“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము”
విజయవంతమైన తోటపనికి కేవలం ఏదో కొన్ని విత్తనాల్ని నేలపై అలా అలా చల్లేసి, కొన్ని నెలల తర్వాత తిరిగివచ్చి కాపు కోసుకుందామనుకోవడం కన్నా ఎక్కువే. నేలను పదును పెట్టడానికి, విత్తనాలు విత్తడానికి, నీరుపెట్టడానికి, మొక్కలు కాపుకొచ్చేంతవరకు వాటిని పోషించడానికి చాలా కష్టపడవల్సి వస్తుంది.
ఈ పనంతా సామెతలు 22:6లో ఉన్న మాటల సత్యసంధతను నిరూపిస్తున్నాయి: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము; వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” నిజమే, బిడ్డను విజయవంతంగా పెంచడానికి తల్లిదండ్రుల శిక్షణ పెద్ద పాత్రను వహిస్తుంది.
అయితే దేన్నైనా అనుమతించే నేటి ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు ఈ సలహాను పాటించడంలో విఫలం అవుతున్నారు. పిల్లలు తమకై తాముగా సమస్యల్ని పరిష్కరించుకోవడం నేర్చుకోనివ్వాలని చెప్పే ఈ లోకంలో ప్రబలివున్న దృక్పథాన్ని పాటించినప్పుడు తరచూ పిల్లల్ని వాళ్ల మానానికి వాళ్లను వదిలేయడం జరుగుతుంది. వారు ఒంటరివారైపోతున్నారు. అటువంటి పద్ధతిని అవలంబించడం పిల్లలు, నీతినియమాల్లేని వ్యక్తుల కట్టుబాట్లను వదులుకున్న వ్యక్తుల కోరల్లో చిక్కుకునేలా చేస్తుంది.—సామెతలు 13:20.
తల్లిదండ్రులు తమ పిల్లల తొలి దశలోనే వాళ్ల మనసుల్లో, దైవిక శిక్షణ ద్వారా క్రైస్తవ సూత్రాలను నాటడం ఎంత శ్రేష్ఠం! తొలి దశ అంటే ఎంత వయస్సు నుండి అని అర్థం? “శిశుప్రాయం నుండి” అని అపొస్తలుడైన పౌలు సమాధానమిస్తున్నాడు. యువకుడైన తిమోతి విషయంలో అదే జరిగింది. ఆయన తల్లి అయిన యునీకే, అవ్వయైన లోయి “పరిశుద్ధ లేఖనములను” తిమోతి మనస్సులో నాటారు, తద్వారా ఆయన వాటిని “నేర్చుకుని” “రూఢియని తెలిసికొన్నాడు.” దాని ఫలితం? “రక్షణార్థమైన జ్ఞానము”ను ఆయన కల్గివుండేందుకు అటువంటి శిక్షణ ప్రాముఖ్యమైన పాత్రను వహించింది.—2 తిమోతి 1:5; 3:14, 15, NW.
అదే విధంగా నేడు, “మేలు చేయుటయందు విసుకక యుండే” తల్లిదండ్రులు ‘అలయక చేస్తే’ గొప్ప ఫలితాల్ని పొందుతారు. (గలతీయులు 6:9) జ్ఞానియైన సొలొమోను ఇలా చెబుతున్నాడు: “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును.”—సామెతలు 23:24.