కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 1/1 పేజీలు 3-5
  • కుటుంబానికి నిజమైన సహాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబానికి నిజమైన సహాయం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విడాకుల్ని అరికట్టడం
  • వేర్వేరు మతాలు
  • తండ్రి తన బాధ్యతల్ని అలక్ష్యం చేసినప్పుడు
  • సమాధానకరమైన ఆత్మ
  • చెడు సహవాసాలు
  • కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా?
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • దేవుని ప్రీతిపర్చే కుటుంబ జీవితం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • మీ గృహంలో శాంతిని కాపాడుకోండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి
    అనుభవాలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 1/1 పేజీలు 3-5

కుటుంబానికి నిజమైన సహాయం

“అమెరికాలో కుటుంబ సంక్షోభం ఉందనడం సమంజసంగానే ఉంటుంది. పెరుగుతున్న విడాకుల రేట్లనుండీ, వివాహం వెలుపలి జనన గణనాంకాల నుండీ, భార్యా పిల్లల్ని బాధించడానికి సంబంధించి నమోదైన కేసులనుండీ వచ్చేది ఆ నిర్ధారణకే.”

అమెరికా టీవీ వ్యాఖ్యానకర్తయైన టామ్‌ బ్రోకా చెప్పిన పై మాటలు చాలా దేశాలకు అన్వయించబడవచ్చు. ఈ సంక్షోభం అర్థమేమిటి?

అనేక రీతుల్లో, కుటుంబం సమాజానికి పునాది రాయి వంటిది. కుటుంబం సంక్షోభంలో ఉంటే, సమాజం కూడా సంక్షోభంలో ఉంటుంది. అంతేగాక, పిల్లల భావోద్రేక, ఆర్థిక మద్దతుకు మూలం కుటుంబమే. జీవితంలో తొలి పాఠాల్నీ, అత్యంత ప్రాముఖ్యమైన పాఠాల్నీ వాళ్లు నేర్చుకునేది ఇక్కడే. కుటుంబమే సంక్షోభంలో చిక్కుకుంటే, ఇక వాళ్లేమి నేర్చుకుంటారు? వాళ్లకు భద్రత ఎక్కడ? వాళ్లు ఎదిగితే ఎలాంటి పౌరులౌతారు?

ఈ సంక్షోభ కాలంలో కుటుంబానికి ఏదైనా సహాయం దొరుకుతుందా? సహాయం దొరుకుతుంది. కుటుంబమనేది దేవుడు తానే స్వయంగా స్థాపించిన ఒక వ్యవస్థ. (ఆదికాండము 1:27, 28) ఆయన తన వాక్యమైన బైబిల్లో అత్యంతావశ్యకమైన కుటుంబ నిర్దేశకాల్ని ఇచ్చాడు. (కొలొస్సయులు 3:18-21) నిజమే, మనం సమాజాన్నంతటినీ మార్చలేకపోవచ్చు, కానీ మన సొంత కుటుంబంలో బైబిలు సలహాను మనం అన్వయించుకోవచ్చు. తమ కుటుంబంలో బైబిలు సలహాను అన్వయించుకొని, సత్ఫలితాల్ని పొందిన కొంతమంది ప్రజల్ని గురించి మీకు తెలియజేయాలని మేం అనుకుంటున్నాం.

విడాకుల్ని అరికట్టడం

అనేక దేశాల్లో దాదాపు 50 శాతం వివాహాలు విడాకులతో అంతమైపోతున్నాయి. అంటే భారీ ఎత్తున మానవ సంబంధాలు దెబ్బతినడమేనన్న మాట! వైవాహిక జీవితాలిలా అర్థాంతరంగా ముగిసిపోయి ఒంటరిగా ఎదురీత ఈదుతున్న తల్లులు (తండ్రులు), తమ పిల్లల్ని పెంచడంలో సాముగారడీలు చేస్తున్నారు. దంపతులు తమ సమస్యల్ని పరిష్కరించుకొని, కలిసి మెలిసి జీవించగల్గితే అది ఎంతో శ్రేయస్కరమన్న విషయంతో నిశ్చయంగా అనేకమంది ఏకీభవిస్తారు.

సాల్మన్‌ దీవుల్లో నివసిస్తున్న ఒక జంట వైవాహిక జీవితం, సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. భర్త అక్కడున్న ఒక అధికారి కొడుకు, కోపమొస్తే అతడ్ని అదుపుచేయలేం. దానికితోడు అతనికి అనేకమైన చెడు అలవాట్లు. అతనితో కాపురం చేయడం ఆ భార్యకు దుర్భరంగా తయారయ్యింది. ఆమె ఆత్మహత్య చేసుకోడానికి కూడా ప్రయత్నించింది. అప్పుడు, యెహోవాసాక్షులతో బైబిల్ని పఠించడానికి ఆ భర్త ఒప్పుకున్నాడు. దేవుడ్ని ప్రీతిపర్చాలని అనుకునేవారెవరైనా సరే, ఏది తప్పో తెలుసుకోవడం మాత్రమేకాదుగానీ ‘చెడుతనాన్ని అసహ్యించుకోవాలి’ అని కూడా అతడు తెలుసుకున్నాడు. (కీర్తన 97:10) అబద్ధమాడడం, దొంగతనం చేయడం, దౌర్జన్యం, త్రాగుబోతుతనం వంటివి అసహ్యించుకోవాల్సిన క్రియల్లో ఉన్నాయి. అతడు ఆ సలహాను లక్ష్యపెట్టాడు. త్వరలోనే తన చెడు అలవాట్లనూ, దౌర్జన్యపూరిత స్వభావాన్నీ జయించాడు. అతనిలో వచ్చిన మార్పుల్ని చూసి అతని భార్య ఆశ్చర్యచకితురాలైంది. దేవుని వాక్యానికున్న ప్రభావాన్నిబట్టి వాళ్ల వైవాహిక జీవితం ఎంతగానో మెరుగుపర్చబడింది.

దక్షిణ ఆఫ్రికాలోని ఒక యెహోవాసాక్షి తన యజమానురాలూ, ఆమె భర్తా విడాకులను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు విన్నది. ఆ సాక్షి, వైవాహిక జీవితం విషయంలో దేవుని దృక్కోణాన్ని గురించి తన యజమానురాలితో మాట్లాడి, కుటుంబ సంతోషానికిగల రహస్యము అన్న పుస్తకాన్ని చూపించింది. యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకం, దంపతులు తమ మధ్యన తలెత్తిన సమస్యల్ని పరిష్కరించుకోడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో నొక్కి చూపిస్తూ, వివాహ జీవితానికి అన్వయించే బైబిలు సూత్రాల్ని ఉన్నతపరుస్తోంది. ఆ యజమానురాలూ, ఆమె భర్తా ఇరువురూ ఆ పుస్తకాన్ని చదివి, దాంట్లో ఉన్న బైబిలు సలహాలను అన్వయించుకునేందుకు యథార్థంగా ప్రయత్నించారు. తత్ఫలితంగా, వాళ్లు విడాకులు తీసుకోకూడదని నిశ్చయించుకున్నారు. బైబిలు సూత్రాల్ని అన్వయించుకోవడం ద్వారా మరొక వైవాహిక జీవితం కాపాడబడింది.

వేర్వేరు మతాలు

భార్యా భర్తలిరువురూ వేర్వేరు మతాలకు చెందినట్లైతే అప్పుడా వైవాహిక జీవితం మాటేమిటి? బైబిలు “ప్రభువునందు మాత్రమే” పెండ్లిచేసుకోవాలని క్రైస్తవులకు వాస్తవిక దృష్టితో సలహానిస్తోంది. (1 కొరింథీయులు 7:39) అయితే, కొన్నిసార్లు వివాహజతలోని ఒకరు తన మతాన్ని మార్చుకోవచ్చు. అక్కడితో వైవాహిక జీవితమిక పరిసమాప్తమైనట్టేనా? లేదు.

బోట్సువానాలో ఒక స్త్రీ ఇటీవలే యెహోవాసాక్షిగా మారింది. ఆమె క్రొత్త విశ్వాసం, ఆమెలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చిందని ఆమెను అడగడం జరిగింది. దానికి జవాబును చెప్పమని ఆమె తన భర్తనే అడిగింది. దానికాయన “నా భార్య యెహోవాసాక్షి అయినప్పటినుండీ, ఆమెలో అనుకూలమైన అనేక మార్పుల్ని నేను చూశాను. ఆమె ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తుంది. నేనిప్పటికీ మానుకోలేకపోయిన స్మోకింగ్‌ అలవాటును మానుకోవడానికి కావాల్సినంత స్థైర్యం, ఒప్పింపు ఆమెకున్నాయి. నా భార్య నా పైనా, నా పిల్లలపైనా, అలాగే ఇతరులపైనా ఎంతో ప్రేమానురాగాల్ని కురిపించే వ్యక్తిగా మారిపోయింది. ఆమె సహనమూర్తిగా తయారయ్యింది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎంతో సహనాన్ని చూపిస్తోంది. ఇతరులు తమ జీవితాల్ని మెరుగుపర్చుకునేలా వారికి సహాయపడేందుకు ప్రయత్నిస్తూ, ఆమె పరిచర్యలో సమయం గడుపుతోంది. నాలో కూడా కొన్ని అనుకూలమైన మార్పులు రావడం నేను గుర్తించాను. ఇదంతా ఆమె చూపించిన మంచి మాదిరినిబట్టేనని నేను నమ్ముతున్నాను.” ఆ దంపతుల వైవాహిక జీవితంలో బైబిలు సూత్రాలు ఎంత శ్రేష్ఠమైన ప్రభావాన్ని చూపించాయో గదా! సాక్షులుగా మారిన తమ వివాహజతలను గురించి యెహోవాసాక్షులుకాని అనేకమంది అలాంటి వ్యాఖ్యానాల్నే చేశారు.

తండ్రి తన బాధ్యతల్ని అలక్ష్యం చేసినప్పుడు

పటిష్టమైన కుటుంబాలను నిర్మించుకోవడానికి ఉన్న ఒక కీలకం, తండ్రికీ అతని పిల్లలకూ మధ్య ఉన్న బంధమే. అపొస్తలుడైన పౌలు ఇలా సలహా ఇచ్చాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) కాబట్టి అనేక సామాజిక సమస్యలకు బాధ్యులు తమ పాత్రను సరిగ్గా నిర్వర్తించని తండ్రులేనని ది విల్సన్‌ క్వార్టర్లీ పత్రికలో ఒక శీర్షిక అంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. ఆ శీర్షిక ఇలా తెలియజేసింది: “తమ సొంత తండ్రులకు దూరంగా పెరుగుతున్న పిల్లల శాతం 1960లకూ 1990లకూ మధ్యనున్న కాలంలో రెట్టింపు అయ్యింది . . . అమెరికా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కలతపర్చే అనేక సమస్యల వెనుకనున్న ప్రధానమైన శక్తి, పితృత్వ పర్యవేక్షణ తగ్గిపోవడమే.”

తండ్రుల మార్గనిర్దేశకత్వంలో పెరగని పిల్లలు ఎందుకూ పనికిరానివారిగా తయారౌతారని దాని అర్థమా? కాదు. ప్రాచీనకాలంలోని కీర్తనల గ్రంథకర్త ఇలా తెలియజేశాడు: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:10) థాయ్‌లాండ్‌లోని తొమ్మిదేళ్ల బాలుడు అది నిజమని తెలుసుకున్నాడు. తాను ఇంకా పసివానిగా ఉండగానే ఆ అబ్బాయి తన తల్లిని కోల్పోయాడు. దాంతో వాడిక తనకొద్దని ఆ పిల్లవాడి తండ్రి వాడిని నానమ్మ దగ్గర విడిచిపెట్టేశాడు. తాను పనికిరాని వాడ్నని భావిస్తూ, ప్రేమకు నోచుకోనివానిగా ఆ పిల్లవాడు మొండిఘటంగా తయారై, పేచీకోరన్న పేరును సంపాదించుకున్నాడు. తన నానమ్మను కూడా బెదిరించేవాడు. స్థానిక రాజ్యమందిరానికి వెలుపల తరచూ ఆ అబ్బాయి నిలబడి ఉండడాన్ని గమనించిన ఇద్దరు యెహోవాసాక్షుల పూర్తికాల సువార్తికులు, అతడ్ని ఒకరోజు తమ ఇంటికి ఆహ్వానించారు.

ఆ అబ్బాయి దేవుని గురించి అంటే ఆయన తన పిల్లల్ని తండ్రిలా ప్రేమిస్తాడనే విషయాన్ని గురించి చెప్పారు. నమ్మకమైన మానవులకు దేవుడు వాగ్దానం చేసిన భూపరదైసు గురించి కూడా వాళ్లు తెలియజేశారు. (ప్రకటన 21:3, 4) ఇదంతా ఆ బాలుని హృదయాన్ని ఆకట్టుకుంది, దాంతో ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతడు ప్రతీరోజూ వచ్చేవాడు. దేవుడు తన తండ్రిగా ఉండాలని ఆ బాలుడు నిజంగా కోరుకుంటున్నట్లైతే, అతడిక జగడాలమారిగా ఉండకూడదని ఆ సాక్షులు వివరించారు. “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అని రోమీయులకు పౌలు చెప్పిన మాటలతో అది పొందికకల్గి ఉంది. (రోమీయులు 12:18) అతడు తన నానమ్మతో దయాపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంది కూడా. (1 తిమోతి 5:1, 2) త్వరలోనే, అతడు బైబిలు సూత్రాల్ని ఆచరణలో పెట్టడం ఆరంభించాడు. నిస్సందేహంగా, నానమ్మతో ఆ అబ్బాయికున్న బాంధవ్యం ఎంతగానో మెరుగుపడింది. (గలతీయులు 5:22, 23) అతనిలో వచ్చిన మార్పుల్ని చూసి ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తులు ఎంతో ముగ్దులై, తమ పిల్లలు కూడా యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేయించాలని అనుకున్నారు!

సమాధానకరమైన ఆత్మ

అపొస్తలుడైన పౌలు కొలొస్సయులకు ఇలా రాశాడు: “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి.” (కొలొస్సయులు 3:14, 15) సమాధానకరమైన ఆత్మా, హృదయపూర్వకమైన ప్రేమా కుటుంబ బాంధవ్యాన్ని నిశ్చయంగా పటిష్టపరుస్తాయి. అవి దీర్ఘకాలంగావున్న కుటుంబ విభేదాలను సరిచేయగలదు. అల్బేనియాలో నివసిస్తున్న రూఖీయా, కుటుంబ కలహాల మూలంగా తన తమ్ముడితో 17 ఏళ్లుగా మాట్లాడ్డం లేదు. యెహోవాసాక్షులతో ఆమె బైబిల్ని పఠించినప్పుడు, దేవుని సేవకుల్లో ప్రతీ ఒక్కరూ ఇతరులతో సమాధానాన్ని పెంపొందించుకోవాలని కోరబడుతున్నారని ఆమె తెలుసుకుంది. “[మనం] . . . సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.”—1 పేతురు 3:11.

తాను తన సహోదరునితో సమాధానపడవలసి ఉందని రూఖీయా గ్రహించింది. రాత్రంతా ఆమె ప్రార్థించింది. మరుసటి రోజు ఉదయాన ఆమె తన గుండె వేగంగా కొట్టుకుంటుండగా తన తమ్ముడి ఇంటికి వెళ్లింది. రూఖీయా మేనకోడలు తలుపు తెరిచి, ఆశ్చర్యంతో ఇలా అడిగింది: “మీరా! ఏంటి ఇలా వచ్చారు?” తాను తన తమ్ముడితో సమాధానపడడం కోసం వచ్చానని చెప్పి, తన తమ్ముడ్ని చూడాలని రూఖీయా ఎంతో ప్రశాంతంగా అడిగింది. ఎందుకు చూడాలని అనుకుంది? అది దేవుని చిత్తమని ఆమె ఇప్పుడు గ్రహించింది గనుకనే. దానికి ఆమె తమ్ముడు అనుకూలంగా ప్రతిస్పందించాడు, వారు తమ పునఃకలయిక సమయంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, ఆనందబాష్పాలు రాల్చారు. బైబిలు సూత్రాల్ని అనుసరించినందున ఒక కుటుంబం తిరిగి కలుసుకుంది.

చెడు సహవాసాలు

“నేడు సగటు పిల్లవాడు రోజుకు ఏడు గంటలపాటు టీవీ చూస్తాడు. ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తయ్యేనాటికి అతడు, ఎనిమిదివేలకన్నా ఎక్కువ హత్యల్నీ, లక్షకన్నా ఎక్కువ దౌర్జన్యకాండల్నీ చూస్తాడు” అని ది 7 హేబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ ఫామిలీస్‌ అనే పుస్తకం చెబుతోంది. అవి ఒక పిల్లవానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? దాని విషయంలో “నిపుణుల” మధ్య ఏకాభిప్రాయం లేదు. అయితే, బైబిలు చెడు సహవాసాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఉదాహరణకు, అది ఇలా చెబుతోంది: “మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) అదింకా ఇలా కూడా చెబుతోంది: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) చెడుసహవాసాల్ని ఇటు వ్యక్తులతో చేసినా, అటు టీవీ కార్యక్రమాల్లో మనం చూసే పాత్రలతో చేసినా సరే, ఆ సూత్రాన్ని వాస్తవికమైనదిగా మనం దృష్టిస్తే కుటుంబ జీవితం మెరుగుపడగలదు.

లక్సమ్‌బర్గ్‌లో నివసిస్తున్న ఒక తల్లి, యెహోవాసాక్షులతో బైబిల్ని పఠిస్తోంది. ఏడు, ఎనిమిదేళ్ల వయస్సున్న తన కూతుళ్ళిద్దరూ సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా పోట్లాడుకుంటారనీ, అరచుకుంటారనీ ఆమె ఒక సాక్షితో చెప్పింది. సాయంత్రం పూట పిల్లలిద్దరూ ఏం చేస్తుంటారని ఆ సాక్షి అడిగింది. తాను వంటగదిని శుభ్రంచేస్తుండగా వాళ్లిద్దరూ టీవీ చూస్తుంటారని ఆమె చెప్పింది. ఏ కార్యక్రమాల్ని చూస్తుంటారు? “ఏముంది ఏవో కార్టూన్‌ సినిమాల్ని చూస్తుంటారని” ఆ తల్లి జవాబిచ్చింది. అలాంటి కార్యక్రమాలు తరచూ హింసాత్మకంగా ఉంటాయని ఆ సాక్షి చెప్పినప్పుడు, అవెలాంటివో తను చూస్తానని ఆ పిల్లల తల్లి చెప్పింది.

ఆ మరుసటిరోజే, తన పిల్లలు చూస్తున్న కార్టూన్‌ సినిమాలను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆ తల్లి తెలియజేసింది. అందులో ఊహాజనిత వికృత జంతువులు ఇతర గ్రహాలనుండి వచ్చి, తమ దారికి అడ్డు వచ్చిన ప్రతీదాన్నీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తున్నట్టు చూపించారు. యెహోవా బలత్కారాన్ని అసహ్యించుకుంటాడనీ, మనం అలాంటి క్రూరత్వాన్ని తిలకించడం ఆయన్ని సంతోషపర్చదనీ తన పిల్లలకు ఆమె వివరించింది. (కీర్తన 11:5) యెహోవాను ప్రీతిపర్చాలని ఆ బాలికలు టీవీ చూడడానికి బదులుగా డ్రాయింగ్‌ వేసుకోడానికీ, పెయింటింగ్‌ వేసుకోవడానికీ అంగీకరించారు. వాటిని చూడడం మానేసిన తర్వాత త్వరలోనే, వారి హింసాత్మక ప్రవర్తన మారిపోయింది. కుటుంబ వాతావరణం మెరుగుపడింది.

బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం, కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తుందని చూపించేందుకు ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. బైబిలు సలహా అన్ని రకాల పరిస్థితుల్లోనూ అన్వయించబడుతుంది. అది ప్రామాణికమైనది. మేలును కలుగజేయడంలో శక్తివంతమైన ప్రభావాన్ని కల్గివుంది. (హెబ్రీయులు 4:12) ప్రజలు బైబిల్ని పఠించి, అది చెబుతున్న వాటిని యథార్థంగా అన్వయించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, కుటుంబాలు బలపడతాయి, వ్యక్తిత్వాలు మెరుగవుతాయి, తప్పిదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవడం సాధ్యమౌతుంది. దేవుని సలహాను కుటుంబంలో ఒక్క సభ్యుడు పాటించినా సరే, విషయాలు చక్కబడతాయి. నిజంగా, “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది” అని కీర్తనల గ్రంథకర్తయైన దావీదు దృష్టించినట్టుగానే మనమూ దేవుని వాక్యాన్ని జీవితంలోని అన్ని రంగాల్లోనూ దృష్టించాలి.—కీర్తన 119:105.

[6వ పేజీలోని చిత్రం]

బైబిలు సూత్రాల్ని అన్వయించుకోవడం ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి