కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 1/1 పేజీలు 6-11
  • అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం మీకుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం మీకుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని నడిపింపుకు విధేయత చూపించడం
  • నేడు అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం
  • పరీక్షలెదురైనప్పటికీ నమ్మకంగా ఉండటం
  • నేడు సహనం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • అబ్రాహాము—దేవుని స్నేహితుడు
    నా బైబిలు కథల పుస్తకము
  • అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు
    నా బైబిలు పుస్తకం
  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 1/1 పేజీలు 6-11

అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం మీకుందా?

“మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?”—లూకా 18:8.

1. ఒకరు తమ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోవడం నేడు ఎందుకంత సులభం కాదు?

ఒకరు తమ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోవడం నేడు అంత సులభం కాదు. ఆధ్యాత్మిక విషయాల పైనుండి క్రైస్తవుల అవధానాన్ని పక్కదారిపట్టించే ఈ లోకం వారిపైకి విపరీతమైన ఒత్తిడిని తెస్తుంది. (లూకా 21:34; 1 యోహాను 2:15, 16) యుద్ధాలు, విపత్తులు, రోగాలు, లేక ఆకలి వంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని జీవించడానికి అనేకులు ఎంతో కృషి చేయాల్సివస్తోంది. (లూకా 21:10, 11) అనేక దేశాల్లో, మతవ్యతిరేక సంస్కృతి ప్రబలంగా ఉంది, తమ విశ్వాసం అనుసారంగా జీవించేవారు చాదస్తపువారిగా, చివరికి మతోన్మాదులుగా దృష్టించబడుతున్నారు. అంతేగాక, అనేకమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బట్టి హింసించబడుతున్నారు. (మత్తయి 24:9) దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసు వేసిన ఈ ప్రశ్న కచ్చితంగా సరైనదే: “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?”—లూకా 18:8.

2. (ఎ) క్రైస్తవునికి దృఢ విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మనం ఎవరి విశ్వాస మాదిరిని పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది?

2 అయితే వాస్తవమేమిటంటే, మనం మన జీవితాన్ని ఇప్పుడు విజయవంతం చేసుకుని, భవిష్యత్తులో వాగ్దానం చేయబడిన నిత్యజీవాన్ని పొందాలంటే మనకు దృఢ విశ్వాసం ప్రాముఖ్యం. హబక్కూకుతో యెహోవా చెప్పిన మాటలను ఎత్తివ్రాస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. . . . విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీయులు 10:38–11:6; హబక్కూకు 2:4) పౌలు తిమోతికిలా చెప్పాడు: “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి[తివి].” (1 తిమోతి 6:12) అయితే సడలని దృఢ విశ్వాసాన్ని కల్గివుండడం ఎలా సాధ్యం? ఆ ప్రశ్నను పరిశీలించడానికి, దాదాపు 4,000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తి వైపు చూడడం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయన విశ్వాసం ఇప్పటికీ ఇస్లాం, యూదా, క్రైస్తవత్వం వంటి మూడు ప్రధాన మతాల్లో ఎంతో ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. ఆయనే అబ్రాహాము. ఆయన విశ్వాసం ఎందుకంత విశిష్టమైనది? నేడు మనం ఆయనను అనుకరించగలమా?

దేవుని నడిపింపుకు విధేయత చూపించడం

3, 4. తెరహు తన కుటుంబాన్ని ఊరు పట్టణం నుండి హారాను పట్టణానికి ఎందుకు తరలించాడు?

3 అబ్రాహాము (మొదట్లో అబ్రాము అని పిలువబడేవాడు) గురించి బైబిల్లో మొదటిసారిగా దాని తొలి భాగాల్లోనే ప్రస్తావించబడింది. ఆదికాండము 11:26లో మనమిలా చదువుతాము: “తెరహు . . . అబ్రామును నాహోరును హారానును కనెను.” తెరహు ఆయన కుటుంబం కల్దీయుల ఊరనే పట్టణంలో నివసించేవారు, అది దక్షిణ మెసొపొతమియలో ఉన్న సుసంపన్నమైన నగరం. అయితే, వాళ్లు అక్కడే ఉండిపోలేదు. “తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్లుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.” (ఆదికాండము 11:31) అబ్రాహాము సహోదరుడైన నాహోరు కూడా తన కుటుంబంతోపాటు హారాను పట్టణానికి వచ్చాడు. (ఆదికాండము 24:10, 15; 28:1, 2; 29:4) మరి తెరహు సుసంపన్నమైన ఊరు పట్టణం నుండి సుదూర ప్రాంతమైన హారాను పట్టణానికి ఎందుకు తరలి వెళ్లాడు?

4 అబ్రాహాము కాలానికి దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత జీవించిన నమ్మకమైన వ్యక్తియైన స్తెఫెను, యూదా సమాజమందిరం ఎదుట మాట్లాడుతూ, తెరహు కుటుంబం ఇలా అసాధారణంగా తరలి వెళ్లడానికిగల కారణాన్ని గురించి వివరించాడు. ఆయనిలా చెప్పాడు: “మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై—నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయ హారానులో కాపురముండెను.” (అపొస్తలుల కార్యములు 7:2-4) తెరహు తన స్వంత కుటుంబాన్ని హారానుకు తరలించినప్పుడు, ఆయన అబ్రాహాముపట్ల యెహోవాకున్న చిత్తానికి విధేయత చూపించాడు.

5. తన తండ్రి మరణించాక అబ్రాహాము ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు?

5 తెరహు కుటుంబం తమ క్రొత్త నగరంలో స్థిరపడ్డారు. సంవత్సరాల తర్వాత అబ్రాహాము ‘నా స్వదేశము’ అన్నప్పుడు ఆయన మాట్లాడింది హారాను గురించే కాని ఊరు గురించి కాదు. (ఆదికాండము 24:4) అయినప్పటికీ, హారాను కూడా అబ్రాహాముకు శాశ్వత నివాసం కాదు. స్తెఫెను చెప్పినదాని ప్రకారం, “[అబ్రాహాము] తండ్రి చనిపోయన తరువాత, అక్కడనుండి మీరిప్పుడు కాపురమున్న యూ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.” (అపొస్తలుల కార్యములు 7:4) అబ్రాహాము యెహోవా ఇచ్చిన నిర్దేశానికి విధేయుడై లోతుతోపాటు యూఫ్రటీసునదిని దాటి కనాను దేశంలోకి ప్రవేశించాడు.a

6. యెహోవా అబ్రాహాముకు ఏమి వాగ్దానం చేశాడు?

6 యెహోవా అబ్రాహామును కనానుకు తరలి వెళ్లేలా ఎందుకు చేశాడు? దానికిగల కారణానికీ, ఆ నమ్మకమైన వ్యక్తి పట్ల దేవునికిగల సంకల్పాలకూ సంబంధం ఉంది. యెహోవా అబ్రాహాముతో ఇలా చెప్పాడు: “నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడు[ను.]” (ఆదికాండము 12:1-3) యెహోవా కాపుదలను అనుభవించబోయే, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకొనబోయే గొప్ప జనాంగానికి అబ్రాహాము తండ్రి అవుతాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం! కాని ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అబ్రాహాము తీవ్రమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది.

7. యెహోవా వాగ్దానం చేసినదాన్ని పొందేందుకు అబ్రాహాము ఏ మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి?

7 అబ్రాహాము ఊరును విడిచిపెట్టినప్పుడు, ఆయన సుసంపన్నమైన నగరాన్నే కాదు తన తండ్రి విస్తృత కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి వచ్చివుంటాడు. ఆ ప్రాచీన కాలాల్లో అలాంటి విస్తృత కుటుంబమే భద్రతకు ముఖ్యమైన మూలంగా ఉండేది. ఆయన హారాను విడిచి బయల్దేరినప్పుడు, తన సహోదరుడైన నాహోరు కుటుంబంతో సహా తన తండ్రి కుటుంబాన్ని విడిచి తెలియని దేశానికి చేరుకున్నాడు. కనానులో ఆయన నగర గోడల మధ్య సురక్షితంగా ఉండడానికి ప్రయత్నించలేదు. ఎందుకు? అబ్రాహాము ఆ దేశంలోకి ప్రవేశించిన కొంతకాలానికి యెహోవా, “నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని” చెప్పాడు. (ఆదికాండము 13:17) 75 సంవత్సరాల అబ్రాహాము, ఆయన భార్యయైన 65 సంవత్సరాల శారా ఈ నిర్దేశాలను అనుసరించారు. ‘విశ్వాసమునుబట్టి అతడు . . . గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసి అయ్యాడు.’—హెబ్రీయులు 11:9; ఆదికాండము 12:4.

నేడు అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం

8. అబ్రాహాము, ఇతర ప్రాచీనకాల సాక్షుల ఉదాహరణ దృష్ట్యా, మనం ఏమి అలవర్చుకోవాలి?

8 అబ్రాహాము ఆయన కుటుంబం హెబ్రీయులు 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ‘[క్రైస్తవపూర్వ] సాక్షుల గొప్ప మేఘములో’ భాగంగా లెక్కించబడ్డారు. దేవుని ఈ తొలి సేవకుల విశ్వాసం దృష్ట్యా, “ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును [విశ్వాసలేమిని] విడిచి” పెట్టమని పౌలు క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నాడు. (హెబ్రీయులు 12:1) అవును, విశ్వాసలేమి ‘మనల్ని సుళువుగా చిక్కులబెట్టగలదు.’ కాని పౌలు కాలంలోనూ మన కాలంలోనూ నిజ క్రైస్తవులు అబ్రాహాము విశ్వాసానికీ ప్రాచీన కాలాలకు చెందిన ఇతరుల విశ్వాసానికీ పోల్చదగిన దృఢ విశ్వాసాన్ని అలవర్చుకోగలిగారు. తన గురించీ, తోటి క్రైస్తవుల గురించీ మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు: “అయతే మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.”—హెబ్రీయులు 10:39.

9, 10. అనేకులకు నేడు అబ్రాహాముకున్నటు వంటి విశ్వాసం ఉందనడానికి ఏ సాక్ష్యాధారం ఉంది?

9 నిజమే, అబ్రాహాము కాలం నుండి ప్రపంచం ఎంతో మారిపోయింది. అయినప్పటికీ, మనం అదే ‘అబ్రాహాము దేవుని’ సేవ చేస్తున్నాము, ఆయన మారడు. (అపొస్తలుల కార్యములు 3:13; మలాకీ 3:6) యెహోవా అబ్రాహాము కాలంలో ఆరాధించబడడానికి అర్హుడైనట్లుగానే నేడు కూడా ఆరాధించబడడానికి ఆయన అర్హుడు. (ప్రకటన 4:11) అబ్రాహాము వలె అనేకులు యెహోవాకు తమను తాము సంపూర్ణంగా సమర్పించుకుని, దేవుని చిత్తాన్ని చేయడానికి తమ జీవితాల్లో చేసుకోవలసిన ఏ మార్పులనైనా చేసుకుంటున్నారు. గత సంవత్సరం, 3,16,092 మంది “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తమ సమర్పణను బహిరంగంగా వెల్లడి చేశారు.—మత్తయి 28:19.

10 క్రొత్తగా క్రైస్తవులైన వీరిలో అనేకులు తమ సమర్పణను నెరవేర్చుకోవడానికి సుదూర ప్రాంతాలకు ప్రయాణించవలసిన అవసరం ఏర్పడలేదు. అయితే, ఆధ్యాత్మిక భావంలో, చాలామంది చెప్పుకోదగినంత దూరం ప్రయాణించారు. ఉదాహరణకు, మారిషస్‌లో, ఎల్సీ మంత్రగత్తెగా ఉండేది. అందరూ ఆమె అంటే భయపడేవారు. ఒక ప్రత్యేక పయినీరు ఎల్సీ కుమార్తెతో బైబిలు పఠనం చేయడానికి ఏర్పాటు చేసుకుంది, అది ఎల్సీ “చీకటిలోనుండి వెలుగులోనికి” రావడానికి మార్గం తెరిచింది. (అపొస్తలుల కార్యములు 26:18) ఎల్సీ తన కుమార్తెకున్న ఆసక్తిని బట్టి, నా బైబిలు కథల పుస్తకం పఠించడానికి అంగీకరించింది. ఆమెతో వారానికి మూడుసార్లు పఠనం నిర్వహించబడేది ఎందుకంటే ఆమెకు ఎడతెగని ప్రోత్సాహం అవసరమయ్యేది. అభిచార సంబంధమైన ఆమె ఆచారాలు ఆమెకు ఏ ఆనందాన్నీ తీసుకురాలేదు, ఆమెకు ఎన్నో వ్యక్తిగత సమస్యలుండేవి. అయితే చివరికి, ఆమె పిశాచాల నమ్మకం నుండి సత్యారాధనకు సాగించిన సుదీర్ఘ ప్రయాణంలో తన గమ్యస్థానాన్ని చేరుకోగల్గింది. ఆమె సహాయాన్ని కోరుతూ ప్రజలు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, కేవలం యెహోవా మాత్రమే కీడు నుండి మనల్ని కాపాడగలడని ఆమె వారికి వివరించేది. ఎల్సీ ఇప్పుడు బాప్తిస్మం పొందిన సాక్షి, ఆమె కుటుంబంలో నుండి పరిచయస్తుల్లో నుండి 14 మంది సత్యాన్ని అంగీకరించారు.

11. తమను తాము యెహోవాకు సమర్పించుకునేవారు ఏ మార్పులు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నారు?

11 గత సంవత్సరం దేవుని సేవ చేయడానికి తమను తాము సమర్పించుకున్న వారు అలాంటి తీవ్రమైన మార్పులను చేసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. కాని అందరూ ఆధ్యాత్మికంగా మృతకరమైన స్థితి నుండి ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండే స్థితికి వచ్చారు. (ఎఫెసీయులు 2:1) భౌతికంగా ఇప్పటికీ ఈ ప్రపంచంలోనే ఉన్నప్పటికీ, వారిక ఎంతమాత్రం దానిలో భాగం కారు. (యోహాను 17:15, 16) తమ “పౌరస్థితి పరలోకమునందున్న” అభిషిక్త క్రైస్తవులలానే, వారు “పరదేశులును యాత్రికులునైయున్నారు.” (ఫిలిప్పీయులు 3:20; 1 పేతురు 2:11) వారు అన్నిటికీ పైగా దేవుని పట్లా పొరుగువారి పట్లా తమకుగల ప్రేమతో పురికొల్పబడి, తమ జీవితాలను దేవుని ప్రమాణాలకు అనుగుణంగా చేసుకున్నారు. (మత్తయి 22:37-39) వారు స్వార్థపూరిత, వస్తుదాయక లక్ష్యాల కోసం పాటుపడరు లేక ఈ లోకంలో వ్యక్తిగత ఆశలను తీర్చుకోవాల్సిన అవసరత ఉందని భావించరు. బదులుగా, వారు తమ కళ్లను ‘నీతి నివసించే క్రొత్త ఆకాశముల మీదా క్రొత్త భూమి మీదా’ కేంద్రీకరిస్తారు.—2 పేతురు 3:13; 2 కొరింథీయులు 4:18.

12. గత సంవత్సరం నివేదించబడిన ఏ కార్యకలాపం, యేసు తన ప్రత్యక్షతా సమయంలో “భూమిమీద విశ్వాసము” కనుగొన్నాడనే దానికి నిదర్శనాన్నిస్తుంది?

12 అబ్రాహాము కనానుకు కదిలి వెళ్లినప్పుడు, ఆయనా ఆయన కుటుంబం ఒంటరిగా ఉన్నారు, వారికి కేవలం యెహోవా మద్దతు, కాపుదల మాత్రమే ఉన్నాయి. అయితే, క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న ఈ 3,16,092 మంది క్రైస్తవులు ఎంతమాత్రం ఒంటరివారు కారు. నిజమే, అబ్రాహాముకు ఇచ్చినట్లుగానే యెహోవా తన ఆత్మ ద్వారా వారికి మద్దతునిచ్చి, కాపాడతాడు. (సామెతలు 18:10) అంతేగాక, నేటి కొన్ని దేశాలకన్నా ఎక్కువ జనసాంద్రతగల శక్తివంతమైన అంతర్జాతీయ “జాతి” లేక “దేశము” ద్వారా ఆయన వారికి మద్దతునిస్తున్నాడు. (యెషయా 66:8, పరిశుద్ధ బైబిల్‌) గత సంవత్సరం, ఆ దేశానికి లేదా జాతికి చెందిన శిఖరాగ్ర సంఖ్యయైన 58,88,650 మంది పౌరులు తమ పొరుగువారితో దేవుని వాగ్దానాల గురించి మాట్లాడటం ద్వారా తమ సజీవ విశ్వాసానికి నిదర్శనాన్ని ఇచ్చారు. (మార్కు 13:10) వారు ఆసక్తిగల వారిని కనుగొనడానికి కృషి చేస్తూ ఈ పనిలో అత్యంత విశేషంగా 118,66,66,708 గంటలు గడిపారు. ఫలితంగా, విశ్వాసాన్ని వృద్ధిపర్చుకోవాలనుకుంటున్న ఇతరులతో 43,02,852 బైబిలు పఠనాలు నిర్వహించబడ్డాయి. వారి ఆసక్తికి మరింత నిదర్శనగా, ఈ “జాతికి” లేక “దేశానికి” చెందిన 6,98,781 మంది పూర్తికాలంగానైనా లేదా ఒక నెల లేక అంతకన్నా ఎక్కువ కాలమైనా పయినీరు సేవలో భాగం వహించారు. (గత సంవత్సరంలో యెహోవాసాక్షులు చేసిన కార్యకలాపాల వివరాలు 12 నుండి 15 పేజీల్లో ఉన్నాయి.) “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” అన్న యేసు ప్రశ్నకు, ఈ విశేషమైన రికార్డు అనుకూలమైన సజీవ సమాధానంగా ఉంది.

పరీక్షలెదురైనప్పటికీ నమ్మకంగా ఉండటం

13, 14. అబ్రాహాము ఆయన కుటుంబం కనానులో ఎదుర్కొన్న కొన్ని కష్టాలను వివరించండి.

13 అబ్రాహాముకు ఆయన కుటుంబానికి కనానులో పరిస్థితులు తరచూ కష్టతరంగా ఉండేవి. కనీసం ఒక సందర్భంలో, తీవ్రమైన కరవు ఏర్పడడంతో ఆయన కనానును విడిచి ఐగుప్తుకు వెళ్లవలసి వచ్చింది. అంతేగాక, ఐగుప్తు పరిపాలకుడూ, [గాజా సమీపంలోని] గెరారు పరిపాలకుడూ ఇరువురూ అబ్రాహాము భార్యయైన శారాను తమ స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. (ఆదికాండము 12:10-20; 20:1-18) అబ్రాహాము పశువుల కాపరులకూ లోతు పశువుల కాపరులకూ మధ్య ఘర్షణలు కూడా జరిగాయి, దాని వల్ల ఆ రెండు కుటుంబాలు విడిపోయాయి. అబ్రాహాము నిస్వార్థంగా, దేశాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని మొదట లోతుకు ఇచ్చాడు, లోతు యొర్దాను ప్రాంతంలో నివసించడానికి ఎంపిక చేసుకున్నాడు, అది సారవంతంగానూ సుందరంగానూ ఉండి, ఏదెనును తలపించేది.—ఆదికాండము 13:5-13.

14 అప్పుడు, లోతు సుదూరంగా ఉన్న ఏలాము రాజూ అతని మిత్ర రాజ్యాల రాజులకూ, సిద్దీము లోయలోని ఐదు నగరాల రాజులకూ మధ్యన జరిగిన యుద్ధంలో చిక్కుకున్నాడు. విదేశీ రాజులు స్థానిక రాజులను గెలిచి, లోతు ఆయన వస్తువులతో సహా ఎంతో సొమ్మును దోచుకున్నారు. జరిగిన సంగతి అబ్రాహాముకు తెలిసినప్పుడు, ఆయన ధైర్యంగా విదేశీ రాజులను తరుముకెళ్లి, లోతును ఆయన కుటుంబాన్ని అలాగే స్థానిక రాజుల వస్తువులను వెనక్కి తీసుకువచ్చాడు. (ఆదికాండము 14:1-16) అయితే, లోతుకు అంతకన్నా ఘోరమైన అనుభవం ఎదురైంది. సొదొమ లైంగిక దుర్నీతికి పేరుపొందినప్పటికీ ఏదో కారణాన్ని బట్టి ఆయన అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు.b (2 పేతురు 2:6-8) ఆ నగరం నాశనం చేయబడుతుందని ఇద్దరు దేవదూతలు హెచ్చరించినప్పుడు, లోతు తన భార్యా బిడ్డలను తీసుకుని పారిపోయాడు. అయితే, దేవదూతలు ఇచ్చిన ప్రత్యేకమైన నిర్దేశాలను చెవినబెట్టనందుకు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే లోతు కొంతకాలంపాటు తన ఇద్దరు కుమార్తెలతో ఒక గుహలో నివసించే స్థితికి చేరుకున్నాడు. (ఆదికాండము 19:1-30) లోతు కనానులోకి అబ్రాహాము కుటుంబ సభ్యునిగా వచ్చాడు గనుక ప్రాముఖ్యంగా ఈ సంఘటనలు అబ్రాహామును ఎంతగానో కలవరపర్చి ఉండవచ్చు.

15. తెలియని దేశంలో గుడారాల్లో నివసిస్తూ అబ్రాహాము సమస్యలు ఎదుర్కున్నప్పటికీ, ఆయన ఏ ప్రతికూలమైన ఆలోచనావిధానాన్ని అలవర్చుకోలేదు?

15 తానూ లోతూ, తన తండ్రి విస్తృత కుటుంబంతో పాటు సురక్షితంగా ఊరులోనో లేక తన సహోదరుడైన నాహోరుతోపాటు హారానులోనో ఉండిపోయివుంటే బావుండేదని అబ్రాహాము ఎప్పుడైనా అనుకున్నాడా? గుడారాలలో నివసించే బదులు గోడలుగల నగరంలో సురక్షితంగా స్థిరపడివుంటే బావుండేదని ఆయనకి ఎన్నడైనా అనిపించిందా? పరాయి దేశంలో దేశదిమ్మరిలా తిరుగుతూ తాను చేసిన త్యాగాలు జ్ఞానయుక్తమైనవేనా అని బహుశ ఆయన ఎప్పుడైనా తలంచి ఉంటాడా? అబ్రాహాము గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “వారు ఏ దేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న యెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.” (హెబ్రీయులు 11:15) అయినప్పటికీ, వారు తిరిగి వెళ్లలేదు. కష్టాలు ఎదురైనప్పటికీ నిరుత్సాహపడకుండా, వారు ఎక్కడ ఉండాలని యెహోవా ఆశించాడో వారు అక్కడే ఉండిపోయారు.

నేడు సహనం

16, 17. (ఎ) నేడు అనేకమంది క్రైస్తవులు ఏ కష్టాలను అనుభవిస్తున్నారు? (బి) క్రైస్తవులకు ఏ అనుకూల దృక్పథం ఉంది? ఎందుకు?

16 క్రైస్తవుల్లో నేడు అలాంటి సహనమే కనిపిస్తుంది. దేవుని సేవ చేయడం వారికి గొప్ప ఆనందానికి మూలమే అయినప్పటికీ, ఈ అంత్య దినాల్లో నిజ క్రైస్తవులకు జీవితం అంత సుగమంగా లేదు. వారు ఆధ్యాత్మిక పరదైసులో జీవిస్తున్నప్పటికీ, తమ పొరుగువారు ఎదుర్కుంటున్న ఆర్థిక ఒత్తిళ్ళనే వారూ ఎదుర్కుంటున్నారు. (యెషయా 11:6-9) అనేకులు యుద్ధాల్లో అన్యాయంగా బలయ్యారు, కొందరు తమ తప్పేమీ లేకుండానే కడు బీదరికాన్ని అనుభవించవలసి వచ్చింది. అదనంగా, వారు ఎన్నికలేని అల్పసంఖ్యాక వర్గం వారిగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక దేశాల్లో, తమ పట్ల ఎంతో ఉదాసీనత చూపబడుతున్నప్పటికీ వారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఇతర దేశాల్లో, ‘కట్టడవలన కీడు కల్పించాలని’ చూస్తూ ‘దోషులని నిర్దోషులకు మరణము విధించే’ వారి మోసకరమైన దాడిని ఎదుర్కుంటున్నారు. (కీర్తన 94:20, 21) క్రైస్తవులు దాడికి గురవ్వని, తమ ఉన్నత ప్రమాణాలను బట్టి కొంతమందిచే ప్రశంసించబడుతున్న దేశాల్లో కూడా, తాము తమ తోటి విద్యార్థుల నుండి తోటి పనివారి నుండి భిన్నంగా ఉన్నామని వారికి తెలుసు. అబ్రాహాము కూడా అలాగే తన చుట్టూ ఉన్న అనేకులు నగరాల్లో నివసించినప్పటికీ తాను మాత్రం గుడారాల్లో నివసించాడు. అవును, ఈ లోకంలో జీవిస్తూ దాని ‘సంబంధులు కాకుండా’ ఉండటం అంత సులభం కాదు.—యోహాను 17:14.

17 మరి మనం దేవునికి చేసుకున్న మన సమర్పణను బట్టి విచారిస్తున్నామా? అందరిలాగే ఉంటూ మనమూ లోకసంబంధులమై ఉంటే బాగుండునని అనుకుంటున్నామా? యెహోవా సేవలో మనం చేసిన త్యాగాలను బట్టి మనం విచారిస్తున్నామా? ఎంతమాత్రం లేదు! ఆశగా వెనక్కి తిరిగి చూసే బదులు, మనం ఏ త్యాగం చేసివున్నప్పటికీ అది, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలతోనూ భవిష్యత్తులో ఆనందించబోయే ఆశీర్వాదాలతోనూ పోలిస్తే ఎంత మాత్రం విలువైనది కాదని మనం గుర్తిస్తాము. (లూకా 9:62; ఫిలిప్పీయులు 3:8) అంతేగాక, లోకంలోవున్న ప్రజలు ఆనందంగా ఉన్నారా? నిజమేమిటంటే, మన దగ్గర ఇప్పటికే ఉన్న సమాధానాల కోసం అనేకులు ఇంకా అన్వేషిస్తున్నారు. బైబిలు పుటల ద్వారా దేవుని నుండి ఇవ్వబడుతున్న, నడిపింపును మనం అనుసరించినట్లు అనుసరించకపోవడం మూలంగా వాళ్లు కష్టాలు అనుభవిస్తున్నారు. (కీర్తన 119:105) మనం మన తోటి విశ్వాసులతో అనుభవిస్తున్నటువంటి క్రైస్తవ సహవాసం కోసం ఆనందకరమైన సాంగత్యం కోసం అనేకులు పరితపిస్తున్నారు.—కీర్తన 133:1; కొలొస్సయులు 3:14.

18. క్రైస్తవులు అబ్రాహాము వంటి ధైర్యాన్ని చూపించినప్పుడు చివరికి వచ్చిన ఫలితమేమిటి?

18 నిజమే, లోతును చెరపట్టుకుపోయిన వారిని తరిమినప్పుడు అబ్రాహాము ప్రదర్శించినటువంటి ధైర్యాన్ని కొన్నిసార్లు మనమూ కల్గివుండాల్సి ఉంటుంది. మనమలా ఉన్నప్పుడు, ఫలితాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు, ఉత్తర ఐర్లాండ్‌లో తెగ సంబంధిత దౌర్జన్యం మూలంగా విద్వేషాలు లోతుగా పాతుకుపోయాయి, అటువంటి పరిస్థితుల్లో తటస్థంగా ఉండాలంటే ధైర్యం అవసరం. అయినప్పటికీ నమ్మకమైన క్రైస్తవులు యెహోవా యెహోషువకు చెప్పిన ఈ మాటలను అనుసరించారు: “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.” (యెహోషువ 1:9; కీర్తన 27:14) గడిచిన సంవత్సరాల్లో వారు నిర్భయంగా తీసుకున్న స్థానం వారికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది, నేడు ఆ దేశంలోని అన్ని సమాజాల్లోనూ వారు స్వేచ్ఛగా ప్రకటించగల్గుతున్నారు.

19. క్రైస్తవులు ఎక్కడ ఉండడానికి సంతోషిస్తున్నారు, తాము యెహోవా నిర్దేశాన్ని అనుసరించినప్పుడు ఏ ఫలితం వస్తుందని వారు నమ్మకం కలిగివున్నారు?

19 మనం ఏ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, మనం యెహోవా నిర్దేశాన్ని అనుసరిస్తే, తుది ఫలితం ఆయనకు మహిమను తెస్తుందనీ, మనకు దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూరుస్తుందనీ మనం దృఢ నిశ్చయత కలిగివుండవచ్చు. సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, త్యాగాలు చేయవలసి వచ్చినప్పటికీ, మన క్రైస్తవ సహోదరులతో సహవాసాన్ని అనుభవిస్తూ దేవుడు వాగ్దానం చేసిన నిత్య భవిష్యత్తు కోసం నమ్మకంతో ఎదురు చూస్తూ యెహోవా సేవలో ఉండటం కంటే మనం ఉండగల మరో స్థలమేది లేదు.

[అధస్సూచీలు]

a బహుశ, లోతు తండ్రియైన తన సహోదరుడు మరణించినప్పుడు, అబ్రాహాము బహుశ లోతును దత్తత తీసుకుని ఉండవచ్చు.—ఆదికాండము 11:27, 28; 12:5.

b నలుగురు రాజులకు పట్టుబడిన తర్వాత లోతు అధిక భద్రత కోసం పట్టణంలో నివసించడం ప్రారంభించి ఉంటాడని కొంతమంది సూచించారు.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ దృఢ విశ్వాసం ఎందుకు ఆవశ్యకం?

◻ అబ్రాహాము తనకు దృఢ విశ్వాసం ఉందని ఎలా చూపించాడు?

◻ సమర్పణ ఒకరు తమ జీవితంలో చేసుకునే మార్పులతో ఎలా ముడిపడి ఉంది?

◻ మనం ఏ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ దేవుని సేవ చేయడానికి మనం ఎందుకు ఆనందంగా ఉన్నాము?

[7వ పేజీలోని చిత్రాలు]

వాగ్దానం చేయబడినదాన్ని పొందడానికి అబ్రాహాము తన జీవితంలో పెద్ద మార్పులు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు

[9వ పేజీలోని చిత్రాలు]

యేసు తన ప్రత్యక్షత సమయంలో “భూమిమీద విశ్వాసము”ను కనుగొన్నాడని సాక్ష్యాధారం చూపిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి