనందువల్ల, మేము నాలుగున్నర నెలలు దూర ప్రాంతంలో ఉండవలసి వచ్చింది. ఆ సమావేశం ఎనిమిది రోజులు కొనసాగింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలుకొని, రాత్రి తొమ్మిది గంటల వరకూ కార్యక్రమం సాగేది. కాని నేను అలసిపోయేవాడ్ని కాదు. నేను ప్రతి రోజు కోసం ఎదురుచూసేవాడ్ని. కార్యక్రమంలో, సెయింట్ హలీనకు రెండు నిమిషాలు ప్రాతినిధ్యం వహించే ఆధిక్యత నాకు లభించింది. యాన్కీ స్టేడియమ్లోను, పోలో గ్రౌండ్స్‌లోను పెద్ద జనసమూహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడడమంటే నిజంగానే వణుకుపుట్టించే అనుభవమే.
ఆ సమావేశం నేను పయినీరింగ్ చేయాలన్న నా నిర్ణయాన్ని మరింత దృఢపరచింది. ముఖ్యంగా, “దేవుడి రాజ్యం పరిపాలిస్తుంది—లోకాంతం సమీపంలో ఉందా?” అనే బహిరంగ ప్రసంగం ప్రోత్సాహకరమైనదిగా ఉంది. ఆ సమావేశం తర్వాత, మేము బ్రూక్లిన్‌లోని సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాం. అలాగే, ఫ్యాక్టరీని కూడా చూసి వచ్చాం. వాచ్‌టవర్ సొసైటీ అధ్యక్షుడైన సహోదరుడు నార్తో నేను సెయింట్ హలీనలోని ప్రకటనా పని పురోగతిని గురించి మాట్లాడాను. తను మా దీవిని ఒకరోజు సందర్శించడానికి చాలా ఇష్టపడుతున్నానని ఆయన చెప్పారు. సమావేశపు ప్రసంగాలన్నింటి రికార్డులనూ, అనేక మోషన్ పిక్చర్లను నా కుటుంబం కోసం, స్నేహితుల కోసం తీసుకువచ్చాను.
పూర్తికాల సేవ అనే లక్ష్యాన్ని చేరుకున్నాను
నేను తిరిగి వచ్చినప్పుడు, నాకు నా పాత ఉద్యోగం మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే, ఆ దీవిలో వేరే డెన్టిస్ట్లు లేరు. అయితే, నేను పూర్తికాల పరిచర్యలో చేరాలని ఉద్దేశిస్తున్నానని వివరంగా చెప్పాను. చాలా సేపు మాట్లాడిన తర్వాత, నేను వారంలో మూడు రోజులు పనిచేయగలననీ, అయితే, వాళ్ళు మునుపు వారానికి ఆరు రోజులు చేసినప్పుడు ఇచ్చిన దాని కన్నా ఎక్కువ జీతాన్ని ఇస్తామనీ అంగీకరించడం జరిగింది. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని యేసు చెప్పిన మాటలు నిజమైనవని నిరూపించబడింది. (మత్తయి 6:33) మా దీవిలోని కొండప్రాంతాల్లో ప్రయాణం చేయడమనేది, కాళ్ళు బలహీనంగా ఉన్న నాకు ఎల్లప్పుడూ అంత సులభంగా ఉండేది కాదు. అయినప్పటికీ, నేను 14 సంవత్సరాలు పయినీరింగ్ చేయగల్గాను. మా దీవిలోని అనేక మంది తోటిమనుష్యులు సత్యాన్ని నేర్చుకునేందుకు సహాయపడగల్గాను—ఎంతో ఆనందించడానికి అది నిజంగా ఒక కారణమే.
1961లో, నేను పూర్తి క్వాలిఫికేషన్ గల డెన్టిస్ట్గా అయ్యేందుకు ప్రభుత్వం నన్ను రెండు సంవత్సరాల ఉచిత తర్ఫీదుకని ఫిజికి పంపాలని అనుకుంది. నాతో పాటు నా కుటుంబాన్ని తీసుకువెళ్ళవచ్చని కూడా వాళ్ళు చెప్పారు. అది నిజంగా ప్రలోభపెట్టే ప్రతిపాదనే. కాని బాగా గంభీరంగా ఆలోచించిన తర్వాత నేను దానిని నిరాకరించాను. సహోదరులను అంత దీర్ఘకాలం వదిలిపెట్టి వెళ్ళడమూ, వాళ్ళతో కలిసి సేవచేసే ఆధిక్యతను వదిలిపెట్టడమూ నేను కోరుకోని విషయాలు. ఆ ట్రిప్ప్ను సంస్థీకరించిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ చాలా అప్సెట్ అయ్యాడు. “అంతం ఎంతో సమీపంలో ఉందని మీరనుకుంటే, మీరు సంపాదించే డబ్బును మీరు అంతం వచ్చేలోగా ఉపయోగించుకోవచ్చు” అని ఆయన అన్నారు. కానీ నేను స్థిరంగా నిలబడ్డాను.
మరుసటి సంవత్సరం సంఘ పైవిచారణకర్తల కోసం దక్షిణాఫ్రికాలో జరిగే ఒక నెల ట్రెయినింగ్ అయిన కింగ్డమ్ మినిస్ట్రీ స్కూల్‌కు హాజరవ్వమని నాకు పిలుపు వచ్చింది. విలువైన నిర్దేశాలు మాకివ్వబడ్డాయి. మా సంఘ నియామకాలను మరింత ఫలవంతంగా నిర్వర్తించేందుకు అవి మాకు సహాయపడ్డాయి. ఆ స్కూల్ తర్వాత, ఒక ప్రయాణ పైవిచారణకర్తతో పనిచేయడంద్వారా నేను మరింత తర్ఫీదును పొందాను. తర్వాత, నేను సెయింట్ హలీనలోని రెండు సంఘాల్లో సబ్‌స్టిట్యూట్ సర్కిట్ ఓవర్సీయర్గా పది కన్నా ఎక్కువ సంవత్సరాలు సేవచేశాను. ఇంతలో, ఇతర యోగ్యులైన సహోదరులు లభ్యం కావడంతో, వంతులవారీ పద్ధతిలో సబ్‌స్టిట్యూట్ ఓవర్సీయర్ పని చేశాం.
ఈ సమయంలో, మేము జేమ్స్టౌన్ నుండి ఎక్కువ అవసరమున్న లెవల్వుడ్కు మారిపోయాం. అక్కడ పది సంవత్సరాలు ఉన్నాం. ఈ సమయంలో, నేను సరిగ్గా విశ్రాంతి లేకుండా చాలా కష్టపడ్డాను—పయినీరింగ్ చేసేవాడ్ని, వారానికి మూడు రోజులు ప్రభుత్వం కోసం పనిచేసేవాడ్ని, ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవాడ్ని. అంతేకాక, నేను సంఘ విషయాలను చూసుకునేవాడ్ని. ఎదుగుతున్న మా నలుగురు పిల్లల అవసరాలను నేనూ నా భార్య కలిసి చూసుకునేవాళ్ళం. వీటిని అధిగమించేందుకు నా మూడు రోజుల ఉద్యోగాన్ని వదులుకుని, మా దుకాణాన్ని అమ్మేసి, మూడు నెలల సెలవులకు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లోకి మా కుటుంబమంతటినీ తీసుకు వెళ్ళాను. ఆ తర్వాత మేము అసెన్షన్ దీవికి వెళ్ళి, అక్కడ ఒక సంవత్సరం నివసించాం. ఆ సమయంలో, బైబిలు సత్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించేందుకు మేము అనేకులకు సహాయపడగల్గాం.
మేము సెయింట్ హలీనకు తిరిగి వెళ్తూ, మళ్ళీ జేమ్స్టౌన్లోనే నివాసమేర్పరచుకున్నాం. రాజ్యమందిరంతో కలిసి ఉండే ఒక ఇల్లును పునర్నవీకరించుకున్నాం. కుటుంబ అవసరాలను తీర్చేందుకు, నేనూ నా కొడుకు జాన్ కలిసి, ఫోర్డ్ బండిని ఐస్‌క్రీమ్ వ్యాన్‌గా మార్చి, తర్వాతి ఐదు సంవత్సరాలు ఐస్‌క్రీమ్ అమ్మాం. ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టిన కొన్నాళ్ళకి, నాకు వ్యాన్ ఆక్సిడెంట్ అయ్యింది. వ్యాన్ పడిపోయి, నా కాళ్ళు అందులో చిక్కుకుపోయాయి. అలా, నా మోకాలు క్రింది నరాలు చచ్చుపడ్డాయి. నేను మళ్ళీ కోలుకునేందుకు మూడు నెలలు పట్టింది.
భూత భవిష్యత్ కాలాల్లో ఐశ్వర్వవంతమైన ఆశీర్వాదాలు
సంవత్సరాలుగా, మాకు అనేక ఆశీర్వాదాలు—ఆనందించడానికి అదనపు కారణాలు కలిగాయి. అందులో ఒకటి, 1985లో జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్ళి, అప్పటికీ నిర్మాణంలోనే ఉన్న క్రొత్త బెతేల్ హోమ్‌ను సందర్శించడం. మరొక ఆశీర్వాదం, నా కుమారుడు జాన్‌తోపాటు, జేమ్స్టౌన్కు సమీపాన అందమైన అసెంబ్లీ హాల్ నిర్మించడంలో చిన్న భాగం వహించగల్గడం. మా కుమారుల్లో ముగ్గురు పెద్దలుగా సేవ చేస్తున్నందుకూ, దక్షిణాఫ్రికాలోని బెతేల్లో మా మనుమడు సేవ చేస్తున్నందుకు కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. బైబిలు సత్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించడంలో అనేక మందికి సహాయపడడంలో కూడా నిశ్చయంగా ఎంతో ఆనందాన్నీ, సంతోషాన్ని పొందాం.
పరిచర్య చేసేందుకు మాకు ఉండే ప్రాంతం చాలా తక్కువ. అందులో కేవలం 5,000 మంది ప్రజలే ఉన్నారు. అయినప్పటికీ, ఒకే ప్రాంతాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగాయి. చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే మాతో కఠినంగా ఉంటారు. సెయింట్ హలీన దాని స్నేహశీలానికీ పేరుగాంచింది. మీరు ఎక్కడికి వెళ్ళినా, రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడైనా, కారులో వెళ్తున్నప్పుడైనా, మీకు ఎవరు తారసపడినా వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తారు. మీరు ప్రజలతో ఎంత ఎక్కువ పరిచయమేర్పరచుకుంటే, వాళ్ళకు సాక్ష్యమివ్వడం అంత సులభంగా ఉంటుందన్నది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం. చాలా మంది ప్రచారకులు ఈ దీవి విడిచి వెళ్ళినప్పటికీ, ఇక్కడ ఇప్పుడు 150 మంది ప్రచారకులు ఉన్నారు.
మా పిల్లలు అందరూ ఎదిగి, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వివాహమై 48 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనూ నా భార్యా మాత్రమే మిగిలిపోయాం. శోధనలు ఉన్నప్పటికీ యెహోవాను ఆనందంగా సేవ చేయడంలో కొనసాగేందుకు ఈ సంవత్సరాలన్నింటిలోనూ ఆమె చూపించిన నమ్మకమైన ప్రేమా, మద్దతూ నాకు సహాయపడ్డాయి. మా శారీరక బలం క్షీణించిపోతుంది, కానీ మా ఆధ్యాత్మిక బలం రోజురోజుకూ పెరుగుతోంది. (2 కొరింథీయులు 4:16) నేను 17 ఏండ్లప్పుడు ఎలా ఉండేవాడ్నో అంత కన్నా మంచి ఆరోగ్యాన్ని పుంజుకునే అద్భుతమైన భవిష్యత్తు కోసం నా కుటుంబంతోపాటు, నా స్నేహితులతోపాటు ఎదురు చూస్తున్నాను. అన్నింటి కన్నా ముఖ్యంగా, మన ప్రేమామయుడైన, మనపై శ్రద్ధ చూపే యెహోవా దేవుడ్నీ, ఇప్పుడు పరిపాలనలో ఉన్న ఆయన యొక్క రాజైన యేసుక్రీస్తునూ నిరంతరం సేవించగల్గేలా అన్ని విధాలా పరిపూర్ణతను ఆస్వాదించాలన్నదే నా అభిలాష.—నెహెమ్యా 8:10.
[26వ పేజీలోని చిత్రం]
జార్జ్ స్కీపీయో, ఆయన ముగ్గురు కుమారులు. వీళ్ళు ముగ్గురు పెద్దలుగా సేవచేస్తున్నారు
[29వ పేజీలోని చిత్రం]
జార్జ్ స్కీపీయో తన భార్య డోరస్‌తో