కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 1/1 పేజీలు 11-20
  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్వాసం విషయంలో అబ్రాహాము మాదిరి
  • దేవుడు చెప్పేది వినడం
  • దేవునితో మాట్లాడటం
  • నేడు విశ్వాసంగలవారి రికార్డు
  • నేడే విశ్వాసాన్ని వృద్ధిచేసుకోండి
  • త్వరలో నెరవేరే నిరీక్షణ
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం మీకుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ‘వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోవడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 1/1 పేజీలు 11-20

“మీ హృదయములను స్థిరపరచుకొనుడి”

“మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.”—హెబ్రీయులు 10:36.

1, 2. (ఎ) మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవులకు ఏమి జరిగింది? (బి) మన విశ్వాసం బలహీనమైపోవడం ఎందుకు సులభం?

విశ్వాసం గురించి బైబిలు రచయితలందరిలోకి, అపొస్తలుడైన పౌలు కంటే ఎక్కువగా ఎవరూ ప్రస్తావించలేదు. విశ్వాసం బలహీనమైపోయిన వారి గురించి లేక విశ్వాసం చచ్చిపోయిన వారి గురించి ఆయన తరచుగా మాట్లాడాడు. ఉదాహరణకు, హుమెనైయును, అలెక్సంద్రు ‘విశ్వాస విషయమై ఓడబద్దలై పోవడాన్ని’ అనుభవించారు. (1 తిమోతి 1:19, 20) దేమా “యిహలోకమును స్నేహించి” పౌలును విడిచి వెళ్లాడు. (2 తిమోతి 4:10) కొందరు తమ క్రైస్తవ వ్యతిరేకమైన, బాధ్యతారహితమైన క్రియలతో “విశ్వాసత్యాగము” చేశారు. ఇతరులు అబద్ధ జ్ఞానము మూలంగా మోసగించబడి, “విశ్వాస విషయము తప్పిపోయిరి.”—1 తిమోతి 5:8; 6:20, 21.

2 ఆ అభిషిక్త క్రైస్తవులు అలా ఎందుకు తప్పిపోయారు? “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” (హెబ్రీయులు 11:1) మనం, మనం చూడలేని వాటిని విశ్వసిస్తాము. మనం చూడగల వాటికి అది అవసరం లేదు. అదృశ్య ఆధ్యాత్మిక సంపదల కంటే దృశ్యమైన సంపదల కోసం కృషి చేయడం సులభం. (మత్తయి 19:21, 22) ‘శరీరాశ నేత్రాశ’ వంటి అనేక దృశ్య విషయాలు మన అపరిపూర్ణ శరీరాన్ని బలంగా ఆకర్షించి, మన విశ్వాసాన్ని బలహీనపర్చగల్గుతాయి.—1 యోహాను 2:16.

3. క్రైస్తవులు ఎలాంటి విశ్వాసాన్ని అలవర్చుకోవాలి?

3 అయినప్పటికీ, పౌలు ఇలా చెబుతున్నాడు: “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” మోషేకు అలాంటి విశ్వాసం ఉంది. ఆయన “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి” యుంచి, “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” ఉండెను. (హెబ్రీయులు 11:6, 24, 26, 27) క్రైస్తవులకు అలాంటి విశ్వాసం అవసరం. గత శీర్షికలో పేర్కొనబడినట్లుగా, ఈ విషయంలో అబ్రాహాము చక్కని ఉదాహరణగా ఉన్నాడు.

విశ్వాసం విషయంలో అబ్రాహాము మాదిరి

4. అబ్రాహాము జీవన విధానం ఆయన విశ్వాసం ద్వారా ఎలా ప్రభావితమయ్యింది?

4 అన్ని జనాంగాల ప్రజలకు ఒక ఆశీర్వాదంగా ఉండే సంతానానికి తండ్రివవుతావని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసే సమయానికి అబ్రాహాము ఊరులో ఉన్నాడు. (ఆదికాండము 12:1-3; అపొస్తలుల కార్యములు 7:2, 3) ఆ వాగ్దానం ఆధారంగా, అబ్రాహాము యెహోవాకు విధేయుడై ముందు హారానుకు ఆ తర్వాత కనానుకు తరలి వెళ్లాడు. అక్కడ, యెహోవా అబ్రాహాము సంతానానికి ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 12:7; నెహెమ్యా 9:7, 8) అయితే, యెహోవా వాగ్దానం చేసినదానిలో అధికభాగం అబ్రాహాము మరణం తర్వాతే నెరవేరనైయుంది. ఉదాహరణకు, ఆయన శ్మశాన భూమిగా కొన్న మక్పేలాలోని గుహ తప్ప అబ్రాహాముకు కనానులో తనదంటూ స్వంతంగా ఏ భూమీ లేదు. (ఆదికాండము 23:1-20) అయినప్పటికీ, ఆయనకు యెహోవా వాక్యంలో విశ్వాసం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా, “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ [భవిష్యత్‌] పట్టణము” నందు ఆయనకు విశ్వాసం ఉంది. (హెబ్రీయులు 11:10) అలాంటి విశ్వాసం ఆయనను ఆయన జీవితమంతటిలోనూ బలపర్చింది.

5, 6. యెహోవా వాగ్దానానికి సంబంధించి అబ్రాహాము విశ్వాసం ఏ విధంగా పరీక్షించబడింది?

5 ప్రాముఖ్యంగా అబ్రాహాము సంతానం గొప్ప జనమౌతుందనే వాగ్దానానికి సంబంధించి మనం దీన్ని చూడవచ్చు. ఇది జరగాలంటే, అబ్రాహాముకు ఒక కుమారుడు ఉండాలి, కుమారుని కోసం ఆయన ఎంతోకాలం వేచివున్నాడు. ఆయన మొదట దేవుని వాగ్దానాన్ని విన్నప్పుడు ఆయన వయసెంతో మనకు తెలియదు కాని ఆయన హారానుకు సుదీర్ఘ ప్రయాణం చేసే సమయానికి కూడా యెహోవా ఆయనకు కుమారుడ్ని అనుగ్రహించలేదు. (ఆదికాండము 11:30) ఆయన ‘ఆస్తిని ఆర్జించి, మనుష్యులను సంపాదించుకోవడానికి’ తగినంత కాలం ఆయన హారానులో ఉన్నాడు, ఆయన కనానుకు వెళ్లే సమయానికి ఆయన వయసు 75 సంవత్సరాలు, శారా వయస్సు 65 సంవత్సరాలు. అప్పటికి కూడా వాళ్లకు కుమారుడు కలుగలేదు. (ఆదికాండము 12:4, 5) శారా తాను 70వ పడికి చేరుకునే సరికి, తాను ఇక అబ్రాహాముకు సంతానాన్ని ఇచ్చే వయస్సు దాటి పోయిందని భావించింది. కాబట్టి, ఆ సమయంలో ఉన్న వాడుక ప్రకారం, ఆమె తన దాసీయైన హాగరును అబ్రాహాముకు ఇవ్వడంతో, ఆమె అబ్రాహాముకు ఒక కుమారుడ్ని కంటుంది. కాని ఆ పిల్లవాడు వాగ్దాన సంతానం కాదు. హాగరు ఆమె కుమారుడు ఇష్మాయేలు చివరికి పంపివేయబడతారు. అయినప్పటికీ, అబ్రాహాము వారి పక్షాన విజ్ఞప్తి చేసినప్పుడు, ఇష్మాయేలును ఆశీర్వదిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు.—ఆదికాండము 16:1-4, 10; 17:15, 16, 18-20; 21:8-21.

6 దేవుడు తన స్వంత నిర్ణాయక సమయంలో అంటే వారు మొదటిసారి వాగ్దానాన్ని విన్న చాలా కాలం తర్వాత అంటే, అబ్రాహాముకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు శారాకి మగ సంతానమైన ఇస్సాకు జన్మించాడు. అది ఎంత అద్భుతంగా ఉండివుండవచ్చు! వృద్ధులైన ఈ జంటకు, “మృతతుల్యమైన” తమ శరీరాలు క్రొత్త జీవాన్ని ఉనికిలోకి తెచ్చినప్పుడు అది దాదాపు పునరుత్థానంలానే అయ్యింది. (రోమీయులు 4:19-21) దానికోసం ఎంతోకాలం వేచి చూడాల్సి వచ్చింది, కాని వాగ్దానం చివరికి నెరవేరినప్పుడు, ఆ నిరీక్షణకు తగ్గ ఫలితం లభించింది.

7. విశ్వాసం సహనంతో ఎలా ముడిపెట్టబడింది?

7 విశ్వాసం అంటే ఏదో కొద్ది కాలంపాటు ఉండేది మాత్రమే కాదని అబ్రాహాము విశ్వాసం మనకు జ్ఞాపకం చేస్తుంది. “మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది. . . . మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము” అని వ్రాసినప్పుడు పౌలు విశ్వాసాన్ని సహనంతో ముడిపెట్టాడు. (హెబ్రీయులు 10:36-39) వాగ్దాన నెరవేర్పు కోసం చాలామంది ఎంతోకాలం వేచివున్నారు. కొంతమంది పూర్తి జీవితకాలం వేచివున్నారు. వారి దృఢ విశ్వాసం వారిని బలపర్చింది. అబ్రాహాము వలే వారు, యెహోవా నిర్ణాయక సమయంలో తప్పక ప్రతిఫలాన్ని పొందుతారు.—హబక్కూకు 2:3.

దేవుడు చెప్పేది వినడం

8. నేడు మనం దేవుడు చెప్పేది ఎలా వింటాము, అది మన విశ్వాసాన్ని ఎందుకు బలపరుస్తుంది?

8 కనీసం నాలుగు విషయాలు అబ్రాహాము విశ్వాసాన్ని బలపర్చాయి, అవే విషయాలు మనకు కూడా సహాయం చేయగలవు. మొదటిగా, యెహోవా చెప్పేది వినడం ద్వారా ఆయన, ‘దేవుడు ఉన్నాడన్న తన నమ్మకాన్ని’ ప్రదర్శించాడు. అలా ఆయన, యెహోవాను నమ్మినప్పటికీ ఆయన మాటల యందు విశ్వాసం ఉంచని యిర్మీయా కాలంలోని యూదులకు భిన్నంగా ఉన్నాడు. (యిర్మీయా 44:15-19) నేడు, యెహోవా తన ప్రేరేపిత వాక్యమైన బైబిలు పుటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, అది “మీ హృదయములలో . . . చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది” అని పేతురు చెప్పాడు. (2 పేతురు 1:19) మనం బైబిలును శ్రద్ధగా చదివినప్పుడు, మనం “విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారు[తాము.]” (1 తిమోతి 4:6; రోమీయులు 10:17) అంతేగాక, ఈ అంత్య దినాల్లో, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలోనూ, బైబిలు ప్రవచనాన్ని అర్థం చేసుకోవడంలోనూ నడిపింపును అంటే “తగనవేళ [ఆధ్యాత్మిక] అన్నము”ను అందజేస్తున్నాడు. (మత్తయి 24:45-47) ఈ మాధ్యమం ద్వారా యెహోవా చెప్పేది వినడం, దృఢ విశ్వాసాన్ని కల్గివుండడానికి ఆవశ్యకం.

9. క్రైస్తవ నిరీక్షణను మనం నిజంగా నమ్ముతుంటే దాని ఫలితం ఏమైవుంటుంది?

9 అబ్రాహాము విశ్వాసం ఆయనకున్న నిరీక్షణతో సన్నిహిత సంబంధం కల్గివుంది. “తాననేక జనములకు తండ్రియగునట్లు, . . . అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.” (రోమీయులు 4:18) మనకు సహాయం చేయగల రెండవ విషయం ఇదే. యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” మనం ఎన్నడూ మరచిపోకూడదు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.” (1 తిమోతి 4:10) మనం నిజంగా క్రైస్తవ నిరీక్షణను నమ్ముతుంటే, అబ్రాహాము విషయంలోలాగే మన జీవిత విధానమంతా మనకున్న విశ్వాసానికి నిదర్శనంగా ఉంటుంది.

దేవునితో మాట్లాడటం

10. ఏ విధమైన ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరుస్తుంది?

10 అబ్రాహాము దేవునితో మాట్లాడాడు, ఆయన విశ్వాసాన్ని బలపర్చినవాటిలో ఇది మూడవ విషయం. నేడు, మనం కూడా, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించే బహుమానాన్ని ఉపయోగించుకుని యెహోవాతో మాట్లాడవచ్చు. (యోహాను 14:6; ఎఫెసీయులు 6:18) “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” అని యేసు ప్రశ్నించింది, ఎడతెగక ప్రార్థించడాన్ని నొక్కిచెప్పే ఉపమానాన్ని చెప్పిన తర్వాతే. (లూకా 18:8) విశ్వాసాన్ని బలపర్చే ప్రార్థన అనాలోచితమైనదీ లేక యాంత్రికమైనదీ కాదు. అది ఎంతో అర్థవంతమైనది. ఉదాహరణకు, మనం ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నప్పుడు లేక మనం అత్యధిక ఒత్తిడి క్రింద ఉన్నప్పుడు హృదయపూర్వకమైన ప్రార్థన అత్యంతావశ్యకం.—లూకా 6:12, 13; 22:41-44.

11. (ఎ) అబ్రాహాము యెహోవా ఎదుట తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆయన ఎలా బలపర్చబడ్డాడు? (బి) అబ్రాహాము అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

11 అబ్రాహాము వృద్ధుడౌతుండగా, యెహోవా ఆయనకు ఇంకా వాగ్దాన సంతానాన్ని ఇవ్వకుండా ఉన్నప్పుడు, ఆయన తన చింత గురించి దేవునితో మాట్లాడాడు. యెహోవా ఆయనకు ఇచ్చిన అభయాన్ని బలపర్చాడు. ఫలితం? అబ్రాహాము “యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.” ఆ తర్వాత యెహోవా తన అభయపూర్వకమైన మాటలను ధృవపర్చడానికి ఒక సూచనను ఇచ్చాడు. (ఆదికాండము 15:1-18) మనం యెహోవా ఎదుట ప్రార్థనలో మన హృదయాలను తెరిచి, యెహోవా తన వాక్యమైన బైబిలులో ఇస్తున్న అభయపూర్వకమైన మాటలను అంగీకరించి, పూర్ణ విశ్వాసంతో ఆయనకు విధేయత చూపిస్తే, అప్పుడు యెహోవా మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తాడు.—మత్తయి 21:22; యూదా 20, 21.

12, 13. (ఎ) యెహోవా నడిపింపును అనుసరించినప్పుడు అబ్రాహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు? (బి) ఎలాంటి అనుభవాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి?

12 అబ్రాహాము విశ్వాసాన్ని బలపర్చిన నాలుగవ విషయం ఏమిటంటే, అబ్రాహాము దేవుని నడిపింపును అనుసరించినప్పుడు యెహోవా ఆయనకిచ్చిన మద్దతే. దాడి చేస్తున్న రాజుల చేతుల్లో నుండి లోతును కాపాడడానికి అబ్రాహాము వెళ్లినప్పుడు, యెహోవా ఆయనకు విజయాన్ని అనుగ్రహించాడు. (ఆదికాండము 14:16, 20) తన సంతానం స్వాధీనం చేసుకోబోయే దేశంలో అబ్రాహాము తాత్కాలిక నివాసిగా జీవిస్తుండగా, యెహోవా ఆయనను వస్తుపరంగా ఆశీర్వదించాడు. (ఆదికాండము 14:21-23 పోల్చండి.) ఇస్సాకుకు తగిన భార్యను చూసే ప్రయత్నంలో ఆయన సేవకునికి యెహోవా నడిపింపును అనుగ్రహించాడు. (ఆదికాండము 24:10-27) అవును, యెహోవా “అన్ని విషయములలోను . . . అబ్రాహామును ఆశీర్వదించెను.” (ఆదికాండము 24:1) ఫలితంగా, యెహోవా ఆయనను ‘నా స్నేహితుడు’ అని పిలిచేంతగా ఆయన విశ్వాసం బలపర్చబడింది, యెహోవా దేవునితో ఆయన సంబంధం సన్నిహితమయ్యింది.—యెషయా 41:8; యాకోబు 2:23.

13 మనం నేడు అలాంటి దృఢమైన విశ్వాసాన్ని కల్గివుండగలమా? కల్గివుండగలం. అబ్రాహాము వలె మనం యెహోవా ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా ఆయనను శోధిస్తే, ఆయన మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఉదాహరణకు, సువార్త ప్రకటించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించినప్పుడు అనేకులు అద్భుతమైన విధంగా ఆశీర్వదించబడ్డారని 1998వ సంవత్సర సేవా రిపోర్టును ఒక్కసారి చూస్తే మనకు తెలుస్తుంది.—మార్కు 13:10.

నేడు విశ్వాసంగలవారి రికార్డు

14. రాజ్య వార్త నెం. 35తో చేసిన ప్రచారాన్ని యెహోవా ఎలా ఆశీర్వదించాడు?

14 గత 1997 అక్టోబరులో, రాజ్య వార్త నెం. 35తో చేసిన ప్రపంచ వ్యాప్త ప్రచార కార్యక్రమం లక్షలాదిమంది సాక్షుల ఆసక్తి, ఉత్సాహాల మూలంగా విశేషంగా విజయవంతమయ్యింది. ఘానాలో జరిగింది విశిష్టమైంది. నాలుగు భాషల్లో దాదాపు 2.5 కోట్ల కాపీలు పంచిపెట్టబడ్డాయి, ఫలితంగా ఇంచుమించు 2,000 బైబిలు పఠనాల కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. సైప్రస్‌లో ఇద్దరు సాక్షులు రాజ్య వార్త పంచిపెడుతుండగా, ఒక ప్రీస్టు తమను అనుసరించడాన్ని గమనించారు. కొద్దిసేపటి తర్వాత, వారు ఆయనకు రాజ్య వార్త కాపీని ఇవ్వబోయారు. ఆయన అప్పటికే ఒక కాపీని తీసుకుని ఉన్నాడు, ఆయనిలా అన్నాడు: “దీంట్లోని విషయం ఎంత బాగుందంటే, దీన్ని తయారు చేసిన ప్రజలను నేను అభినందించాలనుకుంటున్నాను.” డెన్మార్క్‌లో, చక్కని ఫలితాలతో రాజ్య వార్త 1.5 కోట్ల కాపీలు పంచిపెట్టబడ్డాయి. అక్కడ పౌర సంబంధాల సంస్థలో పనిచేసే ఒక స్త్రీ ఇలా చెప్పింది: “ఆ ట్రాక్ట్‌లో ప్రతి ఒక్కరి కోసం సందేశం ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం సులభం, అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరికను మీలో కలుగజేస్తుంది. అది సరిగ్గా తాకాల్సిన చోటే తాకుతుంది!”

15. అంతటా ఉన్న ప్రజలను చేరడానికి జరుగుతున్న కృషిని యెహోవా ఆశీర్వదించాడని ఏ అనుభవాలు చూపిస్తున్నాయి?

15 ప్రజలకు వారి ఇళ్లల్లోనే కాదుగాని ప్రతిచోట వారికి ప్రకటించడానికి 1998లో కృషి చేయడం జరిగింది. కోటె డీ ఐవరీలో ఒక మిషనరీ జంట ఓడ రేవులో 322 ఓడలను దర్శించారు. వాళ్లు 247 పుస్తకాలను, 2,284 పత్రికలను, 500 బ్రొషూర్లను, వందల కొలది కరపత్రాలను, అలాగే సముద్రం మీద ఉండగా చూడడానికి నావికులకు వీడియోలను అందజేశారు. కెనడాలో ఒక సాక్షి వాహన విడిభాగాలమ్మే ఒక షాపుకు వెళ్లాడు. ఆ షాపు యజమాని ఆసక్తి చూపించాడు, సహోదరుడు అక్కడ నాలుగున్నర గంటలు గడిపాడు, అయితే కొనుగోలుదారులు వస్తూ పోతుండగా సాక్ష్యమివ్వడంలో గడిపిన మొత్తం సమయం మాత్రం ఒక గంటే. చివరికి, రాత్రి పది గంటలకు పఠనం చేసుకోవడానికి ఏర్పాటు జరిగింది. అయితే, కొన్నిసార్లు మధ్యరాత్రి వరకూ పఠనం ప్రారంభించడానికి సాధ్యమయ్యేది కాదు, ఇక రెండింటి వరకూ పఠనం కొనసాగేది. ఆ పఠన సమయాలు ఒక సవాలుగా ఉండేవి కాని తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. కూటాలకు హాజరు కావడానికి ఆ వ్యక్తి ఆదివారాల్లో తన షాపును మూసేయడానికి నిర్ణయించుకున్నాడు. త్వరలోనే ఆయనా ఆయన కుటుంబం చక్కని అభివృద్ధి సాధించడం మొదలు పెట్టారు.

16. ప్రకటించే, బోధించే పనుల్లో దేవుడు కోరుతున్నాడు బ్రొషూరు, జ్ఞానము పుస్తకం శక్తివంతమైన ఉపకరణాలుగా ఉన్నాయని ఏ అనుభవాలు చూపిస్తున్నాయి?

16 దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రొషూరు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకము ప్రకటించే, బోధించే పనుల్లో శక్తివంతమైన ఉపకరణాలుగా ఉన్నాయి. ఇటలీలో బస్సు కోసం వేచివున్న ఒక నన్‌ రాజ్య వార్త కాపీని తీసుకుంది. మరునాడు మళ్లీ ఆమెను కలిసినప్పుడు ఆమె దేవుడు కోరుతున్నాడు బ్రొషూరును తీసుకుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఆమె బస్‌ స్టాప్‌లో 10 నుండి 15 నిమిషాల పాటు బైబిలు పఠనం చేసేది. ఒక నెలన్నర తర్వాత, ఆమె కాన్వెంట్‌ను విడిచి గౌటిమలాలోవున్న తన ఇంటికి వెళ్లి పఠనాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకుంది. మలావీలో, శ్రద్ధగా చర్చికి వెళ్లే లోబీన అనే స్త్రీ కుమార్తెలు యెహోవాసాక్షులతో బైబిలు పఠనాన్ని ప్రారంభించారు, అది ఆమెకు సుతరాము ఇష్టం లేదు. అయినప్పటికీ, సాధ్యమైనప్పుడల్లా ఆ అమ్మాయిలు తమ తల్లితో బైబిలు సత్యాన్ని పంచుకునేవారు. 1997 జూన్‌లో, లోబీన జ్ఞానము పుస్తకాన్ని చూసింది, “నిత్యజీవానికి నడిపించే జ్ఞానము” అనే వాక్యం ఆమెలో ఆసక్తిని రేకెత్తించింది. జూలైలో ఆమె బైబిలు పఠనానికి అంగీకరించింది. ఆగస్టులో ఆమె జిల్లా సమావేశానికి హాజరై, మొత్తం కార్యక్రమమంతా శ్రద్ధగా విన్నది. ఆ నెల చివరికల్లా, ఆమె తన చర్చిని వదిలేసి, బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలిగా అర్హురాలయ్యింది. ఆమె 1997 నవంబరులో బాప్తిస్మం తీసుకుంది.

17, 18. ఆధ్యాత్మిక విషయాలను “చూడడానికి” వ్యక్తులకు సహాయం చేసేలా సంస్థ వీడియోలు ఎలా ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి?

17 సంస్థ వీడియోలు, అనేకులు ఆధ్యాత్మిక విషయాలను “చూడడానికి” సహాయం చేశాయి. మారిషస్‌లో ఒక వ్యక్తి చర్చిలో ఉన్న అనైక్యతను బట్టి చర్చికి వెళ్లడం మానుకున్నాడు. ఒక మిషనరీ, దైవిక బోధచే ఐక్యమవ్వడం (ఆంగ్లం) అనే వీడియోను ఉపయోగించి యెహోవాసాక్షుల మధ్య ఉన్న ఐక్యతను ఆయనకు చూపించాడు. దానితో ప్రభావితుడైన ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “యెహోవాసాక్షులైన మీరు ఇప్పటికే పరదైసులో ఉన్నారు!” ఆయన బైబిలు పఠనానికి అంగీకరించాడు. జపాన్‌లో ఒక సహోదరి యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోను అవిశ్వాసియైన తన భర్తకు చూపించింది, క్రమ బైబిలు పఠనం తీసుకునేలా ఆయన ప్రేరేపించబడ్డాడు. దైవిక బోధచే ఐక్యమవ్వడం (ఆంగ్లం) అనే వీడియోను చూసిన తర్వాత ఆయన తానూ యెహోవా సాక్షిని కావాలని కోరుకున్నాడు. బైబిలు—వాస్తవాల, ప్రవచనాల పుస్తకం (ఆంగ్లం) అనే మూడు భాగాల వీడియో, బైబిలు సూత్రాలను తన జీవితంలో అన్వయించుకోవడానికి ఆయనకు సహాయం చేసింది. చివరగా, యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం) అనే వీడియో, యెహోవా తన ప్రజలను సాతాను దాడులకు వ్యతిరేకంగా బలపరుస్తాడని ఆయనకు చూపించింది. 1997 అక్టోబరులో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.

18 గత సేవా సంవత్సరంలో అనుభవించిన అనేకానేక ఆనందాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. యెహోవాసాక్షులకు సజీవమైన విశ్వాసం ఉందనీ, వారి కార్యకలాపాన్ని ఆశీర్వదించడం ద్వారా యెహోవా ఆ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడనీ ఆ అనుభవాలు చూపిస్తున్నాయి.—యాకోబు 2:17.

నేడే విశ్వాసాన్ని వృద్ధిచేసుకోండి

19. (ఎ) అబ్రాహాము కంటే మనం ఏ విధంగా మెరుగైన స్థితిలో ఉన్నాము? (బి) యేసు బలి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గత సంవత్సరం ఎంతమంది సమకూడారు? (సి) గత సంవత్సరం ఏ దేశాల్లో విశేషమైన సంఖ్యల్లో ప్రజలు జ్ఞాపకార్థదినానికి హాజరయ్యారు? (12 నుండి 15 వరకు ఉన్న పేజీల్లోని చార్టును చూడండి.)

19 అనేక విధాలుగా మనం నేడు అబ్రాహాము కంటే మేలైన స్థితిలో ఉన్నాము. అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానాలనన్నింటినీ యెహోవా నెరవేర్చాడని మనకు తెలుసు. అబ్రాహాము సంతానం కనానును వారసత్వంగా పొందింది, వారు నిజంగానే ఒక గొప్ప జనమయ్యారు. (1 రాజులు 4:20; హెబ్రీయులు 11:12) అంతేగాక, అబ్రాహాము హారానును వదిలివెళ్లిన దాదాపు 1,971 సంవత్సరాల తర్వాత, ఆయన వంశీకులలో ఒకడైన యేసు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా నీటిలో బాప్తిస్మం తీసుకున్నాడు, సంపూర్ణ ఆధ్యాత్మిక భావంలో అబ్రాహాము సంతానమైన మెస్సీయా అయ్యేందుకు సాక్షాత్తూ యెహోవా నుండి వచ్చిన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాడు. (మత్తయి 3:16, 17; గలతీయులు 3:16) సా.శ. 33 నీసాను 14న, యేసు తనయందు విశ్వాసం ఉంచే వారి కోసం తన జీవితాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడు. (మత్తయి 20:28; యోహాను 3:16) ఆయనను బట్టి కోట్లాదిమంది ఇప్పుడు ఆశీర్వాదాలను పొందగలరు. ఈ అద్భుతమైన ప్రేమ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గత సంవత్సరం నీసాను 14న 1,38,96,312 మంది సమావేశమయ్యారు. గొప్ప వాగ్దానాలను నెరవేర్చేవాడైన యెహోవాకు ఎంతటి ఘనత!

20, 21. (ఎ) మొదటి శతాబ్దంలో, అన్ని జనాంగాలకు చెందిన ప్రజలు అబ్రాహాము సంతానం ద్వారా తమపైకి తాము ఆశీర్వాదాలను ఎలా తెచ్చుకున్నారు, నేడు వారు ఎలా తెచ్చుకుంటున్నారు?

20 మొదటి శతాబ్దంలో, శారీరక ఇశ్రాయేలీయులతో మొదలుకొని అన్ని జనాంగాలకు చెందిన అనేకులు అబ్రాహాము యొక్క ఈ సంతానమందు విశ్వాసం ఉంచి “దేవుని ఇశ్రాయేలు”లో నూతన, ఆధ్యాత్మిక సభ్యులైన దేవుని అభిషిక్త కుమారులయ్యారు. (గలతీయులు 3:26-29; 6:16; అపొస్తలుల కార్యములు 3:25, 26) దేవుని రాజ్యంలో సహపరిపాలకులుగా పరలోకంలో అమర్త్య ఆత్మ జీవితాన్ని పొందే కచ్చితమైన ఉత్తరాపేక్ష వారికి ఉంది. కేవలం 1,44,000 మందే ఈ విధంగా ఆశీర్వదించబడతారు, వారిలో కొంతమందే మిగిలివున్నారు. (ప్రకటన 5:9, 10; 7:4) గత సంవత్సరం, జ్ఞాపకార్థ సమయంలో చిహ్నాలలో భాగం వహించడం ద్వారా 8,756 మంది తాము ఈ సంఖ్యకు చెందినవారమన్న తమ నమ్మకాన్ని ధృవీకరించారు.

21 నేడు యెహోవాసాక్షుల్లోని దాదాపు అందరూ ప్రకటన 7:9-17 నందు ప్రవచించబడిన “గొప్ప సమూహానికి” చెందిన వారే. వారు యేసు ద్వారా తమకు తాము ఆశీర్వాదాలను తెచ్చుకుంటున్నారు గనుక, వారికి పరదైసు భూమి మీద నిత్యజీవ నిరీక్షణ ఉంది. (ప్రకటన 21:3-5) 1998లో ప్రకటనా పనిలో భాగం వహించిన 58,88,650 మంది, ఈ సమూహం నిజంగానే ‘గొప్పది’ అనడానికి నిదర్శనంగా ఉన్నారు. రష్యా మరియు యుక్రేయిన్‌ రెండూ కూడా మొదటిసారిగా 1,00,000 మంది ప్రచారకులను నివేదించడాన్ని చూడడం ప్రాముఖ్యంగా ఉత్తేజకరంగా ఉంది. అమెరికా నుండి వచ్చిన నివేదిక కూడా విశేషమైనది—ఆగస్టులో 10,40,283 మంది ప్రచారకులు! గత సంవత్సరం 1,00,000 కంటే ఎక్కువమంది ప్రచారకులను నివేదించిన 19 దేశాల్లో ఇవి కేవలం మూడు మాత్రమే.

త్వరలో నెరవేరే నిరీక్షణ

22, 23. (ఎ) మనం నేడు మన హృదయాలను ఎందుకు స్థిరపర్చుకోవాలి? (బి) పౌలు ప్రస్తావించిన విశ్వాసం లేని వారిలా కాక అబ్రాహాములా ఉన్నామని మనం ఎలా నిరూపించుకోగలం?

22 యెహోవా వాగ్దాన నెరవేర్పులో మనం ఎంత దూరం వచ్చేశామనేది జ్ఞాపకార్థదినానికి హాజరైనవారికి గుర్తు చేయబడింది. 1914లో దేవుని పరలోక రాజ్యానికి యేసు రాజుగా సింహాసనాసీనుడయ్యాడు, దానితో రాజ్యాధికారంతో ఆయన ప్రత్యక్షత ప్రారంభమయ్యింది. (మత్తయి 24:3; ప్రకటన 11:15) అవును, అబ్రాహాము సంతానం ఇప్పుడు పరలోకంలో పరిపాలిస్తున్నాడు! తన కాలం నాటి క్రైస్తవులకు యాకోబు ఇలా చెప్పాడు: “ప్రభువురాక [“ప్రత్యక్షత,” NW] సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.” (యాకోబు 5:8) ఆ ప్రత్యక్షత ఇప్పుడు ఒక వాస్తవమై ఉంది! మన హృదయాలను స్థిరపర్చుకోవడానికి ఎంత చక్కటి కారణం!

23 దేవుని వాగ్దానాలలో మన నమ్మకం క్రమ బైబిలు పఠనం ద్వారా, అర్థవంతమైన ప్రార్థన ద్వారా ఎడతెగక పునర్నూతనం కావించబడాలి. మనం యెహోవా వాక్యానికి విధేయత చూపిస్తూ నిరంతరం ఆయన ఆశీర్వాదాలను పొందుదము గాక. అప్పుడు మనం తమ విశ్వాసం బలహీనమైపోయిన లేక తమ విశ్వాసం చచ్చిపోయిన, పౌలు ప్రస్తావించిన వారిలా కాక అబ్రాహాములా ఉంటాము. మనల్ని మన పరిశుద్ధ విశ్వాసం నుండి ఏదీ వేరు చేయలేదు. (యూదా 20) 1999 సేవా సంవత్సరంలోనూ అలాగే భవిష్యత్తులో నిరంతరమూ యెహోవా సేవకులందరి పట్లా అది నిజమైవుండాలని మేము ప్రార్థిస్తున్నాము.

మీకు తెలుసా?

◻ నేడు మనం దేవుడు చెప్పేది ఎలా వినగలం?

◻ దేవునికి అర్థవంతమైన ప్రార్థనలను చేయడం ఏ ప్రయోజనాలను తెస్తుంది?

◻ మనం విధేయతాపూర్వకంగా యెహోవా నడిపింపును అనుసరిస్తే, మన విశ్వాసం ఎలా బలపర్చబడుతుంది?

◻ (12 నుండి 15 పేజీలలోవున్న) వార్షిక రిపోర్టులోని ఏ అంశాలు ప్రాముఖ్యంగా మీకు ఆసక్తికరమైనవిగా అనిపించాయి?

[12-15వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 1998 సేవా సంవత్సరపు నివేదిక

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

[16వ పేజీలోని చిత్రం]

మనం యెహోవా వాక్యాన్ని వింటే, ఆయన వాగ్దానాలయందు మన నమ్మకం పునర్వికాసం కావించబడుతుంది

[18వ పేజీలోని చిత్రం]

తన ఆజ్ఞలను అనుసరించేవారిని యెహోవా ఆశీర్వదించి తద్వారా వారి విశ్వాసాన్ని బలపరుస్తాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి