సాయుధ దొంగలు దాడి చేసినప్పుడు
ఆఫ్రికాకు పశ్చిమాన ఉన్న మారుమూల పట్టణమైన ఇకాయీలో, పెద్ద పెద్ద ఇళ్ళు కోటల్లా మారిపోయాయి. అనేక ఇళ్లకు పది అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడలపై ఇనుపచువ్వలూ, వాడియైన గాజు పెంకులూ, ఇనుప ముళ్ళ తీగలూ ఉన్నాయి. వాటికి గొళ్ళాలతోనూ, అడ్డ కమ్మీలతోనూ, చెయిన్లతోనూ, వ్రేలాడుతున్న పెద్ద పెద్ద తాళం కప్పలతోనూ ఎంతో పటిష్టంగా ఉన్న వాచ్‌మెన్ గేట్లు ఉన్నాయి. ఇనుప ఊచలతో కిటికీలు దృఢంగా ఉన్నాయి. స్టీల్ గేట్లు, పడగ్గదుల్ని ఇంటిలోని మిగతా గదులనుండి వేరుచేస్తున్నాయి. ఆల్షేసన్, రాటవైలర్ వంటి పెద్ద పెద్ద కుక్కల్ని రాత్రివేళల్లో గొలుసుల్ని విప్పేసి కాంపౌండ్‌లో వదిలిపెడతారు. శక్తివంతమైన కాంతిని వెదజల్లే లైట్లు చీకటిని పటాపంచలు చేస్తుంటాయి, అంతా సవ్యంగా ఉన్నప్పుడు కంప్యూటరీకరణ చేయబడిన యాంత్రిక నిఘా సిస్టమ్‌లు మంద్రస్థాయిలో శబ్దం చేస్తుంటాయి.
దొంగలు జొరబడకుండా తమ ఇళ్లను భద్రంగా ఉంచుకోవాలని అందరూ కోరుకుంటారు. వార్తాపత్రికల్లోని పతాకశీర్షికలు ఇలా గగ్గోలు పెట్టాయి: “సమాజాన్ని దోచుకుంటున్న సాయుధ దొంగలు”; “పిల్లల దొంగల వీరంగం”; “[పట్టణంలో] వీధి గుండాల అరాచకం—ఆందోళన.” అనేక దేశాల్లోని పరిస్థితి కూడా ఇదే. బైబిలు ప్రవచించినట్లుగానే, మనం నిజంగా క్లిష్టమైన కాలాల్లో జీవిస్తున్నాము.—2 తిమోతి 3:1.
సాయుధ దొంగతనాలతోపాటుగా నేరాల రేటు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ప్రభుత్వాలు తమ పౌరులను కాపాడలేని స్థితిలో ఉన్నాయి, లేక కాపాడ్డానికి సుముఖంగాలేవు. కొన్ని దేశాల్లో పోలీసులు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నారు, కావాల్సినంత ఆయుధ సామాగ్రిలేదు గనుక వాళ్లు బాధితులకు సహాయాన్ని అందించడానికి తగినంత సంసిద్ధంగాలేరు. తమ కళ్లెదుట జరుగుతున్న దాన్ని ఆపేందుకు ముందుకు రావడానికి అనేకమంది జంకుతున్నారు.
సహాయం కోసం అటు పోలీసులపైగానీ, ఇటు ప్రజలపైగానీ ఆధారపడలేని బాధితులు, తమ రక్షణ చర్యలను తామే చేపడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలోని ఒక క్రైస్తవ పెద్ద ఇలా అన్నారు: “మీరు సహాయం కోసం అరిస్తే, దొంగలు మిమ్మల్ని చితకబాదడమో లేక చంపడమో చేస్తారు. బయటి నుండి సహాయం వస్తుందన్న ఆశను వదులుకోండి. సహాయం అందితే మంచిదేగానీ, దానికోసం ఎదురు చూడవద్దు, లేక దానికోసం అరవద్దు ఎందుకంటే సహాయంకోసం అరవడమంటే మరిన్ని కష్టాల్ని కోరి తెచ్చుకోవడమే.”
కాపుదల, దేవుని వాక్యం
క్రైస్తవులు లోకసంబంధులు కాకపోయినప్పటికీ, వారు ఈ లోకంలోనే ఉన్నారు. (యోహాను 17:11, 16) ప్రతీ ఒక్కరిలాగే, వాళ్లూ తమ భద్రత కోసం సహేతుకమైన ఏర్పాట్లను చేసుకుంటారు. అయినప్పటికీ, యెహోవాను ఆరాధించని అనేకమంది ప్రజల్లాగాక దేవుని ప్రజలు, క్రైస్తవ నియమాలు అనుమతించిన పరిధిలో కాపుదల ఏర్పాట్లను చేసుకుంటారు.
దానికి భిన్నంగా, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ప్రజలు, తమను దొంగల బారినుండి కాపాడుకోడానికి మంత్రతంత్రాలను ఆశ్రయిస్తారు. మాంత్రికుడు తన వద్దకు వచ్చిన వ్యక్తి మణికట్టుపైనో, ఛాతిపైనో, లేక వీపుపైనో బహుశా ఒక గాటు పెడతాడు. ఆ తర్వాత మంత్రించిన లేపనాన్ని ఆ గాయంపై పూసి, కొన్ని మంత్రాల్ని చదువుతాడు, దానితో ఇక అతడు దొంగల బారినుండి తప్పించుకున్నట్టే. మరి కొందరు తమ ఇళ్లల్లో రక్షరేకుల్నో, మంత్రించిన లేపనాల్నో ఉంచుకుంటారు. అలా ‘పెట్టుకోవడం’ దొంగలు తమను హింసించకుండా ఉండేలా చేస్తుందని నమ్ముతారు.
మంత్రతంత్రాలు ఎలాంటివైనా సరే, వాటితో నిజక్రైస్తవులకు సంబంధంలేదు. అభిచార సంబంధ అన్ని రకాల అభ్యాసాల్ని బైబిలు ఖండిస్తోంది. అలాంటి ఆచరణలు భూమి మీద నేరాన్ని పురికొల్పుతున్న దయ్యాలతో సంబంధాన్ని పెట్టుకునే స్థితిలో ప్రజల్ని ఉంచుతాయి గనుక వాటిని ఖండించడం సమంజసమే. (ఆదికాండము 6:2, 4, 11) బైబిలు సరళంగా ఇలా చెబుతోంది: “మంత్రయోగములు చేయకూడదు.”—లేవీయకాండము 19:26.
కొంతమంది ప్రజలు సెక్యూరిటీ కోసం తుపాకుల్ని చేతబట్టడానికి కూడా వెనుకాడరు. అయితే క్రైస్తవులు, “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని యేసు చెప్పిన మాటల్ని గంభీరంగా తీసుకుంటారు. (మత్తయి 26:52) దేవుని ప్రజలు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగా . . . సాగకొట్టుకున్నారు’ గనుక వాళ్లు తమను దొంగల బారి నుంచి లేక దాడుల నుంచి కాపాడుకోడానికి తుపాకులను కొనరు.—మీకా 4:3.
సాయుధదారులైన సెక్యూరిటీ గార్డుల్ని పెట్టుకోవడం విషయమేమిటి? ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయమైనప్పటికీ, సెక్యూరిటీ కోసం చేసుకునే అలాంటి ఏర్పాటు ఇతరుల చేతుల్లో తుపాకిని ఉంచుతుందన్న విషయాన్ని గుర్తించుకోండి. దొంగలుపడితే, సాయుధదారులైన గార్డుల్ని కాపలా పెట్టుకున్న యజమాని వాళ్లనుండి ఏం ఆశిస్తాడు? కాపలా కాస్తున్న ప్రజల్నీ, ఆస్తుల్నీ రక్షించడానికి అవసరమైతే ఆ దొంగల్ని కాల్చాలని కూడా ఆ యజమాని ఆశించడా?
మంత్రతంత్రాలనూ, ఆయుధాలనూ తమను కాపాడే ఉపకరణాలుగా తిరస్కరించడంలో క్రైస్తవులు తీసుకున్న స్థానం, దేవుడ్ని ఎరుగని వ్యక్తుల దృష్టికి బహుశా మూర్ఖంగా అనిపించవచ్చు. అయితే, బైబిలు మనకిలా అభయమిస్తోంది: “యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును.” (సామెతలు 29:25) యెహోవా తన ప్రజలను ఒక జనాంగంగా కాపాడుతున్నప్పటికీ, ఆయన దొంగలబారి నుండి తన సేవకులను కాపాడ్డానికి ప్రతీ సందర్భంలోనూ జోక్యం కలుగజేసుకోడు. యోబు ఎంతో యథార్థవంతుడైనప్పటికీ, దోపిడి దొంగలు ఆయన పశువులకాపరులను చంపి, ఆయన పశుసంపదను కొల్లగొట్టుకొనిపోవడానికి దేవుడు అనుమతించాడు. (యోబు 1:14, 15, 17) ‘దొంగలవలన ఆపదలను’ అనుభవించడానికి దేవుడు అపొస్తలుడైన పౌలును కూడా అనుమతించాడు. (2 కొరింథీయులు 11:26) అయినా, బైబిలు నియమాలకు అనుగుణంగా జీవించమని దేవుడు తన సేవకులకు ఉద్బోధిస్తున్నాడు, అవి దొంగల మూలంగా కలిగే అపాయాల్ని తగ్గిస్తాయి. దొంగలు పడ్డప్పుడు కలగబోయే హానిని తగ్గించే రీతుల్లో దొంగతనాలకు ప్రతిస్పందించేలా తన సేవకులకు సహాయపడే జ్ఞానంతో దేవుడు వారిని సన్నద్ధుల్ని చేస్తున్నాడు కూడా.
దొంగల బెడదను తగ్గించుకోవడం
ఎంతో కాలం క్రిందట ఒక జ్ఞాని ఇలా గమనించాడు: “ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.” (ప్రసంగి 5:12) మరో మాటల్లో చెప్పాలంటే, అధికంగా వస్తువుల్ని సమకూర్చుకునే వాళ్లకు తాము సంపాదించిన వాటిని కోల్పోతామేమోనన్న చింతతో నిద్రపట్టదు.
కాబట్టి చింతల్నేగాక దొంగల బెడదను కూడా తగ్గించుకోవడానికి ఉన్న ఒక మార్గం ఏమిటంటే, ఖరీదైన వస్తువుల్ని ఎక్కువగా కూడబెట్టుకోకుండా జాగ్రత్త వహించడమే. ప్రేరేపితుడైన అపొస్తలుడు ఇలా వ్రాశాడు: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:16) ఖరీదైన వస్తువుల్ని కొనడానికి ప్రజల్ని ఏ ఆశలైతే ప్రేరేపిస్తాయో అవే ఆశలు వాటిని దొంగిలించేలా ఇతరుల్ని ప్రేరేపిస్తాయి. ఒకడు ‘జీవపుడంబాన్ని’ ప్రదర్శించడం అంటే దొంగతనం చేయడానికి మొగ్గుచూపించే వాళ్లను ఆహ్వానించడమేనన్నమాట.
దొంగల అవధానాన్ని అంతగా చూరగొనని స్థాయితోపాటుగా, దొంగల బెడదను తప్పించుకోవడానికున్న మరొక రక్షణకవచం ఏమిటంటే మీరు నిజక్రైస్తవులని చూపించుకోవడమే. మీరు ఇతరులపట్ల ప్రేమగలవారనీ, మీ వ్యవహారాలన్నింటిలో మీరు నిజాయితీపరులనీ, క్రైస్తవ పరిచర్యలో చురుగ్గా ఉన్నారనీ చూపించుకున్నట్లైతే, మీరు గౌరవించదగ్గ ఒక మంచి వ్యక్తిగా సమాజంలో పేరును సంపాదించుకోగలరు. (గలతీయులు 5:19, 23) ఒక క్రైస్తవునికున్న అలాంటి మంచిపేరు, ఏ ఆయుధమూ ఇవ్వలేనంత రక్షణ ఇవ్వగల్గుతుంది.
సాయుధ దొంగలు పడ్డప్పుడు
ఎలాగోలాగ మీ ఇంటిలోకి చొరబడిన దొంగలను మీరు చూశారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఆస్తికన్నా మీ ప్రాణాలు ప్రాముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. క్రీస్తు యేసు ఇలా చెప్పాడు: “దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. ఎవడైనా . . . నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రమునుకూడ ఇచ్చివేయుము.”—మత్తయి 5:39, 40.
ఇది జ్ఞానయుక్తమైన సలహా. నేరస్థులకు తమ ఆస్తిపాస్తుల్ని గూర్చిన సమాచారాన్నంతటినీ ఇవ్వాల్సిన అవసరం క్రైస్తవులకు లేకపోయినా, దొంగలను ఎదిరించబోతున్నామన్న, వాళ్లతో సహకరించడంలేదన్న, వాళ్లను మోసగించబోతున్నామన్న భావాన్ని గనుక వాళ్లు పసిగడితే, వాళ్లు మరింత క్రూరంగా ప్రవర్తించవచ్చు. వారిలో అనేకులు “మంచిగా ఉండటం మానుకున్నారు” గనుక క్రూరంగానూ, నిర్దయతోనూ ప్రవర్తించేలా ఒట్టినే రెచ్చిపోతారు.—ఎఫెసీయులు 4:19, పరిశుద్ధ బైబల్.
అపార్టుమెంటు కాంప్లెక్స్‌లో సామ్యూల్ నివసిస్తున్నాడు. తప్పించుకోడానికి వీల్లేకుండా దొంగలు ఆ కాంప్లెక్సును చుట్టుముట్టి, ఒకదాని తర్వాత మరొక అపార్టుమెంటును దోచుకుంటున్నారు. తుపాకుల కాల్పుల్నీ, తలుపులు బద్ధలౌతున్న శబ్దాల్నీ, జనాల కేకల్నీ, ఏడ్పుల్నీ, పెడబొబ్బల్నీ సామ్యూల్ విన్నాడు. తప్పించుకోవడం అసాధ్యం. సామ్యూల్ తన భార్యనీ, ముగ్గురు కొడుకుల్నీ చేతులుపైకిపెట్టి, మోకాళ్ళూని, కళ్ళు మూసుకొని ఉండమని చెప్పాడు. దొంగలు లోపలికి దూసుకొచ్చినప్పుడు, తాను వాళ్ల కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడితే రేపు వాళ్లను గుర్తుపడతానని వాళ్లు అనుకోవచ్చనే ఉద్దేశంతో తన తల క్రిందకు దించుకొని వాళ్లతో సామ్యూల్ మాట్లాడాడు. “రండి, మీకు కావాల్సినవాటిని తీసుకోండి. వేటినైనా మీరు తీసుకోవచ్చు. మేము యెహోవా సాక్షులము, మేము మిమ్మల్ని ఎదిరించము” అని ఆయన వాళ్లతో అన్నాడు. దాంతో వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకటి రెండు గంటల్లో మొత్తం 12 మంది సాయుధదారులైన మనుషులు లోపలకు జొరబడ్డారు. బంగారాన్నీ, డబ్బునీ, ఎలక్ట్రానిక్ పరికరాల్నీ దోచుకున్నా వాళ్లు, మిగతా వారిని కొట్టినట్టుగా లేక గాయపర్చినట్టుగా ఆ కుటుంబానికి ఏ విధమైన అపకారాన్నీ తలపెట్టలేదు. సామ్యూల్ కుటుంబ సభ్యులు తమ ప్రాణాల్ని కాపాడినందుకు యెహోవాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
దొంగల బారినపడ్డ వ్యక్తులు డబ్బు కోసమో, వస్తువుల కోసమో ఎదిరించకపోతే, దొంగలు వాళ్లకు అంతగా హానిని తలపెట్టకపోవచ్చని ఈ ఉదాహరణ చూపిస్తోంది.a
కొన్నిసార్లు ఒక క్రైస్తవుడు ఇచ్చే సాక్ష్యమే అతనికొక రక్షణకవచంగా ఉండవచ్చు. యాడ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు, ఆయన వాళ్లతో ఇలా చెప్పాడు: “మీకు రోజులు గడవడం కష్టంగా ఉండి ఉండొచ్చు, అందుకే మీరీ తోవను త్రొక్కారు. ఒకనాటికి తమకూ తమ కుటుంబానికీ సరిపడేంత ఆహారం ప్రతీ ఒక్కరికీ దొరుకుతుందని యెహోవాసాక్షులుగా మేము నమ్ముతాం. దేవుని రాజ్యంలో ప్రతీఒక్కరూ సంతోష, సమాధానాలతో జీవిస్తారు.” అది వాళ్లను శాంతపర్చింది. వారిలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “మేము మీ ఇంటిని దోచుకోడానికి వచ్చినందుకు విచారిస్తున్నాం, ఆకలి మమ్మల్నిలా చేసిందని మీరు అర్థంచేసుకోండి.” వాళ్లు యాడ ఇంటిని దోచుకున్నా, ఆయనకుగానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ హాని తలపెట్టలేదు.
ప్రశాంతంగా ఉండడం
అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా తమ బాధితుల్ని భయంకంపితుల్ని చేయడమే దొంగల ఉద్దేశమైనప్పుడు ప్రశాంతంగా ఉండడం అంత సులభంకాదు. ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. సహాయం కోసం చేసే అభ్యర్థనను, అది క్లుప్తంగానూ, మనస్సులోనే చేసినా సరే యెహోవా వింటాడు. బైబిలు మనకిలా అభయమిస్తోంది: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.” (కీర్తన 34:15) యెహోవా మన ప్రార్థనలను వింటాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ప్రశాంతంగా వ్యవహరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వగలడు.—యాకోబు 1:5.
ప్రార్థనతోపాటుగా, దొంగలుపడితే ఏం చేయాలి ఏం చేయకూడదు అని ముందుగానే నిశ్చయించుకోవడం కూడా మనం ప్రశాంతంగా ఉండటానికి సహాయకరంగా ఉంటుంది. దొంగలుపడ్డప్పుడు మీరెలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటారో ముందుగానే ఊహించి చెప్పడం సాధ్యంకాదనుకోండి. అయినప్పటికీ, మీరున్న ఇంటికి నిప్పు అంటుకుంటే ఏం చేయాలో తెలియజేసే భద్రతా విషయాలను మనస్సులో ఉంచుకోవడం ఎంత జ్ఞానయుక్తమో, దొంగలుపడ్డప్పుడు ఏం చేయాలో తెలియజేసే సూత్రాల్ని మనస్సులో ఉంచుకోవడం కూడా అంతే జ్ఞానయుక్తం. దాన్ని గురించి ముందుగానే ఆలోచించుకోవడం, మీరు ప్రశాంతంగా ఉండేలా, ఆందోళన పడకుండేలా, రాబోయే అపాయాల నుండి తప్పించుకునేలా సహాయపడుతుంది.
దొంగతనం విషయంలో దేవుని దృక్కోణం స్పష్టంగా ఇలా తెలియజేయబడింది: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము.” (యెషయా 61:8) దొంగతనాన్ని ఒక గంభీరమైన పాపంగా లెక్కించేలా తన ప్రవక్తయైన యెహెజ్కేలును యెహోవా ప్రేరేపించాడు. (యెహెజ్కేలు 18:18, NW) అయినప్పటికీ, దొంగ పశ్చాత్తాపపడి, తాను దొంగిలించిన సొత్తును తిరిగి ఇచ్చేస్తే, దేవుడు అతన్ని కనికరంతో క్షమిస్తాడని బైబిల్లోని అదే పుస్తకం చూపిస్తోంది.—యెహెజ్కేలు 33:14-16.
నేరం రాజ్యమేలుతున్న ఈ లోకంలో జీవిస్తున్నా, దొంగతనం ఇక ఎన్నటికీ ఉండని దేవుని రాజ్యంలో జీవించే నిరీక్షణనుబట్టి క్రైస్తవులు ఆనందిస్తారు. ఆ కాలాన్ని గురించి బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “ఎవరి భయములేకుండ [దేవుని ప్రజలు] తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజారపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యచ్చియున్నాడు.”—మీకా 4:4.
[అధస్సూచీలు]
a నిజమే, సహకారానికి కూడా హద్దులు ఉంటాయి. దేవుని చట్టాన్ని ఉల్లంఘించే ఏ రీతిలోనైనా సరే, యెహోవా సేవకులు సహకరించరు. ఉదాహరణకు, ఒక క్రైస్తవురాలు ఇష్టపూర్వకంగా మానభంగానికి లొంగిపోదు.